మా అమ్మ పేపరు చదవటం

December 20th, 2011ఇది అరవై ఏళ్ల క్రితం చందమామలో వచ్చిన ఒక పేజీ కథ. 1953 జనవరి సంచికలోనిది. చందమామ అంతర్గత పనుల్లో  భాగంగా దీన్ని ఇవ్వాళ టైప్‌ చేయవలసి వచ్చింది. చదవగానే నా మనసు ఎక్కడికో వెళ్లిపోయింది.  సామాజిక స్పృహ అనే పెద్ద పెద్ద పదాలు వాడకుండానే చందమామలో సమకాలీన సమాజ చిత్రణ ఎంత స్పష్టంగా, ఎంత మనోహరంగా చిత్రించబడేదో చెప్పడానికి ఈ కథ ఈనాటికీ ఒక సజీవ ఉదాహరణ.

కుటుంబ సభ్యులందరి పనులూ చేసిపెట్టే అమ్మ పేపర్‌ చదవటానికి ఎంత హైరానా పడుతుందో, పని చేసి కోల్పోయిన శక్తిని ఎంతగా కూడగట్టుకోవలసి వస్తుందో, కనీసం పేపరు చదవడానికి కూడా ఆమె ఎంత స్ట్రగుల్‌ అవ్వాల్సి వస్తుందో విశాఖ పట్నంకి చెందిన లక్ష్మీబాయి గారు 1953 లోనే అత్యద్భుతంగా ఈ చిన్ని కథనంలో వర్ణించారు.

ఇంట్లో అందరూ విసిరేసిన పేపర్‌ ముక్కలను ఏరుకోవడం, పరుపుమీదికి చేరాక కళ్లద్దాలు మరిచిపోవడం, ఇల్లంతా వెతకడం, తీరా కళ్లద్దాలు దొరకటం, తర్వాత పేపర్‌ కనబడకుండా పోవడం. దిండు కింద పెట్టి మర్చిపోవడం. ఇన్ని కష్టాలు పడ్డాక పేపర్‌ చదవడం అనే పని మొదలు పెట్టి చేతిలో పేపరూ, ముక్కుమీద కళ్లద్దాలూ పెట్టుకుని హాయిగా నిద్రపోవడం.  తీరా ఆ పేపరు ఆరోజుదు కాదు నిన్నటిదో మొన్నటిదో అని గ్రహించి కుటుంబ  సబ్యులంతా నవ్వటం. కాని ఆ పాత వార్తలనే అమ్మ మర్నాడు పూస గుచ్చినట్లు చెప్పడం..

తెల్లారు జామునే లేచి పని చేసి  కుటుంబాన్ని లేపి, బయటకు పంపే అమ్మ పేపర్‌ చదవడానికి ఎంత కష్టపడుతుందో మరి. అంత పని చేసి అమ్మకు నిద్ర రాదంటే రాదా మరి. “ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు నువ్వు, నువ్వు చేసే పని ఏమిటి ఇంతకూ..’ అంటూ మగ మహారాజులం ఎన్ని లక్షలసార్లు మన అమ్మలనూ, మన జీవన సహచారిణిలనూ ఇన్నాళ్లూ అని ఉంటామో. అమ్మ కష్టాలు అమ్మకే అర్థమవుతాయోమో మరి.

మనుషులు చేసే శ్రమలన్నింటిలోనూ నిస్సారమైందీ, మనిషిని నిర్వీర్యం చేసేదీ, సమాజం దృష్టిలో ఎలాంటి విలువ లేనిదీ ఇంటిపనే అని లెనిన్‌ వందేళ్ల క్రితం ఢంకా భజాయించి చెప్పాడు. దానికి పరిష్కారంగా మహిళలను పెద్ద ఎత్తున సామాజిక ఉత్పత్తి కార్యకలాపాల్లోకి తీసుకురావాలని, ఉయ్యాలలూపే చేతులు రాజ్య వ్యవహారాలలో పాలు పంచుకోవాలని లెనిన్‌ ఒక మహత్తర స్పప్నాన్ని అప్పట్లోనే ఆవిష్కరించారు. దానికనుగుణంగా అక్టోబర్‌ విప్లవం విజయవంతమయ్యాక సోవియట్‌ రష్యాలో పురుషులతో సమానంగా స్రీలు సామాజిక ఉత్పత్తి కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారు.

ప్రపంచ చరిత్రలో మహిళలకు ఉత్పత్తి వ్యవహారాల్లో సమాన భాగస్వామ్యం  కల్పించిన మొట్ట మొదటి దేశంగా సోవియట్‌ యూనియన్‌ నిలిచింది కూడా. హిట్లర్‌ దండయాత్ర కాలంలో ఒక తరం యుపకులు మొత్తంగా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టవలసిన విపత్కర పరిస్థితుల్లో సోవియట్‌ మహిళలు దేశంలోని మొత్తం కర్మాగారాలలో ఉత్పత్తి సజావుగా కొనసాగే పాత్రను చేపట్టారని అప్పట్లో ఫ్యాక్టరీల్లో పని చేసిన స్ర్తీపురుషుల నిష్పత్తి 70:30గా ఉండేదని గణాంకాలు చెబుతున్నాయి. కాని ఆ స్వర్గం తనంతట తాను కూలిపోయింది. కారణాలు లక్షోపలక్షలు.

ఆశ్చర్యకరమైనదేమిటంటే ఇంట్లో  మహిళలు చేసే వంటపని లోని శ్రమను గుర్తించి దానికి 3 వేలరూపాయల ఆర్థిక విలువను లెక్కగట్టి చెప్పడానికి భారత సర్వోన్నత న్యాయస్థానానికి దాదాపు 65 సంవత్సరాల సమయం పట్టింది. మన అమ్మ.. మనందరి అమ్మ… కుటుంబం కోసం తన శక్తియుక్తులను ఫణంగా పెట్టేది. తన జీవితం మొత్తాన్ని కుటుంబంకోసం త్యాగం చేసేది. నా దృష్టిలో పేపరు చదువుతూ అలాగే నిద్రపోయే అమ్మ మన సామాజిక జీవిత చిత్రణకు నిలువెత్తు దర్పణం. సమాజంలో సగభాగానికే కాదు… యావద్దేశానికే అన్నం వండి పెడుతున్న మహాత్మురాలు.

పైసా ఆదాయం అడగకుండానే, కుటుంబానికి సమస్త చాకిరీలు చేసిన, చేస్తున్న  జీవిత ఔన్నత్యానికి మన కాలపు ప్రతీక అమ్మ. మన సహచరికి కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలోపల, ఇంకా చెప్పాలంటే  మన వెనుక ఉన్న అమ్మలూ, అర్దాంగినులూ మన వ్యక్తిగతానికి సంబంధించిన అన్ని పనులూ చాకరీలు చేసిపెడుతూ సామాజిక మానవులుగా, ఉత్పత్తిలో పాలుపంచుకునే మానవులుగా మనల్ని తీర్చిదిద్దుతుంటారు. మనం సమాజ కార్య కలాపాల్లో పాల్గొంటూ విశ్రాంతి సమయంలో అపుడప్పుడూ తీరిగ్గా  సిద్దాంతాలు కూడా చేస్తుంటాం.

తీరా మహిళ బయట పనిచేయక తప్పని అనివార్య పరిస్థితులు వచ్చి పడిన నేటి కాలంలో కూడా ఇంటికి రాగానే వంటపని, ఇంటిపని వంతు మహిళ స్వంతంగానే ఉంటోంది. “అయినా ‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు నువ్వు, నువ్వు చేసే పని ఏమిటి ఇంతకూ..’ అని మనం అంటూనే ఉంటాము. మగ మహారాజులం కదా. ఆమాత్రం అనకపోతే మన మగతనం ఏమైపోవాలి..

చాకిరీ చేసే అమ్మా, ఇంటిల్లిపాదినీ బయటపనులకు తయారు చేసి పంపే అమ్మా, పేపరు చదువుతూ, చదువుతూ అలానే నిద్రపోయే అమ్మా.. నువ్వు చదువుతూనే నిద్రపోవే అమ్మా! ఈ ప్రపంచం ఏమీ మునిగిపోదు.

(అమ్మ గొప్పతనాన్ని, అమ్మతనం లోని విలువను మరోసారి గుర్తుకు తెచ్చిన చందమామ అలనాటి కథకు జోహార్లు.)

ఆ అలనాటి అపురూప కథ పూర్తి పాఠాన్ని  ఇక్కడ చదవండి.

మా అమ్మ పేపరు చదవటం

మా అమ్మ సాయంత్రం పూట పేపరు ఎలా చదువుతుందో ఎప్పుడైనా చూశారూ? ఏ సంగతి మరిచినా అమ్మ పేపరు చదవడం మాత్రం మరవదు. పాపం, ఇంటిపనంతా ముగించుకుని అమ్మ హాల్లోకి వచ్చేసరికి పేపరు పేజీలన్నీ  ఒక్క చోటున ఉండవు. నాలుగు వేపులా నాలుగు కాగితాలూ ఇంట్లో పడి ఉంటాయి. మేడమీద అన్నయ్య చదివి అక్కడే పారేసిన మొదటి పేజీ, అక్కయ్య చదివిన మధ్యపేజీ, ఇవన్నీ ఏరుకుని వచ్చి అమ్మ పడుకుని చదవడానికని ఆసక్తితో పరుపుమీదకు వెళుతుంది.

అమ్మకప్పుడు జ్ఞాపకమొస్తుంంది. తన కళ్లద్దాలు మరచిపోయనట్లు. వాటికోసరం ఇల్లంతా వెతుకుతుంది. ఇటు అటు ఇల్లంతా ఒక పదిహేను నిమిషాలు గాలించిన తర్వాత అమ్మకు అప్పుడు జ్ఞాపకమొస్తుంది ఎక్కడుంచిందీ, ఎలాగో కళ్లద్దాల పెట్టె దొరుకుతుంది. కాని, అది తీసి చూసేసరికి అందులో కళ్లద్దాలు ఉండవు. మళ్లీ ఐదు నిమిషాలు గాలించుతే కళ్లద్దాలు దొరుకుతాయి. ఆఖరుకి పరుపు దగ్గిరికి వెళితే, పేపర్లు ఏవి! ఇక్కడే పెట్టానే అనుకుంటుంది.

కొంత సేవు వెతికిన తర్వాత కళ్లద్దాల కోసం వెళ్లేముందు ఆ పేపర్లు తలగడ కిందనే పెట్టానని అప్పుడు జ్ఞాపకమొస్తుంది. ఇన్ని బాధలు పడి. ఎలాగో పేపరు చదవడానికి మొదలు పెడుతుంది. ఒక్క ఘడియ చదువుతుందో లేదో చేతిలో పేపరూ, ముక్కుమీద కళ్లద్దాలూ పెట్టుకుని హాయిగా నిద్రపోతుంది.

ఇంతలో మానాన్న వస్తారు. మమ్మల్ని అందరినీ పిలిచి, ఒక్కసారిలా వచ్చి చూడండి, అంటారు ఆ దృశ్యం చూసేసరికి మాకు నవ్వాగదు. ఇంతకూ అసలా పేపరు ఆ రోజుదే కాదు. నిన్నటిదో, మొన్నటిదో తారీకు చూడకుండానే అమ్మ అంత ఆసక్తితో పాత పేపర్లే చదివేస్తూ ఉంటుంది.

అన్నిటికంటే ముఖ్యమైన విష యం ఏమిటంటే, ఆ మర్నాడు అమ్మ మాతో పేపర్లో ఉండే వింతలూ, విశేషాలూ, వార్తలూ చక్కా పూసగుచ్చినట్లు చెపుతుంది. మరి ఎలా చెప్పగలుగుతుంమదో ఏమో..!
-లంకలపల్లి లక్ష్మీబాయి – వాల్తేరు

RTS Perm Link