లేఖల్లో చందమామ…

April 16th, 2012

నేను గత 55 సంవత్సరాలుగా చందమామ పాఠకురాలిని. ఆ చల్లని చందమామకు లాగే ఈ పంచరంగుల చందమామ కూడా ఇంటిల్లిపాదికి ఎంతో ఆనందం కలిగిస్తోంది. 50 ఏళ్ల క్రితం చదివిన తోకచుక్క, రాకాసిలోయ, విచిత్రకవలలు ఇంకా నా కళ్లకు కట్టినట్లే ఉన్నాయి. చందమామను చూస్తే ఎన్నో జ్ఞాపకాలు. జైలు సూపర్నెంటుగా పనిచేసిన మా వారు ఆఫీసు నుంచి వచ్చాక ఏమాత్రం తీరిక దొరికినా చందమామే చదివేవారు. మా ఏడుగురు పిల్లలకు రామాయణ, భారతాలు పరిచయం చేసిన పుణ్యం చందమామదే. ఇప్పుడు చందమామ తిరిగి పూర్వవైభవం సంపాదించింది. చాలా కథలు వేస్తున్నారు. పాత సీరియల్స్, కొన్ని పాత కథలు చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. మళ్లీ మా ఇంట్లోకి వెన్నెల వెలుగులు వస్తున్నాయి. చందమామలో 40 ఏళ్లుగా కథలు రాస్తున్న మాచిరాజు కామేశ్వరరావు నా కుమారుడే. ఐదేళ్ల గ్యాప్ తర్వాత తను మళ్లీ చందమామకు కథలు రాసి పంపనున్నాడు. నా వయస్సు ఇప్పుడు 81 సంవత్సరాలు. వంద సంవత్సరాల వరకు చందమామ చదువుతుండాలని నా ఆశ. మా అభిమాన చందమామ ఇంటిల్లపాదిని ఇలాగే అలరించాలని ఆశీర్వదిస్తున్నాను.
–మాచిరాజు రత్నకుమారి, హైదరాబాద్.

ఊహ తెలిసినప్పటినుంచి చందమామ తెలుసు. ఇప్పటికీ చందమామ చేతిలో పడిందంటే చాలు పుస్తకం మొత్తం చదవందే వదలను. అయితే నేను చదివే విధానం గమ్మత్తుగా ఉంటుంది. వెనకపేజీ నుంచి మొదలు పెట్టి ముఖచిత్రంతో ముగిస్తాను. నాకు పది సంవత్సరాల వయసు గల మనవడున్నాడు. వాడు కథ చెబితే గాని నిద్రపోడు. రోజుకో కొత్త చెప్పాలి. అలాంటప్పుడు అనిపిస్తుంటుంది. ‘చందమామ నెలకొక్కటేనా’ అని.
–వై. సువర్ణకళ, ఉప్పల్, హైదరాబాద్.

ఏప్రిల్ సంచికలో నా తొలి కథ ‘అనువుగానిచోట‘ చూడగానే ఎంత సంతోషమేసిందో మాటల్లో చెప్పలేను. నర్సింగ్ హోమ్ నుంచి ఇంటికొచ్చి రాత్రి ఏక బిగిన చదివేశాను. నడి రాత్రి తర్వాత కూడా చందమామను మునివేళ్లతో పట్టుకుని నిమురుతుంటే మా చెల్లెలు చూసి ‘ఇక చాల్లే పడుకో’ అంటూ మందలించింది. దీనికి కారణం ఉంది. ఇతర పిల్లల పత్రికలకు కథలు పంపే నా స్నేహితురాళ్లు ‘చందమామలో నా కథ పడుతోంద’ని చెబితే అదీ చూద్దాం అంటూ గత కొద్ది నెలలుగా అపహాస్యం చేస్తూ వచ్చారు. అందుకే చందమామలో నా తొలి కథను ఆనందంతో కాదు కసిగా చదివాను. 12 భాషల్లో చందమామను తెప్పించుకుని వాళ్లందరికీ నా కథను 12 భాషల సంచికలలో చూపించి నవ్వాలని ఉంది. చందమామలో నా తొలి కథ ప్రచురించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
–డాక్టర్ సిరి, మిర్యాలగూడ, నల్గొండ

ఏప్రిల్ చందమామ చక్కటి కథలతో పున్నమి చంద్రుడిలా నిండుగా ఉంది. అయితే జాబిలిలోని మచ్చలా ‘తరం-అంతరం’ కథ అనిపించింది. అలాంటి కథల ప్రచురణ దయచేసి ఇకనైనా ఆపండి. గ్యాస్ స్టవ్‌లు, మిక్సీల బొమ్మలు, పిజ్జాలు, బర్గర్లు, కంప్యూటర్, ఆఫీసు లాంటి పదాలు చందమామకు వద్దు. ఈ కాలం సబ్జెక్టులతో వెయ్యి కథలు రాయొచ్చు. అయితే అవి చందమామకు అందాన్నివ్వవు. అలాంటి కథలకు చాలా పత్రికలు ఉన్నాయి. తాజ్‌మహల్‌కి గులాబి రంగు లేస్తే ఇంకా అందంగా అర్థవంతంగా ఉండొచ్చు గాక. కానీ దాన్ని పాలరాతితో నిర్మించిన షాజహన్ అభిరుచే అందరికీ ఇష్టం. ఆమోదం. చందమామ కూడా అంతే. ఎన్నో గొప్ప పత్రికలు సైతం కాలగర్భంలో కలిసి పోయినా, చందమామ ఇప్పటిదాకా గర్వంగా తలెత్తుకుని నిలబడిందంటే ఆ గొప్పతనం దాని మూలాల్లోనే ఉంది. దయచేసి వాటిని అలాగే కాపాడండి. ఇది నా ఒక్కడి అభిప్రాయం కానేకాదు. చందమామ అభిమానులందరి అభిప్రాయం. కావాలంటే సర్వే జరపండి. చందమామకి ఆధునికత వద్దు.. వద్దు.. వద్దు…
— పి. వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి, ఎపి.

గత కొద్ది నెలలుగా చందమామలో వస్తున్న కథల సంఖ్య చూసి చాలా ఆనందం కలిగింది. ఎక్కువ మంది రచయితలకు అవకాశం కల్పించడం ముదావహం. మీరు చేస్తున్న కృషికి దన్యవాదాలు. చందమామకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నంలో మీరు విజయం సాధించాలని అభిలషిస్తున్నాను.
— జి. సుబ్రహ్మణ్య గౌడ్, రాజంపేట, కడప, ఎపి.

చందమామతో మా కుటుంబ అనుబంధం నాలుగు తరాలకు సంబంధించినది. తాతగారు, నాన్నగారు, మేము, మా పిల్లలము. గత 60 ఏళ్లుగా మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ చందమామను చదువుతూ వస్తున్నారు. పదేళ్లకు పైబడి, చందమామ ఫోటో వ్యాఖ్యల పోటీలో నా పేరు చూసుకోవాలని తహతహలాడాను. కాని అంబలి కోరుకుంటే, అమృత పరమాన్నం దక్కినట్లు.. ఏప్రిల్ సంచికలో నా కథ ‘చెల్లని నాణెం‘ ప్రచురించబడింది. చందమామలో నా పేరును నా కళ్లతో చూసుకున్న అదృష్టవంతుడిని. చందమామ ప్రాణస్నేహితులైన మా పూర్వీకులకు ఇది ఘననివాళిగా భావిస్తూ నా ఈ చిన్ని కథను వారికే అంకితం ఇస్తున్నాను.
–జి. జాన్ కెనడి. రంగారెడ్డి జిల్లా, ఎపి.

నా తొమ్మిదవ ఏటనుంచి చందమామ చదవటం అలవాటు. అప్పుడు దీని ధర పావలా ఉండేది. ఇప్పుడు నాకు 66 సంవత్సరాలు. ఇప్పటికే ప్రతినెలా కొని చదువుతున్నాను. ఆ ఆసక్తే నన్ను చందమామకు కథలు వ్రాసేలా చేస్తోంది.
–ఇందిర, హైదరాబాద్

జీవితంలో మర్చిపోలేని రోజిది. ఏప్రిల్ సంచికలో నా కథ ‘చౌకబేరం‘ అచ్చయింది. నా కథ చందమామలో వస్తోందని ఇప్పటికే మా బంధుమిత్రులకు చెప్పాను కాబట్టి వాల్లందరూ విశాఖపట్నంలో తెలుగు చందమామలు కొనుక్కుని మరీ చదివారు. బ్యాంకులో పనిచేసే మా అన్నయ్య కూడా చందమామ కాపీలు కొని ఆయన ఆఫీసులో పంచారట. చందమామ అంటే ఓల్డెస్ట్ మరియు గోల్డ్ మేగజైన్ కదా. దాంట్లో నా కథ పడటం అంటే మా వాళ్లందరికీ పెద్ద విశేషమైపోయింది. ఇక చంద్రాపూర్‌లో మా పిల్లలు చదువుతున్న స్కూలులో టీచర్లందరూ లైబ్రరీకి పోయి మరీ చందమామలో పడ్డ నా కథ చదవారట. నాన్న కథ 12 భాషల చందమామలలో వచ్చిందని వారు చెబితే అందరికీ ఆశ్చర్యమే. అన్ని చందమామల్లో నా కథ వస్తుందని గతంలోనే మీరు చెప్పగా నాకు ఒక సెట్ కావాలని అడిగాను. ఆవిధంగా మీరు పంపిన 12+ 2 భాషల చందమామల పాకెట్ ఇవ్వాళే అందుకున్నాను -15-04-2012-  మనస్పూర్తిగా చెబుతున్నాను. ఈ రోజును జీవితంలో మర్చిపోలేను. పన్నెండు చందమామల్లో ఒకేసారి నా కథ చూసుకోవడం నాకు గొప్ప అనుభూతి అయితే మా పిల్లలు వాటిని మొత్తంగా స్కూలుకు తీసుకుపోయి టీచర్లకు, సహ విద్యార్థులకు చూపిస్తామని గోల చేసేస్తున్నారు. చందమామకు ఎలాంటి కథలు రాయాలి అనే విషయంలో కూడా మీరు ఇస్తున్న సలహా మాలాంటి వారికి ఎంతగా ఉపయోగపడుతోందో మాటల్లో చెప్పలేను. థాంక్యూ చందమామా..
–మళ్ల లక్ష్మీనారాయణ, రైల్వేస్, చంద్రాపూర్, మహారాష్ట్ర

RTS Perm Link


One Response to “లేఖల్లో చందమామ…”

  1. chandamama on April 16, 2012 5:22 AM

    రత్నకుమారి అమ్మా,
    మీ ఆశీర్వాదం చందమామకు వరంగా మారాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. నిండునూరేళ్లు మీరు సంపూర్ణారోగ్యంతో ఉండాలని, చందమామను చదువుతూనే ఉండాలని కోరుకుంటున్నాము. మీ అబ్బాయి మాచిరాజూ కామేశ్వరరావు గారి కథలు అందాయి. ఒక తెగిపోయిన చరిత్ర బంధం మళ్లీ అతుక్కున్నట్లుగా ఉంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నెల్లు పొల్లును వేరుచేస్తూ చందమామలో ఏది మంచి ఏది చెడ్డ అనే అంశంపై మీరు నిక్కచ్చిగా అభిప్రాయాలు తెలుపండి. చందమామలోని మంచి అంతటికీ మీలాంటి అమృత మాతృమూర్తులే కారణం. అమ్మలు, నాన్నల ప్రభావం కారణంగానే చందమాను కొన్ని తరాలుగా తెలుగు పిల్లలు చదువుతూ వస్తున్నారు. ఈ అపరూప బంధం కలకాలం ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటూ..
    చందమామ.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind