లోకంలోని పిల్లలందరూ ఇక మీ పిల్లలే…

July 17th, 2011

ఆదిలక్ష్మి, లెనిన్‌బాబు గార్ల ఏకైక కుమార్తె చిన్నారి గీతా ప్రియదర్శిని అకాల, అసహజ, అర్ధాంతర మరణంపై రెండురోజుల క్రితం ఈ బ్లాగులో తెలియపర్చినప్పటినుండి బ్లాగర్ల నుండి, మిత్రుల నుండి వస్తున్న స్పందనలకు ప్రతిస్పందించలేకపోయాను. పిల్లలు లేని మాకు, ఒకే ఒక చిన్నారిని ఒకానొక ఘోర క్షణంలో పోగొట్టుకున్న ఆ దంపతులకు మధ్య సాన్నిహిత్య పరిచయం ఇలా అనుకోని మలుపు తిరిగిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఇది నిజమో కాదో అనే అసంధిగ్ధ స్థితి నుంచి, విషయాన్ని నిర్ధారించుకున్న దశవరకూ ఈ కథనంలో అప్‌డేట్ చేస్తున్న వివరాలను చూసి స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

ముఖ్యంగా జీవితంలో ఒకే ఒక ఆశకు కూడా దూరమై కుప్పగూలిపోయిన ఆ దంపతులకు చేతనైన సాయం వీలైతే చేయవలసిందిగా ఆ కథనంలో చేసిన అభ్యర్థనకు తక్షణ స్పందన వచ్చింది.

చందమామ కుటుంబాలకు విషాదవార్త

తాము సహాయం చేయడానికి సిద్ధమై కూడా తమ పేర్లు బయటకు పొక్కకుండా, తమ కష్టార్జితం నుంచి తలా కొంచెం వేసుకుని అందించడానికి అమెరికా నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాల వరకు ముందుకొచ్చిన మానవతా మూర్తులకు నమస్కరించడం తప్ప కృతజ్ఞతలు చెప్పలేను.

బిడ్డను కోల్పోయిన దయనీయ క్షణాల్లో డబ్బురూపంలో సాయం అందించడానికి ముందుకొస్తే ఆ తల్లిదండ్రులు స్వీకరించగలరా, తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుందేమో అనే సందేహాన్ని సహాయం చేయదలచిన వారు వ్యక్తపరిచారు. లెనిన్‌బాబుగారిని  ఈవిషయమై నిన్న మధ్యాహ్నం సంప్రదిస్తే, జీవితంలో ఎవరివద్దా చేయి చాపకూడదని, కష్టార్జితంమీదే బతకాలని భావిస్తూ వచ్చామని, ప్రియదర్శిని తల్లి కుప్పగూలి పోయి ఉన్న ఈ క్షణంలో ఏం చెప్పడానికి కూడా పాలుపోవడం లేదని, మీకేది మంచిదనిపిస్తే అది చేయండని నాకు సూచించారు. ఆ ప్రకారమే సహాయం చేయదలిచిన వారికి సమాచారం అందించడమైనది. ఈ కన్నతల్లిని ముందే ఎరిగి ఉన్నవారు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఎంత కొంత సాయం చేయడానికి ముందుకొచ్చారు.

అవసరంలో ఆదుకోవడానికి ముందుకొచ్చిన మిత్రుల మానవీయ స్పందనను స్వాగతిస్తూనే… చిన్న విజ్ఞప్తి.. ఇప్పటికీ దుఃఖ భారం నుంచి బయటపడని ఆ కన్నతల్లి  గుండెబద్దలు కాకూడదని, ఆమె మనిషిగా లేచి నిలబడాలని మనందరమూ కోరుకుంటున్నాము. మీకు వీలైనప్పుడు ఆమెతో ఫోన్ ద్వారా మాట్లాడి స్వాంతన కలిగించండి. ఇంకా సమయం అనుకూలిస్తే… నిజాం పేటలోని ఆమె ఇంటికి వెళ్లి నాలుగు మాటలాడి ధైర్యం చెప్పండి. అంతర్జాలంలో ప్రమదావనం మహిళా బృంద సభ్యులు కూడా ఇవాళ ఈమేరకు సమాచారం పంచుకున్నారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. కుప్పగూలిపోయిన ఆమె లేచి నిలబడడానికి నలుగురూ కలిసి మాట్లాడటం, ధైర్యవచనాలు పలకడం కూడా చాలా అవసరం.

ఆదిలక్ష్మిగారి ఫోన్ నెంబర్ – 9440971265

ఇంతకన్నా దయనీయ పరిస్థితుల్లో బిడ్డలను, నిండు జీవితాలను కళ్లముందే పోగొట్టుకుంటున్న సంఘటనలు మన చుట్టూ వందలాదిగా జరుగుతూనే ఉన్నాయి. అందరం అన్నింటికీ స్పందించలేకపోవచ్చు.. అవసరానికి ఆదుకోలేక పోవచ్చు… కాని కష్టంలో ఉన్నవారిని, పిడుగుపాటుకు గురైనవారిని పలకరించి, సానుభూతి ప్రకటించి మేమున్నామంటూ ధైర్యం చెప్పే మన పురాతన గ్రామీణ సంప్రదాయాన్ని, జీవన సంస్కారాన్ని, వీలైన సందర్భంలో మనకు కుదిరిన సమయంలో అయినా సరే ప్రదర్శించగలిగితే అలాంటి సహాయతత్వం మరికొంతమందికి ప్రేరణగా ఉంటుందని ఓ చిన్న ఆశ.

ఆదిలక్ష్మిగారూ, బిడ్డకు దూరమైన మీరు అనుభవిస్తున్న స్థాయిలో గుండెకోత ఎలాంటిదో మాకు తెలియక పోవచ్చు. కోచింగుల పేరిట పాలుగారే  పిల్లల్ని బండకేసి చేపల్ని తోముతున్నట్లు తోముతున్నారంటూ మీరు ప్రకటించిన ఆగ్రహం కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఆ తోముడు చివరకు ఇలా ప్రియదర్శినినే బలితీసుకోవడం ఊహించలేకపోతున్నాము. ఇక జీవితం వద్దు అని నిర్ణయించుకున్న చివరిక్షణాల్లో పాప ఎంతగా నలిగిపోయిందో ఇక బయటపడదు.

స్వేచ్ఛ అంటే ఏమిటో తెలిసిన పిల్ల, స్వేచ్ఛగా 16 ఏళ్లపాటు మీవద్ద పెరిగిన పిల్ల, ఇంట్లో అలవడుతున్న స్వాభిమానానికి, బయటి జీవితంలో ఎదురవుతున్న వాస్తవానికి మధ్య తేడాను కొంచెంగా అయినా గ్రహిస్తున్న పిల్ల…  ఇలా జీవితాన్ని తీసేసుకోవడం మీకు ఊహకు కూడా అంది ఉండదు. తనమీద పడిన మొద్దు అనే తాజా ముద్రను చెరుపుకోవడానికి పాప తన జీవితాన్నే కోల్పోవడానికి సిద్ధం కావడం నిజంగా ఘోరం.

మనకళ్లముందు ఆస్తులకోసం పిల్లల్ని చంపుతున్నారు. ప్రేమోన్మాదం కోసం ఆసిడ్‌లతో ముంచుతున్నారు. ఇవి ప్రత్యక్ష హత్యలయితే ప్రియదర్శిని వంటి వారు ఎంచుకుంటున్న మార్గం పరోక్ష హత్యల్లో భాగమే. సమాజ పురోగమనానికి ఏ మాత్రం మేలు చేయని హత్యలివి.

ఈ దుర్ఘటన జరగడానికి ముందు ఏం జరిగిందో చెప్పడానికయినా మీరు కోలుకోవడం అవసరం. లేచి తిరగడం అవసరం. మీ ఆశలు పూర్తిగా కూలిపోయాయని తెలుసు. మీరు లేచినిలబడటం చాలా కష్టమని తెలుసు.. మీ సహచరుడు కాస్త ఏమారితే మీరు మిగలరనే విషయం కూడా తెలుసు… కానీ.. జీవితాన్ని ఎందుకు చేతులారా తీసేసుకోకూడదో పిల్లలకు చెప్పడానికయినా మీరు మిగలాలి. మృత్యువును ధిక్కరిస్తూ పాప తీసుకున్న ఆ కఠోర నిర్ణయాన్ని ఎవరూ సమర్థించకపోవచ్చు.. సమర్థించకూడదు కూడా..

పాపలేని ప్రపంచం మీకు శూన్య ప్రపంచంలాగే అనిపించవచ్చు. కాని వ్యక్తిగా మీరు రక్తం పోసి  పెంచిన బిడ్డను కోల్పోయాక ఇప్పుడు మీరు నిజంగా సమూహంలో భాగమయ్యారు. లోకంలోని పిల్లలందరూ ఇక మీ పిల్లలే.. పిల్లలందరిలో మీ పాపను చూసుకోవడం వల్ల వ్యక్తిగా మీకూ, సమాజానికీ కూడా మంచి జరుగుతుంది. పాప లేని ప్రపంచం మనందరికీ ఒక గుణపాఠం కావాలి. ఆ గుణ పాఠాన్ని ప్రపంచంతో పంచుకోవడానికైనా సరే… మీరు కోలుకోవాలి. ఆత్మహననం మంచి మార్గం కాదనే సత్యాన్ని బోధించడానికి మీరు మళ్లీ ఈ ప్రపంచంలో పడాలి. అమ్మ ఒడి పిల్లలందరికీ ప్రేమను పంచే మమతల ఒడిగా మారాలి.

చెప్పడం చాలా సులభం. అందులోనూ గడ్డ పైన ఉండి చెప్పడం ఇంకా సులభం.. కానీ మీరు తేరుకోవటం, తెప్పరిల్లడం మీ చేతుల్లోనే ఉంది. మీ క్షేమం మా అందరికీ అవసరం. తల్లిదండ్రులుగా మీ కష్టం ఇకపైనయినా ఎవరికీ కలగకూడదని, అలుముకున్న చీకటిని తొలగించుకుని మీరు మళ్లీ వెలుగులు పంచిపెడతారని, దారుణంగా భగ్నమయిన మాతృహృదయ ఆకాంక్షలను ప్రపంచంకోసం పరిచి ఉంచుతారని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నా….

లెనిన్‌బాబుగారూ, అమ్మఒడి జాగ్రత్త… ఆదిలక్ష్మి గారు జాగ్రత్త….

RTS Perm Link