చందమామ విజయగాథ….!!!

August 25th, 2011

“భారతీయ సాహిత్యాకాశంలో కథా కాంతులు మెరిపించిన గొప్ప చరిత్ర చందమామ సొంతం. కోట్లాది మంది పిల్లల, పెద్దల మనో ప్రపంచంపై దశాబ్దాలుగా మహత్ ప్రభావం కలిగిస్తున్న అద్వితీయ చరిత్ర చందమామకే సొంతం. గ్రామఫోనూ, రేడియో తప్ప మరే ఇతర వినోద విజ్ఞాన సాధనమూ లేని కాలంలో చదువగలిగిన ప్రతి వారికి చక్కటి వినోద సాధనంగా పనిచేసిన చరిత్రకు సజీవ సాక్ష్యం చందమామ.

చందమామ ఆవిర్భవించి అప్పుడే ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. ఇలాంటి కథల పత్రిక ప్రపంచంలో మరొకటి లేదని సామాన్యులు, మాన్యులు కూడా ముక్తకంఠంతో దశాబ్దాలుగా ఘోషిస్తున్నారు. చందమామ పత్రిక పఠనంతో తమ జ్ఞాపకాలను అపూర్వంగా పంచుకుంటున్నారు. ఆధునిక తరం అవసరాలకు అనుగుణంగా రూపొందిన పిల్లల పత్రికలు ఎన్ని వచ్చినా; కంప్యూటర్లూ, సెల్‌ఫోన్లూ, ఐప్యాడ్‌లూ వంటి ఆధునిక సాంకేతిక, వినోద ఉపకరణాలు ఎన్ని ఉనికిలోకి వచ్చినా పిల్లలూ, పెద్దలూ, వయో వృద్ధులూ.. ఇలా అన్ని వయస్సుల వారినీ, తరాల వారినీ అలరిస్తూ వస్తున్న ఏకైక కథల పత్రిక అప్పుడూ ఇప్పుడూ కూడా చందమామే.

తెలుగు నేలమీదే కాదు.. భారతీయ భాషలన్నింటిలోనూ అలనాటి తరం, నేటి తరం పాఠకులు ఎవ్వరూ కూడా చందమామతో తమ అనుబంధం మర్చిపోలేదు. చందమామ కథలతో పాటే పెరిగిన పిల్లలు జీవితంలో ఎన్ని దశలనూ అధిగమించినా సరే ఈనాటికీ వారు తమ బాల్యాన్ని మర్చిపోలేదు. తమ బాల్యాన్ని మంత్రనగరి సరిహద్దులలో ఊగించి, శ్వాసించిన చందమామ కథలనూ మర్చిపోలేదు. దేశీయ భాషలకు చెందిన సమస్త పాఠకులూ ఈనాటికీ చందమామ కార్యాలయానికి పంపుతున్న లేఖలూ, అభిప్రాయాలే దీనికి తిరుగులేని సాక్ష్యం.

తొలి సంచిక ప్రారంభమైన 1947 నుంచి చందమామ పత్రికను కొంటూ తమ పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకూ కూడా చందమామ కథలు చదివి వినిపిస్తూ, తాము మళ్లీ మళ్లీ చదువుతూ చందమామతో తాదాత్మ్యం చెందుతున్న పాఠకులు దేశంలో ఏ భాషలోనూ, ఏ ప్రాంతంలోనూ మరే పత్రికకూ లేరని చెప్పడంలో ఇసుమంత అతిశయోక్తి లేదు.

తెలుగునాడులో, భారతదేశంలో కొన్ని తరాల పిల్లలు, పెద్దల కాల్పనిక ప్రపంచాన్ని చందమామ కథలు ఉద్దీప్తం చేశాయి. నాగిరెడ్డి-చక్రపాణిగార్ల మహాసంకల్పం, కుటుంబరావు గారి అద్వితీయ -గాంధీ గారి-శైలి చందమామ కథలకు తిరుగులేని విజయాన్నందించింది. ఆ కథల అమృత ధారలలో దశాబ్దాలుగా ఓలలాడుతూ వస్తున్న వారు చందమామ కథాశ్రవణాన్ని తమ తదనంతర తరాల వారికి కూడా అందిస్తూ ఒక మహత్తర సంస్కృతిని కొనసాగిస్తూ వస్తున్నారు….”

 

మాలిక వెబ్ పత్రికకు రచనలు పంపమని కొన్ని రోజుల క్రితం వలభోజు జ్యోతిగారు మెయిల్ పంపారు. కాస్త ఆలస్యంగానే చందమామ విజయగాథ అనే పేరుతో ఈ కథనం పంపడంతో వారు సాదరంగా స్వీకరించి ప్రచురించారు.  ఏ విజయగాథకూ తీసిపోని చందమామ కథపై ఈ చిన్ని కథనం పూర్తి పాఠాన్ని చూడాలంటే కింది లింకుపై క్లిక్ చేయండి.

‘చందమామ’ విజయగాథ

ఒక పత్రిక మరో పత్రిక గురించి  ఆ పత్రిక ఇంకో పత్రిక గురించి బండబూతులతో సత్కరించుకుంటున్న పాడుకాలం ఇది.  చందమామ పత్రిక చరిత్రను తడుముతున్న  ఈ కథనాన్ని ప్రచురణకు స్వీకరించిన మాలిక వెబ్ పత్రిక నిర్వాహకులకు కృతజ్ఞతలు.

జ్యోతి గారూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు.

 

 

 

 

 

 

RTS Perm Link