చందమామలో ఓ చక్కటి కథ : “విమర్శ”

March 30th, 2012

చందమామ కథకులు శ్రీ తిరుమలశ్రీ గారు పంపిన ఈ కథ ‘విమర్శ’ జనవరి చందమామలో ప్రచురితమైంది.  మధ్యయుగాలకు సంబంధించిన ఈ రాజరికపు నేపథ్యంలోని కథలో ఆధునిక భావాలను అతి చక్కగా చొప్పించడంలో రచయిత ప్రదర్శించిన నైపుణ్యం సాటిలేనిది.  పాలకుడిని సామంతుడు విమర్శించినంత మాత్రానే అతడికి వెంటనే  బుద్ది చెప్పి వస్తానని ఔద్ధత్యం ప్రదర్శించిన సేనాధిపతికి రాజు ఎలా కనువిప్పు కలిగించాడో ఈ విమర్శ కథ మనోహరంగా వివరిస్తుంది.

కుటుంబ పెద్ద అభిప్రాయాలను కుటుంబ సభ్యులే  ఏకగ్రీవంగా ఆమోదించలేనప్పుడు రాజు ఆదేశాలను, నిర్ణయాలను సామంతులు, పాలితులు ఏకగ్రీవంగా ఎలా ఆమోదించగలరు అనే సార్వకాలిక ఇతివృత్తంతో ఈ కథ నడిచింది.

“అనంతవర్మ సామంతుడైనంతలో మనకు బానిస అని అర్థం కాదు. మన సామ్రాజ్యమనే ఉమ్మడి కుటుంబంలో అతనూ ఒకడు. చక్రవర్తి చేసే శాసనాలను విశ్లేషించి విమర్శించే హక్కు సామంతరాజులకు ఉన్నాయి. వారు మనకు చెల్లిస్తూన్న కప్పమూ, మన సామ్రాజ్యంలో వారూ ఒక భాగమే నన్న సత్యమూ వారికి ఆ హక్కును ప్రసాదించాయి. అందుకు వారిని తప్పు పట్టడం సమంజసం కాదు”

“ఓ క్షణం అధికార మదం అనే పొరని తొలగించి శాంతంగా ఆలోచిస్తే నీకే బోధపడుతుంది. చిన్నదైన నీ స్వంత కుటుంబం లోనే ఏకాభిప్రాయం కుదరడం అరుదు. భార్యకూ భర్తకూ, కన్నవారికీ సంతానానికీ నడుమనే ఆలోచనలలో ఓ పొందికంటూ కుదరడంలేదు. అటువంటప్పుడు సామ్రాజ్య పాలనలో రాజకీయ పరమైన శాసనాల విషయంలో ఏలికల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంలో వింత ఏముంది?… మన శాసనాల పట్ల అనుమానాలు రేగాయాంటే   ఆ లోపం మనదే ఔతుంది. ఆ సందేహాలను తీర్చవలసిన బాధ్యత మనపైన ఉంది

“మనకు అధికారం ఉందికదా అని…విమర్శించినవారినల్లా శిక్షించాలనుకోవడం అవివేకమే ఔతుంది. అసలు విమర్శలనేవే లేకుంటే మన చర్యల లోని లోటుపాట్లు మనకు ఎలా తెలిసి వస్తాయి? సద్విమర్శలు ఎప్పుడూ ఆరోగ్యకరమే”.

పాతకాలానికే కాదు ఏ కాలానికైనా  సరే వర్తించే అక్షరలక్షల్లాంటి జీవిత పాఠాలను ఈ శక్తివంతమైన సంభాషణలు బోధిస్తున్నాయి.   ఎంపిక విషయంలో ఈ కథ ఇక్కడే నిలిచి గెలిచిందంటే కూడా అతిశయోక్తి కాదు.

తిరుమలశ్రీ గారూ..  ఆధునిక భావసంస్కారాన్ని పాత రూపంలో చొప్పించి ఇంత మంచి కథను పంపినందుకు మన:పూర్వక కృతజ్ఞతలండీ..

ఈ కథ పూర్తి పాఠం ఇక్కడ చదవండి

విమర్శ

-తిరుమలశ్రీ (పి.వి.వి. సత్యనారాయణ)

జనవరి 2012 చందమామ

త్రిపర్ణ సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి విష్ణువర్ధనుడు సహృదయుడూ, సమర్థుడూనూ.
ఒకసారి సర్వ సేనాని శూరసేనుడు చక్రవర్తి వద్దకు వచ్చి, “ప్రభూ! మన సామంత రాజ్యాలలో ఒకటైన రామపురి రాజ్యాన్ని ఏలే అనంతవర్మ ఏలినవారి శాసనాలను విమర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కప్పం కట్టడానికి కూడా సవా లక్ష ప్రశ్నలు వేస్తున్నాడట. తమ ఆజ్ఞ ఐతే తక్షణమే వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి వస్తాను” అన్నాడు.
సేనాని ఫిర్యాదును శాంతంగా ఆలకించిన విష్ణువర్ధనుడు, “అనంతవర్మకు తప్పక బుద్ధి చెప్పవలసిందే. ఎలా చెప్పాలన్నది మేం ఆలోచిస్తాం,” అని అప్పటికి అతన్ని పంపేసాడు.
చక్రవర్తి ఆదేశాలకు ఎదురుచూస్తూ, రామపురి మీదకు దండెత్తేందుకు సన్నాహాలను చేసుకోసాగాడు శూరసేనుడు. అంతలో ఓ రోజున అతనికి చక్రవర్తి నుండి పిలుపు రానే వచ్చింది. ఉత్సాహంగా వెళ్ళాడు అతను.
విష్ణువర్ధనుడు, శూరసేనుడితో రామాపురం గురించి గాని, అనంతవర్మ గురించి కాని ప్రస్తావించలేదు. “శూరసేనా! ఉమ్మడి కుటుంబపు వ్యవస్థను గూర్చి అధ్యయనం చేస్తున్నాం మేము. ఆ సందర్భంలో నీ సహకారం కోరి పిలిపించాము” అన్నాడు.
సామాజిక దృక్పథం కలిగిన చక్రవర్తి తరచు అటువంటి విషయాలపై అధ్యయనం చేస్తూండడం కద్దు. అందుకే, “అవశ్యం సెలవీయండి, ప్రభూ!” అన్నాడు శూరసేనుడు.
”ఆ అధ్యయనంలో ఓ భాగమైన ‘కుటుంబంలో సామరస్యతను’ గూర్చి పరిశీలించేందుకని వివిధ తరగతులకు చెందిన కొన్ని కుటుంబాలను నమూనాలుగా తీసుకున్నాం మేము. వాటిలో నీదొకటి,” చెప్పాడు విష్ణువర్ధనుడు. “నువ్విప్పుడు చేయవలసిందల్లా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించి…గత మూడు మాసాలలోనూ నీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి నువ్వు తీసుకున్న నిర్ణయాలూ, వాటిని నీ కుటుంబ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భాలూ వగైరా వివరాలన్నీ రాసుకుని వచ్చి మాకు చూపించాలి నువ్వు”.
’ఓస్, అదెంత భాగ్యం!’ అనుకున్న శూరసేనుడు చక్రవర్తి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
మర్నాడు తల వ్రేలాడేసుకుని వచ్చిన సేనానిని చూసి విస్తుపోయాడు విష్ణువర్ధనుడు.
“మహాప్రభూ! తరచి చూస్తే గత మూడు మాసాలలోనూ నేను చేసిన ప్రతిపాదనలతో, నిర్ణయాలతో నా భార్య కాని, నా ఇద్దరు కుమారులు గాని ఏకగ్రీవంగా అంగీకరించిన సందర్భాలు ఒకటీ అరా తప్పితే ఏవీ లేవు,” అని విన్నవించుకున్నాడు శూరసేనుడు.
విష్ణువర్ధనుడు విస్తుపోతూ, “ఆశ్చర్యంగా ఉన్నదే! మరి కుటుంబ పెద్దగా నువ్వేం చేసావ్? వారిని దండించి నీ దారికి త్రిప్పుకున్నావా లేదా?” అనడిగాడు.
అందుకు శూరసేనుడు నవ్వి, “ఓ పక్క నేను తాళి కట్టిన భార్య, మరో పక్క పిల్లలు పసివాళ్ళూ, అనుభవశూన్యులూను. నా నిర్ణయాల లోని లోతుపాతులు వారికి ఎలా అర్థమౌతాయి? అందుకే వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. అలా కొన్ని సందర్భాలలో వారి ఆలోచనా సరళిని మార్చగలిగాను. కొన్ని సందర్భాలలో వారి ఆలోచనలకు అనుగుణంగా నా  నిర్ణయాలను మార్చుకున్నాను,” అని జవాబిచ్చాడు.
అప్పుడు విష్ణువర్ధనుడు మందహాసం చేసి, “రామపురాధీశుడు అనంతవర్మ విషయంలో నువ్వు చేసిన ఫిర్యాదుకు సమాధానం కూడా ఇదే, శూరసేనా! అనంతవర్మ సామంతుడైనంతలో మనకు బానిస అని అర్థం కాదు. మన సామ్రాజ్యమనే ఉమ్మడి కుటుంబంలో అతనూ ఒకడు. చక్రవర్తి చేసే శాసనాలను విశ్లేషించి విమర్శించే హక్కు సామంతరాజులకు ఉన్నాయి. వారు మనకు చెల్లిస్తూన్న కప్పమూ, మన సామ్రాజ్యంలో వారూ ఒక భాగమే నన్న సత్యమూ వారికి ఆ హక్కును ప్రసాదించాయి. అందుకు వారిని తప్పు పట్టడం సమంజసం కాదు” అన్నాడు శాంతంగా.
“ప్రభూ!” అన్నాడు శూరసేనుడు తెల్లబోయి.
“శూరసేనా! ఓ క్షణం అధికార మదం అనే పొరని తొలగించి శాంతంగా ఆలోచిస్తే నీకే బోధపడుతుంది. చిన్నదైన నీ స్వంత కుటుంబం లోనే ఏకాభిప్రాయం కుదరడం అరుదు. భార్యకూ భర్తకూ, కన్నవారికీ సంతానానికీ నడుమనే ఆలోచనలలో ఓ పొందికంటూ కుదరడంలేదు. అటువంటప్పుడు సామ్రాజ్య పాలనలో రాజకీయ పరమైన శాసనాల విషయంలో ఏలికల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంలో వింత ఏముంది?… మన శాసనాల పట్ల అనుమానాలు రేగాయాంటే   ఆ లోపం మనదే ఔతుంది. ఆ సందేహాలను తీర్చవలసిన బాధ్యత మనపైన ఉంది”.
ఓ క్షణం ఆగి సాభిప్రాయంగా సేనాని వంక చూసాడు విష్ణువర్ధనుడు. “మనకు అధికారం ఉందికదా అని…విమర్శించినవారినల్లా శిక్షించాలనుకోవడం అవివేకమే ఔతుంది. అసలు విమర్శలనేవే లేకుంటే మన చర్యల లోని లోటుపాట్లు మనకు ఎలా తెలిసి వస్తాయి? సద్విమర్శలు ఎప్పుడూ ఆరోగ్యకరమే”.
చక్రవర్తి నిశిత దృష్టికి, విశాల దృక్పథానికీ జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయాడు శూరసేనుడు. “నా అజ్ఞానానికి మన్నించండి, మహాప్రభూ! స్వయంగా రామపురికి వెళ్ళి అనంతవర్మను కలుసుకుంటాను. అతని అనుమానాలనూ, శంకలనూ నివృత్తి చేసి పని సాధించుకుని వస్తాను,” అని చక్రవర్తి వద్ద అనుమతి తీసుకుని నిష్క్రమించాడు.

RTS Perm Link


Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind