ఆకలి తప్ప మాకేమీ తెలియదు….

February 24th, 2012

శ్రీ దాసరి వెంకటరమణ గారికి,
చందమామకు పంపిన మీ కథ ‘విత్తనం గింజ’పై నా అభిప్రాయాన్ని రాత పూర్వకంగా పంపమని చెప్పారు. చాలా ఆలస్యం చేసినందుకు క్షంతవ్యుడిని. శంకర్ గారు ఈ కథకు బొమ్మలు వేస్తున్నారు కనుక ఆయన అభిప్రాయాన్ని కూడా మీకు చెబితే బాగుంటుందనే ఇన్నాళ్లుగా మీకు సమాధానం పంపలేదు.

ఇక కథ విషయానికి వస్తే… పొగడ్డం తప్ప ఇక ఏమీ చేయలేనన్నదే వాస్తవం.

ఈ కథను ప్రచురణకోసం చదువుతున్నప్పుడే మాకు నోటి మాట రాలేదంటే నమ్మండి. పిల్లల్ని విత్తనం గింజలుగా పోల్చి రెంటినీ సమానంగా జాగ్రత్తగా పరిరక్షించుకోవలసిన అవసరం గురించి ఈ కథలో హృద్యంగా చెప్పారు. చందమామ కథలకు సంబంధించి ఏలాంటి వంకలు లేకుండా, సందేహాలు లేవనెత్తకుండా ఆమోదముద్ర పడిన అతి కొద్ది కథల్లో ‘విత్తనం గింజ’ ఒకటి అని మా బలమైన నమ్మకం.కథ గమనం, కథలో హేతువు, బిగి సడలని శైలి, చక్కటి ముగింపు వంటి చందమామకు ప్రాణాధారమైన అంశాలలో సవాలక్ష వడపోతలను దాటుకుని ఏక ధాటిన మీ కథకు పైవారి ఆమోదముద్ర లభించేసింది.

కథను నేను చదివి వినిపిస్తున్నప్పుడే, ముగింపు సమీపించే కొద్దీ నాకే గగుర్పాటు కలిగింది. చందమామకు మీరు పంపిన అత్యుత్తమ కథల్లో ఇదొకటి అని చెప్పడానికి సాహసిస్తున్నాను. ముగింపులో ప్రసంగ ధోరణి కాస్త ఎక్కువ అనిపించినప్పటికీ మనస్సుపై కథ కలిగించిన మౌలిక ప్రభావాన్ని అది ఏమాత్రం దెబ్బతీయలేదు. మీ కథ అక్కడే నిలిచింది.. గెలిచింది కూడా…

“… పిల్లలు పుట్టగానే వాళ్లు మనకే సొంతమనే భ్రమలో ఉంటాం. దాదాపు వాళ్లను మన ఆస్థిలో భాగంగా భావిస్తాం. వాస్తవానికి పిల్లలు జాతీయ ఆస్తులు. ఒక ఎకరం పొలమున్న నీవే విత్తనం గింజల్ని ఇంట్లో ఇంత జాగ్రత్త చేస్తున్నావే… మరి జాతీయ ఆస్తులైన ఈ పిల్లలు కూడా విత్తనం గింజల్లాంటివారే వారిని మరెంత జాగ్రత్తగా పోషించాలి? నీవు పొలంలో విత్తనం వేస్తే మొలిచే మొక్క ఏం కాయ కాస్తుందో నీకు ముందే తెలుస్తుంది. కానీ ఈ పిల్లలనే మొక్కలు పెరిగి పెద్దవారై జాతికి ఎటువంటి ఫలాలు అందిస్తారో మనం కనీసం ఊహించను కూడా ఊహించలేం. నీ కుమారుడికి కిరణ్ అని ఎందుకు పేరు పేట్టావో కాని వాడు రేపు నీ కుటుంబానికే కాదు మానవజాతికే వెలుగవుతాడు….”

రమణ గారూ! ఈ కథను మీరు చందమామకు పంపించినందుకు, ముందుగా మేమే కథను చదివినందుకు మా జన్మ సార్థకమైందనుకుంటున్నాము. బాలకార్మిక వ్యవస్థను దాని నిజమైన అర్థంలో ఎందుకు నిర్మూలించాలో చాటి చెప్పిన కథ ఇది. పిల్లలు చిన్నవయసులో కూడా తమ తమ వృత్తులకు సంబంధించిన పనులు చేయవలిసిందే, నేర్చుకోవలిసిందే.. కాని వారి భావిజీవిత పయనానికి ఈ పనులు అడ్డంకులు కారాదు.

మేం చిన్నప్పుడు పల్లె బడుల్లో చదువుకునేటప్పుడు చాలా మంది పిల్లలు బడికి రాలేక, చదువుకోలేక, వ్యవసాయ సంబంధ వృత్తిపనులు చేసుకుంటూ చదువుకు దూరమైపోయారు. ఊహతెలియని ఆ వయసులో మాలో కొందరు ఎందుకు చదువుకు దూరమవుతున్నారో అర్థమయ్యేది కాదు కాని, లోకంలో చాలామందికి లేని అవకాశాలు మాకు లభించాయని, ఆర్థికంగా కాస్త ముందు పీఠిన ఉండటం అనే ఒకే ఒక్క అంశం మమ్మల్ని చదువుల బాట పట్టించిందని తర్వాత మాకు అర్థమయింది. మీ కథలో, పిల్లవాడిని చదివించలేక పల్లెలో ఆసామీ కింద పనికి పెట్టిన పేద తండ్రితో టీచర్ మాధవయ్య నుడివిన మంత్రసదృశ వాక్యాలు చూడండి..

“ఈ పిల్లలనే మొక్కలు పెరిగి పెద్దవారై జాతికి ఎటువంటి ఫలాలు అందిస్తారో మనం కనీసం ఊహించను కూడా ఊహించలేం. నీ కుమారుడికి కిరణ్ అని ఎందుకు పేరు పేట్టావో కాని వాడు రేపు నీ కుటుంబానికే కాదు మానవజాతికే వెలుగవుతాడు….”

పేదవాళ్లు చదువుకుంటే చిన్న గెనెమూ పెద్ద గెనెము తేడా లేకుండా పోతుందని -ఒక పొలానికి మరొక పొలానికి మధ్యన ఉండే పొడవాటి లేదా పొడవు తక్కువ అడ్డుకట్టలు. మా ప్రాంతంలో దీన్ని గెనెం, గెనాలు అని అంటాము-, అందరూ చదువుకు పోతే ఊర్లలో పనిపాటలెవరు చేస్తారనే పెద్ద కులాల వికృత ప్రకటనలు,వాటి రాజకీయ వ్యక్తీకరణలు కూడా ఇటీవలిదాకా వింటూ వచ్చాము. కొంతమంది సుఖాల కోసం చాలామంది ఈ దేశంలో బతుకులు కోల్పోతూ రావడమే ఈ దేశంలో ఇప్పటికీ జరుగుతున్న విషాద పరిణామం.

దాదాపు 20 ఏళ్ల క్రితం అనుకుంటాను జంటిల్‌మన్ అనే సినిమాలో, ఎండమావిలా మెరిపిస్తున్న డాక్టర్ చదువు చదవాలనే కోరికకు అడుగడుకునా తూట్లు పడుతుండటంతో, తన కోసం తల్లి జీవితాన్ని కూడా బలి పెడుతున్న ఘటనను చూడకముందే తాను రోడ్డుమీద బస్సుకింద తలపెట్టి చనిపోయిన ఆ అబ్బాయి ఇప్పటికీ నా తలపుల్లో గింగురుమంటూనే ఉంటాడు. మన ఘనమైన అహింసా దేశంలో ఇలాంటి హింసలు లక్షల్లో కళ్లముందు జరుగుతూనే ఉన్నాయి.

కాళీపట్నం రామారావు గారు రచించిన యజ్ఞం కథలో, తన కొడుకు తనలాగా అప్పులపాలై బానిస బతుకు బతకకూడదని సీతారావుడు తన కన్న కొడుకును కత్తితో నరికివేసిన భయానక చర్య తెలుగు సాహిత్య లోకాన్ని కదిలించేసింది. జీవితవాస్తవాన్ని ఇంత భీభత్సంగా, భయానకంగా చూపించాలా.. ఇది సరైన పరిష్కారమేనా అంటూ ఈ కథపై చాలా విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి.

కాని ఎన్ని వందల వేల, లక్షల జీవితాలు మన చుట్టూ నేటి హైటెక్ యుగంలో కూడా భీభత్సంగానే ముగుస్తున్నాయో మనకందరికీ తెలుసు. ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, ఆంగ్లాన్ని అనర్ఘళంగా ఔపౌసన పట్టినా చదవడానికి శక్తిలేక, డబ్బుల్లేక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచు కేరళకు పోయి బిచ్చమెత్తుకుని చదువుకు కావలసిన డబ్బులు ఏరుకుంటోందని నిన్న కాక మొన్ననే చదివాము. ఇంతకు మించిన భయానక జీవనవాస్తవికతను మనం కథల్లో చూడగలమా?  ఎంతమంది పేద పిల్లల బతుకులు, చదువుల గడివరకూ రాలేక బాల కార్మిక జీవితపు తొలి అడుగులను పదేళ్ల ప్రాయంలోనే వేస్తున్నాయో మనందరికీ తెలుసు.

రమణ గారు,
విత్తనంగింజను రైతు భద్రంగా చూసుకుని వచ్చే పంటకోసం దాపెడుతున్నట్లుగా పిల్లలను కుటుంబాలు భవిష్యత్తు కోసం భద్రంగా దాచిపెట్టాలని చెబుతున్న ఈ కథను వీలైతే ఇంగ్లీష్ భాషలో కూడా ప్రచురించే ఏర్పాట్లు చేయండి. ఈ మార్చి నెలలో 12 భాషల చందమామల్లో మీ కథ ప్రచురిస్తున్నాము. ఇతర భాషల్లో అనువాదం కోసం దీన్ని ఆంగ్లంలో బ్యాక్ ట్రాన్స్‌లేషన్ చేయించాము కాబట్టి మీకు ఆంగ్ల అనువాద ఫైల్ కూడా పంపుతాము. ఇంగ్లీష్ చందమామలో కూడా ఈ కథ వస్తే బాగుంటుంది కాని ప్రాంతీయ చందమామలకు, ఇంగ్లీష్ చందమామ లే అవుట్‌కు ఇప్పుడు సంబంధం లేదు కాబట్టి ప్రచురించలేకపోతున్నాము.

దాదాపు మీ కథ చందమామలో మూడున్నర పుటలు రావడంతో అనివార్యంగా కథను కొంత కుదించి 3 పుటలకు తీసుకురావలిసి వచ్చింది. వర్ణణలు, అలంకారాలు, అదనపు పదాలు వంటి దర్జీ పనికి దొరికే వాటినే తొలగించాము తప్ప మూలకథకు మార్పు చేయలేదనే అనుకుంటున్నాము. పత్రిక చేతికందాక చూసి చెప్పండి.

కొసమెరుపు
మీ కథకు బొమ్మలు వేయవలసిందిగా సీనియర్ చిత్రకారులు శంకర్ గారికి పంపించాము. ఆయన చందమామ ఆఫీసుకు వచ్చి పని చేస్తున్న కాలంలో తెలుగు కథను ఒకటికి రెండు సార్లు చదివించుకుని అర్థం చేసుకుని తర్వాతే బొమ్మలు వేసేవారు. ఇంటిపట్టునే ఉంటూ ఇప్పుడు బొమ్మలు వేస్తున్నారు కనుక కథ ఇంగ్లీష్ అనువాదాన్ని పంపిస్తే దాని రెండు సార్లు చదివి తర్వాతే బొమ్మలేయడానికి కూచుంటారు. కథలో ఏమాత్రం సందేహం వచ్చినా, బొమ్మకోసం పంపిన వర్ణనలో కాస్త తేడా ఉందని గమనించినా వెంటనే ఫోన్ చేసి బొమ్మను కాస్త మార్చవచ్చునా అని అడుగుతుంటారాయన.

ఆయన మీ కథ ముందుగా చదివారు. అతిశయోక్తి అనుకోకుంటే మీ కథ చదివాక ఆయన నిజంగా కదిలిపోయారు. సందేహ నివృత్తికోసం ఫోన్‌లో మాట్లాడుతూ, తనను విశేషంగా ఆకర్షించిన ఒక వ్యాక్యాన్ని పదే పదే తల్చుకుని ప్రస్తావించారు.

“చిన్న పిల్లవాడిని బడికి పంపకుండా పనిలో పెట్టి చాలా తప్పు చేశావు సూరయ్యా, అసలు చిన్నపిల్లవాడిని పనిలో పెట్టడం నేరం. తెలుసా!” అంటూ టీచర్ మాధవయ్య, పిల్లవాడి తండ్రిని మందలిస్తే, “తెలియదయ్యా, ఆకలి తప్ప మాకేమీ తెలియదు. రేపటి సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం పూట గడవటం లేదు,” అంటాడు ఆ పేద తండ్రి.

శంకర్ గారు ‘ఆకలి తప్ప మాకేమీ తెలియదు’ అనే ఈ ఒక్క వాక్యాన్ని పట్టుకున్నారు. ‘ఎంత గొప్ప వ్యక్తీకరణ.. ఆకలి ముందు ఈ ధర్మసూత్రాలూ పనిచేయవ’ని చెబుతూ, ఇలాంటి కథలు చందమామకు ప్రాణం పోస్తాయంటూ ఆయన కదిలిపోయారు. రచయితలను ప్రోత్సహిస్తే, రచనలు పంపమని వారి వెంటబడి మరీ ఒత్తిడి పెడితే చందమామకు కథలు కరువా..! అంటూ ఆయన ఏకవాక్యంతో మీ కథను శిరసున పెట్టుకున్నారు.

ఈ నవ వృద్ద చిత్రకారుడికి కథ నచ్చిందంటే, చందమామ కధ సగం విజయం సాధించినట్లే లెక్క. ఎందుకంటే 60 సంవత్సరాలుగా ఆయన చందమామ కథలను వింటూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. పనిపాటలు చేసుకునే పాటక జనానికి కాస్త ఓదార్పు నిచ్చి అలసట తీర్చేదే కథ అంటూ ఆయన చందమామ కథా రహస్యాన్ని ప్రతిసారీ విప్పి చెబుతుంటారు.

రమణగారూ,
కేవలం శంకర్ గారి అభిప్రాయం రావాలనే మీ కథపై రాతపూర్వక స్పందనను ఇంత ఆలస్యంగా పంపుతున్నాను. అందుకు క్షమించాలి. అపార్థం చేసుకోరనే ఆశిస్తున్నాను. జీవిక రీత్యా, బాలసాహిత్య పరిషత్ బాధ్యతల రీత్యా తీవ్రమైన పని ఒత్తిడులలో ఉంటూ కూడా అడపా దడపా చందమామకు మీరు కథలు పంపుతూనే ఉన్నారు. పిల్లలనూ, పెద్దలనూ హృదయపు లోతులకంటా వెళ్లి స్పర్శించే ఇలాంటి మంచి కథలను మీరు చందమామకు ఎప్పటికీ పంపుతారని, పంపుతూండాలని కోరుకుంటూ..

