అభివృద్ధి వెలుగునీడలు : మల్లెమడుగు

April 8th, 2012

ఈ ఆదివారమంతా మరే పనీ చేయకుండా ఇంటికి వచ్చే మూడు పేపర్లు అక్షరాక్షరం తిరిగేస్తూ, బ్లాగులు చూస్తూ, ఇష్టమైన కథనాలను ఆన్‌లైన్ లింకులతో సహా నిలవ చేసుకుంటూ గడిపేశాను. నాకు బాగా నచ్చిన కొన్ని అపురూప కథనాల లింకులను ఇక్కడ ఇస్తున్నాను.

కూటాలమర్రి, మల్లెమడుగులను వెతుక్కుంటూ…

గత ఫిబ్రవరి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధాలలో రెండు వారాల పాటు ఒక అద్భుత కథనం ప్రచురించబడింది. అడవికీ, నాగరికతకు మధ్య తెగిపోయిన పేగు బంధాన్ని అద్వితీయ శైలిలో వివరించిన ఈ కథనాల కర్త డాక్టర్ లెనిన్ ధనశెట్టి గారు.

కడప-నెల్లూరు జిల్లాల మధ్య వెలిగొండు పర్వత శ్రేణుల మధ్య ఉంటే కూటాలమర్రి- మల్లెమడుగు గ్రామం గ్రామమే అటవీ జీవనాన్ని వదిలిపెట్టి మైదానాల పాలబడిన శిథిలమైపోయిన చరిత్రను కమనీయంగా, మానవీయంగా, కరుణామయంగా చిత్రించిన కథనం ఇది.

బస్సులూ, కరెంటు దీపాలు ఎట్టుంటాయో కూడా చూడకుండానే కాటికి పోయినోళ్ల ఊళ్లు కూటాలమర్రి, మల్లెమడుగు. ఒక్క మల్లెమడుగు గ్రామంలోనే 350 గడప ఉండేది. నీటి సౌకర్యం లేకపోయినా మంచుకే పంటలు పండే జీవగడ్డ. పురుగు మందు, ఎరువు అనే పదాలు తెలియని, దుక్కి దున్ని విత్తనాలు విసిరితే చాలు పుట్లకొద్దీ పంట కోసుకోవడమే తరువాయిగా బతికిన పచ్చపచ్చటిప్రాంతం..

నాగరికత తన కరకు కత్తులను మెత్తగా దింపగా పిల్లలు చదువులపాలై, ఉద్యోగాల పాలై.. ఒక్కొక్కరూ బయటి ప్రపంచంలోకి ఎగిరిపోగా బిత్తరపోయిన ఊరు. నలభై ఏళ్లుగా ఊరికి రోడ్డెయ్యండనీ, కరెంటీయండనీ నాయకులకూ, కలెక్టర్లకూ మొక్కిన మొక్కులు మొక్కులుగానే మిగిలిపోయిన నేపథ్యంలో కొంపా గోడూ, పొలాలూ ఆవులూ వదిలి చెట్టుకొకరూ పుట్టకొకరూగా ఒక్కో కుటుంబం దేశం మీద పడిపోతే ఖాళీ అయిపోయిన ఊరు. మల్లెమడుగు.

రచయిత మాటల్లో చెప్పాలంటే…. “ఒక తరం ఆశలకు వృద్ధతరం విశ్వాసాలకూ మధ్య ఈ గ్రామంలో జరిగిన యుద్ధంలో- సంఘర్షణలో ఎన్ని హృదయాలు గాయపడ్డాయో? ఎన్ని గుండెలు ఊరిని వదలలేక కుమిలి కుమిలి ఆగి మరణించాయో? ఒక యుద్ధానంతర దైన్యాన్నీ, వేదననూ ఆ శిథిల గ్రామం అణువణువునా ప్రతిబింబిస్తోందనిపించిందా క్షణం.?”

దాదాపు పాతికేళ్లుగా ఈ ఊర్ల గురించి వింటూ వస్తున్న రచయిత ఒకరిద్దరు మిత్రులతో కలిసి ఈ సంవత్సరం అడవిబాట పట్టి ఈ శిధిల గ్రామాలను శోధిస్తూ పోయిన క్రమమే ఈ కథనానికి మూలం. యుగాలనుండి మనుషులు సాగిస్తున్న పర్యాటక యాత్రల చరిత్రలో ఒక అద్వితీయ ఘట్టాన్ని ఈ కథనం మన కళ్లముందు దివ్యంగా ప్రదర్శించింది.

భూ దిగంతాల కనుచూపు మేరా ఆక్రమించిన విశాలమైన లోయ- ఆ లోయ పొడవునా సమ్మోహన నిశ్శబ్ద ధ్యానం.. కనుచూపు పరిమితికి లొంగని విశాల లోయ.. రెండు కొండల నడుమ లోయలోకి నడుస్తూ అడవితల్లి సౌందర్యాన్ని విభ్రాంతితో నిశ్చేష్టులై చూస్తూ… ఆమె గర్భంలోకి నిర్భయంగా… నిరాయుధంగా… జ్ఞాన రహితంగా… అచేతనంగా ఎవరో మంత్రించినట్టు అలా సాగిపోవడం…  చీకటి పొదలను దాటే క్రమంలో ఆ వేణువనం మధ్యలోని ఆయిల్ పెయింటింగ్ లాంటి ఒక చెరువు.. ఎత్తయిన కొండ చరియలతో సహా వెదురు గెడల ఆకుల సూక్ష్మ కొనలు సైతం స్వచ్ఛమైన ఆ చెరువు నీళ్ళలో ప్రతిఫలిస్తుండగా కోటి వర్ణాలుగా వివర్ణించిన కాంతి ఇంద్రజాలం…

వేల ఎకరాల పచ్చిక బీళ్ళ మైదానం… కోటి ఐమాక్స్‌లలోనూ పట్టని దృశ్య ఉత్సవం. దూరంగా చెట్ల సందుల్లో కనిపిస్తున్న పూరిళ్ళ ఊరు… మల్లెమడుగు… ఏళ్ళ జ్ఞాపకం వాస్తవమై సాక్షాత్కరించిన సందర్భం.. కొరివి దెయ్యాల కథల్నుంచి… గాయత్రి, ఎగ్జార్సిస్ట్, వోమెన్, అరుంధతి, కాంచన వరకూ విలేజ్ అండ్ అర్బన్ లెజెండ్స్ అనబడే హత్యా ఆత్మహత్యల బీభత్సరస ప్రధాన గాథలన్నీ మెదళ్ళ స్మృతి పేటికల నుంచి మాటలుగా ప్రవహిస్తుండగా, కొన్ని వేల పిట్టల అరుపులతో ఆ అడవిలోయ ప్రతిధ్వనిస్తుండగా, ఉత్తర దక్షిణాలుగా వ్యాపించిన మల్లెమడుగు ఈ కథన రచయితకు క్షతగాత్రురాలిలా దర్శనమిచ్చిందట.

ముగ్గురు కలెక్టర్లు మమ్మల్ని అడవి నుంచి బయటకు తరిమి మా బతుకులను నాశనం చేశారని అడవికి మమ్మల్ని దూరం చేసిన వారికి అడవి తల్లి గోస తగిలి వంశనాశనం అయిపోతుందని కూటాలమర్రి కాలనీలో జీవచ్ఛవాలుగా మిగిలి ఉన్న వారి శాపాలు..

ఒక యుద్ధం లేదు. ఒక సైనిక దాడి లేదు… ఒక దురాక్రమణ లేదు. ఆదివాసీ అభివృద్ధి పేరిట పాలకులు చేపట్టిన అర్థరహిత చర్యల కారణంగా అడవికి దూరమైపోయిన అడవిపుత్రుల విషాద చరిత్ర ఇది.

నాకు తెలిసి సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితమే అనుకుంటాను.. నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో జీవిస్తున్న చెంచులను ఉద్ధరించడానికి నడుం కట్టిన ప్రభుత్వం వారిని అక్కడి నుంచి బయటకి తెచ్చి మైదాన ప్రాంతంలో నివాస ప్రాంతం, వ్యవసాయ భూమి కల్పించి బతికేయమని చెప్పింది. అడవి ఉత్పత్తులమీద, ఆహార సేకరణ మీద ప్రధానంగా బతుకుతూ వచ్చిన చెంచులు ఒక్కసారిగా తమ కళ్లముందు కనిపించిన ఈ విశాలప్రపంచంలో ఏం చేయాలో, ఎలా బతకాలో అర్థం కాక తిండిలేక చనిపోయారు.

భూమి ఇచ్చాం కదా బతికేస్తారులే అని వదిలేసిన మన ఘనత వహించిన ప్రభుత్వం, అధికారులు వారికి వ్యవసాయం వచ్చా, రాకపోతే వారికి కల్పించవలసిన కనీస ప్రాధమిక శిక్షణ, పరికరాలు, తదితర వ్యవసాయ అవసరాలను తీర్చడం ఎలా అనే విషయాలను ప్రాథమికంగానే మర్చిపోయారు. ఏం చేయాలో తోచని స్థితిలో ఆ ఆడవి పుత్రులు ఆకలికి మాడి చనిపోయారు.

ఈ రోజుకీ అడవి పుత్రులను ఇలాగే ఉద్ధరిస్తున్నారని ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో లెనిన్ ధనశెట్టి గారు రాసిన అద్భుత కథనం తేటతెల్లం చేసింది. అభివృద్ధి అని మనం అనుకుంటున్న గొప్ప విషయాలు ఆ అదివాసీలను ఆకలికి మాడి చావకుండా నిరోధించలేకపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి నమూనా ఇలాగే కొనసాగుతున్నట్లుంది.

మనం నివశిస్తున్న నేలమీద ఒకానొక మహారణ్యంలో అభివృద్ధి భావన విషప్రభావంతో అంతర్ధానమైపోయిన రెండు గ్రామాల శిథిల చరిత్రను దయనీయంగా తడిమిన ఆ రెండు కథనాల లింకులను కింద చూడండి.

కూటాలమర్రి, మల్లెమడుగులను వెతుక్కుంటూ…

http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2012/feb/5/travel&more=2012/feb/5/sundaymain

ఊరు అడవిలో..మనుషులు కాలనీలో…

http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2012/feb/12/travel&more=2012/feb/12/sundaymain

ఈ రెండు కథనాలపై దేశదేశాల ఆంధ్రజ్యోతి పాఠకుల నుంచి వచ్చిన స్పందన కింది ఉత్తరాలలో చూడండి.

అద్భుతం ఆ వనవ్యాహ్యాళి

ట్రావెలోకం చదువుతున్నంత సేపూ ఉత్కంఠ, ఉద్వేగం. అనిర్వచనీయమైన అనుభూతిని పొందాను. సాహిత్యంలో ఇదో కొత్త ఒరవడి. అద్భుతమైన వర్ణనా చాతుర్యం, పదగాంభీర్యం, శైలీ విన్యాసం పాఠకుల మనసు రంజింప చేసేలా ఉంది. మంచి వనవ్యాహ్యాళికి తీసుకెళ్లారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితం గా నిరాశ్రయులైన, అవుతున్న ఒక సమూహ జీవన వాస్తవాన్ని కళ్లముందు ఆవిష్కరించారు. విధ్వంసక అభివృద్ధి వెనుక దిసమొలతో సంచరిస్తున్న (అ)నాగరికుల అసలు స్వ రూపాన్ని నిర్భయంగా చెప్పి, చెంప ఛెళ్లు మనిపించారు.

శెభాష్. ఆత్మనిందను (నాగరికతా శాపగ్రస్తులం) సైతం అలంకార పదబంధాలతో అందించారు. మట్టిమనుషులు మృత జీవులుగా మారుతున్న క్రమాన్ని, నరజాతి చరిత్ర నరహంతకుల పాలవుతున్న వైనాన్ని, అడవి బిడ్డల ఆవేదనల మూలాన్ని, అమ్మతనం కనిపించని అభివృద్ధి మోసాల్ని ఎంత స్పష్టంగా సూటిగా చెప్పారో! తిరుగు ప్రయాణంలో అలసట చెందిన మీ కళ్లు విశ్రాంతి కోరుకోవాల్సిందిపోయి, కన్నీళ్లు కార్చాయం టే మీ హృదయం ఎంతగా చలించిందో అర్థమవుతోంది.- డా.జి.వి.కృష్ణయ్య, కొత్తపట్నం

ట్రావెలోకం చదువుతున్నంతసేపూ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాము. ఈ మధ్యకాలంలో ఇంతగా మనసును హత్తుకున్న రచన మరోటి లేదు. మీతో ప్రయాణించిన స్నేహితులందరికీ శుభాకాంక్షలు. మీ స్నేహబృందంతో కలిసి ఇలాంటి ప్రయాణం చేయాలని నాకు ఉంది.-శ్రీనివాస్, మలేసియా,ప్రసాద్, శివప్రసాద్, శ్రీధర్, ఇ-మెయిల్

కూటాలమర్రి, మల్లెమడుగులను వెతుక్కుంటూ.. సాహసయాత్ర వ్యాసాలు అద్భుతం. వెలిగొండ అందాల ఆవిష్కరణ శైలి కూడా ప్రకృతి అంత స్వచ్ఛంగానే ఉంది. తెలుగు సాహిత్యలోకంలో మీలాంటి రచయిత ఉన్నందుకు గర్వంగా ఉంది. ‘అకారణంగా కన్నీళ్లు వచ్చాయి ఎందుకో?’ అనే పదాలు రాయకుండా ఉండాల్సింది.- హరిప్రసాద్, ఇ-మెయిల్

మీరెంతో ప్రేమతో, శ్రద్ధ తీసుకుని రాసినా ఈ బ్యూరోక్రాట్స్ మారతారంటారా? రెండు వ్యాసాలు చదివేసరికి నేను కూడా లోపలెక్కడో విలపించాను. బహుశా చదివిన అందరూ ఇలాగే ఫీలౌతుండచ్చు. బయటో…లోపలో…- విజయ్‌కుమార్ కోడూరి

లెనిన్‌గారి ట్రావెలాగ్ చదివాక ఇది రాయకుండా ఉండలేకపోతున్నాను. మీరు నడచిన ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ప్రచార అధికారిగా 1983-90 మధ్య తెగ తిరిగిన రోజులన్నీ గుర్తుకు వచ్చి సంభ్రమానికి గురయ్యాను. ఆ తర్వాత బెజవాడ రేడియోలో న్యూస్ ఎడిటర్‌గా చేసేటప్పుడు లంక వెంకటరమణతో కలిసి ఎక్కి దిగిన కొండలు, చేసిన సాహసాలూ గుర్తొచ్చాయి. పైపెచ్చు నేను నెల్లూరు వాడిని కావడం వల్ల మీ అనుభూతి నన్ను మరింతగా కుదిపింది. మంచి వ్యాసంతో ఆపాతమధురాలను తలపు తెచ్చినందుకు ధన్యవాదాలు.- ఎమ్.వి.ఎస్.ప్రసాద్, చెన్నై.

కొసమెరుపు:

నిన్ననే మా ఊరునుంచి శివరాం ఒక కబురు మోసుకువచ్చాడు. 1970ల మొదట్లో హరిత విప్లవంలో భాగంగా మా ఊరులోకి కరెంటు, హైబ్రిడ్ సేద్యం వచ్చింది మొదలు ఇంతవరకు ఏటా రెండు పంటలకు తక్కువ కాకుండా పండుతూ కడప జిల్లా కోస్తాగా పేరొందిన మా ప్రాంతంలో -సుండుపల్లె, మడితాడు, రాయవరం- ఏట్లో కిలోమీటర్ల పొడవునా వేసిన వేలాది సాగునీటి బోర్లు ఈ నెలలో పూర్తిగా నీటిచుక్క లేకుండా పోయాయట.

మాకు తెలిసి ఈ నలభై ఏళ్లలో మొదటిసారిగా మా ప్రాంతాల్లోని ఊర్లలో మంచినీటి ట్యాంకర్లు అడుగుపెట్టి నీటిని బిందెల లెక్కన ఇస్తున్నాయట. గల్ఫ్ దేశాలనుంచి వచ్చిపడుతున్న డబ్బుతో అన్ని ఊర్లలో భూములను కొనివేసి తోటల సాగు మొదలెట్టిన మా ప్రాంత ముస్లింలు బోర్లు మొత్తంగా ఎండిపోవడంతో విలవిల్లాడిపోతున్నారట.

దీనంతటికీ కారణం వరుసగా రెండేళ్ల పాటు వర్షాలు కురవకపోవడం. ఊళ్లలో చెరువులు ఎండిపోవటం. వాన పడితే, చెరువునిండితే, ఏటిలో జల పైకి ఎగబాకితే పచ్చగా బతికిన మాప్రాంతం ఇవ్వాళ తాగేందుకు మంచి నీళ్లకు కూడా గతిలేక బయటినుంచి ట్యాంకర్లను తెప్పించుకుని బతకాల్సిన పరిస్థితి.

500 ఏళ్ల క్రితం కృష్ణదేవరాయలకున్న పాటి ముందు చూపు కూడా మన పాలకులకు లేకపోవడమే మనుషులను, ఊర్లను చంపేస్తోంది. చెరువులను చదును చేసి ప్లాట్ల బిజినెస్ మొదలెట్టేస్తున్నారు. ఊరు మనుగడకు ప్రాణాధారమైన చెరువులను మాయం చేసేస్తున్నారు. చెరువుకు, ఏటి జలకు ఉన్న పేగు బంధాన్ని తెంచేస్తున్నారు.

మా ఊరికి చాలా దగ్గరలోనే ఉన్న కూటాల మర్రి, మల్లెమడుగు ఊర్ల అంతర్ధానం గురించి బాధపడుతున్నాం కాని అడవుల్లోని గుడిసెలనే కాదు. మైదానాల్లోని ఊర్లను కూడా వల్లకాట్లోకి పంపిస్తున్న పాలకులు, పాలనలే మా ప్రాంతాన్ని కూడా కాటేస్తున్నాయి. మరొక్క సంవత్సరం ఇలాగే ప్రకృతి పెడముఖం పెట్టిందంటే మా ప్రాంతం మొత్తంగా ఖాళీ అయిపోతుంది. ఈ సారి కూడా వర్షపాతం తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే తేల్చేసింది.

65 ఏళ్ల స్వాహాతంత్రం మా ఊరు పునాదులను కూడా పెకిలించివేస్తోంది. శతకోటిలింగాల్లో ఒక బోడిలింగంలాగా మా ఊరు కూడా అంతరించిపోనుందా..?

తల్చుకుంటేనే భయమేస్తోంది.

RTS Perm Link


Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind