మందులు తెచ్చిచ్చేవాళ్లూ లేరు నాయనా!

April 22nd, 2012

ఊరులో మా అవ్వ

నిన్న మధ్యాహ్నం నా పాఠశాల సహ విద్యార్థి, మా ఊరికి పక్క ఊరివాడైన శ్రీనివాస్‌ని చెన్నయ్‌లో కలిశాను. తను ప్రస్తుతం కడప జిల్లా రాయచోటి పట్టణంలో ఉంటున్నాడు. విఐటి పరీక్షలకు హాజరవుతున్న తన పెద్ద కూతురుకు తోడుగా కుటుంబంతో కలిసి వచ్చాడు. ఆ పాప మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్షకు వెళితే సాయంత్రం అయిదు గంటలవరకు అన్నానగర్‌లో బిఒఎ స్కూల్ వెస్ట్ గేటు వద్ద వేచి ఉంటూ పిచ్చాపాటీగా మాట్లాడుకుంటూ గడిపాం.

ఎలా ఉన్నావు అంటూ పలకరింపులు అయ్యాక సహజంగానే మా సంభాషణ ఊరివైపు, మనుషులు, సంబంధాలు, మార్పుల వేపు మళ్లింది. “పల్లెలు, పట్నాలు మాట్లాడేందుకు మనుషులు లేక చస్తున్నాయి రాజా” అంటూ మొదలెట్టాడు శీను. గత కొంతకాలంగా ఈ విషయం అనుభవంలోకి వస్తున్నప్పటికీ తన గొంతులో మారుతున్న మానవ సంబంధాల వికృత విశ్వరూపం కొత్తగా ధ్వనించింది. తన మాటల్లోనే గత పదిహేనేళ్లలో మారిపోయిన మా ఊళ్లు మా మనుషుల కథ విందాము.

“నా యాభై ఏళ్ల జీవితానుభవంతో చెబుతున్నా రాజా, ఊళ్లలో, పట్నాల్లో మనుషులకు డబ్బు జబ్బు పట్టింది. పలకరించే మనిషిలేక, ముసలితనంలో ఆదుకునే దిక్కు లేక మనుషులు చస్తున్నారు. రెక్కలు వచ్చీ రాకముందే పిల్లలు చదువుల కోసం, ఉద్యోగాల కోసం పట్నాలు, నగరాలు, విదేశాల బాట పడుతున్నారు. కాళ్లూ చేతులూ కదపలేని ముసలితనంలో ఉన్న కన్న తల్లిని, తండ్రినీ కాసింత ధైర్యం చెప్పి మందూ మాకూ ఇచ్చేందుకు కూడా మనిషి లేకుండా పోతున్నాడు. ఎన్ని లక్షలూ,  కోట్లూ సంపాదించి మాత్రం కన్నవారి బాగోగులు చూడటం సాధ్యం కాకుండా పోయాక ఇక మనం ఎన్ని చెప్పుకుని ఏం ప్రయోజనం?

నా ఉదాహరణే తీసుకుందాం. మాది వాస్తవానికి కృష్ణా జిల్లా అబ్బవరం గ్రామం. మా నాన్న 40 ఏళ్ల క్రితం బతుకు కోసం వలస వచ్చి మీ ఊరు పక్కూరికి వచ్చేశాడు. అలా మనం కలిసి చదువుకున్నాం. దాదాపు 25 ఏళ్ల తర్వాత 2008లో మళ్లీ రాయచోటిలోనే కలుసుకున్నాము. కొన్ని సంవత్సరాల క్రితం అబ్బవరంలో మాకు దగ్గర బంధువైన అవ్వను చూసుకోవడానికి ఎవరూ లేరనిపించి రాయచోటికి తీసుకువచ్చి మా ఇంట్లో పెట్టుకుని నా శక్తిమేరకు సేవ చేశాను. కాని ఆమెకు మా ఇల్లు  కొత్త ప్రపంచమైపోయింది. 90 ఏళ్లు అబ్బవరం గ్రామంలో పెరిగిన అవ్వ వందలమంది జనంతో, బంధుబలగం తోడుగా బతుకు సాగించిన అవ్వ మా ఇంటికి వచ్చేశాక మాట్లాడే మనిషి లేక విలవిల్లాడిపోయింది.

ఎవరి బతుకు పోరాటం వారిదైపోయాక  ఏదో ఒక పనితో ఇంటిబయటకు పోవలసిన పరిస్థితుల్లో 24 గంటలూ ఆమెను అంటిపెట్టుకుని ఉండటం సాధ్యమా? నేను నా సన్ టీవీ డిష్ నెట్ వ్యాపారం కోసం బయటకు వెళ్లిపోవడం, నా భార్య టీచర్ జాబ్ చేయడం, ఆడపిల్లలిద్దరూ చదువుకోసం వెళ్లిపోవడం రొటీన్‌గా మారాక ఆమెకు తోడుగా ఉండి పలకరిస్తూ, అవసరమైనది తీరుస్తూ ఉండే మనిషి లేకుండా పోయాడు. నాకు పెద్దగా పరిచయం లేని మా నాన్న తరపు బంధువులను ఎంతగానో అడుక్కున్నాను. ఆమెకు మీతోటే అటాచ్మెంట్ ఎక్కువ కాబట్టి నెలకు ఒకరైనా ఇక్కడికి వచ్చి ఆమెకు తోడుగా ఉండమని, ఖర్చులన్నీ నేను భరిస్తానని చెప్పినా ఎవరూ రాలేదు. మాలాగే వారికి ఎన్ని జీవిత సమస్యలో.

ఈరోజుల్లో ఊరు విడిచి బయటికి వచ్చిన ప్రతి ఒక్క ముసలివారి ప్రపంచం వేరుపడిపోతోంది. పుట్టి పెరిగిన ఊరిని, కష్టంలోనూ, సుఖంలోనూ జీవితాన్ని పండించిన ఊరిని, ముసలివయసులో చూసుకునే వారు లేక వదిలేసినప్పుడు నగరాల్లో ఉన్న పిల్లల వద్దకో, బంధువుల వద్దకో వెళ్లిపోయి రోజులు గడుపుతున్న వారు నిజంగా జీవచ్ఛవాలే. మా అవ్వకు తిండిలోటు లేకుండా చూసుకున్నాము గాని స్వంత ఊరితో, స్వంత మనుషులతో అనుబంధాన్ని ఆమెకు కల్పించలేకపోయాము. తన వాళ్లంటూ లేక ఆమె మా ఇంట్లో ఎంత విలవిల్లాడిపోయిందో నాకు తెలుసు.

అందుకే ఆమె చనిపోతే రాయచోటిలో ఆమె అంత్యక్రియలు చేయాలనిపించలేదు. ఎంత కష్టమైనా సరే ఆమెను ఆమె స్వంతఊరిలోనే సాగనంపాలని రాయచోటినుంచి కృష్ణాజిల్లావరకు ఆమెను తీసుకుని ఊరివారిమధ్యే ఆమెకు అంత్యక్రియలు పూర్తి చేశాను. ఫలానా వారి కొడుకు అని తెలిశాక ఆ ఊరి పెద్దలంతా వరుసపెట్టి మాట్లాడుతూ తమ బాధలు చెప్పుకున్నారు.

చాలా సంపాదించాము నాయనా,  పిల్లలందరికీ చదువులు చెప్పించాము. అందుకే ఒక్కరూ ఊరిలో మిగల్లేదు. ఉద్యోగాల బాటపట్టిన బిడ్డలు లక్షలు సంపాదిస్తున్నారు కాని మాకేమయినా అయితే మాట్లాడే వారులేరు. కనీసం మాత్రలు బయటూరికి పోయి తెచ్చిచ్చే వారు లేరు. ఎందుకు నాయనా ఈ దిక్కులేని బతుకు మాకు. ఇలా అవుతుందని కనగన్నామా.. అంటు అందరూ వలవలా ఏడ్చేవారే. ముసలామెకు ఇంత ఘనంగా ఊరు తీసుకొచ్చి చివరి క్రియలు జరుపుతున్నావు సంతోషం నాయనా అంటూ ఏడ్చేవారే ఆ ఊళ్లో..

వాళ్లముఖాల్లో దైన్యం, కన్నబిడ్డల సాయం అందని ఘోరం కనిపిస్తూంటే నిజంగా తట్టుకోలేకపోయాను. రేపు మా పిల్లలకు చదువు చెప్పించి, వారు ఉద్యోగాలకో లేదా పెళ్లి చేసుకుని వెళ్లిపోయాక మా గతి కూడా ఇంతే కదా అని జీవితంలో మొట్టమొదటి సారి భయం పుట్టింది రాజా..

మనందరి బతుకులూ తాతా మనవడు సినిమాలో చూపిన బతుకులే అయిపోతున్నాయి. ఆ సినిమా అప్పట్లో చూసినప్పడు మన జీవితాలకు అది కొత్త అనుభవం. అలాంటిది మనకు లేదులే అని సంతోషించి ఉంటాము కూడా. కాని 30 ఏళ్లలోపే అది వెంటాడుతూ మన జీవితాల్లోకి వచ్చేసింది. పదోతరగతి చదువుకున్నంతవరకు ఇంట్లోనే ఉన్న పిల్లలు రేపు మరొకచోటికి వెళ్లిపోతే అదీ ఇద్దరూ చెరొక చోటికి వెళ్లి చదువుకోవలసివస్తే, నా భార్య ట్రాన్స్‌ఫర్ అయి వేరే ఊరికో, పట్నానికో  వెళ్లిపోతే, నేను నా చిన్న బిజినెస్  కోసం ఇక్కడే ఉండిపోవలసి వస్తే.. బతుకేమిటి అనే గ్లాని పుడుతుంది. ఎన్నడూ లేనిది అప్పుడే మేం ఒకరికొకరం దూరమవుతున్నంత ఫీలింగ్ వచ్చేసింది.

ఉమ్మడి కుటుంబాల బంగారు కాలం ఎప్పుడో పోయింది. కనీసం సింగిల్ కుటుంబాల కాలం కూడా మన కళ్లముందే కరిగిపోతోంది. ఎక్కడో విదేశాలకు పోవడం కాదు. మన ఉంటున్న చోట్లోనే ఒక కుటుంబంగా ఉండలేని పరిస్థితి వచ్చేశాక ఇక దేన్ని చూసి సంతోషించాలి?

నాకు తెలిసి మరో దేశంలో ఉద్యోగం చేస్తున్న ఒకరి తల్లి ఊర్లో ఉండి టాయ్‌లెట్‌‍లో పడిపోతే చివరకు ఆ విషయం కూడా రోజూ ఫోన్ చేసే కొడుకు తెలుసుకుని తెలిసిన డాక్టర్‌కి కబురు చేసి అక్కడినుంచే వైద్యం ఇప్పించిన ఘటనలు జరుగుతున్నాయి. వందల కోట్లు సంపాదించి బిడ్డలకు పంచిపెట్టిన పెన్నా సిమెంట్స్ ఓనర్ ఇప్పుడు దిక్కులేకుండా రాయచోటిలో ఒక వృద్ధాశ్రమంలో బతుకు వెళ్లదీస్తున్నాడు. 90 ఏళ్ల వయసులో ఆయన ఏడుపును, ఒంటరితనపు చిత్రహింసను ఎవరు పరిష్కరిస్తారు?

జీవితం ఇలాగే బోసిపోతోందా?

మన జీవితాల్లో ఈ ఒంటరితనం రోగాన్ని మించిన భయంకరమైన రోగం మరొకటి లేదు. వద్ధాశ్రమంలోకూడా పోయి ఉండలేని వారి బతుకు మాటేమిటి మరి. మనం పుట్టి పెరిగిన ఊళ్లలో వారానికి ఒకసారి ఆరెంపీ వైద్యుడు పోయి ముసలివారికి మందూమాకూ ఇచ్చి వచ్చే రోజులొచ్చేశాయి. తల్చుకున్నప్పుడల్లా దేవుతుంది నాకు. మన చిన్నప్పుడు మనం చూడలేనంత డబ్బు మనం సంపాదిస్తున్నాము. డబ్బుతో పనిలేకుండా ఉన్నంతలో పొదుపుగా, కలివడిగా, సంతోషంగా గడిపిన రోజులు పోయాయి. ఊరు ఊరంతా బంధుబలగంతో, ఆటలతో, సంతోషంగా గడిపిన రోజులు ఎక్కడిపోయాయి ఇప్పుడు? కుటుంబాలు కూడా చెట్టుకొకరూ, పుట్టకొకరుగా వేరుపడిపోవలసి వస్తున్న పాడుకాలంలో చివరకు మనం ఏమైపోతామో అర్థం కావడం లేదు.”

నిన్న శనివారం శీనుతో గడిపిన మూడుగంటలూ ఇదే సంభాషణ.. మంచి జీవితం కోసం, సంపాదన కోసం, భవిష్యత్తు కోసం మనుషులు పడుతున్న పాట్లు వారి వృద్ధాప్య జీవితంలో బతికి ఉన్నప్పుడే నరకాన్ని చూపిస్తున్నాయని, కోరికోరి మనం మన గతిని ఇలా నిర్దేశించుకుంటున్నామంటూ శీను విషాదంతో చెబుతుంటే మౌనంగా ఉండిపోయాను. స్వర్గ నరకాలను నమ్మవచ్చు నమ్మకపోవచ్చు కాని నరకం ఇప్పుడు భూమ్మీదే మనందరి కోసం తయారవుతోంది. ఇది మనందరి జీవితాలనూ వెంటాడుతోంది. తల్లిదండ్రులు, పిల్లలు కూడా కలిసి బతకడం సాధ్యం కాని నరకం ఇది. ఆ నరకంలో కూడా -అదంటూ ఉంటే- మనిషికి ఎదురుపడనంత ఘోర నరకం ఇది.

నా స్నేహితుడితో ఊరి ఊసులాడుకుంటున్నప్పుడే చందమామ చిత్రకారులు శంకర్ గారి స్థితి గుర్తుకొచ్చింది. కొడుకులూ కూతుళ్లలో చాలామంది దేశంలో వేరే నగరాలకు, విదేశాలకు వెళ్లిపోయాక స్వంత ఇంటిలోనే కావచ్చు ఇప్పుడు ఆ దంపతులు ఇద్దరే మిగిలారు. భారీ సంతానం వీరికి. కాని ఒక్కరూ దగ్గరగా లేరు. 88 ఏళ్ల వయసులో ఆయన, సహచరి షణ్ముఖవల్లి గారు ఒకరికొకరు తోడుగా బతుకుతున్నారు. సాంప్రదాయక జీవితం గడుపుతున్న వీరిలో ఆమెకు ఆరోగ్యం బాగాలేక నగరంలోనే దూరంగా ఉంటున్న కూతురు ఇంటికి ఆమె వెళ్లిపోతే కాసింత అన్నం, కాసింత పప్పుకూర స్టౌమీద పెట్టి చేసుకుకోవటం తప్పితే ఆయనకు వేరే దారిలేదు.

“ఏంటి మాస్టారూ ఈ రకమైన జీవితం” అని అడిగితే ఆయన ఎప్పటిలాగే శాస్త్రోక్తంగా అంటుంటారు. “కాళ్లూ చేతులూ ఆడుతున్నంతవరకూ ఇలాగే బతకాలని ఆ శంకరుడు ఆదేశించాడు కదా మరి. ప్రతివాడికీ ఆ శంకరుడు టికెట్ రాసి పెట్టాడు. ఆ రోజు దగ్గర కాగానే టికెట్ చింపేసి వెళ్లిపోవడమే గతి. ఎవరూ ఏమీ చేయలేరు కదా”.  ఆయన జీతం చెక్ బ్యాంకులో వేసి రావడానికి, అవసరమైన డబ్బు తీసుకొచ్చి ఇవ్వడానికి కూడా చందమామ నుంచి ఎవరో ఒకరు పోతే తప్ప మరో దారి లేదు వాళ్లకు.

ఈ వయసులో కూడా సంపాదన ఉన్న ఇలాంటి వారిని మినహాయిస్తే కోట్లాది సాధారణ జీవితాల పరిస్థితి ఏమిటి? ఇది మనకే కాదు సంపదల మేట పడిన అమెరికాలో కూడా కోట్లాదిమందికి గృహసమస్య పెనుభారంగా మారి సంక్షేమ కోతల కోరల్లో పడి నలుగుతున్నారని, దీనికి తెలుపు నలుపు వర్ణభేదం కూడా లేదని వార్తలు విస్తృతంగా అంతర్జాలంలో కనబడుతున్నాయి.

మొత్తం మానవ సమాజానికే డబ్బు జబ్బు, ఒంటరితనం జబ్బు పడుతున్నట్లుంది. మందు మాకులివ్వడానికి కూడా మనుషులు లేరంటూ విలపిస్తున్న మన తరానికి, మన జాతికి ఇదే ఒక పెద్ద నరకం. మన బంగారు బాల్యాన్ని, ఉమ్మడి కుటుంబం, విడి కుటుంబం యొక్క మధురోహలను కూడా దూరం చేసి మనుషులను అమాంతంగా చెల్లాచెదురు చేస్తున్న మహా నరకమిది. రేపు మాపు ఎవరయినా దీనికి బలి కావలిసిందే కాబోలు.

మనుషులుగా మనం కోల్పోయిన, కోల్పోతూ వస్తున్న మన జీవితానందాలను, ఒకనాటి మన ప్రపంచం నడకను పట్టిచూపుతున్నందుకే చందమామ కథలు ఇవ్వాల్టికీ సమాజాన్ని అంతగా ఆకర్షిస్తున్నాయేమో..!

RTS Perm Link


5 Responses to “మందులు తెచ్చిచ్చేవాళ్లూ లేరు నాయనా!”

 1. sri on May 5, 2012 9:24 AM

  Well Said.

 2. chandamama on May 8, 2012 12:00 AM

  మీ వ్యాఖ్య సకాలంలో చూడలేకపోయాను శ్రీ గారూ, క్షమించాలి.
  ధన్యవాదాలు.

 3. Srikanth M on May 9, 2012 12:09 AM

  రాజశేఖర్ గారూ మీకు సమాధానంగా నాబ్లాగులో పోస్టేశాను చూడండి.
  రాజశేఖర్ గారూ, విశేఖర్ కు ఆల్-ఖాయిదాతో సంబందాలున్నాయా..!!

 4. gksraja on June 5, 2012 9:39 AM

  అవును! మీరు చెప్పేదాంట్లో వాస్తవం ఉంది, కానీ దాన్ని జీర్ణించుకొనే సంసిద్ధత ఉండాలి నిన్నటితరంవాళ్లకు. ప్రతిదాన్నీ మార్కెట్ శక్తులు కబళిస్తున్న వేళ, ఒకసారి ఆదివాసుల సంగతే ఊహించండి. అడవి బిడ్డల్ని చెట్టుకి చేనుకి కాకుండా చేసి వాళ్ళు పండించిందే వాళ్లకు దక్కకుండా చేస్తున్న కుట్రల పట్ల మనందరి ఉదాసీనతే దీనికి కారణంగా తోచడం లేదూ? అవును- నరకం, స్వర్గం వేరే ఎక్కడా ఉండవు. మనం నిర్మించుకుంటున్నవే. ఉమ్మడి కుటుంబం కూడా మరో సమస్యే! ‘బంగారు కుటుంబం’ లో మంచి సందేశమే వుంది. మాట్లాడే వాళ్ళ కరువు కేవలం బంధువులు, సంతానం వల్లే కలగడం లేదు. సమాజమే అలా తయారయ్యింది. ‘ఇడియట్ బాక్సు’ ‘సెల్ ఫోను’ ఎంతటి సౌకర్యమో, అంతటి అగాధాల్ని కూడా సృష్టిస్తున్నాయి మానవ సంబంధాల్లో. ‘ అందుకే మూల సూత్రం ‘మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే’ అన్నదాన్ని మననం చేసుకుంటూ, పరిష్కారాలు ఉమ్మడిగా కనుక్కొనే ప్రయత్నం చేసుకోవాలి. జీవితం వేరు జీవనం వేరు అన్న స్పృహ ఈ నాడు ఎందరికి కలుగుతోంది?
  రాజా.
  gksraja.blogspot.com

 5. chandamama on June 16, 2012 11:02 AM

  జికెఎస్ రాజా గారూ,

  క్షమించాలి. చాలా చాలా ఆలస్యంగా మీ వ్యాఖ్య చూశాను. మీవ్యాఖ్య సారాంశంతో ఏకీభవించడమే తప్ప విభేదించవలసింది లేదు.

  కృతజ్ఞతలు

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind