చందమామ విజయగాథ….!!!

August 25th, 2011

“భారతీయ సాహిత్యాకాశంలో కథా కాంతులు మెరిపించిన గొప్ప చరిత్ర చందమామ సొంతం. కోట్లాది మంది పిల్లల, పెద్దల మనో ప్రపంచంపై దశాబ్దాలుగా మహత్ ప్రభావం కలిగిస్తున్న అద్వితీయ చరిత్ర చందమామకే సొంతం. గ్రామఫోనూ, రేడియో తప్ప మరే ఇతర వినోద విజ్ఞాన సాధనమూ లేని కాలంలో చదువగలిగిన ప్రతి వారికి చక్కటి వినోద సాధనంగా పనిచేసిన చరిత్రకు సజీవ సాక్ష్యం చందమామ.

చందమామ ఆవిర్భవించి అప్పుడే ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. ఇలాంటి కథల పత్రిక ప్రపంచంలో మరొకటి లేదని సామాన్యులు, మాన్యులు కూడా ముక్తకంఠంతో దశాబ్దాలుగా ఘోషిస్తున్నారు. చందమామ పత్రిక పఠనంతో తమ జ్ఞాపకాలను అపూర్వంగా పంచుకుంటున్నారు. ఆధునిక తరం అవసరాలకు అనుగుణంగా రూపొందిన పిల్లల పత్రికలు ఎన్ని వచ్చినా; కంప్యూటర్లూ, సెల్‌ఫోన్లూ, ఐప్యాడ్‌లూ వంటి ఆధునిక సాంకేతిక, వినోద ఉపకరణాలు ఎన్ని ఉనికిలోకి వచ్చినా పిల్లలూ, పెద్దలూ, వయో వృద్ధులూ.. ఇలా అన్ని వయస్సుల వారినీ, తరాల వారినీ అలరిస్తూ వస్తున్న ఏకైక కథల పత్రిక అప్పుడూ ఇప్పుడూ కూడా చందమామే.

తెలుగు నేలమీదే కాదు.. భారతీయ భాషలన్నింటిలోనూ అలనాటి తరం, నేటి తరం పాఠకులు ఎవ్వరూ కూడా చందమామతో తమ అనుబంధం మర్చిపోలేదు. చందమామ కథలతో పాటే పెరిగిన పిల్లలు జీవితంలో ఎన్ని దశలనూ అధిగమించినా సరే ఈనాటికీ వారు తమ బాల్యాన్ని మర్చిపోలేదు. తమ బాల్యాన్ని మంత్రనగరి సరిహద్దులలో ఊగించి, శ్వాసించిన చందమామ కథలనూ మర్చిపోలేదు. దేశీయ భాషలకు చెందిన సమస్త పాఠకులూ ఈనాటికీ చందమామ కార్యాలయానికి పంపుతున్న లేఖలూ, అభిప్రాయాలే దీనికి తిరుగులేని సాక్ష్యం.

తొలి సంచిక ప్రారంభమైన 1947 నుంచి చందమామ పత్రికను కొంటూ తమ పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకూ కూడా చందమామ కథలు చదివి వినిపిస్తూ, తాము మళ్లీ మళ్లీ చదువుతూ చందమామతో తాదాత్మ్యం చెందుతున్న పాఠకులు దేశంలో ఏ భాషలోనూ, ఏ ప్రాంతంలోనూ మరే పత్రికకూ లేరని చెప్పడంలో ఇసుమంత అతిశయోక్తి లేదు.

తెలుగునాడులో, భారతదేశంలో కొన్ని తరాల పిల్లలు, పెద్దల కాల్పనిక ప్రపంచాన్ని చందమామ కథలు ఉద్దీప్తం చేశాయి. నాగిరెడ్డి-చక్రపాణిగార్ల మహాసంకల్పం, కుటుంబరావు గారి అద్వితీయ -గాంధీ గారి-శైలి చందమామ కథలకు తిరుగులేని విజయాన్నందించింది. ఆ కథల అమృత ధారలలో దశాబ్దాలుగా ఓలలాడుతూ వస్తున్న వారు చందమామ కథాశ్రవణాన్ని తమ తదనంతర తరాల వారికి కూడా అందిస్తూ ఒక మహత్తర సంస్కృతిని కొనసాగిస్తూ వస్తున్నారు….”

 

మాలిక వెబ్ పత్రికకు రచనలు పంపమని కొన్ని రోజుల క్రితం వలభోజు జ్యోతిగారు మెయిల్ పంపారు. కాస్త ఆలస్యంగానే చందమామ విజయగాథ అనే పేరుతో ఈ కథనం పంపడంతో వారు సాదరంగా స్వీకరించి ప్రచురించారు.  ఏ విజయగాథకూ తీసిపోని చందమామ కథపై ఈ చిన్ని కథనం పూర్తి పాఠాన్ని చూడాలంటే కింది లింకుపై క్లిక్ చేయండి.

‘చందమామ’ విజయగాథ

ఒక పత్రిక మరో పత్రిక గురించి  ఆ పత్రిక ఇంకో పత్రిక గురించి బండబూతులతో సత్కరించుకుంటున్న పాడుకాలం ఇది.  చందమామ పత్రిక చరిత్రను తడుముతున్న  ఈ కథనాన్ని ప్రచురణకు స్వీకరించిన మాలిక వెబ్ పత్రిక నిర్వాహకులకు కృతజ్ఞతలు.

జ్యోతి గారూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు.

 

 

 

 

 

 

RTS Perm Link


2 Responses to “చందమామ విజయగాథ….!!!”

 1. Ennela on August 26, 2011 11:24 PM

  అవునండీ అసలు టీవీలు అవీ లేని కాలంలో ఒక కథని కళ్ళకి కట్టినట్టు చెప్పడం…ఇంకా మనం ఆ వర్ణనలని అతి సుందరంగా మనసులో ముద్రించుకోవడం ఇవన్నీ మన” మామ” వల్లే కదా! చందమామ పుస్తకం తెలియని పిల్లలు ఉండరనడం అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు..ఎక్కడైనా 10 చందమామలు ఒక్క సారి దొరికాయంటే , అపూర్వ సంపద ఇస్తా అన్న ఒద్దు యీ 10 పుస్తకాలు చాలు అని చెప్పేంత అపురూపమైన వస్తువులవి….చందమామ ఔన్నత్యం వెనక ఉన్నవారి శ్రమ నైపుణ్యం గురించి వ్రాయాలనే ఆలోచన అభినందనీయం.

 2. chandamama on August 27, 2011 10:04 AM

  ధన్యవాదాలు ఎన్నెల గారూ,

  ప్రస్తుతం న్యూజెర్సీలో ఉంటున్న లలిత గారు – telugu4kids.com – ఈ మధ్యే మెయిల్ పంపారు. ఇటీవలే వారి ఇంటిలో చిన్న విందు కార్యక్రమానికి తెలిసినవారిని పిలిచినప్పుడు వారింట్లో ఉన్న ఇటీవలి చందమామలను చూపించారట. అమెరికాలోనూ చందమామలు దొరుకుతున్నాయా? ఎలా తీసుకుంటున్నారు? అంటూ అడిగి కార్యక్రమం ముగిసిన తర్వాత కొన్ని చందమామలను చదివి ఇస్తామని తమ ఇళ్లకు పట్టుకెళ్లారట. జీవితం కోసం వేలాది మైళ్ల దూరం పయనించి వెళ్లినవారు కూడా చందమామను మర్చిపోలేదు. ఆ జ్ఞాపకాలను వదులుకోలేదు.

  మీకో చిన్న సలహా. వీలయితే చందమామ ఇటీవలే ప్రచురించిన చందమామ ఆర్ట్‌బుక్ తెప్పించుకోండి. చందమామ అలనాటి చిత్రకారులు సర్వశ్రీ చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వపాగార్లు వేసిన 180 ఒరిజనల్ చిత్రాలను అద్భుతమైన నాణ్యతతో ఈ పుస్తకంలో ప్రచురించడమైనది. వెల కాస్త అధికమే. మన దేశంలో రూ.1500లు ఇతర దేశాలకయితే 38 డాలర్లుగా నిర్ణయించారు. మధ్యతరగతి వర్గాలు ఇంతపెట్టి కొనడానికి కష్టమే కావచ్చు. కాని కొనగలిగితే జీవితపర్యంతం దాచుకోదగిన అపరూప పుస్తకం. వీలయితే చూడండి. మరోసారి ధన్యవాదాలు..

  మీకూ బాల్యంలో చందమామ జ్ఞాపకాలు ఉంటాయనిపిస్తోంది. చిన్నప్పుడు చందమామను చదివిన అనుభవం ఉంటే తప్పకుండా మీ చందమామ జ్ఞాపకాలను రాసి నా మెయిల్ ఐడీకి పంపండి.

  rajasekhara.raju@chandamama.com
  krajasekhara@gmail.com

  మీ ఫోటో, వృత్తి వివరాలు కూడా పంపగలరు. అయితే ఫోటో తప్పనిసరి కాదు. మీ చందమామ జ్ఞాపకాలను ప్రింట్ చందమామలో ఒకటి లేదా రెండుపేజీలలో ప్రచురిస్తాము. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి చందమామ జ్ఞాపకాలను పత్రికలో వరుసగా ప్రచురిస్తున్నాము. ప్రపంచం నలుమూలలనుంచి పాఠకులు, అభిమానులు చందమామతో తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఈ వేదిక పూర్తిగా పాఠకులదీ, అభిమానులదీ కాబట్టి తప్పక దీన్ని ఉపయోగించుకోగలరు. మీకు తెలిసిన మీ స్నేహితులకు ఈ విషయం తెలియపర్చి చందమామ జ్ఞాపకాలు పంపమని చెప్పగలరు.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind