చందమామ కథ : ఎద్దు బాధ

March 17th, 2012

జటాయువు

చందమామ మొదటి నుంచి మధ్యయుగాల కథలకు, రాజు రాణి, తోటరాముడి కథలకు, జానపద, పౌరాణిక, జాతక బేతాళ కథలకు పేరుమోసిందని మనందరికీ తెలుసు. కథ అనే భావనకు సార్వత్రిక నమూనాగా నిలిచిపోయిన గొప్ప కథలివి. అందుకే 1950, 60, 70ల దశకం నాటి కథలంటే చందమామ పాఠకులకు, వీరాభిమానులకు అంత పిచ్చి.

కాని మా చందమామ లైబ్రేరియన్ బాలాగారికి మాత్రం 80ల నాటి చందమామ కథలంటే ప్రాణం. చందమామ కథలు నిజంగా పరిపక్వత అందుకున్నది 80లలోనే అని తన నిశ్చితాభిప్రాయం. తెలుగు చందమామ సర్క్యులేషన్ హిందీ చందమామను అధిగమించి తొలిసారిగా లక్ష కాపీల సంఖ్యను దాటి రికార్డు సాధించింది కూడా 80ల లోనే అని తను ఉదాహరణను కూడా చూపిస్తుంటారు. ఆయన అభిప్రాయంతో మనం ఏకీభవించవచ్చు. ఏకీ భవించకపోవచ్చు.

కాని చందమామలో మధ్యయుగాల కథలే కాకుండా ఆధునిక వాతావరణం ఉన్న కథలు కూడా అప్పుడప్పుడూ తమవైన మెరుపులు మెరిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చందమామకు రచనలు పంపుతున్న పాత, కొత్త రచయితలు అద్భుతమైన తర్కంతో, చక్కటి ముగింపుతో కూడిన కథలను గత మూడేళ్లుగా చందమామకు అందిస్తున్నారు. పాత కొత్త కథల మేళవింపుతో ప్రతి నెలా అచ్చవుతున్న ఒక పేజీ కథలు చందమామకే హైలెట్‌గా మారుతున్నాయి. పాఠకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి కూడా.

మనుషుల బాధలు, సమాజం బాధలు గురించే పట్టించుకుంటున్న కాలంలో ఎద్దు బాధను కూడా పట్టించుకుని కథగా మలిస్తే ఎలా ఉంటుంది? అది కూడా ఎద్దు కోణం నుంచి దాని బాధను కథగా మల్చడం. ఈ మార్చి నెలలో చందమామలో వచ్చిన కొత్త కథ ఎద్దుబాధ ఈ కోణంలోంచే పుట్టింది. చెప్పిన పనల్లా గుడ్డిగా చేసుకునిపోయే ఎద్దు ఒక్కోసారి రైతుమీదికి తిరగబడుతుంది. చేస్తున్న పనిని ఆపివేసి కదలకుండా మొరాయిస్తుంది. దాదాపు ఇది పల్లెల్లోని రైతులందరికీ అనుభవపూర్వకమైన విషయమే.

మా జిల్లాలో ఎద్దులు, దున్నలు ఇలా చేస్తున్న పని ఉన్నట్లుండి ఆపివేసి మొరాయించడాన్ని అంకె వేసింది అని అంటుంటారు. ఎద్దు అంకె వేసింది అంటే ఎద్దు మెడపై కట్టిన కాడిని దిగజార్చుకుని కాలు ముందుకు కదపకుండా మడిలో, చేనులో అలాగే నిలబడిపోవటం. పనిచేస్తున్నప్పుడు ఏదైనాభరించలేని కష్టం తగిలితే దాన్ని మాటల్లో రైతుకు చెప్పలేని ఎద్దులు తమకు తోచిన విధంగా పరిష్కారం ఎంచుకుంటాయి. అంకె వేసుకోవడం ఇలాంటి పరిష్కారాలలో ఒకటి.

పొలంలో దున్నుతున్నప్పుడు విపరీతంగా అలిసిపోయినా, ఎద్దు కాలి గిట్టలకు ముళ్లు గుచ్చుకుని కాలు కదపటం కష్టమైపోయినా, విపరీతంగా దప్పిక వేసినా, వేగంగా అడుగులేయలేదని రైతు తనను మరీ బాదేస్తున్నాడనిపించినా ఇలాంటి ఎన్నో కారణాలతో ఎద్దులు పొలాల్లో అంకెలేసుకుంటుంటాయి. పని చేయలేదని మాటిమాటికి అంకె వేసుకుంటోందని రైతు దాని బాధను గుర్తించకుండా ఎద్దును మరింతగా బాదిపడేస్తే అది మరింతగా మొండికేస్తుంది. రైతుపై పొలంలోనూ బయట కూడా తిరగబడుతుంది.

చాలా కాలంగా వివిధ పత్రికలు, వెబ్‌సైట్లకు కథలు, రచనలు చేస్తున్నప్పటికీ చందమామకు ఇటీవలే పరిచయమైన శాఖమూరి శ్రీనివాస్ గారు (మరో కలం పేరు సుధారాణి) ఎద్దుబాధ అనే ఈ కథను సాపుచేసి “ఇంకా దీనికి పేరు పెట్టలేదని, ఏ పేరు పెడితే బాగుంటుంద”ని మూడు నెలల క్రితం ఫోన్‌ సంభాషణలో అడిగారు. ‘ఎద్దు కష్టం మీద ఇంత మంచి కథ రాశారు కదా ఎద్దుబాధ అని పేరు పెడితే సరిపోతుంది కదా’ అని నేను సరదాగా చెప్పాను.

ఆశ్చర్యంగా ఆయన ఆ పేరే ఖరారు చేసి పంపడం. కథల ఎంపికకు కూర్చున్నప్పుడు మా యాజమాన్యం వారికి కూడా కథ బాగా నచ్చేసి కథ తొలి యత్నంలోనే ఎంపికైపోయింది. ఎద్దు నిజంగా అలా మొండికేస్తుందా అని మావాళ్లు -వ్యవసాయం అంటే ఏమిటో తెలీదు- నిర్ధారించుకున్న తర్వాతే ఎద్దుబాధకు ఆమోదముద్ర వేశారనుకోండి.

పెద్ద కమతాలలో పనిచేస్తున్నప్పుడు పని ఎప్పుడు అయిపోతుంది అనే ఆదుర్దా, ఆందోళనకు ఎద్దులు గురయ్యాయంటే కొన్ని సందర్భాల్లో అవి మొండికేయడం, అంకె వేసుకోవడం వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఈ కథను విడిగా చదివినప్పుడు కాకుండా మా వాళ్లకు చదివి వినిపిస్తున్నప్పుడు నా చిన్నప్పుడు సేద్యంతో, ఎద్దులతో నా అనుబంధం కళ్లముందు రీల్ లాగా తిరిగింది.

‘ఎద్దును ముద్దు చేయవద్దురా అది చెప్పినమాట వినదు’ అంటూ తాత పదే పదే చెబుతున్నా జంతువులంటే అపారమైన అభిమానంతో విశ్రాంతి సమయంలో వాటి దగ్గరకు పోయి నూపురం, మెడను దువ్వడం, స్పర్శతో దానికి పరవశం కలిగింపజేయడం చేసేసరికి కొన్నాళ్లకు అవి నిజంగానే పొలంలో నా అరుపులు, అదిలింపులను పట్టించుకోకుండా వాటిపాటికవి నడుస్తూ పోవడం జరిగేది.

35 సంవత్సరాల క్రితం నాటి నా బాల్యాన్ని, పల్లె జీవితాన్ని మళ్లీ ఒకసారి నాకు గుర్తు చేసిన కథ ఎద్దుబాధ. ఆ తర్వాత ‘మీ కథ ఎద్దుబాధ సాక్షిగా ఎంపికయిపోయిందండీ’ అని శ్రీనివాస్ గారితో చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నాము. “చందమామను ఎద్దుబాధతో కొట్టారండీ… ఎంపికకాక తప్పుతుందా వేసుకోక తప్పుతుందా..’ అని నేనంటే “కథకు పేరు పెట్టింది మీరే కదా..” అని ఆయన నవ్వడం…

ఎద్దుకు కూడా బాధ ఉంటుందని అది పైకి చెప్పుకోలేకపోయినా ఏదో ఒకరకంగా దాన్ని ప్రదర్శిస్తుందని చెప్పిన అందమైన కథ ఎద్దుబాధ. ఈ మార్చి నెల చందమామలో ఈ మంచి కథ వచ్చింది. చదవకపోతే తీసుకుని చదవండి. పత్రిక అందుబాటులో లేకపోతే ఇక్కడ ఈ కథను చదువుకోండి.

ఎద్దుబాధ
శ్రీరంగాపురంలో భూస్వామి రామేశం కొత్తగా ఓ ఎద్దుల జతను కొన్నాడు. వాటిలో ఒకటి చురుగ్గానే పనిచేస్తున్నా మరొకటి మాత్రం పదే పదే మొరాయించసాగింది. బలవంతపెడితే కదలకుండా కూర్చుంటుంది. పనిచేయని ఆ ఒక్క ఎద్దును అమ్మడం అసాధ్యమని భావించి, రెండింటినీ విక్రయించాలనుకున్నాడు రామేశం. ఒకనాడు రామేశం మిత్రుడు స్వరవర్మ పొరుగూరు నుంచి వచ్చాడు. అతను సామాన్య రైతు. “వర్మా.. ఇటీవలే కొన్న నా ఎద్దుల జతను సగం ధరకే అమ్మాలని నిర్ణయించుకున్నాను. వాటిని చూసి నచ్చితే కొనుగోలు చేసుకువెళ్లు. పైకం కూడా నీకు వీలున్నప్పుడివ్వు,” అన్నాడు రామేశం.

పక్కనే పాకలో ఉన్న ఎడ్లను పరీక్షించిన స్వరవర్మ వాటిని కొని తన వెంట తీసుకెళ్లాడు. అంత సులువుగా అవి అమ్ముడవడం రామేశానికి ఆనందం కలిగించింది. అయితే ఓ నెల గడిచాక ఎద్దులతో స్వరవర్మ ఎలా నెగ్గుకొస్తున్నాడో తెలుసుకోవాలనిపించింది. వెంటనే స్నేహితున గ్రామం బయలు దేరాడు. దారిలోనే ఉన్న పొలం వద్ద స్వరవర్మ కనిపించాడు.

అక్కడ తను అమ్మిన ఎడ్లు ఎంతో శాంతంగా పొలాన్ని దున్నడం గమనించాడు రామేశం. ఇబ్బంది పెట్టిన ఎద్దు కూడా ఎంతో హుషారుగా నాగలి లాగుతోంది. ఎంతో ఆశ్చర్యం కలిగింది.

మిత్రుడి అనుమానం గమనించిన స్వరవర్మ “ఎద్దుల్ని కొనడానికి ముందే వాటి పరిస్థితి నీ పనివాళ్ల మాటల ద్వారా తెలిసింది. వాటిని పరీక్షించి, ఏ లోపం లేదని నిర్ధారించుకున్నాకే కొన్నాను. ఎద్దు మొండికేయడానికి కారణం.. నీకున్న విశాలమైన, గట్లు లేని పొలాన్ని చూసి గొడ్డు చాకిరీ చేయాలని అది భయపడటమే! మోర ఎత్తితే గట్లు కనిపించే నా చిన్న కమతాన్ని ప్రయాస లేకుండా దున్నుతోంది. నువ్వు దాని బాధను అర్థం చేసుకోలేక పోయావు,” అన్నాడు. సందేహ నివృత్తి కలగడంతో రామేశం సంతోషించి, మిత్రుడి అంచనా సామర్థ్యాన్ని ఎంతగానో పొగిడాడు.
–ఎస్. సుధారాణి

RTS Perm Link


3 Responses to “చందమామ కథ : ఎద్దు బాధ”

 1. Anonymous on March 23, 2012 12:14 PM

  రాజు గారికి నమస్కారం,
  ఎద్దుబాధ కథ నిజంగా వస్తువైవిధ్య పరంగా నూత్న అంశాన్ని స్పృశించిన మాట వాస్తవం. ఇలాంటి కథలతో బాల సాహిత్యం పరిపుష్టి కావలసిన ఆవశ్యకత చాలా వుంది. అయితే కథను ఇంకా కొంత వివరణ చేర్చి ఎద్దు మోరఎత్తడం (అంకె వేయడం) కళ్ళకు కట్టినట్లుగా వర్ణిస్తూ రెండు మూడు పేజీలకు పెంచి రాస్తే మరింత రక్తి కట్టి, రాణించేదని నా వ్యక్తిగత అభిప్రాయం.
  ఎద్దుబాధ కథను చందమామలో చదివాను. అందులో అచ్చుతప్పు మనస్సు కలుక్కు మనిపించింది. మీరు శాంతంగా ఒకసారి మళ్ళీ చదవండి. ఆ తప్పు మీకు తెలుస్తుంది. మీరు ఈ బ్లాగులో రాసిన కథలో ఆ తప్పు సవరించ బడింది. చందమామలో ఇలాంటి అచ్చు తప్పులకు తావు లేకుండా చేస్తారని ఆశిస్తున్నాను.

 2. బిపిన్ on April 7, 2012 5:42 AM

  “మన ముందు ఉన్న పెద్ద పనులను చూస భయపడుతం కన్నా వాటిని చిన్నవిగా విభజించి చెయ్యండి” అని చెప్పకనే చెప్పారు రాజు గారు!! వారికి నా ధన్యవాదాలు…

 3. chandamama on April 7, 2012 6:48 AM

  బిపిన్ గారూ,
  అద్భుతం. ఎద్దు బాధ కథను మీదైన కొత్తకోణంలో అర్థం చేసుకున్నందుకు, తక్కువ మాటల్లో ఇంత మంచి వ్యాఖ్య పంచుకున్నందుకు ధన్యవాదాలు. పెద్ద పనులను చూసి భయపడుతుండటం కన్నా వాటిని చిన్నవిగా విభజించి చేయడం.. ఎంత మంచి అవగాహన..
  మరోసారి అభినందనలు..

  దాసరి వెంకట రమణ గారూ,
  ఎద్దుబాధ కథను పొడిగించి రాయవచ్చన్న మీ సూచన చాలా బాగుంది. కాని ఈ కథను చూడగానే వెనుకా ముందూ చూడకుండా ఎంపిక చేయడంతో మరో ఆలోచనకు తావు లేకుండా పోయింది.

  చందమామలో అచ్చుతప్పు.. ఎంత ప్రయత్నించినా ఈ తప్పునుంచి బయటపడటం కష్టమైపోతోంది. నాలుగైదు అంచెలుగా ప్రూఫులు దిద్దుతున్నప్పటికీ ఎక్కడో ఏదో పొరపాటు దొర్లుతూనే ఉంది. చివరి నిమిషంలో క్షుణ్ణంగా పరిశీలించడంలో ఎక్కడో తప్పు దొర్లుతోంది. అందుకు క్షమాపణలు..
  కథలో మంచి విషయాన్ని ప్రశంసించినందుకు, జరగకూడని లోపాన్ని ఎత్తి చూపినందుకు కృతజ్ఞతలు.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind