చందమామతో నా జ్ఞాపకాలు

July 1st, 2011

అవసరాల రామకృష్ణారావు గారు

అప్పుడు నా వయసు పదహారు -1947-. ఇప్పుడు ఎనభై -2011-. అప్పుడంటే ఎప్పుడని! చంద్రోదయమయినప్పుడు. అంటే తెలుగు పిల్లల అందాల మాసపత్రికగా చందమామ మొట్టమొదటి సంచిక వెలువడిన నాటి మాట. అందులో నే వ్రాసిన పొట్టి పిచిక కథ అచ్చవడం ఓ విధంగా నా సాహితీ ప్రస్థానానికి తొలి బీజం అవడం కన్న తీపి గుర్తు మరేముంటుంది!

నాటి నా బాల్యంలో తొంగి చూసిన ఆ తొలికిరణపు రూపురేఖలే నేటి ఈ వృద్ధాప్యంలో కూడా కొనసాగడం కంటే మించిన ఆశ్చర్యం, ఆనందం ఇంకేముందని!

అమ్మ చెప్పిన కథే అయినా, అందరికీ తెలిసిన కథే అయినా, మంచి ప్రింటుతో చక్కని బొమ్మలతో వచ్చిన నాటి ఆ చందమామ లోని కథాంశం నా మనసుమీద ఇంప్రింటు చేసేసినట్లుంది!

ఓ బడుగు జీవి తను కష్టపడి సాధించుకున్నది అది లేశమే ఔగాక, పోగొట్టుకుంటుంది. ఎంతమందినో కలుసుకుని, ఎవరూ కలిసిరాకపోయినా, పట్టుదల వదలక, చివరికి విజయం సాధిస్తుంది. అదీ ’పొట్టి పిచిక కథ’. అదే నా విజయసూత్రం అవుతుందని ఆనాడనుకోలేదు!

వెయ్యి పైగా రచనలు చేసి, ఈనాటికీ తల వంచక, కలం దించక తెలుగు కథకుడిగా కొనసాగుతున్న నాకు వేగుచుక్క ఆ కథే కదా! పక్షులతో జంతువులతో మనుషుల్ని కలిపి సామాజికాంశాలను సరళంగా చెప్పవచ్చునని నేను నేర్చుకున్నది చందమామ పత్రిక చలవవల్లనే. ’గణిత విశారద’ అనే నవల రాసింది చందమామ పఠన స్పూర్తి తోనే.

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ నుంచి 1969లో బహుమతి పొందిన నా ‘అర్థమున్న కథలు’ పబ్లిషర్స్‌ చందమామ రక్తసంబంధీకులు ‘యువప్రచురణలు’ వారే. అంతేకాదు. నేను చలసాని-చక్రపాణి అవార్డు అందుకోవడం కూడా తత్సంబంధమైన సత్సాంప్రదాయమే.

సైజుతో పాటు చురుకుతనంలో కూడా నాటి పొట్టి పిచిక లక్షణాలు ఇప్పటికీ నాలో మిగిలి ఉన్నాయని నా మీద నేను వేసుకునే సోకైన జోకు!

చందమామ కథ ఇచ్చిన ఊపుతో నేన్రాసి పుస్తక రూపంలో వచ్చిన పిల్లల రచనల గురించి ఇక్కడ చెప్పుకోవడం అప్రస్తుతం కాదనుకుంటాను. ‘కేటూ డూప్లికేటూ’, ‘మేథమేట్రిక్స్‌’ మూడు భాగాలూ, ‘ఆంగ్రేజీ మేడీజీ’ ‘ఆంగ్రేజీ యమఈజీ’ ఇలా మరో అరడజనువరకు చిరు సరుకు దొరుకు…

నెలనెలా వెన్నెలలద్దుకుని, చకచకా సొగసులు సరిదిద్దుకుని, పదారుభాషల వారి కితాబులందుకుని భారతీయ పత్రికగానే కాక, అంతర్జాతీయ స్థాయిని చేరుకున్న చందమామ పుట్టింది మన భాషలోనే అని తలుచుకుంటే ఉప్పొంగని తెలుగు గుండె ఉండదు.

కాలక్షేపం కథలతోనే సరిపెట్టుకోక శాస్త్రీయ పరిశోధనాత్మక వ్యాసాలూ, మెదడుకి మేతగా పోటీలూ, అన్యభాషలు నేర్పే ఏర్పాట్లూ– ఇవన్నీ కంటికి నదురైన రంగులతో, అచ్చుతో, అనువైన సైజుతో ఇక్కడ కాక మరెక్కడ దొరుకుతాయని! ఈ సంస్థ పుస్తకరూపంలో పిల్లలకందించే విజ్ఞాన వర్గకోశాలు ఎన్నెన్నని!

ఇంతెందుకు.. ఇటీవల వీరు ప్రచురించిన చందమామ Art Book చూశారా! పదిహేనువందల రూపాయల ఖరీదు కాస్త ఎక్కువే అనిపించవచ్చు కాని అది అందించే శతకోటి అందాల మాట!

నా తొలి ప్రేమ చందమామ. వాక్రూప వర్ణార్ణవం…!

ఈ నాటికీ కథాసుధల్ని వెదజల్లుతూ హాయిగా జీవించగలిగే నా మనోధృతికి నాటి చందమామే మధురస్మృతి!!

– అవసరాల రామకృష్ణారావు

*******
అవసరాల రామకృష్ణారావు గారు 80 ఏళ్లవయసులోనూ సాహిత్య వ్యాసంగం చేస్తూ వస్తున్న విశిష్ట రచయిత. 1947 జూలై నెలలో వచ్చిన తొలి చందమామలో ‘పొట్టి పిచుక’ అనే కథను వీరే రాశారు. పదిహేనేళ్ల చిన్న వయసులో ఈయన రాసిన తొలి కథ ఇది.

తను కష్టపడి సాధించుకున్న దాన్ని పోగొట్టుకున్న ఓ బడుగుజీవి పిచ్చిక ఎంతోమందిని కలుసుకుని, ఎవరూ కలిసిరాకపోయినా పట్టుదల వదలక చివరికి విజయం సాధిస్తుంది. తొలి చందమామలో కుతూహలం కొద్దీ రాసిన ఈ కథ తదనంతర జీవితం మొత్తంలో తన విజయ సూత్రం అవుతుందని వీరు ఆనాడు ఊహించనే లేదట.

దాదాపు 64 ఏళ్ల తర్వాత వీరి పొట్టిపిచుక కథను ఈనెల -జూలై 2011- చందమామలో మళ్లీ ప్రచురించడమైనది. ఈ సందర్భంగా వారు పంపిన ‘చందమామ జ్ఞాపకాలు’తోపాటు, ‘విజయమాల’ అనే రెండు పేజీల కొత్త కథ కూడా జూలై సంచికలోనే ప్రచురితమైనది.

తొలి చందమామలో కథలు రాసి జీవించి ఉన్న ఏకైక రచయిత  రామకృష్ణారావుగారు.

చందమామ జ్ఞాపకాలతో పాటు, వీరు పంపిన ‘విజయమాల’ కథను కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాము. పొట్టి పిచుకతో పాటు వీరి మూడు రచనలను ఒకే చోట చూడాలంటే జూలై నెల చందమామ ప్రతిని చూడగలరు.

ఈ తొలి చందమామ కథ సజీవ సహజ మూర్తికి చందమామ మనవూర్వక అభివందనలు.

విజయమాల

చంద్రగిరి నగరిని చారుదత్తుడు పాలించే రోజుల్లో మంత్రి బుద్ధసాగరుడూ, ఆస్థాన విద్వాంసుడు గుణకీర్తీ ఆయన కెంతో చేదోడువాదోడుగా ఉండేవారు. ప్రత్యేకించి గుణకీర్తి ఆ తరానికి సాహితీ ప్రతినిధిగా నిలిచేటంత ప్రజారంజక గ్రంధాలు లిఖించాడు. అయితే ఆయన తన ఏభయ్యవఏట జరిగిన ఓ దుస్సంఘటనలో మరణించాడు. గుణకీర్తి స్మారకచిహ్నంగా చారుదత్తుడు ఓ శిలావిగ్రహాన్ని ప్రతిష్టించాడు.
గుణకీర్తి భార్య ఏనాడో చనిపోతే కొడుకు శ్రుతకీర్తి పొరుగుదేశంలోఉన్న మేనత్త ప్రాపకంలో పెరిగాడు. ఆమె భర్త కరుణేంద్రుడు అక్కడ సైనికాధికారి. ఆ దేశంలోనే ఉన్న సిద్ధేంద్రస్వామి గురుకులంలో శ్రుతకీర్తి విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు.

గుణకీర్తి తర్వాత ఆయన నిర్వహించిన ఆస్థాన విద్వాంస పదవి, తగిన అభ్యర్థి దొరకక, ఏళ్లపాటు ఖాళీగా ఉండిపోయింది. మంత్రి బుద్ధిసాగరుడి పరీక్షలకు తట్టుకుని నిలబడే వివేకవంతులెవరూ ఓ పట్టాన దొరకలేదు. ‘ఉయ్యాల్లో పిల్లాణ్ణి పెట్టుకుని వాడికోసం ఊరంతా వెతుకుతున్నట్టు మనం శ్రుతకీర్తి విషయం పక్కన పెట్టి ఇంకా అతడిని చిన్నపిల్లాడిగానే పరిగణిస్తున్నాం. ఈపాటికి ఉభయ భాషాప్రవీణ అయి ఉండాలే!’ అనే చారుదత్తుడి సూచనని మెచ్చుకుని మంత్రి వెంటనే శ్రుతకీర్తిని పిలిపించాడు.

ఏ పరీక్షకు గురిచేసినా ప్రథముడిగా నిలిచే అతని తెలివితేటల్ని చూసి బుద్ది సాగరుడి నోట మాటరాలేదు. ఇరవై ఏళ్లకే అంత పెద్ద పదవా అని ఎవరేమన్నా లెక్క చెయ్యకుండా రాజు అనుమతి తీసుకుని శ్రుతకీర్తిని వెంటనే ఆస్థాన విద్వాంసుడిగా నియమించాడు.

అలా నిర్ణయించిన సభకి సూచనగా ఓ ఉత్సవం జరిగింది. అతని ఉన్నతికి తోడ్పడిన బంధువులనీ, గురువునీ ప్రత్యేకించి ఆహ్వానించారు.

ప్రజల హర్షామోదాలు సరేసరి. వారి సంప్రదాయం ప్రకారం శ్రుతకీర్తి విజయహారాన్ని చేత్తో పెట్టుకుని తన ప్రగతికి తోడ్పడిన అతి ముఖ్యవ్యక్తి మెడలో ఆ దండను వెయ్యాలి. ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

తనని ప్రేమతో పెంచిన మేనత్త మెడలోనా, చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించిన కరుణేంద్రుడి మెడలోనా, తననో భాషా కోవిదుణ్ణి చేసిన సిద్ధేంద్రస్వామికా ఆ గౌరవం?  పిన్నవయసులోనే తనని గుర్తించి రప్పించిన మహారాజుకా లేదా తనలోని ప్రతిభను రుజువు చేసి పెద్దపీట వేసిన మంత్రి బుద్ధి సాగరుడికా?

అందరి అంచనాలూ వమ్ము చేస్తూ శ్రుతకీర్తి ఆ హారాన్ని శిలావిగ్రహ రూపంలో ఉన్న తండ్రి మెడలో వేశాడు! అతని ఎన్నికని మంత్రి సమర్థించిన తీరు ఇదీ….

ఓ వ్యక్తి గొప్పవాడైనందుకు, అలా తోడ్పడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత చెప్పుకోవలిసిందే! అయితే శ్రుతకీర్తి ప్రతిభకు అందరికన్న ముందు చెప్పుకోవలిసింది జన్మనిచ్చిన గుణకీర్తిని మాత్రమే. ఓ తరానికి ప్రతినిధిగా నిలబడి ప్రజ్ఞావంతుడైన మహాపండితుడి జన్యు సంబంధం కన్న శక్తివంతమైనదేముంటుంది, తనయుడి వ్యక్తిత్వంలో…

– అవసరాల రామకృష్ణారావు

రామకృష్ణారావు గారి గురించి మరిన్ని వివరాలకు కింది లింకును చూడగలరు

తొలి చందమామ అపరూప కథకులు శ్రీ అవసరాల

చందమామ ఆన్‌లైన్‌లో కూడా వీరి పొట్టిపిచుక కథను కింది లింకులో చూడవచ్చు -1947 జూలై సంచికను ఎంపిక చేసుకోవాలి-
http://chandamama.com/archive/TEL/storyArchive.htm

 

RTS Perm Link