అంపశయ్య మీద ఉన్న బాలసాహిత్యాన్ని రక్షించుకుందామా!!!

December 14th, 2011

ప్రియ మిత్రులకు అభివందనాలు,

మీకు భుజాన భేతాళుడిని చురకత్తిలాంటి చూపులతో మెలితిరిగిన కోరమీసంతో గంభీరంగా స్మశానంలోనుండి నడిచివెళ్తున్న విక్రమార్కుడు గుర్తున్నాడా?

మీకు ఒంటికన్ను రాక్షసుడు, అతనితో సాహసోపేతంగా యుద్ధం చేసి రాజకుమారిని ఆమె రాజ్యానికి తీసుకుని వస్తున్న సాహస వీరుడు గుర్తున్నాడా?

పోనీ మీకు మెలితిరిగిన తోకతో చూడగానే భయపెట్టేలా కాక ముద్దుగ అనిపిస్తూ, చెడ్డ అత్తగారి భరతం పట్టి మంచి కోడలికి సహాయం చేసిన అందమైన దెయ్యాలు గుర్తున్నాయా?

వీటిలో ఏ ఒక్కటి గుర్తున్నా మీరు చిన్నప్పుడు నాలాగనే ఖచ్చితంగా ఏ చందమామనో, బొమ్మరిల్లునో పదిలంగా దాచుకుని చదివిన అదృష్టవంతులు అయ్యి ఉంటారు. మరి మన ముందు తరం సంగతో ఇప్పటి పిల్లలకు బాల సాహిత్యం అంటే హ్యారీ పాటర్, టింటిన్, సిండ్రెల్లా మరోటో మరోటో మనది కాని సాహిత్యమే కానీ మనము గ్రోలిన రుచులు వారికేవి?

మంచి దెయ్యాల గురించి, సాహస వీరుల గురించి, భేతాళుడి గురించి వారికి తెలిసే అవకాశం ఎంత ఉంది, ఆ అవకాశం వారికి మనం ఎంతవరకూ ఇస్తున్నాము ఇంగ్లీషులో చదివితే గ్లోబల్ మార్కెట్ లో విలువ పెరుగుతుంది, నిజమే కానీ తెలుగులో అదీ వారి మాతృభాషలో అందమైన కథలున్నాయి, వాటిలో నీతితో పాటు బ్రతుకు మార్గాలు ఉంటాయని కానీ అసలు తెలుగులో కథలు ఇంత బాగుంటాయి అన్న అనుభవం కానీ వారికి మిగులుస్తున్నామా?

నా దృష్టిలో ఈ తరం పిల్లలు అత్యంత దురదృష్టవంతులు, మాతృ భాషలో మాట్లడటమే మహాపరాధంగా భావించే తల్లితండ్రులు, బడి యాజమాన్యాలు ఒకవైపైతే, మనసుని కట్టిపడేసే బాల సాహిత్యం అందుబాటులో లేకపోవటం మరొకవైపు. ఇప్పటి తరానికి ఆ లోటు ని పూడ్చటానికీ, ఆనాటి రుచులని అందించటానికి మొక్కవోని దీక్షతో నడుము కట్టారు రచన పత్రిక నిర్వాహకులు శాయి గారు.

ఈ బృహత్కార్యంలో భాగంగా ఆయన దాసరి సుబ్రమణ్యంగారు ఒకప్పుడు యువ, బొమ్మరిల్లు పత్రికలకోసం రచించిన అగ్ని మాల, మృత్యులోయ సీరియల్స్‌ను విడి సంపుటాలుగా ఈ యేడాది మొదట్లో మన ముందుకు తెచ్చారు. ఈ సారి అప్పట్లో ప్రమోద పిల్లల కథలో వచ్చిన కపాల దుర్గం సీరియల్ వచ్చే జనవరి నాటికి ప్రచురించబోతున్నారు.  అలాగే దాసరిగారు చందమామకు కాకుండా ఇతర పత్రికలలో రాసిన మరొక ఇరవై సీరియల్స్ ను లభ్యత మేరకు మన ముందుకు తెచ్చే మెగా ప్రాజెక్టు కు సిద్ధ పడ్డారు.

ఈ బృహత్కార్యం లో ఆయనకు తెలుగు భాష మీద బాల సాహిత్యం మీద మక్కువ ఉన్న అభిమానుల అండదండల అవసరం చాలా ఉంది. మనం చేసే ఏ చిన్న సహాయమైనా చాలా విలువైనదే.

మీకు వీలున్నంత వరకూ ఎంత చిన్న ఆర్ధిక సహయమైనా సరే అది మనం ఒక రోజు ఆటో ఎక్కితే ఖర్చయ్యేంత చిన్నదైనా, ఒక రోజు ఏ పిజా హట్ కో వెళ్ళి సంబరాలు జరుపుకున్నంత పెద్దదైనా, మీకు తోచిన సహాయం అందించి ఈ కార్యాన్ని విజయవంతం చేయండి. బాల సాహిత్యాన్ని బ్రతికించండి.

ఈ లేఖని చదివి చెత్త బుట్ట లో కి నెట్టివేయకుండా మీకు తెలిసిన నలుగురు మిత్రులకి పంపండి. మనం నిత్యం ఎన్నో స్పాం లేఖలని పేరు పేరునా ఎందరో మితృలకి పంపుతాము, దానివల్ల ప్రయోజనం ఉన్నా లేకపోయినా. ఈ లేఖ చదివి ఏ కొంతమంది స్పందించినా మన భావి తరానికి చక్కటి సాహిత్యాన్ని వారు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా బహుమతిగా అందించిన వారము అవుతాము. ఆసక్తి ఉన్నవారు వాహిని బుక్ ట్రస్ట్ (vahini book trust)పేరిట చెక్ పంపించగలరు

స్పందించిన ప్రతివారికీ ముందస్తుగానే కృతజ్ఞతలు తెలుపుతూ

మీ నేస్తం
సాయి లక్ష్మి కోరాడ.

నేనెవరు

నేను వృత్తిరీత్యా సాంకేతిక నిపుణురాలిని, ప్రవృత్తి రీత్యా పుస్తకాభిమానిని, స్వస్థలం భాగ్యనగరం. నాతరం పిల్లలు చాలా మందిలాగానే తెలుగులో పుట్టి, పదవ తరగతి వరకూ తెలుగు మాధ్యమంలో చదివి, ఆ తెలుగు తీయతనానికి ముగ్ధురాలినై తెలుగు సాహిత్యం మీద మక్కువ పెంచుకున్న సామాన్యురాలిని. తెలుగులో ఉత్తమ సాహిత్యం కరువైపోతోంది అని బాధపడుతూ కూర్చోకుండా నాకు చేతనైనంతలో ఏదైనా చేయాలి అని తాపత్రయ పడుతున్న పాఠకురాలిని, అంతే.

 

(“నాతరం పిల్లలు చాలా మందిలాగానే తెలుగులో పుట్టి, పదవ తరగతి వరకూ తెలుగు మాధ్యమంలో చదివి, ఆ తెలుగు తీయతనానికి ముగ్ధురాలినై తెలుగు సాహిత్యం మీద మక్కువ పెంచుకున్న సామాన్యురాలిని.”

సాయి లక్ష్మి గారూ,

తెలుగును, బాలసాహిత్యాన్ని కలకాలం బతికించే చిన్ని మాటలండీ ఇవి.

చందమామ పట్ల, ఉత్తమ సాహిత్యం పట్ల మీ అభిమానం, ఆదరణ కొనసాగుతుందని, ఇలాగే కొనసాగాలని మనసారా కాంక్షిస్తూ..

మీకూ, మిత్రులకూ హృదయపూర్వక కృతజ్ఞతలు.

రాజు)

రచన శాయి గారి చిరునామా, ఈమెయిల్, ఫోన్

Y.V.S.R.N. Talpa Sai
Rachana magazine
1-9-286/2/p
yadlapati vari illu
vidyanagar,
near to Ramnagar Gundu
hyderabad – 500044
040-27071500
040-27077599
99485 77517

Emails

rachanapatrika@gmail.com
rachanapatrika@hotmail.com

www.rachana.net

Vahini book trust, 1-9-286/3, Vidya Nagar, Hyderabad -500044

NB: ఈ కథనం ఈ బ్లాగులో ప్రచురించడానికి వెనుక నేపథ్యం గురించి కామెంట్ విభాగంలో చూడగలరు.

పెద్ద గమనిక: ఈ ఏడాది జనవరిలో దాసరి సుబ్రహ్మణ్యం గారి మృత్యులోయ, అగ్నిమాల, దాసరి గారి కథల సంపుటికి స్వచ్చందంగా ఆయన ఆభిమానులు తమ శక్తి మేరకు తోడ్పాటు నందించారు. ఈ ప్రకటన వీరికి సంబంధించినది కాదు. గతంలో తోడ్పాటు నందించిన వారిపై మళ్లీ భారం పెట్టడం తగదని శాయిగారి దృఢాభిప్రాయం.  వారు మినహా ఇతర బాల సాహిత్య అభిమానులకు మాత్రమే ఈ ప్రకటన వర్తిస్తుందని తెలియపరుస్తున్నాము.

రచనపై, శాయిగారిపై పడుతున్న అదనపు బారాన్ని కొంచెం తగ్గించినా చాలు అన్నదే ఈ ప్రకటన ఉద్దేశం.

 

RTS Perm Link


3 Responses to “అంపశయ్య మీద ఉన్న బాలసాహిత్యాన్ని రక్షించుకుందామా!!!”

 1. chandamama on December 14, 2011 6:58 AM

  రాజు గారికి,

  మీ విలువైన సమయం వెచ్చించి ఇంత విపులంగా జాబు రాసినందుకు కృతజ్ఞురాలిని. నిజమే మీరనట్టు మార్కెట్ లో బాలల భారతం, రామాయణం వంటి పుస్తకాలు చాలానే కనిపిస్తున్నాయి కాని వాటిలో ఉపయోగించిన భాష, చిత్రాలు అన్ని నాసి రకంగానే ఉన్నాయి. నా దృష్టిలో ఈ తరం పిల్లలు అత్యంత దురదృష్టవంతులు. మాతృభాషలో మాట్లాడటం నామోషీగా భావించే తల్లితండ్రులు ఒకవైపైతే మనసుని కట్టిపడేసే ఒక్క పుస్తకం కూడా లేకపోవటం మరొకవైపు. నా చిన్నతనంలో ప్రతి వేసంగి సెలవులకి స్థానిక గ్రంధాలయానికి వెళ్లి చదుకున్న పుస్తకాలు, అందులోని బొమ్మలు, భాషా, భావం అన్ని నా మనోఫలకంపైన చెరగని ముద్ర వేసాయి అన్నది అక్షరసత్యం. అలాంటి ఒక్క పుస్తకం నా భావి తరానికి అందించాలి అని ఎంత తాపత్రయ పడుతున్నా దొరకటంలేదే అని చాలా బాధ పడుతూ ఉంటాను. దాసరి గారి మృత్యులోయ, అగ్నిమాల నేను మా అమ్మాయికి పుట్టినరోజు బహుమతిగా ఇవ్వటమే కాదు దగ్గరుండి చదివిస్తున్నా కూడా. మీరన్నట్టు ఇవి మన వారసత్వ సంపద. ఎంత టెక్నాలజీ పెరిగినా మరొక తాజ్ మహల్ ని ఎలాగైతే ఇప్పటి తరం కట్టలేదో, అలానే ఉపిరి తీసుకోనివ్వని సాహిత్యాన్ని కూడా ఇప్పటి తరం అందివ్వలేదు, మాలో ఆ సృజనాత్మక శక్తి నశించిపోయింది అన్నది ఒక కఠోర సత్యం.

  వసుంధర కథలు అంటే ఎన్నో ఏళ్ళుగా చందమామలో వస్తున్నా కథలే, అవి భేతాళ కథల రూపంలో కాని మరేదైనా చిన్న కథల రూపంలో కాని వచ్చినవే. ఇవి మరుగున పడిపోకూడదు, ఇప్పటికే చందమామ పాత పుస్తకాలను దాచిపెట్టుకోలేకపోయామే అని ఎంతో బాధ పడుతున్న నాలాంటి వాళ్ళందరి కోరిక అనే అనుకోండి. ఆర్ధిక విషయాలకు వస్తే ఈ ప్రాజెక్ట్ మొదలు పెడితే చేయూతని అందించటానికి నాలాంటి అభిమానులు చాలా మందే ఉంటారు అన్నది నిజం. తలొక నీటి బొట్టు కలిసి మహాసముద్రం ఐనట్టు పదిమంది అభిమానులు కలిస్తే తప్పక విజయవంతం అవుతుంది, కాని మీరన్న కాపి రైట్ విషయాల గురించి నేను మాట్లాడలేను, ఈ విషయంలో నా పరిథి అల్పమే.

  రచన శాయి గారు కాని, స్వయంగా వసుంధర గారు కాని ఈ విషయంలో ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటే మా వంతు సహాయ సహకారాలు అందించటానికి మాలాంటి అభిమానులు ఎప్పుడు సిద్ధమే.

  మీ స్పందనకు మరొకసారి ధన్యవాదాలు

  సాయిలక్ష్మి
  ————————
  లక్ష్మిగారికి,
  ఆలస్యంగా మీ ఈమెయిల్‌కి సమాధానం పంపుతున్నందుకు క్షమార్హుడిని.
  “నా దృష్టిలో ఈ తరం పిల్లలు అత్యంత దురదృష్టవంతులు. మాతృభాషలో మాట్లాడటం నామోషీగా భావించే తల్లితండ్రులు ఒకవైపైతే మనసుని కట్టిపడేసే ఒక్క పుస్తకం కూడా లేకపోవటం మరొకవైపు.”

  నిజమైన విషాదమిది.

  “దాసరి గారి మృత్యులోయ, అగ్నిమాల నేను మా అమ్మాయికి పుట్టినరోజు బహుమతిగా ఇవ్వటమే కాదు దగ్గరుండి చదివిస్తున్నా కూడా.”

  కారుచీకట్లో కూడా కాంతిరేఖల వంటి మాటలివి.

  “ఇప్పటికే చందమామ పాత పుస్తకాలను దాచిపెట్టుకోలేకపోయామే అని ఎంతో బాధ పడుతున్న నాలాంటి వాళ్ళందరి కోరిక అనే అనుకోండి.”
  పాత చందమామలను ఎలాగూ ఇక పొందలేము. ఆన్‌లైన్ చందమామలో చదువుకోవడం తప్పితే.

  నాకు తెలిసి బాలసాహిత్య పరిషత్ చైర్మన్ శ్రీ దాసరి వెంకట రమణ గారి వద్ద మాత్రమే 1947 నుంచి 2011 వరకు అన్ని చందమామల కాపీలు ప్రింట్ రూపంలో ఉన్నాయి. పాత చందమామల సేకరణలో ఈయనకు ఎంత పిచ్చి ఉందంటే తన వద్ద లేని 1950ల నాటి చందమామ కాపీ కోసం ఆబిడ్స్‌లో పాత పుస్తకాల షాప్ ఓనర్‌కి వెయ్యిరూపాయిలు చెల్లించి, -ఒకే ఒక్క చందమామ కోసం- మరీ సొంతం చేసుకున్నారు. రూపాయి విలువ చేయని పాత చందమామకోసం వెయ్యి రూపాయలు చెల్లించడం. నమ్మశక్యం కాని నిజం.

  ఈయన రికార్డును ఎవరూ చెరుపలేరని ఇటీవలి వరకూ భావించాను. కాని ఈమధ్యే పరిచయమై చందమామకు కథలు రాసి పంపుతున్న నల్గొండ జిల్లాకు చెందిన యువ వైద్యురాలు డాక్టర్ సిరి (మాచర్ల శిరీష) గారు ఒక సందర్బంలో పాత చందమామను చేజిక్కించుకోవాలని పంతానికి పోయి ఒక చందమామకోసం మూడు వేల రూపాయలు చెల్లించి మరీ స్వంతం చేసుకున్నారట. ఆమె నుంచి ఈ మాట వింటూనే నా గుండె లయ తప్పిందనుకోండి. చందమామకోసం తిండి తిప్పలు చాలించి చదువుతూ పాతికేళ్ల వయసులో కూడా తల్లిదండ్రులనుంచి మందలింపులు పొందే అసంఖ్యాక పాఠకులలో ఈమె ఒకరు.

  “ఆర్ధిక విషయాలకు వస్తే ఈ ప్రాజెక్ట్ మొదలు పెడితే చేయూతని అందించటానికి నాలాంటి అభిమానులు చాలా మందే ఉంటారు అన్నది నిజం. తలొక నీటి బొట్టు కలిసి మహాసముద్రం ఐనట్టు పదిమంది అభిమానులు కలిస్తే తప్పక విజయవంతం అవుతుంది.”

  సాయిలక్ష్మి గారూ, నిజంగా కళ్లు చెమరుస్తున్నాయి మీమాటలకు. చందమామ కథల ప్రచురణ విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెడతాము. అది ఇప్పట్లో సాధ్యపడేది కాదు కనుక. కాని రచన పత్రిక సంపాదకులు శ్రీ శాయి గారు, ప్రతి సంవత్సరం దాసరి సుబ్రహ్మణ్యం గారి జానపద సీరియల్స్ -అంటే చందమామలో కాకుండా బొమ్మరిల్లు, ప్రమోద వంటి నాటి కథల పత్రికలలో ఆయన రాసిన 20 పైగా జానపద సీరియల్స్- ని ప్రచురించాలని దృఢసంకల్పంతో ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా ‘కపాలదుర్గం’ అని ప్రమోదలో దాసరి గారు రాసిన సీరియల్‌ను శాయిగారు ప్రచురిస్తున్నారు.

  సాహిత్యాన్ని కొని చదవడమే కష్టమైపోతున్న రోజుల్లో క్రమం తప్పకుండా పత్రికను తీసుకురావడమే గొప్ప అనుకుంటే ఇలాంటి సీరియల్స్‌ను కూడా ప్రచురించాలనుకోవడమే ఒక సాహసం. గత సంవత్సరం కూడా ఆయన దాసరి గారి రెండు సీరియల్స్ -మృత్యులోయ, అగ్నిమాల- ఆయన కథల సంపుటిని ఒకేసారి ప్రచురించి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. వాటి ముద్రణ కోసం దాసరి గారిపై ఉడతాభక్తిగా తమ శక్తిమేరకు ఆర్ధికంగా చేయూతనందించిన వారిని మళ్లీ ఇబ్బంది పెట్టకూడదన్న మొహమాటంతో ఆయన ఈసారి ఎలాంటి ప్రకటనా, సహాయం కోసం పిలుపులూ లేకుండానే తెగించి కపాలదుర్గం సీరియల్‌ని ప్రచురిస్తున్నారు.

  ఒకసారి సహాయం చేసిన వారినుంచి మళ్లీ తోడ్పడమని అడగడం బావుండదని ఆయన అభిప్రాయం. ఈ సంవత్సరం జనవరిలో ప్రచురించిన దాసరి గారి సీరియల్స్‌కు అప్పుడు కంట్రిబ్యూట్ చేసిన వారు మినహా ఇతరులు, ఆర్దికంగా సాయపడగలవారు ఎవరైనా స్వచ్ఛందంగా సహాయం చేయగలిగితే స్వీకరించడానికి అభ్యంతరం లేదని ఆయన చెబుతున్నారు. దాసరి గారి తొలి వర్థంతి సందర్బంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో 2011 జనవరిలో జరిగిన పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ మూడు పుస్తకాల ప్రచురణ ఖర్చులు వచ్చినా చాలు మళ్లీ కొత్త పుస్తకాల ప్రింటు చేయడానికి కాస్త ఊపిరి వస్తుందం’టూ చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి.

  ఇస్రోలో బంగారు బాతు లాంటి ఉద్యోగం వదులుకుని సాహిత్య పిచ్చితో రచన పత్రికను మొదలు పెట్టిన ఈయన ప్రస్తుత సమాజం దృష్టిలో నిజంగా పిచ్చివారే. కాని ఈ పిచ్చి సమాజానికి, సాహిత్యానికి అవసరం అనుకుంటే ఆ పిచ్చిలో మనం కాస్త పాలు పంచుకోవడం అవసరమే అనుకుంటాను.

  చందమామకు కాకుండా దాసరి గారు రాసి అప్పట్లో ప్రచురించిన 20 పైగా జానపద సీరియల్స్‌ను ఈ కాలంలో ప్రచురించ తలపెట్టడమే ఒక మెగా ప్రాజెక్టు లాంటిది. మీరు చందమామపై ఎంత అభిమానం చూపుతున్నారో మళ్లీ చెప్పనవసరం లేదు. కాని మానుండి చిన్న అభ్యర్థన ఏమిటంటే రచన శాయి గారు ఊపిరి పీల్చుకోవడానికైనా మీవంటి వారు కాసింత చేయూతనిస్తే బాగుంటుంది.

  కాబట్టి మీరూ, మీ స్నేహితులు చర్చించి ‘కపాలదుర్గం’ సీరియల్ ప్రచురణకోసం ఆర్థిక పరమైన చేయూతను వీలైతే అందించగలరని నా అభ్యర్థన.

  కాని ఒక్క మనవి. మీ అవసరాలకు పోనూ ఎంతో కొంత పంపగలగడం సాధ్యపడితేనే మీరు ఈ పనికి తోడ్పాటును అందించండి. దీంట్లో ఎలాంటి బలవంతం కాని, ఒత్తిడి కాని లేదని గ్రహించ ప్రార్థన.

  రచన శాయి గారి ఈమెయిల్, ఫోన్
  rachanapatrika@gmail.com
  099485-77517
  040-27077599

  చందమామ పట్ల, ఉత్తమ సాహిత్యం పట్ల మీ అభిమానం, ఆదరణ కొనసాగుతుందని, ఇలాగే కొనసాగాలని మనసారా కాంక్షిస్తూ..

  మీ
  రాజు.

 2. radha on December 14, 2011 12:36 PM

  I appreciate your work. Presenting CHANDAMAMA to children on their birthday is my hobby, more intention to make them enjoy the flavour of CHANDAMAMA. Thanks once again

 3. chandamama on December 14, 2011 11:42 PM

  పుట్టినరోజు పిల్లలకు చందమామను బహుమతిగా ఇవ్వడం.. మూడు తరాలుగా తెలుగు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ మంచి బహుమతిని క్రమం తప్పకుండానే ఇస్తూ వస్తున్నారు. నలభై ఏళ్ల క్రితం మేం కూడా ఇలా పెరిగినవాళ్లమే.. అమ్మా! ఆ ఉన్నత సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్న మీకు నమస్సుమాంజలి.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind