విజిటింగ్ కార్డుతోనూ ప్రమాదమే…

August 4th, 2011

అదొక పెట్రోల్ పంపు. తన కారులో పెట్రోల్ పోయించుకుంటున్న మహిళవద్దకు ఒకతను వచ్చి తానొక పెయింటర్ నని చెప్పుకున్నాడు. తన సేవలు అవసరమైతే పిలువమంటూ తన విజిటింగ్ కార్డును ఆమె చేతిలో పెట్టి వెళ్ళాడు. ఆమె మారుమాటాడకుండా తల ఊపి ఆ కార్డును తీసుకుని కారులో కూర్చుంది. ఆ వ్యక్తి కూడా మరొక వ్యక్తి కారులో కూర్చున్నాడు.

పెట్రోల్ పంపు వద్దనుంచి బయటపడ్డ ఆమెకు, అదే సమయంలో తనను ఆ వ్యక్తులిద్దరూ వెంబడిస్తున్నట్లు అర్థమైంది. మరుక్షణంలోనే ఆమెకు కళ్లు తిరిగినట్లయింది. శ్వాస పీల్చడం కూడా ఆమెకు కష్టమైపోయింది. కారు తలుపు తీయడానికి ప్రయత్నించింది. ఇంతలో తన చేతినుంచి ఏదో వాసన వస్తున్నట్లనిపించిందామెకు. పెట్రోల్ బంక్ వద్ద ఆ వ్యక్తి వద్దనుంచి కార్డు తీసుకున్నచేతి నుండే ఆ వాసన వస్తోంది.

ఇంతలో ఆ ఇద్దరు వ్యక్తులూ తనకు అతి సమీపంలోకి వచ్చినట్లు ఆమె గమనించింది. ఏదో ఒకటి తక్షణమే చేయాలని అర్థమై, దారి మలుపులోకి కారును మళ్లించి సహాయం చేయమంటూ అదే పనిగా హారన్ మోగించడం మొదలుపెట్టింది. దీంతో ఆ వ్యక్తులు అక్కడినుంచి వెళ్ళిపోయారు. తర్వాత కూడా ఆమె చాలాసేపు అక్కడే ఇబ్బందిపడుతూ ఉండిపోయింది. చివరకు ఆమె శ్వాస పీల్చుకోసాగింది.

దీనంతటికీ కారణం ఆమె ఆ వ్యక్తినుంచి తీసుకున్న కార్డే. ఆ కార్డుపై పూయబడిన పదార్థం ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.

ఆ మందు పేరు బురుండంగ -Burundanga- దీనిగురించి ప్రజలకు పెద్దగా తెలీదు కాని అంతర్జాలంలో దీనిపై చాలా సమాచారమే పొందుపర్చబడి ఉంది. వ్యక్తులకు ఊపిరాడకుండా  నిర్వీర్యులను చేసి వారినుండి ఏదైనా తస్కరించడానికి ఈ డ్రగ్‌ని ఉపయోగిస్తున్నారట. ఇది ‘డేట్ రేప్ డ్రగ్’ కంటే నాలుగింతల ప్రమాదకరంగా ఉంటుందని వార్తలు.

మహిళలపై అత్యాచారం చేయడానికి చాలాకాలంగా ‘మృగాళ్లు’ ఉపయోగిస్తున్న డ్రగ్ ముద్దు పేరు ‘డేట్ రేప్ డ్రగ్’ దీన్ని ఆహారంలో, పానీయంలో కూడా కలిపి ప్రయోగిస్తుంటారు.

‘బురుండంగా’ అని పైన ప్రస్తావించిన మందు సాధారణమైన కార్డు లేదా కాగితంపై కూడా పూసి తీసుకుపోవడానికి వీలుగా ఉంటోందట.

కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా వీధుల్లో వెళుతున్నప్పుడు పొరపాటుగా కూడా విజిటింగ్ కార్డులు, పత్రాలు వంటివాటిని ఎవరైనా ఇస్తే తీసుకోకూడదని విజ్ఞుల హెచ్చరిక.

మన ఇంటి ముంగిటకు వచ్చి తలుపు తట్టి, ఫలానా సేవలందిస్తామంటూ ఏదో ఒక కార్డు ముక్క చేతుల్లో పెట్టే సందర్బాలకు కూడా ఈ హెచ్చరిక వర్తిస్తుందట.

ఇది ముంబై పోలీస్ బలగాలకు చెందిన ఒక వ్యక్తి ఇటీవల పంపిన ఈమెయిల్ అట.

మీ భార్య, సోదరిలు, కుమార్తెలు, మనవరాళ్ళు, అమ్మలు, స్నేహితురాళ్ళు, సహచరులు -విమెన్ కొల్లీగ్స్- అందరికీ ఈ సందేశాన్ని పంపించవలసిందని ఈ ఈమెయిల్ అభ్యర్థన.

మందుబాబుల పిల్లలపై మన సమాజంలో పడుతున్న తీవ్రమైన దుష్ప్రభావాల గురించి ‘ఆల్కహాలిక్ పిల్లలు‘, ‘బుజ్జి’ అనే రెండు అతి మంచి పుస్తకాలను ఇటీవలే ప్రచురించి ఉచితంగా పంపిణీ చేస్తున్న శ్రీదేవీ మురళీధర్ గారు ఇవ్వాళ ఇంగ్లీషులో పంపిన హెచ్చరిక సందేశానికి తెలుగు సేత ఇది. దీంట్లోని అక్షరాక్షరం వాస్తవమే.

కాని. ఒక్కమాట మాత్రం చెప్పితీరాలి. 20 ఏళ్లకు పైగా పల్లెటూళ్లలో జీవితం గడిపినంత కాలం మా ఊళ్ల ఆడపడుచులకు ఇలాంటి భయాలు ఒక్కటంటే ఒక్కటీ కూడా ఉండేవి కావు. కాస్త ఏమారితే జీవితాలనే మార్చేసే ఇలాంటి భయంకరమైన మందుల గురించీ, మాదక ద్రవ్యాల గురించి, విషపుటాలోచనల ప్రతిబింబాల గురించీ మా ఊహల్లోకూడా అనుభవంలోకి వచ్చేవి కావు.

ఇతరులకు సహాయం చేయి, చెడు సహవాసం చేయకు.. అనే బోధలు మాత్రమే మా ఊళ్లలో వినిపించేవి. కానీ. మనిషి కాదు కదా. వాడిచ్చే కార్డు ముక్కను కూడా నమ్మవద్దని పై సందేశం ఆకాశంలో సగాన్ని హెచ్చరిస్తోంది. పక్క ప్రయాణీకుడిచ్చే బిస్కట్ ముక్క కూడా ముట్టరాదన్న ప్రచారం మన రైళ్లలో ఎప్పుడో మొదలైపోయింది.

అసత్యములాడరాదు, పెద్దలను గౌరవించవలెను అంటూ తరతరాలుగా నీతిబోధలు చేస్తూ వస్తున్న సమాజంలో ఆధునిక నీతి బోధలు ఇలాంటి రూపంలోకి మారుతున్నాయి.

బిస్కట్టును నమ్మవద్దు… కార్డును నమ్మవద్దు.. మనిషిని నమ్మరాదు. మగాడిని, మృగాడిని నమ్మరాదు. మనందరం గర్వంగా చెప్పుకుంటున్న, పిలుచుకుంటున్న ఆధునిక జీవితం మన కళ్లముందే ఎంత పలుచనవుతుందో కదా…!!!

మనుషులను మనుషులే నమ్మడానికి వీల్లేకుండా పోతున్న సమాజ వాస్తవికతను ఇంత నగ్నంగా ఎత్తి చూపే ఈమెయిల్‌ని పంపిన శ్రీదేవి గారూ…

మీకు కృతజ్ఞతలు చెప్పాలా వద్దా అని తటపటాయిస్తున్నానండీ..

RTS Perm Link