ఏది మంచి కథ?

June 22nd, 2012

పత్రిక, పాఠకులు, రచయితలు మధ్య సంబంధ బాంధవ్యాలు అరిటాకు లాంటి సున్నిత పునాది మీదే కొనసాగుతుంటాయి, చెదిరిపోతుంటాయి కూడా. పత్రిక నిర్వాహకుల అహం, పాఠకుల అహం, రచయితల అహం.. వీటిలో ఏ ఒక్కటీ తక్కువ కాదు. -ఇక్కడ అహం అనేమాటను పాజిటివ్‌గా తీసుకుంటేనే మంచిది- చందమామ కూడా దీనికి మినహాయింపు కాదు. అసలు ఒక పత్రికలో రచనలు ఏ ప్రాతిపదికన సెలెక్ట్ అవుతాయి, తిరస్కరింపబడతాయి అనేది పై మూడు కేటగిరీలలో ఏ ఒక్కరూ స్పష్టంగా చెప్పలేకపోవచ్చు.

కథ చాలా బాగుంది అనుకున్న సందర్భాల్లో కూడా అతి స్వల్పమైన కారణాల వల్ల ఎంపిక కాకపోవచ్చు. అవి సాహిత్య కారణాలు, సాహిత్యేతర కారణాలు, రాజకీయ కారణాలు, శైలి, కథలోని టోన్ ద్వారా వచ్చే సమస్యల కారణాలు, మంచి కథను కూడా పాడుచేసేలా పాత్రల చిత్రీకరణలో జరుగుతున్న లోపానికి సంబంధించిన కారణాలు ఇలా ఏవయినా కావచ్చు. కథ స్వీకరించడానికి, స్వీకరించకపోవడానికి ఇవన్నీ దోహదం చేసేవే.

పైగా వీటన్నిటికి మించి ఎంపిక దారుల మానసిక స్థితి -మూడ్- ఎలా ఉందనేది కూడా కథల ఎంపికలో గణనీయ ప్రభావమే చూపుతుందనుకుంటాను. ఒక సమయంలో అంత బాగాలేదనిపించిన కథ మరో సందర్భంలో ఫర్వాలేదు వేసుకోవచ్చు అనిపించి దాన్ని స్వీకరిస్తున్న సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. ఒక సారి సెలెక్షన్ కాని కథలు మరోసారి సులభంగా స్వీకరించబడటానికి ఎంపికదారుల మూడ్ కూడా అంతో ఇంతో పనిచేస్తుందనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవలిసిందే.

అందుకే కథను ఎందుకు ఎంపిక చేస్తున్నారు, ఎందుకు చేయలేదు అనే విషయంపై నూటికి నూరుపాళ్లు ఎవరూ సాధికారతను కలిగి ఉండరనుకుంటాను. దశాబ్దాలుగా కథలను స్వీకరిస్తున్న చందమామ కూడా దీనికి భిన్నం కాదు. లబ్ద ప్రతిష్టులైన రచయితల కథలు, కొత్తగా పంపుతున్న రచయితల కథలు కూడా స్వీకరించలేనప్పుడు మీ కథలో లోపం కాదని, అనేకానేక చిన్న చిన్న కారణాలతో మీ కథ తీసుకోలేకపోతున్నామని చెబుతూ చందమామ గతంలోనే సంజాయిషీతో కూడిన వివరణను రచయితలకు పంపుతూ కొత్త కథలు పంపవలసిందిగా అభ్యర్థించేది.

ఒక రచయిత కథలు పదే పదే చందమామలో ప్రచురించబడటానికి, స్వీకరించబడటానికి, 20, లేదా 30 కథలను ఒక రచయిత పంపినా ఒక కథ కూడా స్వీకరించలేకపోవడానికి ఇలాంటి సకారాణ, అకారణ అంశాలు పనిచేస్తుండవచ్చు.

చందమామలో ఎలాంటి కథలు పడుతాయి, పడవు?

1. ఏ జాతికైనా దానికే సంబంధించిన మూల కథలు -బేసిక్ స్టోరీస్- ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఇప్పటికే కొన్ని డజన్లసార్లు పలు పత్రికలలో కథలు గత కొన్ని దశాబ్దాలుగా ప్రచురించబడి ఉంటాయి. ఆ బేసిక్ కథల సారాంశాన్ని తీసుకుని పూర్తిగా రూపాన్ని మార్చి కొత్త కథ రాసి పంపినా ప్రచురణకు తీసుకోకపోవచ్చు.

ఈ కారణంవల్లే ఒకప్పుడు జంతువుల పాత్రలతో నడిచే కథలకు ప్రాముఖ్యతనిచ్చిన చందమామ తర్వాత కాలంలో రీటోల్డ్ స్టోరీస్ రూపంలో వస్తున్న జంతు కథలను పూర్తిగా పక్కన పెట్టేయడం జరిగింది. ప్రస్తుతం చందమామలో జంతుకథలు వస్తున్నాయంటే అవి చందమామలోని పాత కథలే అయి ఉంటుంది.

2. స్త్రీలను, వృద్ధులను, అంగవికలురను, బలహీన వర్గాల ప్రజలను కించపర్చే, నిందించే రకం కథలు గత సమాజాలలో లేదా శతాబ్దాల క్రితం పుట్టిన సాహిత్యంలో వచ్చి ఉండవచ్చు. కాని సమానత్వం సార్వజనిక విలువగా మారిన ఆధునిక కాలంలో వాటిని యధాతథంగా స్వీకరించడం పరమ అభ్యంతరకరం కాబట్టే కథ ఎంత బాగున్నా ఇలాంటి కించపర్చే సంభాషణలు కథలో వచ్చాయంటే వాటిని ఏ పత్రిక కూడా స్వీకరించలేకపోవచ్చు.

పీడకుడు పీడితుడిని తిట్టడం, దూషించడం పాత్రస్వభావ రీత్యా సహజమే కావచ్చు కాని ఇలాంటి వాటిని కూడా యధాతథంగా స్వీకరించలేని సున్నితత్వం సమాజంలో ప్రబలుతోంది కాబట్టి ఇలాంటి కథలను జాగ్రత్తగానే పరిశీలించడం జరుగుతోంది.

3. కుటుంబరావు గారు చందమామ అనధికారిక సంపాదకులుగా ఉన్నప్పుడే ఒరిజనల్ బేతాళ కథలను రెండు మూడింటిని యధాతథంగా ప్రచురించి ఇక సాధ్యం కాని పరిస్థితుల్లో వాటికి ఆధునిక సంస్కారాన్ని, కొత్త భావజాలాన్ని తొడిగి కొత్త బేతాళ కథలను తీసుకురావడం జరిగింది. గత 50 ఏళ్లకు పైగా చందమామ బేతాళ కథలు ఎంత సంచలనానికి కారణమవుతున్నాయో చెప్పవలసిన పనిలేదు.

4. సాధారణీకరణలు
ఆడదాని నోట్లో నువ్వు గింజ కూడా నానకూడదు అనే శాపాన్ని ధర్మరాజు పెట్టాడని భారతంలో అందరూ చదివే ఉంటారు. కర్ణుడు తనకే పుట్టాడనే విషయాన్ని కర్ణుడి మరణ సందర్భంలో గాని చెప్పలేకపోయిన కుంతీదేవిపై ఆగ్రహంతో ధర్మరాజు ‘ఇకపై స్త్రీల నోటిలో ఏ రహస్యమూ దాగకుండు గాక’ అని శపించాడట. ఇది సమాజంలోని మొత్తం స్త్రీలకు వ్యతిరేకంగా తీర్చి దిద్దబడిన గతకాలపు భావజాలం నుంచి పట్టిన పదబంధం. ఇలాంటి సాధారణీకరించిన సంభాషణలను స్త్రీ పాత్రలకు, నిస్సహాయులకు, వెనుకబడిన ప్రజలకు ఆపాదించి కథలు తయారైతే ఆధునిక సాహిత్యం వాటిని తిరస్కరించడమే జరుగుతుంది.

5. చిన్న ఉదాహరణ. పంచతంత్రకథల్లో ఆషాడభూతికి ఆశ్రయం ఇచ్చిన మంగలి తన భార్యను అనుమానిస్తూ ‘ఓసి ముక్కిడి ముండా’ అని తిట్టిన సందర్భాన్ని 70లలో చందమామలో వచ్చిన పంచతంత్రకథల్లో యధాతథంగా ప్రచురించారు. దీన్ని మళ్లీ 2011లో ప్రచురించినప్పుడు ఆ పదం వెనుక స్త్రీలను కించపరిచే భావజాలాన్ని గమనించకుండా అలాగే ప్రచురించడంతో పాఠకులనుంచి తీవ్ర నిరసన వచ్చింది. చందమామ కథల మంచిచెడ్డలను పాఠకులే నిర్దేశిస్తున్న చక్కటి పఠనా పురోగతిని, పరిశీలనను ఇక్కడ గమనించవచ్చు.

6. కథ ఎంత బాగా రాసినప్పటికి దాన్ని పోలిన, దాని సారాంశాన్ని పోలిన కథ అంతకుముందే చందమామలో వచ్చి ఉంటే, స్వీకరణ సాధ్యం కాదు. ఉదాహరణ చందమామలో వైద్యుల కథలు, దయ్యాల కథలు, జంతువుల కథలు, చాలా ఎక్కువగా వచ్చాయి. ఈ కోవలోని కథలు ఒకటి రెండు వరుసగా పడగానే వాటిని పోలిన ఇతివృత్తంతో చాలామంది కొత్త కథలను పంపడం సహజం. దాదాపు అన్ని పత్రికల విషయంలో ఇలాంటి ధోరణి ఉందేమో మరి. నాలుగైదు చందమామలను వరుసగా చూసి వాటిని పోలిన కథలు పంపితే వేసుకుంటారేమో అనే ఊహతో కొన్ని కథలు పంపించండం అందరి శ్రమ వృధా కావడానికే దారితీస్తుంది.

7. ప్రతి కథలోనూ వైవిధ్యతను ప్రదర్సించడం, కథను పోలిన కథను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపకపోవడం గతంలో వచ్చిన కథను మార్చి, పాలిష్ చేసి కొత్త రూపంలో పంపడం వంటివి ఎక్కడైనా ప్రచురణార్హతకు నోచుకోవనుకుంటాను.

8. ఆడదాని సలహా అనే పాత కథను ఈ సంవత్సరం ఏప్రిల్ చందమామలో ప్రచురించడమైనది. బెస్తవాడి చర్యలకు దురుద్దేశ్యం అంటగట్టిన రాణిని ఉద్దేశించి పర్షియా ప్రభువు చివరలో నగరంలో చాటింపు వేస్తాడు “ఆడదాని సలహా ప్రకారం ఎవరూ నడుచుకోవద్దు. వారి సలహా విన్నట్లయితే సగం పొరపాటును దిద్దుకోవడానికి రెండు పొరపాట్లు అదనంగా చేయవలసివస్తుంది”
ఈ ప్రకటన మహిళలపై ప్రస్తుత సమాజం అంగీకరించని అభిప్రాయాలను వ్యక్తీకరిస్తోంది.  ఈ మూలకథను నలభై ఏళ్ల క్రితం ఆడదాని సలహా పేరుతో యధాతథంగా ప్రచురించారు. ఈకథను అలాగే మళ్లీ ప్రచురిస్తే పాఠకులు దాడిచేయడం తప్పదు. మొత్తం స్త్రీ జాతినే అవమానిస్తున్న పై ప్రకటనను మార్చకుంటే కొంప మునుగుతుందని భావించి యాజమాన్యం వారి దృష్టికి తీసుకుపోయి అన్ని భాషల్లోనూ పై వాక్యాన్ని ఇలా మార్చడం జరిగింది.
“మన సన్నిహితులు, ఆంతరంగికులు చెప్పిన సలహా ప్రకారంమాత్రమే ఎవరూ నడుచుకోవద్దు. ఇతరుల సలహాను గుడ్డిగా విన్నట్లయితే సగం పొరపాటును దిద్దుకోవడానికి రెండు పొరపాట్లు అదనంగా చేయవలసి వస్తుంది”
మార్చిన కథకు అనుగుణంగా ఆడదాని సలహా అనే కథ శీర్షికను కూడా నష్టం మూడుసార్లు అని మార్చటం జరిగింది. అలనాటి తమిళ చందమామలో ఇదే పేరుతో ఈ కథను ప్రచురించడంతో ప్రస్తుత సందర్భానికి ఇదే బాగుందని దాన్నే స్వీకరించడం జరిగింది.

కథనం పెద్దది కావడంతో ఇప్పటికి ముగించి మరోసారి కలుద్దాము.
చందమామ.

RTS Perm Link