బానిసత్వం తప్పదు గాని మరీ ఇంతగానా..!

December 22nd, 2011

సాఫ్ట్‌వేర్ రంగం అమానుష పనివిధానానికి, శ్రమ అమానవీకరణకు నెలవుగా మారిపోయిన క్రమం గురించి ఇటీవలే చర్చించుకున్నాము. చర్చలో పాల్గొన్న అందరూ దాదాపుగా 8 గంటలనుంచి 12 గంటలు, 15 గంటల వరకు ఈ రంగంలో పెరుగుతున్న పనిభారం గురించి అంగీకరించారు. ఈ రోజు నేను సాక్షి పత్రికలో చదివిన ఈ వ్యాసం ఓ భయంకర సత్యాన్ని చాటుతోంది.

పని చేసుకుంటూ చదువుకునే పరిస్థితులున్న  పాశ్చాత్య దేశాలలో, పొదుపు చర్యలు, బడ్జెట్ కోతలు పేరుతో అక్కడి ప్రభుత్వాలు తీసుకువస్తున్న సంస్కరణల కారణంగా విద్యార్థుల జీవితాలు తల్లకిందులవుతున్న వైనం గురించి ఈ వ్యాసం హృద్యంగా వివరిస్తోంది.

బ్రిటన్‌లో చదువుకుంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం  వెతుక్కుంటున్న మూడు లక్షల మంది విద్యార్థులు తమకు నిరుద్యోగ భృతి లభించాలంటే ఇంటర్న్‌షిప్ -అప్రెంటిస్‌షిప్- పేరుతో సూపర్ మార్కెట్లలో, మాల్స్ లలో మూడు వారాలపాటు ఉచితంగా పనిచేసి పెట్టవలసిన వైనాన్ని ఈ వ్యాసం తెలిపింది.

ఉన్నత విద్యావంతులు, సాంకేతిక నిపుణులు, ఉద్యోగాలు కోల్పోయిన సీనియర్లు, తాజాగా మార్కెట్లోకి అడుగుపెట్టిన జూనియర్లు అందరూ బానిసత్వం కంటే అధ్వాన్నమైన ఈ ఉచిత ఇంటర్న్‌షిప్‌ల కోసం పోటీలు పడుతున్నారట. ఇలా ఏ పనిచెప్పినా చేయడానికి సిద్ధమవుతుంటే జీతాలిచ్చి ఉద్యోగులను పనిలో పెట్టుకోవడం దండగని యజమానులు బహిరంగంగానే చెబుతున్నారట.

బ్రిటన్ ప్రభుత్వం ప్రజాధనంతో ఇస్తున్న నిరుద్యోగ భృతిని పొందాలంటే విద్యార్థులు బడా కంపెనీలకు బానిస చాకిరీ చేయవలసిన ఆగత్యం ఏమిటి అంటూ ఆ వ్యాసం చివర్లో ప్రస్తావించింది.

సంస్కరణల పేరుతో పొదుపు చర్యల పేరుతో ప్రజల జీవితాలపైనే అన్నిరకాలుగా కోతలు విధిస్తూ పారిశ్రామిక సంస్థల, యజమానుల జోలికి వెళ్లని పాశ్చాత్య ప్రభుత్వాలు ఏ నాగరికతను గొప్పగా చూపబోతున్నాయి?

ఇంటర్న్‌షిప్‌ పనికి ఎర్ర ఏగానీ కాదు కదా ఒక పూట భోజనం కూడా పెట్టరట.

మన పల్లెలు గుర్తు వస్తున్నాయి. ఎవరైనా ఊర్లలో గంట పని చేయించుకుంటే డబ్బులు ఇవ్వలేక పోయినా కడుపునిండా అన్నం పెట్టి పంపేవారు. మన కోసం  కాసింత పని చేసిపెట్టిన  వారిని ఊరికే పంపవద్దన్నది మన గ్రామీణ సంప్రదాయం.

పాశ్యాత్య నాగరికతకు ఏ నీతి కూడా లేకుండా పోతోందా?

ఈ వ్యాసంలోని నిజానిజాలను పాశ్చాత్య దేశాలలో చదువుతున్న మన విద్యార్థులు, మన ఉద్యోగులు తేలిస్తే బాగుంటుంది. అక్కడి పరిస్థితి నిజంగా ఇంత భయంకరంగా ఉంటోందా..

నేటి ప్రపంచంలో బానిసత్వం తప్పదు కాని మరీ ఇంతగానా..!

పరిశీలన కోసం కింది వ్యాసం లింకును చూడండి.

చదువు‘కొనడానికి’ పడుపు వృత్తి!

 

RTS Perm Link


2 Responses to “బానిసత్వం తప్పదు గాని మరీ ఇంతగానా..!”

 1. Prasad on December 22, 2011 2:55 AM

  రాజు గారు,
  ఎకానమీ కుంచించుకు పోయేటపుడు పరిస్థితులు గడ్డుగానే ఉంటాయి. ఏ స్థాయి లో అంటే, ఎకానమీ వృధ్ధిచెందేటపుడు కార్లూ, పార్టీలూ, బంగళాలూ పెరిగిన స్థాయి లో.
  పాశ్చాత్య సమాజిక రాజకీయ వ్యవస్థలకి కనీసం సంక్షోభాన్ని తట్టుకొనే దృఢత్వం, సంక్షోభానికి పరిష్కారాన్ని అన్వేషించే సామర్ధ్యం ఉన్నాయి.
  వాళ్ళని చూసి వాతలు పెట్టుకొన్న మన వ్యవస్థ ఇంకా బాలారిష్టాలను దాటలేదు. ఇక్కడ ప్రతి విషయమూ రాజకీయమౌతుంది. ఇక్కడ సంక్షోభం మొదలైతే, దానిని తట్టుకొని బయటపడే సామర్ధ్యం మన వ్యవస్థ కి ఉందా అనేది సందేహాస్పదం.

  “పాశ్యాత్య నాగరికతకు ఏ నీతి కూడా లేకుండా పోతోందా?”

  మీకు తెలిసే ఉంటుంది (It may be an exaggeraion):
  A journalist asked Gandhiji, “What’s you opinion about western civilization?”
  He said, “It’s a good idea”.

 2. chandamama on December 22, 2011 5:27 AM

  ప్రసాద్ గారూ
  నిజం. మీరన్నదే కరెక్ట్. ఇక్కడ ప్రతి విషయమూ రాజకీయమవుతుంది. ఇక్కడే వ్యాఖ్యానంలో, ప్రకటనలో జాగ్రత్తపడాల్సి ఉంది. మంచి విషయం గుర్తుచేశారు. కృతజ్ఞతలు.

  కాని అదే సమయంలో ప్రజాధనంతో నిరుద్యోగ భృతిని అందించే ప్రభుత్వాలు ఆ భృతిని పొందాలంటే ఉచితంగా ప్రైవేట్ కంపెనీలకు మూడు వారాల పాటు సేవ చేయాలని లక్షలమంది విద్యార్థులకు తప్పనిసరి షరతును విధించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. ఆదేశ పూర్వకమైన ఈ షరతును అక్కడి వారు ఆమోదిస్తున్నారా, అర్ధాంగీకారంతోటే పనిచేస్తున్నారా, లేక ఇక ఏమార్గమూ లేక తప్పనిసరై అనుసరిస్తున్నారా అనేది అక్కడి వారే చెప్పవలసి ఉంటుంది. ప్రభుత్వం విధించిన ఇలాంటి షరతుతో ఇక కొత్తవారికి ఉద్యోగాలు కల్పించవలసిన అవసరం మాకేమిటి అని మాల్స్ యజమానులు ప్రకటించేశారట కూడా. ఇది ఎవరికి, ఎన్ని విధాలుగా నష్టకరమో తెలుస్తూనే ఉంది కదా. దీనికి సరైన సమాధానం అక్కడినుంచే రావాల్సి ఉంది.

  ధన్యవాదాలు

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind