ఆదిలక్ష్మిగారు : చందమామ జ్ఞాపకాలు

September 20th, 2011

ఆపీసులో కూర్చుని పనిచేస్తుంటే కూడా ఆదిలక్ష్మి గారి కుటుంబ విషాద పరిణామాలు గుర్తుకొచ్చి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. ప్రస్తావనకు వస్తుంటేనే బాథ తన్నుకొస్తోంది. విషయం మా పైవాళ్లకు క్లుప్తంగా తెలిపి మౌనంగా ఉంటున్నాను. ఈ మౌనం కూడా నన్ను కాలుస్తోంది. భరించక తప్పదు.  వృత్తిగత సంబంధంలో ఎంత గొప్ప మేధో సాహచర్యం వారి కుటుంబంతో అబ్బిందో మాటల్లో చెప్పలేను. తల్చుకుంటేనే దుఖం దుఖంగా ఉంటోంది.

విషయం తెలియగానే చందమామ కార్యాలయంలో విషాద వాతావరణం. ఈ సెప్టెంబర్ నెల చందమామలో అచ్చయిన “తీపికి చేదు చెల్లుకు చెల్లు” కథ ఆమె రాసిందే అని చెప్పగానే అందరూ కదిలిపోయారు. చిన్న పిల్ల తెలిసీ తెలియని వయసులో తీసుకున్న అనూహ్య నిర్ణయం ఒక పచ్చటి కుటుంబం పునాదిని ఎంతగా కదిలించివేసిందో తల్చుకుంటూ బాధపడ్డారు. కార్పొరేట్ విద్య పెడుతున్న అపరిమిత ఒత్తిడి మాత్రమే కాకుండా పిల్లలను ఇంత సున్నితంగా మారుస్తూ, వారిని అవాంఛనీయ చర్యలవైపు కొట్టుకుపోయేలా చేసే ప్రథమ శత్రువు టెలివిజన్ అంటూ విమర్శించారు.

కష్టాలొస్తే ఉరి ఒక పరిష్కారం అనేంత భయంకరమైన రీతిలో టీవీలు ప్రదర్శస్తున్న సీరియల్స్, ఉరి తగిలించుకుంటున్న దృశ్యాలు పిల్లల సున్నితత్వంపై దెబ్బతీస్తున్నాయని ఫీలయ్యారు. పిల్లల విషయంలో ఎలా ఉండాలో, వారి మనస్సులో దాగి ఉన్న విషయాలను ఎలా బయట పెట్టాలో కూడా తెలియడం లేదంటూ తమ తమ అనుభవాలు పంచుకున్నారు.

చందమామ ఇటీవల సంపాదించుకున్న ఓ మంచి కథా రచయిత్రి ఆదిలక్ష్మిగారు. ఆన్‌లైన్ చందమామలో తన చందమామ జ్ఞాపకాలు ద్వారా ఆమెతో ఏర్పడిన పరిచయం తర్వాత కథకురాలిగా, అనువాదకురాలిగా బహు రూపాలలోకి విస్తరించింది. స్కేల్ పెట్టి కొలిచినట్లుగా అక్షరాలను ఎంత అందంగా ఆమె చెక్కుతారో. ఆమె 2010లో రాసి పంపగా ఆన్‌లైన్‌లో, ఈ బ్లాగులో ప్రచురించిన ‘చందమామ జ్ఞాపకాలు’ చూస్తే తెలుస్తుంది.

ఆమెకు కలిగిన తీరని కష్టానికి చలించిపోతూనే ఆమెగురించి తెలిసినవారికోసం, చందమామ పాఠకులకోసం ఆమె గతంలో పంపిన చందమామ జ్ఞాపకాలు ప్రచురిస్తున్నాము. తెలుగు అక్షరాలపై ఇంత పట్టు ఉన్న, ఇంత చక్కటి భావుకత, అద్వితీయ ఊహాశక్తి కలిగిన ఈ చందమామ కథకురాలి చందమామ జ్ఞాపకాలను ఇక్కడ ముందస్తు పరిచయంతో పాటు మరోసారి చూడగలరు.

పరిచయం:
‘చందమామ’ జ్ఞాపకాలకు సంబంధించి ‘అమ్మఒడి’ ఆదిలక్ష్మిగారిది ఓ వినూత్న అనుభవం. చిన్నప్పుడు నాన్న చదివి వినిపిస్తే తప్ప చందమామ కథను వినలేని అశక్తత లోంచి ‘నేనే చదువు నేర్చుకుంటే పోలా’ అనే పట్టుదలతో, స్వయంకృషి తోడుగా శరవేగంగా చదువు నేర్చుకున్న అరుదైన బాల్యం తనది. ఈ తీపి జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే ఇక్కడ కొద్దిగా విందాం..

నాన్నకి చదవటం వచ్చు కాబట్టి కదా చక చకా చదివేసాడు. మొదటి సారి ఇష్టంగా చదివేసేవాడు. మళ్ళీ చదవమంటే కుదరదనే వాడు.

అదే నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ – అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందింది. చదవటం రాక చందమామ బొమ్మలు పదేపదే చూసుకునే కొద్దీ పసి మనస్సు లోతుల్లో అక్షరాలు నేర్చుకోవాలనే తపన పెరిగింది.

వీధిబడిలో చేర్చగానే, ఇష్టంగా మారాం చేయకుండా అక్షరాలు నేర్చేసాను. పెద్ద బాలశిక్ష చాలా కొద్దీ రోజుల్లో పూర్తి చేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పటికే నాకు కథలు చదవటం వచ్చేసింది.

ఆ విధంగా చందమామ నాకు చదవటం నేర్పింది. చదువు కోవాల్సిన అవసరం నేర్పింది. చదువు నేర్పిన గురువుని గౌరవించటమూ నేర్పింది.”

గీతాప్రియదర్శిని

చందమామ ద్వారా చదవటం నేర్చిన, చదువు నేర్పిన గురువును గౌరవించడం నేర్చిన ఆదిలక్ష్మిగారు, ఒకప్పుడు నాన్నతో తను పొందిన అనుభవాన్ని తన పాపాయి నుంచి కూడా ఎదుర్కొన్నారట. చందమామ కథను ఒకసారి చదివి వినిపిస్తే మళ్లీ మళ్లీ వినాలి అనే కుతూహలంతో తప్పుల తడకగా చందమామ కథను చదివి నవ్వించే పాప గీతాప్రియదర్శిని, ఒకట్రెండుసార్లు చదివి ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్నిసార్లయినా చదివి వినిపిస్తాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేదట.

ఇదీ చందమామ ఘనత, చందమామతో బంధం అల్లుకున్న తరతరాల తెలుగు కుటుంబాల ఘనత. ఆదిలక్ష్మిగారు, ఆమె జీవన సహచరుడు, వారి పాపాయి దశాబ్దాలుగా నింగిలోని చందమామతో పాటు నేలమీది ‘చందమామ’తో కూడా చెలిమి కొనసాగిస్తున్నారు. నేలమీది ‘చందమామ’తో ఇటీవలి వరకు ప్రత్యక్ష సంబంధం లేని ఆదిలక్ష్మి గారు ఇటీవలే చందమామతో పరిచయంలోకి వచ్చారు.

నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… తాను పాఠాలు చెబుతున్న స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారూ… మీ చందమామ కుటుంబాన్ని చూసి చందమామ సిబ్బందిగా మేం గర్వపడుతున్నాం.

చందమామతో మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఆదిలక్ష్మి గారి చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠం ఇక్కడ చూడండి.
————–

అరచేతిలో అందాల చందమామ
ఆదిలక్ష్మి

బాల్యం నుండి ఇప్పటికీ చందమామ మా జీవితంలో ఓ భాగం. అక్షరాలు నేర్చుకోవాలన్న ఆకాంక్షని రేకెత్తించిందే చందమామ.

అమ్మఒడిలో కాళ్ళు చేతులు ఆడిస్తూ, స్వయంక్రీడా వినోదితమైన శైశవ దశలో, ఎవ్వరికైనా పంచభూతాలైన భూమి (మట్టి), ఆకాశం(చందమామ), అగ్ని (వెలిగే దీపం), గాలి, నీళ్ళు పరమ ఆకర్షణలు!

’అనగ అనగా ఓ రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు’ అంటూ కథ చెబితే ’ఊ’ కొట్టటం వచ్చిన నాటి నుండే ఆకాశంలోని చందమామతో పాటు అరిచేతిలోని చందమామా పరమ ఆకర్షణే!

రంగు రంగుల బొమ్మలు; ఒంటికొమ్ము రాక్షసులు, చింతచెట్టు దెయ్యాలు, మాయల మారి మాంత్రికులు, బుద్ది చెప్పే గ్రామాధికారులు, మంచి దారిలోకి మారిపోయే గజ దొంగలు…. ఎన్నో పాత్రలు! ఇతిహాసాలు నేర్పిందీ చందమామే!

విచిత్ర కవలలు జానపద కథలతో వింత లోకాలకి తీసి కెళ్ళిందీ చందమామే!

చిన్నప్పుడు…. అప్పటి కింకా బడిలో చేరలేదు. నాన్న ప్రతి నెలా చందమామ తెచ్చేవాడు. నాన్న చందమామ బిగ్గరగా పైకి చదవాలంటే, ఇద్దరు ఆయన కాళ్ళు పట్టాలి. ఒకరు ఆయన తల దగ్గర కూర్చొని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి మెల్లిగా మర్ధన చెయ్యాలి. అప్పుడు గాని బిగ్గరగా చదివేవాడు కాదు.

తల దగ్గర కూర్చొన్న వాళ్ళు, బొమ్మలు కూడా కనబడుతుండగా కథ వినవచ్చన్న మాట. ఎప్పుడూ నేనే నాన్న తల దగ్గర కూర్చొనే అవకాశం పొందేదాన్ని. నాన్న కథలన్నీ ఒకసారి చదివి పెట్టేవాడు. అంతే! మళ్ళీ మళ్ళీ చదవమంటే “మొన్నే చదివాను కదమ్మా!” అనేవాడు.

నాన్నకి చదవటం వచ్చు కాబట్టి కదా చక చకా చదివేసాడు. మొదటి సారి ఇష్టంగా చదివేసేవాడు. మళ్ళీ చదవమంటే కుదరదనే వాడు.

’అదే నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ – అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందింది. చదవటం రాక చందమామ బొమ్మలు పదేపదే చూసుకునే కొద్దీ పసి మనస్సు లోతుల్లో అక్షరాలు నేర్చుకోవాలనే తపన పెరిగింది.

వీధిబడిలో చేర్చగానే, ఇష్టంగా మారాం చేయకుండా అక్షరాలు నేర్చేసాను. పెద్ద బాలశిక్ష చాలా కొద్దీ రోజుల్లో పూర్తి చేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పటికే నాకు కథలు చదవటం వచ్చేసింది.

ఆ విధంగా చందమామ నాకు చదవటం నేర్పింది. చదువు కోవాల్సిన అవసరం నేర్పింది. చదువు నేర్పిన గురువుని గౌరవించటమూ నేర్పింది.

చందమామ బొమ్మలు చూసి ఏకలవ్వుడులా రంగుల్లో బొమ్మలు వేయటం నేర్చాను. నా అనుభవాలన్నీ మా వారితో పంచుకోబోతే తానూ మరికొన్ని అనుభవాలు చెప్పాడు. మా పాపని చూస్తే నా బాల్యం మరో సారి కళ్ళముందు కదలాడింది. (రంగుల్లో బొమ్మలతో సహా)

ఓ సారి చదివేసిన చందమామని, మళ్ళీ మా చేత చదివించుకునేందుకు, మా టక్కరి పాప చందమామ పట్టుకుని పక్కనే పడుకుని ఒక్కో పుట తిప్పుతూ తనకి అర్ధమైన కథని తప్పుల తడకగా చెప్పేది. “అలా కాదు నాన్నా! ఆ కథలో ఇలా ఉంది” అని పొరబాటున అన్నామో! అంతే…. “మళ్ళీ చదవవూ” అంటూ బతిమాలేది.

ఒకట్రెండుసార్లు చదివి ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్ని సార్లయినా చదువుతాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేది. “అయితే ముందు నువ్వే చదవటం నేర్చుకో!” అని అనటంతో అక్షరాలు అలవోకగా నేర్చింది.

అదీ చందమామ! అందాల చందమామ! అరచేతిలో చందమామ! కథలతో జీవితాన్ని అనుసంధానించి, భారతానికి రామాయణానికి భగవంతుడికీ దగ్గర చేసింది చందమామ. గురువుకి చెప్పినంత కృతజ్ఞత చందమామకీ చెప్పాలి!

మా విద్యార్ధుల్లో ఒకరి ఇంట్లో చందమామలు బైండింగ్ చేయించి మరీ గృహ గ్రంధాలయంలో దాచి ఉంచుకుంటే చూచి “అబ్బా! వీళ్ళెంత సంపన్నులో కదా!” అన్పించింది.

(నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారికి… చందమామతో తమ జ్ఞాపకాలను పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. సం.)

ఇది 2010 ఏప్రిల్ 9న చందమామ వెబ్‌సైట్‌లో, బ్లాగులో ప్రచురించబడిన కథనం.

తెలిసి తాను జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదని,  కానీ 18 ఏళ్లుగా కష్టాలమీద కష్టాలను ఎదుర్కొంటున్నానని ఆదిలక్ష్మిగారు మాటలో సందర్బంలో చెప్పేవారు.  ఎన్ని దెబ్బలు తగిలినా కోలుకున్నానంటే, నిబ్బరంగా సహిస్తున్నానంటే తాను నమ్మిన భగవద్గీతే కారణమని, అంతులేని కష్టాల్లో కూడా అనంత శక్తిని ఇస్తూ బతికిస్తూ వచ్చింది ఆ గీతాసారమే అని ఆమె పదే పదే అనేవారు.

ఎంత మంచి మనిషికి, ఎంత మంచి కుటుంబానికి ఇంత కష్టం తగిలింది?

RTS Perm Link

లెనిన్ లేరు… ఆదిలక్ష్మి ఉండలేరు…

September 17th, 2011

సుజాతగారు, వలబోజు జ్యోతి గారు చెప్పిన ఒక విషాదవార్తను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గీతాప్రియదర్శిని కన్నతల్లిదండ్రులు, అమ్మఒడి తదితర తెలుగు ఇంగ్లీషు బ్లాగుల నిర్వాహకులు ఆదిలక్ష్మి, లెనిన్‌బాబు గార్లు.. జీవితం నుంచి సెలవు తీసుకునే ప్రయత్నం చేశారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వేళ కూడా నాతో మాట్లాడిన లెనిన్ బాబు గారు ఇక లేరు. నిద్రమాత్రలు మింగిన ఆదిలక్ష్మిగారు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితినుంచి కోలుకుంటున్నారని వార్త. (స్వచ్చందంగానే వారిద్దరూ లోకంనుంచి తప్పుకోవడానికి సిద్ధపడే ఇలా చేశారని సుజాత గారి తాజా వార్త -బజ్ ద్వారా- ద్వారా తెలుస్తోంది. )

జూలై 15న గీతాప్రియదర్శిని విద్యాశిక్షణా పరమైన ఒత్తిళ్లకు లోనై జీవితం ముగించుకున్నప్పటినుంచి ఈ కన్న తల్లిదండ్రులకు తమ జీవితమే ఓ ప్రశ్నార్థకమైపోయింది. ‘అమ్మఒడిని లేకుండా చేశారు, అమ్మఒడిని చంపేశారు’ అంటూ ఆరోజు ఆదిలక్ష్మిగారు ఫోన్‌లో చేసిన ఆక్రందన ఇంకా వెంటాడుతూనే ఉంది.

-20 ఏళ్లక్రితం ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా పారిశ్రామికురాలిగా జీవితం మొదలెట్టిన ఈమె జీవితంలో అనూహ్యమైన ఎత్తుపల్లాలను చవిచూసి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జాతీయంగా అంతర్జాతీయంగా పాలకవ్యవస్థలు సాగిస్తూ వస్తున్న రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలపై కణిక వ్యవస్థ పేరుతో వందలాది కథనాలు అమ్మఒడి తదితర బ్లాగుల్లో రాశారు.-

నిన్న సాయంత్రం -శుక్రవారం- కూడా లెనిన్ బాబుగారితో చందమామ ఆఫీసునుంచి ఫోన్ చేసి మాట్లాడాను. ఆదిలక్ష్మిగారు గతంలో పంపిన కథ “తీపికి చేదు చెల్లుకు చెల్లు”ను ఈ సెప్టెంబర్‌ నెలలోనే చందమామ ప్రచురించిందని, మీ కొత్త చిరునామా పంపితే చందమామ కాపీ, రెమ్యునరేషన్ పంపుతామని, ఆయనతో మాట్లాడితే శనివారం తప్పుకుండా చిరునామా పంపుతానని చెప్పారు. తీరా శనివారమే ఘోరం జరిగిపోయింది. లెనిన్‌గారు ఉన్నారు కాబట్టే ఆమె గత నెలన్నర రోజులగా బతికి ఉన్నారు.

వ్యవస్థపై తమదైన పోరాటంలో వాళ్లిద్దరూ తన చిట్టితల్లి గీతాప్రియదర్శినిని తమ జీవిత సర్వస్వంగా ప్రేమించారు. పదిహేనేళ్లకు పైగా వారు పడుతూ వస్తున్న తీవ్ర ఆర్థిక, మానసిక బాధలకు కన్నకూతురిపై ప్రేమ రూపంలో వారికి స్వాంతన దొరికిందనుకుంటాను. భారతీయ సాంప్రదాయిక విశ్వాసాలపై ఎనలేని ప్రేమ గల ఆమెకు తన కన్న కూతురు చితాభస్మాన్ని గంగానదికి తీసుకెళ్లి కలపాలని ఉండేది.

స్థలం మారితే అన్నా కాస్త తెప్పరిల్లుతుందేమో అనిపించి, ఈ విషయం లెనిన్ బాబుగారు వారం రోజుల క్రితం చెబితే తప్పకుండా తీసుకెళ్లమని చెప్పాను. చివరకు ఆ కోరికకూడా తీరనట్లుంది. ఎన్నడూ లేనిది శుక్రవారం మాట్లాడినప్పుడు ఆయన గొంతు చాలా డల్‌గా వినిపించింది. మీరెలా ఉన్నారు. ఆమె కోలుకున్నారా అని అడిగితే బతకాలి కాబట్టి బతుకుతున్నాం అన్నారు. ఇప్పుడనిపిస్తోంది. ఆయన అప్పుటికే ఇక జీవితం వద్దు అని నిర్ణయానికి వచ్చారేమో.

వారు కన్నకూతురు తమనుంచి దూరమయినందుకు కూడా పెద్దగా బాధపడలేదనుకుంటాను. కాని నరకబాధలు పెట్టిన ఆ కోచింగ్ సెంటర్‌ నిర్వాహకుడిని చివరిసారిగా కలిసి ఒకే  కోరిక కోరారట. ఏమంటే ఆ సెంటర్లో పాపను ఒక పనామె చాలా బాగా చూసుకుందట. రోజూ ప్రియదర్సిని ఆ పనామె ఆదరణ గురించి ఇంట్లో చెప్పేదట. బతికి ఉండగా తమ పాపను స్కూల్లో అందబాగా చూసుకున్న ఆ పనావిడకు కృతజ్ఞతలు చెబుతామనే ఉద్దేశంతో ఆమెను చూపించమని నిర్వాహకుడిని అడిగితే ఆమె క్లాసుల వద్దకు పనిమీద వెళ్లిందని, కలపడం కుదరదని చెప్పాడట ఆ రాక్షసుడు.

తమ పాప మరణానికి కారణమంటూ కోచింగ్ సెంటర్ మీద కేసు పెట్టాలని ఎంతో మంది సలహా ఇచ్చినా మనిషే పోయాక ఇక కేసు ఎందుకు అనే నిర్వేదంలో ఆ పనికి పూనుకోలేదు వీళ్లు. అలాంటిది ఆ నిర్వాహక రాక్షసులు ఆ పనామెను చివరిసారిగా కలుసుకునేందుకు కూడా తమకు అవకాశం ఇవ్వకపోవడం చూసిన క్షణంలోనే వారి గుండె బద్దలయిపోయింది. లోకం ఎందుకింత అన్యాయంగా మారిపోయిందనే వేదన… కూతురు ప్రాణాలు పోవడానికి కారకులైనవారిని కూడా క్షమించిన తమ పట్ల ఇంత నిర్దయగా వారు ఎలా వ్యవహరించారన్న ఆక్రోశం.. వారి బాధను మరింత రెట్టింపు చేసి ఉన్నట్లుంది.

జూలై 15న చందమామలు బ్లాగులో ప్రియదర్శిని ఆత్మహత్య గురించి ప్రచురించిన కథనాన్ని వాళ్లు చాలా లేటుగా చూశారట. నా అభ్యర్థనను మన్నించి కొంతమంది అజ్ఞాతంగా పంపిన సహాయానికి లెనిన్ బాబు గారు కృతజ్ఞతలు చెప్పారు. సానుభూతి కంటే, తమను మరింతగా పట్టించుకుని ఉంటే, ఇంటివద్దకు ఎవరైనా వచ్చి కలిసి ఉంటే, ఆమెకు స్వాంతన చెప్పి ఉంటే చాలా బావుండేదని ఆయన బాధ వ్యక్తం చేశారు.

ఒక మాటమాత్రం నిజం. వాళ్లు మహానగరంలో ఉండి కూడా భయంకరమైన ఒంటరితనం బారిన పడే ఈ ఘోరానికి పాల్పడ్డారనిపిస్తోంది. పిల్లలకోసం పెట్టిన స్కూలు కూడా నిలిపేశారు. బంధువుల ఒత్తిడి మేరకు వారికి దగ్గరగా ఉన్న అద్దె ఇంటికి మారారు. రెండు నెలలపాటు ఏ పనీ లేకుండా, పైగా అపరిమిత బాధలో ఉన్న ఈ తల్లిదండ్రులు ఇరవై ఏళ్లుగా తాము చేస్తున్న జీవన పోరాటం ఇక చాలని అలసి పోయారనుకుంటాను.

గత పద్దెనిమిదేళ్లుగా బంధువులకు పూర్తిగా దూరమైపోయిన వీళ్లు ఈ మధ్యనే ఓ ఫంక్షన్‌ కోసం హైదరాబాదుకు వెళ్లి బంధువులను అందరినీ కలిసి వచ్చారు. నంద్యాలలో ఎందుకు దూరంగా ఉండటం మహానగరానికి వస్తే మా పిల్లలే చాలామంది ఉన్నారు. స్కూలు పెడితే బాగా జరుగుతుంది అని భరోసా ఇస్తే నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్లారు. బతుకు జరగడం మాటేమిటో కానీ మహానగరం నిలువునా ఒక కుటుంబాన్ని కాల్చేసింది.

పాప  చనిపోవడానికి నెలరోజుల క్రితం  కూడా, ‘ఒక్కసారి చెన్నయ్ రండి, మీ కుటుంబం ఫోటోలు పంపండి’ అని శోభ కోరితే ‘నేరుగా వచ్చి కనబడితే సర్‌ప్రయిజ్‌గా ఉంటుంది కదా. వీలైనంత త్వరలో వస్తాము’ అని చెప్పింది. వృత్తిపర సంబంధంలోకి వచ్చిన నాకంటే శోభతో ఆమె చాలా విషయాలు పంచుకుందట. “లక్ష్మిగారు ఎంత ధైర్యంగా ఉండేవాళ్లు ఇలా ఎలా చేయగలిగారు” అని శోభ ఇప్పుడు షాక్ తింటూ వలవలా ఏడ్చేసింది. ఆమె ఫోన్‌లో నవ్వితే కూడా అంత స్వచ్ఛంగా, ఆనందంగా వినిపించేదని, అన్ని బాధలు, బరువులు, ఒత్తిళ్లు సంవత్సరాలుగా మోస్తూ కూడా ఎలా భరించి ఆమె అంత సహజాతిసహజంగా నవ్వగలిగేదని శోభకు ఆశ్చర్యం. -కారుణ్య.బ్లాగ్‌స్పాట్.కామ్-

నంద్యాలలో ఉన్నప్పుడు ఆమె అద్దె తక్కువగా ఉంటుందని టౌన్‌కు ఆనుకుని ఉన్న పల్లెలో ఇల్లు తీసుకున్నారు. ప్రకృతంటే ప్రాణం, పక్షులంటే ప్రాణం, రోడ్డుమీద తిరుగాడే పశువులంటే ప్రాణం, సాయంత్రం వేళల్లో ఇల్లు వదిలి వాళ్లిద్దరూ, అప్పుడప్పుడూ పాప కూడా పల్లె బాటలో పొలాల గుండా నడుస్తున్నప్పుడు మంద్రమంద్రంగా వీచే ఆ చల్లటి గాలి గురించి, పల్లె అందాల గురించి ఎన్నిసార్లు ఆమె మాట్లాడారో.. హైదరాబాద్‌లో కొత్తగా స్కూలు తెరిచి పిల్లలకు పాఠాలు చెబుతుండగా వారికి మంచినీళ్ల క్యాన్‌లను కూడా అందనీయకుండా చేసిన, తమను చిరకాలంగా వెంటాడుతూ వస్తున్న ఆ అదృశ్య శక్తుల గురించి నవ్వుతూనే ఎంత ధర్మాగ్రహం ప్రకటించారో.

రంగనాయకమ్మగారు ‘జానకి విముక్తి’  నవలలో సత్యం పాత్ర ద్వారా పలికిస్తారు. కష్టాల పట్ల సానుభూతి ప్రకటించగల హృదయం ఉండీ కూడా లోకంలో చాలామంది సహాయం చేయలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారనే అర్థంలో సత్యం, విశాలాక్షికి ఉత్తరం రాస్తాడు. పాతికేళ్ల క్రితమూ ఇంతే. ఇప్పుడూ ఇంతే.

చెన్నయ్ నుంచి 400 కిలోమీటర్లు దూరంలో ఉన్న హైదరాబాదుకి వెళ్లి వారిని పలకరించలేకపోయాను. ఆమె కోలుకోవడం కష్టమనిపిస్తున్నప్పటికీ కొన్నాళ్లు ఆమెకు తోడు నీడగా ఉండి కాపాడుకోమని లెనిన్ బాబు గారికి  చెప్పానే గాని, భరించలేమనుకున్నప్పుడు కొన్నాళ్లు అన్నీ వదిలి చెన్నయ్‌కి వచ్చి మావద్ద ఉండమని చెప్పలేకపోయాను.

కొన్నాళ్లు వాళ్లిద్దరినీ అలా వదిలేస్తేనే బాగుంటుందని పూర్తిగా కోలుకుంటే తప్పక కలుసుకోవచ్చనుకున్నామే కాని ఒకటన్నర నెల కాకముందే ఇంత ఘోరానికి ఒడిగడతారని అస్సలు ఊహించలేదు. పాప, ఇప్పుడు ఆమె జీవన సహచరుడు కూడా లేకుండా మిగిలిన ఆమె విషం మింగి కూడా బయటపడిందని తెలుస్తోంది. బతికి బయటపడినా ఆమె జీవచ్చవమే. ఆమె జీవిస్తుందనే భరోసా ఈ క్షణంలో నాకయితే కలగడం లేదు. అమ్మ ఒడి నిజంగా ఇప్పుడే ఇవ్వాళే ఖాళీ అయిపోయింది.

తిరుపతిలో ఎలక్ట్రానిక్ షాపులో పనిచేస్తూ చేస్తూ ఉన్నట్లుండి ఇంటికి రాకుండా మాచెల్లెలు కొడుకు మాయమైపోతే గత ఆరునెలలుగా వాడి అనుపానులు కూడా తెలియని స్థితిలో ఉన్నాం మేం. మావాడు కనిపించలేదని పోలీసు స్టేషన్‌లో కంప్లయింట్ చే్స్తే దానికి అతీ గతీలేదు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మేనకోడలు మహానగరం నడిబొడ్డున స్వంత ఇంట్లో చంపబడితే కూడా దిక్కులేదు ఈ దేశంలో… మాలాంటి, మనలాంటి సామాన్యుల సమస్యలకు ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో అర్థం కాని పరిస్థితి.

చదువుల కోసం, మంచి బతుకుకోసం రాష్ట్రం నుంచి వేలాది కిలోమీటర్ల దూరానికి మనుషులు వెళ్లిపోతున్నారు. దగ్గరే ఉండి కూడా ఇబ్బందుల్లో ఉన్నవారిని, పిడుగుపాటుకు గురయినవారిని కలవలేకుండా ఉన్నాము. రాతలకు చేతలకు మధ్య సంబంధం ఎక్కడో పెటిల్లున తెగిపోయినట్లుంది.

ఆదిలక్ష్మిగారిని తెలిసిన వాళ్లం సకాలంలో స్పందించి ఉంటే, పాప దుర్మరణం తర్వాత మరో ఘోరం ఇలా జరిగి ఉండేది కాదు. ఆమె  కుప్పగూలిపోయినా ధైర్యంగా కనిపించిన, ఆత్మస్థైర్యంతో మాట్లాడిన సహచరుడు లెనిన్ గారి అండ ఉందని, కొన్నాళ్ల తర్వాతయినా ఆమె కోలుకుంటుందని నిజంగానే నమ్మాను నేను.

“వస్తామని కలుస్తామని మాటిచ్చిన లెనిన్ గారు తిరిగిరాని తీరాలకు తరలి వెల్లటం. ఆయనను అనుసరించాలని పోరాడుతున్న ఆదిలక్ష్మీ గారిద్దరూ మాటతప్పారు. మరో పాపానికి ఒడిగట్టారు. ఇంతకంటే ఆత్మీయుల్ని తిట్టలేను. దుఃఖం గుండెను పిండేస్తుంది. లెనిన్, ఆదిలక్ష్మిగార్లు మాట తప్పారు” అంటూ దుర్గేశ్వర గారు తమ హరిసేవలో రాసిన మాట అక్షరసత్యం.

పిల్లలను ప్రేమించడమే, సర్వస్వంగా ప్రేమించడమే తప్పయిపోయే కాలం ముంచుకొస్తోందా? పిల్లలు లేని మాకు ఈ అనుభూతి  గాఢత గురించి ఎన్నటికీ తెలీకపోవచ్చు.

కన్నవారిని కొడుకులు తన్ని తరిమేస్తుంటే కూతుర్లు కాస్త అన్నం పెడుతున్న కాలం వచ్చేసింది. ఆ నమ్మకాన్నే నీ చుట్టూ అమ్మా, నాన్నా అల్లుకున్నారేమో..!

గీతా ప్రియదర్శినీ, అనంత దరిద్రాన్ని ప్రేమించిన కన్నవారు నువ్వు లేని లోకాన్ని ఇలా శపిస్తున్నారు.. ఎందుకిలా చేశావు తల్లీ?

ఆదిలక్ష్మిగారూ, క్షమించండి.. ఘోరమైన తప్పిదం చేశాను. ఇలా చేస్తారని, ఇలా జరుగుతుందని ఊహించలేదు. మీ గురించి సమాచారం తెలుసుకునే చివరి వనరును కూడా పొగొట్టుకున్నాను. ఎప్పుడు కాల్ చేసినా లెనిన్ గారు అందుకునే మీ ఫోన్ ఈ సాయంత్రం నుంచి స్విచ్ఛాఫ్ అయిపోయింది. కష్టాల్లో ఉన్నవారిని కాపాడుకోవడం తెలీని, చేతకాని జీ్వచ్ఛవాలం. మా పాపాలను మన్నించండి..

చందమామ కుటుంబాలకు విషాదవార్త
http://blaagu.com/chandamamalu/2011/07/15/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE-%E0%B0%95%E0%B1%81%E0%B0%9F%E0%B1%81%E0%B0%82%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B5/

లోకంలోని పిల్లలందరూ ఇక మీ పిల్లలే…
http://blaagu.com/chandamamalu/2011/07/17/%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B1%82-%E0%B0%87%E0%B0%95-%E0%B0%AE/

 

విషాదవార్త

http://kaburlu.wordpress.com/2011/09/17/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A6-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4/#comment-388

ఆదిలక్ష్మిగారు ఎందుకిలా చేసారు??

http://jyothivalaboju.blogspot.com/2011/09/blog-post_17.html

 

లెనిన్ ,ఆదిలక్ష్మిగార్లు మాటతప్పారు

http://durgeswara.blogspot.com/2011/09/blog-post_17.html

 

ఈ బ్లాగులు ఇక ఎన్నటికీ అప్‌డేట్ కాకపోవచ్చు.

అమ్మఒడి
http://ammaodi.blogspot.com/

ఆహా! ఓహో!
http://paalameegada.blogspot.com/

కింది తాజా సమాచారం చూడగలరు.

కార్పోరేట్ విష సంస్కృతి..

http://vasantalakshmi.blogspot.com/2011/09/blog-post_18.html

 

2004 డిసెంబర్ 26న విరుచుకుపడిన సునామీ సమాచారంతో ఉన్న కింది లింకును చూసిన ఆదిలక్ష్మిగారు కింది బ్లాగర్‌కు జీమెయిల్‌లో పంపిన కామెంట్ కింది లింకులో చూడగలరు.

జ్ఞాపకాల అలజడిలో…!

http://kaarunya.blogspot.com/search/label/%E0%B0%B8%E0%B1%81%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%E0%B1%80%20%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%AA%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81

 

తాజా ఆత్మీయ సమాచారం కోసం కింది లింక్ చూడండి

అమ్మఒడి ఆదిలక్ష్మిగారు

http://teluguyogi.blogspot.com/2011/09/blog-post_19.html

 

RTS Perm Link

చందమామ చిత్ర బ్రహ్మ వపా విశ్వరూపం

September 14th, 2011

గణపతి విశ్వరూపం

చందమామ సెప్టెంబర్ సంచిక మార్కెట్లోకి ఆగస్ట్ 25వ తేదీనే వచ్చేసింది. పాఠకులందరికీ మహదానందం. వినాయక చతుర్థి పర్వదినానికి ఐదు రోజుల ముందే గజాననుడి ముఖచిత్రంతో కనులవిందుగా, కంటికింపుగా చందమామ. నిజంగా కవర్ పేజీపై ఉన్నది వినాయకుడి విశ్వరూపం కాదు. చందమామ అపర చిత్ర బ్రహ్మ వపాగారి విశ్వరూపం అంటే ఇంకా ఖచ్చితంగా ఉంటుందేమో. బ్రహ్మ మహేశ్వరులను కూడా అవలీలగా అలా పక్కన పెట్టిన చిత్రరాజసం వపాగారికి తప్ప మరెవరికి చెల్లుతుంది మరి!  ఈ ముఖ చిత్రం కోసం చందమామ వర్ణన కూడా కింద చదవగలరు.

అట్టమీది బొమ్మ
విశ్వరూపం

ఈ నెల ముఖచిత్రాన్ని -సెప్టెంబర్ 2011- దివంగతులైన మా సీనియర్‌ చిత్రకారుడు శ్రీ వడ్డాది పాపయ్య 1980లలో చిత్రించారు. వినాయక చవితి వర్వ దినం సందర్భంగా ఈ చిత్రాన్ని ఈ నెల అట్టమీది బొమ్మగా తిరిగి ప్రచురిస్తున్నాము.

గణపతి తన అయిదు తలలతో భారీ రూపం ధరించిన నేపథ్యంలో ఆ విశ్వరూపాన్ని ఈ చిత్రం ప్రదర్శిస్తోంది. బ్రహ్మదేవుడు గణేశ విగ్రహ విశేషాలను వివరిస్తూ కథ చెబుతాడు.

ఒకసారి స్వర్గాధిపతి దేవేంద్రుడు, ఐరావతం సహోదరుడైన గజేంద్రుడిని అవమానిస్తాడు. ఈ సందర్భంగా ‘దేవేంద్రుడు ఏదో ఒక రోజు తన ముందు తలవంచుతాడ’ని గజేంద్రుడు జోస్యం చెబుతాడు. ఆ సందర్భాన్ని తలపిస్తూ ఏనుగు తలను తనదిగా చేసుకున్న వినాయకుడి విశ్వరూపానికి దేవేంద్రుడు మొక్కుతాడు. గణపతిని తాను గతంలో అవమానించినందుకు పశ్చాత్తాపం తెలుపుతూ ఇంద్రుడు తన చెవుల్ని రెండు చేతులతో పట్టుకుంటాడు.

ఈ దృశ్యాన్ని బ్రహ్మదేవుడు మరింత వివరంగా వర్ణిస్తున్నాడు. విఘ్నేశ్వరుడు పూర్తిగా బ్రహ్మ సృష్టి. అయిదు గణాలు లేదా పంచభూతాలను -నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశం-  తనలో కలిగి ఉన్నందున అతడు మహాగణపతి అయ్యాడు. భౌతిక, మానసిక శక్తులకు ప్రతీకగా గణపతి ఏనుగుతొండం నిలుస్తుంది. ఇతడి విశ్వరూపంలో ఈ అంశమే వ్యక్తీకరించబడింది.

అదే సమయంలో అతడు తన చిన్న వాహనమైన మూషికంపై ప్రయాణిస్తుంటాడు. ఏనుగు తల రెండు చిన్న కళ్లను కలిగి ఉంటుంది. కాని అవి సూక్ష్మాతి సూక్ష్మ వస్తువులను కూడా చూడగలిగేటంత శక్తిమంతంగా ఉంటాయి. అంటే గణపతి చూపునుంచి ఏదీ దాక్కోలేదని ఇది తెలుపుతుంది. అతడి పెద్ద చెవులు విశ్వం లోని ఏమూల నుంచైనా భక్తులు చేసే ప్రార్థనలను వినగలుగుతాయి. అదేవిధంగా పొడవాటి తొండం తను కోరుకున్న ప్రతిదాన్ని అందుకోగలుగుతుంది.

ఆవిధంగా విశ్వ సంపదను మొత్తంగా అతడు పొందగలిగే స్థానంలో ఉన్నాడు. ఏదైనా కార్యాన్ని సాధించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ మొదటగా విఘ్నేశ్వరుడినే పూజిస్తారు. విఘ్నేశ్వరుడు భాద్రపద మాసంలోనే అవతరించాడు.

అందుకనే భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థినాడు విఘ్నేశ్వరుడిని పూజించినవారికి కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని ఒక నమ్మకం. ఆవిధంగా కార్యసాధనలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని ఎదుర్కొనేందుకు కావలసిన శక్తిని, ధైర్యాన్ని వీళ్లు పొందుతారు.

ఈ నెల అట్టమీది బొమ్మను, దానితో పాటు ప్రచురించిన ఉన్న కథను మీరు ఆస్వాదించారని భావిస్తున్నాము. వచ్చే నెలలో కూడా అట్టమీద బొమ్మ రూపంలోని మరొక చందమామ సుందరమైన కళా సృష్టితో మీ ముందుకు వస్తాము.”

ఈనెల చందమామపై పాఠకుల లేఖలు

సెప్టెంబర్ చందమామను ఆగస్ట్ 27నే అందుకున్నాను. వపాగారి వినాయక చవితి ముఖచిత్రం అద్భుతంగా ఉంది. చందమామకు పూర్వ వైభవం వచ్చినట్టుంది. లోపలి కథలు కూడా చాలా బాగున్నాయి. అచ్చులో నా కథ చూసుకుంటే మహదానందమేసింది.
–ఆరుపల్లి గోవిందరాజులు, విశాఖపట్నం

సెప్టెంబర్ చందమామ వినాయకుడి ముఖచిత్రంతో అబ్బురమనిపించింది. వపాగారి మార్కు ముఖచిత్రాల్లో ఇది హైలెట్. అలాగే ఈ నెల బేతాళ కథలో కొట్టొచ్చినట్లు మార్పు ఏమంటే శంకర్ గారు పూర్తి పేజీ బొమ్మ వేయడం. బేతాళ కథకు ఫుల్ పేజీ బొమ్మ వేయడం చందమామ చరిత్రలో ఇదే తొలిసారేమో. రాజు, గుర్రం, పాముని శంకర్ పూర్తి పేజీలో అందంగా చిత్రించారు. కథ కూడా బాగుంది.
సారయ్య, కరీంనగర్, ఎపి.

సెప్టెంబర్ సంచిక సకాలంలో అందటం మహదానందంగా ఉండటమే కాకుండా ఇంతవరకు చందమామ సుదీర్ఘ చరిత్రలో ముఖచిత్ర వివరణ, -వినాయకుడు- చిత్రకారుని ప్రతిభ గురించి ఎప్పుడూ విశ్లేషించలేదు. వడ్డాది పాపయ్య గారు చందమామకు జీవనాడి. అలాగే నేడు కూడా కథోచిత చిత్రాలు అందిస్తున్న సీనియర్ చిత్రకారులు శంకర్ -కె.సి. శివశంకరన్- గారికి పెద్ద పీట వేసి గౌరవించాలి. పాత కొత్తల మేలుకలయికతో చందమామ చల్లని కిరణాలతో పరవశించని పాఠకుడు ఉండడంటే అతిశయోక్తి కానేరదు. ఆబాలగోపాలాన్ని హిమశీకరాలతో షష్ఠిపూర్తి దాటినా అందాల చందమామ అలరించడం ఎంత చిత్రం. వంద ఏళ్ళు చదవాలనే పాఠకుల ఆశ ఎంత విచిత్రం. ఇది దురాశ కాదెంతమాత్రం. ఇది మీకు నా శాశ్వత శుభప్రశంస.
–బి. రాజేశ్వరమూర్తి, చిలకలపూడి, కృష్ణా జిల్లా, ఎపి.

RTS Perm Link

చందమామ కథల మునితో కబుర్లు!

September 7th, 2011

శ్రీ కోలార్ కృష్ణయ్యర్ గారు

చందమామ కథల రచయిత కోలార్ కృష్ణయ్యర్ గారు డిల్లీ వెళ్తారని తెలిసి ఇవ్వాళ -23-08-2011- సాయంత్రం రెండున్నర గంటలకు మా దంపతులు ఇరువురం ఆయనను బెంగుళూరులోనే కలవడానికి నిర్ణయించుకున్నాము. అంతకు ముందురోజు రాత్రి కావలినుంచి బస్సులో ప్రయాణించి రావడంతో బాగా అలసిపోయాము. కృష్ణయ్యర్ గారు కథల ప్రచురణ కోసం రేపు ఢిల్లీ బయలుదేరి రెండు నెలలు అక్కడే ఉంటానని చెప్పారు కాబట్టి అలసటగా ఉన్నా కలవాలనుకున్నాము. ఇంటివద్దనుంచి బయల్దేరి  నాలుగన్నర గంటలకు వారు ఇప్పుడు ఉంటున్న ఇల్లు చేరాము. బెంగుళూరులో ఆయన ఉన్న ప్రాంతం మాకు చాలాదూరం. మాది తూర్పు సరిహద్దు. వారిది పడమర సరిహద్దు. వారి కుమార్తె మధ్య మధ్యలో ఫోన్ చేస్తుంటే దారిచెప్పగా వారి ఇల్లు కనుక్కుని వెళ్ళాము.

పండుముసలి ఐనా పదేళ్ళపిల్లాడిలా -89 ఏళ్లు- ఆయన తమ అనుభవాలను, అనుభూతులను పంచారు. మావారూ చాలా సరదాపడి విషయాలన్నీ విని నన్ను కొన్ని నోట్ చేసుకోమన్నారు. కృష్ణయ్య గారి కధలపై ఎవరో పేరు చెప్పారు గానీ నేను పెన్ పుచ్చుకునేలోగా చెప్పడం ఐపోయింది. వారిని తిరిగి వెనక్కు తీసుకెళ్ళడం ఇష్టం లేక మౌనంగా ఉండి విన్నాను. – ఈ కథనం చివరలో అదనపు సమాచారంలో దీనిని చూడవచ్చు-

నేను “మీరు అన్ని కధల్లోనూ’ శిల్లంగేరి’ అనే పేరు ఎందుకని పెడతారు” అని అడగ్గా , కృష్ణయ్యగారు “మాపూర్వులు ఆనాటి ముస్లింల ధాటికి ఝడిసి సొంత ఊరినుండీ పారిపోయి కర్ణాటక ప్రాంతంలోని అయిదు ఊర్లలో తలదాచుకున్నారుట. వాటిలో ఒకటి శిల్లంగేరి. అది మేము నివసించిన ప్రాంతం’ అని అన్నారు.

“మరి మీ ఇంటిపేరు ‘కోలార్’ అని ఎందుకు వచ్చింది” అనే నా సందేహానికి  వారు “మానాయన గారు చదువుకోలేదు. నిరక్షరాస్యులు. నన్ను బడిలో చేర్పించడానికి వెళ్ళినపుడు పంతుళ్ళు ‘మీ అబ్బాయి పేరేమి’ అనగా ‘కృష్ణయ్య’ అని చెప్పారుట. మరి ఇంటి పేరేమి? అని అడగ్గా “మేము ఉండేది కోలార్‌లో’ అని చెప్పగా పంతుళ్ళు తన ఇంటిపేరు ‘కోలార్’ అని రాశారుట! అలా తమ పేరు కోలార్ కృష్ణయ్య అయిందని చెప్పారు.

వారి విద్యాభ్యాసం ఎక్కువగా అనంతపురంలోనే సాగిందట. ఇంకో తమాషా ఏమంటే వారు తెలుగు కాక కన్నడ మీడియంలో చదివారుట! ఎనిమిదవ వతరగతి వరకూ తెలుగే చదివారు కానీ, ఒకరోజున తెలుగు పంతులుగారు పరీక్ష పేపర్లన్నీ దిద్ది అందరికీ ఇస్తూ కృష్ణయ్య గారి పేపర్ మాత్రం ఇవ్వక, చివరగా పిలిచి, చెవి మెలివేసి “ఏరా మొద్దూ ! ప్రతివాక్యానికీ ముందు ‘సున్న’ పెడుతున్నావ్ ! సున్నతో వాక్యం మొదలెడతారా? తెలివితక్కువ గాడిదా!” అంటూ భుజంపై ఒక్కదెబ్బ వేశారుట.

దాంతో మన కృష్ణయ్య బాబుకు (అపుడు చిన్నవాడుకదా!) కోపం, పౌరుషం వచ్చి, వాళ్ళ నాన్నగారి వద్దకెళ్ళి ‘నేను తెలుగులో చదవను’ అని చెప్పాడట. అప్పటికే కన్నడ మీడియంలో పిల్ల్లలు తక్కువై ఆ సెక్షన్ ఎత్తేస్తారనే భయంతో ఉన్న ఉపాధ్యాయులకు అదొక బాసట! దాంతో కృష్ణయ్యగారి తండ్రివెళ్ళి మావాడు కన్నడంలో చదువుతాడనిచెప్పి “వెళ్ళి ఆ సెక్షన్ లో కూర్చోపో” అని చెప్పారుట.

అప్పటినుండీ కన్నడ మీడియంలోనే చదివారాయన. కానీ పెద్దయ్యాక నాలుగు వందల తెలుగు కధలు రాసి, పండిన పండితుడు మన కోలార్ కృష్ణయ్య. కన్నడ మీడియంలో చదివి తెలుగులో చిన్నపిల్లలకోసం కధలు కాయించిన కర్పూర కల్పవృక్షం కోలార్ కృష్ణయ్యగారు. ఆయన “మరి కన్నడంలో కధలు వ్రాయలేదా?” అన్న నాసందేహానికి ” కన్నడంలో కధలేవీ వ్రాయలేదని” చెప్పారు.

చదువంటేనే తెలీని వారి తండ్రికి ఇలాంటి కధల పండితుడు తన సంతానమంటే ఎంత ఆనందించారో! మరికొన్ని విషయాలు మాట్లాడాలంటే సమయం చాలలేదు. కృష్ణయ్యగారి సంతానం , మనుమలు మనుమరాళ్ళు ,మునిమనుమలు ,మునిమనుమరాళ్ళు  అంతా తాతగారి పుస్తకాలు చదువుతారుట! విదేశాల్లో ఉన్న తన సంతతిని అక్కడివారు ‘కోలార్ ‘ అనే పేరుతోనే పిలుస్తారని మురిసిపోతూ చెప్తున్న ఆ 89 ఏళ్ళ నవ్వుల ముని ఆక్షణంలో ఎనిమిదేళ్ళ పిల్లాడిలా అనిపించారు. -ఇతరదేశాల్లో ఇంటిపేరే అసలు పేరుగా పిలుస్తారు కదా-

కళాశాల చదువు పూర్తయి ప్రభుత్వోద్యోగాలూ, ఆపై తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం అయ్యాక ప్రస్తుతం పిల్లలందరి దగ్గరా కొన్నాళ్ళు గడపుతూ, తిరుగుతూ, తిరిగి చందమామకు కధలు రాస్తూ నవ్వుకుంటూన్న నాగరికుడీయన. తాను ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ రాసిన కధలను, కొందరు పబ్లీషర్స్ విజయవాడనుండీ, మద్రాసునుండీ -ఇంకా ఢిల్లీ అని చెప్పిన గుర్తు-  ప్రింట్ చేసి వెయ్యిరూపాయలు కొందరిస్తే, అచ్చంగా ఆరే ఆరుకాపీలు కొందరు ఇస్తారుట!

ఇల్లు వెతుక్కుంటూ మధ్య మధ్య ఫోన్ చేస్తున్నమమ్ము తీసుకెళ్ళడానికి వారి పెద్దమ్మాయి అనుకుంటా.. క్రిందికి వచ్చి అప్యాయంగా పలుకరించి దారిచూపారు. అక్కడ ఉన్నకాస్తంత సమయాన్నీ కోలార్ గారితో మాట్లాడి బంగారం తవ్వుకోవాలనే ప్రయత్నంలో ఆమె  పేరు సైతం అడగడం మరచాము.

ఇటీవలే మార్చి ఐదున అనుకుంటాను  కోలార్ గారి గృహలక్ష్మి వారికి శాశ్వతంగా దూరమైందని తెలిసి బాధేసింది. వారి అమ్మాయి “ఎన్నో ఏళ్ళ అనుబంధం కదా నాన్నగారు తట్టుకోడం కష్టం” అనిచెప్పారు. కోలార్ కృష్ణయ్యగారు అందుకేనేమో తమవద్ద ఉన్న ప్రింటైన తమ రచనలన్ని అందరికీ పంచుతున్నారుట! -ఆగస్టు చివరలో కలిసిన తమకే ఆయన పాతిక పుస్తకాలు ఇచ్చేశారని హైమవతి గారు చెప్పి ఆశ్చర్యపరిచారు-

తిరుపతిలో కుమారునివద్ద కొంతకాలం , మంగుళూర్ కుమారునివద్ద కొంతకాలం, బెంగుళూర్ కుమార్తెవద్ద కొంతకాలం, ఢిల్లీలో కుమారునివద్దకు ఈరోజే ప్రయాణమవుతున్నారుట, అందుకే మేము హడావిడిగావెళ్ళి చూసి, మాట్లాడి వారు ఎంతో అప్యాయతగా మాకోసం తిరుపతి నుండీ తెచ్చిన షుమారుగా పాతిక పుస్తకాలు మాకు అందించారు, మరోమారు తీరుబాటుగా ఒక్కరోజంతా కలసి కబుర్లు చెప్పుకుందాము ” అనిచెప్పారు. సాగనంపటానికి క్రిందివరకూ రాలేమనగా, వారికి నమస్కరించి శలవుతీసుకుని మేడదిగాం.

తిరిగి ట్రాఫిక్ జోరులో డ్రైవర్ కారు నడుపుతుండగా మేమిరువురం  కోలార్ గారి కబుర్లు చెప్పుకుంటూ రెండుగంటలతర్వాత ఇల్లు చేరాం–.

అన్నట్లు – కోలార్ కృష్ణయ్యగారు నిర్మొహమాటంగా – “చందమామలో కొన్నికధలు పిల్లలకోసం లాగా ఉండవు. పెద్దవారు చదువుతున్నప్పటికీ ‘ ప్రేమించడం, పెళ్ళిచేసుకోడం, దయ్యలూ పిశాచాలూ లాంటివి పిల్లలకు అర్ధం కాకపోగా భయంకలిగిస్తాయని నా అభిప్రాయం. కొన్నిడైలాగ్స్, మాటలూ కూడా పిల్లలస్థాయిని మించి ఉంటాయి.నాకు తెలుగు కాస్తే వచ్చును, అందువలన నేను ఉపయోగించే భాషకూడా పిల్లలస్థాయికి సరిపోతుంది. (దేవునికధలు చందమామలో వేయరు అనికూడా అన్నారు).” అని వ్యాఖ్యానించారు. తాము ఏఏ పిల్లల పుస్తకాలకు వ్రాశారో కూడా చెప్పారు. (చంపక్, గోకుల్ వంటివి).

ఆయనను కలవడానికి నాలుగు గంటలు పోనూ రానూ  కష్టం అనిపించినా ఒక తలపండిన తపస్వినీ, కధల మునినీ చూసి మాట్లాడామన్న తృప్తి సంతోషం మిగిలాయి.

కోలార్ గారితో కొంతసేపు కబుర్లివే-!

అదనపు సమాచారం
కృష్ణయ్యగారి కధలపై రీసెర్చ్ చేసిన వ్యక్తి ” మీకు కధలకు ప్లాట్స్ ఎలాదొరుకుతాయి? ఈకధ రాయాలని ఎలా తోస్తుంది? ” అని అడిగారుట. దానికి కృష్ణయ్యగారు ” ఏదైనా సంఘటన చూసినపుడో, విన్నపుడో  వచ్చిన ఆలోచనను తనదైన శైలిలో కధలా మలుస్తానని చెప్పారుట.”ఏ కధకైనా ఒక సందేశం ఉండాలి, లేక పోతే ఆ కధ వలన ప్రయోజనం ఉండదు.ఇటీవల కధలు ఉత్తిగా వ్రాస్తున్నారు తప్ప, ప్రయోజనం కనిపించడంలేదు.” అన్నారు.

వారు తాను చూసే ఒక సీరియల్ లో (ఆ ఒక్కటే మేమూ చూసే సీరియల్ కావడం తమాషాగా అనిపించింది) -మొగలిరేకులు- దాన్లో దేవి (ఒక కారెక్టర్) తమ కుటుంబానికి విరోధి ఐన వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడతానని చెప్తుంది. పెద్దలకు ఇష్టం లేక పోయినా అలాచేయడంవలన తమ రెండు కుటుంబాల చిరకాల విరోధం పోయి స్నేహం తిరిగి విరుస్తుందని ఆమెభావన. ఈ ఆలోచనతో ఒక కధ వ్రాశానని చెప్పారు.

“ఏమైనా డిస్ట్రిబ్యూటర్స్‌తో చాలాబాధ. ప్రింట్ ఐందాకా నమ్మకంలేదు.” అన్నారు. ఎంతైనా ఓపిగ్గా వ్రాస్తూ  డిస్ట్రిబ్యూటర్స్‌తో తంటాలు పడుతూ ఇంకా పుస్తకాలు ప్రింట్ కోసం తపిస్తున్న ఇప్పటికి 40పైగా పుస్తకాలు ప్రచురించారు. ఇంకా 60 పిల్లల పుస్తకాల కూర్పుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మహా మనీషికి మాతృభాషపట్ల, చిన్నపిల్లలకు మానవతా విలువలు నేర్పాలనే అభిలాష పట్ల ఉన్న మక్కువ ఎక్కువే!

వారు నాకు ఇచ్చిన తమ పుస్తకాలలోని కొన్ని క్యారెక్టర్స్ చారిత్రక, పురాణాలలోనివి ఇంగ్లీషులోకి అనువదించమని సూచించారు చూడాలి నావయస్సూ 65. ఆయనంత ఓపిక భగవంతుడు నాకూ ఇవ్వాలిగా! పైగా ఆయనలా డిస్ట్రిబూటర్స్‌తో ప్రింట్ కోసం తంటాలు పడటం నావల్ల అయ్యేపనికానే కాదు.

ఆదూరి హైమవతి.

(చందమామ సీనియర్ కథకులు శ్రీ కోలార్ కృష్ణయ్యర్ గారితో హైమవతి గారి కుటుంబానికి రెండు తరాల కథారూప పరిచయం ఉంది. గత 35 ఏళ్లకు పైగా వీరు ఈయన కథలు విడవకుండా చదవడమే కాకుండా తమ పిల్లలకూ కూడా వీరి కథలను పరిచయం చేశారట. ఈ కుటుంబం మొత్తానికి చందమామతో సుదీర్ఘ అనుబంధం ఉంది. కృష్ణయ్యర్ గారితో ప్రత్యేక అనుబంధం కూడానూ. మూడున్నర దశాబ్దాల తర్వాత ఈ చందమామ కథల మునితో పరిచయం కలిగే అవకాశం కోసం గత ఆరునెలలుగా ఈ కుటుంబం ఎదురు చూసింది. ఆయన తిరుపతిలో, బెంగుళూరులో, మంగుళూరులో తమ పిల్లల వద్ద గడుపుతూ రావడంతో సమయం కుదరలేదు. మొత్తంమీద ఆయన బెంగళూరు చిరునామా తీసుకుని అక్కడే కలియనున్నామని చెప్పడంతో కలిసిన తర్వాత వివరాలను రాసి పంపమని కోరాము. మరుసటి రోజే హైమవతి గారు ఆయనతో భేటీ వివరాలు రాసి పంపారు. కాస్త ఆలస్యంగా వీటిని ఇక్కడ ప్రచురించడమైనది. తెలుగు టీచర్ మందలించారనే కోపంతో తెలుగే చదవనని భీష్మించుకుని కన్నడ మాధ్యమంలోకి మారిపోయిన కృష్ణయ్యగారు తర్వాత నాలుగు వందల తెలుగు కథలు రాసి తెలుగు బాలసాహిత్యానికి తమదైన చేర్పునందించడం చూస్తుంటే హృద్యంగా అనిపిస్తోంది. ప్రస్తుతం కథల ప్రచురణ కోసం ఢిల్లీలో ఉన్న ఈయన అక్టోబర్ చివరలో తిరిగొస్తారు. జీవితం చివరి అంచులోనూ కథారచనను వదిలిపెట్టని ఈ రుషితుల్యుడితో మాట్లాడాలంటే దిగువ నంబర్లలో సంప్రదించవచ్చు.)

తిరుపతి    :   Land line : 0877-2251715
ఢిల్లీ           :   Mobile no: 09483321031 –ఇప్పుడు ఇక్కడే ఉన్నారు
బెంగళూరు: Land line: 080 23494065

 

ఆదూరి హైమవతి దంపతుల చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకులు చూడండి.

చందమామ చదవకుంటే?

 

‘చందమామ’ జ్ఞాపకాలతో వృధ్ధాప్యమూ పసితనమే…!!

RTS Perm Link

గణపతి చరిత్ర

September 1st, 2011

ఆదిమసమాజంలో గణవ్యవస్థ రూపుదాల్చిన క్రమంలో సమాజ సంరక్షణ కొరకు ఎన్నుకోబడ్డ నాయకుడే గణపతి లేదా గణనాయకుడు లేదా గణాధిపతి. ప్రతి గణానికి ఒక గుర్తు లేదా సంకేతం పాము, ఎలుక, ఏనుగు, కుక్క, చిలుక, తాబేలు, పక్షి మొక్క మొదలైన పేర్లు చిహ్నాలుగా ఉండేవి. గణపతికి ఏనుగుతల ఉండటం ఆ గణం యొక్క ఆధిపత్యాన్ని లేదా మిగతా గణాలపై గల సార్వభౌమత్వాన్ని తెలియజేస్తుంది.

ఆ గణ సంకేతాలే నేటి సమాజంలో గోత్రాలుగా కొనసాగుతున్నాయి. ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లు, నోములు, వ్రతాలు, పూజలు పరిశీలిస్తే ఆదిమ సమాజ లక్షణాలు కనబడతాయి. గోత్రనామం తెలుగు అర్థం తెలుసుకుంటే సమాజపరిణామంలో మనిషి మూలాలు తెలుస్తాయి.

ఆదిమ సమాజంలో భక్తి వ్యక్తిగతం. రాజ్యవ్యవస్థ, వ్యక్తిగత ఆస్థి ఏర్పడిన తర్వాతే భక్తి ప్రదర్శనగా మారింది. నేడు భక్తి వ్యాపారమైంది. ఇప్పుడు పూజా ద్రవ్యమూ సరుకే. దేవుడూ సరుకే. భక్తి కూడా సరుకే. పెట్టుబడిదారీ సమాజంలో సరుకు ఉత్పత్తి లాభం కోసమే. ప్రదర్శన వ్యాపార లక్షణం. గణేశ ఉత్సవంలో కనిపిస్తున్న తీరుకి ఇది నిదర్శనం. భక్తి వేలం వెర్రిగా మారటం సామ్రాజ్యవాద సంస్కృతి తలకెక్కి తైతక్కలాడటమే.

భయం+అజ్ఞానం దేవుడు. భయానికి కారణం అభద్రత, అజ్ఞానానికి హేతువు విచక్షణా జ్ఞానం కొరత. విచక్షణే సైన్స్ సమస్యలకు పరిష్కారం చూపుతుంది.

— డా. జి,వి. కృష్ణయ్య. drgvkrishnaiahkp@gmail.com

డాక్టర్ గారూ, మన చరిత్ర సైన్స్‌కి సంబంధించిన మంచి విషయాన్ని ఇవ్వాళే ఈమెయిల్ ద్వారా పంచుకున్నందుకు కృతజ్ఞతలండీ.

క్లుప్తంగానే అయినా గణపతి భావన వెనక ఉన్న ఒక సుదీర్ఘ చరిత్రను ప్రస్తుతం దాని వికృత పరిణామాలను సుస్పష్టంగా వివరించారు.

దాదాపు 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్లు ‘గణపతి’ పేరిట, దేవీప్రసాద్ చటోపాధ్యాయ రచించిన ప్రామాణిక పుస్తకం ‘లోకాయత’లోంచి చిన్న భాగాన్ని పుస్తకంగా వేశారు. భగవద్గీత చారిత్రక పరిణామాలపై, గణపతిపై ఇతర అంశాలపై వీరు ప్రచురించిన చిన్న పుస్తకాలు అప్పట్లో సంచలనం కలిగించాయి. కాని ఆ సంప్రదాయాన్ని, తరం తర్వాత తరానికి అందవలిసిన శాస్త్రీయ జ్ఞాన వారసత్వాన్ని ప్రస్తుతం ఎవరూ కొనసాగిస్తున్నట్లు లేదు.

ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక వారు ప్రచురించిన వందకు పైగా పుస్తకాలు తెలుగు పిల్లల, పెద్దల జ్ఞాన దాహాన్ని, శాస్త్రీయ చింతనను ఒకరకంగా తీరుస్తున్నాయని చెప్పవచ్చు. వీటిలో నలభైపుస్తకాలు ఆన్‌లైన్‌లో కూడా పీడీఎఫ్ రూపంలో ఉచితంగా అందుబాటులో ఉండటం చాలా మంచి విషయం.

పండుగలు, సంప్రదాయాలు, పేరుకుపోతున్న మౌఢ్యం వంటివాటి వెనుక చారిత్రక అంశాలను వివరించి చెబుతున్న ఇలాంటి రచనలను ప్రతి పండుగ పూటా గుర్తు చేయడం, ప్రత్యామ్నాయ పత్రికలు ప్రచురించడం చాలా అవసరం. నిఖిలేశ్వర్ గారు పాతికేళ్ల క్రితం ఉదయం పత్రికలో అనుకుంటాను. శ్రామికవర్గ పండుగల గురించి చాలా మంచి వ్యాసం రాశారు. అలాంటివి తరం తరానికి అందాలి. కనీసం ఆన్‌లైన్ ప్రతులుగా అయినా అందరికీ అందుబాటులో ఉంటే మంచిదేమో..

మనుషులు జరుపుకుంటున్న ప్రతి పండుగ వెనుక ఎంత  చరిత్ర దాగి ఉందో.. మన వ్యవసాయ సంస్కృతిని వందల సంవత్సరాలుగా ప్రదర్శిస్తూ వస్తున్న పండుగలు ఇప్పటి వేలం వెర్రిలో, తెప్పలుగా పారుతున్న భక్తి రసం వెల్లువలో తమ రూపాన్ని, సారాన్ని పూర్తిగా మార్చుకుంటున్నాయి.

‘లోకాయత’ భారతీయ తాత్వికచింతనలో హేతువుకు, నాస్తిక వాదానికి పట్టం గడుతూ దశాబ్దాల క్ర్రితమే దేవీప్రసాద్ చటోపాధ్యాయ రాసిన పరమ ప్రామాణిక రచన. మోర్గాన్ రాసిన ‘పురాతన సమాజం’ తో సరిపోలగల గొప్ప రచన. కాని 700 పేజీల ఈ ఉద్గ్రంతం తెలుగు పాఠకులకు ఈనాటికీ అందుబాటులో లేదు. నిజమైన విషాదం.

కొడవటిగంటి కుటుంబరావు గారి రచనల సంకలనాలలో విరసం గతంలో ప్రచురించిన “సంస్కృతి వ్యాసాలు” సంపుటిలో మన ప్రాచీన ఆచార వ్యవహారాలు, పండుగలు, సంప్రదాయాలు గురించిన విశ్లేషణాత్మక రచనలు చాలానే ఉన్నాయి. ప్రత్యేకించి గోత్రాల వెనుక నేపథ్యంపై, వివిధ కుల, వర్గ సమూహాలు చరిత్ర క్రమంలో పాటిస్తూ వచ్చిన నిషేధాలపై చక్కటి వివరణ ఈ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకం త్వరలో ప్రచురణ కావచ్చు.

వందేళ్ల క్రితం కందుకూరి, గురజాడ తదితరులు తెలుగు సమాజానికి అందించిన హేతుపూర్వక భావ సంస్కారం ఇప్పుడు కనుమరుగవుతున్నట్లోంది.

హితసూచిని : రాజశేఖర చరిత్ర

http://kanthisena.blogspot.com/2010/12/blog-post.html

వీధికొక గుడి, గుంపులుగా దందాలు.. ‘తెలుగునాట భక్తిరసం కుప్పలుగా పారుతోంది…’ అంటూ తెలుగు కవి చేసిన అద్భుత వ్యక్తీకరణ ఇప్పుడు మరింత వాస్తవంగా మారుతోంది.

కృష్ణయ్యగారూ,
హేతు దృష్టిని, శాస్త్రీయ చింతనను ప్రోత్సహించే ఇలాంటి మంచి రచనలను వీలైనప్పుడల్లా తప్పక పంచుకోగలరు. చరిత్ర పట్ల, సైన్స్ పట్ల మమకారం గల మీరు సైన్స్, ఆధ్యాత్మికత అంశాలపై తెలుగు బ్లాగుల్లో కొనసాగుతున్న చర్చలో కూడా పాల్గొంటే మంచిదేమో.. ఆలోచించండి.

బొందలపాటి సీతారాం ప్రసాద్ గారు మతం, సైన్స్, ఆధ్యాత్మికత వంటి అంశాలపై గత కొంత కాలంగా తన బ్లాగులో తన కోణంలో తను చర్చిస్తున్నారు. ప్రాథమికంగా ఈయన మత వ్యతిరేకీ కాదు, సైన్స్ వ్యతిరేకీ కాదు. తన వ్యక్తిగత అనుభవాలు, అనుభూతులు, పరిశీలన ద్వారా మతం, సైన్స్ పట్ల తనకు ఏర్పడుతున్న భావాలను అక్షరీకరిస్తున్నారు.

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్

http://bondalapati.wordpress.com

సైన్స్ పరిధికి, సైన్స్ పరిమితికి అవతల ఉంటున్న అంశాలను ఆధ్యాత్మిక కోణంలో పరిశీలించవచ్చు అని ఈయనా, ఇతర మిత్రుల అభిప్రాయం.  సైన్స్‌ని సైన్స్‌గానూ, ఆధ్యాత్మికతను ఆధ్యాత్మికతగానూ పరిశీలించడానికి, సానుకూల, ప్రతికూల అభిప్రాయాలను పరస్పరం పంచుకోవడానికి సీతారాం గారి కింది రచనలు ఉపయోగపడతాయనుకుంటాను.

ముఖ్యంగా సైన్స్ ఎన్నటికీ కనిపెట్టలేని అంశాలు, సైన్స్‌కు సాధ్యం కాని ఆవిష్కరణలు, భౌతిక సూత్రాలకు అతీతంగా, నిరూపితం కాని వాస్తవాలు అంటూ ఈయన పంచుకుంటున్న స్వంత ఆలోచనలపై సమగ్ర అవగాహనకోసం కింది లింకులను అధ్యయనం చేయవలసిన  అవసరముంది.

సైన్స్‌‌లో లోతుగా ప్రవేశమున్నవారు -సైన్స్ రచనలు చదువుకున్నవారు, సైన్స్ పట్ల అభిమానం ఉన్నవారు, విశ్వాసం ఉన్నవారు కాదు అని కాదు- ఈ చర్చలో పాల్గొంటే మంచి ఫలితాలు వస్తాయని నా ఉద్దేశం.

రోహిణీ ప్రసాద్ గారూ, శ్రీనివాస చక్రవర్తి గారూ -శాస్త్రవిజ్ఞానము బ్లాగు,  http://scienceintelugu.blogspot.com – మీ అమూల్యమైన సమయాన్ని కాస్త ఈ ప్రతిపాదిత అంశాలపై వెచ్చిస్తే ఈ చర్చ ఫలవంతమవుతుందని భావిస్తున్నాను. ఏ మాత్రం వీలున్నా మీరు కింది లింకులను చూడగలరు.

బ్లాగు రూపంలో చర్చ కష్టమనుకుంటే నేరుగా సీతారాం గారితోటే మీరు చర్చించవచ్చు. తన ఈమెయిల్ ఐడీ కింద చూడగలరు.

sitarama.prasad@gmail.com

 

అతీంద్రియ శక్తులు : నా అనుభవాలూ, ఆలోచనలూ, వైఖరి.

అలౌకిక అనుభవాలు: నా అనుభవాలూ, ఆలోచనలూ, వైఖరి.

దేవుడూ, సృష్టి జననం, కాలం యొక్క అంతం మొదలైన ప్రశ్నలు..

జ్ఞానోదయాలు, అధిభౌతిక ప్రపంచం (metaphysical world), పరిపూర్ణ సత్యం మొదలైనవి..

మానవ జాతి పయనం ఎటు వైపుకి?

విశ్వం పుట్టుక కి కారణం లేదనటం హేతువాదమే!

స్వేఛ్ఛాఇఛ్ఛ, లేక ఫ్రీ విల్, ఉందా..లేదా..?

మతమూ, సైన్సూ వాటి ఆవశ్యకత…

రిచర్డ్ ఫేన్మేన్ మతం,సైన్స్ గురించి ఇచ్చిన ఉపన్యాసాలు

NB: సైన్స్‌తో, ఆధ్యాత్మికతో బాగా పరిచయం ఉన్న, అవగాహన ఉన్న ఇతర మిత్రులు ఎవరయినా సరే ఈ చర్చలో పాలు పంచుకోవచ్చు. శాస్త్ర జ్ఞానంపై, సైన్స్ ఆవిష్కరణలపై, భౌతిక సూత్రాల పరిమితిపై, ఆధ్యాత్మికతపై కూడా చర్చ జరగడం తెలుగులో చాలా, చాలా తక్కువ.  అందులోనూ ఆరోగ్యకరమైన చర్చ జరగటం మరీ తక్కువ. తెలుగులో, ఇంగ్లీషులో కూడా పై లింకులలో మీరు చర్చించవచ్చు. మీ అవగానలను పంచుకోవచ్చు.

శాస్త్రవిజ్ఞానం

http://scienceintelugu.blogspot.com

శాస్త్ర విజ్ఞానం – ఆధునిక సమాజాల ఆయువుపట్టు అనే  కేప్షన్‌తో తెలుగులో ఒక నిబద్ద సైన్స్  బ్లాగ్ పాఠకులందరికీ అందుబాటులో ఉంది. విజ్ఞాన శాస్తంలోని వివిధ విభాగాలపై కథ, నవల వంటి ఆకర్షణీయ శైలితో రెగ్యులర్‌గా ఈ బ్లాగును నడుపుతున్నారు. శాస్త్ర విషయాలను ఇంత విస్తృతంగా రోజువారీగా పోస్ట్ చేస్తున్న బ్లాగు మరొకటి తెలుగులో లేదంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఈ విశిష్ట బ్లాగు ఇతర భారతీయ భాషలలో కూడా వస్తోంది.

కలైడోస్కోప్‌ఇండియా

http://www.kaleidoscopeindia.blogspot.com/

 

తెలుగులో సైన్స్ మీదే రాస్తున్న కొన్ని బ్లాగులను కింద చూడండి.

http://scienceintelugu.blogspot.com/
http://lolakam.blogspot.com/
http://rohiniprasadkscience.blogspot.com/
http://emitiendukuela.blogspot.com/2010/05/what-is-raman-effect.html

 

NB: ఇప్పుడే చూస్తున్నాను సాహిత్యాభిమాని బ్లాగులో చందమామ అభిమాని శివరాంప్రసాద్ గారు వినాయకచవితి పేరిట జరుగుతున్న పనికిరాని ఆర్భాటాలపై చక్కటి వ్యంగ్య రచన ప్రచురించారు. కింది లింకులో చూడండి.

అమ్మో వినాయక చవితి!

http://saahitya-abhimaani.blogspot.com/2011/09/blog-post.html

శివరాంప్రసాద్ గారూ, ఆధ్యాత్మికతను పాటిస్తున్నప్పటికీ పండుగల పేరుతో సాగుతున్న వేలంవెర్రిని దుయ్యబడుతూ చక్కటి కథనం ప్రచురించినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లు ఎవరో ఒకరు మూడో కన్ను తెరవనంతవరకు పండుగ పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట పడదనుకుంటాను.

మరోసారి అభినందనలు.

 

 

 

రాజశేఖర రాజు
http://blaagu.com/chandamamalu
http://kanthisena.blogspot.com

krajasekhara@gmail.com

 

RTS Perm Link