తొలి ‘చందమామ’ కథకులు ఇక మిగిలి లేరు

October 31st, 2011

శ్రీ అవసరాల రామకృష్ణారావు గారు

“తొలి చందమామ కథకులు ఇక ఎవరూ లేరండీ”

గత శుక్రవారం రాత్రి 10 గంటల వేళ రచన పత్రిక సంపాదకులు శ్రీ శాయి గారు ఉన్నట్లుండి ఫోన్ చేసి చెప్పినప్పుడు మ్రాన్పడిపోయాను. ముందయితే ఆయన ఏం చెబుతున్నదీ ఒక్క క్షణం అర్థం కాలేదు.  తట్టిన మరుక్షణం ‘అయ్యో, అయ్యో’ అనే ఒక్క మాట మాత్రమే నా నోట్లోంచి వచ్చింది. తొలి చందమామ అపరూప కథకులు శ్రీ అవసరాల రామకృష్ణారావు గారు ఇక లేరన్న మాటను శాయి గారు కాస్త మార్చి పై విధంగా చెప్పారు.

ఆయన్ను హైదరాబాద్‌లో కలిసి  10 నెలలయిందనుకుంటాను చందమామ జానపద  సీరియల్స్ రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన రచనలు మృత్యులోయ, అగ్నిమాల, స్వీయ కథలు ఆవిష్కరణ సభ సందర్భంగా తొలిసారిగా అవసరాల వారిని ఈ జనవరి చివరలో రవీంద్రభవన్‌లో కలిశాము. విశాఖపట్నంలో ఉన్న ఆయనను అంత దూరం నుంచి రప్పించిన వారు రచన శాయి గారు, దాసరి వెంకటరమణ గారు.

ఈ చిన్న పరిచయంతోటే తర్వాత ఆయన  తమ చందమామ జ్ఞాపకాలు, విజయమాల అనే రెండుపేజీల చిన్న కథను పంపారు. ‘రచన’ శాయి గారి సలహాతో వీటిని, 1947 తొలి చందమామ సంచికలో ప్రచురితమైన వారి మొట్టమొదటి కథ పొట్టి పిచుక మూడింటిని కలిపి ఈ సంవత్సరం జూలై సంచికలో చందమామ 64వ  వార్షిక సందర్బంగా చందమామ ప్రచురించి తన్ను తాను గౌరవించుకుంది.

తర్వాత కొన్ని నెలల విరామంతో ఆయన మరొక రెండు కథలు పంపారు. వాటిలో తొలి ప్రచురణగా ‘అవిశ్వాసం’ అనే ఉత్కృష్టమైన విలువల కథను ఈ డిసెంబర్ సంచికలో ప్రచురణకు స్వీకరించడమైంది.  కథ చూడగానే మనసుకు హత్తుకుపోయింది.

తల్లిదండ్రులు లేని పిల్లాడిని దశాబ్దాలపాటు తన వద్ద ఉంచుకుని తన షాపులో పెట్టుకుని ఆప్తబంధువులా చూసుకున్న ఒక యజమాని చివరకు తన ఇంట్లో విలువైన నగ పోయిందనిపించిన్పప్పుడు తన కింద పనిచేసే వాడే తీసుకుని ఉంటాడని అనుమానించి, ‘ఏదో ఒక బలహీన క్షణంలో నువ్వే తీసుకుని ఉంటావు. ఎవరికీ చెప్పనులే ఆ నగను నువ్వే తీసుకొచ్చి దాని స్థానంలో ఉంచు’ అని అక్కడినుంచి ఇంట్లోకి వెళ్లి  చూస్తే యజమాని వాడే దుప్పటి మడతల్లో ఆ నగ ఉంటుంది.  పొరపాటు గ్రహించి ఆ యజమాని తప్పునీది కాదు నాది అన్నప్పుడు అప్పటికే గుండె పగిలి ఇల్లు వదిలి పోతూన్న సేవకుడు  అంటాడొకమాట.

‘పొరపాటు మీది కాదు. నాది బాబుగారూ.. మీరేమో నన్ను దొంగ అనుకున్నారు. నేనేమో మిమ్మల్ని పెద్ద మనిషి అనుకున్నాను అంతే..

మానవ సంబంధాలన్నీ పరస్పర విశ్వాసం మీదే నడుస్తాయి.  అది చెదిరి మనసు విరిగితే మంచివాళ్లు మరక్కడ ఉండలేరు. ‘

చందమామలో పనిచేస్తున్న నా చిన్నిజీవితానికి రెండు మూడు సార్లు మాత్రమే ఫోన్ పలకరింపులతో ప్రేమాభిమానాలను ముద్దగా రంగరించి పరవశింపజేసిన అవసరాల రామకృష్ణారావు గారూ,  మీరు మాత్రమే రాయగల గొప్పమాటలవి.  మీరు మాత్రమే ముగించగల గొప్ప కథా ముగింపు ఇది.

‘మీరేమో నన్ను దొంగ అనుకున్నారు.నేనేమో మిమ్మల్ని పెద్ద మనిషి అనుకున్నాను…’

ఇంతకు మించి ఎవరినీ మారణాయుధంతో పొడవనసరం లేదు. ఇంతకు మించి మరెవ్వరినీ కత్తులతో కుళ్లబొడవనవసరం లేదు.. మనిషి మాటకున్న మహిమాన్విత శక్తిని ఇంతగా వ్యక్తీకరించిన గొప్ప వాక్యాన్ని ఇటీవల కాలంలో నేనయితే చూడలేదు.

మాస్టారూ! తొలి చందమామ కథ ‘పొట్టిపిచుక’లో మీరు పదిహేనేళ్ల వయసులో ప్రదర్శించిన ఆ విరుపు మిమ్మల్ని జీవితాంతం వదలిపెట్టలేదు. బహుశా మీరు రాసిన చివరి కథల్లో ఒకటై ఉండగల ఈ కథ -అవిశ్వాసం- కూడా విశ్వాసం చెదరడం అనే గొప్ప విలువను మహాకావ్య స్పురణతో చూపించింది.

తెలుగు సాహిత్యం ఎంత గొప్ప కథకుడిని పోగొట్టుకుందో బహుశా ఇప్పటికిప్పుడే ఎవరికీ అర్థం కాకపోవచ్చు. ఎంత గొప్ప విరుపుతో కూడిన రచనా శక్తిని మనం పొగొట్టుకున్నామో ఇప్పుడిప్పుడే మనకు బోధపడకపోవచ్చు. చివరకి ఇటీవలే ఆయన స్వాతి పత్రికలో రాసిన సరస రాహిత్యంతో కూడిన సరసమైన కథ భార్యాభర్తల సంబంధాల మధ్య ఘర్షణను,మారుతున్నసంబంధాలను కూడా కొత్త ధోరణితో ముగించి షాక్ తెప్పించింది.

‘అనుమతివ్వక పోతే అటాక్ చేయడం కూడా చేతకాని వాడు…’ అంటూ భర్తను భార్య కామెంట్ చేయగలగటం ఇంత వినూత్నశైలితో మీకు కాక మరెవ్వరికి సాధ్యమవుతుంది మాష్టారూ -స్వాతిలో వీరు రాసిన కొత్త కథ. కథ పేరు గుర్తు రావడం లేదు-

వయస్సు 80 సంవత్సరాలు దాటి ఉండవచ్చు కాని రాయకపోతే అనారోగ్యం అంటూ చెణుకుతూ అలసిన గుండె బాధను ప్రపంచానికి తెలియకుండా నవ్వించిన ఈ మాన్య వృద్ధ యువకుడిని ఎలా మర్చిపోగలం?

ఆయనతో నా చిన్ని పరిచయం ఎంత విషాదకరంగా ముగిసిందో ఊహించడానికే కష్టంగా ఉంది. గత శుక్రవారం సాయంత్రానికి డిసెంబర్ చందమామ సంచిక ఫైనల్ ప్రూప్‌ని ముగించి ఇంటికి వచ్చాను. మీ ‘అవిశ్వాసం’ కథ తప్పకుండా డిసెంబర్‌ నెలలోనే రాబోతుంది మాష్టారూ అంటూ ఆయనకు మంచి వార్త చెప్పి సంతోషపెట్టాలనుకున్నాను.

కాని “తొలి చందమామ కథకులు ఇక ఎవరూ లేరండీ”అంటూ సరిగ్గా గత శుక్రవారం రాత్రే రచన శాయి గారు ఫోన్‌లో చెప్పడం జీవితానికో దిగ్భ్రమ ఘటన.

నా ప్రపంచం గత 25 రోజుల పైగా  ఇంట్లో అంతర్జాలానికి, సిస్టమ్‌కు దూరమైపోయింది. తెలిసి కూడా ఏమీ రాయలేకపోయాను. ఇప్పుడు కూడా పూర్తిగా రాయడం సాధ్యపడక ఇంతటితో ముగిస్తున్నాను.

గత జూలై చందమామ సంచికలో చందమామ పత్రికతో తన బాంధవ్యం గురించి ఆయన అపురూపంగా పంచుకున్న మధుర జ్ఞాపకాలను పాఠకుల కోసం మళ్లీ ఇక్కడ ప్రచురిస్తున్నాము.

చందమామతో నా జ్ఞాపకాలు
-శ్రీ అవసరాల రామకృష్ణారావు

అప్పుడు నా వయసు పదహారు -1947-. ఇప్పుడు ఎనభై -2011-. అప్పుడంటే ఎప్పుడని?  చంద్రోదయమయినప్పుడు.అంటే తెలుగు పిల్లల అందాల మాసపత్రికగా చందమామ మొట్టమొదటి సంచిక వెలువడిన నాటి మాట. అందులో నే వ్రాసిన “పొట్టి పిచిక కథ” అచ్చవడం ఓ విధంగా నా సాహితీ ప్రస్థానానికి తొలి బీజం అవడం కన్న తీపి గుర్తు మరేముంటుంది! నాటి నా బాల్యంలో తొంగి చూసిన ఆ తొలికిరణపు రూపురేఖలే నేటి ఈ వృద్దాప్యంలో కూడా కొనసాగడం మించిన ఆశ్చర్యం, ఆనందం ఇంకేముందని!

అమ్మ చెప్పిన కథే అయినా, అందరికీ తెలిసిన కథే అయినా, మంచి ప్రింటుతో చక్కని బొమ్మలతో వచ్చిన నాటి ఆ చందమామ లోని కథాంశం నా మనసుమీద ఇంప్రింటు చేసేసినట్లుంది! ఓ బడుగు జీవి తను కష్టపడి సాధించుకున్నది అది వేషమే ఔగాక, పోగొట్టుకుంటుంది. ఎంతమందినో కలుసుకుని, ఎవరూ కలిసిరాకపోయినా, పట్టుదల వదలక, చివరికి విజయం సాధిస్తుంది. అదీ ‘పొట్టి పిచిక కథ’ అదే నా విజయసూత్రం అవుతుందని ఆనాడనుకోలేదు!

వెయ్యి పైగా రచనలు చేసి, ఈనాటికీ తల వంచక, కలం దించక తెలుగు కథకుడిగా కొనసాగుతున్న నాకు వేగుచుక్క ఆ కథే కదా! పక్షులతో జంతువులతో మనుషుల్ని కలిపి సామాజికాంశాల్ని సరళంగా చెప్పవచ్చునని నేను నేర్చుకున్నది. చందమామ పత్రిక చలవవల్లనే. ‘గణిత విశారద’ అనే నవల రాసింది చందమామ పఠన స్పూర్థి తోనే. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి 1969లో బహుమతి పొందిన నా ‘అర్థమున్న కథలు’ పబ్లిషర్స్ చందమామ రక్తసంబంధీకులు ‘యువప్రచురణలు’ వారే. అంతేకాదు. నేను చలసాని-చక్రపాణి అవార్డు అందుకోడం కూడా తత్సంబంధమైన సత్సాంప్రదాయమే.

సైజుతో పాటు చురుకుతనంలో కూడా నాటి పొట్టి పిచిక లక్షణాలు ఇప్పటికీ నాలో మిగిలి ఉన్నాయని నా మీద నేను వేసుకునే సోకైన జోకు!

చందమామ కథ ఇచ్చిన ఊపుతో నేన్రాసి పుస్తక రూపంలో వచ్చిన పిల్లల రచనల గురించి ఇక్కడ చెప్పుకోడం అప్రస్తుతం కాదనుకుంటాను. ‘కేటూ డూప్లికేటూ’, ‘మేథమేట్రిక్స్’ మూడు భాగాలూ, ‘ఆంగ్రేజీ మేడీజీ’ ‘ఆంగ్రేజీ యమఈజీ’ ఇలా మరో అరడజనువరకు చిరు సరుకు దొరుకు.

నెలనెలా వెన్నెలలద్దుకుని, చకచకా సొగసులు సరిదిద్దుకుని, పదారుభాషల వారి కితాబులందుకుని భారతీయ పత్రికగానే కాక, అంతర్జాతీయ స్థాయిని చేరుకున్న చందమామ పుట్టింది మన భాషలోనే అని తలుచుకుంటే ఉప్పొంగని తెలుగు గుండె ఉండదు. కాలక్షేపం కథలతోనే సరిపెట్టుకోక శాస్త్రీయ పరిశోధనాత్మక వ్యాసాలూ, మెదడుకి మేతగా పోటీలూ, అన్యభాషలు నేర్పే ఏర్పాట్లూ– ఇవన్నీ కంటికి నదురైన రంగులతో, అచ్చుతో, అనువైన సైజుతో ఇక్కడ కాక మరెక్కడ దొరుకుతుందని! ఈ సంస్థ పుస్తకరూపంలో పిల్లలకందించే విజ్ఞాన వర్గకోశాలు ఎన్నెన్నని! ఇంతెందుకు ఇటీవల వీరు ప్రచురించిన చందమామ Art Book చూశారా! పదిహేనువందల ఖరీదు కాస్త ఎక్కువే అనిపించవచ్చు కాని అది అందించే శతకోటి అందాల మాట?

నా తొలి ప్రేమ చందమామ. వాక్రూప వర్ణార్ణవం…

ఈ నాటికీ కథాసుధల్ని వెదజల్లుతూ హాయిగా జీవించగలిగే నా మనోధృతికి నాటి చందమామే మదురస్మృతి!

RTS Perm Link

చందమామలు బ్లాగ్ పునర్దర్శనం

October 21st, 2011

గత నెల 20వ తేదీ తర్వాత చందమామలు బ్లాగు మళ్లీ హఠాత్తుగా మాయమయింది. బ్లాగు.కామ్ -blaagu.com అప్‌డేషన్ జరుగుతున్నందున దీంట్లోని బ్లాగులు కనిపించడం లేదని త్వరలో వీటిని తిరిగి తీసుకువస్తామని నిర్వాహకులు అలర్ట్ చేశారు. నేను గమనించక ముందు కొద్ది రోజులు, గమనించిన  తర్వాత చాలా రోజులు సుషుప్తావస్తలో ఉన్న చందమామలు బ్లాగు సరిగ్గా నెలరోజుల తర్వాత నిన్నటి నుంచి మళ్లీ ఉనికిలోకి వచ్చింది.

నా బ్లాగ్ కనిపించడం లేదని బ్లాగు. కామ్ నిర్వాహకులకు మెయిల్ పెట్టిన తర్వాత వారు ఆలస్యంగా చూసుకున్నట్లున్నారు.  మెయిల్ చూడలేదని రెండు రోజుల్లోనే ఈ లోపాన్ని సరిచేయగలమని వారు చెప్పినట్లు సరిగ్గా రెండు రోజుల్లోపే ఈ బ్లాగు మళ్లీ యాక్టివేట్ అయింది.

నెలరోజులు బ్లాగ్‌తో, బ్లాగర్లతో సంబంధాలు కోల్పోయి తిరిగీ మీముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది.

ఇంటిలో సిస్టమ్ ఈ సమయంలోనే మొరాయించి మోడెమ్ పాడవడంతో కొత్తది తీసుకోవడం లేటవుతోంది. గత ఏడేళ్లుగా నిర్విరామంగా, రిపేర్ అన్నదే లేకుండా పనిచేసిన నా సిస్టమ్ కూడా ఈ సమయంలోనే మొరాయించేసింది. వీలైనంత త్వరలో ఈ సమస్యనుంచి బయటపడగలనని అనుకుంటున్నాను. అంతవరకు రెగ్యులర్ బ్లాగ్ అప్‌డేషన్లు బహుశా సాధ్యం కాకపోవచ్చు.

ఈ సాంకేతిక సమస్యలకు తోడు కొన్ని వ్యక్తిగత సమస్యలు – కుటుంబంలో  జ్వరాలు, మొబైల్ పోవడం. పాత నెంబర్ మీదే కొత్త సిమ్ తీసుకుంటే వొడాఫోన్ వారు ఉన్న కాస్తంత ఓపికకు కూడా పరీక్ష పెట్టి విసిగించడం వంటివి- కూడా ఒకేసారి తోడై బాగా ఇబ్బంది పెట్టాయి. నంబర్ పోర్టబిలిటీకోసం ప్రయత్నం జరుగుతోంది.  ఇలా  సినిమా కష్టాలు లాగా సమస్యలన్నీ ఒకేసారి రావడంతో కాస్త తేరుకునే క్రమంలో ఉన్నాను.

నా పాత మొబైల్ నంబర్ ని నంబర్ పోర్టబిలిటీ కింద మార్చుకుంటున్న ప్రక్రియ కాస్త ఆలస్యమ వుతోంది.  పాత నెంబర్ -9884612596- సరిగా పనిచేయడం మొదలయ్యేంత వరకు నా కొత్త నంబర్ -రిలయెన్స్- ని మిత్రుల సౌకర్యం కోసం ఇస్తున్నాను.

7305018409

ఈ రెండు నంబర్లూ నావిగానే ఉంటాయి – (మళ్లీ మొబైల్ పోయేంతవరకు)

రాజు

చెన్నయ్

వరుస సమస్యలతో.. నా మరో బ్లాగు ‘నెలవంక’ కూడా అప్ డేట్ కాలేదు

kanthisena.blogspot.com

మళ్ళీ అంతర్జాలంలోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది.

సినిమా కష్టాలు అని నవ్వుకుంటామే గాని కష్టాలు ఒకేసారి వస్తాయనడం నిజమే.. సినిమా కష్టాలు అని తీసిపారేయకూడదేమో…

RTS Perm Link