మన:పూర్వక కృతజ్ఞతలతో
మీ
చందమామ.

RTS Perm Link


3 Responses to “ఆకలి తప్ప మాకేమీ తెలియదు….”

 1. chandamama on February 26, 2012 12:53 PM

  రాజు గారికి,
  నమస్కారం,

  నేను విత్తనం గింజ కథను చందమామలో ప్రచురణ నిమిత్తం మీకు పంపినప్పుడు, ఒక మద్యాహ్నం వేళ మీరు ఫోన్ చేసి ” మీ కథను మేము నాలుగు చేతులతో అందుకున్నాం చాలా బాగుంది. చాలా త్వరగా అన్ని రకాల అడ్డంకులు తొలగి చందమామ యాజమాన్యం చేత వెంటనే ప్రచురణకు కూడా తీసుకో బడింది”. అంటూ ఆ కథను పొగడుతూ మీరు చాలా చెప్పారు.

  ఇలాంటి కథలు చందమామకు పంపుతూ వుండొచ్చు కదా! సంవత్సరానికి ఒక కథ పంపితే ఎలా? అంటూ చిరుకోపం ప్రదర్శించారు కూడా. మీ ప్రశంసతో నా కడుపు నిండి పోయింది. అందుకే మీరు ఆ కథ గురించి చెప్పిన మాటలు అక్షర రూపకంగా పంపండి అన్న ఆనాటి నా అభ్యర్థన మన్నించి మీ అభిప్రాయం పంపినందుకు ధన్యవాదాలు.

  ఈ విత్తనం గింజ కథకు ప్రేరణ కేంద్ర సాహిత్య అకాడెమీ తెనాలి లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అక్కిరాజు రమాపతి రావు గారు తన ప్రసంగంలో చెప్పిన ‘రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనం గింజలను అమ్ముకోడు’ అన్న ఏక వాక్యం. ఆ వాక్యం ఆధారంగా ఈ కథను అల్లడం జరిగింది.

  మీ అభిమానానికి ధన్యవాదాలు.

  సెలవిప్పటికి స్నేహమేప్పటికి

  -రమణ

  Dasari Venkata Ramana
  General Secretary
  Balasahitya Parishat
  Ph: 04024027411. Cell: 9000572573.
  email: dasarivramana@gmail.com

 2. వేణు on March 8, 2012 2:28 AM

  మార్చి నెల చందమామలో ‘విత్తనం గింజ’ కథ చదివాను. చాలా బాగుంది. ఈ కథలోని ‘‘ఆకలి తప్ప మాకేమీ తెలియదు. రేపటి సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం పూట గడవటం లేదు..” అనే మాటలు ఎంత వాస్తవికం.. ఎంత హృదయ విదారకం! అద్భుత చిత్రకారుడు శంకర్ గారు కథలోని ప్రాణంలాంటి ఆ వాక్యాన్ని గుర్తించి ప్రస్తావించటం కథకుడికి గొప్ప ప్రశంస! దాసరి వెంకటరమణ గారికి అభినందనలు.

 3. chandamama on March 18, 2012 7:44 AM

  రమణగారూ,
  మీరు పంపే కథకోసం ఎదురు చూస్తున్నాము. రాసి ఉంటే పంపగలరు.

  వేణుగారూ,
  వాస్తవం హృదయ విదారకంగా కూడా ఉంటుందని మీరు చేసిన ప్రకటన హృద్యంగా ఉంది. “ఆకలి తప్ప మాకేమీ తెలియదు”.
  బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న పాలకవర్యులు ఈ ఆకలికీ, పిల్లలు పనిచేయవలసి రావడానికి మధ్య సంబంధం గురించి ఆలోచిస్తే బాగుండేది.
  ధన్యవాదాలు

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind