తొలి ‘చందమామ’ కథకులు ఇక మిగిలి లేరు

October 31st, 2011

శ్రీ అవసరాల రామకృష్ణారావు గారు

“తొలి చందమామ కథకులు ఇక ఎవరూ లేరండీ”

గత శుక్రవారం రాత్రి 10 గంటల వేళ రచన పత్రిక సంపాదకులు శ్రీ శాయి గారు ఉన్నట్లుండి ఫోన్ చేసి చెప్పినప్పుడు మ్రాన్పడిపోయాను. ముందయితే ఆయన ఏం చెబుతున్నదీ ఒక్క క్షణం అర్థం కాలేదు.  తట్టిన మరుక్షణం ‘అయ్యో, అయ్యో’ అనే ఒక్క మాట మాత్రమే నా నోట్లోంచి వచ్చింది. తొలి చందమామ అపరూప కథకులు శ్రీ అవసరాల రామకృష్ణారావు గారు ఇక లేరన్న మాటను శాయి గారు కాస్త మార్చి పై విధంగా చెప్పారు.

ఆయన్ను హైదరాబాద్‌లో కలిసి  10 నెలలయిందనుకుంటాను చందమామ జానపద  సీరియల్స్ రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన రచనలు మృత్యులోయ, అగ్నిమాల, స్వీయ కథలు ఆవిష్కరణ సభ సందర్భంగా తొలిసారిగా అవసరాల వారిని ఈ జనవరి చివరలో రవీంద్రభవన్‌లో కలిశాము. విశాఖపట్నంలో ఉన్న ఆయనను అంత దూరం నుంచి రప్పించిన వారు రచన శాయి గారు, దాసరి వెంకటరమణ గారు.

ఈ చిన్న పరిచయంతోటే తర్వాత ఆయన  తమ చందమామ జ్ఞాపకాలు, విజయమాల అనే రెండుపేజీల చిన్న కథను పంపారు. ‘రచన’ శాయి గారి సలహాతో వీటిని, 1947 తొలి చందమామ సంచికలో ప్రచురితమైన వారి మొట్టమొదటి కథ పొట్టి పిచుక మూడింటిని కలిపి ఈ సంవత్సరం జూలై సంచికలో చందమామ 64వ  వార్షిక సందర్బంగా చందమామ ప్రచురించి తన్ను తాను గౌరవించుకుంది.

తర్వాత కొన్ని నెలల విరామంతో ఆయన మరొక రెండు కథలు పంపారు. వాటిలో తొలి ప్రచురణగా ‘అవిశ్వాసం’ అనే ఉత్కృష్టమైన విలువల కథను ఈ డిసెంబర్ సంచికలో ప్రచురణకు స్వీకరించడమైంది.  కథ చూడగానే మనసుకు హత్తుకుపోయింది.

తల్లిదండ్రులు లేని పిల్లాడిని దశాబ్దాలపాటు తన వద్ద ఉంచుకుని తన షాపులో పెట్టుకుని ఆప్తబంధువులా చూసుకున్న ఒక యజమాని చివరకు తన ఇంట్లో విలువైన నగ పోయిందనిపించిన్పప్పుడు తన కింద పనిచేసే వాడే తీసుకుని ఉంటాడని అనుమానించి, ‘ఏదో ఒక బలహీన క్షణంలో నువ్వే తీసుకుని ఉంటావు. ఎవరికీ చెప్పనులే ఆ నగను నువ్వే తీసుకొచ్చి దాని స్థానంలో ఉంచు’ అని అక్కడినుంచి ఇంట్లోకి వెళ్లి  చూస్తే యజమాని వాడే దుప్పటి మడతల్లో ఆ నగ ఉంటుంది.  పొరపాటు గ్రహించి ఆ యజమాని తప్పునీది కాదు నాది అన్నప్పుడు అప్పటికే గుండె పగిలి ఇల్లు వదిలి పోతూన్న సేవకుడు  అంటాడొకమాట.

‘పొరపాటు మీది కాదు. నాది బాబుగారూ.. మీరేమో నన్ను దొంగ అనుకున్నారు. నేనేమో మిమ్మల్ని పెద్ద మనిషి అనుకున్నాను అంతే..

మానవ సంబంధాలన్నీ పరస్పర విశ్వాసం మీదే నడుస్తాయి.  అది చెదిరి మనసు విరిగితే మంచివాళ్లు మరక్కడ ఉండలేరు. ‘

చందమామలో పనిచేస్తున్న నా చిన్నిజీవితానికి రెండు మూడు సార్లు మాత్రమే ఫోన్ పలకరింపులతో ప్రేమాభిమానాలను ముద్దగా రంగరించి పరవశింపజేసిన అవసరాల రామకృష్ణారావు గారూ,  మీరు మాత్రమే రాయగల గొప్పమాటలవి.  మీరు మాత్రమే ముగించగల గొప్ప కథా ముగింపు ఇది.

‘మీరేమో నన్ను దొంగ అనుకున్నారు.నేనేమో మిమ్మల్ని పెద్ద మనిషి అనుకున్నాను…’

ఇంతకు మించి ఎవరినీ మారణాయుధంతో పొడవనసరం లేదు. ఇంతకు మించి మరెవ్వరినీ కత్తులతో కుళ్లబొడవనవసరం లేదు.. మనిషి మాటకున్న మహిమాన్విత శక్తిని ఇంతగా వ్యక్తీకరించిన గొప్ప వాక్యాన్ని ఇటీవల కాలంలో నేనయితే చూడలేదు.

మాస్టారూ! తొలి చందమామ కథ ‘పొట్టిపిచుక’లో మీరు పదిహేనేళ్ల వయసులో ప్రదర్శించిన ఆ విరుపు మిమ్మల్ని జీవితాంతం వదలిపెట్టలేదు. బహుశా మీరు రాసిన చివరి కథల్లో ఒకటై ఉండగల ఈ కథ -అవిశ్వాసం- కూడా విశ్వాసం చెదరడం అనే గొప్ప విలువను మహాకావ్య స్పురణతో చూపించింది.

తెలుగు సాహిత్యం ఎంత గొప్ప కథకుడిని పోగొట్టుకుందో బహుశా ఇప్పటికిప్పుడే ఎవరికీ అర్థం కాకపోవచ్చు. ఎంత గొప్ప విరుపుతో కూడిన రచనా శక్తిని మనం పొగొట్టుకున్నామో ఇప్పుడిప్పుడే మనకు బోధపడకపోవచ్చు. చివరకి ఇటీవలే ఆయన స్వాతి పత్రికలో రాసిన సరస రాహిత్యంతో కూడిన సరసమైన కథ భార్యాభర్తల సంబంధాల మధ్య ఘర్షణను,మారుతున్నసంబంధాలను కూడా కొత్త ధోరణితో ముగించి షాక్ తెప్పించింది.

‘అనుమతివ్వక పోతే అటాక్ చేయడం కూడా చేతకాని వాడు…’ అంటూ భర్తను భార్య కామెంట్ చేయగలగటం ఇంత వినూత్నశైలితో మీకు కాక మరెవ్వరికి సాధ్యమవుతుంది మాష్టారూ -స్వాతిలో వీరు రాసిన కొత్త కథ. కథ పేరు గుర్తు రావడం లేదు-

వయస్సు 80 సంవత్సరాలు దాటి ఉండవచ్చు కాని రాయకపోతే అనారోగ్యం అంటూ చెణుకుతూ అలసిన గుండె బాధను ప్రపంచానికి తెలియకుండా నవ్వించిన ఈ మాన్య వృద్ధ యువకుడిని ఎలా మర్చిపోగలం?

ఆయనతో నా చిన్ని పరిచయం ఎంత విషాదకరంగా ముగిసిందో ఊహించడానికే కష్టంగా ఉంది. గత శుక్రవారం సాయంత్రానికి డిసెంబర్ చందమామ సంచిక ఫైనల్ ప్రూప్‌ని ముగించి ఇంటికి వచ్చాను. మీ ‘అవిశ్వాసం’ కథ తప్పకుండా డిసెంబర్‌ నెలలోనే రాబోతుంది మాష్టారూ అంటూ ఆయనకు మంచి వార్త చెప్పి సంతోషపెట్టాలనుకున్నాను.

కాని “తొలి చందమామ కథకులు ఇక ఎవరూ లేరండీ”అంటూ సరిగ్గా గత శుక్రవారం రాత్రే రచన శాయి గారు ఫోన్‌లో చెప్పడం జీవితానికో దిగ్భ్రమ ఘటన.

నా ప్రపంచం గత 25 రోజుల పైగా  ఇంట్లో అంతర్జాలానికి, సిస్టమ్‌కు దూరమైపోయింది. తెలిసి కూడా ఏమీ రాయలేకపోయాను. ఇప్పుడు కూడా పూర్తిగా రాయడం సాధ్యపడక ఇంతటితో ముగిస్తున్నాను.

గత జూలై చందమామ సంచికలో చందమామ పత్రికతో తన బాంధవ్యం గురించి ఆయన అపురూపంగా పంచుకున్న మధుర జ్ఞాపకాలను పాఠకుల కోసం మళ్లీ ఇక్కడ ప్రచురిస్తున్నాము.

చందమామతో నా జ్ఞాపకాలు
-శ్రీ అవసరాల రామకృష్ణారావు

అప్పుడు నా వయసు పదహారు -1947-. ఇప్పుడు ఎనభై -2011-. అప్పుడంటే ఎప్పుడని?  చంద్రోదయమయినప్పుడు.అంటే తెలుగు పిల్లల అందాల మాసపత్రికగా చందమామ మొట్టమొదటి సంచిక వెలువడిన నాటి మాట. అందులో నే వ్రాసిన “పొట్టి పిచిక కథ” అచ్చవడం ఓ విధంగా నా సాహితీ ప్రస్థానానికి తొలి బీజం అవడం కన్న తీపి గుర్తు మరేముంటుంది! నాటి నా బాల్యంలో తొంగి చూసిన ఆ తొలికిరణపు రూపురేఖలే నేటి ఈ వృద్దాప్యంలో కూడా కొనసాగడం మించిన ఆశ్చర్యం, ఆనందం ఇంకేముందని!

అమ్మ చెప్పిన కథే అయినా, అందరికీ తెలిసిన కథే అయినా, మంచి ప్రింటుతో చక్కని బొమ్మలతో వచ్చిన నాటి ఆ చందమామ లోని కథాంశం నా మనసుమీద ఇంప్రింటు చేసేసినట్లుంది! ఓ బడుగు జీవి తను కష్టపడి సాధించుకున్నది అది వేషమే ఔగాక, పోగొట్టుకుంటుంది. ఎంతమందినో కలుసుకుని, ఎవరూ కలిసిరాకపోయినా, పట్టుదల వదలక, చివరికి విజయం సాధిస్తుంది. అదీ ‘పొట్టి పిచిక కథ’ అదే నా విజయసూత్రం అవుతుందని ఆనాడనుకోలేదు!

వెయ్యి పైగా రచనలు చేసి, ఈనాటికీ తల వంచక, కలం దించక తెలుగు కథకుడిగా కొనసాగుతున్న నాకు వేగుచుక్క ఆ కథే కదా! పక్షులతో జంతువులతో మనుషుల్ని కలిపి సామాజికాంశాల్ని సరళంగా చెప్పవచ్చునని నేను నేర్చుకున్నది. చందమామ పత్రిక చలవవల్లనే. ‘గణిత విశారద’ అనే నవల రాసింది చందమామ పఠన స్పూర్థి తోనే. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి 1969లో బహుమతి పొందిన నా ‘అర్థమున్న కథలు’ పబ్లిషర్స్ చందమామ రక్తసంబంధీకులు ‘యువప్రచురణలు’ వారే. అంతేకాదు. నేను చలసాని-చక్రపాణి అవార్డు అందుకోడం కూడా తత్సంబంధమైన సత్సాంప్రదాయమే.

సైజుతో పాటు చురుకుతనంలో కూడా నాటి పొట్టి పిచిక లక్షణాలు ఇప్పటికీ నాలో మిగిలి ఉన్నాయని నా మీద నేను వేసుకునే సోకైన జోకు!

చందమామ కథ ఇచ్చిన ఊపుతో నేన్రాసి పుస్తక రూపంలో వచ్చిన పిల్లల రచనల గురించి ఇక్కడ చెప్పుకోడం అప్రస్తుతం కాదనుకుంటాను. ‘కేటూ డూప్లికేటూ’, ‘మేథమేట్రిక్స్’ మూడు భాగాలూ, ‘ఆంగ్రేజీ మేడీజీ’ ‘ఆంగ్రేజీ యమఈజీ’ ఇలా మరో అరడజనువరకు చిరు సరుకు దొరుకు.

నెలనెలా వెన్నెలలద్దుకుని, చకచకా సొగసులు సరిదిద్దుకుని, పదారుభాషల వారి కితాబులందుకుని భారతీయ పత్రికగానే కాక, అంతర్జాతీయ స్థాయిని చేరుకున్న చందమామ పుట్టింది మన భాషలోనే అని తలుచుకుంటే ఉప్పొంగని తెలుగు గుండె ఉండదు. కాలక్షేపం కథలతోనే సరిపెట్టుకోక శాస్త్రీయ పరిశోధనాత్మక వ్యాసాలూ, మెదడుకి మేతగా పోటీలూ, అన్యభాషలు నేర్పే ఏర్పాట్లూ– ఇవన్నీ కంటికి నదురైన రంగులతో, అచ్చుతో, అనువైన సైజుతో ఇక్కడ కాక మరెక్కడ దొరుకుతుందని! ఈ సంస్థ పుస్తకరూపంలో పిల్లలకందించే విజ్ఞాన వర్గకోశాలు ఎన్నెన్నని! ఇంతెందుకు ఇటీవల వీరు ప్రచురించిన చందమామ Art Book చూశారా! పదిహేనువందల ఖరీదు కాస్త ఎక్కువే అనిపించవచ్చు కాని అది అందించే శతకోటి అందాల మాట?

నా తొలి ప్రేమ చందమామ. వాక్రూప వర్ణార్ణవం…

ఈ నాటికీ కథాసుధల్ని వెదజల్లుతూ హాయిగా జీవించగలిగే నా మనోధృతికి నాటి చందమామే మదురస్మృతి!

RTS Perm Link


9 Responses to “తొలి ‘చందమామ’ కథకులు ఇక మిగిలి లేరు”

 1. M.V.Appa Rao on October 31, 2011 8:20 AM

  రాజశేఖరరాజుగారూ, ఏమిటో ఈ ఏడాది అన్నీ ఇలాటి విషాదవార్తలే వినవలసి వస్తున్నది. ఫిబ్రవరిలో ముళ్లపూడివారిని దూరం చేసుకున్న
  వార్త మరచి పోకముందే అవసరాల వారు స్వర్గస్తులయ్యారన్న వార్త పిడుగులా తాకింది. మీకు వీలుంటే “చందమామ” ప్రారంభ సంచిక
  facsimile ఎడిషన్ ప్రచురుణకర్తలు విడుదలచేయడానికి సలహా ఇవ్వగలరు. చందమామ అభిమానులు ఎంత ఖరీదైనా తాప్పక కొంటారని
  నా నమ్మకం.

 2. Prasad on October 31, 2011 11:24 AM

  సరైన నివాళి. ఇలా ఒక్కొక్క రత్నమూ రాలిపోతుంటే ఆత్రేయ గారు చెప్పిన, “పోయినోళ్ళందరూ మంచోళ్ళు”, అనే పలుకు గుర్తుకు వస్తూంది. “ఉన్నోళ్ళు మాత్రం పోయినోళ్ళ తీపి గురుతులు గా “, ఉండగలుగుతున్నారా..! అనిపిస్తుంది.

 3. Prasad on October 31, 2011 11:25 AM

  సరైన నివాళి. ఇలా ఒక్కొక్క రత్నమూ రాలిపోతుంటే ఆత్రేయ గారు చెప్పిన, “పోయినోళ్ళందరూ మంచోళ్ళు”, అనే పలుకు గుర్తుకు వస్తూంది. “ఉన్నోళ్ళు మాత్రం పోయినోళ్ళ తీపి గురుతులు గా “, ఉండగలుగుతున్నారా..! అనిపిస్తుంది.

 4. chandamama on October 31, 2011 11:33 PM

  ప్రసాద్ గారూ,
  “ఉన్నోళ్ళు మాత్రం పోయినోళ్ళ తీపి గురుతులు గా “, ఉండగలుగుతున్నారా..!
  మీ సందేహంలోనే సమాధానం కూడా దాగి ఉందనిపిస్తోంది.

  అప్పారావు గారూ,
  నాకు తెలిసి ఆయన నడకలోనే కాని, మాటల్లో మాత్రం చివరివరకు వృద్ధాప్య చ్ఛాయలు కనబడలేదు నాకు. రాయడం, పనిచేయడంలోనే ఆరోగ్యం ఉందన్న అతి గొప్ప రహస్యాన్ని చివరివరకూ చాటి చెప్పినవారాయన.

  “చందమామ” ప్రారంభ సంచిక facsimile ఎడిషన్ ప్రచురుణకర్తలు విడుదలచేయడం..” మీ అమూల్య అభిప్రాయాన్ని ఇప్పటికే రెండుసార్లు మా వాళ్ల దృష్టికి తీసుకుపోయాను. మరోసారి గుర్తుచేయగలను.
  స్పందించిన మీకు కృతజ్ఞతలు.

 5. వేణు on November 1, 2011 12:32 AM

  అవసరాల గారి జ్ఞాపకాలను జులై నెలలో ప్రచురించటం ద్వారా చందమామ ఒక మంచి పనిచేసింది. ఆయన తాజా కథ ప్రచురణ గురించి మీరు చెప్పి, ఆయన స్పందనను వినివుంటే నిజంగా ఎంతో బాగుండేది!

  అవసరాల గారు మీరన్నట్టే ‘చివరివరకూ వృద్ధాప్యచ్ఛాయలు’కు అతీతంగా జీవించారు. ఆయన వాక్యాల్లాగే ఉత్సాహం పరవళ్ళు తొక్కే జీవనశైలి ఆయనది!

 6. chandamama on November 1, 2011 5:27 AM

  వేణుగారూ, ‘అవిశ్వాసం’ కథను ప్రచురణకు తీసుకున్నట్లు మాస్టారు గారికి ముందె చెప్పాము. కాని ఏ నెలలో ప్రచురించబడుతుంది అన్నది చివరి లే అవుట్ పూర్తయ్యేంతవరకు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఇంతవరకు చెప్పలేదు.

  అయితే ఆయన అడిగిన ఒక కోరిక తీర్చలేకపోయాము. తాను ఎంతగానో మెచ్చుకున్న చందమామ ఆర్ట్‌బుక్‌ని ‘అంత పెట్టి కొనలేను కాబట్టి కాస్త తగ్గించి ఇవ్వగలరా’ అని నోరు తెరిచి అడిగారాయన. తప్పకుండా కనుక్కుని చెబుతాను అని మాట ఇచ్చాను కాని నిర్ణయం తీసుకోవడంలో లేటయింది. సకాలంలో నిర్ణయం జరిగి ఆయనకు కాపీ పంపి ఉంటే చాలా బాగుండేది. ఈ చిన్న కోరికను కూడా సరైన సమయంలో తీర్చలేకపోయామే అన్న బాధ ఇక వెంటాడుతుంది.

  ఆర్ట్‌బుక్‌ని ఆయన రచన శాయి గారి వద్దో లేదా దాసరి వెంకటరమణ గారి వద్దో చూశారనుకుంటాను. ఏదైతేనేం… ఆయన చివరి కోరికలలో ఒకటి తీరలేదు. చేయకూడని సమయాల్లో తాత్సారం చేసినప్పుడు మనుషులే మిగలకుండా పోతున్నారు.. చేతులు కాలితే గాని ఆకులు పట్టుకోవడం చేతకావడం లేదేమో మనకు.

  చందమామ సీరియల్స్ రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారికి ఆయన జీవితంలోని చివరి రెండు నెలలు చందమామను పంపలేకపోయాము. 1952లో చందమామలో చేరింది మొదలుకుని 2009 అక్టోబర్ వరకు ఆయన ఉద్యోగిగా, తర్వాత కూడా చందమామను చదువుతూనే వచ్చారు. తన జీవితంలో చివరి రెండు నెలలు మాత్రం చందమామ ఆయనకు దూరమైంది. ఇది తెలిసి చేసిన తప్పు కాదు. కాని ఆలా జరిగిపోయింది. ఇప్పడూ అంతే..

  మన కళ్లముందు కాంతిమంతంగా తిరుగుతూ ఉంటున్న వయో వృద్ధులు మనలను విడిచి పోలేరులే అనే విశ్వాసం మనకు కాస్త ఎక్కువే కాబట్టి ఇలా జరుగుతోందేమో మరి.

  పంచుకున్న మీకు ధన్యవాదాలు.

 7. M.Siva Ram Prasad on November 18, 2011 6:58 AM

  It is unbelievable that avasarala ramakrishna rao garu is no more with us in physical form but his spirit inspires us for ever. He is simple, measured in his talk and never boasted about himself. His wit and humor add charm and colour to his candid expressions. When I last met him in Sept.2011, he looked weak and changed. When asked to comment, he joked about himself that change is inevitable till death. Such is the personality of ARR. May his soul rest in peace in heaven.

 8. రాజశేఖర రాజు on November 20, 2011 3:55 PM

  శ్రీ శివరామ్ ప్రసాద్ గారూ,
  ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించాలి.
  మాలిక వెబ్ పత్రికలో మీ స్పందన కూడా చూశాను. మీ సహానుభూతితో పాలు పంచుకుంటున్నాను. మీరు తప్పక అవసరాలగారి గురించి మీ జ్ఞాపకాలను రాసి పంపండి. ఆలస్యం అవుతుందనుకుంటే ఈ బ్లాగులో కూడా మీ రచనను ప్రచురించవచ్చు. ఆయనతో మీ ఫోటో ఉంటే కూడా పంపగలరు. అది అవసరం. చందమామ పత్రికకు కూడా ఆయన గురించి లేఖ రాసి పంపగలరు. పాఠకుల పేజీలో దాన్ని ప్రచురించవచ్చు.

  రాజు.
  మొబైల్ 7305018409
  Emails:
  krajasekhara@gmail.com
  rajasekhara.raju@chandamama.com

 9. M.Siva Ram Prasad on December 5, 2011 11:41 AM

  Rajasekhara Rajugaru: Please refer our telephonic talk a few days ago. It was very nice talking to you, sharing our sentiments about Avasarala Ramakrishna Rao Garu. As advised by you I send the review about his novel, ‘Sampengalu Sannajajulu’ to Malika Patrika on 2.12.2011. The other article, my reminiscences about him is also ready. I will send copies of both to you through courier.
  Please tell me how to submit comment in Telugu.

  Regards, M.Siva Ram Prasad

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind