వెరీ కైండ్ ఆఫ్ యు సర్…!

July 15th, 2011

శంకర్ గారితో చందమామ పనిమీద ఫోన్లో మాట్లాడిన ప్రతిసారీ ఆయన నాతో చివర్లో చెప్పే మాట “వెరీ కైండ్ ఆప్ యు సర్

చిత్రమాంత్రికుడితో...

 

 

 

 

 

 

 

 

 

 

 

అక్టోబర్ నెల బేతాళ కథకు మరి కొన్ని కథలకు చిత్ర వివరణ -ఇమేజ్ డిస్క్ర్రిప్షన్- పంపుతున్నట్లు చెప్పినప్పుడు, ఆయన యోగ క్షేమాలు విచారించినప్పుడు, ఆయనకు నెలవారీ జీతం చెక్, చందమామ పుస్తకాలు అందాయో లేదో వాకబు చేసినప్పుడు, చందమామతో, చందమామ పనితో ఆయన అనుభవాలను తనతో పంచుకున్నప్పుడు హృదయ పూర్వకమైన అభిమానంతో ఆయన అనే చివరిమాట ఇది. ‘వెరీ కైండ్ ఆఫ్ యు సర్’.

ఎప్పుడు ఆయనకు పోన్ చేసినా సరే బిజనెస్ లైక్‌గా నాలుగు ముక్కలు మాట్లాడి ఫోన్ పెట్టేయడం అసాధ్యం. పైగా చందమామ చరిత్రపై మమకారం, చందమామపై పాతతరం సిబ్బందిపై అబిమానం చూపిస్తున్నందుకు, మా ఇద్దరి మధ్య ఎప్పుడు సంభాషణ జరిగినా తన సుదీర్గ అనుభవ సారాన్ని పంచుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం.

88 ఏళ్ళ వయస్సు నిండిన పండు ముదుసలి. దాదాపుగా కుమారులు, కుమార్తెలు మంచి పొజిషన్లో ఉంటున్నప్పటికీ దేశదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలస పోయినందువల్ల, ఇంట్లో ముసలి దంపతులు మాత్రమే ఉంటుండటం వల్ల మనుషులు కలవడానికి వచ్చినా, ఫోన్ ద్వారా మాట్లాడినా వారితో తన అనుభవాలు పంచుకోవడం అంటే ఆయనకు ఎంత సంతోషమో…

నాటి చిత్రవైభవం - జటాయువు

చిత్ర వివరణలకు తగినట్లుగా కథలకు బొమ్మలు వేసినప్పుడు, వాటని నీట్‌గా ప్యాక్ చేసి చందమామ తెలుగు ఎడిటోరియల్ అని పేరు రాసి మరీ దాన్ని భద్రంగా అందజేసినప్పుడు గడచిన ఆరు దశాబ్దాలుగా చందమామ పని పట్ల ఆయన ప్రదర్శిస్తూ వచ్చిన అకుంఠిత దీక్ష, పరిపూర్ణ నిబద్దత ఆ ప్యాకెట్‌పై అక్షరాలలో కనిపించేవి.

దాదాపు 90 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో జీవితంలో అన్ని పనులూ మానుకుని విశ్రాంతితో కాలం గడిపే అవకాశం అందరికీ వస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ జీవితం చివరి వరకు చందమామ బొమ్మలు గీస్తూ ఉండాలని, తన కష్టార్జితంతోనే తాను జీవించాలని రెండు చిరకాల ఆకాంక్షలతో ఆయన బతుకుతున్నారు.

గతంలోలాగా ఎక్కువ కథలకు బొమ్మలు గీయడం కష్టం అని తెలుసు. ఏకాగ్రతతో బొమ్మలు గీయటం సాధ్యం కాని శారీరక అశక్తత తనలో పెరుగుతున్నట్లు తెలుసు. గంట రెండు గంటలు కూర్చుని విరామం లేకుండా ఇంట్లో కూర్చుని బొమ్మలు గీస్తున్నా సరే, వెన్నెముకలో బాగా నొప్పిరావడం, అలసి పోవడం. ఇది మొత్తంగా తన ఏకాగ్రతపై ప్రభావితం చూపటం అనుభవంలోకి వస్తూనే ఉంటుందాయనకు.

కానీ ఈ అన్ని భౌతికపరమైన సమస్యలనూ ఆయన ఒకే ఒక ఆసరాతో, ఆలంబనతో అధిగమిస్తూ తన శరీరంలోని ప్రతి శక్తికణాన్ని తన లక్ష్యం కోసమే కేటాయిస్తూ జీవిస్తున్నారు.  చందమామలో చేరడం, చందమామలో ఇన్నాళ్లుగా బొమ్మలు వేయడం -పౌరాణిక, జానపద, బేతాళ తదితర ఏ ఇతివృత్తమైనా సరే- దైవాజ్ఞ ప్రకారమే తన జీవితంలో జరుగుతూ వస్తోందని, ఈ ప్రపంచంలో, ఒక సంస్థ 60 ఏళ్లపాటు తనను ఉద్యోగిగా కొనసాగిస్తూ జీవితాన్ని ఇస్తోందంటే అది మానవేతర కారణం వల్లే జరిగిందని ఆయన ప్రగాఢ విశ్వాసం.

నాటి చిత్ర వైభవం - మత్స్యావతారం

‘ఒరే శంకరా నువ్వు చందమామలో చేరి బొమ్మలు గీస్తూ ఉండరా!’ అని ఏనాడో దేవుడు ఆజ్ఞాపించాడని, ఆయన ఆదేశాన్ని ఈనాటికీ పాటిస్తూ వచ్చానని చెబుతారు. అందుకే ఈనాటికీ బొమ్మలు వేయాలంటే స్నానం చేసి పూజ ముగించిన తర్వాతే పనిలోకి దిగటం ఆయన అలవాటుగా మారింది. కుంచె పట్టుకుంటే తనకు  ప్రపంచంలో ఇక ఏదీ కనిపించదని, వినిపించదని ఏ అశరీరవాణో తనకు సూచిస్తుంటే తన కుంచె కదులుతుంటోందనిపిస్తుంటుందని ఆయన పదే పదే చెబుతారు.

చందమామలో 55 ఏళ్లు పనిచేసినప్పటికీ తనజీతం మూడేళ్లకు ముందు కూడా పదివేలకు దాటలేదని తెలిస్తే దిగ్భ్రాంతి కలగకమానదు. ఈ ఆరు దశాబ్దాల కాలంలో ఎంతమంది, ఎన్ని బయటి సంస్థలు ఆయనకు అవకాశాలు ప్రతిపాదించారో, తమ వద్దకు రమ్మని ఆహ్వానించారో ఆయనకు లెక్క తెలీదు. జీవితం అవసరం రీత్యా కూడా తనకు అవకాశాలు కల్పించినా వేటివైపూ ఆయన కన్నెత్తి చూడలేదు.

చందమామకు బొమ్మలు వేయడం… తన జీవితానికి ఇది చాలు అనుకున్నారాయన. దశాబ్దాలు పనిచేస్తున్నప్పుడు సిబ్బంది అడగక ముందే వారి ఆవసరాలను యాజమాన్యం చూడాలని, వారిని మరికొంచెం మిన్నగా పట్టించుకోవాలని ఆయనకు అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. కాని చేసేది దైవకార్యం అనుకుంటున్నప్పుడు, దైవాజ్ఞను మీరకూడదని ప్రతి క్షణం తన మనస్సు గుర్తు చేస్తున్నప్పడు ఆయన 55 ఏళ్ల అసంతృప్తులను అన్నిటినీ తనలోనే దాచేసుకున్నారు.

చందమామ నియామక పత్రం

నారు పోసినవాడు నీరుపోయడా అనే సామెత ఆయనకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కన్నతల్లి ద్వారా నేర్చుకున్న తెలుగును ఆయన మర్చిపోలేదు. నాగిరెడ్డి గారు స్వయంగా పిలిచారు. చందమామలో ఉద్యోగ నియామకపత్రం ఇచ్చారు. 1952లో చందమామలో చేరినప్పుడు తనకు ఇచ్చిన నియామకపత్రాన్ని ఈనాటికీ ఆయన భద్రంగా పదిలపర్చుకుంటూ వస్తున్నారు.

‘ఇప్పుడు నీడనిచ్చిన చందమామ భవంతి లేదు. ఆహ్వానంపలికి ఆదరించిన నాగిరెడ్డి గారు లేరు. తెలుగువారి చందమామలో తెలుగు యాజమాన్యమే లేకుండా పోయింది. కాని శంకర్ నేటికీ చందమామలోనే ఉంటున్నాడ’ని ఆయన ఆవేదనతో చెబుతున్నప్పుడు దశాబ్దాల ఆత్మయబంధం ఏదో తనలోంచి తెగిపోయినంత భాధానుబూతి ఆయనలో కలుగుతుంటుంది.

లేబర్ సమస్య అని మరొకటి అనీ లక్ష కారణాలు చెప్పినా, నిర్వహణలో వైఫల్యమే చందమామ పరుల పాలు కావడానికి ప్రధాన కారణమని శంకర్ గారి బలమైన అభిప్రాయం. చక్రపాణి, నాగిరెడ్డి గారు ఉన్నంతవరకూ దేదీప్యమానంగా వెలిగిన చందమామ తర్వాత తన ప్రాభవాన్ని కోల్పోవడానికి ఇతరేతర కారణాలకంటే వ్యక్తులే కారణమని ఆయన చెబుతారు. తాము చూస్తూ ఉండగా పెరిగి పెద్దదయిన వటవృక్షం తమముందే నేలకొరగడం ఆయనకు శరాఘాతం.

70లు, 80ల వరకు లక్షలాది మందిని తన వద్దకు రప్పించుకున్న చందమామ భవంతి ఈరోజు ఉనికిలో లేకుండా నేలమట్టమైపోయిన ఘటనను తల్చుకుంటేనే భరింపరాని బాధ ఆయనకు. అలా జరుగుతుందని ఊహించడానికి కూడా కష్టమయ్యేదాయనకు.

అన్నిటికంటే మహాశ్చర్యం ఏమంటే, కథాచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా చందమామ బొమ్మలు చందమామ కథలకు మించిన ఆసక్తిని దశాబ్దాలుగా పాఠకుల, అభిమానులలో కలిగిస్తూ వస్తున్నప్పటికీ, ఈ చిత్రమాంత్రికుడు చందమామ కథకే తొలి ప్రాదాన్యం ఇస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే పత్రికకు కథే ప్రాణమని, మంచి కథలు ఉంటేనే మంచి బొమ్మలు వేయడానికి ప్రేరణ కలుగుతుందని. కథను బట్టే మంచి బొమ్మలు చిత్రకారులు గీయడానికి వీలవుతుందని ఆయన బలంగా నమ్ముతారు.

పెళ్ళి తర్వాత 1946లో దంపతులు

అందుకే ఈ మధ్యకాలంలో చందమామలో కథల నాణ్యత పెరుగుతూ వస్తోందని. పంపిన కథలకు బొమ్మలు వేస్తూంటేనే మనసుకు హాయి గొల్పుతున్నట్లు ఉంటోందని ఆయన చెబుతూ వస్తున్నారు. ఈ మధ్యే అచ్చయిన శివనాగేశ్వరరావు గారి ‘బంగారు నెమలి’ కథకు బొమ్మలు గీస్తున్నప్పుడు ఆయన ఎంత సంతోషపడ్డారో. కథ ముందు పెట్టుకుని చదివి బొమ్మ గీస్తున్నప్పుడో లేదా పూర్తి చేసినప్పుడో తన అనుభూతిని మాతో పంచుకుంటారాయన.

గత సంవత్సరం మే నెల చందమామలో వచ్చిన  కప్పగంతు శివరాం ప్రసాద్ -చందమామ వీరాభిమాని- గారి ‘నిజమైన చదువు’ బేతాళ కథకు నాలుగు నెలల క్రితమే జనవరిలో శంకర్ గారు బొమ్మలువేశారు. జనవరి చివరలో శివరాంగారు ఆయనను కలుసుకోవాలని వచ్చినప్పుడు తన బేతాళ కథకే శంకర్ గారు బొమ్మలు గీయడం ముగించారు. ఓ సాయంత్రం ఆయన ఇంటికి పోయినప్పుడు సాదరంగా ఆహ్వానిస్తూ, ‘మీ బేతాళ కథకే బొమ్మలు వేస్తున్నాను. బాగున్నాయా చూసి చెప్పండి’ అన్నప్పుడు శివరాం గారు పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది.

జీవితంలో శివరాం గారు శంకర్ గారిని కలిసింది అదే మొదటిసారి. తాను చందమామకు కథ రాసి పంపడం అదే మొదటిసారి. తన కథకు శంకర్ గారు బొమ్మలు వేస్తున్నప్పుడు ఆయనను కలిసిన అనుభవం కూడా ఏ కథకుడికైనా బహుశా అదే మొదటిసారి. కథకు సరిగ్గా సరిపోయిన బొమ్మలు వేయడంతో మహదానందంతో శివరాంగారు శంకర్ గారి పాదాలకు నమస్కరించి ఆశీర్వదించమని కోరారు.

ఈ అరుదైన ఘటనను శివరాం గారు ఎలా మర్చిపోలేకున్నారో శంకర్ గారు కూడా అదే విధంగా గుర్తు పెట్టుకున్నారు. ఇప్పటికీ సందర్భం వస్తే చాలు..  ‘ప్రసాద్ గారు బాగున్నారా’ అంటూ పరామర్శించే ఈ నవ వృద్ధ యువకుడిలో ఆత్మీయత రంగరించుకున్న మెత్తటి తడి… బెంగళూరు నుంచి వచ్చి కలుసుకుని  నాలుగు మంచి మాటలు తనగురించి బ్లాగులో రాసి ప్రచురించిన శివరాం గారి పట్ల ఆయనకు ఎంత సాదర భావమో..

కథకులకు, రచయితలకు ప్రోత్సాహమిస్తే, వారితో నిత్య సంబంధంలో ఉంటే వారు మంచి కథలు పంపడానికి ప్రేరణగా ఉంటుందని, చందమామలో ప్రస్తుతం సగం పాత కథలు, సగం కొత్త  కథలు వస్తున్నాయంటే కథకులు ప్రేరణ పొందుతున్నారని, మంచి కథలు పంపడానికి ఉత్సాహం చూపుతున్నారని అర్థం అని ఆయన అంటారు.

పనిపాటలతో అలసే పాటకజనానికి చందమామ కథలు తొలినుంచి కాస్త సేద తీర్చాయని, చందమామలో సరదా కధలను చదువుతూ జనం జీవితంలో పడుతున్న శ్రమను కాస్సేవు మర్చిపోయేవారని, చింత చెట్టు దయ్యాలు, రాక్షసుల కథలు చందమామలో అంత విజయం పొందాయంటే అదే కారణమని ఈయన అభిప్రాయం. మనుషులకు మంచి చేసే దయ్యాలు, రాక్షసులు మంచివైపు నిలబడే దయ్యాలు చందమామలో కాక ఇంకే పత్రికలో కనిపిస్తాయని ఆయన ధీమాగా చెబుతారు.

రెండేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చి శంకర్ గారిని కలిసిన అన్వర్ -సాక్షి చిత్రకారులు- గారు ఆయనను కలిశాక ఒకే ఒక మాటన్నారు. ‘జీవితంపట్ల ఆయన పరిపూర్ణమైన సంతృప్తితో ఉంటున్నారు. ఇది లేదు, ఇది రాలేదు అనే కొరతకు సంబంధించిన మాట ఆయన నోట్లోంచి రావటంలేదు. మనిషిలో బాధ ఉంటే కదా అసంతృప్తి చెందడానికి.”

మనిషి జీవితంలో అత్యంత విలువైన 60 సంవత్సరాలు. ఒకే పత్రిక, ఒకే పని, ఒకే ఆశయం. ఇది తప్ప నాకింకేమీ వద్దు అనే పరమ సంతుష్టికరమైన జీవితాచరణ. వీటన్నింటి ప్రతిరూపం. చందమామ శంకర్.

షణ్ముఖవల్లి, శంకర్ దంపతులు

వ్యక్తిగత జీవితంలో ఆయనకు నిజమైన తోడూ నీడా ఆయన జీవన సహచరి షణ్ముఖవల్లి గారు. ఆమె లేకుంటే ఆయన లేరన్నది ఉబుసుపోక మాట కాదు. అక్షరసత్యం. నీడలా అంటిపెట్టుకునే ఆమె ఏదైనా పనిమీద బయటకు వెళ్లవలసివచ్చి రాత్రివరకు రాలేకపోతే 88 ఏళ్ల వయసులో కూడా శంకర్ గారు అన్నం స్వయంగా తానే వండుకుని తింటారు. ఈనాటికీ ఇదే తంతు..

నేర్చుకోవాలంటే, ఆచరించాలంటే కళ్లముందు జీవితంలో ఎన్ని ఉదాహరణలు లేవు మనకు…

శంకర్ గారూ, మీతో కలిసి పని చేసే మహద్భాగ్యం అనుకోకుండా దక్కినందుకు..

మీ మాట మీకే అప్పగిస్తున్నానండీ..

వెరీ కైండ్ ఆఫ్ యు సర్…!

RTS Perm Link


One Response to “వెరీ కైండ్ ఆఫ్ యు సర్…!”

  1. M.V.Appa Rao on July 15, 2011 10:45 AM

    రాజశేఖర రాజుగారు, శంకర్ గారి గురించి మంచి విషయాలు మరోసారి చెప్పినందుకు ధన్యవాదాలు.ఈ సారి నేను మద్రాసు
    వచ్చినప్పుడు మనం శ్రీ శంకర్ గారిని తప్పక కలుద్దాము.క్రితంసారి మిమ్మల్ని కల్సినప్పుడు ఆయన్ని టైములేక కలవడం
    కుదరలేదు.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind