మన్నించు మహానుభావా!

July 28th, 2011

చందమామ కార్యాలయానికి ఉదయం యధాప్రకారం బస్సులో వెళుతూ రోజువారీ ఆలవాటుగా పేపర్‌తో పాటు జూలై నెల ‘నడుస్తున్న చరిత్ర’ మాసపత్రిక పేజీలు తిరగేస్తుంటే మధ్యపేజీల్లో ‘మన్నించు మహానుభావా’ అంటూ ఆర్ద్రంగా పలకరించిందో కథనం. ఇటీవలే కన్ను మూసిన నటరాజ రామకృష్ణగారితో మిత్రుడు ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు నెమరువేసుకున్న పాత జ్ఞాపకాలకు అక్షరరూపం ఇది. ఈ మూడు పేజీల హృద్య కథనం రెప్పలార్చకుండా చదివినప్పుడు కళ్లు చెమ్మగిల్లాయి.

మన చుట్టూ, మన ఎరుకలోకి రాకుండా, ఎంత మంది మహనీయులు ఒక లక్ష్యం కోసం జీవితకాలం నిబద్ధ కృషి చేస్తూ కనుమరుగవుతున్నారో అనే వేదన మనస్సును కదిలించేసింది. ముఖ్యంగా ఉమా తన నాన్నతోపాటు తొలిసారిగా రామకృష్ణగారిని కలిసినప్పుడు వారికి ఎదురైన అపురూప సత్కారం, వందేళ్లకాలం నుంచి సమాజంచేత చీత్కరించబడుతున్న నాట్యకళాకారిణులను, దేవదాసీల దుర్భరజీవితాలను తల్చుకుంటూ రామకృష్ణ గారు రోదించిన వర్ణన చదువుతున్నప్పుడు… ‘ఆయన నన్ను కోరుకునే కొద్దీ నేను దూరం కావడం మొదలెట్టాను. ఆ మహాకళాకారుడికి అంత దగ్గర ఉండే శక్తి నాకు లేదం’టూ తన కథనాన్ని ఉమా ముగించిన తీరును చూస్తున్నప్పుడు నేనెక్కడ ఉండి చదువుతున్నానో కూడా మర్చిపోయాను.

ఉమా.. పదిహేనేళ్లుగా తిరుపతిలో మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా వాలు కుర్చీలో కూర్చున్న భంగిమలో ఉన్న నాన్న ఫోటోని చూస్తుండిపోయానే కాని ఆయన గురించి నాకు పెద్దగా తెలీదు. మిత్ర సంబంధాలకు అవతల మీ ఈ జ్ఞాపకం మీలోని ఓ కొత్త మనిషిని చూపిస్తోంది.

“ఒక్కొక్కసారి ప్రేమనూ అభిమానాన్నీ స్వీకరించడానికి కూడా చాలా శక్తి కావాలి. అంత శక్తి లేక నేను నటరాజ రామకృష్ణను చాలా కోల్పోయాను, సరిగ్గా మా నాయనను కోల్పోయినట్లే.”

“ఇప్పటిదాకా వాళ్ళు జీవించిన జీవితం చెడ్డదని వాళ్ళు అనుకోకూడదు. వాళ్ళు గొప్ప కళాకారులు. కళాకారులమనే తృప్తితోనే వాళ్ళు కన్ను మూయాలి. కన్ను మూయకముందే వాళ్ళకా తృప్తి కలిగించాలి’ అనేవాడాయన.

“నాట్యం కోసం కుటుంబానికి దూరమైన ఆయన శిష్యులమీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఆశ పెట్టుకున్నాడు. తను నమ్మినవాటి కోసం తన సంపదమంతా ఖర్చు చేసిన ఆయన తన శిష్యులే తన ఆస్తి అనుకున్నాడు. అయితే, యీ ఆశలన్నీ భగ్నమవుతున్నట్టుగా నాకు ఆయన మాటలను బట్టీ అనిపించేది. ఆయన నాట్యకళకు వారసులున్నారు. అద్భుత అభినయాలతో వారు అలరించగలరు. అయితే, ఆయన కోరుకున్న తీరులో మాత్రం ఆ కళావారసత్వం కొనసాగదేమో అనే దిగులు నాకు ఆయనలో కనిపించేది.

ఆంధ్రనాట్యం గురించీ, పురిణి గురించీ ఆయన మాట్లాడే మాటలేవీ నాకు అర్థమయ్యేవి కాదు. అయితే ఆ అద్భుత కళారూపాల వెనుక వున్న కన్నీళ్ల గురించిన ఆయన వేదన మాత్రం నాకు అర్థమయ్యేది. బహుశా అదే ఆయనను నాకూ, నన్ను ఆయనకూ దగ్గర చేసిందేమో. ఆ దగ్గరితనమే నన్ను భయపెట్టేది. ఆయన నన్ను కోరుకునే కొద్దీ నేను దూరం కావడం మొదలుపెట్టాను. ఆ మహాకళాకారుడికి అంత దగ్గరగా వుండే శక్తి నాకు లేదు. ఆయన ఆఖరి రోజుల్లోగానీ, ఆయన మరణించిన తర్వాత గానీ నేను హైదరాబాద్‌ వెళ్ళలేదు. వెళ్ళే శక్తి నాకు లేకపోయింది.”

నటరాజ రామకృష్ణ గారి ఆంతరంగిక హృదయాన్ని స్పర్శిస్తున్న ఈ అపురూప కథనంకోసం కింది లింకును చూడండి.

మన్నించు మహానుభావా!
http://maavooru.wordpress.com/2011/07/15/%E0%B0%AE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BE/

RTS Perm Link

చందమామ కథ

July 26th, 2011

చందమామ చరిత్రకు సంబంధించి 2006 సంవత్సరానికి ఓ విశిష్టత ఉంది. చందమామ అంతర్గత విషయాల గురించి లక్షలాదిమంది పాఠకులకు ఇటు ప్రింట్‌లోనూ, అటు ఆన్‌లైన్‌లోనూ తొలిసారిగా పరిచయం చేసిన సంవత్సరమది. దీనికి ఈమాట.కామ్ వెబ్‌సైట్‌లో అంకురార్పణ చేసినవారు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు, తర్వాత చందమామ కథ పేరిట ఈనాడులో ఆదివారం అనుబంధంలో వచ్చిన ప్రధాన కథనం. తర్వాత తెలుగు వికీపీడియా వెబ్‌సైట్‌లో చందమామ అభిమానులు కొందరు కలిసి చందమామ విశిష్ట చరిత్రపై రాసిన బృహత్ వ్యాసం.

ఈ మూడు కథనాలు అప్పటినుంచి ఇప్పటి దాకా చందమామ గురించి తెలుసుకోవాలనుకునేవారికి కరదీపికలాగా ఉపయోగపడుతున్నాయి. ఆ తర్వాత సర్వశ్రీ వసుంధర, త్రివిక్రమ్, శివరామ్ ప్రసాద్, బ్లాగాగ్ని, నాగమురళి, సిహెచ్ వేణు, సుజాత, రవి, రవిచంద్ర, తదితర బ్లాగర్లు, రచయితలెందరో తమకు తెలిసిన చందమామ గురించి ప్రధానంగా ఆన్‌లైన్ పాఠకులతో పంచుకున్నారు. పంచుకుంటున్నారు.

ప్రత్యేకించి శ్రీ కప్పగంతు శివరాం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కేవలం తెలుగు చందమామ పాత చరిత్రను తడుముతున్న వ్యాసాలు, కథనాలను ప్రచురిస్తూ ఆన్‌లైన్ పాఠకులకు పరిచయం చేస్తున్న మనతెలుగుచందమామ బ్లాగ్ తెలుగు బ్లాగుల్లో ఒక ప్రత్యేక బ్లాగుగా నిలిచింది.
http://manateluguchandamama.blogspot.com

(చందమామ గురించి రాయదలిచిన వారందరికీ ప్రచురించడానికి అవకాశమిస్తూ ఈ విశిష్ట బ్లాగ్ పాఠకుల ఆదరణ పొందుతోంది. దీన్ని గురించి మరొక సారి వివరంగా చర్చించుకుందాం.)

కొన్ని నెలలక్రితం శివరాం ప్రసాద్ గారు ‘మనతెలుగుచందమామ’ బ్లాగును ‘అలనాటితెలుగుచందమామ’ గా పేరు మార్చారు. కింది లింకును చూడగలరు

http://alanaatiteluguchandamaama.blogspot.com

 

“చందమామ” జ్ఞాపకాలు
కొడవటిగంటి రోహిణీ ప్రసాద్
http://www.eemaata.com/issue41/chandamama.html

ఈమాట.కామ్ వెబ్‌సైట్‌లో 2006 జనవరి సంచికలో ఇది ప్రచురించబడింది. చందమామ చరిత్రకు సంబంధించి గత దశాబ్దంలో ఆన్‌లైన్ పాఠకులకు అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి రచన ఇది.

1960 ప్రాంతాల్లో సెలవురోజుల్లో చందమామ ఆపీసుకు వెళ్లి రోజంతా గడుపుతూ పొందిన అరుదైన చందమామ జ్ఞాపకాలను కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు ఈ పెద్ద వ్యాసంలో వివరించారు. చందమామ లోపలి చరిత్రను సూచనప్రాయంగా తడిమిన తొలిరచన కావడంతో ఇది విశేష ప్రాచుర్యం పొందింది. గత అయిదేళ్లుగా ఈ కథనాన్ని చందమామ అభిమానులు నిరంతరం చదువుతూ ఉపయోగరకమైన లింకులు అందిస్తూ, అభిప్రాయాలు ప్రచురిస్తూ దీన్ని చందమామ నిత్య కరదీపికగా నిలబెడుతూ వస్తున్నారు.

“చందమామ” బృహత్ వ్యాసం
తర్వాత తెలుగు వికీపీడియాలో  చందమామ గురించిన తొలి పరిచయం 2006 ఏప్రిల్ 12న జరిగింది. -నిర్దిష్టంగా ఏ తేదీన తెవికీలో చందమామ వ్యాసం సంక్షిప్త భాగం ప్రచురించారో, ప్రస్తుతం దీంట్లో మనందరం చూస్తున్న ప్రధాన వ్యాసం ఎప్పుడు పూర్తి చేశారో తెలీదు. (తెవికీలో చందమామపై పెద్ద వ్యాసం రచనలో పాలుపంచుకున్న అభిమానులందరి పేర్లను త్రివిక్రమ్ గారు తెలిపితే చరిత్రకు ఉపయోగకరంగా ఉంటుంది) ఎంతమంది చందమామ అభిమానులు ఈ బృహత్ వ్యాస రూపకల్పనలో పాలు పంచుకున్నారో తెలీదు కాని, తెవికీ చరిత్రలోనే వందలసార్లు చేర్చి, దిద్ది, సవరించి ప్రచురించిన కొద్ది వ్యాసాలలో ఇదీ ఒకటి.

http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE

చందమామ కథ
2006 నవంబర్ 12న ఈనాడు ఆదివారం అనుబందంలో వచ్చిన చందమామ కథ లక్షలాది మంది పాఠకులను అచ్చురూపంలో చేరి ఉర్రూతలూగించింది. చందమామ చరిత్ర కథను బేతాళుడు చెబుతున్నట్లుగా రూపొందిన ఈ అయిదు పేజీలవ్యాసం చందమామ అద్భుత పయనాన్ని, భారతీయ పాఠకుల ఊహాకల్పనపై అది అద్దిన పంచరంగులను అత్యంత ఆకర్షణీయంగా అచ్చురూపంలో పరిచింది.

రోహిణీ ప్రసాద్ గారి చందమామ జ్ఞాపకాలు వ్యాసం, వికీపీడియాలో వచ్చిన చందమామ వ్యాసం ఈ నాటికీ అంతర్జాల పాఠకులకు అందుబాటులో ఉంటూ వస్తున్నాయి. కాని ఈనాడు ఆన్‌లైన్‌లో వారు ప్రచురించిన చందమామ కథ లింకు చాలాకాలంగా అందుబాటులో లేకుండా పోయింది. సంవత్సరం తర్వాత ఆన్‌లైన్ పత్రికలలోని పాత లింకులను చెరిపివేస్తున్నందున ఈ అపురూప కథనం పాఠకులకు అందుబాటులో లేకుండా పోయింది. 2008లో వికీపీడియాలో చందమామపై కథనం చదివినప్పటినుంచి నేను చెరిపివేయబడిన ఈ లింకుకోసం, చందమామ కథ వ్యాసం ప్రింటవుట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కాని ఫలితం లేకపోయింది.

చిట్ట చివరకు చందమామ ప్రియమిత్రుడు, సిహెచ్ వేణు గారు ఈనాడులో వచ్చిన చందమామ కథ ఫైళ్లను శ్రమతీసుకుని మరీ పంపారు. భారతీయ సాంస్కృతిక రాయబారిగా, మన సాంస్కృతిక వారసత్వంగా ప్రశంసలందుకుంటున్న చందమామ ఉజ్వల చరిత్రను తెలిపే ఈ అరుదైన కథనాన్ని ఇక్కడ ఇమేజ్‌ల రూపంలో చూడండి.

చందమామ చరిత్రపై ఒక అరుదైన వ్యాసం కనుమరుగు కాకుండా తోడ్పడిన వేణుగారికి కృతజ్ఞతాభివందనలు.

అలాగే….

అయిదేళ్ల క్రితమే తెలుగు చందమామ పాఠకుల హృదయాలను రంజింప చేస్తూ ఇంత చక్కటి కథనాన్ని ప్రచురించిన ఈనాడు పత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈనాడు పత్రిక సౌజన్యంతో…

ఇప్పుడు చందమామ కథను ఇక్కడ చూడండి.

గమనిక: నేరుగా ఇక్కడ ఇమేజ్‌లను చూస్తుంటే అక్షరాలు చిన్నవిగా ఉండి కనిపించటం లేదు. ఇమేజ్‌పై క్లిక్ చేసి మరో విండోలో తెరువబడిన ఇమేజీని కుడి క్లిక్ చేస్తే కాస్త స్పష్టంగా కనబడుతోంది. పరిష్కారం దొరికితే సరిచేయడం జరుగుతుంది. ప్రింటవుట్ తీసుకుంటే ఇది మంచి క్వాలిటీతో వస్తోంది.

చందమామ కథ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చందమామలు 2

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చందమామ కథ 3

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చందమామ కథ 4

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చందమామ కథ 5

 

 

 

 

 

 

 

 

 

 

 

RTS Perm Link

చిన్ని చిన్ని అపార్థాలు

July 21st, 2011

ఇది ఇద్దరు అన్నాచెల్లెళ్ల మధ్య నడిచిన ఎస్ఎమ్ఎస్ సంభాషణ.

ఆరోజు అన్న పుట్టినరోజు. ఆ అమ్మాయి తన 18వ పుట్టిన రోజు జరుపుకున్న అయిదు రోజుల తర్వాత అతడి పుట్టినరోజు వచ్చింది. కాని అతడు ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయాడు. అప్పుడు చెల్లెలు అతడికి ఇలా సందేశం పెట్టంది.

“అన్నా! నీకో కథ  చెబుతాను వినాలి మరి. ఒక అమ్మాయి తన 18వ పుట్టిన రోజున తన సోదరుడు తనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతాడని ఆరోజు రాత్రి 11. 59 నిమిషాల వరకు ఎదురుచూసింది. కానీ, ఆమె శుభాకాంక్షలను అందుకోనేలేదు. తర్వాత అయిదురోజుల పాటు ఆమె ఆగ్రహంతో, ఆశాభంగంతో గడిపింది. చివరికి అతడి జన్మదినం రానే వచ్చింది. ఆమె మనస్సులో, హృదయంలో పెద్ద పోరాటం. ఆమె హృదయం చెప్పింది. “అతడికి శుభాకాంక్షలు చెప్పు” కానీ ఆమె మనస్సు తిరగబడింది. అప్పుడామెలో పెద్ద డైలమా. అప్పుడు ఆ సోదరుడు ఏం చేసి ఉంటాడో నాకు చెప్పు. ఆమె డైలమా ఎలా తొలిగిపోయి ఉంటుంది?”

అప్పుడామె తిరుగు సందేశంలో అందుకున్న సమాధానం:

“అన్న ఆమెతో ఇలా చెప్పి ఉంటాడు.” ‘జూన్ 23వ తేదీని నేనెలా మర్చిపోయాను? ఆఫీసులో కాస్త పని ఒత్తిడిలో ఉండి ఉన్నప్పటికీ ఆ విషయం మర్చిపోయి ఉండకూడదు. జరిగిన పొరపాటుకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నా..

…కాని.. ఒకటి మాత్రం నిజం..ఆ చెల్లెలు పది కిలోల బరువున్నప్పుడు నేను ఎత్తుకుని పెంచిన చెల్లెలే అనడంలో సందేహం లేదు. సరైన సందర్భంలో, సకాలంలో అతడి నోటినుంచి ఎలాంటి  మాటలూ రానప్పటికీ, అన్న మనసులో ఏముంటుందో తనకు తెలుసు. ఆమెకు తెలియదా? తను ఇప్పుడు ఎదుర్కొంటున్న డైలమ్మా వెనుక ఆమె మనసులో ఏం దాగి ఉందో నాకు తెలీదా మరి!”

అన్న పంపిన సందేశం చివరి వాక్యం చదివీ చదవక ముందే ఆమె కళ్లలో ధారలుగా కన్నీళ్లు… గొంతు పెగల్లేదామెకు. నోట మాట లేదు. స్థాణువైపోయింది. పై ఎస్ఎమ్ఎస్ చదువుతున్నప్పుడు ఆమె కాలేజీ బస్సుకోసం వేచి ఉంటోంది. అందరూ తననే చూస్తున్నారని గ్రహించడానికి ఆమెకు కాసింత సమయం పట్టింది. అప్పుడామె కళ్లలో పడిన దుమ్మును తుడుచుకుంటున్నట్లు నటించింది. తను ఏడవడానికి కారణం కంట్లో దుమ్మే అని ఆమె భ్రమింపజేసి ఉండవచ్చు.

కానీ…. వాస్తవానికి తన సోదరుడికి తనపట్ల ఉన్న ప్రేమ గురించి తన మనసులో ఏర్పడిన సందేహాలను తుడుచుకోవడానికి ఆమె అలా వ్యవహరించి ఉండవచ్చు…

ఆ చెల్లెలు ఎవరో కాదు… నేనే.. లవ్ యు బ్రదర్….”

శ్రుతి మురళి, బీడీఎస్ ప్రధమ సంవత్సరం, శ్రీవేంకటేశ్వర డెంటల్ కాలేజ్, తలంబూర్, తమిళనాడు

హిందూ పత్రిక చెన్నయ్ టాబ్లాయిడ్‌లో ఇవ్వాళ -21-07-2011-న వచ్చిన “Little misunderstandings” పేరిట వచ్చిన  కథనాని‌కి ఇది తెలుగు పరిచయం.

(నిన్న గాక మొన్న దారుణంగా కనుమరుగైపోయిన గీతా ప్రియదర్శిని జ్ఞాపకాలకోసం ఈ పోస్ట్…)

2.  ఆదిరెడ్డి దాకా…..

ఈ రోజే ఢిల్లీలో ఆదిరెడ్డి ఆత్మహత్య… తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంకోసం జరుగుతున్న ఆత్మబలిదానాల్లో ఇది తాజా దుర్ఘటన… శవానికి కూడా ఎపీ భవన్‌లో చోటు లోని ఘోరం.  కొన్ని నెలల మౌనం తర్వాత మళ్లీ కొన్ని సందేహాలు….

అన్నెం పున్నెం ఎరుగని పసిబిడ్డలు వందలమంది భావోద్రేకం సాక్షిగా శలభాల్లా మాడిపోతున్నారు. చివరికి ఎవరి ప్రయోజనాల కొమ్ముగాయడానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పసిపిల్లలు ఇలా మృత్యుధిక్కారాన్ని ప్రకటిస్తున్నారో బోధపడటం లేదు. గత సంవత్సర కాలం పైగా 600కు పైబడిన మరణాలు. భావోద్వేగంతో చెప్పాలంటే అమరత్వాలు….

నిర్భీతిగా ఒక విషయాన్ని అడగాలని ఉంది.. ఆంధ్ర రాష్ట్రంలో ఈ కొసనా, ఆ కోసనా  ఏ ఒక్క రాజకీయ నేత సంతానం, ఒక్క ప్రజాప్రతినిధి సంతానం కూడా ప్రాణత్యాగం చేసిన ఘటన లేదు. ఒక్క ప్రముఖ నేత కుమారుడు లేదా కుమార్తె జైలు పాలయిన చరిత్రలేదు. వీరి లక్ష్యసాధనలో ఒక్కడంటే ఒక్క నేత కొడుకు కూడా బలయిన చరిత్ర భూతద్దంలో గాలించినా కానరావడం లేదు. వీళ్లంతా ఉన్నత విద్యల కోసం అటు అమెరికా బాట లేదా ఇటు కోస్తా బాట పట్టారేమో తెలీదు.

వీళ్ల తండ్రులు మాత్రం ఉద్యమం పేరిట తోటి ప్రజాప్రతినిధులను, దళిత అధికారులను చావగొడుతూ, స్వచర్మ రక్షణకోసం బలవంతపు క్షమాపణలు ప్రకటిస్తూ చరిత్ర క్రమంలో బతికేస్తుంటారు.

కాని బలిదానాల చరిత్రలో కూడా ఈ అన్యాయ పరంపర కొనసాగుతున్న దారుణం మాటేమిటి?

ఇంత పెద్ద అపార్ధాలు చోటు చేసుకున్నాక, పెంచి పోషించబడుతున్న విద్వేషాగ్ని ఇంత ఉచ్ఛనీచాలెరుగని భాషాప్రయోగాలతో దాడికి దిగటం మొదలయ్యాక….

నూనూగు మీసాల నవయువకుల్లారా? మీ బలిదానాల చరిత్ర మన జాతికి మంచి చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను. కడుపుమంటలోంచి, అరవై ఏళ్ల అవమానాల  సుదీర్ఘ చరిత్ర నుంచి పుట్టుకొస్తున్న మీ త్యాగం అంతిమంగా పరాన్నభుక్కుల పాలబడరాదని మాత్రమే మనసా వాచా కోరుకుంటున్నాం.

విలువైన జీవితాలను తృణప్రాయంగా ధారపోస్తున్న మీ అమరత్వానికి మకిలి అంటకూడదని, మీ నిస్వార్థం నిర్మలంగా నిలిచిపోవాలని ఆశిస్తున్నాం.

ప్రత్యేక రాష్ట్రం కనుచూపు మేరలో కనబడటం లేదని స్పష్టమవుతున్న వేళ…

తెలంగాణా “ప్రజల” న్యాయమైన ఆకాంక్ష ఫలించాలని మనసారా కోరుకుంటూ..
ఆదిరెడ్డికి, ఆరువందలమంది ప్రాణ త్యాగులకు కన్నీటి నివాళులతో…

RTS Perm Link

లోకంలోని పిల్లలందరూ ఇక మీ పిల్లలే…

July 17th, 2011

ఆదిలక్ష్మి, లెనిన్‌బాబు గార్ల ఏకైక కుమార్తె చిన్నారి గీతా ప్రియదర్శిని అకాల, అసహజ, అర్ధాంతర మరణంపై రెండురోజుల క్రితం ఈ బ్లాగులో తెలియపర్చినప్పటినుండి బ్లాగర్ల నుండి, మిత్రుల నుండి వస్తున్న స్పందనలకు ప్రతిస్పందించలేకపోయాను. పిల్లలు లేని మాకు, ఒకే ఒక చిన్నారిని ఒకానొక ఘోర క్షణంలో పోగొట్టుకున్న ఆ దంపతులకు మధ్య సాన్నిహిత్య పరిచయం ఇలా అనుకోని మలుపు తిరిగిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఇది నిజమో కాదో అనే అసంధిగ్ధ స్థితి నుంచి, విషయాన్ని నిర్ధారించుకున్న దశవరకూ ఈ కథనంలో అప్‌డేట్ చేస్తున్న వివరాలను చూసి స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

ముఖ్యంగా జీవితంలో ఒకే ఒక ఆశకు కూడా దూరమై కుప్పగూలిపోయిన ఆ దంపతులకు చేతనైన సాయం వీలైతే చేయవలసిందిగా ఆ కథనంలో చేసిన అభ్యర్థనకు తక్షణ స్పందన వచ్చింది.

చందమామ కుటుంబాలకు విషాదవార్త

తాము సహాయం చేయడానికి సిద్ధమై కూడా తమ పేర్లు బయటకు పొక్కకుండా, తమ కష్టార్జితం నుంచి తలా కొంచెం వేసుకుని అందించడానికి అమెరికా నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాల వరకు ముందుకొచ్చిన మానవతా మూర్తులకు నమస్కరించడం తప్ప కృతజ్ఞతలు చెప్పలేను.

బిడ్డను కోల్పోయిన దయనీయ క్షణాల్లో డబ్బురూపంలో సాయం అందించడానికి ముందుకొస్తే ఆ తల్లిదండ్రులు స్వీకరించగలరా, తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుందేమో అనే సందేహాన్ని సహాయం చేయదలచిన వారు వ్యక్తపరిచారు. లెనిన్‌బాబుగారిని  ఈవిషయమై నిన్న మధ్యాహ్నం సంప్రదిస్తే, జీవితంలో ఎవరివద్దా చేయి చాపకూడదని, కష్టార్జితంమీదే బతకాలని భావిస్తూ వచ్చామని, ప్రియదర్శిని తల్లి కుప్పగూలి పోయి ఉన్న ఈ క్షణంలో ఏం చెప్పడానికి కూడా పాలుపోవడం లేదని, మీకేది మంచిదనిపిస్తే అది చేయండని నాకు సూచించారు. ఆ ప్రకారమే సహాయం చేయదలిచిన వారికి సమాచారం అందించడమైనది. ఈ కన్నతల్లిని ముందే ఎరిగి ఉన్నవారు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఎంత కొంత సాయం చేయడానికి ముందుకొచ్చారు.

అవసరంలో ఆదుకోవడానికి ముందుకొచ్చిన మిత్రుల మానవీయ స్పందనను స్వాగతిస్తూనే… చిన్న విజ్ఞప్తి.. ఇప్పటికీ దుఃఖ భారం నుంచి బయటపడని ఆ కన్నతల్లి  గుండెబద్దలు కాకూడదని, ఆమె మనిషిగా లేచి నిలబడాలని మనందరమూ కోరుకుంటున్నాము. మీకు వీలైనప్పుడు ఆమెతో ఫోన్ ద్వారా మాట్లాడి స్వాంతన కలిగించండి. ఇంకా సమయం అనుకూలిస్తే… నిజాం పేటలోని ఆమె ఇంటికి వెళ్లి నాలుగు మాటలాడి ధైర్యం చెప్పండి. అంతర్జాలంలో ప్రమదావనం మహిళా బృంద సభ్యులు కూడా ఇవాళ ఈమేరకు సమాచారం పంచుకున్నారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. కుప్పగూలిపోయిన ఆమె లేచి నిలబడడానికి నలుగురూ కలిసి మాట్లాడటం, ధైర్యవచనాలు పలకడం కూడా చాలా అవసరం.

ఆదిలక్ష్మిగారి ఫోన్ నెంబర్ – 9440971265

ఇంతకన్నా దయనీయ పరిస్థితుల్లో బిడ్డలను, నిండు జీవితాలను కళ్లముందే పోగొట్టుకుంటున్న సంఘటనలు మన చుట్టూ వందలాదిగా జరుగుతూనే ఉన్నాయి. అందరం అన్నింటికీ స్పందించలేకపోవచ్చు.. అవసరానికి ఆదుకోలేక పోవచ్చు… కాని కష్టంలో ఉన్నవారిని, పిడుగుపాటుకు గురైనవారిని పలకరించి, సానుభూతి ప్రకటించి మేమున్నామంటూ ధైర్యం చెప్పే మన పురాతన గ్రామీణ సంప్రదాయాన్ని, జీవన సంస్కారాన్ని, వీలైన సందర్భంలో మనకు కుదిరిన సమయంలో అయినా సరే ప్రదర్శించగలిగితే అలాంటి సహాయతత్వం మరికొంతమందికి ప్రేరణగా ఉంటుందని ఓ చిన్న ఆశ.

ఆదిలక్ష్మిగారూ, బిడ్డకు దూరమైన మీరు అనుభవిస్తున్న స్థాయిలో గుండెకోత ఎలాంటిదో మాకు తెలియక పోవచ్చు. కోచింగుల పేరిట పాలుగారే  పిల్లల్ని బండకేసి చేపల్ని తోముతున్నట్లు తోముతున్నారంటూ మీరు ప్రకటించిన ఆగ్రహం కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఆ తోముడు చివరకు ఇలా ప్రియదర్శినినే బలితీసుకోవడం ఊహించలేకపోతున్నాము. ఇక జీవితం వద్దు అని నిర్ణయించుకున్న చివరిక్షణాల్లో పాప ఎంతగా నలిగిపోయిందో ఇక బయటపడదు.

స్వేచ్ఛ అంటే ఏమిటో తెలిసిన పిల్ల, స్వేచ్ఛగా 16 ఏళ్లపాటు మీవద్ద పెరిగిన పిల్ల, ఇంట్లో అలవడుతున్న స్వాభిమానానికి, బయటి జీవితంలో ఎదురవుతున్న వాస్తవానికి మధ్య తేడాను కొంచెంగా అయినా గ్రహిస్తున్న పిల్ల…  ఇలా జీవితాన్ని తీసేసుకోవడం మీకు ఊహకు కూడా అంది ఉండదు. తనమీద పడిన మొద్దు అనే తాజా ముద్రను చెరుపుకోవడానికి పాప తన జీవితాన్నే కోల్పోవడానికి సిద్ధం కావడం నిజంగా ఘోరం.

మనకళ్లముందు ఆస్తులకోసం పిల్లల్ని చంపుతున్నారు. ప్రేమోన్మాదం కోసం ఆసిడ్‌లతో ముంచుతున్నారు. ఇవి ప్రత్యక్ష హత్యలయితే ప్రియదర్శిని వంటి వారు ఎంచుకుంటున్న మార్గం పరోక్ష హత్యల్లో భాగమే. సమాజ పురోగమనానికి ఏ మాత్రం మేలు చేయని హత్యలివి.

ఈ దుర్ఘటన జరగడానికి ముందు ఏం జరిగిందో చెప్పడానికయినా మీరు కోలుకోవడం అవసరం. లేచి తిరగడం అవసరం. మీ ఆశలు పూర్తిగా కూలిపోయాయని తెలుసు. మీరు లేచినిలబడటం చాలా కష్టమని తెలుసు.. మీ సహచరుడు కాస్త ఏమారితే మీరు మిగలరనే విషయం కూడా తెలుసు… కానీ.. జీవితాన్ని ఎందుకు చేతులారా తీసేసుకోకూడదో పిల్లలకు చెప్పడానికయినా మీరు మిగలాలి. మృత్యువును ధిక్కరిస్తూ పాప తీసుకున్న ఆ కఠోర నిర్ణయాన్ని ఎవరూ సమర్థించకపోవచ్చు.. సమర్థించకూడదు కూడా..

పాపలేని ప్రపంచం మీకు శూన్య ప్రపంచంలాగే అనిపించవచ్చు. కాని వ్యక్తిగా మీరు రక్తం పోసి  పెంచిన బిడ్డను కోల్పోయాక ఇప్పుడు మీరు నిజంగా సమూహంలో భాగమయ్యారు. లోకంలోని పిల్లలందరూ ఇక మీ పిల్లలే.. పిల్లలందరిలో మీ పాపను చూసుకోవడం వల్ల వ్యక్తిగా మీకూ, సమాజానికీ కూడా మంచి జరుగుతుంది. పాప లేని ప్రపంచం మనందరికీ ఒక గుణపాఠం కావాలి. ఆ గుణ పాఠాన్ని ప్రపంచంతో పంచుకోవడానికైనా సరే… మీరు కోలుకోవాలి. ఆత్మహననం మంచి మార్గం కాదనే సత్యాన్ని బోధించడానికి మీరు మళ్లీ ఈ ప్రపంచంలో పడాలి. అమ్మ ఒడి పిల్లలందరికీ ప్రేమను పంచే మమతల ఒడిగా మారాలి.

చెప్పడం చాలా సులభం. అందులోనూ గడ్డ పైన ఉండి చెప్పడం ఇంకా సులభం.. కానీ మీరు తేరుకోవటం, తెప్పరిల్లడం మీ చేతుల్లోనే ఉంది. మీ క్షేమం మా అందరికీ అవసరం. తల్లిదండ్రులుగా మీ కష్టం ఇకపైనయినా ఎవరికీ కలగకూడదని, అలుముకున్న చీకటిని తొలగించుకుని మీరు మళ్లీ వెలుగులు పంచిపెడతారని, దారుణంగా భగ్నమయిన మాతృహృదయ ఆకాంక్షలను ప్రపంచంకోసం పరిచి ఉంచుతారని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నా….

లెనిన్‌బాబుగారూ, అమ్మఒడి జాగ్రత్త… ఆదిలక్ష్మి గారు జాగ్రత్త….

RTS Perm Link

చందమామ కుటుంబాలకు విషాదవార్త

July 15th, 2011

గీతా ప్రియదర్శిని

చందమామ చిరకాల అభిమాని, అమ్మఒడి బ్లాగు రూపకర్త,  ఆదిలక్ష్మి గారి అమ్మాయి గీతా ప్రియదర్శిని మనందరినీ వదిలి పెట్టి ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. పోటీ చదువుల విషవలయంలో పీకలలోతు కూరుకుపోయిన ఈ ప్రపంచాన్ని శపిస్తూ ఈ పాలమీగడ…. పసిప్రాయంలోనే ఈ లోకం నుంచి దాటుకుంది.

ఈ రాత్రి 12 గంటల వేళ -15-07-2011- వలబోజు జ్యోతిగారి ఈమెయిల్ చూసి ఈ దారుణ నిజాన్ని నేరుగానే తెలుసుకుందామని గీత అమ్మకు కాల్ చేసి విఫలమై, నా బాధను ప్రపంచం ముందుకు తీసుకువస్తున్నాను.

గత సంవత్సర కాలంగా చందమామ పనిలో భాగంగా, ఇతరత్రా సందర్భాలలో ఆదిలక్ష్మిగారితో మాట్లాడాలని ఆమె ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా, ‘అమ్మలేరు అంకుల్, తర్వాత చేస్తారా, ముఖ్యమైన విషయం అయితే చెప్పండి’ అంటూ పలకరించిన ఆ లేతస్వరం ఇవ్వాళ శాశ్వతంగా మూగపోయింది. వలభోజు జ్యోతి గారిద్వారా విన్న ఈ వార్తను స్వీకరించడానికి కూడా నాకు మనస్కరించడం లేదు.

“నా తల్లిని ప్రయివేట్ కళాశాలల చేపల తోముడు అనే వికృత కోచింగ్ బారిన పడవేయను’ అంటూ ఆదిలక్ష్మిగారు కొన్ని నెలల క్రితం చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లోగింగురుమంటున్నాయి. సెలవులొచ్చాయంటే చాలు ప్రైవేట్ కాలేజీలు ఆంధ్రదేశంలో బడిపిల్లలను ‘చేపల్ని బండపై తోమినట్లు’ తోముతున్నాయని ఆగ్రహం ప్రకటించిన ఈ కన్నతల్లి ఏకైక గారాల పట్టి మనమెవ్వరూ ఊహించని కోణంలో జీవితం వద్దనుకుని వెళ్లిపోయింది.

పోటీ చదువుల భారంలో కన్నకూతురిని ముంచనివ్వనని కన్న తల్లి శపథం చేస్తే, చదువులలో డల్‌గా ఉన్నావని పాలుగారే ఈ చిన్నారిని తోటి మిత్రులు వెక్కిరించారు.

తల్లిదండ్రులు చేస్తున్న జీవన పోరాటం సంవత్సరాలుగా చూస్తూ చూస్తూ ఎదుగుతున్న ఈ లేత గుండె తన మిత్రులు పెట్టిన కోతను భరించలేక కరిగి పోయిందేమో…

జీవితానికి మార్కులొక్కటే కొలబద్ద కాదంటూ కన్నవారు చేసిన బోధకంటే…. జీవితమంటే, భవిష్యత్తు అంటే మార్కులే అంటూ గిరిగీసి మరీ నిల్చున్న ప్రపంచం నుంచి కొత్తగా ఎదురైన అవహేళనలను అర్థం చేసుకోక ఈ పసిమనసు తల్లడిల్లిపోయిందేమో… కారణం ఈ క్షణంలో స్పష్టంగా తెలీదు కాని మన కళ్లముందు మళ్లీ ఈ ఘోరం జరిగిపోయింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా పారిశ్రామిక వేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందిన ఈమె కన్నతల్లి, గత 18 ఏళ్లుగా తాను నమ్మిన విలువల కోసం రాష్ట్రం నుంచి కేంద్రం దాకా మొత్తం పాలక వ్యవస్థమీదే తనదైన కోణంలో తిరగబడిన నేపధ్యంలో, సర్వస్వం కోల్పోయి జీవితంతో తీవ్రంగా ఘర్షణ పడుతోంది.

తెలుగు బ్లాగులలోనే అరుదైన విలక్షణమయిన అమ్మఒడి బ్లాగులో కణిక వ్యవస్థ పేరిట వీరు రాసిన, రాస్తున్న కథనాలు, ఈ ప్రపంచంలోని అన్యాయం, అవినీతిపై తమదైన కోణంలో వీరు ఘర్షిస్తున్న చరిత్రకు ఓ నిఖార్సయిన ప్రతిబంబం.

భారత రాజకీయ రంగంపై సుదీర్ఘ కుట్ర, నకిలీ కణిక వ్యవస్థ వంటి అంశాలపై ఇంగ్లీషులో, తెలుగులో ఆదిలక్ష్మిగారు గత కొన్ని సంవత్సరాలుగా 425 పైగా సుదీర్ఘ కథనాలు వెలువరించారు. తెలుగు బ్లాగుల చరిత్రలోనే ఉబుసుపోక కబుర్ల కోసం కాక తాను నమ్మిన దాన్ని చెప్పడం కోసం కొనసాగించిన సుదీర్ఘ కథనాల చరిత్రలో అమ్మఒడి బ్లాగుదే అగ్రస్థానం.

ఒక చిన్న అవలోకనం!
http://ammaodi.blogspot.com/

సంపదలను చవి చూసిన చోటనే పేదరికాన్ని కూడా చవి చూస్తున్న ఈ అమ్మా నాన్నలకు జీవితంలో మిగిలిన ఒకే ఒక చిరు ఆశ కూడా ఇవ్వాళ శాశ్వతంగా దూరమైపోయింది. ఆదిలక్ష్మిగారూ, లెనిన్ గారూ.. నాకు తెలిసిన ఈవార్తను ఎలా రాయాలోకూడా అర్థం కాక కుములుతున్నా.. క్షమించండి….

దాదాపు సంవత్సరం క్రితం ఆదిలక్ష్మి గారు తన అరుదైన ‘చందమామ’ జ్ఞాపకాలను పంపుతూ కన్నకూతురి ఫోటోను ప్రచురణకోసం పంపారు.

‘చందమామ’ జ్ఞాపకాలకు సంబంధించి ‘అమ్మఒడి’ ఆదిలక్ష్మిగారిది ఓ వినూత్న అనుభవం. చిన్నప్పుడు నాన్న చదివి వినిపిస్తే తప్ప చందమామ కథను వినలేని అశక్తత లోంచి ‘నేనే చదువు నేర్చుకుంటే పోలా’ అనే పట్టుదలతో, స్వయంకృషి తోడుగా శరవేగంగా చదువు నేర్చుకున్న అరుదైన బాల్యం తనది.

ఆవిధంగా చందమామ ద్వారా చదవటం నేర్చిన, చదువు నేర్పిన గురువును గౌరవించడం నేర్చిన ఆదిలక్ష్మిగారు, ఒకప్పుడు నాన్నతో తను పొందిన అనుభవాన్ని తన పాపాయి నుంచి కూడా ఎదుర్కొన్నారట. చందమామ కథను ఒకసారి చదివి వినిపిస్తే, మళ్లీ మళ్లీ వినాలి అనే కుతూహలంతో తప్పుల తడకగా చందమామ కథను చదివి నవ్వించేదట పాప. కన్నతల్లి  ఒకట్రెండుసార్లు చందమామను చదివి వినిపించి, ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్నిసార్లయినా చదివి వినిపిస్తాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేదట.

ఇదీ చందమామతో బంధం అల్లుకున్న తరతరాల తెలుగు కుటుంబాల చరిత్ర. ఆదిలక్ష్మిగారు, ఆమె జీవన సహచరుడు, వారి పాపాయి దశాబ్దాలుగా నింగిలోని చందమామతో పాటు నేలమీది ‘చందమామ’తో కూడా చెలిమి కొనసాగిస్తూ వచ్చారు. నేలమీది ‘చందమామ’తో ఇటీవలి వరకు ప్రత్యక్ష సంబంధం లేని ఆదిలక్ష్మి గారు ఇటీవలే చందమామతో పరిచయంలోకి వచ్చారు.

నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… తాను పాఠాలు చెబుతున్న స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారూ… మీ చందమామ కుటుంబాన్ని చూసి చందమామ సిబ్బందిగా మేం గర్వపడుతున్నాం. అంటూ చందమామ బ్లాగులో, వెబ్‌సైట్‌లో ఈ చందమామ కుటుంబం గురించి సంవత్సరం క్రితమే పరిచయం చేశాము.

ఈ సంవత్సర  కాలంగా ఆమె పంపిన రెండు కథలు చందమామలో ప్రచురించబడ్డాయి. మూడవ కథను కూడా ఈ మధ్యనే ప్రచురణకు తీసుకున్నామని, అన్ని కథలూ స్వీకరించలేకపోయినా క్రమం తప్పకుండా చందమామకు కథలు పంపిస్తూ ఉండమని ఈమధ్యే ఆదిలక్ష్మిగారికి చెప్పడం కూడా అయింది.

కానీ, ఇంతలోనే ఈ ఘోరం.

ఈ క్షణం కూడా, నాకు నడిజాములో చేరిన ఈ వార్త నిజం కాకుండా పోతే ఎంత బాగుండు అనిపిస్తోంది.

కన్నవారి సాహిత్య వారసత్వంతో ఇంటర్మీడియట్ పూర్తికాక ముందే తానూ ఒక బ్లాగును రూపొందించుకుని తన పసిమనసుకు తోచిన కథలూ, కథనాలూ పోస్ట్ చేస్తూ వస్తున్న ఈ చిన్నారి, తన లేలేత బ్లాగును లోకంలోని పసిపిల్లలందరికీ వారసత్వంగా మిగిల్చి వెళ్లిపోయింది.

ఆహా! ఓహో!
http://paalameegada.blogspot.com/

2010 డిసెంబర్ నెలలో కొత్తపల్లి పిల్లల వెబ్ సైట్‌లో జారు బాబూ అనే తన కథ, బొమ్మ రెండూ పడితే ఆనందంగా ఈ వార్తను తన బ్లాగులో పంచుకొంది.

“కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!”
http://paalameegada.blogspot.com/2010/12/blog-post.html

ఇదే ఈ చిన్నారి చివరి బ్లాగ్ కథనం. చంద్రుని చల్లదనానికి పరవశించే చకోర పక్షుల నేపధ్యంలో రామాయణం నేపధ్యంలో ఒక  పేజీ కథను గతంలోనే ఈ చిన్నారి చందమామ పత్రికకు పంపింది. కాని, పౌరాణిక నేపథ్యం ఉన్న కథను చిన్న కారణంవల్ల చందమామ స్వీకరించలేకపోయింది.

పగలే వెన్నెలా – పరవశమాయెగా!

http://paalameegada.blogspot.com/2010/09/blog-post.html

కానీ పైన ప్రస్తావించిన ‘జారు బాబూ’ కథను చదివితే చిన్న వయసులోనే ఊహలకు అక్షరాలద్దుతున్న ఈ చిన్నారి రచనా పాటవం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

సామాజిక కారణాలతో పిల్లలు వద్దనుకున్న మాకు, లోకంలోని పిల్లలంతా మా పిల్లలే అన్న సంస్కారాన్ని ఉద్యమాల పుణ్యమా అని నేర్చుకున్న మాకు, సంతాన ప్రాప్తిని స్వచ్చందంగా వద్దనుకున్న మాకు, పసిపిల్లల అర్థాంతర మరణాలు గుండె కోతను మిగిలిస్తున్నాయి.

ఆదిలక్ష్మిగారూ, వీలయితే పాపతో పాటు ఈ వేసవిలో నంద్యాల నుంచి చెన్నయ్‌కి వచ్చి మాతో కొన్నాళ్లు గడుపుతామని మాట ఇచ్చారు. కాని మీరే మీ బ్లాగులో ఈమధ్యనే అవలోకనం చేసుకున్న విధంగా ఉపాధి వెతుక్కోవడం కోసం చిన్న పట్టణం నుంచి హైదరాబాదుకు మకాం మార్చారు. కాని మీ పాపను శాశ్వతంగానే చూడలేకపోయాం. విధి అంటూ పెద్దమాటలు వాడనవసరం లేదు కాని, ఒక్కసారి మీరు ఇటు వచ్చి తర్వాత అటు వెళ్లి ఉంటే ఎంతబాగుండేదో..

ప్రపంచానికి ఎదురుతిరిగి నరక బాధలు అనుభవిస్తూ కూడా మీరు జోకులెయ్యడం, కడుపారా నవ్వడం, నవ్వించడం మర్చిపోలేదు. లక్ష బాధలు అనుభవిస్తూ కూడా మీరు కోల్పోని నవ్వును ఫోన్లో విన్నప్పుడల్లా జీవితంపై కొండంత నమ్మకం చివురించేది మాకు.

విధినిర్ణయం అనే భావనపై మాకిప్పుడు నమ్మకం లేదు. కాని ఈ క్షణం మాకు ఒకే ఆలోచన…. ఇలా జరిగి ఉండకపోతే బాగుండు…. ఇది నిజం కాకపోయి ఉంటే బాగుండు….

కాని ఒక భాధ మా హృదయాలను ఇకపై జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది..

గీతా ప్రియదర్శినీ…. చందమామ కన్నబిడ్డా!

మేం సాధారణ మనుషులం.. నిద్ర లేచింది మొదలుకుని లక్ష తప్పులు చేస్తూనే బతుకుకోసం పోరాడుతున్నవాళ్లం..

ఇంత శిక్ష వేసి వెళ్లిపోయావేమిటి తల్లీ…

 

తాజా నోట్:
రాత్రి లెనిన్ గారికి ఫోన్ చేస్తే అప్పటికే ఆలస్యమయింది కాబట్టి ఫోన్ తీయలేదు. ఈ తెల్లవారుజామున మిస్స్డ్ కాల్ చూసి తనే చేసారు. ఏ ఘోరం నిజం కాకూడదని అనుకున్నానో అదే నిజమైంది. నిన్న తెల్లవారి పాప స్నానం చేయడానికి వెళ్లింది. తిరిగి బయటకు రాలేదు. నంద్యాల నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత కోచింగ్ కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో నంద్యాలను మించిన దారుణ అనుభవాలు….

అన్నీ కరెక్టుగా రాసిన సమాధానాలకు తప్పు అని రాసి మార్కులు కోత కోయడం. వెనుకబడిన సబ్జెక్టులో సహజంగానే మార్కులు తగ్గితే టీచర్లే గేలి చేయడం… ఈ రోజుల్లో కూడా క్లాసులో అందరి ముందూ ఆమెను బెంచీపై నిలబెట్టి ఆవమానించడం..

మార్కులు రాకపోయినా ఫరవాలేదు ఎలాంటి ప్రశ్నలు వస్తాయో, ప్రశ్నలు ఎలా రూపొందిస్తారో ప్రాసెస్ తెలుసుకోవడానికి మాత్రమే కోచింగ్‌కి హాజరు కామని తల్లీ దండ్రీ కొండంత ధైర్యం, భరోసా ఇచ్చినా  నేరుగా అనుభవించేది, కోచింగ్ సెంటర్లనే చేపల తోముడు బండలపై జరిగే ప్రతి ఘటననూ ప్రత్యక్షంగా భరించేదీ తను కాబట్టి ఎంత నరకం అనుభవించిందో..

కోచింగ్ కాలేజీకి పోవాలంటేనే భయం వేస్తున్న నేపధ్యంలో ఈ పసిపిల్ల ఎంత దయనీయ స్థితిలో తనకు ఇక…. వద్దు అనే నిర్ణయానికి వచ్చిందో మనకు అర్థం కాకపోవచ్చు.

తోటి పిల్లలు కాదు.. కోచింగ్ వెలగబెడుతున్న కాలేజీ నిర్వాహకులు, టీచర్లే ఒక జీవితాన్ని నిలువునా గొంతు కోసేసారు. తాముంటున్న నిజాంపేటకు దగ్గర్లోని ఓ కాలేజ్ కమ్ కోచింగ్ సెంటర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

నక్సలైట్లు పూనుకుంటే తప్ప ఈ దేశంలో ఏ ఒక్క అన్యాయ ఘటనకు సంబంధించి కూడా సహజన్యాయం, తక్షణ న్యాయం జరగదు కాదు జరగదు.. ఇది నా వ్యక్తిగతాభిప్రాయం…  కాబట్టి ఈ కాలేజీకి ఏం జరగదు.. ఈ నిర్వాహకులకు ఏం కాదు. ఆ టీచరాక్షసులకు నెల జీతం తప్ప మరే గుండెకోతలూ కనిపించవు… వినిపించవు…

అయినా ఈ రోజుల్లో కూడా పిల్లలను బెంచీ ఎక్కి అవమానించడం రాష్ట్ర రాజధానిలోనే అలవాటుగా కొనసాగుతోందా? రూపంలో కార్పొరేట్ కల్చర్.. సారంలో పక్కా ఫ్యూడల్ సంస్కృతి.. భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం వెలిగిపోతోందని పేపర్లలో మహామేధావుల రాతలు… పత్రికలు చెప్పేది ఎంత నిజమో…. హైదరాబాద్ ఇంత పచ్చి ఫ్యూడల్ కంపుతో ఇంత ఘోరంగా తయారయిందా!

17 సంవత్సరాలు కన్నబిడ్డకు స్వేచ్ఛనిచ్చి నిజంగా అమ్మఒడిలాగే పొదవుకుని కాపాడుకున్న అమ్మ.. నిన్న ఈ ఘోరం జరిగినప్పటినుంచి ఏడుపు ఆపటం లేదు. లెనిన్ గారితో మాట్లాడుతూంటే పక్కన హృదయవిదారకంగా ఆమె రోదన. కన్నతల్లి మాత్రమే పెట్టగల రోదనలు. ‘రాజుగారూ, అమ్మ ఒడి ఖాళీ అయింది. అమ్మ ఒడిని ఖాళీ చేశారు. అందరూ కలిసి అమ్మ ఒడిని ఖాళీ చేసేశారు..”  ఆమె ఇవ్వాళ మాట్లాడగలిగింది ఈ రెండు ముక్కలు మాత్రమే.’

24 గంటలూ ఆమెకు తోడుగా ఉండమని, ఒక్క క్షణం కూడా ఆమెను వదలవద్దని లెనిన్ గారికి సలహా ఇస్తుంటేనే మనసులో భరింపరాని బాధ…

ఆమెకు ఇవ్వాళ ఉదయమే కాల్ చేసి ఏదయినా అనువాద పని ఇస్తే చేయగలరా అని అడగాలనుకున్నాను. గత ఎనిమిది నెలలుగా వీరిద్దరూ మేం చేస్తున్న అనువాద పనులలో భాగస్వాములు. ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి మధ్యలో రెండు నెలలు గ్యాప్. మళ్లీ ఇవ్వాళ పని వస్తే చేయగలరా అని ఫోన్ చేయాలనుకున్నాను. ఇంతలోనే ఈ ఘోరం..

రాజేష్ గారూ మీరన్నది నిజం. ఇక్కడ ఊహాగానాలు వద్దు. వీలయితే.. పసిబిడ్డను పోగొట్టుకున్న కన్నవారికి కాసింత ఓదార్పుగా మనం నాలుగు మాటలు మాట్లాడితే చాలు.

మొబైల్ లెనిన్ గారి వద్దే ఉంది కాబట్టి కాస్త స్వాంతనగా తనను పలకరిస్తే చాలు.

వారి మొబైల్ నంబర్: 94409 71265

కన్నబిడ్డకు దూరమై, సర్వం కోల్పోయిన ఈ “నిరుపేద” తల్లిదండ్రులకు మనం కాసింత సాయం ఆర్థికంగా కాని, ఇతరత్రా కాని ఏదయినా చేయగలమా? వాళ్లు ఏదీ నోరు విప్పి అడిగే స్థితిలో కూడా లేరిప్పుడు. కూకట్‌పల్లి దగ్గిర్లోని నిజాం పేటలో వీరు ప్రస్తుతం ఉంటున్నారు.

A/c.No. 31223689337 [Yadla Adi Laksmi].
SBI, Nandyal Branch code. 883.

Cell No: 9440971265.
leninyadla@gmail.com
adilakshmi.yadla@gmail.com

(నంద్యాల ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఇటీవలే ఓపెన్ చేసిన పై ఖాతానే వీరు కొనసాగిస్తున్నట్లుంది. )

మన జీవిత అవసరాలకు పోనూ కాస్త మిగులు ఆదాయం మన వద్ద ఉంటే, ఎంత పరిమితంగా అయినా సరే, ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన ఈ “అనాథ”లకు కాస్త సాయం చేయగలిగితే బాగుంటుందేమో… ఆలోచించండి… ముందుగా లెనిన్ గారికి పైనంబర్ కి ఫోన్ చేసి స్వాంతన పలుకుదాం…

జరిగిన ఈ ఘోర దురంతం పట్ల మనలో ఏ ఒక్కరూ తప్పుగా అర్థం చేసుకోరని నమ్మకముంది. కన్న కోత, గుండెకోతలు కలిసి ముప్పేట దాడికి గురయిన వీరికి వీలయితే కాసింత సహాయం చేద్దాం..

రాజశేఖర రాజు.
చందమామ
చెన్నయ్
9884612596
krajasekhara@gmail.com

కాలం నిన్న ఉదయం 7.30 గంటల తర్వాత ముందుకు కదలకుండా అలాగే ఆగిపోయి ఉంటే ఎంత బాగుండేదో..

చదువులో మొద్దును కాను…!
సూసైడ్ నోట్ రాసి బాలిక ఆత్మహత్య
న్యూస్ టుడే: ఓ బాలిక తన తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కెపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన లెనిన్‌బాబు, సరిత -యడ్ల ఆదిలక్ష్మి- దంపతులు రెండు మాసాల కింద నగరానికి వచ్చి నిజాంపేట గ్రామంలోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి ఒక్కగా నొక్క కుమార్తె ప్రియదర్శిని (16). ఈమె నంద్యాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం హైదరాబాద్‌లో చదివించాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇందుకు గాను ప్రస్తుతం ప్రవేశం కోసం ఆయా కళాశాలల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.శుక్రవారం ఉదయం 7.30 వరకు తన గదిలోంచి ఆమె బయటకు రాకపోవడంతో తల్లి సరిత తలుపు తట్టారు. ఎంతకీ పలకకపోవడంతో అనుమానం వచ్చి తండ్రి లెనిన్‌బాబు తలుపులు పగలగొట్టి చూడగా ప్రియదర్శిని చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. తన మృతికి ఎవరూ కారణం కాదని, తాను చదువులో మొద్దుకానని రాసింది. తల్లిదండ్రులకు నమస్సారం అంటూ అందులో పేర్కొంది. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె కళ్లను ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈనాడు ఆన్‌లైన్‌లో హైదరాబాద్ ఎడిషన్లో వచ్చిన ఈ వార్త కాస్త ఆలస్యంగా అందింది. “చదువులో మొద్దును కాను…” తనను బెంచిపై ఎక్కించి నిలబెట్టి అవమానించిన ఆ ఘోరమైన కాలేజిపై -నిజాంపేట-, డల్ స్టూడెంట్ అని వట్టిపుణ్యానికి వెక్కిరించిన వారిపై ఈ పసిపాప ప్రకటించిన ధిక్కార స్వరం ఎంత నైర్మల్యంతో ఉందో గమనించండి. నిన్న ఉదయం  రెండుమూడు సార్లు తను ఉన్న గదిలోకి పాప వచ్చిందని, తనకు జరిగిన అవమానంపై ఆమె మనసులో ఇంతగా వేదన రగులుతోందని అసలు ఊహించలేకపోయానని లెనిన్‌బాబు గారు ఈ ఉదయం ఫోన్‌లో చెబుతుంటే గుండె పట్టేసింది.

రేపటినుంచి ఈ చిన్నారి కళ్లు ఈ ప్రపంచాన్ని సరికొత్తగా చూస్తుంటాయి.  మరొక మనిషికి జీవనదానంగా మారిన కళ్లు..  తను మొగ్గలా ఉన్నప్పుడు కూడా ఎవరినీ ద్వేషించని ఆ కళ్లు..  తను మొద్దును కాను అని మాత్రమే చివరిసారిగా విన్నవించుకున్న ఆ కళ్లు… బండబారిపోయిన మన మహా వ్యవస్థలను ప్రశ్నిస్తున్న ఆ కళ్లు….

టీచర్‌గా పనిచేస్తున్న నా మిత్రుడు నాగరాజు కొన్ని రోజుల క్రితం ఒక గొప్ప నిజాన్ని చెప్పారు. దేశం మొత్తం మీద కాంపిటీషన్ పరీక్షలకు, పోటీ చదువులకు, కోచింగ్ చిత్రహింసలకు ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ప్రయోగశాలగా మారిందని, ఇక్కడ సీటు, ర్యాంకు సంపాదించుకుంటే దేశంలో ఎక్కడైనా పోయి చదివేయవచ్చని, బతికేయవచ్చని చెప్పాడు. రిజర్వేషన్ కేటగిరీలో కూడా ఎవరికీ సీటు గ్యారంటీ అని చెప్పలేనంతగా పోటీ పెరిగిపోయిందని ఈ రాష్ట్రంలో సీట్లు సంపాదించుకోవడం అంత సులభం కాదని తన అనుభవంతో చెప్పాడు..

చదవటం, బతకడం తర్వాతి మాట.  ఎంత మంది అర్థాంతర మరణాలను, అసహజ మరణాలను ఇంకా మనం మన గొప్ప రాష్ట్రంలో చూడాల్సి ఉందో అని ఇవ్వాళ మళ్లీ భయమేస్తోంది నాకు….

RTS Perm Link

వెరీ కైండ్ ఆఫ్ యు సర్…!

July 15th, 2011

శంకర్ గారితో చందమామ పనిమీద ఫోన్లో మాట్లాడిన ప్రతిసారీ ఆయన నాతో చివర్లో చెప్పే మాట “వెరీ కైండ్ ఆప్ యు సర్

చిత్రమాంత్రికుడితో...

 

 

 

 

 

 

 

 

 

 

 

అక్టోబర్ నెల బేతాళ కథకు మరి కొన్ని కథలకు చిత్ర వివరణ -ఇమేజ్ డిస్క్ర్రిప్షన్- పంపుతున్నట్లు చెప్పినప్పుడు, ఆయన యోగ క్షేమాలు విచారించినప్పుడు, ఆయనకు నెలవారీ జీతం చెక్, చందమామ పుస్తకాలు అందాయో లేదో వాకబు చేసినప్పుడు, చందమామతో, చందమామ పనితో ఆయన అనుభవాలను తనతో పంచుకున్నప్పుడు హృదయ పూర్వకమైన అభిమానంతో ఆయన అనే చివరిమాట ఇది. ‘వెరీ కైండ్ ఆఫ్ యు సర్’.

ఎప్పుడు ఆయనకు పోన్ చేసినా సరే బిజనెస్ లైక్‌గా నాలుగు ముక్కలు మాట్లాడి ఫోన్ పెట్టేయడం అసాధ్యం. పైగా చందమామ చరిత్రపై మమకారం, చందమామపై పాతతరం సిబ్బందిపై అబిమానం చూపిస్తున్నందుకు, మా ఇద్దరి మధ్య ఎప్పుడు సంభాషణ జరిగినా తన సుదీర్గ అనుభవ సారాన్ని పంచుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం.

88 ఏళ్ళ వయస్సు నిండిన పండు ముదుసలి. దాదాపుగా కుమారులు, కుమార్తెలు మంచి పొజిషన్లో ఉంటున్నప్పటికీ దేశదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలస పోయినందువల్ల, ఇంట్లో ముసలి దంపతులు మాత్రమే ఉంటుండటం వల్ల మనుషులు కలవడానికి వచ్చినా, ఫోన్ ద్వారా మాట్లాడినా వారితో తన అనుభవాలు పంచుకోవడం అంటే ఆయనకు ఎంత సంతోషమో…

నాటి చిత్రవైభవం - జటాయువు

చిత్ర వివరణలకు తగినట్లుగా కథలకు బొమ్మలు వేసినప్పుడు, వాటని నీట్‌గా ప్యాక్ చేసి చందమామ తెలుగు ఎడిటోరియల్ అని పేరు రాసి మరీ దాన్ని భద్రంగా అందజేసినప్పుడు గడచిన ఆరు దశాబ్దాలుగా చందమామ పని పట్ల ఆయన ప్రదర్శిస్తూ వచ్చిన అకుంఠిత దీక్ష, పరిపూర్ణ నిబద్దత ఆ ప్యాకెట్‌పై అక్షరాలలో కనిపించేవి.

దాదాపు 90 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో జీవితంలో అన్ని పనులూ మానుకుని విశ్రాంతితో కాలం గడిపే అవకాశం అందరికీ వస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ జీవితం చివరి వరకు చందమామ బొమ్మలు గీస్తూ ఉండాలని, తన కష్టార్జితంతోనే తాను జీవించాలని రెండు చిరకాల ఆకాంక్షలతో ఆయన బతుకుతున్నారు.

గతంలోలాగా ఎక్కువ కథలకు బొమ్మలు గీయడం కష్టం అని తెలుసు. ఏకాగ్రతతో బొమ్మలు గీయటం సాధ్యం కాని శారీరక అశక్తత తనలో పెరుగుతున్నట్లు తెలుసు. గంట రెండు గంటలు కూర్చుని విరామం లేకుండా ఇంట్లో కూర్చుని బొమ్మలు గీస్తున్నా సరే, వెన్నెముకలో బాగా నొప్పిరావడం, అలసి పోవడం. ఇది మొత్తంగా తన ఏకాగ్రతపై ప్రభావితం చూపటం అనుభవంలోకి వస్తూనే ఉంటుందాయనకు.

కానీ ఈ అన్ని భౌతికపరమైన సమస్యలనూ ఆయన ఒకే ఒక ఆసరాతో, ఆలంబనతో అధిగమిస్తూ తన శరీరంలోని ప్రతి శక్తికణాన్ని తన లక్ష్యం కోసమే కేటాయిస్తూ జీవిస్తున్నారు.  చందమామలో చేరడం, చందమామలో ఇన్నాళ్లుగా బొమ్మలు వేయడం -పౌరాణిక, జానపద, బేతాళ తదితర ఏ ఇతివృత్తమైనా సరే- దైవాజ్ఞ ప్రకారమే తన జీవితంలో జరుగుతూ వస్తోందని, ఈ ప్రపంచంలో, ఒక సంస్థ 60 ఏళ్లపాటు తనను ఉద్యోగిగా కొనసాగిస్తూ జీవితాన్ని ఇస్తోందంటే అది మానవేతర కారణం వల్లే జరిగిందని ఆయన ప్రగాఢ విశ్వాసం.

నాటి చిత్ర వైభవం - మత్స్యావతారం

‘ఒరే శంకరా నువ్వు చందమామలో చేరి బొమ్మలు గీస్తూ ఉండరా!’ అని ఏనాడో దేవుడు ఆజ్ఞాపించాడని, ఆయన ఆదేశాన్ని ఈనాటికీ పాటిస్తూ వచ్చానని చెబుతారు. అందుకే ఈనాటికీ బొమ్మలు వేయాలంటే స్నానం చేసి పూజ ముగించిన తర్వాతే పనిలోకి దిగటం ఆయన అలవాటుగా మారింది. కుంచె పట్టుకుంటే తనకు  ప్రపంచంలో ఇక ఏదీ కనిపించదని, వినిపించదని ఏ అశరీరవాణో తనకు సూచిస్తుంటే తన కుంచె కదులుతుంటోందనిపిస్తుంటుందని ఆయన పదే పదే చెబుతారు.

చందమామలో 55 ఏళ్లు పనిచేసినప్పటికీ తనజీతం మూడేళ్లకు ముందు కూడా పదివేలకు దాటలేదని తెలిస్తే దిగ్భ్రాంతి కలగకమానదు. ఈ ఆరు దశాబ్దాల కాలంలో ఎంతమంది, ఎన్ని బయటి సంస్థలు ఆయనకు అవకాశాలు ప్రతిపాదించారో, తమ వద్దకు రమ్మని ఆహ్వానించారో ఆయనకు లెక్క తెలీదు. జీవితం అవసరం రీత్యా కూడా తనకు అవకాశాలు కల్పించినా వేటివైపూ ఆయన కన్నెత్తి చూడలేదు.

చందమామకు బొమ్మలు వేయడం… తన జీవితానికి ఇది చాలు అనుకున్నారాయన. దశాబ్దాలు పనిచేస్తున్నప్పుడు సిబ్బంది అడగక ముందే వారి ఆవసరాలను యాజమాన్యం చూడాలని, వారిని మరికొంచెం మిన్నగా పట్టించుకోవాలని ఆయనకు అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. కాని చేసేది దైవకార్యం అనుకుంటున్నప్పుడు, దైవాజ్ఞను మీరకూడదని ప్రతి క్షణం తన మనస్సు గుర్తు చేస్తున్నప్పడు ఆయన 55 ఏళ్ల అసంతృప్తులను అన్నిటినీ తనలోనే దాచేసుకున్నారు.

చందమామ నియామక పత్రం

నారు పోసినవాడు నీరుపోయడా అనే సామెత ఆయనకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కన్నతల్లి ద్వారా నేర్చుకున్న తెలుగును ఆయన మర్చిపోలేదు. నాగిరెడ్డి గారు స్వయంగా పిలిచారు. చందమామలో ఉద్యోగ నియామకపత్రం ఇచ్చారు. 1952లో చందమామలో చేరినప్పుడు తనకు ఇచ్చిన నియామకపత్రాన్ని ఈనాటికీ ఆయన భద్రంగా పదిలపర్చుకుంటూ వస్తున్నారు.

‘ఇప్పుడు నీడనిచ్చిన చందమామ భవంతి లేదు. ఆహ్వానంపలికి ఆదరించిన నాగిరెడ్డి గారు లేరు. తెలుగువారి చందమామలో తెలుగు యాజమాన్యమే లేకుండా పోయింది. కాని శంకర్ నేటికీ చందమామలోనే ఉంటున్నాడ’ని ఆయన ఆవేదనతో చెబుతున్నప్పుడు దశాబ్దాల ఆత్మయబంధం ఏదో తనలోంచి తెగిపోయినంత భాధానుబూతి ఆయనలో కలుగుతుంటుంది.

లేబర్ సమస్య అని మరొకటి అనీ లక్ష కారణాలు చెప్పినా, నిర్వహణలో వైఫల్యమే చందమామ పరుల పాలు కావడానికి ప్రధాన కారణమని శంకర్ గారి బలమైన అభిప్రాయం. చక్రపాణి, నాగిరెడ్డి గారు ఉన్నంతవరకూ దేదీప్యమానంగా వెలిగిన చందమామ తర్వాత తన ప్రాభవాన్ని కోల్పోవడానికి ఇతరేతర కారణాలకంటే వ్యక్తులే కారణమని ఆయన చెబుతారు. తాము చూస్తూ ఉండగా పెరిగి పెద్దదయిన వటవృక్షం తమముందే నేలకొరగడం ఆయనకు శరాఘాతం.

70లు, 80ల వరకు లక్షలాది మందిని తన వద్దకు రప్పించుకున్న చందమామ భవంతి ఈరోజు ఉనికిలో లేకుండా నేలమట్టమైపోయిన ఘటనను తల్చుకుంటేనే భరింపరాని బాధ ఆయనకు. అలా జరుగుతుందని ఊహించడానికి కూడా కష్టమయ్యేదాయనకు.

అన్నిటికంటే మహాశ్చర్యం ఏమంటే, కథాచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా చందమామ బొమ్మలు చందమామ కథలకు మించిన ఆసక్తిని దశాబ్దాలుగా పాఠకుల, అభిమానులలో కలిగిస్తూ వస్తున్నప్పటికీ, ఈ చిత్రమాంత్రికుడు చందమామ కథకే తొలి ప్రాదాన్యం ఇస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే పత్రికకు కథే ప్రాణమని, మంచి కథలు ఉంటేనే మంచి బొమ్మలు వేయడానికి ప్రేరణ కలుగుతుందని. కథను బట్టే మంచి బొమ్మలు చిత్రకారులు గీయడానికి వీలవుతుందని ఆయన బలంగా నమ్ముతారు.

పెళ్ళి తర్వాత 1946లో దంపతులు

అందుకే ఈ మధ్యకాలంలో చందమామలో కథల నాణ్యత పెరుగుతూ వస్తోందని. పంపిన కథలకు బొమ్మలు వేస్తూంటేనే మనసుకు హాయి గొల్పుతున్నట్లు ఉంటోందని ఆయన చెబుతూ వస్తున్నారు. ఈ మధ్యే అచ్చయిన శివనాగేశ్వరరావు గారి ‘బంగారు నెమలి’ కథకు బొమ్మలు గీస్తున్నప్పుడు ఆయన ఎంత సంతోషపడ్డారో. కథ ముందు పెట్టుకుని చదివి బొమ్మ గీస్తున్నప్పుడో లేదా పూర్తి చేసినప్పుడో తన అనుభూతిని మాతో పంచుకుంటారాయన.

గత సంవత్సరం మే నెల చందమామలో వచ్చిన  కప్పగంతు శివరాం ప్రసాద్ -చందమామ వీరాభిమాని- గారి ‘నిజమైన చదువు’ బేతాళ కథకు నాలుగు నెలల క్రితమే జనవరిలో శంకర్ గారు బొమ్మలువేశారు. జనవరి చివరలో శివరాంగారు ఆయనను కలుసుకోవాలని వచ్చినప్పుడు తన బేతాళ కథకే శంకర్ గారు బొమ్మలు గీయడం ముగించారు. ఓ సాయంత్రం ఆయన ఇంటికి పోయినప్పుడు సాదరంగా ఆహ్వానిస్తూ, ‘మీ బేతాళ కథకే బొమ్మలు వేస్తున్నాను. బాగున్నాయా చూసి చెప్పండి’ అన్నప్పుడు శివరాం గారు పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది.

జీవితంలో శివరాం గారు శంకర్ గారిని కలిసింది అదే మొదటిసారి. తాను చందమామకు కథ రాసి పంపడం అదే మొదటిసారి. తన కథకు శంకర్ గారు బొమ్మలు వేస్తున్నప్పుడు ఆయనను కలిసిన అనుభవం కూడా ఏ కథకుడికైనా బహుశా అదే మొదటిసారి. కథకు సరిగ్గా సరిపోయిన బొమ్మలు వేయడంతో మహదానందంతో శివరాంగారు శంకర్ గారి పాదాలకు నమస్కరించి ఆశీర్వదించమని కోరారు.

ఈ అరుదైన ఘటనను శివరాం గారు ఎలా మర్చిపోలేకున్నారో శంకర్ గారు కూడా అదే విధంగా గుర్తు పెట్టుకున్నారు. ఇప్పటికీ సందర్భం వస్తే చాలు..  ‘ప్రసాద్ గారు బాగున్నారా’ అంటూ పరామర్శించే ఈ నవ వృద్ధ యువకుడిలో ఆత్మీయత రంగరించుకున్న మెత్తటి తడి… బెంగళూరు నుంచి వచ్చి కలుసుకుని  నాలుగు మంచి మాటలు తనగురించి బ్లాగులో రాసి ప్రచురించిన శివరాం గారి పట్ల ఆయనకు ఎంత సాదర భావమో..

కథకులకు, రచయితలకు ప్రోత్సాహమిస్తే, వారితో నిత్య సంబంధంలో ఉంటే వారు మంచి కథలు పంపడానికి ప్రేరణగా ఉంటుందని, చందమామలో ప్రస్తుతం సగం పాత కథలు, సగం కొత్త  కథలు వస్తున్నాయంటే కథకులు ప్రేరణ పొందుతున్నారని, మంచి కథలు పంపడానికి ఉత్సాహం చూపుతున్నారని అర్థం అని ఆయన అంటారు.

పనిపాటలతో అలసే పాటకజనానికి చందమామ కథలు తొలినుంచి కాస్త సేద తీర్చాయని, చందమామలో సరదా కధలను చదువుతూ జనం జీవితంలో పడుతున్న శ్రమను కాస్సేవు మర్చిపోయేవారని, చింత చెట్టు దయ్యాలు, రాక్షసుల కథలు చందమామలో అంత విజయం పొందాయంటే అదే కారణమని ఈయన అభిప్రాయం. మనుషులకు మంచి చేసే దయ్యాలు, రాక్షసులు మంచివైపు నిలబడే దయ్యాలు చందమామలో కాక ఇంకే పత్రికలో కనిపిస్తాయని ఆయన ధీమాగా చెబుతారు.

రెండేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చి శంకర్ గారిని కలిసిన అన్వర్ -సాక్షి చిత్రకారులు- గారు ఆయనను కలిశాక ఒకే ఒక మాటన్నారు. ‘జీవితంపట్ల ఆయన పరిపూర్ణమైన సంతృప్తితో ఉంటున్నారు. ఇది లేదు, ఇది రాలేదు అనే కొరతకు సంబంధించిన మాట ఆయన నోట్లోంచి రావటంలేదు. మనిషిలో బాధ ఉంటే కదా అసంతృప్తి చెందడానికి.”

మనిషి జీవితంలో అత్యంత విలువైన 60 సంవత్సరాలు. ఒకే పత్రిక, ఒకే పని, ఒకే ఆశయం. ఇది తప్ప నాకింకేమీ వద్దు అనే పరమ సంతుష్టికరమైన జీవితాచరణ. వీటన్నింటి ప్రతిరూపం. చందమామ శంకర్.

షణ్ముఖవల్లి, శంకర్ దంపతులు

వ్యక్తిగత జీవితంలో ఆయనకు నిజమైన తోడూ నీడా ఆయన జీవన సహచరి షణ్ముఖవల్లి గారు. ఆమె లేకుంటే ఆయన లేరన్నది ఉబుసుపోక మాట కాదు. అక్షరసత్యం. నీడలా అంటిపెట్టుకునే ఆమె ఏదైనా పనిమీద బయటకు వెళ్లవలసివచ్చి రాత్రివరకు రాలేకపోతే 88 ఏళ్ల వయసులో కూడా శంకర్ గారు అన్నం స్వయంగా తానే వండుకుని తింటారు. ఈనాటికీ ఇదే తంతు..

నేర్చుకోవాలంటే, ఆచరించాలంటే కళ్లముందు జీవితంలో ఎన్ని ఉదాహరణలు లేవు మనకు…

శంకర్ గారూ, మీతో కలిసి పని చేసే మహద్భాగ్యం అనుకోకుండా దక్కినందుకు..

మీ మాట మీకే అప్పగిస్తున్నానండీ..

వెరీ కైండ్ ఆఫ్ యు సర్…!

RTS Perm Link

‘మాయాబజార్‌’లో వెలిగిన భస్మాసురుడు

July 9th, 2011

మానవజాతి సాగించిన సాంకేతిక అన్వేషణలో సినిమా మాధ్యమానికి మహత్తర స్థానముందని తలపండిన విజ్ఞులు ఎప్పుడో ప్రకటించారు. ఇటీవలే 75 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలుగు సినిమా చరిత్ర గతంలోకి ఓసారి తొంగిచూస్తే నటనకు భాష్యం చెప్పిన మహానటులు, కడకంటి చూపులతో లక్షభావాలను పలికించి, వశీకరించిన మేటి నటీమణులు, సంగీత సాహిత్యాలకు, సినిమా నిర్మాణంలో తలమానికంగా నిలిచే కెమెరా విన్యాసాలకు, అబ్బురపర్చే దర్శకత్వ ప్రతిభకు మారుపేరుగా నిలిచే సాంకేతిక నిపుణులు ఎంతోమంది తెలుగు సినీ వినీలాకాశంలో స్వర్ణకాంతులను వెలయించి తమదైన గొప్ప వారసత్వాన్ని భవిష్యత్తరాలకు అందించి వెళ్లారు.

ఇలాంటి అరుదైన నటీనటుల్లో గురు గోపీనాథ్ ఒకరు. కేరళలో కథాకళి నృత్యరూపకానికి ఆధునిక కాలంలో ప్రాణం పోసిన మహనీయ గురువు గోపీనాథ్. ఆయన కేరళవాసులకు కథాకళి బ్రహ్మ కాగా మనకు మాయాబజార్ సినిమాతో ఒక మహాద్భుత నటుడిగా మిగిలిపోయారు.

మోహినీ భస్మాసుర

మాయాబజార్ సినిమాలో మోహినీ భస్మాసుర రూపకంలో మూకాభినయంతో ఘటోత్కచుడినే కాకుండా లక్షలాది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గోపీనాధ్ ఒక మలయాళ నటుడేకాదు. కథాకళికి ప్రాణప్రతిష్ట చేసిన మేటి నాట్యాచార్యుడు కూడా. సినిమాలో భస్మాసురుడిగా ఆయన నటవైభవాన్ని తెలుసుకునే ముందు ఆయన జీవిత విశేషాలను కాస్త వివరంగా తెలుసుకుందాం.

కథాకళికి మారుపేరు గురు గోపీనాథ్…
గురు గోపీనాథ్ 20 శతాబ్దిలోని భారతీయ నృత్య చరిత్రలో నిరుపమాన వ్యక్తిత్వంతో వెలుగొందారు. భారతీయ సాంప్రదాయ నృత్యంలో ఆయన మేటి నాట్యాచార్యుడు. తన జీవిత ప్రారంభంలో గోపీనాథ్ చేసిన కృషి ఫలితంగానే కథాకళి నృత్యం కేరళలోనూ విదేశాల్లోనూ ప్రఖ్యాతి గాంచింది.

నృత్యకారుడిగా గోపీనాథ్ సాధించిన అత్యున్నత విజయం ఏదంటే కథాకళిని నృత్యగురువులకు, విద్యార్థులకు, ప్రేక్షకులకు మరింతగా సుబోధకం చేయడమే. ఇందుకుగాను తన సృజనాత్మకతను మేళవించి, ప్రాచ్య నృత్యరూపంగా పేరొందిన ఈ పురాతన నృత్యంనుంచి నూతన నృత్య శైలిని రూపొందించారు. ఆయన కృషివల్లే ఈ నృత్యం కథాకళి నటనం అని తర్వాత కేరళ నటనం అని పేరు పొందింది.

1908 జూన్ 24న కేరళలోని అలెప్పీ జిల్లాలో అంబాలప్పుజ తాలూకా చంపక్కులమ్‌లో మాధవి అమ్మ మరియు కైఫ్పిల్లి శంకర పిళ్లై దంపతులకు జన్మించిన గోపీనాథ్ కథాకళిని, వ్యవసాయాన్ని సాంప్రదాయిక వృత్తిగా స్వీకరించిన పెరుమన్నూర్ కుటుంబానికి చెందినవారు.

13 ఏళ్ల ప్రాయంలోనే కథాకళిని నేర్చుకోవడం ప్రారంభించిన గోపీనాథ్ 12 ఏళ్లపాటు కఠోర దీక్షతో ముగ్గురు సుప్రసిద్ధ గురువుల వద్ద కథాకళిని నేర్చుకున్నారు. కథాకళి నాట్యంలో సుప్రసిద్ధులైన కళామండలం కృష్ణయ్యర్, కళామండలం మాధవన్, ఆనంద శివరామ్ వంటి ప్రముఖులతో కలిసి ఆయన శిక్షణ పొందారు.

కథాకళి నృత్యం లోని రెండు రీతుల్లోనూ గోపీనాథ్ నిష్ణాతుడిగా పేరొందారు. జన్మతః కళాకారుడిగా గుర్తింపుపొందిన గోపీనాథ్ కథాకళి సాంప్రదాయరీతిని ఔపోసన పడుతూనే ఈ సాంప్రదాయాన్ని నవ్యరీతులతో విస్తరించడంతో తన స్వంత ప్రతిభను అద్భుతరీతిలో ప్రదర్శించారు.

తన సృజనాత్మక ప్రతిభ వల్లే భారతీయ నాట్యరీతుల్లో పేరొందిన కథాకళి 1930లలోనే ప్రపంచ ఖ్యాతి పొందింది. ఆధునిక ప్రపంచానికి తగినట్లుగా సృజనాత్మక శైలిని రూపొందించిన గోపీనాథ్ కేరళ నటనం పేరిట కొత్త నృత్యరీతిని కూర్చారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గురు గోపీనాథ్ శైలిని కథాకళి అనే వ్యవహార పేరుతో పిలుచుకుంటున్నారు.

కథాకళికి గోపీనాథ్‌తో వెలుగు రేఖలు

సాంప్రదాయక రూపం విషయంలో ఏ మాత్రం రాజీపడని నాటి ప్రజానీకానికి తన కొత్త నృత్యరీతిని పరిచయం చేసి ఒప్పించడంలో, మెప్పించడంలో గురు గోపీనాథ్ అద్భుత సామర్థ్యం కనపర్చారు. రాజమందిరాలకు, దేవాలయ ప్రాంగణాలకు మాత్రమే పరిమితమై ఉన్న కథాకళిని విస్తృత ప్రజారాసుల చెంతకు చేర్చడంలో అనన్య సామాన్య కృషిని తలపెట్టిన క్రమంలో తనదైన సొంత శైలిని ఆవిష్కరించారు.

దాదాపు 12 సంవత్సరాలపాటు ఏకధాటిగా నేర్చుకోవలసి ఉన్న కథాకళికి కొత్త సిలబస్ తయారు చేయడమే కాక శిక్షణా సమయాన్ని కూడా గణనీయంగా తగ్గించిన ఘనత గోపీనాథ్‌కే చెల్లింది. ఈ క్రమంలో అయన కథాకళి ప్రాచీన సంప్రదాయానికి, దాని సారానికి ఎలాంటి విఘాతం కల్పించలేదు.

రూపంలో సాంప్రదాయంగా కనిపిస్తూనే, సారంలో బహళ జనామోదాన్ని పొందే దిశగా కథాకళికి వెలుగు రేఖలద్దారు. ఒక్కమాటలో చెప్పాలంటే కథాకళి మరియు కేరళకు గోపీనాథ్ ప్రతిరూపంలా నిలిచారు. సాంప్రదాయ నృత్యాన్ని అర్థం చేసుకునే పాటి పాండిత్యం లేని సాధారణ భారతీయ ప్రజానీకం గోపీనాథ్ ఆవిష్కరణతో కథాకళిని ఆస్వాదిస్తూ పరవశించిపోయే స్థితికి చేరుకున్నారంటేనే గోపీనాథ్ కృషి ఏపాటిదో మనకు తెలుస్తుంది.

భారతీయ నాట్య రీతులు బైబిల్, ఆంగ్లికన్ లేదా సామాజిక వస్తువుతో ప్రయోగాలు చేయడానికి చాలా కాలం ముందే అంటే 1940, 50లలోనే గోపీనాథ్ విభిన్న నృత్యరీతులను రూపొందించారు. శ్రీ ఏసునాథ విజయం, దివ్య నాదం, సిస్టర్ నివేదిత, చండాల బిక్షుకి, కేరళ పిరవి (కేరళ రాష్ట్ర ఆవిర్భావంపై) వంటివి ఆయన ఎన్నుకున్న బ్యాలెట్లలో కనిపిస్తాయి.

అలాగే ఢిల్లీలోని రామ్ లీలా ప్రదర్శనలపై రూపొందిన నృత్యరూపకం ఆయన ప్రతిభకు సజీవ తార్కాణంలా నిలుస్తుంది. జీవిత చరమాంకంలో ఆయన రూపొందించిన రామాయణం నృత్యరూపకం బహుళ ప్రజాదరణను పొందింది. గోపీనాథ్ రామాయణ నృత్యరూపకం కేరళ వ్యాప్తంగా 1500 సార్లు ప్రదర్శించబడిందంటేనే దాని గొప్పతనం ఏమిటో సుబోధకమవుతుంది.

చారిత్రకంగా చూస్తే కథాకళి నాట్యరీతి, శిక్షణ కేవలం పురుషులకు మాత్రమే సంబంధించింది. అయితే కథాకళిని యువతులు కూడా ప్రదర్శించవచ్చని చూపించిన మొదటి వ్యక్తి గురు గోపీనాథ్.

నర్తిస్తూనే తుదిశ్వాస విడిచిన గోపీనాథ్

అమెరికాలోని మిచిగాన్‌లో జన్మించిన ఈషర్ ల్యూలా షేర్మన్ -రాగిణి దేవి- కి గోపీనాథ్ డ్యాన్స్ పార్టనర్‌గా ఉండేవారు. వీరిరువురు కలిసి ముంబైలో 1932లో తమ తొలి స్టేజి ప్రదర్శనను ఇచ్చారు. ఇది సాధించిన విజయంతో వీరు మరిన్ని ప్రదర్శనలను దేశవ్యాప్తంగా ఇవ్వగలిగారు. ప్రదర్శన, ప్రసంగాలతో కూడిన ఈ భారతీయ సాంప్రదాయ నృత్యం వీరిరువురి మేళవింపుతో బహుళ ప్రజాదరణకు నోచుకుంది.

1930లలో యువ గోపీనాథ్ ప్రదర్శనను తిలకించిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ నృత్యకారుడిని బహువిధాలా ప్రశంసిస్తూ ఇలా రాశారు.

“గోపీనాథ్ నిజమైన కళాకారుడు. భారత్‌లో కానీ ప్రపంచంలో కాని గోపీనాథ్‌తో సరితూగగలవారు ఎక్కువమంది లేరని ఘంటాపధంగా చెప్పగలను. నృత్యం భారతీయ ఉజ్వల సంపదగా వెలుగొందిన పురాస్మృతులను ఈయన తిరిగి నా మనోనేత్రం ముందుకు తీసుకువచ్చారు. మనమధ్య ఈయన ప్రదర్శన ఒక గొప్ప పాఠం స్థాయిలో ఉంది. తిరిగి ఇప్పుడు నృత్యం తనదైన రీతుల్లో మనముందుకు వచ్చింది. గోపీనాథ్ నాట్యశైలి మనలను సరైన దారిలో వెళ్లడానికి మనకు మార్గం చూపుతుంది. ఈ విషయంలో మనం ఇప్పటికీ అంథకారం నుంచి బయటకు రాలేకున్నాం.”

నర్తనమే ఆయన శ్వాస

మళయాళ చిత్ర పరిశ్రమ గురు గోపీనాథ్‌ను మళయాళీ చలనచిత్ర ప్రారంభ నటులలో ఒకరిగా గుర్తించింది. ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపుడిగా గోపీనాథ్ నటించారు. ఇది మళయాళీ చలనచిత్ర చరిత్రలో ఆరవ చిత్రంగాను, సౌండ్ ట్రాక్ కలిగిన మూడవ చిత్రంగానూ పేరొందింది. ‘జీవితనౌక’ సినిమాలో జీసస్ క్రైస్త్‌, ‘భక్తకుచేల’ చిత్రంలో పూతనగాను ఆయన నటించారు.

పైగా, కథాకళిలోని 9 విభిన్న భావోద్వేగాలను చూపించగల అరుదైన నృత్య కళాకారులలో గోపీనాథ్ ఒకరు. ముఖం లోని సగభాగంలో వివిధ భావ వ్యక్తీకరణలను పలికించగల మేటి కళాకారుడీయన.

తాను ముందునుంచి కోరుకున్నట్లుగా స్టేజీమీద మేకప్‌తోనే కన్నుమూశారు. 1987 అక్టోబర్ 9న కేరళలోని ఎర్నాకులంలో ఉన్న ఫైన్ ఆర్ట్స్ హాల్‌లో, తన సుప్రసిద్ధ రామాయణం నృత్యరూపకంలో దశరథ మహారాజు పాత్రలో నర్తిస్తూనే గోపీనాథ్ పరమపదించారు. తన నాట్యజీవితంలో భాగంగా ప్రపంచంలో పలుదేశాలను ఆయన సందర్శించారు.

అమెరికా, రష్యా, శ్రీలంక వంటి పలుదేశాల్లో ఆయన నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. స్వతంత్ర భారత్ తరపున 1954లో రష్యా పర్యటించిన తొలి సాంస్కృతిక బృందంలో ఈయన సభ్యుడిగా ఉన్నారు. 1961లో ఫిన్లాండ్‌లోని హెల్సింకిలో జరిగిన 8వ ప్రపంచ యువజనోత్సవాల్లో సాంప్రదాయ నృత్యాలకు గాను న్యాయనిర్ణేతగా ఆయన ఆహ్వానం అందుకున్నారు.

భస్మాసురుడిగా నట విశ్వరూపం
నృత్యకారుడిగా గోపీనాధ్ గారి విశ్వరూపం దర్శించాలంటే తెలుగు, తమిళ చలన చిత్ర చరిత్రలో అజరామర కావ్యంగా పేరొందిన ‘మాయాబజార్’ సినిమాలో మోహినీ భస్మాసుర రూపకాన్ని చూసి తీరాలి.

తాను ఎవరి తలపై చేయి పెడితే వారు భస్మమయ్యేటట్లుగా శివుడి వరం పొందిన భస్మాసురుడు, ఆ వర నిర్ధారణ కోసం శివుని నెత్తిపైనే చెయ్యి పెట్టబోయి, తదనంతర పరిణామాలలో మోహిని రూపంలోని మహావిష్ణువు మాయలో పడి, తన నెత్తిమీద తానే చేయిపెట్టుకుని భస్మమైపోయిన ఘటనను నభూతో నభవిష్యతి అన్న రీతిలో గోపీనాథ్ నర్తించి చూపారు.

ఈ పది నిమిషాల రూపకం చూస్తున్నంతసేపు మనకు తెరపై భస్మాసురుడే కనిపిస్తుంటాడు. భీకరాకారుడైన రాక్షసుడు నర్తిస్తుంటే ఎలా ఉంటాడు అని చెప్పడానికి తెలుగు సినిమాలలో మనకు ఉన్న ఏకైక నిదర్శనం ఈ భస్మాసురుడే. వందల సినిమాల్లో నటించామని గొప్పలు చెప్పుకునే మన నట మహానుభావులు, ఒకే ఒక చిత్రంతో గోపీనాథ్ వెండితెర ముందు ఆవిష్కరించిన నట విశ్వరూపాన్ని చూసయినా కాస్త నమ్రతను ప్రదర్శస్తే బాగుంటుందేమో…!

అసురుడి మొరటుతనానికి, ఆ భారీకాయుడి ధాష్టీకానికి, రూపకం మొదటినుంచి చివరివరకూ ప్రాణప్రతిష్ట చేసిన గోపీనాథ్ ఆవిధంగా తనదైన సాంప్రదాయ నృత్య నర్తనతో అభిమానుల్లోనే కాక దక్షిణ భారత చలనచిత్ర ప్రేక్షకులు హృదయాల్లో అజరామరంగా నిలిచిపోయారంటే ఆశ్చర్య పోవలసిన పనిలేదు.

తెలుగువారి సాంస్కృతిక సంపదల్లో ఒకటిగా పేరొందిన మాయాబజార్ సినిమాలో శ్రీ వసుమర్తి కృష్ణమూర్తి గారి నృత్య దర్శకత్వంలో భస్మాసురుడిగా నర్తించిన గురు గోపీనాథ్ నట విశ్వరూప ప్రదర్శనను కింది లింకులలో చూడండి.

మోహినీ భస్మాసుర

మాయాబజార్ – గురు గోపీనాధ్

నోట్: కథాకళి గోపీనాథ్ గారిపై పై మూడు కథనాలు నేను వెబ్‌దునియా.కామ్ తెలుగు విభాగంలో పనిచేస్తున్నప్పుడు ‘నాటి వెండి కెరటాలు’ అనే సినిమా విభాగంలో రాసినవి. గోపీనాధ్ గారి శతజయంతి సందర్భంగా వెబ్‌దునియా మలయాళం వెబ్‌సైట్‌ ఎడిటర్ శశిమోహన్ గారు చిన్న కథనం ప్రచురిస్తూ మాయాబజార్‌లో భస్మాసురుడిగా గోపీనాధ్ నటించిన ఘటనను పునస్కరించుకుని తెలుగు వెబ్‌‌సైట్‌లోనూ ఆయనపై కథనం రాయమని సూచించారు. దానిప్రకారం తనపై మూడు కథనాలను తెలుగులో ప్రచురిస్తే శశిమోహన్ గారు మహదానందపడిపోయారు.

యూట్యూబ్‌లోని పై లింకు తెరిచి గోపీనాధ్ గారి నటనను చూడండి. మనం ఓ  పదినిమిషాలపాటు మన ఎస్వీరంగారావు గారిని కూడా మర్చిపోతాం. ఇంత చేసి ఈ రూపకం మూకాభినయంతో కూడింది. టాకీ యుగం వచ్చాక తెలుగులో గాత్రం లేకుండా అభినయంతో మాత్రమే సాగిన అరుదైన రూపకాల్లో ఇది ఒకటి.

ఈ లింకు చూసిన తర్వాత మీకు చిన్న పరీక్ష.

మాయాబజార్ సినిమాలోని మోహినీ భస్మాసుర రూపకంలో భస్మాసురుని బురిడీ కొట్టించిన మోహిని పాత్రధారిణి అయిన ఆ కొంటెపిల్ల ఎవరో కాస్త చెబుతారా? ఈ ‘పిల్ల’ వివరాల కోసం మన కాలపు డిజిటల్ డేటా రుషి శ్యామ్ నారాయణ్ గారు 20 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారట. కాని ఫలితం దక్కలేదు. ఈ రోజు రాత్రి భస్మాసురుడితో పాటు  ఈమెకూడా ఉన్న నలుపు తెలుపు ఇమేజ్ తను పంపితే చూసి ఎవరీవిడ అని అడిగాను.  ఈ ‘పిల్ల’కోసం తాను కూడా 20 ఏళ్లుగా వెతుకుతున్నానని ఆయన సరదాగా అన్నారు. మాయాబజార్ సినిమా టైటిల్స్‌లో ఈ పిల్ల పోటో లేదా అనంటే ‘ఆ పని కూడా అయిపోయింది. దొరకలేదనే’శారీయన.

కవికోకిల పాట కొంటె పిల్ల

ఈమె ఎవరో కనుక్కోండి అంటూ ‘కవికోకిల’ అనే అలనాటి అద్భుత తెలుగు వీడియో పాటను కూడా నాకు గూగుల్ టాక్ లో జోడించి మరీ సవాల్ కొట్టారు కనుక్కోండి చూద్దాం అంటూ.

‘కవికోకిల తీయని పలుకులలో’ అంటూ లలితా రావు -?- నటించగా సుశీల పాడిన ఆ పాట వీడియో లింకు ఇక్కడ చూడండి. సినిమా పేరు ‘చివరకు మిగిలేది’.

Kavi Kokila.mp4

(ఇప్పుడు నా బ్లాగులో లింక్ అప్‌డేషన్ పనిచేయలేదు కాబట్టి గూగుల్‌లో పై లింకును కాపీ చేసి ఈ అద్భుతమైన పాటను చూస్తూ వినండి.)

బొమ్మలో కంటే ఆ పాటలో ఆమె మరింత అద్భుతంగా కనిపిస్తూ వెలిగిపోయింది. చివరకు ఈమె వివరాలకోసం కూడా మనం విఎకె రంగారావు గారిని పట్టుకోవలసిందేనా అంటే ‘చివరిమార్గం అదేనం’టూ ముక్తాయించారు శ్యామ్ గారు.

ఒక నటి నటనా సోయగానికి, ఒక  గాయకురాలి గాన సౌరభానికి నిర్వచనంలా నిలిచే అతి కొద్ది పాటల్లో ఇదీ ఒకటి. సుశీల గారి గానజీవితంలో మెరిసిన అత్యద్భుత పాటలలో ఇదీ ఒకటి. వినగానే జమునారాణి  లేదా వసంత పాటలా అనిపించినా ఇది సుశీలమ్మ పాటే.

-ఇక్కడ అప్రస్తుతం అనుకోకుంటే సుశీలగారికి బాగా నచ్చే పాట “పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా” మూడేళ్ల క్రితం మద్రాసులో ఆమెకు ఇంటర్నేషనల్ తెలుగు అసోసియేషన్ తరపున స్వర్ణాభిషేకం జరిగినప్పుడు ఆమె వీరాభిమాని, ఐఎఎస్ రాజ్‌కుమార్ గారు చేసిన అభ్యర్థనను మన్నించి ఆమె ఈ పాటను సగం వరకు చూసి పాడినప్పుడు ఆహూతుల చప్పట్లతో స్టేడియం ప్రతిధ్వనించింది.

http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/0804/21/1080421020_1.htm

ముఖ్యంగా ‘శేషతల్పమున…’ అంటూ నాలుకను పై దవడ వైపుకు చాపి ఆమె పాడుతుంటే పాట వినడం కంటే ఆమె గొంతులో, ఆ గాన ఝరిలో ఓ దివ్యత్వం. దండం పెట్టి పాట వినటం తప్ప ఏమివ్వగలం మనం. –

‘చివరకు మిగిలేది’ అని 1960లలో వచ్చిన ఈసినిమాకు ఒక బెంగాలీ సినిమా మాతృక. బెంగాలీలో మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగువారికి నచ్చదని సావిత్రి గారు నటించడానికి వ్యతిరేకించినా, చిత్రనిర్మాతలు ఉప్పునూతుల పురుషోత్తమరెడ్డిగారు, మరొకరు కలిసి అక్కినేని నాగేశ్వరరావు గారి సహాయంతో ఆమెను ఒప్పించి నటింపజేశారట.

కవికోకిల తీయని పలుకులలో అనే ఈ పాట మనల్ని మంత్రముగ్ధులను చేసినప్పటికీ, సావిత్రి గారన్నట్లే అప్పట్లో ఈ సినిమా ఒక రోజు కూడా సరిగా ఆడలేదట.

ఈ వివరాలన్నీ శ్యామ్ నారాయణ్ గారు ఇప్పుడే చెప్పారు. మొత్తానికి ఆరునెలలు కష్టపడి ఈ సినిమా బెంగాలీ మాతృకను, తెలుగులో చివరకు మిగిలేది రీమేకింగ్‌ని, తర్వాత హిందీలో వచ్చిన ఇదే మాతృక సినిమాను మొత్తం మూడు సినిమాలను మంచి ప్రింట్‌లో ఉన్నవి శ్యామ్ గారు పట్టేశారట. ఇందుకు ఆరునెలల సమయం పట్టిందాయనకు. ఎవరికయినా ‘చివరికి మిగిలేది’ సినిమా కావాలంటే శ్యామ్ గారికి మెయిల్ పంపండి చాలు.

<syamnarayana.t@gmail.com>

మన సావిత్రిని పోలిన ఆ ‘పిల్ల’ ఎవరో చెప్పి ఎవరయినా కాస్త పుణ్యం కట్టుకుంటారా?

శ్యామ్ గారు సరదాగా పిలిచే ఈ కొంటెపిల్ల లలితారావు అని, ఈ కథనం నెట్‌లో చూసిన శశిరేఖ గారు వ్యాఖ్య పెడుతూ చెప్పారు. అంతిమంగా నిర్ధారణ అయినంతవరకు ఆమే ఈమె అనుకుందాం మరి.

లలితారావు

Final note: మొత్తం మీద మాయాబజార్‌లో మోహిని పాత్రధారిణి, చివరికి మిగిలేది సినిమాలో “కవికోకిల తీయని పలుకులలో’ పాటలో నటించిన నటి వివరాలు పూర్తిగా తెలిశాయి. పెళ్లికాక ముందు ఈమె లలితారావు. పెళ్లయ్యాక లలితా శ్రీనివాసన్. ప్రస్తుతం ఈమె వయస్సు 67 సంవత్సరాలు. తొలినాళ్లలో కర్నాటకలోని హసన్‌లో పెరిగిన ఈమె ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. 19 ఏళ్ల వయస్సులోనే పెళ్లయినప్పటికీ నాట్యం పట్ల అవరోధాలు లేని కుటుంబవాతావరణంలో గడిపిన ఈమె 1984లో కర్నాటకలో తొలి క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్‌ని ప్రారంభించారు. ఈ రోజుకీ ఈమె నాట్యమే లోకంగా బతుకుతున్నారు. ఈమె గురించి 2011 ఏప్రిల్ 29న హిందూ పత్రిక బెంగళూరు ఎడిషన్లో Little steps up the ladder అనే పేరిట ఒక కథనం కూడా వచ్చింది. వీటి వివరాలను శశిరేఖ గారు మరో వ్యాఖ్యలో తెలిపారు.

“Her name is confirmed. Birth name: Lalitha Rao & After Marriage: Lalitha Srinivasan – Checkout the article on Hindu with her photograph:”

http://www.hindu.com/fr/2011/04/29/stories/2011042950800300.htm

పూర్తి కామెంట్ కోసం కింది కామెంట్లలో చూడండి.

ఈ వివరాలు తెలియజేసిన  శశిరేఖ గారు చాలా కాలం నుంచి చివరికి మిగిలేది సినిమాకోసం వెతుకుతున్నారట. శ్యామ్ గారికి ఆ సినిమా కావాలని మెయిల్ కూడా పెట్టారు.

శ్యామ్ గారూ,  ఈమె కోరిక నెరవేరుస్తారు కదూ..!

రాజు
చందమామ

RTS Perm Link

మన రహంతుల్లాగారి తెలుగు గోస…

July 7th, 2011

ఆఫీసులో కాస్త పని తక్కువ ఉన్నట్లనిపిస్తే మళ్లీ బ్లాగ్ ప్రపంచంకేసి తొంగిచూస్తే నా కళ్లముందు ఒక అద్భుతం.

మళ్లీ మన రహంతుల్లా గారే…. మళ్లీ మన తెలుగు భాష మీదే… మన ఇంటి భాషమీదే నూరు జన్మల ప్రేమను ఒకేసారిగా కురిపిస్తూ మాలిక అనే వెబ్‌ పత్రిక ద్వారా ఒక బ్రహ్మాస్త్రాన్ని మనమీదికి వదిలారు. -మరుజన్మలున్నాయా లేవా అనేది మరోవిషయం-

“మన పల్లె భాషను గౌరవించుదాం. మన పక్కెలు, జెల్లలు, గెడ్డలు, మదుములు, పరసలు, పరజలు,… ఇంకా నీచమని భావించి మన సంస్కృతాభిమాన పండితులు వదిలేసిన తెలుగు పదాలన్నీ తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కిద్దాం.” అంటూ ఆయన తొలిబాణం వదిలింది మొదలు ఈ పెద్ద వ్యాసం రూపంలోని పెద్ద గోసను ముగించేవరకు రెప్పవేయకుండా చదివాను.

‘ప్రజలు మనకంటే ఎంతో గొప్పవారు.. వారికి నేర్పడానికి ముందు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ఒక మహా నేత చెప్పిన ఆ మంత్ర వాక్యాలు మళ్లీ మళ్లీ గుర్తొచ్చాయి నాకయితే.

కొల్లేరు ప్రజలు తమకు తెలిసిన చేపల,పక్షుల రకాలను ఈ వ్యాసంలో చదువుతుంటే ఒళ్లు గగుర్పొడిచింది నాకు.

మట్టగిడస, కర్రమోను, బొమ్మిడాయి, శీలావతి, గొరక, ఇంగిలాయి, జెల్ల, బొచ్చె, జడ్డువాయి, చేదు పరిగె, కొరమీను, వాలుగ, పండుకప్ప, గండి బొగడ, కొయ్యంగ, మునుగపాము, గడ్డు గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార, చాకరొయ్య, గడ్డికొయ్య, మాల తప్పడాలు, ఏటిజెల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజెల్ల, పారాటాయి….

మిత్రులారా చదువుతున్నారా? ఇవన్నీ మన తెలుగు నేలమీద జనం నోట్లో ఇంకా ఊరుతున్న, చేపల  రకాలను సూచించే పదాలివి.

మెదక్ జిల్లా రాయికోడు మండలం షంషుద్దీన్ పూర్ గ్రామనివాసి ఏర్పుల కమలమ్మ స్వయంగా సాగుచేసి సరఫరా చేస్తున్న 50 రకాల విత్తనాల పేర్లు చూడండిః

“తైదలు, ఉలవలు, సజ్జలు, పచ్చజొన్నలు, తోక జొన్నలు, తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, బుడ్డజొన్న, అత్తకోడళ్ళ జొన్న, నల్లతొగరి, ఎర్రతొగరి, తెల్లతొగరి, అనుములు, కొర్రలు, బొబ్బర్లు, పెసర్లు, వడ్లు, తెల్లనువ్వులు, ఎర్రనువ్వులు, గడ్డినువ్వులు, పుంట్లు, శనగలు, ఆవాలు, తెల్లకుసుమ, ధనియాలు, వాము, బటాని, సిరిశనగ, మిరప, కోడిసామలు, పల్లీలు, గోధుమ, సాయిజొన్న, నల్లకుసుమ, అవశలు, లంకలు, సిరిశనగ.”

“ఈ తెలంగాణా తల్లికి ఏమి ఇంగ్లీషొచ్చు అయినా ఈ తెలుగు నేల తల్లులు ఎన్నో వందల ఏళ్ళనుండి మొక్కల పేర్లు, విత్తనాల పేర్లు మక్కువగా గుర్తు పెట్టుకొని వ్యవసాయం నడపలేదా? ఇంగ్లీషు, లాటిన్ పదాలకిచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన తెలుగు పదాలకు కూడా ఇవ్వలేకపోవటానికి కారణం ఏమిటి? మనం మనకి అర్థం కాకపోయినా, ఇంగ్లీషు వాళ్ళకు అర్థం కావాలి.”

వీటిలో పావుశాతం పేర్లు అయినా ప్రస్తుత తరం తెలుగువాళ్ల జ్ఞాపకాల్లో ఉంటున్నాయా?

ఇరవయ్యేళ్లు పల్లెటూరికి దూరం కాగానే మమతలు, అనురాగాలనే కాదు బాల్యజీవితం పొడవునా నీడనచ్చి చల్లదనం పంచిపెట్టిన చెట్ల పేర్లు కూడా మర్చిపోతున్న పాడుజీవితం మనది.

రహంతుల్లాగారు, తెలుగు భాషను చంపొద్దంటూ తెలుగు పట్ల భక్తిని రంగరించి సంధించిన ములుకులు మనలో కాస్త లోతుగా గుచ్చుకుని ఉంటే గుచ్చుకోనివ్వండి. కాని ఆయన  తన వ్యాసంలో చేసిన ఔద్దత్య ప్రకటనను చూస్తే ఆయన ధర్మాగ్రహం వెనుక నేపథ్యం కాస్తయినా అర్థమవుతుంది.

“అత్యధిక జనాభా మాట్లాడేభాషను నాశనం చేస్తూ పరాయిభాషకు పట్టం గట్టడం అంటే పరస్త్రీ ముందు భార్యను అగౌరవపరచటం లాంటిది. ఇది భాషా వ్యభిచారం, అనైతికం, అసహజం, తెలుగు జాతి ప్రజల హక్కుల ఉల్లంఘన.” అంటున్నారీయన.

నాకయితే వణుకు పుడుతోంది పై అక్షర శస్త్రాలను చూస్టుంటే.

“తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించాలని అన్ని పార్టీలవాళ్లూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కేంద్రానికి పంపారు. కోర్టుకు గూడా వెళ్ళారు. కొద్ది రోజులకే జార్జిబుష్ హైదరాబాద్ రావటం, సిలికాన్ వ్యాలీలో ఉన్న ప్రతి ముగ్గురు భారతీయ ఉద్యోగుల్లో ఒకరు ఆంగ్లప్రదేశ్‍కు చెందిన వారేనని తేల్చటం, దిల్‍కుష్ అతిథి భవనంలో అమెరికా వెళ్ళటానికి వీసాలిచ్చే కేంద్రం పెడతామనటం, మన మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ ఇంగ్లీషు ఉచ్చు బిగించిపోవటం చకచకా జరిగి పోయాయి. మరోసారి తాజాగా తెలుగుతల్లి సాక్షిగా ఉద్యోగాల కోసం మన పెద్దలు మోకరిల్లారు”

“మన సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, విద్య, పరిపాలన మన భాషలోనే ఉండాలి. కంప్యూటర్ కోసం తెలుగును బలి పెట్టటం ఎలుకలున్నాయని ఇంటికి తగులబెట్టడంతో సమానం. కంప్యూటర్‍నే తెలుగులోకి వంచుతాం. ఎన్నో భాషల గ్రంథాలు ఇంగ్లీషులోకి అనువదించుకున్నారు. అవసరం అటువంటిది.”

‘కంప్యూటర్‌నే తెలుగులోకి వంచుతాం…’ అంటున్నారీయన.

ఫ్రౌఢ డిండిమభట్టు ఔద్ధత్యం ఎలా ఉండేదో తెలీదు కాని, ఈ మధ్య కాలంలో తెలుగు వాక్యంలో ఇంత ఔద్ధత్య ప్రకటనను నేను చూడలేదంటే చూడలేదు.

తెలుగు భాషా ప్రేమికుడిగా మనందరికీ ఎంతకాలంగానో తెలిసి ఉన్న మన రహంతుల్లాగారి ఒక్కో వ్యాక్యం ఒక్కో ఉల్లేఖనలా కనిపిస్తోంది.

మనం ఏం కోల్పోతున్నామో, మన పిల్లలకు ఏం జరుగబోతోందో తెలుసుకోవడానికయినా ఆయన వ్యాసం పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడగలరు.

ఇంటి భాషంటే ఎంత చులకనో!
http://magazine.maalika.org/?p=193

ఈ రోజే ఈ వెబ్‌పత్రికను పరిచయం చేసిన వలబోజు జ్యోతి గారికి కృతజ్ఞతలతో…

చందమామ

RTS Perm Link

చందమామతో నా జ్ఞాపకాలు

July 1st, 2011

అవసరాల రామకృష్ణారావు గారు

అప్పుడు నా వయసు పదహారు -1947-. ఇప్పుడు ఎనభై -2011-. అప్పుడంటే ఎప్పుడని! చంద్రోదయమయినప్పుడు. అంటే తెలుగు పిల్లల అందాల మాసపత్రికగా చందమామ మొట్టమొదటి సంచిక వెలువడిన నాటి మాట. అందులో నే వ్రాసిన పొట్టి పిచిక కథ అచ్చవడం ఓ విధంగా నా సాహితీ ప్రస్థానానికి తొలి బీజం అవడం కన్న తీపి గుర్తు మరేముంటుంది!

నాటి నా బాల్యంలో తొంగి చూసిన ఆ తొలికిరణపు రూపురేఖలే నేటి ఈ వృద్ధాప్యంలో కూడా కొనసాగడం కంటే మించిన ఆశ్చర్యం, ఆనందం ఇంకేముందని!

అమ్మ చెప్పిన కథే అయినా, అందరికీ తెలిసిన కథే అయినా, మంచి ప్రింటుతో చక్కని బొమ్మలతో వచ్చిన నాటి ఆ చందమామ లోని కథాంశం నా మనసుమీద ఇంప్రింటు చేసేసినట్లుంది!

ఓ బడుగు జీవి తను కష్టపడి సాధించుకున్నది అది లేశమే ఔగాక, పోగొట్టుకుంటుంది. ఎంతమందినో కలుసుకుని, ఎవరూ కలిసిరాకపోయినా, పట్టుదల వదలక, చివరికి విజయం సాధిస్తుంది. అదీ ’పొట్టి పిచిక కథ’. అదే నా విజయసూత్రం అవుతుందని ఆనాడనుకోలేదు!

వెయ్యి పైగా రచనలు చేసి, ఈనాటికీ తల వంచక, కలం దించక తెలుగు కథకుడిగా కొనసాగుతున్న నాకు వేగుచుక్క ఆ కథే కదా! పక్షులతో జంతువులతో మనుషుల్ని కలిపి సామాజికాంశాలను సరళంగా చెప్పవచ్చునని నేను నేర్చుకున్నది చందమామ పత్రిక చలవవల్లనే. ’గణిత విశారద’ అనే నవల రాసింది చందమామ పఠన స్పూర్తి తోనే.

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ నుంచి 1969లో బహుమతి పొందిన నా ‘అర్థమున్న కథలు’ పబ్లిషర్స్‌ చందమామ రక్తసంబంధీకులు ‘యువప్రచురణలు’ వారే. అంతేకాదు. నేను చలసాని-చక్రపాణి అవార్డు అందుకోవడం కూడా తత్సంబంధమైన సత్సాంప్రదాయమే.

సైజుతో పాటు చురుకుతనంలో కూడా నాటి పొట్టి పిచిక లక్షణాలు ఇప్పటికీ నాలో మిగిలి ఉన్నాయని నా మీద నేను వేసుకునే సోకైన జోకు!

చందమామ కథ ఇచ్చిన ఊపుతో నేన్రాసి పుస్తక రూపంలో వచ్చిన పిల్లల రచనల గురించి ఇక్కడ చెప్పుకోవడం అప్రస్తుతం కాదనుకుంటాను. ‘కేటూ డూప్లికేటూ’, ‘మేథమేట్రిక్స్‌’ మూడు భాగాలూ, ‘ఆంగ్రేజీ మేడీజీ’ ‘ఆంగ్రేజీ యమఈజీ’ ఇలా మరో అరడజనువరకు చిరు సరుకు దొరుకు…

నెలనెలా వెన్నెలలద్దుకుని, చకచకా సొగసులు సరిదిద్దుకుని, పదారుభాషల వారి కితాబులందుకుని భారతీయ పత్రికగానే కాక, అంతర్జాతీయ స్థాయిని చేరుకున్న చందమామ పుట్టింది మన భాషలోనే అని తలుచుకుంటే ఉప్పొంగని తెలుగు గుండె ఉండదు.

కాలక్షేపం కథలతోనే సరిపెట్టుకోక శాస్త్రీయ పరిశోధనాత్మక వ్యాసాలూ, మెదడుకి మేతగా పోటీలూ, అన్యభాషలు నేర్పే ఏర్పాట్లూ– ఇవన్నీ కంటికి నదురైన రంగులతో, అచ్చుతో, అనువైన సైజుతో ఇక్కడ కాక మరెక్కడ దొరుకుతాయని! ఈ సంస్థ పుస్తకరూపంలో పిల్లలకందించే విజ్ఞాన వర్గకోశాలు ఎన్నెన్నని!

ఇంతెందుకు.. ఇటీవల వీరు ప్రచురించిన చందమామ Art Book చూశారా! పదిహేనువందల రూపాయల ఖరీదు కాస్త ఎక్కువే అనిపించవచ్చు కాని అది అందించే శతకోటి అందాల మాట!

నా తొలి ప్రేమ చందమామ. వాక్రూప వర్ణార్ణవం…!

ఈ నాటికీ కథాసుధల్ని వెదజల్లుతూ హాయిగా జీవించగలిగే నా మనోధృతికి నాటి చందమామే మధురస్మృతి!!

– అవసరాల రామకృష్ణారావు

*******
అవసరాల రామకృష్ణారావు గారు 80 ఏళ్లవయసులోనూ సాహిత్య వ్యాసంగం చేస్తూ వస్తున్న విశిష్ట రచయిత. 1947 జూలై నెలలో వచ్చిన తొలి చందమామలో ‘పొట్టి పిచుక’ అనే కథను వీరే రాశారు. పదిహేనేళ్ల చిన్న వయసులో ఈయన రాసిన తొలి కథ ఇది.

తను కష్టపడి సాధించుకున్న దాన్ని పోగొట్టుకున్న ఓ బడుగుజీవి పిచ్చిక ఎంతోమందిని కలుసుకుని, ఎవరూ కలిసిరాకపోయినా పట్టుదల వదలక చివరికి విజయం సాధిస్తుంది. తొలి చందమామలో కుతూహలం కొద్దీ రాసిన ఈ కథ తదనంతర జీవితం మొత్తంలో తన విజయ సూత్రం అవుతుందని వీరు ఆనాడు ఊహించనే లేదట.

దాదాపు 64 ఏళ్ల తర్వాత వీరి పొట్టిపిచుక కథను ఈనెల -జూలై 2011- చందమామలో మళ్లీ ప్రచురించడమైనది. ఈ సందర్భంగా వారు పంపిన ‘చందమామ జ్ఞాపకాలు’తోపాటు, ‘విజయమాల’ అనే రెండు పేజీల కొత్త కథ కూడా జూలై సంచికలోనే ప్రచురితమైనది.

తొలి చందమామలో కథలు రాసి జీవించి ఉన్న ఏకైక రచయిత  రామకృష్ణారావుగారు.

చందమామ జ్ఞాపకాలతో పాటు, వీరు పంపిన ‘విజయమాల’ కథను కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాము. పొట్టి పిచుకతో పాటు వీరి మూడు రచనలను ఒకే చోట చూడాలంటే జూలై నెల చందమామ ప్రతిని చూడగలరు.

ఈ తొలి చందమామ కథ సజీవ సహజ మూర్తికి చందమామ మనవూర్వక అభివందనలు.

విజయమాల

చంద్రగిరి నగరిని చారుదత్తుడు పాలించే రోజుల్లో మంత్రి బుద్ధసాగరుడూ, ఆస్థాన విద్వాంసుడు గుణకీర్తీ ఆయన కెంతో చేదోడువాదోడుగా ఉండేవారు. ప్రత్యేకించి గుణకీర్తి ఆ తరానికి సాహితీ ప్రతినిధిగా నిలిచేటంత ప్రజారంజక గ్రంధాలు లిఖించాడు. అయితే ఆయన తన ఏభయ్యవఏట జరిగిన ఓ దుస్సంఘటనలో మరణించాడు. గుణకీర్తి స్మారకచిహ్నంగా చారుదత్తుడు ఓ శిలావిగ్రహాన్ని ప్రతిష్టించాడు.
గుణకీర్తి భార్య ఏనాడో చనిపోతే కొడుకు శ్రుతకీర్తి పొరుగుదేశంలోఉన్న మేనత్త ప్రాపకంలో పెరిగాడు. ఆమె భర్త కరుణేంద్రుడు అక్కడ సైనికాధికారి. ఆ దేశంలోనే ఉన్న సిద్ధేంద్రస్వామి గురుకులంలో శ్రుతకీర్తి విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు.

గుణకీర్తి తర్వాత ఆయన నిర్వహించిన ఆస్థాన విద్వాంస పదవి, తగిన అభ్యర్థి దొరకక, ఏళ్లపాటు ఖాళీగా ఉండిపోయింది. మంత్రి బుద్ధిసాగరుడి పరీక్షలకు తట్టుకుని నిలబడే వివేకవంతులెవరూ ఓ పట్టాన దొరకలేదు. ‘ఉయ్యాల్లో పిల్లాణ్ణి పెట్టుకుని వాడికోసం ఊరంతా వెతుకుతున్నట్టు మనం శ్రుతకీర్తి విషయం పక్కన పెట్టి ఇంకా అతడిని చిన్నపిల్లాడిగానే పరిగణిస్తున్నాం. ఈపాటికి ఉభయ భాషాప్రవీణ అయి ఉండాలే!’ అనే చారుదత్తుడి సూచనని మెచ్చుకుని మంత్రి వెంటనే శ్రుతకీర్తిని పిలిపించాడు.

ఏ పరీక్షకు గురిచేసినా ప్రథముడిగా నిలిచే అతని తెలివితేటల్ని చూసి బుద్ది సాగరుడి నోట మాటరాలేదు. ఇరవై ఏళ్లకే అంత పెద్ద పదవా అని ఎవరేమన్నా లెక్క చెయ్యకుండా రాజు అనుమతి తీసుకుని శ్రుతకీర్తిని వెంటనే ఆస్థాన విద్వాంసుడిగా నియమించాడు.

అలా నిర్ణయించిన సభకి సూచనగా ఓ ఉత్సవం జరిగింది. అతని ఉన్నతికి తోడ్పడిన బంధువులనీ, గురువునీ ప్రత్యేకించి ఆహ్వానించారు.

ప్రజల హర్షామోదాలు సరేసరి. వారి సంప్రదాయం ప్రకారం శ్రుతకీర్తి విజయహారాన్ని చేత్తో పెట్టుకుని తన ప్రగతికి తోడ్పడిన అతి ముఖ్యవ్యక్తి మెడలో ఆ దండను వెయ్యాలి. ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

తనని ప్రేమతో పెంచిన మేనత్త మెడలోనా, చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించిన కరుణేంద్రుడి మెడలోనా, తననో భాషా కోవిదుణ్ణి చేసిన సిద్ధేంద్రస్వామికా ఆ గౌరవం?  పిన్నవయసులోనే తనని గుర్తించి రప్పించిన మహారాజుకా లేదా తనలోని ప్రతిభను రుజువు చేసి పెద్దపీట వేసిన మంత్రి బుద్ధి సాగరుడికా?

అందరి అంచనాలూ వమ్ము చేస్తూ శ్రుతకీర్తి ఆ హారాన్ని శిలావిగ్రహ రూపంలో ఉన్న తండ్రి మెడలో వేశాడు! అతని ఎన్నికని మంత్రి సమర్థించిన తీరు ఇదీ….

ఓ వ్యక్తి గొప్పవాడైనందుకు, అలా తోడ్పడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత చెప్పుకోవలిసిందే! అయితే శ్రుతకీర్తి ప్రతిభకు అందరికన్న ముందు చెప్పుకోవలిసింది జన్మనిచ్చిన గుణకీర్తిని మాత్రమే. ఓ తరానికి ప్రతినిధిగా నిలబడి ప్రజ్ఞావంతుడైన మహాపండితుడి జన్యు సంబంధం కన్న శక్తివంతమైనదేముంటుంది, తనయుడి వ్యక్తిత్వంలో…

– అవసరాల రామకృష్ణారావు

రామకృష్ణారావు గారి గురించి మరిన్ని వివరాలకు కింది లింకును చూడగలరు

తొలి చందమామ అపరూప కథకులు శ్రీ అవసరాల

చందమామ ఆన్‌లైన్‌లో కూడా వీరి పొట్టిపిచుక కథను కింది లింకులో చూడవచ్చు -1947 జూలై సంచికను ఎంపిక చేసుకోవాలి-
http://chandamama.com/archive/TEL/storyArchive.htm

 

RTS Perm Link