చందమామ : ఒక ప్రశంసా.. ఒక విషాదమూ…

March 10th, 2012

రెండు అనుకోని కోణాలనుంచి చందమామ గురించిన ప్రశంసా వ్యాఖ్యలను ఈరోజు చూడటం తటస్థించింది. మా శోభ -కారుణ్య బ్లాగర్- బి.ఎడ్ పూర్తి చేసి డిఎస్‌సి‌ కోసం సిద్ధమవుతూ భాషా బోధనా పద్ధతులపై తెలుగు అకాడెమీ ప్రచురించిన ‘తెలుగు బోధనా పద్ధతులు’ పుస్తకాన్ని నిద్ర లేచినప్పటినుంచి రుబ్బుతోంది. ఈ రోజు మధ్యాహ్నం పాఠ్యపుస్తకం చదువుతూ ఉండగా, దాంట్లో చందమామ గురించిన ప్రస్తావన కనబడేసరికి ‘డీఎస్సీ పుస్తకంలో చందమామ గురించి ఉంది’ అని కేక పెట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన అధికారిక పుస్తకంలో చందమామ పట్ల ప్రశంసా వాక్యాలను చూడటంతో గొప్ప అనుభూతి కలిగింది.

అంశ ప్రదర్శన
అంశాన్ని ఎంత జాగ్రత్తగా ఎంపిక చేసి సక్రమంగా విభజించినా అంశప్రదర్శన (presentation of content) సరిగా లేకుంటే విద్యార్థులకు చిరాకు విసుగు కలుగుతుంది. అభ్యసించవలసిన అంశం సరిగా ఉండదు. ఇక్కడ మనం ‘చందమామ’ పిల్లల మాసపత్రికను ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రదర్శన బాగుండటం వల్ల ‘చందమామ’ అనే పుస్తకానికి అంత జనాదరణ కలిగింది. మన పాఠ్య పుస్తకాలకు ‘చందమామ’ ఒరవడి కావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రచురించిన ఒకటి,  రెండు తరగతుల తెలుగు వాచకాలు, కథావాచకాలకు సంబంధించిన పుస్తకాలను పరిశీలిస్తే కొంత ప్రగతిని సాధించినట్లు తెలుస్తూ ఉంది.

చిత్రాలు – పటాలు – బొమ్మలు – పట్టికలు
చిత్రాలు, పటాలు, బొమ్మలకు ‘చందమామ’ను ఒరవడిగా తీసుకోవచ్చు. చిత్రాలు, బొమ్మలు నలుపు తెలుపులో ఉండటం కంటే పంచరంగులలో ఉంటే, అవి విద్యార్థులను ఆకర్షిస్తాయి. అంశం ఉన్న చోటనే చిత్రం/ పటాలుండటం మంచిది. అంశం పక్కనే చిత్రం ఉంటే అంశాన్ని చదివేటప్పుడు విద్యార్థులు పక్కనున్న చిత్రాన్ని చూసి అంశాన్ని అర్థం చేసుకుంటారు. అంశం ఒకచోట చిత్రం మరో చోట ఉంటే విద్యార్థులకు అర్థం కాక ఆసక్తి నశిస్తుంది.”

నాణ్యమైన కాగితం, పంచరంగులు, అచ్చుతప్పులు లేని ముద్రణ, చక్కటి ముఖచిత్రం వంటివి పిల్లల్లో ఆసక్తిని కల్గిస్తాయని కూడా ‘తెలుగు బోధనా పద్ధతులు’ పుస్తకం తర్వాతి పుటలలో వివరించింది.

పిల్లలు, వారితో పాటు పెద్దలు కూడా మెచ్చే సకల అంశాలూ చందమామలో చేరి ఉండటమే దశాబ్దాలుగా దాని వైభవానికి, ప్రాచుర్యానికి కారణం. కాని ప్రభుత్వ పాఠ్య పుస్తకం విశేషంగా ప్రశంసించిన చందమామ పత్రిక ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో కి తీసుకురావడానికి వీలులేక పోవడమే అన్నిటికంటే మించిన విషాదం.

ఎందుకంటే సెక్యులర్ ప్రభుత్వం, దాని పాలనాధికారులకు చందమామ పత్రిక ఒక నిషిద్ధ వస్తువు. ఎందుకంటే చందమామ కంటెంట్ రిలిజియస్ కంటెంట్ అని ముందునుంచి ముద్రపడింది. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రాచీన పౌరాణిక గాధలను చందమామలో ప్రచురిస్తూ వస్తున్నప్పటికీ, సకల దేశాల జానపద కథలను తనవిగా చందమామ స్వీకరించినప్పటికీ, ప్రధానంగా హిందూ పురాణాలు, ఇతిహాసాల నుంచి చాలా ఎక్కువ కథలను, సీరియల్స్‌ని చందమామ ప్రచురిస్తూ వచ్చిన కారణంగా చందమామ కంటెంట్ మతపరమైన కంటెంటుగా ప్రభుత్వ దృష్టిలో ముద్రపడిపోయింది. అందుకే స్కూల్ లైబ్రరీలలోకి, కాలేజీ లైబ్రరీలలోకి, పాఠ్య పుస్తకాల ప్రణాళికలోకి చందమామ అడుగుపెట్టలేదు.

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ చందమామ పత్రిక లభించేలా ప్రభుత్వాధికారులను, ప్రభుత్వాల నేతలను ప్రభావితం చేస్తూ చందమామ మార్కెటింగ్ విభాగం ప్రయత్నించవచ్చు కదా అని మా యాజమాన్యాన్ని ఇటీవలే అడిగితే వారు చెప్పిన సమాధానంతో నిజంగా దిమ్మదిరిగిపోయింది. పాఠ్య ప్రణాళిక, బోధనాంశాలు, పద్ధతులు కూడా సెక్యులర్ -లౌకిక- స్వభావంతో ఉండాలనే ప్రభుత్వ నిబంధనల కారణంగా రాష్ట్రంలోనూ, దేశంలోనూ కొన్ని వేల పాఠశాల లైబ్రరీలలో చందమామకు స్థానం లేకుండా పోయింది. సర్వశిక్షా అభియాన్ వంటి పధకాలలో కూడా చందమామతో సహా ఇతర బాలసాహిత్య పథకాలు భాగం కాలేకపోవడానికి ఈ ప్రభుత్వ లౌకిక ధోరణే కారణం.

కానీ ఇదంతా విన్నాక నాకో చిన్న సందేహం. మన దేశంలో ప్రభుత్వం కాని, ప్రభుత్వ  కార్యక్రమాలు కాని ఎన్నడూ మతానికి, ఆధ్యాత్మికతకు దూరంగా ఉన్న చరిత్ర లేదు. సెక్యులర్ భావనకు నిజమైన అర్థంలో మతాతీతంగా ఉండవలసిన ప్రభుత్వం, వ్యవస్థ అన్నిరకాల మతాచారాలకు సమానంగా తలుపులు తెరిచేసింది. హిందూసంస్థలు, ముస్లిం సంస్థలు, క్రైస్తవ సంస్థలు ప్రారంభించిన పాఠశాలలు ఏ మేరకు సెక్యులర్‌గా ఉన్నాయో జగమెరిగిన సత్యమే.. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు ప్రారంభించే సందర్భంగా జరిపే భూమి పూజలు ఎంత సెక్యులర్‌గా ఉంటున్నాయో అందరికీ తెలుసు. సాక్షాత్తూ దేశ అత్యున్నత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సైతం, ఉపగ్రహ ప్రయోగాల సందర్భంగా చెంగాళమ్మగుడిలో, తిరుమల వెంకన్న గుడిలో ప్రదర్శించే రాకెట్ల, ఉపగ్రహ నమూనాల ప్రదర్శనలో ఎంత సెక్యులర్ స్వభావం ఉంటోందో అందరికీ తెలుసు. చివరకు మంత్రులు, ఉన్నతాధికారులు సైతం జాతర్లలో, బోనాలలో, గణేష్ ఉత్సవాలలో ఎంతగా పోటీలు పడి పాల్గొంటుంటారో అందరికీ తెలుసు.

ఇవేవీ సరిగా పాటించనప్పడు, చందమామ లేదా తదితర బాల సాహిత్య పత్రికల రిలిజియస్ కంటెంట్ మాత్రమే ఎందుకు అభ్యంతరకమైన, నిషిద్ధ వస్తువుగా ఉండాలో ఏమాత్రం అర్థం కావడంలేదు. ఈ సెక్యులియర్, రిలిజయస్ గొడవల సంగతి తెలియకేనా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి జీవన సహచరి సుధామూర్తి గారు కర్నాటకలోని అయిదు వేల గ్రామీణ పాఠశాలలకు కన్నడ చందమామలను రెగ్యులర్‌గా అందించే బృహత్తర ప్రాజెక్టుకు పచ్చజండా ఊపారు? సెక్యులరిజం దాని నిజమైన అర్థంలో పాటించబడితే చాలా మంచివిషయమే కాని ఈ పాక్షికత ఏమిటి? ఈ పక్ష’వాతం’ ఏమిటి?

మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని భాషలలోనూ చందమామను చదువుతున్న వారిలో ముస్లింలు కూడా పెద్ద ఎత్తున ఉంటున్నట్లు చందమామ కార్యాలయానికి వచ్చే ఉత్తరాలు తెలుపుతూనే ఉన్నాయి. గత 60 సంవత్సరాలుగా చందమామను చదువుతూ, తన మనవళ్లు, మనవరాళ్లకు కూడా చందమామ కథలు వినిపిస్తున్న మాజీ వెటరినరీ శాఖోద్యోగి అబ్దుల్ హమీద్ గారి వంటి వృద్ధతరం పాఠకులు ఆంధ్రలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంటున్నారని కొత్తగా బయటపడుతోంది. రిలిజయస్ కంటెంటుకు నిజంగా అభ్యంతరం తెలుపవలసివారు. అడ్డుకోవలసిన వారు సైతం చందమామను తమదిగా స్వీకరిస్తున్నప్పుడు, చందమామ ఉర్దూలో ఎందుకు ప్రచురింపబడలేదు అంటూ అమెరికానుంచి కూడా ఉర్దూ మహిళలు ప్రశ్నిస్తున్న కాలంలో, ఏలిన వారికి మాత్రమే చందమామ రిలిజియస్‌గా కనిపిస్తోంది.

దేశంలోని సవాలక్ష వైపరీత్యాలలో ఇదొక సరికొత్త  వైపరీత్యం అని సమాధానపడాలి కాబోలు.

ఈలోగా, సిద్ధాంతాల పట్ల విశ్వసానికి, వాటి ఆచరణకు మధ్య గీతను చెరిపివేసిన అసాధారణ మేధావులు, బుద్ధి జీవులు సైతం బాలసాహిత్యం కాల్పనికంగానే ఉంటుందని, మానవజీవితాన్ని మానవీయంగా పునర్నిర్మించే ప్రయత్నంలో అవాస్తవిక కాల్పనిక సాహిత్యానికి తనదయిన స్థానం ఎప్పుడూ ఉంటుందంటూ సార్వకాలిక ప్రకటనలు చేస్తున్నారు.

ఈ కథేమిటో మరోసారి చూద్దాం.

RTS Perm Link