చందమామ కథ
చందమామ చరిత్రకు సంబంధించి 2006 సంవత్సరానికి ఓ విశిష్టత ఉంది. చందమామ అంతర్గత విషయాల గురించి లక్షలాదిమంది పాఠకులకు ఇటు ప్రింట్‌లోనూ, అటు ఆన్‌లైన్‌లోనూ తొలిసారిగా పరిచయం చేసిన సంవత్సరమది. దీనికి ఈమాట.కామ్ వెబ్సైట్లో అంకురార్పణ చేసినవారు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు, తర్వాత చందమామ కథ పేరిట ఈనాడులో ఆదివారం అనుబంధంలో వచ్చిన ప్రధాన కథనం. తర్వాత తెలుగు వికీపీడియా వెబ్సైట్లో చందమామ అభిమానులు కొందరు కలిసి చందమామ విశిష్ట చరిత్రపై రాసిన బృహత్ వ్యాసం.
ఈ మూడు కథనాలు అప్పటినుంచి ఇప్పటి దాకా చందమామ గురించి తెలుసుకోవాలనుకునేవారికి కరదీపికలాగా ఉపయోగపడుతున్నాయి. ఆ తర్వాత సర్వశ్రీ వసుంధర, త్రివిక్రమ్, శివరామ్ ప్రసాద్, బ్లాగాగ్ని, నాగమురళి, సిహెచ్ వేణు, సుజాత, రవి, రవిచంద్ర, తదితర బ్లాగర్లు, రచయితలెందరో తమకు తెలిసిన చందమామ గురించి ప్రధానంగా ఆన్లైన్ పాఠకులతో పంచుకున్నారు. పంచుకుంటున్నారు.
ప్రత్యేకించి శ్రీ కప్పగంతు శివరాం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కేవలం తెలుగు చందమామ పాత చరిత్రను తడుముతున్న వ్యాసాలు, కథనాలను ప్రచురిస్తూ ఆన్లైన్ పాఠకులకు పరిచయం చేస్తున్న మనతెలుగుచందమామ బ్లాగ్ తెలుగు బ్లాగుల్లో ఒక ప్రత్యేక బ్లాగుగా నిలిచింది.
http://manateluguchandamama.blogspot.com
(చందమామ గురించి రాయదలిచిన వారందరికీ ప్రచురించడానికి అవకాశమిస్తూ ఈ విశిష్ట బ్లాగ్ పాఠకుల ఆదరణ పొందుతోంది. దీన్ని గురించి మరొక సారి వివరంగా చర్చించుకుందాం.)
కొన్ని నెలలక్రితం శివరాం ప్రసాద్ గారు ‘మనతెలుగుచందమామ’ బ్లాగును ‘అలనాటితెలుగుచందమామ’ గా పేరు మార్చారు. కింది లింకును చూడగలరు
http://alanaatiteluguchandamaama.blogspot.com
“చందమామ” జ్ఞాపకాలు
కొడవటిగంటి రోహిణీ ప్రసాద్
http://www.eemaata.com/issue41/chandamama.html
ఈమాట.కామ్ వెబ్సైట్లో 2006 జనవరి సంచికలో ఇది ప్రచురించబడింది. చందమామ చరిత్రకు సంబంధించి గత దశాబ్దంలో ఆన్లైన్ పాఠకులకు అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి రచన ఇది.
1960 ప్రాంతాల్లో సెలవురోజుల్లో చందమామ ఆపీసుకు వెళ్లి రోజంతా గడుపుతూ పొందిన అరుదైన చందమామ జ్ఞాపకాలను కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు ఈ పెద్ద వ్యాసంలో వివరించారు. చందమామ లోపలి చరిత్రను సూచనప్రాయంగా తడిమిన తొలిరచన కావడంతో ఇది విశేష ప్రాచుర్యం పొందింది. గత అయిదేళ్లుగా ఈ కథనాన్ని చందమామ అభిమానులు నిరంతరం చదువుతూ ఉపయోగరకమైన లింకులు అందిస్తూ, అభిప్రాయాలు ప్రచురిస్తూ దీన్ని చందమామ నిత్య కరదీపికగా నిలబెడుతూ వస్తున్నారు.
“చందమామ” బృహత్ వ్యాసం
తర్వాత తెలుగు వికీపీడియాలో చందమామ గురించిన తొలి పరిచయం 2006 ఏప్రిల్ 12న జరిగింది. -నిర్దిష్టంగా ఏ తేదీన తెవికీలో చందమామ వ్యాసం సంక్షిప్త భాగం ప్రచురించారో, ప్రస్తుతం దీంట్లో మనందరం చూస్తున్న ప్రధాన వ్యాసం ఎప్పుడు పూర్తి చేశారో తెలీదు. (తెవికీలో చందమామపై పెద్ద వ్యాసం రచనలో పాలుపంచుకున్న అభిమానులందరి పేర్లను త్రివిక్రమ్ గారు తెలిపితే చరిత్రకు ఉపయోగకరంగా ఉంటుంది) ఎంతమంది చందమామ అభిమానులు ఈ బృహత్ వ్యాస రూపకల్పనలో పాలు పంచుకున్నారో తెలీదు కాని, తెవికీ చరిత్రలోనే వందలసార్లు చేర్చి, దిద్ది, సవరించి ప్రచురించిన కొద్ది వ్యాసాలలో ఇదీ ఒకటి.
http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE
చందమామ కథ
2006 నవంబర్ 12న ఈనాడు ఆదివారం అనుబందంలో వచ్చిన చందమామ కథ లక్షలాది మంది పాఠకులను అచ్చురూపంలో చేరి ఉర్రూతలూగించింది. చందమామ చరిత్ర కథను బేతాళుడు చెబుతున్నట్లుగా రూపొందిన ఈ అయిదు పేజీలవ్యాసం చందమామ అద్భుత పయనాన్ని, భారతీయ పాఠకుల ఊహాకల్పనపై అది అద్దిన పంచరంగులను అత్యంత ఆకర్షణీయంగా అచ్చురూపంలో పరిచింది.
రోహిణీ ప్రసాద్ గారి చందమామ జ్ఞాపకాలు వ్యాసం, వికీపీడియాలో వచ్చిన చందమామ వ్యాసం ఈ నాటికీ అంతర్జాల పాఠకులకు అందుబాటులో ఉంటూ వస్తున్నాయి. కాని ఈనాడు ఆన్లైన్లో వారు ప్రచురించిన చందమామ కథ లింకు చాలాకాలంగా అందుబాటులో లేకుండా పోయింది. సంవత్సరం తర్వాత ఆన్లైన్ పత్రికలలోని పాత లింకులను చెరిపివేస్తున్నందున ఈ అపురూప కథనం పాఠకులకు అందుబాటులో లేకుండా పోయింది. 2008లో వికీపీడియాలో చందమామపై కథనం చదివినప్పటినుంచి నేను చెరిపివేయబడిన ఈ లింకుకోసం, చందమామ కథ వ్యాసం ప్రింటవుట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కాని ఫలితం లేకపోయింది.
చిట్ట చివరకు చందమామ ప్రియమిత్రుడు, సిహెచ్ వేణు గారు ఈనాడులో వచ్చిన చందమామ కథ ఫైళ్లను శ్రమతీసుకుని మరీ పంపారు. భారతీయ సాంస్కృతిక రాయబారిగా, మన సాంస్కృతిక వారసత్వంగా ప్రశంసలందుకుంటున్న చందమామ ఉజ్వల చరిత్రను తెలిపే ఈ అరుదైన కథనాన్ని ఇక్కడ ఇమేజ్‌ల రూపంలో చూడండి.
చందమామ చరిత్రపై ఒక అరుదైన వ్యాసం కనుమరుగు కాకుండా తోడ్పడిన వేణుగారికి కృతజ్ఞతాభివందనలు.
అలాగే….
అయిదేళ్ల క్రితమే తెలుగు చందమామ పాఠకుల హృదయాలను రంజింప చేస్తూ ఇంత చక్కటి కథనాన్ని ప్రచురించిన ఈనాడు పత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈనాడు పత్రిక సౌజన్యంతో…
ఇప్పుడు చందమామ కథను ఇక్కడ చూడండి.
గమనిక: నేరుగా ఇక్కడ ఇమేజ్‌లను చూస్తుంటే అక్షరాలు చిన్నవిగా ఉండి కనిపించటం లేదు. ఇమేజ్‌పై క్లిక్ చేసి మరో విండోలో తెరువబడిన ఇమేజీని కుడి క్లిక్ చేస్తే కాస్త స్పష్టంగా కనబడుతోంది. పరిష్కారం దొరికితే సరిచేయడం జరుగుతుంది. ప్రింటవుట్ తీసుకుంటే ఇది మంచి క్వాలిటీతో వస్తోంది.
test Filed under ఈనాడులో చందమామ | Comments (3)
3 Responses to “చందమామ కథ”
Leave a Reply













రాజు గారు,
నాలాగా ఈ వ్యాసాలను అప్పుడు చదవటం మిస్ అయిన వారికే కాకుండా, భవిష్యత్త్ లో మరింత మందికి ఎక్కువ ఉపయోగకరం ఈ ప్రయత్నం. శ్రమకొర్చి వీటిని సంపాదించిన వేణు గారికి ధన్యవాదాలు.
ఈ వ్యాసానికి నెట్ ఎడిషన్ లింకులు ఈమాటలోనూ, వికీపీడియాలోనూ ఇవ్వటం వల్ల వారం తర్వాత ఈ వ్యాసం మాయమైపోయింది. (కొత్త వ్యాసాలతో ఆ లింకు రీప్లేస్ అవుతూ వచ్చింది). అలా ఈ వ్యాసం నెటిజన్లకు అందుబాటులో లేకుండా పోయింది- ఇన్నేళ్ళూ!
ఈ కవర్ స్టోరీ రాసిన జర్నలిస్టు మిత్రుడు జనార్దన్. ‘ఈమాట’ రోహిణీప్రసాద్ గారి వ్యాసంలోని కొన్ని విషయాలను సముచితంగా ఉపయోగించుకుని చక్కగా కథనం తీర్చిదిద్దాడు. ఉత్పల, దాసరి సుబ్రహ్మణ్యం గార్లు సజీవంగా ఉన్నపుడు ప్రచురితమైన వ్యాసమిది!
శంకర్ గారి ఇంటర్ వ్యూ తెలుగులో తొలిసారిగా వచ్చిన సందర్భం ఇదేననుకుంటాను. చెన్నైలో ఉన్న శంకర్ గారి ఇంటర్వ్యూ కోసం ప్రశ్నావళి పంపటం వరకూ మాత్రమే నా పాత్ర. అంతకుమించి ఏమీ లేదు!
రాజు గారు, ఇంత చక్కని వ్యాసం మాకోసం షేర్ చేసినందుకు ఉదయపుర్వక ధన్యవాదాలు. అన్నట్లు నేను మళ్ళా ఈ నెల నుండే చందమామ ని చదవటం మొదలు పెట్టాను, చాలా బాగుంది. బోల్డన్ని క్వాలిటి కథలతో మనోరంజకంగా ఉంది. మల్ల చందమామకు పూర్వ వైభవం వస్తుందని మనసారా ఆశిస్తున్నా. పేపర్ క్వాలిటి మాత్రం కుంచం నిరాశకు గురిచేసింది, అయినా పర్లేదు కథలు బాగున్నాయి కదా.
ధన్యవాదాలు
లక్ష్మి
sailaxmik@gmail.com
Fri, Jul 29, 2011 at 9:37 AM
లక్ష్మిగారూ,
చందమామని మళ్లీ చదవటం మొదలు పెట్టారు. ఒక మంచి పాఠకురాలు చందమామకు మళ్లీ దొరికినట్లే కదా. చాలా సంతోషం. మీకు ఏమాత్రం సమయం ఉంటే మీరు కొత్త చందమామ చదివిన వెంటనే మీకు నచ్చిన కథలు, నచ్చనివి, ఫర్వాలేదనిపించినవి గురించి పేర్కొంటూ మీ అభిప్రాయం తప్పనిసరిగా ఈమెయిల్ చేయండి. నా చందమామ అధికారిక ఈమెయిల్ ఐడీకే పంపండి.
rajasekhara.raju@chandamama.com
అలాగే మీనుంచి చందమామకు కథలు ఆశించవచ్చా.. మంచి రీడర్ మంచి స్టోరీ రైటర్ కూడా కావచ్చు కదా.. ఆలోచించండి.
పేపర్ క్వాలిటీ విషయంలో బాగా విమర్శలు వస్తున్నాయి. మావంతుగా పాఠకుల ప్రతి అభిప్రాయాన్ని యాజమాన్యం వద్దకు తీసుకెళుతున్నాము.
చందమామ మునుపటి చిత్రకారులు సీతారాం గారు మళ్లీ చందమామతో సంబంధంలోకి వచ్చారు. అక్టోబర్ నెల నుంచి ఈయన చిత్రాలు మళ్లీ చందమామను అలంకరించనున్నాయి. శాంపుల్‌గా ఆయన పంపిన చిత్రాలు మావాళ్లకు బాగా నచ్చాయి కనుక బొమ్మల విషయంలో కూడా చందమామ మరికాస్త మెరుగుపడుతుందని చెప్పవచ్చు. పాఠకుల అభిప్రాయమే చందమామ మెరుగుదలకు వజ్రాయుధం లాంటిది కనుక రెగ్యులర్‌గా మీవంటి వారు చందమామ రూపరేఖలపై అభిప్రాయం పంపితేనే మంచిది. మీరు అభిప్రాయం ఇంగ్లీషులో కూడా పంపవచ్చు. నేరుగా అందవలసిన వారికి వేగంగా అందుతుంది.
అభిమానంతో.
రాజు.