దైవం జంతువు రూపంలో…

May 19th, 2011

ఇంటి పిల్లీ, ఇంటి కుక్కా దైవానికి మారు రూపాలు అని చందమామ చిత్రకారులు శంకర్ గారు చెబుతున్నారు. చందమామ కథకు బొమ్మ రూపంలో ప్రాణప్రతిష్ఠ పోస్తూ, గత 55 సంవత్సరాలకు పైగా బేతాళ కథలకు వన్నెలద్దుతున్న ఈ చిత్ర బ్రహ్మ… ఇంటి పిల్లీ, ఇంటి కుక్కలో కనిపించే దైవాంశను గురించి ఇవ్వాళే ఫోన్‌లో పంచుకున్నారు.

చందమామ ఈ సంవత్సరం మొదటినుంచి సకాలంలో అంటే నెల మొదట్ల్లోనే మార్కెట్లోకి వస్తూండటం తెలిసిందే. దీంట్లో భాగంగా పత్రిక కంటెంట్ కూడా రెండు మూడు నెలలకు ముందే సిద్ధమవుతూ కాస్త వేగం పుంజుకొంది. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన ఇంటివద్దే ఉండి చందమామకు బొమ్మలు వేసి పంపుతుంటారు. ఆగస్టు నెల పత్రిక బేతాళ కథ -ధర్మయ్య తీర్పు-కు బొమ్మ వేయడం ఇవాళ్టితో పూర్తవుతుందని సాయంత్రం 3 గంటల తర్వాత ఇంటికి వచ్చి తీసుకెళ్లవలసిందిగా ఆయన ఈ ఉదయం ఫోన్‌లో చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన తన బంధువలమ్మాయిని తోడు తీసుకుని ఈ శుక్రవారం వేరే ఊరికి వ్యక్తిగతపని మీద వెళుతున్నానని, ఈలోగానే బేతాళ కథకు బొమ్మలు వేయడం పూర్తవడం సంతోషంగా ఉందని, మీకూ, నాకూ కూడా బొమ్మల గురించి ఇక టెన్షన్ ఉండదు కనుక ఇక నిశ్చింతగా ఆ కార్యక్రమానికి వెళ్లివస్తానని చెబుతూ మాటల సందర్భంలో జంతువుల్లో దివ్యత్వం గురించి కొన్ని ఘటనలు పంచుకున్నారు.

చెన్నయ్ నగరంలో పోరూరులో ఉన్న ఆ బంధువుల అమ్మాయి ఇంటికి మాష్టారు దంపతులు ఎప్పుడు వెళ్లినా సరే  ఆ ఇంటిలో ఉన్న ఒక పెద్ద కుక్క వారిని ఆప్తబంధువులుగా భావించి వదలదట. పోలీసు లేబర్ డాగ్‌లాంటి ఆ కుక్క సింహంలా ఇంట్లో తిరుగాడుతూ, మన భాషలో మనం మాట్లాడితే దాని భాషలో అది అర్థం చేసుకుని చెప్పింది తుచ తప్పకుండా చేస్తూంటుందని ఆయన చెప్పారు.

అలాగే తన అవసరాలను అది సైలెంటుగానే ఇంటివారికి గుర్తు చేస్తూంటుందట. పొరపాటున కూడా అది కాలకృత్యాదులను ఇంటి ఆవరణలో తీర్చుకోదట. దాని అవసరం పడగానే అది యజమానికి గుర్తు చేస్తుందట. ఎలాగంటే దాన్ని పగటిపూట ఇంటి ఆవరణలో కట్టేయకుండా వదిలేస్తారట. సాయంత్రం కాగానే దాన్ని బయటకు తీసుకెళతారు.

ఏరోజైన సకాలంలో అలా ఇంటి బయటకు తీసుకుపోనట్లయితే, ఇది సరికొత్త రూపంలో తను బయటకు పోవాలనే విషయం గుర్తుచేస్తుంది. ఎక్కడో ఓ మూల పడి ఉండే గొలుసును తీసుకువచ్చి ఇంటి యజమానికి ఇస్తుందట. దీన్ని నా మెడకు బిగించి బయటకు తీసుకుపో.. ఎందుకింత లేటు అని  ఎగాదిగా చూస్తుందట. మరి దాని అవసరం దానిది. మనుషులు గుర్తించకపోతే ఎలా అని శంకర్ గారి చెణుకు. ఎక్కడో ఉన్న గొలుసును తీసుకొచ్చి అది యజమానికి ఇస్తూంటే వీరికి ఒకే ఆశ్చర్యం. బయటకు తీసుకుపోతే గొలుసు తగిలిస్తారనే రోజువారీ అంశాన్నిఅది అలా స్టిమ్యులేట్ చేసుకుని ఇంటివారికి గుర్తుచేస్తుంది.

ఆ ఇంటివారు తమిళంలోనో, ఇంగ్లీషులోనూ ఏదైనా చెబితే అది వెంటనే అర్థం చేసుకుని తుచ తప్పకుండా దాన్ని పాటిస్తుందట. మాట్లాడే మనిషి భాషను మాట్లాడలేని కుక్క గ్రహించి ఆవిధంగా నడుచుకోవడం చూసి కదిలిపోతుంటారు వీళ్లు. బయటికి వెళ్లి దానికి తినడానికి ఏవైనా బిస్కెట్లవంటివి తెచ్చి కూడా సంచిలోంచి తీసి ఇవ్వకపోతే కాస్సేపు చూస్తుందట. తర్వాత చిన్న చిన్న మూలుగులతో  శబ్దం చేసి మరీ ఆ బిస్కెట్లను బయటకు తీయించి తీరిగ్గా తిన్న తర్వాత తిరిగి తన స్థానంలోకి వెళ్లిపోతుందట.

వీళ్లు నావాళ్లు, బయటకు వెళితే తప్పకుండా ఏదైనా తీసుకువస్తారు అనే జ్ఞానాన్ని అది ఎంతగా గుర్తుపెట్టుకుంటుందో మరి. చిన్న పిల్లలకు, ఇంటి జంతువులకు తేడా లేదనే కదా ఇది చెప్పేది. చెప్పిన మాట ఎన్నడయినా వినకపోతే, గోల చేస్తే, ఇంటివాళ్లు బయటకు  వెళ్లిపో అని కేక వేస్తారట. అది ఎలా అర్థం చేసుకుంటుందో కాని బుద్దిగా తన స్థానంలోకి వెళ్లి కిముక్కుమనకుండా కూర్చుంటుందట.

మనిషి భాషను అది ఎంత గొ్ప్పగా అర్థం చేసుకుంటుందో తెలిపే మరో విశేషం. ఆ ఇంటిలో వారు పనిమీద రెండు మూడు గంటలు బయటకు వెళితే దాన్ని ఆవరణలోంచి  ఇంటిలోపల టీవీ ముందు కూర్చుండబెట్టి ఏదో ఒక జంతువుల ఛానెల్ పెట్టి చూస్తుండమని చెప్పి వెళతారట. పాపం అది బుద్ధిగా ఆ టీవీలో బొమ్మలను చూస్తూ వాళ్లు కూర్చుండబెట్టిన చోటునుంచి కదలకుండా అలాగే చూస్తూ ఉంటుందట. వాళ్లు తిరిగి వచ్చేంతవరకు అలాగే ఉంటుందట.

ఇంటి జంతువు ఇంటి మనిషి కంటే ఎక్కువగా చెప్పిన మాటకు కట్టుబడి అలాగే ఉండటం ఎలా సాధ్యం అంటూ మాస్టారు గారు ఆశ్చర్యపోయారు. ఇంటివారి కోపాన్ని, సంతోషాన్ని, సరదాను, విషాదాన్ని అర్థం చేసుకుని మెలిగే పెంపుడు జంతువు ఇంటి మనుషుల కిందే లెక్క అని ఈయన అభిప్రాయం.

అన్నిటికంటే మించి వీళ్లు ఆ ఇంటిలోకి వెళ్లడం వరకే వీరి పని. తర్వాత వీరు బయలు దేరి వస్తూ ఉంటే మాత్రం ఒప్పుకోదట. చేతిలో సంచీ చూసిందంటే వీళ్లిక వెళ్లిపోతారు అని భావించి సంచీని నోటితో పట్టుకుని వదలదట. చుట్టాలను, అతిథులను అంత త్వరగా బయటకు పంపేయకూడదు అనే మానవ అనుభవజ్ఞాన సంస్కారాన్ని అదెంత బాగా అలవర్చుకున్నదో అని వీరికి విస్మయం కలుగుతూంటుంది. వీళ్లు వెళ్లటం తప్పనిసరి అయితే దాన్ని ఎలాగోలా మరిపించి ఆవరణలోంచి పక్కకు తీసుకెళ్లి ఏమారుస్తారట. అక్కడికీ వీళ్ళు గేటు దాటి నడవటం గాని చూసిందంటే అంతెత్తు ప్రహరీ గోడ దూకి బయటకు రావాలని గింజుకుంటుందట.

అలాగే తాను 30 లేదా 40 ఏళ్ల క్రితం మద్రాసులోని పేరుంగుడి ప్రాంతంలోని ఇంటిలో ఉన్నప్పుడు పిల్లితో తమ అనుబంధం గురించి కూడా ఈ సందర్బంగా శంకర్ గారు పంచుకున్నారు. ఇంటి చుట్టూ కొబ్బరిచెట్లు, మామిడి చెట్లు ఉండగా పరిసరాలలో తిరుగుతూండే ఈ పిల్ల అడివిపిల్లిలా భీకరంగా కనిపించేదట. నల్లపిల్లి. భారీ ఆకారం. వీరి అలవాట్లను అది ఎంతగా స్వతం చేసుకుందంటే. పొరపాటున కూడా చల్లని పదార్థాలు ముట్టేది కాదట. వేడిగా వండిన అన్నాన్ని తీసి మజ్జిగ వంటివి కలిపి పెడితే తింటుంది కాని చల్లబడితే వెంటనే అలిగి అక్కణ్ణించి వెళ్లిపోతుందట. రోజు వేడి అన్నం పెట్టేవారు ఈరోజేమయింది మీకు అంటూ తూష్ణీభావం ప్రదర్సిస్తూ అక్కడినుంచి వెళ్లిపోతుందట. ఏదో ఒకటి వేడిగా చేసి మళ్లీ పిలిస్తే కాని దగ్గరికి రాదట.

ఇక ఆ ఇంటి పిల్లలతో దాని అనుబంధం చెప్పాలి. వాళ్లు ఎక్కడ పడుకుంటే ఇది అక్కడికే పోయి పడుకునేదట. వారి బాధలను, విషాదాన్ని కూడా అది అలాగే పట్టేస్తుందట. పెద్దవాళ్లు ఎప్పుడయినా అరిచిన సందర్బాల్లో పిల్లలు ముసుగు కప్పుకుని ఏడుస్తుంటే ఈ పిల్లికి అస్సలు సహించేది కాదట. వెంటనే పోయి దుప్పటి లాగి వాళ్ల ముఖంలోకి చూస్తూ ఉంటుందట. ఆ పిల్లలు మళ్లీ దుప్పటి లాక్కుని కప్పుకుంటే మల్లీ లాగేసేదట. పిల్లలు ఏడిస్తే, కన్నీరు పెడితే అంత పిల్లికి కూడా ఇష్టముండదు మరి. సైలెంటుగా పోయి వారివద్ద కూర్చుని ఏడవవద్దు అంటూ ఓదార్చే ఈ మార్జాల మహత్వాన్ని ఏమని వర్ణించాలి అంటారీయన.

మన ఇంటిలో మనతోపాటే పెరుగుతూ, మన మనోభావాలను పరికిస్తూ, వాటికనుగుణంగా తమకు తాము మెలుగుతూ మన సంతోషాన్ని, విషాదాన్ని కూడా తమవిగా చేసుకుని మన వెన్నంటి ఉండే పెంపుడు జంతువులు దైవాంశ ప్రతిరూపాలు అంటారు శంకర్ గారు. నన్ను వదిలి పెట్టి పోవద్దు అనే అర్థం వచ్చేలా చేతిలోని సంచిని గట్టిగా పట్టుకుని నిలేసే కుక్క సంస్కారానికి మనం నిండు నమస్కారాలు చేయాలంటారీయన.

అసలు పెంపుడు జంతువులు మనుషుల పట్ల ప్రదర్సించే ఆ కరుణామయ దృశ్యాలను కథలుగా రాయాలంటారీయన. జంతువుల కథలు సాహిత్యంలో ఎన్నటికీ చెరిగిపోవని, మనుషులకు పాఠాలు నేర్పే కథలుగా జంతుకథలు సాహిత్యంలో కలకాలం నిలిచిపోతాయని శంకర్ గారు నొక్కి చెప్పారు.

జీవితపు తొలి నాళ్లు పల్లెలో ఉన్నప్పుడు మా ఇంటలోనూ పిల్లీ, కుక్కా ఉండేవి. సంవత్సరాలపాటు అవి మా బాల్యాన్ని పంచుకునేవి. చేతిలో చేయి వేస్తూ, అలాగే కళ్లలోకి చూస్తూ, పిల్లీ, కుక్క మాకు ఆనందాన్ని పంచిపెట్టిన, మా కష్టాల్లో పాలుపంచుకున్న ఒకనాటి మా పల్లెజీవితాన్ని తల్చుకుంటేనే కన్నీరు చిప్పిల్లుతుంది.

జీవితం తన్నిన తాపుకు పల్లెలకు దూరమై అమాంతంగా ఇలా పట్నాలకు, మహానగరాలకు వచ్చి అద్దె ఇళ్లలో పడ్డాం కాని, లేకుంటే మా పల్లె మాకు బతుకు నిచ్చి ఉంటే, అక్కడ అవకాశాలు లేవని, వ్యవసాయం ఇక గిట్టబాటు కాదని, బతకలేమని నిర్ణయించుకుని పట్నం దారి పట్టి ఉండకపోతే ఇప్పుడు కూడా మాకూ ఒక కుక్కా, పిల్లీ తోడుగా ఉండేవి కదా..

అసలే పిల్లలు లేనివాళ్లం. ఉద్యమాల బాట పట్టి  పిల్లలు వద్దనుకున్నవాళ్లం. ఇప్పుడు ఆ ఉద్యమాలూ లేక, పిల్లలూ లేక, పిల్లులూ కుక్కలూ లేక జానా బెత్తెడు ఇరుకు గదుల్లో మా పనులు మేము చేసుకుంటూ.. మా బతుకు మేము గడిపేస్తూ…

పిల్లలూ, జంతువుల రూపంలో లేలేత జీవిత మాధుర్యాన్ని కోల్పోయి ఇలా ఒంటరిగా బతకడం ఏంటో..

అడవి పిలిచింది మళ్లీ నాకు గుర్తుకొస్తోంది. విశ్వ విఖ్యాత రచయిత జాక్ లండన్ తానొక కుక్క  అవతారమెత్తిన చందంగా, కుక్కతనాన్ని నిలువునా జీర్ణం చేసుకుని పలవరించిన చందంగా తీర్చిదిద్దిన మహా నవల అడవి పిలిచింది మళ్లీ గుర్తుకొస్తోంది.

పీకాక్ క్లాసిక్స్ వారు ప్రచురించిన ఈ నవలను 2005లో తొలిసారిగా చదివింది మొదలుకుని దాన్ని మర్చిపోవడం చేతకావడం లేదు.మానవుడితో కుక్క అనుబంధాన్ని.. కాదు కాదు.. కుక్కతో మానవానుబంధాన్ని మహిమాన్వితంగా అక్షరీకరించిన ఈ ప్రామాణిక రచనను రాత్రికి వీలైతే మళ్లీ ఒకసారి చదవాలనిపిస్తోంది.

జంతువుల కథలు మళ్లీ చందమామలో అగ్రస్థానం పొందితే, ఎక్కువగా ప్రచురించబడితే ఎంత బాగుంటుందో.. అనిపిస్తోంది..

దైవం మానవరూపంలో అని ఈమధ్యే సాయి నిర్యాణం సందర్బంగా ఒక కమ్మటి ఆస్తిక గీతాన్ని టీవీలలో విన్నాను. దైవం జంతువు రూపంలో అని మార్చుకుంటే కూడా బాగుంటుందేమో…

శంకర్ గారూ, లేస్తూనే ఇవ్వాళ మళ్లీ కమ్మటి మాటలతో కంట తడి పెట్టించారు. కుక్కా పిల్లీ దైవత్వ ప్రతిరూపాలు.. జంతు అనుబంధాన్ని కోల్పోయిన వాళ్లం…జీవితంలో ఎలా మర్చిపోగలం ఈ మాటల్ని… నిండు నూరేళ్లూ చల్లగా ఉండండి మాష్టారూ..

RTS Perm Link