చందమామ కథల మునితో కబుర్లు!

September 7th, 2011

శ్రీ కోలార్ కృష్ణయ్యర్ గారు

చందమామ కథల రచయిత కోలార్ కృష్ణయ్యర్ గారు డిల్లీ వెళ్తారని తెలిసి ఇవ్వాళ -23-08-2011- సాయంత్రం రెండున్నర గంటలకు మా దంపతులు ఇరువురం ఆయనను బెంగుళూరులోనే కలవడానికి నిర్ణయించుకున్నాము. అంతకు ముందురోజు రాత్రి కావలినుంచి బస్సులో ప్రయాణించి రావడంతో బాగా అలసిపోయాము. కృష్ణయ్యర్ గారు కథల ప్రచురణ కోసం రేపు ఢిల్లీ బయలుదేరి రెండు నెలలు అక్కడే ఉంటానని చెప్పారు కాబట్టి అలసటగా ఉన్నా కలవాలనుకున్నాము. ఇంటివద్దనుంచి బయల్దేరి  నాలుగన్నర గంటలకు వారు ఇప్పుడు ఉంటున్న ఇల్లు చేరాము. బెంగుళూరులో ఆయన ఉన్న ప్రాంతం మాకు చాలాదూరం. మాది తూర్పు సరిహద్దు. వారిది పడమర సరిహద్దు. వారి కుమార్తె మధ్య మధ్యలో ఫోన్ చేస్తుంటే దారిచెప్పగా వారి ఇల్లు కనుక్కుని వెళ్ళాము.

పండుముసలి ఐనా పదేళ్ళపిల్లాడిలా -89 ఏళ్లు- ఆయన తమ అనుభవాలను, అనుభూతులను పంచారు. మావారూ చాలా సరదాపడి విషయాలన్నీ విని నన్ను కొన్ని నోట్ చేసుకోమన్నారు. కృష్ణయ్య గారి కధలపై ఎవరో పేరు చెప్పారు గానీ నేను పెన్ పుచ్చుకునేలోగా చెప్పడం ఐపోయింది. వారిని తిరిగి వెనక్కు తీసుకెళ్ళడం ఇష్టం లేక మౌనంగా ఉండి విన్నాను. – ఈ కథనం చివరలో అదనపు సమాచారంలో దీనిని చూడవచ్చు-

నేను “మీరు అన్ని కధల్లోనూ’ శిల్లంగేరి’ అనే పేరు ఎందుకని పెడతారు” అని అడగ్గా , కృష్ణయ్యగారు “మాపూర్వులు ఆనాటి ముస్లింల ధాటికి ఝడిసి సొంత ఊరినుండీ పారిపోయి కర్ణాటక ప్రాంతంలోని అయిదు ఊర్లలో తలదాచుకున్నారుట. వాటిలో ఒకటి శిల్లంగేరి. అది మేము నివసించిన ప్రాంతం’ అని అన్నారు.

“మరి మీ ఇంటిపేరు ‘కోలార్’ అని ఎందుకు వచ్చింది” అనే నా సందేహానికి  వారు “మానాయన గారు చదువుకోలేదు. నిరక్షరాస్యులు. నన్ను బడిలో చేర్పించడానికి వెళ్ళినపుడు పంతుళ్ళు ‘మీ అబ్బాయి పేరేమి’ అనగా ‘కృష్ణయ్య’ అని చెప్పారుట. మరి ఇంటి పేరేమి? అని అడగ్గా “మేము ఉండేది కోలార్‌లో’ అని చెప్పగా పంతుళ్ళు తన ఇంటిపేరు ‘కోలార్’ అని రాశారుట! అలా తమ పేరు కోలార్ కృష్ణయ్య అయిందని చెప్పారు.

వారి విద్యాభ్యాసం ఎక్కువగా అనంతపురంలోనే సాగిందట. ఇంకో తమాషా ఏమంటే వారు తెలుగు కాక కన్నడ మీడియంలో చదివారుట! ఎనిమిదవ వతరగతి వరకూ తెలుగే చదివారు కానీ, ఒకరోజున తెలుగు పంతులుగారు పరీక్ష పేపర్లన్నీ దిద్ది అందరికీ ఇస్తూ కృష్ణయ్య గారి పేపర్ మాత్రం ఇవ్వక, చివరగా పిలిచి, చెవి మెలివేసి “ఏరా మొద్దూ ! ప్రతివాక్యానికీ ముందు ‘సున్న’ పెడుతున్నావ్ ! సున్నతో వాక్యం మొదలెడతారా? తెలివితక్కువ గాడిదా!” అంటూ భుజంపై ఒక్కదెబ్బ వేశారుట.

దాంతో మన కృష్ణయ్య బాబుకు (అపుడు చిన్నవాడుకదా!) కోపం, పౌరుషం వచ్చి, వాళ్ళ నాన్నగారి వద్దకెళ్ళి ‘నేను తెలుగులో చదవను’ అని చెప్పాడట. అప్పటికే కన్నడ మీడియంలో పిల్ల్లలు తక్కువై ఆ సెక్షన్ ఎత్తేస్తారనే భయంతో ఉన్న ఉపాధ్యాయులకు అదొక బాసట! దాంతో కృష్ణయ్యగారి తండ్రివెళ్ళి మావాడు కన్నడంలో చదువుతాడనిచెప్పి “వెళ్ళి ఆ సెక్షన్ లో కూర్చోపో” అని చెప్పారుట.

అప్పటినుండీ కన్నడ మీడియంలోనే చదివారాయన. కానీ పెద్దయ్యాక నాలుగు వందల తెలుగు కధలు రాసి, పండిన పండితుడు మన కోలార్ కృష్ణయ్య. కన్నడ మీడియంలో చదివి తెలుగులో చిన్నపిల్లలకోసం కధలు కాయించిన కర్పూర కల్పవృక్షం కోలార్ కృష్ణయ్యగారు. ఆయన “మరి కన్నడంలో కధలు వ్రాయలేదా?” అన్న నాసందేహానికి ” కన్నడంలో కధలేవీ వ్రాయలేదని” చెప్పారు.

చదువంటేనే తెలీని వారి తండ్రికి ఇలాంటి కధల పండితుడు తన సంతానమంటే ఎంత ఆనందించారో! మరికొన్ని విషయాలు మాట్లాడాలంటే సమయం చాలలేదు. కృష్ణయ్యగారి సంతానం , మనుమలు మనుమరాళ్ళు ,మునిమనుమలు ,మునిమనుమరాళ్ళు  అంతా తాతగారి పుస్తకాలు చదువుతారుట! విదేశాల్లో ఉన్న తన సంతతిని అక్కడివారు ‘కోలార్ ‘ అనే పేరుతోనే పిలుస్తారని మురిసిపోతూ చెప్తున్న ఆ 89 ఏళ్ళ నవ్వుల ముని ఆక్షణంలో ఎనిమిదేళ్ళ పిల్లాడిలా అనిపించారు. -ఇతరదేశాల్లో ఇంటిపేరే అసలు పేరుగా పిలుస్తారు కదా-

కళాశాల చదువు పూర్తయి ప్రభుత్వోద్యోగాలూ, ఆపై తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం అయ్యాక ప్రస్తుతం పిల్లలందరి దగ్గరా కొన్నాళ్ళు గడపుతూ, తిరుగుతూ, తిరిగి చందమామకు కధలు రాస్తూ నవ్వుకుంటూన్న నాగరికుడీయన. తాను ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ రాసిన కధలను, కొందరు పబ్లీషర్స్ విజయవాడనుండీ, మద్రాసునుండీ -ఇంకా ఢిల్లీ అని చెప్పిన గుర్తు-  ప్రింట్ చేసి వెయ్యిరూపాయలు కొందరిస్తే, అచ్చంగా ఆరే ఆరుకాపీలు కొందరు ఇస్తారుట!

ఇల్లు వెతుక్కుంటూ మధ్య మధ్య ఫోన్ చేస్తున్నమమ్ము తీసుకెళ్ళడానికి వారి పెద్దమ్మాయి అనుకుంటా.. క్రిందికి వచ్చి అప్యాయంగా పలుకరించి దారిచూపారు. అక్కడ ఉన్నకాస్తంత సమయాన్నీ కోలార్ గారితో మాట్లాడి బంగారం తవ్వుకోవాలనే ప్రయత్నంలో ఆమె  పేరు సైతం అడగడం మరచాము.

ఇటీవలే మార్చి ఐదున అనుకుంటాను  కోలార్ గారి గృహలక్ష్మి వారికి శాశ్వతంగా దూరమైందని తెలిసి బాధేసింది. వారి అమ్మాయి “ఎన్నో ఏళ్ళ అనుబంధం కదా నాన్నగారు తట్టుకోడం కష్టం” అనిచెప్పారు. కోలార్ కృష్ణయ్యగారు అందుకేనేమో తమవద్ద ఉన్న ప్రింటైన తమ రచనలన్ని అందరికీ పంచుతున్నారుట! -ఆగస్టు చివరలో కలిసిన తమకే ఆయన పాతిక పుస్తకాలు ఇచ్చేశారని హైమవతి గారు చెప్పి ఆశ్చర్యపరిచారు-

తిరుపతిలో కుమారునివద్ద కొంతకాలం , మంగుళూర్ కుమారునివద్ద కొంతకాలం, బెంగుళూర్ కుమార్తెవద్ద కొంతకాలం, ఢిల్లీలో కుమారునివద్దకు ఈరోజే ప్రయాణమవుతున్నారుట, అందుకే మేము హడావిడిగావెళ్ళి చూసి, మాట్లాడి వారు ఎంతో అప్యాయతగా మాకోసం తిరుపతి నుండీ తెచ్చిన షుమారుగా పాతిక పుస్తకాలు మాకు అందించారు, మరోమారు తీరుబాటుగా ఒక్కరోజంతా కలసి కబుర్లు చెప్పుకుందాము ” అనిచెప్పారు. సాగనంపటానికి క్రిందివరకూ రాలేమనగా, వారికి నమస్కరించి శలవుతీసుకుని మేడదిగాం.

తిరిగి ట్రాఫిక్ జోరులో డ్రైవర్ కారు నడుపుతుండగా మేమిరువురం  కోలార్ గారి కబుర్లు చెప్పుకుంటూ రెండుగంటలతర్వాత ఇల్లు చేరాం–.

అన్నట్లు – కోలార్ కృష్ణయ్యగారు నిర్మొహమాటంగా – “చందమామలో కొన్నికధలు పిల్లలకోసం లాగా ఉండవు. పెద్దవారు చదువుతున్నప్పటికీ ‘ ప్రేమించడం, పెళ్ళిచేసుకోడం, దయ్యలూ పిశాచాలూ లాంటివి పిల్లలకు అర్ధం కాకపోగా భయంకలిగిస్తాయని నా అభిప్రాయం. కొన్నిడైలాగ్స్, మాటలూ కూడా పిల్లలస్థాయిని మించి ఉంటాయి.నాకు తెలుగు కాస్తే వచ్చును, అందువలన నేను ఉపయోగించే భాషకూడా పిల్లలస్థాయికి సరిపోతుంది. (దేవునికధలు చందమామలో వేయరు అనికూడా అన్నారు).” అని వ్యాఖ్యానించారు. తాము ఏఏ పిల్లల పుస్తకాలకు వ్రాశారో కూడా చెప్పారు. (చంపక్, గోకుల్ వంటివి).

ఆయనను కలవడానికి నాలుగు గంటలు పోనూ రానూ  కష్టం అనిపించినా ఒక తలపండిన తపస్వినీ, కధల మునినీ చూసి మాట్లాడామన్న తృప్తి సంతోషం మిగిలాయి.

కోలార్ గారితో కొంతసేపు కబుర్లివే-!

అదనపు సమాచారం
కృష్ణయ్యగారి కధలపై రీసెర్చ్ చేసిన వ్యక్తి ” మీకు కధలకు ప్లాట్స్ ఎలాదొరుకుతాయి? ఈకధ రాయాలని ఎలా తోస్తుంది? ” అని అడిగారుట. దానికి కృష్ణయ్యగారు ” ఏదైనా సంఘటన చూసినపుడో, విన్నపుడో  వచ్చిన ఆలోచనను తనదైన శైలిలో కధలా మలుస్తానని చెప్పారుట.”ఏ కధకైనా ఒక సందేశం ఉండాలి, లేక పోతే ఆ కధ వలన ప్రయోజనం ఉండదు.ఇటీవల కధలు ఉత్తిగా వ్రాస్తున్నారు తప్ప, ప్రయోజనం కనిపించడంలేదు.” అన్నారు.

వారు తాను చూసే ఒక సీరియల్ లో (ఆ ఒక్కటే మేమూ చూసే సీరియల్ కావడం తమాషాగా అనిపించింది) -మొగలిరేకులు- దాన్లో దేవి (ఒక కారెక్టర్) తమ కుటుంబానికి విరోధి ఐన వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడతానని చెప్తుంది. పెద్దలకు ఇష్టం లేక పోయినా అలాచేయడంవలన తమ రెండు కుటుంబాల చిరకాల విరోధం పోయి స్నేహం తిరిగి విరుస్తుందని ఆమెభావన. ఈ ఆలోచనతో ఒక కధ వ్రాశానని చెప్పారు.

“ఏమైనా డిస్ట్రిబ్యూటర్స్‌తో చాలాబాధ. ప్రింట్ ఐందాకా నమ్మకంలేదు.” అన్నారు. ఎంతైనా ఓపిగ్గా వ్రాస్తూ  డిస్ట్రిబ్యూటర్స్‌తో తంటాలు పడుతూ ఇంకా పుస్తకాలు ప్రింట్ కోసం తపిస్తున్న ఇప్పటికి 40పైగా పుస్తకాలు ప్రచురించారు. ఇంకా 60 పిల్లల పుస్తకాల కూర్పుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మహా మనీషికి మాతృభాషపట్ల, చిన్నపిల్లలకు మానవతా విలువలు నేర్పాలనే అభిలాష పట్ల ఉన్న మక్కువ ఎక్కువే!

వారు నాకు ఇచ్చిన తమ పుస్తకాలలోని కొన్ని క్యారెక్టర్స్ చారిత్రక, పురాణాలలోనివి ఇంగ్లీషులోకి అనువదించమని సూచించారు చూడాలి నావయస్సూ 65. ఆయనంత ఓపిక భగవంతుడు నాకూ ఇవ్వాలిగా! పైగా ఆయనలా డిస్ట్రిబూటర్స్‌తో ప్రింట్ కోసం తంటాలు పడటం నావల్ల అయ్యేపనికానే కాదు.

ఆదూరి హైమవతి.

(చందమామ సీనియర్ కథకులు శ్రీ కోలార్ కృష్ణయ్యర్ గారితో హైమవతి గారి కుటుంబానికి రెండు తరాల కథారూప పరిచయం ఉంది. గత 35 ఏళ్లకు పైగా వీరు ఈయన కథలు విడవకుండా చదవడమే కాకుండా తమ పిల్లలకూ కూడా వీరి కథలను పరిచయం చేశారట. ఈ కుటుంబం మొత్తానికి చందమామతో సుదీర్ఘ అనుబంధం ఉంది. కృష్ణయ్యర్ గారితో ప్రత్యేక అనుబంధం కూడానూ. మూడున్నర దశాబ్దాల తర్వాత ఈ చందమామ కథల మునితో పరిచయం కలిగే అవకాశం కోసం గత ఆరునెలలుగా ఈ కుటుంబం ఎదురు చూసింది. ఆయన తిరుపతిలో, బెంగుళూరులో, మంగుళూరులో తమ పిల్లల వద్ద గడుపుతూ రావడంతో సమయం కుదరలేదు. మొత్తంమీద ఆయన బెంగళూరు చిరునామా తీసుకుని అక్కడే కలియనున్నామని చెప్పడంతో కలిసిన తర్వాత వివరాలను రాసి పంపమని కోరాము. మరుసటి రోజే హైమవతి గారు ఆయనతో భేటీ వివరాలు రాసి పంపారు. కాస్త ఆలస్యంగా వీటిని ఇక్కడ ప్రచురించడమైనది. తెలుగు టీచర్ మందలించారనే కోపంతో తెలుగే చదవనని భీష్మించుకుని కన్నడ మాధ్యమంలోకి మారిపోయిన కృష్ణయ్యగారు తర్వాత నాలుగు వందల తెలుగు కథలు రాసి తెలుగు బాలసాహిత్యానికి తమదైన చేర్పునందించడం చూస్తుంటే హృద్యంగా అనిపిస్తోంది. ప్రస్తుతం కథల ప్రచురణ కోసం ఢిల్లీలో ఉన్న ఈయన అక్టోబర్ చివరలో తిరిగొస్తారు. జీవితం చివరి అంచులోనూ కథారచనను వదిలిపెట్టని ఈ రుషితుల్యుడితో మాట్లాడాలంటే దిగువ నంబర్లలో సంప్రదించవచ్చు.)

తిరుపతి    :   Land line : 0877-2251715
ఢిల్లీ           :   Mobile no: 09483321031 –ఇప్పుడు ఇక్కడే ఉన్నారు
బెంగళూరు: Land line: 080 23494065

 

ఆదూరి హైమవతి దంపతుల చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకులు చూడండి.

చందమామ చదవకుంటే?

 

‘చందమామ’ జ్ఞాపకాలతో వృధ్ధాప్యమూ పసితనమే…!!

RTS Perm Link


10 Responses to “చందమామ కథల మునితో కబుర్లు!”

 1. karthik on September 7, 2011 1:07 AM

  మంచి సమాచారానికి అనేక నెనర్లు..

 2. Prasad Bondalapati on September 7, 2011 5:54 AM

  రాజు గారు,
  చాలా ఆసక్తికరమైన కథనం. నిజమే, పుస్తకాలను ముద్రించుకోవాలంటే ఈ రోజుల్లో చేతి చమురు వదలకుండా ఉండే లా లేదు. ఇంకో విషయం..నేను ఇప్పటిదాకా మీ వయసు ఏ నలభై ఐదో యాభయ్యో అనుకొంటున్నాను.

 3. chendu.ca on September 7, 2011 10:12 AM

  కోలార్ గారి జీవితం గూర్చి హైమవతి గారు ఎంత వివరంగాచెప్పారు, ఆమె కృష్ణయ్యగారినికలిసి ఇంతవివరంగా ఆయన జీవిత వివరాలివ్వడం గొప్పే! ఆమెకూ ప్రచురించిన మీకు అనేకానేక వందన శతాలు.
  చెందు.

 4. chandamama on September 7, 2011 10:19 AM

  కార్తీక్ గారూ
  ధన్యవాదాలు.

  ప్రసాద్ గారూ,
  కృతజ్ఞతలు. ఇక్కడ మీరు ప్రస్తావించింది నా వయస్సు గురించేనా? మీ అంచనా దాదాపుగా దగ్గరగానే ఉంది. ఇక్కడ సందర్భం కాకపోయినప్పటికీ, నేనిప్పుడు 49లో పడ్డమాట వాస్తవమే.

  ఆదూరి హైమవతి గారు ఇప్పుడే మరికొన్ని విషయాలు చెప్పారు. అమెరికాలో ప్రస్తుతం చదువుకుంటున్న వారి అబ్బాయి ప్రసాద్‌కి తాము కోలార్ గారిని కలిసి మాట్లాడామని చెప్పగానే తను ఆశ్చర్యపోయాడట. ఎంతదృష్టమో మీది అని అన్నాడట. ‘అమ్మా ఇంతకూ ఆయన తన కథల్లో శిళ్లంగేరి ఊరును ఎందుకు వాడతారో అడిగావా’ అని అడిగి మరీ కనుక్కున్నాడట.

  నిజంగా కూడా ఆయన పేరు వెనుక నేపథ్యం, ఆయన కథల్లో పదే పదే వినిపించే శిళ్లంగేరి ఊరు నేపథ్యం మీద్వారానే తొలిసారిగా బయటపడింది హైమవతి గారూ, నిజంగా దీన్ని చందమామ చరిత్రకు ఒక అదనపు చేర్పుగానే భావించవచ్చు. కోలార్ గారిని కలవడమే కాకుండా వివరంగా రాసి పంపారు. మీ దంపతులకు ఇద్దరికీ హృదయవూర్వక కృతజ్ఞతలు.

  చెందు గారికి
  ఈ కథనం మీకూ నచ్చినందుకు చాలా సంతోషమండీ….!
  చందమామ

 5. Prasad Bondalapati on September 8, 2011 4:26 AM

  రాజు గారు,
  “నావయస్సూ 65. ఆయనంత ఓపిక భగవంతుడు నాకూ ఇవ్వాలిగా!”

  ఇక్కడ మీరు ఎవరి వయసు గురించి ప్రస్తావిస్తున్నారు?

 6. chandamama on September 8, 2011 6:01 AM

  ప్రసాద్ గారూ,
  నా వయస్సూ 65 అని చెప్పినవారు ఆదూరి హైమవతి గారు. కోలార్ గారిని కలిసిన క్షణాలను రాసి పంపించినవారు ఆమే. ఈ కథనం మొదట్లోనే ఆయనతో హైమవతి గారి భేటీ అనే అర్థం వచ్చేలా పరిచయం చేసి ఉంటే బాగుండేది. అదే గందరగోళానికి కారణమయిందనుకుంటున్నాను. ఈ పెద్ద కథనంలో చివరి పెద్ద పేరా మాత్రమే నాది.

  ఆదూరి హైమవతి అనే పేరు కింద బ్రాకెట్లలో ఉన్న సమాచారం మాత్రమే నేను పొందుపర్చాను. మిమ్మల్ని ఇంతగా గందరగోళపర్చినందుకు బాధగా ఉంది.

  ఇంతవరకు నేనయితే కోలార్ గారిని కలవలేదు. చందమామతో పని రీత్యా ఆయనతో మాట్లాడటమే తప్ప ప్రత్యక్షంగా కలవలేదు.

  “ఆయనంత ఓపిక భగవంతుడు నాకూ ఇవ్వాలిగా”

  చివరకు ఈ వ్యాక్యం కూడా నేనే ప్రయోగించాననుకున్నారా మీరు. అయ్యో.. హతోస్మి… ఈ వాక్యం నాదే అయితే మీతో నాకు ‘గొడవే’ లేదు మరి.

  ఏమయినా మిమ్మల్ని ఇంత గందరగోళానికి గురిచేశానన్నమాట. నాదే పొరపాటు.
  రాజు

 7. వేణు on September 8, 2011 11:40 PM

  చందమామలోని ఎన్నో కథల్లో శిళ్ళంగేరి పేరు చూసి, ఆసక్తి గా ఉండేది. కథల ద్వారానే కాకుండా ప్రధానంగా ఇలా ఊరి పేరు ద్వారా పాఠకులు రచయితను గుర్తుంచుకోవటం విశేషమే. శిళ్ళంగేరి గ్రామాన్ని అసంఖ్యాకమైన కథల ద్వారా చిరస్మరణీయం చేసిన కోలార్ కృష్ణ అయ్యర్ గారి సంగతులు ఇలా తెలుసుకోవటం బాగుంది!

 8. hymavathy.Aduri on September 9, 2011 8:19 AM

  గందరగోళంలేకపోతే రుచేముంటుంది? వంటకు, పంటకు, గంటకు కొత్త తరగతి ప్రవేసానికీ గందరగోళం తప్పదుమరి.చందమామరాజు గారు అప్పుడే 65కు వెళితే ఎలా?! ఇంకా యంగ్ గా ఉండి చందమామకు ఎంతో సేవ చేయాల్సిఉందికదా!ఆయనవల్లే వెబ్ లో చందమామ బ్లాగ్ ప్రారంభమై అమెరికాలో ఉన్ననేను అది చూసే ఈవయస్సులో తిరిగి చందమామ చకోరాన్నైనానుకదా! అందుకే చందమామరాజయ్యారాయన.Hymavathy.

 9. chandamama on September 9, 2011 10:59 AM

  వేణుగారూ,
  అసలు శిళ్లంగేరి, కోలార్ పేర్ల వెనుక ఇంత చరిత్ర ఉందని హైమవతిగారి కథనం చదివితే గాని నాకూ తెలియదు. కోలార్ పట్టణమే ఇంటిపేరు కావడం, శిళ్లంగేరి వెనుక ముస్లి దాడుల చరిత్ర దాగి ఉండటం ఎంత గమ్మత్తుగా ఉందో చూస్తుంటే. నిజంగానే కృష్ణయ్యర్ గారు చిరస్మరణీయులే. ఆయన కథల్లో అక్కడక్కడా అక్షరదోషాలు ఉండటం చూసి 90 ఏళ్లు సమీపించిన వయోవృద్ధుడి చేతి రాతలో ఆ మాత్రం దోషాలు సహజం అనుకున్నాను కాని కన్నడ మీడియాలో చదువుకుని తిరిగి తెలుగులోకి ప్రయాణించిన ఒక ఉద్వేగ భరిత చరిత్ర ఉందని ఊహలో కూడా నాకు తట్టలేదు.

  ఈ కథనంలో కోలార్ గారు చందమామ కథలపై చేసిన వ్యాఖ్యపై ఒక పెద్ద కథనమే రాయవచ్చు. చందమామలో కొన్ని కథలు పిల్లల కథలుగా ఉండవని, చందమామలో దేవుళ్ల కథలు వేయరని ఆయన చెప్పిన అభిప్రాయాలపై కాస్త వివరణ ఇవ్వవలిసి ఉంది. అలా ఎందుకుండవో దాదాపు చందమామ అభిమానులకు, ‘చంపి’లకు తెలిసిన విషయమే అనుకోండి. ఆయన ఈమధ్యే చందమామ జ్ఞాపకాలు కూడా పంపారు. ఎంత బావున్నాయో..
  ధన్యవాదాలు.

 10. chandamama on September 9, 2011 11:29 AM

  హైమవతిగారూ,
  చందమామ పాఠకులు, అభిమానులకు శ్రీ కృష్ణయ్యర్ గారిని పరిచయం చేసిన ఘనత పూర్తిగా మీదే. మీరు ఏ క్షణంలో చందమామ రాజు అని పేరు పెట్టేశారో గాని నాకు ఈ పేరే స్థిరపడిపోయినట్లుంది. అదృష్టము, భాగ్యము అనే పదాల పట్ల నాకు నమ్మకం లేదు కానీ, చందమామ పాఠకులు, చందమామ పిచ్చోళ్లు -చంపిలు-, చందమామ అభిమానులతో సమాచార సంబంధాల్లోకి రావడం.. నా ఊహల్లో కూడా ఎన్నడూ లేని అవకాశంగానే భావిస్తున్నాను. పాత చందమామతో పోలిస్తే పాఠకులకు నచ్చని అంశాలు అనివార్యంగా ప్రస్తుత చందమామలో చోటు చేసుకుంటున్నాయన్నది వాస్తవం. కాని చంపిలు తప్పితే చందమామ సాధారణ అభిమానులు ఈనాటికీ చందమామకు ఇస్తున్న విశిష్ట స్థానం చూస్తుంటే, చందమామను చదువుతూనే కాలం చేయాలనే పరమ భావోద్వేగాలను వృద్ధులు ప్రకటించడం చూస్తుంటే చందమామ లోపలినుంచి మేం చేస్తున్న పని కొంచెపు స్థాయిలో లేదనిపిస్తోంది. చందమామ పట్ల వ్యసన భావం కలవారికోసం మేం శ్రమిస్తున్నాం అనే భావం మా అందరికీ అపరిమిత సంతోషం కలిగిస్తూంటుంది.

  మా పరిధిలో మేం పత్రికలో సాగుతున్న లోపాలను, అడ్డంకులను పరిష్కరించలేక పోయినప్పటికీ ఈరోజుకీ చందమామకోసం ఆబగా ఎదురుచూస్తున్న వారికి మేము సేవలందిస్తున్నామనే భావం మమ్మల్ని క్షణక్షణం మా పనిలో ఉత్తేజితులను చేస్తుంటుంది. చందమామ పాఠకులు, అభిమానుల ఆకాంక్షలను నెరవేర్చడానికి మేం ప్రతిరోజూ మా పనిలో కొత్త అంశాలను నేర్చుకుంటున్నామని మాత్రమే చెప్పగలం.

  హైమవతి గారూ,
  ఇది తప్పితే మీ పొగడ్తలకు మేము అర్హులం కాదనుకుంటున్నామండీ… మనందరిదీ చందమామ బంధం. ఆ ఒక్కటే మనల్ని కలిపి ఉంచుతుంది. ఉంచాలి కూడా.
  మీకు కృతజ్ఞతాభివందనలు

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind