ఆదిలక్ష్మిగారు : చందమామ జ్ఞాపకాలు

September 20th, 2011

ఆపీసులో కూర్చుని పనిచేస్తుంటే కూడా ఆదిలక్ష్మి గారి కుటుంబ విషాద పరిణామాలు గుర్తుకొచ్చి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. ప్రస్తావనకు వస్తుంటేనే బాథ తన్నుకొస్తోంది. విషయం మా పైవాళ్లకు క్లుప్తంగా తెలిపి మౌనంగా ఉంటున్నాను. ఈ మౌనం కూడా నన్ను కాలుస్తోంది. భరించక తప్పదు.  వృత్తిగత సంబంధంలో ఎంత గొప్ప మేధో సాహచర్యం వారి కుటుంబంతో అబ్బిందో మాటల్లో చెప్పలేను. తల్చుకుంటేనే దుఖం దుఖంగా ఉంటోంది.

విషయం తెలియగానే చందమామ కార్యాలయంలో విషాద వాతావరణం. ఈ సెప్టెంబర్ నెల చందమామలో అచ్చయిన “తీపికి చేదు చెల్లుకు చెల్లు” కథ ఆమె రాసిందే అని చెప్పగానే అందరూ కదిలిపోయారు. చిన్న పిల్ల తెలిసీ తెలియని వయసులో తీసుకున్న అనూహ్య నిర్ణయం ఒక పచ్చటి కుటుంబం పునాదిని ఎంతగా కదిలించివేసిందో తల్చుకుంటూ బాధపడ్డారు. కార్పొరేట్ విద్య పెడుతున్న అపరిమిత ఒత్తిడి మాత్రమే కాకుండా పిల్లలను ఇంత సున్నితంగా మారుస్తూ, వారిని అవాంఛనీయ చర్యలవైపు కొట్టుకుపోయేలా చేసే ప్రథమ శత్రువు టెలివిజన్ అంటూ విమర్శించారు.

కష్టాలొస్తే ఉరి ఒక పరిష్కారం అనేంత భయంకరమైన రీతిలో టీవీలు ప్రదర్శస్తున్న సీరియల్స్, ఉరి తగిలించుకుంటున్న దృశ్యాలు పిల్లల సున్నితత్వంపై దెబ్బతీస్తున్నాయని ఫీలయ్యారు. పిల్లల విషయంలో ఎలా ఉండాలో, వారి మనస్సులో దాగి ఉన్న విషయాలను ఎలా బయట పెట్టాలో కూడా తెలియడం లేదంటూ తమ తమ అనుభవాలు పంచుకున్నారు.

చందమామ ఇటీవల సంపాదించుకున్న ఓ మంచి కథా రచయిత్రి ఆదిలక్ష్మిగారు. ఆన్‌లైన్ చందమామలో తన చందమామ జ్ఞాపకాలు ద్వారా ఆమెతో ఏర్పడిన పరిచయం తర్వాత కథకురాలిగా, అనువాదకురాలిగా బహు రూపాలలోకి విస్తరించింది. స్కేల్ పెట్టి కొలిచినట్లుగా అక్షరాలను ఎంత అందంగా ఆమె చెక్కుతారో. ఆమె 2010లో రాసి పంపగా ఆన్‌లైన్‌లో, ఈ బ్లాగులో ప్రచురించిన ‘చందమామ జ్ఞాపకాలు’ చూస్తే తెలుస్తుంది.

ఆమెకు కలిగిన తీరని కష్టానికి చలించిపోతూనే ఆమెగురించి తెలిసినవారికోసం, చందమామ పాఠకులకోసం ఆమె గతంలో పంపిన చందమామ జ్ఞాపకాలు ప్రచురిస్తున్నాము. తెలుగు అక్షరాలపై ఇంత పట్టు ఉన్న, ఇంత చక్కటి భావుకత, అద్వితీయ ఊహాశక్తి కలిగిన ఈ చందమామ కథకురాలి చందమామ జ్ఞాపకాలను ఇక్కడ ముందస్తు పరిచయంతో పాటు మరోసారి చూడగలరు.

పరిచయం:
‘చందమామ’ జ్ఞాపకాలకు సంబంధించి ‘అమ్మఒడి’ ఆదిలక్ష్మిగారిది ఓ వినూత్న అనుభవం. చిన్నప్పుడు నాన్న చదివి వినిపిస్తే తప్ప చందమామ కథను వినలేని అశక్తత లోంచి ‘నేనే చదువు నేర్చుకుంటే పోలా’ అనే పట్టుదలతో, స్వయంకృషి తోడుగా శరవేగంగా చదువు నేర్చుకున్న అరుదైన బాల్యం తనది. ఈ తీపి జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే ఇక్కడ కొద్దిగా విందాం..

నాన్నకి చదవటం వచ్చు కాబట్టి కదా చక చకా చదివేసాడు. మొదటి సారి ఇష్టంగా చదివేసేవాడు. మళ్ళీ చదవమంటే కుదరదనే వాడు.

అదే నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ – అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందింది. చదవటం రాక చందమామ బొమ్మలు పదేపదే చూసుకునే కొద్దీ పసి మనస్సు లోతుల్లో అక్షరాలు నేర్చుకోవాలనే తపన పెరిగింది.

వీధిబడిలో చేర్చగానే, ఇష్టంగా మారాం చేయకుండా అక్షరాలు నేర్చేసాను. పెద్ద బాలశిక్ష చాలా కొద్దీ రోజుల్లో పూర్తి చేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పటికే నాకు కథలు చదవటం వచ్చేసింది.

ఆ విధంగా చందమామ నాకు చదవటం నేర్పింది. చదువు కోవాల్సిన అవసరం నేర్పింది. చదువు నేర్పిన గురువుని గౌరవించటమూ నేర్పింది.”

గీతాప్రియదర్శిని

చందమామ ద్వారా చదవటం నేర్చిన, చదువు నేర్పిన గురువును గౌరవించడం నేర్చిన ఆదిలక్ష్మిగారు, ఒకప్పుడు నాన్నతో తను పొందిన అనుభవాన్ని తన పాపాయి నుంచి కూడా ఎదుర్కొన్నారట. చందమామ కథను ఒకసారి చదివి వినిపిస్తే మళ్లీ మళ్లీ వినాలి అనే కుతూహలంతో తప్పుల తడకగా చందమామ కథను చదివి నవ్వించే పాప గీతాప్రియదర్శిని, ఒకట్రెండుసార్లు చదివి ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్నిసార్లయినా చదివి వినిపిస్తాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేదట.

ఇదీ చందమామ ఘనత, చందమామతో బంధం అల్లుకున్న తరతరాల తెలుగు కుటుంబాల ఘనత. ఆదిలక్ష్మిగారు, ఆమె జీవన సహచరుడు, వారి పాపాయి దశాబ్దాలుగా నింగిలోని చందమామతో పాటు నేలమీది ‘చందమామ’తో కూడా చెలిమి కొనసాగిస్తున్నారు. నేలమీది ‘చందమామ’తో ఇటీవలి వరకు ప్రత్యక్ష సంబంధం లేని ఆదిలక్ష్మి గారు ఇటీవలే చందమామతో పరిచయంలోకి వచ్చారు.

నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… తాను పాఠాలు చెబుతున్న స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారూ… మీ చందమామ కుటుంబాన్ని చూసి చందమామ సిబ్బందిగా మేం గర్వపడుతున్నాం.

చందమామతో మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఆదిలక్ష్మి గారి చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠం ఇక్కడ చూడండి.
————–

అరచేతిలో అందాల చందమామ
ఆదిలక్ష్మి

బాల్యం నుండి ఇప్పటికీ చందమామ మా జీవితంలో ఓ భాగం. అక్షరాలు నేర్చుకోవాలన్న ఆకాంక్షని రేకెత్తించిందే చందమామ.

అమ్మఒడిలో కాళ్ళు చేతులు ఆడిస్తూ, స్వయంక్రీడా వినోదితమైన శైశవ దశలో, ఎవ్వరికైనా పంచభూతాలైన భూమి (మట్టి), ఆకాశం(చందమామ), అగ్ని (వెలిగే దీపం), గాలి, నీళ్ళు పరమ ఆకర్షణలు!

’అనగ అనగా ఓ రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు’ అంటూ కథ చెబితే ’ఊ’ కొట్టటం వచ్చిన నాటి నుండే ఆకాశంలోని చందమామతో పాటు అరిచేతిలోని చందమామా పరమ ఆకర్షణే!

రంగు రంగుల బొమ్మలు; ఒంటికొమ్ము రాక్షసులు, చింతచెట్టు దెయ్యాలు, మాయల మారి మాంత్రికులు, బుద్ది చెప్పే గ్రామాధికారులు, మంచి దారిలోకి మారిపోయే గజ దొంగలు…. ఎన్నో పాత్రలు! ఇతిహాసాలు నేర్పిందీ చందమామే!

విచిత్ర కవలలు జానపద కథలతో వింత లోకాలకి తీసి కెళ్ళిందీ చందమామే!

చిన్నప్పుడు…. అప్పటి కింకా బడిలో చేరలేదు. నాన్న ప్రతి నెలా చందమామ తెచ్చేవాడు. నాన్న చందమామ బిగ్గరగా పైకి చదవాలంటే, ఇద్దరు ఆయన కాళ్ళు పట్టాలి. ఒకరు ఆయన తల దగ్గర కూర్చొని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి మెల్లిగా మర్ధన చెయ్యాలి. అప్పుడు గాని బిగ్గరగా చదివేవాడు కాదు.

తల దగ్గర కూర్చొన్న వాళ్ళు, బొమ్మలు కూడా కనబడుతుండగా కథ వినవచ్చన్న మాట. ఎప్పుడూ నేనే నాన్న తల దగ్గర కూర్చొనే అవకాశం పొందేదాన్ని. నాన్న కథలన్నీ ఒకసారి చదివి పెట్టేవాడు. అంతే! మళ్ళీ మళ్ళీ చదవమంటే “మొన్నే చదివాను కదమ్మా!” అనేవాడు.

నాన్నకి చదవటం వచ్చు కాబట్టి కదా చక చకా చదివేసాడు. మొదటి సారి ఇష్టంగా చదివేసేవాడు. మళ్ళీ చదవమంటే కుదరదనే వాడు.

’అదే నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ – అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందింది. చదవటం రాక చందమామ బొమ్మలు పదేపదే చూసుకునే కొద్దీ పసి మనస్సు లోతుల్లో అక్షరాలు నేర్చుకోవాలనే తపన పెరిగింది.

వీధిబడిలో చేర్చగానే, ఇష్టంగా మారాం చేయకుండా అక్షరాలు నేర్చేసాను. పెద్ద బాలశిక్ష చాలా కొద్దీ రోజుల్లో పూర్తి చేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పటికే నాకు కథలు చదవటం వచ్చేసింది.

ఆ విధంగా చందమామ నాకు చదవటం నేర్పింది. చదువు కోవాల్సిన అవసరం నేర్పింది. చదువు నేర్పిన గురువుని గౌరవించటమూ నేర్పింది.

చందమామ బొమ్మలు చూసి ఏకలవ్వుడులా రంగుల్లో బొమ్మలు వేయటం నేర్చాను. నా అనుభవాలన్నీ మా వారితో పంచుకోబోతే తానూ మరికొన్ని అనుభవాలు చెప్పాడు. మా పాపని చూస్తే నా బాల్యం మరో సారి కళ్ళముందు కదలాడింది. (రంగుల్లో బొమ్మలతో సహా)

ఓ సారి చదివేసిన చందమామని, మళ్ళీ మా చేత చదివించుకునేందుకు, మా టక్కరి పాప చందమామ పట్టుకుని పక్కనే పడుకుని ఒక్కో పుట తిప్పుతూ తనకి అర్ధమైన కథని తప్పుల తడకగా చెప్పేది. “అలా కాదు నాన్నా! ఆ కథలో ఇలా ఉంది” అని పొరబాటున అన్నామో! అంతే…. “మళ్ళీ చదవవూ” అంటూ బతిమాలేది.

ఒకట్రెండుసార్లు చదివి ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్ని సార్లయినా చదువుతాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేది. “అయితే ముందు నువ్వే చదవటం నేర్చుకో!” అని అనటంతో అక్షరాలు అలవోకగా నేర్చింది.

అదీ చందమామ! అందాల చందమామ! అరచేతిలో చందమామ! కథలతో జీవితాన్ని అనుసంధానించి, భారతానికి రామాయణానికి భగవంతుడికీ దగ్గర చేసింది చందమామ. గురువుకి చెప్పినంత కృతజ్ఞత చందమామకీ చెప్పాలి!

మా విద్యార్ధుల్లో ఒకరి ఇంట్లో చందమామలు బైండింగ్ చేయించి మరీ గృహ గ్రంధాలయంలో దాచి ఉంచుకుంటే చూచి “అబ్బా! వీళ్ళెంత సంపన్నులో కదా!” అన్పించింది.

(నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారికి… చందమామతో తమ జ్ఞాపకాలను పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. సం.)

ఇది 2010 ఏప్రిల్ 9న చందమామ వెబ్‌సైట్‌లో, బ్లాగులో ప్రచురించబడిన కథనం.

తెలిసి తాను జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదని,  కానీ 18 ఏళ్లుగా కష్టాలమీద కష్టాలను ఎదుర్కొంటున్నానని ఆదిలక్ష్మిగారు మాటలో సందర్బంలో చెప్పేవారు.  ఎన్ని దెబ్బలు తగిలినా కోలుకున్నానంటే, నిబ్బరంగా సహిస్తున్నానంటే తాను నమ్మిన భగవద్గీతే కారణమని, అంతులేని కష్టాల్లో కూడా అనంత శక్తిని ఇస్తూ బతికిస్తూ వచ్చింది ఆ గీతాసారమే అని ఆమె పదే పదే అనేవారు.

ఎంత మంచి మనిషికి, ఎంత మంచి కుటుంబానికి ఇంత కష్టం తగిలింది?

RTS Perm Link


5 Responses to “ఆదిలక్ష్మిగారు : చందమామ జ్ఞాపకాలు”

 1. durgeswara on September 20, 2011 8:44 AM

  వారితో ప్రత్యక్షపరిచయం లేకున్నా
  ఈ బ్లాగులద్వారా ఆత్మీయులయ్యారు . వారికొచ్చినకష్టం శతృవులకుకూడా కలగకూదదు.
  పదేపదే వాల్లు గుర్తొచ్చి మనసు వికలమవుతుంది . వారిగూర్చి అడుగుతున ఫోన్ల్,బ్లాగు కామెంట్లు దుఃఖాన్ని ఎక్కువచెస్తుండటంతో నాబ్లాగులో ఆపోస్ట్ కూదా తొలగించాను. కానీ ఆత్మీయుల దుఃఖం నమలను అంతతేలికగా వదలదు కదా. మరలా ఇదిగో ! ఈ బ్లాగుద్వారా మరలా గుర్తుచేస్తున్నది .

 2. chandamama on September 20, 2011 11:44 AM

  దుర్గేశ్వర గారూ,
  ఒక మంచి వార్త ఇప్పుడే విన్నాను. ఆమె కోలుకుంటున్నారు. సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇంతకంటే ఏమీ చెప్పలేను. ఆమె చెప్పేది వినగలిగిన మనుషులు, ఆమె బాధను పంచుకోగలిగిన, ఆమె చేతులు పట్టుకుని ధైర్యం ఇవ్వగలిగిన మనుషులు కావాలిప్పుడు. హైదరాబాద్‌లో మన సుజాత గారి ఆధ్వర్యంలో ఈ ప్రయత్నాలు ఇప్పుడే మొదలవుతున్నాయి. ఆదిలక్ష్మిగారి బంధువులకు బయటి ప్రపంచానికి ఒకే ఒక వారధిగా సుజాతగారు ఉంటున్నారు. పదిమందిని కలుపుకుని ఆమెను కలవాలని, నిలబెట్టాలని తమ వంతు కృషి చేస్తున్న సుజాతగారి ప్రయత్నం ఫలించాలని మనస్పూర్తిగా కోరుకుందాం. కోల్పోయిన ఆశలు చిగురిస్తున్నట్లున్నాయి. కూతురును, భర్తను పోగొట్టుకున్న ఈ పిల్లల టీచర్‌ని ఇప్పుడైనా కాపాడుకుందాం.

 3. సుజాత on September 20, 2011 7:58 PM

  ఆధ్వర్యాలు,ప్రయత్నాలు వంటివి పెద్ద మాటలండీ రాజు గారూ! ఆమె కొద్దిగా కోలుకున్నాక నేను వీలున్నపుడల్లా వెళ్ళి కాసేపు మాట్లాడి, ఆమె చెప్పేది విని రావాలనుకుంటున్నా! అంతే!నాకు సాధ్యమైంది అంతవరకు!

 4. chandamama on September 20, 2011 9:34 PM

  మీ అభిప్రాయం సరైందే సుజాత గారూ, మీరు ఆమెను కలిశాక బ్లాగర్లు, ఇతరులు ఆమెతో ఫోన్‌ద్వారా అయినా మాట్లాడటానికి వీలుంటే ఆ ఏర్పాట్లు చేయండి. నాకు తెలిసిన లెనిన్ బాబుగారి మొబైల్ స్విచ్ఛాప్ అయిపోయినట్లుంది. ఆదిలక్ష్మిగారు దాన్ని ఉపయోగిస్తున్నారేమో తెలుసుకుని మాట్లాడాలనుకునేవారికి చెప్పగలరు.
  “ఆమె చెప్పంది విని రావాలనుకున్నా” ఈ రెండు నెలల్లో ఈ ప్రయత్నం మరికొంత విస్తృతంగా జరిగి ఉంటే బాగుండేది. కోలుకుంటారులే తర్వాత మాట్లాడవచ్చు అనే అందరూ ఉండిపోయారనుకుంటా. ఆ ఘటన జరిగిన తర్వాత మీ ద్వారా ఇప్పుడయినా ఇది జరుగుతోంది కాబట్టే అలా స్పందించాను.
  అందరికీ మంచివార్త మీరే చెప్పండి.

 5. ennela on September 20, 2011 11:21 PM

  mee Tapaa dwaaraa parichayamaina aadilakshmi gaaru tvaragaa kOlukOvaalani, sujata gaari prayatnam safaleekrutamavvaalani manaspoortigaa korukuntunnaa

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind