తొమ్మిది గంటలతోనే అంతమవుతున్న నరకం

December 18th, 2011

“ఇండియా లో సాఫ్ట్-వేర్ రంగం : where are we going?” అనే శీర్షికతో మిత్రులు బొందలపాటి ప్రసాద్ గారు రెండు రోజుల క్రితం తమ బ్లాగులో టపా ప్రచురించారు. ఎనిమిది గంటల పని తొమ్మిది గంటల పనిగా మారిన సాఫ్ట్‌వేర్ రంగంలో మారిన పరిస్థితులను 150 ఏళ్ల క్రితం కారల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రచనలో ప్రతిపాదించిన సూత్రీకరణతో అన్వయిస్తూ ప్రసాద్ గారు ఒక అర్థవంతమైన చర్చను లేవనెత్తారు.

కాస్త ఆలస్యంగా స్పందిస్తూ ఇవ్వాళ తన బ్లాగులో నేను పోస్ట్ చేసిన వ్యాఖ్యను అందరి పరిశీలన కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఇండియా లో సాఫ్ట్-వేర్ రంగం అనే ప్రసాద్ గారి పూర్తి టపా కోసం ఈ కథనం కింది లింకులో చూడండి.

మార్క్సిజం అమలులో పరిమితులుండటం గురించి చెప్పాల్సి వస్తే.. సర్వకాలాల్లోనూ, సకల సమాజాలకూ అన్వయించదగిన, అమలు చేయదగిన సర్వ సమగ్ర సంపూర్ణ సిద్ధాంతం ఈ ప్రపంచంలోనే కాదు ఏ ప్రపంచంలో కూడా సాధ్యం కాదు అన్నది బహుశా అందరికీ తెలిసిన విషయమే. మార్క్సిజం కూడా దీనికి లోబడేదే.

మార్క్స్ సైద్ధాంతిక వైధానికాన్ని రాజకీయంగా, సామాజికంగా అమలు పర్చడంలో గత శతాబ్దం పొడవునా వివిధ దేశాలలో కొనసాగిన ఆచరణ మానవ సమాజానికి కొన్ని అద్భుత ప్రయోగాలను అందించింది. కాని అదే సమయంలో విప్లవ విజయానంతరం సోషలిస్టు “రాజ్యం” ఏర్పడిన క్రమంలో దాని అన్వయంలో జరుగుతూ వచ్చిన తీవ్రమైన పొరపాట్లు ఆ సిద్ధాంతపు సమగ్ర దృక్పధంపైనే అనుమానాల నీలి నీడలు ప్రసరించడానికి అవకాశమిచ్చాయన్నది కాదనలేని సత్యం. ఈ విషయంలో ఇక్కడి చర్చలో పాల్గొన్న మిత్రుల స్పందనను తృణీకరించనవసరం లేదు.

కాని వ్యవసాయిక, చేతి ఉత్పత్తుల దశను దాటి పెట్టుబడి ఆధారిత ఉత్పత్తి విధానం సమాజ ఉనికిలోకి వచ్చి, బలపడుతున్న దశలో మార్క్స్ చేసిన సూత్రీకరణలు ఈనాటికీ మన సమాజానికి అన్వయించబడుతున్నాయా లేదా అన్నదే మన చర్చకు ప్రాతిపదిక కావాలి. ఈ విషయంలో మీరు మార్క్సిజాన్ని సాఫ్ట్‌వేర్ రంగ పరిస్థితికి అన్వయించి చెప్పిన అభిప్రాయాలు చాలా విలువైనవి.

“అప్పట్లో రోజుకి ఎనిమిది గంటలే ఆఫీసు లో ఉండేవాళ్ళం… టెక్నాలజీ పెరిగితే, పని తగ్గి మనిషి సుఖపడాలి. జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి. మరి ఇప్పుడు సాఫ్ట్-వేర్ ఇంజినీర్లు, మునుపెన్నడూ లేనంత కష్టపడుతున్నారు. ఒత్తిడికి లోనవుతున్నారు. పని గంటలు తొమ్మిదికి పెరిగాయి.”

మీ వాక్యాలకు సంబంధించి ఒక చిన్న వివరణ. మీరు ఎనిమిది గంటల పనిని, ఇప్పుడు తొమ్మిది గంటల పనినీ, సౌకర్యాల రూపంలో ‘పార్టీలు’ పరమపదించిన పనినీ చవిచూశారు. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్‌లో భాగంగా మీ జీవితం ఇలా సాగింది సాగుతోంది.

“క్లయింట్లు కంపెనీలను పిండుతుంటే, కంపెనీలు ఉద్యోగులను పిండుతున్న” కొత్త బంగారులోకంలో ఈ తొమ్మది గంటల పని కూడా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్లపై ఎంత భౌతిక, మానసిక ఒత్తిడిని పెంచిందో మన కళ్ళముందే ఘోరాతి ఘోరాతిమైన అనుభవాలను వార్తలుగా చూస్తున్నాము. మీది షిప్టుల వారీ పని కాబట్టి నరకం మీకు తొమ్మిది గంటలతోనే అంతమవుతోంది. (మీ ఒత్తిడికి ప్రతిఫలంగా మీరు సాధారణ ఉద్యోగులు కలలో కూడా ఊహించనంత అధిక మొత్తాలను ఈ మాంద్య పరిస్థితుల్లో కూడా పొందుతూండవచ్చు.)

కాని కాల్ సెంటర్లు, డేటా ఎంట్రీ బిజినెస్‌లు, సాఫ్ట్‌వేర్ లోకలైజేషన్‌ ప్రక్రియల వంటి రంగాలలో పనిచేస్తున్న వేలాది, లక్షలాదిమంది పరిస్థితి ఏమిటి? సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ రంగం అనేది ట్రేడ్‌యూనియన్లు పెట్టుకోవడానికి వీలులేని ఆధునిక అసంఘటిత రంగం కిందికే వచ్చినప్పటికీ, సాఫ్టవేర్ ప్రోగ్రామింగ్‌పై ఆధారపడి ఉనికిలోకి వచ్చిన సాఫ్ట్‌వేర్ లోకలైజేషన్ వంటి రంగాలు అంతకంటే మించిన అమానుష పని పరిస్థితులను సృష్టిస్తున్నాయి.

ఎవరి విషయమో వద్దు. నా విషయంలోనే చూద్దాం. నేను మూడేళ్లకు ముందు భారతదేశంలో 9 ప్రాంతీయ భాషా వెబ్‌సైట్లను నడుపుతున్న ఒక ఉత్తరాది సంస్థ చెన్నయ్ శాఖలో పనిచేశాను. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి 7 గంటల వరకు అంటే 10 గంటల పాటు సాధారణ పనివేళలయితే సరిగ్గా క్లయింట్ నుంచి ఒక అర్జెంట్ పని అంటూ సరిగ్గా 7 గంటలకు హెడ్డాఫీస్ నుంచి ఈమెయిల్ వస్తుంది.

అంతకుముందు చేసిన మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్, లేదా యాహో, మోటరోలా, నోకియా, రిలయెన్స్ లోకలైజేషన్ -తేలిగ్గా చెప్పాలంటే అనువాదం లేదా స్థానికీకరణ- పనులను వెంటనే మోడిపై చేసి పంపాలంటూ తాఖీదు వస్తుంది. ‘ఇట్ ఈజ్ అప్రిషియబుల్ టు డూ దిస్ వర్క్ టుడే’ అని ఇక్కడి వారి సన్నాయి నొక్కులు కూడా ఉంటాయనుకోండి. ఫలితం ఏమిటంటే పదిగంటల రోజువారీ పనికి అదనంగా ఏ రాత్రి రెండు గంటల వరకో పని పూర్తి చేసి అప్పుడు ఇంటికి వెళ్లడం లేదా అక్కడే పడుకుని తెల్లారి లేచిపోవడం. ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు సంవత్సరాలు ప్రతి నెలలో ఇలా 16 గంటలు పనిచేసే అనుభవాలను పదే పదే ఎదుర్కొన్నాము మేము.

పైగా, 2005లో మైక్రోసాఫ్ట్ కంపెనీ, ప్రాంతీయ భాషల్లో లెక్సికాన్ -పదకోశం- తయారీ కోసం మా సంస్థకు ప్రాజెక్టు ఇస్తే దాంట్లో భాగంగా తెలుగులో రెండున్నర కోట్ల పదాలు, పద వ్యుత్పత్తి రూపాలు – base words and generated words – రూపొందించడానికి ఐదున్నర నెలలపాటు సెలవు కూడా తీసుకోకుండా మా తెలుగు lexicon టీమ్ పనిచేసింది. ప్రారంభంలో ఈ లెక్సికాన్ టూల్‌తో ఎలా పనిచేయాలో, సరైన రూపంలో పద వ్యుత్పత్తి రూపాలను ఎలా రూపొందించాలో తెలియక పని మందగించిపోయింది. పలితంగా చివర్లో లీవు లేకుండా పనిచేయవలసి వచ్చింది.

ఒక అరుదైన  రికార్డు సాధించామన్న పేరు రావడం.. 90 శాతం వరకు తెలుగు నామవాచక, క్రియాపదాలను ఈ టూల్‌తో ఒడిసిపట్టామన్న గర్వం మాకు మిగలడం. మా ప్రమోషన్, శాలరీ హైక్ వంటివి పెరగడానికి ఈ పని దోహదం చేయడం జరిగిందనుకోండి. తీరా చూస్తే మైక్రోసాఫ్ట్ ఈ రెండున్నర కోట్ల పదాల, పదరూపాల లెక్సికన్ ప్రాజెక్టును అటకెక్కించేసింది. వ్యక్తులుగా మాకూ, సంస్థగా మైక్రోసాప్ట్‌కూ, తెలుగు సమాజానికి కూడా ఏ రకంగా కూడా ఈ బృహత్తర పనివల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఇది వేరే విషయం. కాని మనుషులుగా మేం కోల్పోయిందేమిటి?

ఇలా మనుషులను పది గంటలపాటు, పద్నాలుగు పదహారు గంటల పాటు రొడ్డ కొట్టుడు పనిచేయిస్తే మనుషులు ఎలా మిగులుతారో, ఏమైపోతారో, వారి చుట్టూ అల్లుకున్న కుటుంబ, మానవీయ సంబంధాలు ఎలా అదృశ్యమవుతాయో చెప్పవలసిన పనిలేదు. ఇంత పని ఎవరు చేయమని చెప్పారు అని ఎవరైనా నిలదీయవచ్చు. మేం కాకపోతే మరొకరు ఈ పని చేస్తారు. ఆధునిక పెట్టుబడిదారీ విధానం కూడా తనకు అవసరమైన కార్మిక శక్తిని రిజర్వుగా పెట్టుకోవడంలో పనిచేయలేని, పని చేయనని మొరాయించే కార్మికులను తొలగించి వారి స్థానాన్ని రిజర్వు కార్మికులతో భర్తీచేయడంలో ఆరితేరిపోయింది.

పెట్టుబడిదారీ వ్యవస్థ వికసిస్తున్న కాలంలో తొలి తరం ప్యాక్టరీల్లో, గనుల్లో పిల్లలను, పెద్దలను కూడా పదహారు గంటలపాటు పనుల్లోకి దింపి యజమానులు సాగిస్తున్న అమానుష దోపిడీని బూర్జువా వర్గ ప్రతినిధులే ఖండించక తప్పని అనివార్య పరిస్థితుల్లో, పదహారు గంటల పనివిధానంలోని అమానుషత్వాన్ని బలంగా ఎత్తిచూపి 8 గంటల పనివిధానాన్ని నాటి సమాజంలో అమలుచేయాలని కోరిన వాడు కారల్ మార్క్స్. ఇది సామాజిక ఆమోదం పొంది చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎనిమిది గంటల పని విధానం 20 శతాబ్దిలో ఉనికిలోకి వచ్చింది.

కాని ఇప్పుడు జరుగుతున్నదేమిటి? సమాజం మొత్తంగా పోరాడి సాధించుకున్న 8 గంటల పనివిధానం ఇవ్వాళ తలకిందులైపోయింది. “టెక్నాలజీ పెరిగితే, పని తగ్గి మనిషి సుఖపడాలి. జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి.” అనే మనిషి ఆశ, ఆశయం సరిగ్గా తలకిందులైపోయి ఆఫీసులో, ఇంట్లో కూడా పనిని గురించే ఆలోచించవలసిన భయానక పరిస్థితులు మనకళ్లముందే ఏర్పడిపోయాయి.

మా సీనియర్ ఒకరు మా సంస్థను వీడి అయిదేళ్ల క్రితం మరొక సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ప్రాసెస్ కంపెనీకి అధిక జీతంపై ఆశతో వెళ్లారు. రెండు నెలల తర్వాత మా అందరినీ కలవాలని మా ఆఫీసుకు వచ్చారు. ఎలా ఉంటున్నారు అని అడిగితే అయిదు పనిదినాలు, రెండు వారాంతపు సెలవులు అంటూ నిట్టూర్చారు. ఎందుకీ నిట్టూర్పు అని అడిగితే వచ్చే వారం ఆఫీసులో ఎవరి కొంపలు అంటుకుపోతాయో అని శని, ఆదివారాల్లో నిద్ర కూడా పట్టడం లేదంటూ వాపోయారు. ఇలాంటి పని ఒత్తిడి, ఉద్యోగ భయాలు అందరికీ ఇదే విధంగా వర్తిస్తున్నాయని కూడా చెప్పలేము. కాని సమాజం ఎన్నటికీ కోరుకోకూడని పని పరిస్థితులు వచ్చేశాయి.

కార్మికుడి అదనపు శ్రమసమయాన్ని, విశ్రాంతి సమయాన్ని కూడా పెట్టుబడిదారుడు ఉపయోగించుకుంటున్న క్రమంలోనే పెట్టుబడి పోగు పడుతోందని మార్క్స్ అప్పట్లో సూత్రీకరించాడు. ఇది ఈరోజుకీ వాస్తవంగా ఉందా లేదా తప్పుగా నిరూపించబడిందా అనేదే మన పరిశీలనాంశంగా ఉండాలి. మార్క్స్ చెప్పినదాంట్లో మార్క్సిజంలో పరిమితులు ఉంటే ఉండనివ్వండి. ఎవరి కొంపలూ మునగవు. కాని ఈరోజు సాఫ్ట్‌వేర్ కార్మికులు -వైట్ కాలర్ ఉద్యోగులే కావచ్చు- అనుభవిస్తున్న జీవిత విషాదాన్ని, అనవసర విషాదాన్ని మార్క్స్ ఆరోజే ఉత్పత్తి క్రమంలో పని పరిస్థితుల పునాదిగా ఊహించాడు. ఇది ఈనాటికీ నిరూపితమవుతున్న సత్యం.

మా పక్కవీధిలోని చాకలాయన రోజూ ఉదయం 7 గంటలకు కొట్టు తెరిచి సాయంత్రం 6 వరకు పనిచేస్తాడు. అది కూడా గొడ్డు చాకిరీయే అనుకోండి. తనకోసం, తన జీవిక కోసం ఆ గొడ్డుచాకిరీకి తలవంచే ఆయన సరిగ్గా రాత్రి 8 గంటలయ్యేసరికి భోజనం ముగించుకుని కొట్టు ముందు బల్లమీదే పడుకుని ఆదమరిచి నిద్రపోతుంటాడు. పదే పదే ఈ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు నాకు స్పురించేదొకటే. చీకూచింతా లేని ఈ చాకలాయన జీవితం గొప్పా లేదా ధనసంపాదన పేరుతో, బతకాలంటే పరుగుపందెం తీయక తప్పదనుకుంటూ ఒళ్లూ, మనసూ కూడా హూనం చేసుకుంటున్న మనలాంటి వారి జీవితం గొప్పా అని.

అమెరికా వాడో లేదా ఏ ఇతర ఔట్ సోర్సింగ్ దేశమో మీకు, నాకు పని అప్పగించి నిద్రపోతాడు. మనం నిద్రమానుకుని పనిచేసి వాడికి అప్పగించి తర్వాత పగటి పూట నిద్రపోతాము. ఇది నిజంగా ‘రాక్షస’ పని. మానవ శారీరక, సహజ ప్రక్రియలకు భిన్నమైన పనిపద్ధతులకు మనం అలవడుతున్నాము. చివరకు ఎవరికోసం అంటే మనకోసం కాదు. ఎవడికోసమో మన జీవితంలో ప్రకృతి సహజమైన నిద్రాసమయాన్ని ధ్వంసం చేసుకుని భార్య పగలూ, భర్త రాత్రీ పనిచేసే పరిస్థితుల్లో కూరుకుపోతున్నాము. సింపుల్‌గా చెప్పాలంటే చాకలాయన నేటికీ తన కోసం మాత్రమే తన పనిచేసుకుపోతున్నాడు. మనం వ్యాపారుల కోసం, కంపెనీల కోసం పనిచేస్తూ జీవితం నుంచి పరాయీకరణ పాలవుతున్నాము.

“….in proportion as the use of machinery and division of labour increases, in the same proportion the burden of toil also increases, whether by prolongation of the working hours, by the increase of the work exacted in a given time or by increased speed of machinery, etc”

అందుకే మార్క్సిజంలోని పరిమితులను మనం తప్పక పరిశీలిద్దాము. కాని శ్రమవిభజన లక్షోపలక్షలుగా విస్తరించుకు పోతున్న క్రమంలో మనుషుల మీద పడుతున్న అనంత భారం గురించి మార్క్స్ నూటయాభై ఏళ్ల క్రితం కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చెప్పిన పై మంత్ర సదృశ వాక్యాలలోని సత్యాన్ని కూడా అంగీకరిద్దాము. దీనికి పరిష్కారాన్ని వెదికే క్రమంలోనే మనం విభేదించవచ్చు.

వ్యవసాయం గిట్టుబాటవుతున్న పరిస్థితులు ముప్పయ్యేళ్లకు ముందున్న విధంగా నేడు కూడా కొనసాగుతున్నట్లయితే నేను పల్లె విడిచి మహానగరాల దారి పట్టి ఉండేవాడిని కాదనుకుంటాను. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అనుభవంతో చెబుతున్నాను. కరెంట్ సక్రమంగా అంది, నీటి వనరులు సక్రమంగా లభ్యమై, కాసింత గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇచ్చే పరిస్థితులు పల్లెల్లో ఇప్పటికీ ఉంటే, నీ పంట నువ్వు పండించుకుని నీ కూరగాయలు నీవు పండించుకుని బతికే వ్యవసాయం కంటే గౌరవనీయమైన వృత్తి ఈ ప్రపంచంలో మరొకటుండదనే నా దృఢాభిప్రాయం.

కాని పైన చెప్పిన వాటిలో వేటికీ గ్యారంటీ కనబడని రోజుల్లో మా పెద్దవాళ్లు ‘సేద్యంతో బతకలేరు పోయి చదువుకోండిరా’ అని పట్టణాలకు తరిమారు. వ్యవసాయ రంగ దుస్థితిపై వాళ్ల అంచనా ఎంత సత్యభూయిష్టమైందో మనందరికీ తెలుస్తూనే ఉంది. అందుకే మనం ఇప్పుడిలా బతుకుతున్నాము.

బతకాల్సి వస్తోంది అంటే ఇంకా బాగుంటుందేమో..

ఈ టపాకు మూలమైన పూర్తి కథనంకోసం కింది లింకులో చూడగలరు.

ఇండియా లో సాఫ్ట్-వేర్ రంగం : where are we going?

RTS Perm Link


5 Responses to “తొమ్మిది గంటలతోనే అంతమవుతున్న నరకం”

 1. భాస్కర రామి రెడ్డి on December 19, 2011 10:37 PM

  రాజశేఖర రాజు గారూ,

  మీ టపాలో తెలుగు లెక్సికాన్ మీద చాలా విలువైన సమాచారం కనిపిస్తుంది. మీకభ్యంతరం లేకపోతే మీ ఫోను నెంబరును నాకు మైల్ చెయ్యగలరా?

  అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళు అటకెక్కించిన పదాలు ఎక్కడైనా దొరుకుతాయేమో ( బ్యాకప్ ) తెలిసే అవకాశమేదైనా వున్నదేమో చెప్తారా?

 2. chandamama on December 19, 2011 11:56 PM

  భాస్కర రామిరెడ్డి గారూ,

  నమస్తే,
  క్షమించాలి. చాలా ఆలస్యంగా చూస్తున్నాను. నా ఫోన్ నంబర్
  7395018409
  చెన్నయ్

  మైక్రోసాఫ్ట్ వాళ్లు అటకెక్కించిన పదాలు ఎక్కడా దొరికే అవకాశం లేదనుకుంటానండీ. అది మా పాత సంస్థ వెబ్‌దునియా వద్ద బ్యాకప్ అయి ఉంటుంది. ఒరిజినల్ ఫైల్ మైక్రోసాఫ్ట్ డంప్‌లో ఉంటుంది. కాని అప్పట్లో ఇంట్లో కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పదాలు సేకరిస్తూ, టూల్ ఉపయోగిస్తూ పని చేసేవాళ్లం కాబట్టి నా కంప్యూటర్‌లో నాలుగేళ్ల క్రితం స్టోర్ చేసిన ఫోల్డర్లలో ఉండవచ్చు. కాని ఆ సాఫ్ట్ వేర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాతే మేం అప్పట్లో జనరేట్ చేసిన పదాలు, పదరూపాలు ఆ టూల్‌లో కనబడే అవకాశం ఉంటంది. ఆ టూల్ సరిగా పనిచేయాలంటే 2005లోనే మా కంపెనీ సిస్టమ్‌లకు 2 GB మెమరీని అందజేసారు. అప్పట్లో మార్కెట్లోకి వచ్చిన కొత్త ప్రాసెసర్ కూడా ఇచ్చారు.

  ఆ ప్రాజెక్టులో నేను తెలుగులో క్రియాపదాలను సేకరించి వాటి పదరూపాలను వ్యుత్పత్తి చేసే పనిలో ఉండేవాడిని. తెలుగు మూల క్రియాపదాల సేకరణలో నాకు ఈనాడు, ఆంద్రజ్యోతి, పేపర్లతో పాటు పీకాక్ క్లాసిక్స్ వారు అప్పట్లో ప్రచురించిన జాక్ లండన్ పుస్తకం ‘అడవిపిలిచింది’ అద్బుతంగా ఉపయోగపడిందనుకోండి. దాని అనువాదం సహవాసి గారనుకుంటాను. ప్రాజెక్టు పనిలో ఉంటూ ఓ అరుదైన కుక్క కథ చదువుతారా అంటూ మా కొలీగ్ దుర్గారావు గారు ఆ పుస్తకం నాకు తెచ్చి ఇచ్చారు. 150 పేజల లోపు ఉన్న ఆ సంక్షిప్త రచనను ఉన్నపాటుగా చదివేశాను. ఈ నవల ఈనాటికీ వెంటాడుతోందనుకోండి.

  జాక్ లండన్ పూర్వ జన్మలో -అందంటూ ఉంటే- కుక్కగా పుట్టాడేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఒక కుక్క రోజూ వారీ జీవితాన్ని, అది తను నమ్మిన వారిపట్ల, మనిషి పట్ల చూపిన అపురూప విశ్వాసాన్ని జాక్ లండన్ నభూతో నభవిష్యత్ అన్నంత స్థాయిలో ఈ పుస్తకంలో రాశారు. బహుశా మీరు ఈ పుస్తకం చదివే ఉంటారు. చదువుతూ ఎంత ఉర్రూతలూగిపోయానంటే సరిగ్గా మేం చేస్తున్న ప్రాజెక్టుకు కావలసిన మూల పదాల సేకరణకు ఈ పుస్తకాన్ని కూడా ఉపయోగించాను. దాదాపు 2,500 మూల క్రియాపదాలను ఈ పుస్తకం నుంచి సేకరించాననుకుంటాను. ఆ ప్రాజెక్టులో భాగంగా తెలుగు క్రియాపదాలను 80 శాతం వరకు లెక్సికాన్ టూల్ ద్వారా సాధించినట్లు గుర్తు. అప్పట్లో తెలుగు పత్రికలు యూనికోడ్ ఫాంట్ లోకి రాలేదు కాబట్టి ఈనాడు ఫాంట్, ఆంద్రజ్యోతి వాడే శ్రీలిపి ఫాంట్‌ను యూనికోడ్ గౌతమి ఫాంట్‌లోకి కన్వర్ట్ చేసేందుకు మైక్రోసాప్ట్ రెండు గొప్ప కన్వర్టర్లను కూడా అందజేసింది. వాటిలో ఒకటి TBIL – ట్రాన్స్‌లిటరేషన్ బిట్వీన్ ఇండియన్ లాంగ్వేజెస్- ఈ కన్వర్టర్ శ్రీలిపి 900 ఫాంట్‌ని శ్రీలిపిలోనుంచి యూనికోడ్‌లోకి అద్భుతంగా మార్చేది. ఇది మీకు ఇప్పుడు కూడా ఆన్‌లైన్ లో ప్రీగా దొరుకుతుందనుకుంటాను. అవసరమైతే ప్రయత్నించండి. తర్వాత పత్రికలు కూడా యూనికోడ్ మార్గంలోకి రావడంతో ఇలాంటి కన్వర్టర్ల అవసరం ఇప్పుడంతగా లేదనుకోండి.

  కాని ఇప్పుడు కూడా శ్రీలిపి నుండి యూనికోడ్‌కి యూనికోడ్ నుంచి శ్రీలిపి కి అక్షరాలను మార్చే కన్వర్టర్ల అవసరం చాలానే ఉంది. శ్రీలిపి తయారీ సంస్తే తన ఎక్చేంజ్ యుటిలిటీ ద్వారా యూనికోడ్ నుంచి శ్రీలిపిలోకి మార్చే విధానాన్ని తన ఖాతాదారులకు -అంటే శ్రీలిపి లాక్ కొని వాడుతున్న వారు- అందించింది. ఇది అమోఘంగా పనిచేస్తుంది, అనూ కూడా ఇలాంటి సౌకర్యాన్ని తన ఖాతాదారులకు కల్పించిందనుకుంటాను. ఇక వెబ్‌దునియా సంస్థ కూడా శ్రీలిపి నుంచి యూనికోడ్‌కు ఫాంట్‌ని కన్వర్ట్ చేసే చక్కటి టూల్ ని అందిస్తోంది. బహుశా ఈ వివరాలన్నీ మీకు అంతగా ఉపయోగపడవేమో మరి.

  తెలుగులో ఇలా బృహత్ పదకోశాలను తయారు చేయడం పెద్ద ఎత్తున సాగుతోందనుకుంటాను. హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మిలినయన్ల కొద్దీ పదాలతో మెగా పదకోశాన్ని ఇప్పటికే తయారు చేసిందనుకుంటాను. -అక్కడ పనిచే్స్తున్న ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు గారిని సంప్రదిస్తే ఈవిషయంపై మరిన్ని వివరాలు అందడేయగలరు. విద్యుల్లేఖ పేరుతో వీరు గతంలోనే ఉచిత పుస్తకాలు ప్రచురించి ఆసక్తి కలవారికి అందజేశారు.- దీన్ని పరిభాషలో కార్పస్ -corpus- అంటున్నారనుకుంటాను. తమ ఉత్పత్తులను స్థానిక భాషల్లోకి పెద్ద ఎత్తున తీసుకు పోవాలనుకుంటున్న మల్టీ నేషనల్ కంపెనీలు ఆయా ప్రాంతీయ భాషల్లో తమ తమ పదకోశాలను పెద్ద ఎత్తునే రూపొందించుకుంటున్నాయి.

  ప్రస్తుతం గూగుల్ సంస్థ కూడా పెద్ద ఎత్తున తెలుగు పద సేకరణపై పడింది. గత సంవత్సరం పొడవునా గూగుల్ తన కార్పస్‌కోసం వికీపిడియాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా 20 లక్షల పైగా పదాలను అనువాదం చేయించి వాటిని తన కార్పస్‌లో కలుపుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వికీపీడియా బృహత్ వ్యాసాలను గత సంవత్సరం జూన్ నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు అనువదించే పనిలో నేనూ భాగం పంచుకున్నాను. అమ్మ ఒడి ఆదిలక్ష్మి గారు కూడా ఈ పనిలో కొంత కాలం భాగం పంచుకున్నారు. మా వంతుగా దాదాపు 2 లక్షల పైగా పదాలున్న వికీపీడియా వ్యాసాలను అనువదించి వారికి పంపాము. అదొక అద్భుతమైన పని అనుకోండి. సైన్స్, మెడికల్, చరిత్ర, లెక్కలు, క్రీడలు, బిజినెస్, ఐటీ, సినిమా, సాహిత్యం, సిద్ధాంత వ్యాసాలు, 20 వేల పదాలవరకు ఉండే బృహత్ వ్యాసాలు, ఇలా సమస్త రంగాలకు సంబంధించిన వికీ పీడియా ఆర్టికల్స్‌ని మేం అనువదించాము. రెమ్యునరేషన్ కూడా రెగ్యులర్‌గా ఉండటంతో ఆర్థికంగా కూడా అది మాకు కొంతమేరకు ఉపకరించింది.

  దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ గూగుల్ తన స్వంత కార్పస్ లేదా బృహత్ పదకోశాలను తయారుచేసుకుంది. ప్రపంచమంతటా ఈ ప్రక్రియ జరుగుతోందనుకుంటాను. గూగుల్ ట్రాన్స్‌లేటర్ టూల్‌కి కూడా ఈ పదకోశం బాగా ఉపయోగపడుతోందనుకుంటాను. కాని అది ఇంకా బాల్యావస్తలోనే ఉంది. పైగా మెషిన్ ట్రాన్స్‌లేషన్ యూరోపియన్ లాంగ్వేజెస్‌లో జరుగుతున్నంత సమర్థంగా ఇండియన్ లాంగ్వేజెస్‌లో సాధ్యపడదేమో అని సందేహాలు కూడా ఉన్నాయి. భారతీయ భాషా పద నిర్మాణాల్లోని సంక్లిష్టతలు కూడా దీనికి కారణమనుకుంటాను.

  మీరు నా ఫోన్ నంబర్ అడిగితే మీకు ఇలా సుత్తి వేయడం లేదు గదా.. క్షమించాలి.

  ఆలస్యంగా స్పందిస్తున్నందుకు అన్యధా భావించరని ఆశిస్తూ
  మీ
  రాజు.
  7395018409
  చెన్నయ్

  Thanks and Regards,

  K. Rajasekhara Raju,
  Associate Editor (Telugu) – Online
  Chandamama India Limited
  No.2 Ground Floor, Swathi Enclave
  Door Nos.5 & 6 Amman Koil Street
  Vadapalani, Chennai – 600026
  Phone : +91 44 43992828 Extn: 819
  Mobile : +91 7395018409/9884612596

  Email : rajasekhara.raju@chandamama.com
  Visit us at telugu. chandamama.com
  blog : blaagu.com/chandamamalu

 3. Prasad on December 20, 2011 4:56 AM

  ధన్య వాదాలు రాజు గారు,
  ఈ తొమ్మిది పని గంటల రోజులు కంపెనీ రూల్స్ పరం గానే. ఎవరి పనిని బట్టి వారు పన్నెండు గంటలూ, పదిహేను గంటలూ కూడా పనిచేస్తూనే ఉంటారు, ప్రత్యేకం గా ఇండియా లో!

 4. రాజేష్ దేవభక్తుని on December 20, 2011 8:55 PM

  ఈ బహుళ జాతి సంస్థలు వచ్చి ఎంతైనా మన దేశంపైనా, జీవితాలపైనా ఎన్నో విదాలుగా విపరీతమైన, దారుణమైన మార్పు కలుగాచేసాయి. రాజు గారు చెప్పింది అక్షరాల నిజం, అయన చెప్పిన సౌలభ్యం ఉంటె వ్యవసాయాన్ని మించిన గౌరవప్రదమైన పని ఏముంది….? ఒప్పుకోవాల్సిందే..!

 5. chandamama on December 21, 2011 12:01 AM

  ప్రసాద్ గారూ,
  ధన్యవాదాలు.
  మీరన్నది అక్షరాలా నిజం.
  మీ బెంగుళూరులోనే శరవేగంగా సాగుతున్న భవన నిర్మాణాలకోసం సిమెంట్ ఇటుకలు తయారుచేసి అందించే ఒక చిన్న ఫ్యాక్టరీలో మా బావ మకుటం లేని మహారాజుగా సూపర్‌వైజర్ పని చేస్తున్నారు. కెఆర్ పురం ఆవలహళ్లి ప్రాంతంలో 3 కిలోమీటర్ల అవతల పల్లెలో ఈ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆయనకు నెలకు 7 వేల జీతం అయితే ఆయన కింద పనిచేస్తున్న కార్మికులకు ఒక్కొక్కరికి ఎంత లేదన్నా నెలకు 10 వేల రూపాయల జీతం వస్తుంది. ఇంతకన్నా తక్కువ వేతనాలు వచ్చే వారు కోట్లలోనే ఉంటారనుకుంటాను మన దేశంలో. మా బావ ఉదయం 7 గంటలకు ఫ్యాక్టరీకి పోతే రాత్రి 8 గంటలకు కాని రాడు. ఏదైనా ఇబ్బంది అయితే 10 గంటల దాకా ఫ్యాక్టరీలోనే ఉండాలి. ఆదివారం కూడా మధ్యాహ్నం వరకు ఫ్యాక్టరీకి పోవాలి.

  ఒక మాట చెప్పండి. దీన్ని గౌరవప్రదమైన మానవ జీవితమే అంటారా? ఇంటిలో వచ్చే ఘర్షణలకు తట్టుకోలేక జపాన్‌ కార్మికులు రోజుల తరబడి ఆఫీసులోనే ఉండి ఎక్కువ పని చేస్తారని రెండు దశాబ్దాల క్రితమే వార్తలు చదివాన్నేను. నిజంగా మన కాలం పెట్టుబడిదారులకు నిత్య పండుగల కాలం. మానవ శ్రమశక్తి ఇంత రెట్టింపు స్థాయిల్లో వాళ్లకు దొరకటం కన్నా ఏం కావాలి?

  నిజంగా ఇలాంటివన్నీ గతిలేక మనుషులుగా చెప్పబడుతున్న వారు చేస్తున్న పనులే.
  టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషికి విశ్రాంతి కాలం పెరగాలి. మరింత ఆహ్లాదకరమైన, ఆనందకరమైన జీవితం సమాజంలో వికసించాలి. కాని అలా జరుగుతోందా? మన కళ్లముందే సకల విధ్వంసాలూ జరిగిపోతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ఇద వ్యక్తుల లోపం కాదు. సమాజ పరిణామక్రమలో ఉత్పత్తి క్రమంలో, పనిపరిస్థితుల క్రమంలో ఏర్పడుతున్న పరిణామాలే.. దాన్ని మనం ఏ పేరుతో పిలుచుకున్నా సరే..

  ఇది మన ఇచ్ఛతో, మన ప్రమేయంతో, మన స్వచ్చంద అంగీకారాలతో జరుగుతున్న పని కాదు. ఆ పునాదిపై నడుస్తున్న జీవితమూ కాదు.
  కాదంటారా?

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind