చందమామ – పాఠకుల ఉత్తరాలు

December 28th, 2011

చాలా కాలం తర్వాత చందమామ కార్యాలయానికి ఉత్తరాల వెల్లువ మొదలైంది. ప్రతి నెలా ఏ మూడు నాలుగు ఉత్తరాలకంటే ఎక్కువగా ప్రింట్ చందమామలో ప్రచురించడం కష్టం కాబట్టి పాఠకుల వాణికి ఆన్‌లైన్‌లో అయినా న్యాయం చేస్తే భావ్యంగా ఉంటుందన్న ఊహ నేపధ్యంలో మాకందిన వాటిలో కొన్ని ఉత్తరాలను ఇక్కడ ప్రచురిస్తున్నాము. వీలు చూసుకుని ఇకపై వచ్చే ఉత్తరాలను కూడా ఇక్కడ ప్రచురించడానికి ప్రయత్నిస్తాము.

చందమామ మంచిచెడ్డలకు నిఖార్సయిన ప్రతిరూపం పాఠకుల లేఖలే. నిర్మొహమాటానికి, నిక్కచ్చితనానికి మారుపేరైన చందమామ పాఠకులు దశాబ్దాలుగా తమ విలువైన అభిప్రాయాలద్వారా చందమామ దిశ దశ సరైన త్రోవలో పయనించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ వచ్చారు. 1950-80 నాటి ప్రామాణిక చందమామ నాణ్యత ప్రస్తుతం లేకపోయినప్పటికీ లక్షలాదిమంది అభిమాన పాఠకులు దేశవ్యాప్తంగా చందమామను నేటికీ తమదిగానే చూసుకుంటున్న చరిత్రకు పాఠకుల ఈ లేఖలే నిదర్శనం.

జీవితం చివరి క్షణాల్లోనూ చందమామను చదువుతూనే కన్నుమూయాలని, చందమామను చదివేందుకోసమే వందేళ్లు బతకాలని భావోద్వేగాలను శిఖరస్థాయిలో ప్రకటిస్తున్న మాన్య పాఠకులూ, అభిమానులే చందమామ మనుగడకు ‘శ్రీరామరక్ష’. గత రెండేళ్ల కాలంలో చందమామలో వచ్చిన మంచిమార్పులకు పాఠకులు నిత్యం పంపుతూ వస్తున్న లేఖలు, అభిప్రాయాలు, విమర్శలే కారణం.

‘ఎవడబ్బసొమ్మని కులుకుతు తిరిగేవు రామచ్చంద్రా’ అని రామదాసు ఆ శ్రీరామచంద్రుడినే మెత్తగా పొడిచిన రీతిలో చందమామ పాఠకులు పత్రిక నిర్వహణపై ప్రభావం వేస్తున్నారు. ‘మీ ఇష్టానుసారంగా కాదు, మా అభిమతానికి అనుగుణంగా పత్రికను నడపండి’ అంటూ దూషణ భూషణల జడివానలో పత్రికను ముంచెత్తుతున్నారు. ఒకమాట మాత్ర నిజం. చందమామ పాఠకుల ఆగ్రహాన్నీ తట్టుకోలేము. అలాగే అనితర సాధ్యమైన వారి మహాదరణను కూడా తట్టుకోలేము.

సందర్భోచితం కాదని పాఠకులు, అభిమానులు భావించని పక్షంలో ఒక చిన్న మాట. 64 ఏళ్ల క్రితం శ్రీయుతులు నాగిరెడ్డి-చక్రపాణి గార్లు తెలుగు సమాజానికి, భారతీయ సమాజానికి ఒక ‘మత్తుమందు’ను అందించారు. దాని పేరు చందమామ. లోకంలో సకల వ్యసనాలకంటే గొప్పదీ, ఔన్నత్యంతో కూడుకున్నది అయిన ఈ మత్తునుంచి పాఠకులు, అభిమానులు నేటికీ బయటపడలేదు. బయటపడలేరు కూడా.

మంచికి,మానవత్వానికి, నీతికి, నిజాయితీకి, సద్బుద్ధికి, సత్ప్రవర్తనకు, ఒక మహాజాతి సంస్కృతికి కూడా పట్టం కట్టిన మహా మత్తు చందమామ సొంతం. అది మంచి మత్తు కావచ్చు, చెడ్డ మత్తు కావచ్చు. ప్రపంచంలో మత్తుకు, వ్యసనానికి లోనయినవారు వాటిలోంచి బయటపడటం చాలా చాలా కష్టం. అందులోనూ చందమామ మత్తులోంచి బయటపడటం మరీ కష్టం. దానికి ఉదాహరణే చందమామ పాఠకుల ఉత్తరాలు. వాటిలో కొన్నింటిని ఈ విడత చదవండి.

ఇవి ఈ సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చందమామకు వచ్చిన ఉత్తరాలలో కొన్ని.

(అమృత సమానమైన వాక్కులతో, పొగడ్తలతో, విమర్శలతో, దూషణ భూషణలతో చందమామ దశను, దిశను నిర్దేశిస్తున్న పాఠకోత్తములందరికీ చందమామ కృతజ్ఞతాంజలులు…)

సెప్టెంబర్ చందమామను ఆగస్ట్ 27నే అందుకున్నాను. వపాగారి వినాయక చవితి ముఖచిత్రం అద్భుతంగా ఉంది. చందమామకు పూర్వ వైభవం వచ్చినట్టుంది. లోపలి కథలు కూడా చాలా బాగున్నాయి. అచ్చులో నా కథ చూసుకుంటే మహదానందమేసింది.
–ఆరుపల్లి గోవిందరాజులు, విశాఖపట్నం

సెప్టెంబర్ చందమామ వినాయకుడి ముఖచిత్రంతో అబ్బురమనిపించింది. వపాగారి మార్కు ముఖచిత్రాల్లో ఇది హైలెట్. అలాగే ఈ నెల బేతాళ కథలో కొట్టొచ్చినట్లు మార్పు ఏమంటే శంకర్ గారు పూర్తి పేజీ బొమ్మ వేయడం. బేతాళ కథకు ఫుల్ పేజీ బొమ్మ వేయడం చందమామ చరిత్రలో ఇదే తొలిసారేమో. రాజు, గుర్రం, పాముని శంకర్ పూర్తి పేజీలో అందంగా చిత్రించారు. కథ కూడా బాగుంది.
సారయ్య, కరీంనగర్, ఎపి.

సెప్టెంబర్ సంచిక సకాలంలో అందటం మహదానందంగా ఉండటమే కాకుండా ఇంతవరకు చందమామ సుదీర్ఘ చరిత్రలో ముఖచిత్ర వివరణ, -వినాయకుడు- చిత్రకారుని ప్రతిభ గురించి ఎప్పుడూ విశ్లేషించలేదు. వడ్డాది పాపయ్య గారు చందమామకు జీవనాడి. అలాగే నేడు కూడా కథోచిత చిత్రాలు అందిస్తున్న సీనియర్ చిత్రకారులు శంకర్ -కె.సి. శివశంకరన్- గారికి పెద్ద పీట వేసి గౌరవించాలి. పాత కొత్తల మేలుకలయికతో చందమామ చల్లని కిరణాలతో పరవశించని పాఠకుడు ఉండడంటే అతిశయోక్తి కానేరదు. ఆబాలగోపాలాన్ని హిమశీకరాలతో షష్ఠిపూర్తి దాటినా అందాల చందమామ అలరించడం ఎంత చిత్రం. వంద ఏళ్ళు చదవాలనే పాఠకుల ఆశ ఎంత విచిత్రం. ఇది దురాశ కాదెంతమాత్రం. ఇది మీకు నా శాశ్వత శుభప్రశంస.
–బి. రాజేశ్వరమూర్తి, చిలకలపూడి, కృష్ణా జిల్లా, ఎపి.

ఆగస్ట్ చందమామ సంచిక మా కుటుంబ సభ్యుల్నీ, మా స్నేహితుల్నీ ఆశ్చర్యానందాల్లో ముంచెత్తింది. మరీ అంతలా కథలు ఒక దానితో ఒకటి పోటీ పడి అలరించాయి. పైగా ధారావాహికలతో కలిపి పందొమ్మిది కథలు ప్రచురించారు. సంతృప్తినిచ్చింది. ఇక ముందు కూడా ఇదే పద్ధతి కొనసాగించండి. సరదా శీర్షిక అయిన నవ్వుల పువ్వులు తొలగించి మరో కథ వేస్తే బాగుంటుంది. ఓ చక్కని పౌరాణిక సీరియల్ కూడా వేయండి.
–ఎస్.ఎస్.వి.ఎల్.ఆర్.సి. మహర్షి, పాల్మకోల్, రంగారెడ్డి జిల్లా, ఎ.పి.

జూలై సంచికలోని ‘పిజ్జా బాట’ చాలా బాగుంది. మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. కథలన్నీ ఆసక్తికరంగా సాగి అబ్బురపరిచాయి. అయితే బొమ్మలలో మరింత శ్రద్ధ అవసరం. గత 40 ఏళ్లుగా చందమామ చదువుతున్నాను. చందమామలో బొమ్మలదే శిఖరాగ్రస్థానం. లక్షలాది మంది అభిమానులున్న చందమామలో ప్రస్తుతం మచ్చలాంటి లోపం బొమ్మలే. లోకజ్ఞానం క్విజ్ స్థానంలో రెండు మూడు తేలికపాటి క్విజ్‌లు ప్రవేశపెట్టండి. పత్రిక కోసం పడిగాపులు పడేలా, ఆసక్తిగా ఎదురు చూసేలా చేసేవి క్విజ్‌లే. కొత్త కథలను ప్రోత్సహించడం అభినందనీయం.
–జి.జాన్ కెన్నడీ, ఘట్కేశ్వర్, రంగారెడ్డి జిల్లా, ఎపి.

ఆగస్ట్ నెల చందమామ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి. ‘చందమామను ఒకసారి చదవండి. తర్వాత దాన్ని వదలరు’ అన్న దుమాల్ గారి వాఖ్య అద్భుతం. వాస్తవం కూడా. అలాగే సెప్టెంబర్ సంచికలోని జ్ఞాపకాలలో ‘బతికినంతకాలం చందమామ చదువుతూనే ఉంటాను’ అంటూ సోమశంకర్ గారు చేసిన ప్రకటన చందమామ పాఠకులందరి అబిప్రాయాన్ని సూచిస్తోంది. చందమామ చరిత్రను తడుముతున్న జ్ఞాపకాలను శీర్షికగా కొనసాగించడం చాలాబాగుంది
— ఎ. నారాయణరావు, అనంతపురం, ఎపి.

గత 20 ఏళ్లనుంచి చందమామ పత్రికను కొని చదువుతున్నాను. నా వయస్సు ఇప్పుడు 28 ఏళ్లు. చందమామ కవర్‌పై వచ్చే వపా చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. చందమామతో వచ్చే వపా చిత్రాల కోసం కథల కోసం చందమామ కొని, చదివి, భద్రపరుస్తున్నాను. 60 ఏళ్ల నాటి వపా చిత్రాలు కవర్ పేజీపై చూడాలని ఉంది. కవర్ పేజీపై వపాగారి పాత చిత్రాలే వేయగలరు. చందమామ చివరి అట్టపై కూడా మీరు కోరిన చిత్రం పేరిట వపాగారి చిత్రం ప్రచురిస్తే బాగుంటుంది. వపా చిత్రాలతోటే పెయింటింగ్ బుక్ ప్రచురించగలరు.
–ఎస్. మాధవరావు, దబరు, శ్రీకాకుళం

నేను పదవీ విరమణ చేసిన ప్రభుత్వ డాక్టర్ని. 1960 నుంచి చందమామ చదువుతున్నాను. అప్పట్లో రోజు పాఠాలు అప్పచెప్పేసి, మా అమ్మదగ్గర పైసలు తీసుకుని, దగ్గరి బడ్డీ కొట్టులో చందమామను కొనుక్కుని తెచ్చుకుని ఒక్కో కథని నిదానంగా చదువుకునేవాడిని. నేను మా అక్క, తర్వాత మా అమ్మ, మానాన్న అందరమూ చందమామను చదివేవాళ్లం. ఈ రోజుకీ చందమామను నేను వదలడం లేదు. నా పిల్లలూ చదువుతున్నారు. చివరకి నా మనవడు కూడా మెల్లగా కూడబలుక్కుని చందమామ చదువుతున్నాడు. చందమామ పట్ల ఇంత ఆకర్షణకు కారణం దీంట్లోని కథలు ఇంగ్లీష్ వాళ్ల హారీ పోటర్ నవలల్లో లాగా మంత్రాలు, మంత్రగాళ్లు, గాలిలో ఎగిరిపోవటాలు లాగా కాకుండా, ఆ కాలపు ప్రజల్లో ఉన్న మంచితనం, చక్కని కొండలు, నదులు, అడవులు, పచ్చని చెట్లు, ప్రజల్లో అమాయకత్వం, స్వచ్ఛత వంటి గుణాలతో కూడి ఉండటమే. ఇవి.. విచిత్రవ్యక్తి, టామ్ సాయర్, హకల్ బెరిఫిన్ వంటి మార్క్ ట్వైన్ నవలలను గుర్తుకు తెచ్చేవి. ఈ పాత రీతినే కొనసాగించండి. పొరపాటున మీరు విమానాలు, కార్లు, ఛేజింగ్, జేమ్స్‌బాండ్ వంటివి పెట్టారంటే నాలాంటి వాళ్లు చందమామను చదవటం మానేస్తారు.
— డా. వి.వి. నరసింహారావు, బుట్టాయిపేట, మచిలీపట్నం, ఎ.పి.

స్వాతంత్ర్య దినోత్సవం, రక్షాబంధన్ ఒకే సమయంలో రావడం బాగుంది. చందమామ కథలో నోరు లేని ప్రాణులు తోటి ప్రాణులకు సహాయం చేయడం వింతగొల్పుతోంది. దేశ సుభిక్షానికి వనపెంపకాలు అవసరమన్న సాధువు మాట విన్న రాజు దేశ పూర్వ వైభవానికి పాటు పడటం బాగుంది. ఆగస్ట్ నెల ముఖచిత్రం రెక్కల గుర్రం ఆకట్టుకుంది. చందమామ కాగితం ముతగ్గా ఉన్నప్పటికీ ముఖచిత్రం మాత్రం బాగుంది. పాతశైలిలోని కథలు పాత కాలాన్ని గుర్తు చేస్తున్నాయి. క్విజ్‌ విధానం మార్చండి.
— వాస్తు రామచంద్ర, రాంజీనగర్, నెల్లూరు, ఎపి.

ఈమధ్య చందమామలో చాలా పాత కథలు వేస్తున్నారు. సంతోషం. కాని 1952కి ముందు చందమామ సంచికలో ఉన్న కథలకు 53 నుంచి ప్రచురించబడిన కథలకు చాలా తేడా ఉంది. రూపం, సారం విషయంలో కూడా అవి తేడాతో ఉంటున్న విషయం జగమెరిగిన సత్యం. కుటుంబరావుగారికి ముందు చందమామ కథలు చాలా సాదా సీదాగా, వచ్చినవి వచ్చినట్లుగా అచ్చయిపోయేవి. ఉగ్గుపాల వయసులో ఉన్న పిల్లలకు ఊకొట్టే కథలుగా, చనుబాల కథలుగా అవి ఉండేవి. కుటుంబరావు గారు వచ్చాకే చందమామ కథల శైలి, విషయం కూడా చాలా మారింది. గాంధీగారి శైలి అనబడే నిరాడంబర రచనా శైలితో కొకు చందమామ కథలకు జీవం పోశారు. దయచేసి 1953 నుంచి చందమామలో ఉన్న కథలనే తిరిగి ప్రచురించండి. 52కి ముందు కథలు అంతగా ఆసక్తి గొల్పవు.
–జి. త్రివిక్రమ్, బెంగళూరు (ఫోన్ సంభాషణ ద్వారా)

I would like to bring to your attention the usage of word” DONGA MUNDA” in your latest JULY issue, page 65. I do realize this is a reprint form 1947. May be it was accepted to use such language in those days.
However, in this day and age, when we are trying to teach all the good things to the kids and we depend on magazines like Chandamma, usage of such words especially in print is inappropriate. Just as times have changed, You should have edited the story and language before the print.
-Srilekha, Hyderabad.

చందమామతో నాకు యాభై ఏళ్ల అనుబంధం ఉంది. చిన్నప్పటినుంచి చందమామ కథలంటే చెవికోసుకునేవాడిని.  భారతీయ భాషలన్నింటిలోనూ చందమామ వెలువడుతూ ఆబాలగోపాలాన్నీ అలరిస్తోంది. చందమామ పేజీలు నున్నగా, ఆయిల్ ప్రింట్‌తో ఉండటం ముఖ్యం కాదు.పాఠకులు కోరుకునేది వాసిగల కథలను మాత్రమే. కథ చిన్నదైనా చదవగానే మనస్సుకు హాయిని కల్గించాలి. మంచి కథ చదివాం అనే అనుభూతి కలగాలి. చందమామకే హైలెట్ అనదగిన ఫోటో వ్యాఖ్యల పోటీని రద్దు చేయడం ఏమాత్రం బాగాలేదు. ఈ శీర్షిక లేకపోవటం చందమామలో ఎంతో వెలితిగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని నా మిత్రులు చాలామంది అన్నారు. ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్‌‌లో ఫుల్ పేజీలో ఫోటోలు ప్రచురించేవారు. ఆ  పేజీలు కనువిందు చేసేవి. ఫోటో వ్యాఖ్యలు రాసి బహుమతి పొందాలని మనస్సు ఉవ్విళ్లూరేది. ఈ శీర్షిక చందమామకోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసేలా చేసేది. ఈ శీర్షికను తిరిగి కొనసాగించాలని సవినయంగా మనవిచేస్తున్నాను.
-బొబ్బా సత్యనారాయణ, నిజామాబాద్

జూన్ గడవక ముందే జూలై సంచిక వచ్చేసింది. ఈ సంచికలో కథలన్నీ బాగున్నాయి కాని ప్రత్యేకించి పి. రంగనాయకమ్మ కథ ‘దేవుడితో చదరంగం’ మరీ బాగుంది. చందమామకు, యువ పత్రికకు నేను కథలు రాసి పంపడానికి ప్రేరణగా నిలిచిన గురుతుల్యులు అవసరాల రామకృష్ణారావు గారి పాత కథ, కొత్త కథ, జ్ఞాపకాలు మూడూ ఒకే సంచికలో వేయడం మరీ బాగుంది.
-ఎన్ ఎస్ ఆర్. మూర్తి, హైదరాబాద్

జూలై సంచిక వారం రోజుల ముందే మార్కెట్లోకి వచ్చేసింది. చాలా సంతోషం. అలాగే కథల ఎంపిక చక్కగా ఉంది. కొన్ని కథలు ఆయా ప్రాంతాల యాసను కలిగి ఉంటున్నాయి. వీటిని సంస్కరించి మాండలిక వాసనలు లేనివిధంగా తిరగరాస్తే బాగుంటుంది.
-ఎంవీవీ సత్యనారాయణ, విశాఖపట్నం

మీరు పంపిన జూలై చందమామ జూన్ 30వ తేదీనే నాకు చేరింది. చాలా సంతోషం. అలాగే చందమామ తొలిసంచికలో రాసిన నా తొలి కథ పొట్టిపిచుక, నేన్రాసిన కొత్త కథ విజయమాల, నా చందమామ జ్ఞాపకాలు మూడూ ఒకే సంచికలో ప్రచురితం కావడం మరీ సంతోషం. పొట్టి పిచుక కథకు వేసిన బొమ్మలు రంగుల్లో మరింత బాగా కనిపిస్తున్నాయి. కృతజ్ఞతలు.
-అవసరాల రామకృష్ణారావు

చందమామ 12 భారతీయ భాషల్లో వస్తుంది అని ఒక ముస్లిం అమ్మాయికి చూపిస్తూ అందులో ఉర్దూ ఉందనుకుని వెతికాను. కనిపించలేదు. అరే అనిపించింది. మన దేశంలో ఉర్దూ చాలా చోట్ల చాలా మందే మాట్లాడ్తారు కదా. ఉర్దూలో కూడా ఉంటే బాగుండును అనిపించింది. ఆ ఆలోచన పంచుకోవాలనిపించి వ్రాస్తున్నాను. ఉర్దూలో చందమామ ఎందుకని రాలేదు?
-జి.లలిత, అమెరికా

చందమామ ఇప్పుడు పూర్వరూపానికి వచ్చేసి చాలా బాగున్నది. ఏవైనా కొన్ని కొత్త శీర్షికలు ప్రవేశపెట్టండి
-కోలార్ కృష్ణఅయ్యర్, బెంగళూరు.

RTS Perm Link