తొలి చందమామ అపరూప కథకులు శ్రీ అవసరాల

February 18th, 2011

అవసరాల రామకృష్ణారావు గారు

శ్రీ అవసరాల రామకృష్ణారావుగారి గురించీ మళ్ళీ పరిచయం చేయనవసరం లేదు. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికలో కథ రాసిన మాన్యులు. 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు. అమ్మ చెప్పిన  కథను, అందరికీ తెలిసిన కథను తనదైన శైలిలో, ఊకొడితే సాగే శైలిలో కుతూహలం కొద్దీ చిన్న వయసులో  కాగితంపై పెట్టి పంపితే తెలుగు పిల్లల అందాల మాసపత్రిక ‘చందమామ’ దాన్ని అలాగే తొలిసంచికలో వేసుకుంది.

ఆ క్షణం.. గత 64 ఏళ్లుగా కొనసాగుతున్న ఆయన సాహితీ ప్రస్థానానికి తొలి బీజం వేసిన క్షణం. బాల్యంలో తొంగి చూసిన ఆ తొలి కిరణపు రూపురేఖలే నేటి ఈ వృధ్దాప్యంలో -80 ఏళ్లు- కూడా కొనసాగడం ఆయనకు ఆశ్చర్యం, ఆనందం వేస్తూంటుంది.

ఓ బడుగుజీవి -పిచ్చిక- తను కష్టపడి సాధించుకున్నది అది చాలా కొంచెమే కావచ్చు పోగొట్టుకుంటుంది. ఎంతమందినో కలుసుకుని ఎవరూ కలిసి రాకపోయినా పట్టుదల వదలక, చివరికి విజయం సాధిస్తుంది. ఇదీ ఆనాడు తొలి చందమామలో అవసరాల గారు రాసిన ‘పొట్టిపిచిక కథ’. ఇదే తదనందర జీవితంలో తన విజయ సూత్రం అవుతుందని తను ఆనాడనుకోలేదట.

వెయ్యికి పైగా రచనలు చేసి 80 ఏళ్ల వయస్సులోనూ తలవంచక, కలం దించక తెలుగు కథకుడిగా కొనసాగుతున్న తనకు, దారి చూపే వేగుచుక్క తొలి చందమామలో అచ్చయిన ఆ తొలి కథే అని వినమ్ర ప్రకటన చేశారీయన. పక్షులతో, జంతువులతో మనుషుల్ని కలిపి సామాజికాంశాల్ని సరళంగా చెప్పవచ్చునని తాను నేర్చుకున్నది ‘చందమామ’ పత్రిక చలవవల్లనే అని హృదయం నిండా కృతజ్ఞతలు ప్రదర్శించారు.

రచన శాయి, దాసరి వెంకటరమణ గార్ల పుణ్యమా అని ఈ తొలి చందమామ కథకుడి గురించి వినడం, కనడం, మాట్లాడడం గత నెలరోజులలోగా జరిగిపోయింది. జనవరి 27న హైదరాబాదులో దాసరి సుబ్రహ్మణ్యంగారి ప్రధమ వర్థంతి సందర్భంగా ఆయన చందమామేతర సీరియల్స్ ఆవిష్కరణ సందర్భంగా సిటీసెంట్రల్ లైబ్రరీ సమావేశమందిరంలో కలుసుకున్నప్పుడు మా అందరి ముందూ ఒక మెరుపు మెరిసినట్లయింది వందమంది దాకా చందమామ అభిమానులు, వీరాభిమానులు, చందమామ రచయితలు, పాఠకులు ఒక చోట చేరిన ఆ అరుదైన సన్నివేశంలో ఆయన 80 ఏళ్ల వయస్సులో కూడా ఎంత చలాకీగా కనిపించారో..

సైజుతో పాటు చురుకుతనంలో కూడా నాటి పొట్టి పిచిక లక్షణాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయని ఈయన తనమీద తను సోకైన  జోక్ వేసుకుంటారట. అక్షరాలా నిజం. ఆయన రూపాన్ని చూసినా, ఫోన్‌లో మాట్లాడినా గలగలగలమనే పిచ్చిక కువకువలనే తలపించే మూర్తిమత్వం.

ఆ సమావేశంలో కుదురుగా మాట్లాడటం సాధ్యం కాకపోయినా తర్వాత శాయిగారు ఆయనతో మాట్లాడించినప్పుడు నాలో ఒక్కటే ఆలోచన. మన కళ్లముందు మిగిలి ఉన్న ఈ తొలి చందమామ అపురూప కథకుడి చందమామ జ్ఞాపకాలు ఎలాగైనా సంపాదిస్తే ఎంతబాగుంటుంది! ఆయన రాయగలరా, రాసి పంపగలరా, వయస్సు సహకరించగలదా.. ఆయనతో మాట్లాడాక ఆ గలగలల శబ్దం ముందు ఈ ‘గలదా’లన్నీ పక్కకు పోయాయి.

చందమామకు కథల పిచ్చికలు
ఆయన విశాఖపట్నం వెళ్లాక రెండు రోజుల్లోగా తన చందమామ జ్ఞాపకాలు, బోనస్‌గా చిట్టి కథ కూడా రాసి శాయిగారికి పంపడం, ఆయన వాటిని స్కాన్ చేసి వెంటనే చందమామకు ఈ మెయిల్ చేయడం నిజంగా అదొక మధురానుభూతి. ఇలా ఈమెయిల్ చేశాక శాయిగారు, ఆయనతో మాట్లాడుతూ మీరు పంపిన జ్ఞాపకాల, కథల పిచ్చికలు చందమామ వైపు ఇప్పుడే ఎగిరిపోయాయని చెప్పిన్పప్పుడు చాలా సంతోషం వేసిందని ఈరోజు ఈ తొలి చందమామ కథకుడు సంబరపడుతూ చెప్పడం మర్చిపోలేని అనుభూతి.

1947 జూలైలోనే తొలి చందమామ అచ్చయింది కనుక దీన్ని పునస్కరించుకుని 2011 జూలై నెలలో ఈ మాన్యుడి పాత కథ -పొట్టిపిచిక కథ-, చందమామ జ్ఞాపకాలు, బోనస్‌గా అందించిన మరో చిన్న కథ -విజయమాల-లను ఒకేసారి ప్రచురిస్తే బాగుంటుందన్న శాయిగారి ప్రతిపాదనను మా పైవారికి చెప్పడం. వెంటనే అది ఆమోదించబడటం జరిగిపోయింది.

ఆయన ఈరోజు -18-02-2011- ఫోన్‌లో మాట్లాడుతూ, తెలుగు భాషపై పిచ్చి అభిమానంతో, తాను ఇతర ప్రాంతీయ భాషలను నేర్చుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. చందమామతో తన సంబంధం మొదటి దశకే పరిమితమని తర్వాత వృత్తి రీత్యా ఇంగ్లీష్ లెక్చరర్‌గా, రీడర్‌గా ఒరిస్సాలో దశాబ్దాలు పనిచేసి రిటైరయ్యాయనని, ఆ ప్రభుత్వం, ఆ ప్రజల ఉప్పుతిని, ఇప్పటికీ వారి ఫించను తింటూ, వారి భాషను నేర్చుకోకపోవడం కంటే మించిన పోగాలం -పొయ్యేకాలం- మరొకటి లేదని ఆయన నొక్కి చెప్పారు.

బహుభాషల నిలయమైన మన దేశంలో అంతర్జాతీయ భాషకు ఇస్తున్న ప్రాధాన్యంలో ఒక శాతం కూడా మన ఇరుగు పొరుగు రాష్ట్ర్ల్లాల భాషలకు ఇవ్వలేకపోతున్నామని ఆయన ఇప్పుడు బాధపడుతున్నారు.

ఒరియా ఎలాగూ నేర్చుకోలేకపోయాను. సంస్కృతాన్నయినా పట్టుకుందాం… అని గతంలోనే ఈయన ప్రయత్నించారట. కాని సంస్కృతం పుస్తకం తెరిచి పట్టుకుంటే దాంట్లోనూ తనను తెలుగుపదమే వెంటాడేదని, దాంతో సంస్కృతాన్ని కూడా పక్కన పెట్టేశానని చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా ఒరిస్సాలో ఉండి కూడా చాకలివారితో పనిబడినప్పుడు, అంగడి అవసరాలకు మాత్రమే చిన్న చిన్న ఒరియా పదాలను ఉపయోగించేవాడిని తప్ప ఆ భాష మూలంలోకి వెళ్లలేకపోయానని నిజంగా ఇది పోగాలమేనని చెప్పారాయన.

పోగాలం అనే పదం తెలుగులో వాడితే దాన్ని ఇతర భాషలవారు చస్తే అర్థం చేసుకోలేరని, అనువదించలేరని, నామవాచకానికి బదులు నాలుగైదు పదాలలో వివరిస్తేగాని ఈ పదం ఇతరులకు అర్థంకాదని, ఇది మన అన్య భాషా దారిద్ర్యమేనని ఆయన తేల్చి చెప్పారు. మన పొరుగున ఉన్న భాషను మనం నేర్చుకోలేకపోతున్నామంటే అది పొరుగు భాష పట్ల మనకున్న చిన్నచూపే కారణమని. ప్రయత్నించీ నేర్చుకోలేకపోతున్నానని, ఇలా మిగతా ఎన్ని సాకులు చెప్పినా, పొరుగు భాషపట్ల కించభావమే ప్రధానమని. ఆయన తేల్చేశారు.

వృత్తి జీవితమంతా ఇంగ్లీష్ టీచింగే అయినప్పటికీ తెలుగు అంటే విపరీత వ్యామోహంతోనే గత 64 ఏళ్ల కాలంలో వెయ్యిరచనలు తెలుగులోనే చేయగలిగానని, మన రచనలు ఇంగ్లీషుతో  సహా ఇతర భాషలలోకి అనువదించుకోలేకపోవటానికి కూడా శక్తి లేకపోవడం కాకుండా మన భాషా దురభిమానమే కారణమవుతోందని ఆయన గట్టి అభిప్రాయం. ఇది పనికిరాదని, ఇలాంటి పిచ్చి అభిమానం మనకే మేలూ చేయదని అంటారు.

చందమామలో తప్పిన అవకాశం
అప్పట్లోనే కొడవటిగంటి కుటుంబరావు గారు తనకు ఉత్తరం రాస్తూ ‘మీరు ఒరిస్సాలో ఉన్నారు కనుక ఒరియా చందమామను సరిదిద్దే పని చేపట్టవచ్చు’ కదా అని అవసరాల గారిని అడిగారట. జీవితంలో అది ఎంత మహత్తరమైన ప్రతిపాదనో -ఆఫర్- మీకు తెలిసే ఉంటుందని, కాని ఆ ఆఫర్ అందుకోవాలంటే అర్హత ఉండాలని, ఒరియాలో అక్షరమ్ముక్క రాయలేని, చదవలేని నాకు ఎలా అది సాధ్యపడుతుందని ఆయన చెబుతోంటే కంఠంలో జీర.

కుటుంబరావు గారు కూడా 30 ఏళ్లు చెన్నయ్‌లో ఉంటూ కూడా తమిళంలో అక్షరం ముక్క మాట్లాడేవారు కారని, దాసరి సుబ్రహ్మణ్యం గారు 54 ఏళ్లు చెన్నయ్‌లో చందమామ పనిలో ఉండి కూడా తమిళం నే్ర్చుకోలేకపోయారని నాకు తెలిసిన సమాచారం చెబితే. నిజంగా ఇది మనభాషపై ఉన్న మక్కువ ప్రభావమేనని కానీ ఇలాంటి వైఖరి, స్వంత భాషపట్ల మాత్రమే అభిమానం, మనకు చాలా నష్టకరంగా మారుతుందని, ఏ రకంగా చూసినా మన భాషకే కట్టుబడిపోవడం సరైంది కాదని అన్నారు.

1996 నుంచి నేనూ చెన్నయ్‌లో ఉంటున్నప్పటికీ, ఏంగా, పోంగా, వాంగా అనే మార్కెట్ లాంగ్వేజ్ తప్ప తమిళం కుదురుగా మాట్లాడటం, రాయడం, చదవడం తెలియదని నేనూ సిగ్గుపడుతూ చెబితే నవ్వారాయన. మనందరికీ ఒకే పోగాలమేనని ఆయన భావన. ఒక రాష్ట్రంలో ఉంటూ కూడా వారి తిండి తింటూ కూడా వారి భాషను నేర్చుకోలేకపోవడం జాతీయ దౌర్భాగ్యమని ఈయన అభిప్రాయం.

(అప్రస్తుతమనుకోకుంటే, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ యాస భాషను నవలల్లో, ప్రత్యేకించి సినిమాల్లో ప్రయోగించడం ద్వారా భాషలోని యాసల్ని, ప్రాంతీయ భాషల అంతర్గత సౌందర్యాన్నికూడా వెక్కిరించే ధోరణిలో జోకర్లు, బపూన్లు, రౌడీల పాత్రల ద్వారా ఆయా ప్రాంత యాసల్లో పలికిస్తూ మన సినిమాలు చేసిన సాంస్కృతిక ద్రోహం మునుపెన్నటికంటే ఇప్పుడే అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. దీని ఫలితాన్ని మనం ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేనంత విస్పష్టంగా చూస్తున్నాం కూడా.)

వారం రోజుల క్రితం నేను ఫోన్ చేసి మాట్లాడుతుంటే నా మాట్లలో ‘ఖచ్చితంగా’ అనే ఊతపదాన్ని ఆయన భలేపట్టేశారు. ఖచ్చితంగా చేద్దాం, చూద్దాం, ప్రయత్నిద్దాం అనే రూపాల్లో ఆ పదాన్ని వాడుతుంటే ఆయనకు ఎందుకో గాని తెగనచ్చేసింది. ఇందులో తెలుగు పదం విభిన్న రూపాల్లో అంత స్వచ్చంగా వాడటమే ఆయన దృష్టిలో పడినట్లుంది.

చివరగా, చందమామతో తన ముచ్చట్లు చాలా పాతకాలానికి మాత్రమే పరిమితమయ్యాయని వృత్తి జీవితంలో, రచనా వ్యాపకంలో కూడా అంతర్ముఖత్వంతో గడపడం వల్ల తనకు ఎవరితోనూ పెద్దగా పరిచయాలు లేవని చెప్పారాయన. పాతకాలం రచయితలంతా ఇలాంటి అంతర్ముఖత్వంతో కూడిన ప్రపంచంలోనే గడిపేశారని పదిమంది నోళ్లల్లో నానాలనే లేశమాత్రపు కోరిక కూడా పాతతరానికి లేదని చెబుతూ కొన్ని వివరాలు తనతో పంచుకున్నాను.

ఆరోగ్యం బాగే కదా అని అడిగితే, రాయడమే ఆరోగ్యం, మనసుకు పనిపెట్టడమే ఆరోగ్యం అన్నారు. ఇప్పటికీ నిరంతరం రాస్తూన్నాను కనుకే ఆరోగ్యం తన కట్టుబాటులో ఉందని చెప్పారు.

చివరకు చందమామ జ్ఞాపకాలను చాలా త్వరగా ముగించినట్లుంది, ఇంకొంచెం వివరంగా రాసి ఉంటే బాగుండేదేమో అని అడిగితే ఇంతకు మించి రాస్తే డబ్బా కొట్టుకున్నట్లే, 60 ఏళ్ల క్రితం నాటి విషయాలు ఎన్ని పుటల్లో చెప్పాలి అంటూ ముగించారు. కందపద్యం అంటే తనకు చాలా ఇష్టం అయినా నాలుగు పాదాలకు బదులు రెండు పాదాలే రాసి చదువుకుని సంతోషించేవారట.

మీరిలాగే ఓపిగ్గా, ఆరోగ్యంగా ఉంటూ చందమామకు కూడా కథలు పంపుతూ ఉండండి అంటే రాస్తుండటమే పెద్ద ఓపిక, పెద్ద ఆరోగ్యం అని నవ్వేశారు. రాయకుంటే అనారోగ్యమేనట.గతంలో రాసిన పుస్తకం పంపుతానని, అంగ్రేజీ యమఈజీ పుస్తకం కూడా త్వరలో రానుందని చెప్పారు.

గడచిన తరాల నిరాడంబరత్వానికి, నమ్రతకు ప్రతిరూపంగా కనిపించే మన చందమామ అలనాటి కథకుడివద్ద, మళ్లీ కలుద్దామంటూ సెలవు తీసుకున్నాను.

అవసరాల రామకృష్ణారావుగారి పాత కథ, కొత్త కథ, చందమామ జ్ఞాపకాల పూర్తిపాఠం కోసం జూలై నెల ప్రింట్ చందమామ వచ్చేంతవరకూ ఆగాల్సిందే…!

తొలి చందమామ కథకుడితో పరిచయ భాగ్యం కల్గించిన రచన శాయి, దాసరి రమణగార్లకు కృతజ్ఞతాభివందనలు.

ఈ నిరంతర శ్రామికుడి మొబైల్ నంబర్: 9866221575

చందమామ జ్ఞాపకాలు తనతో నేరుగా పంచుకోవాలంటే పై నంబర్‌కు కాల్  చెయ్యగలరు.

RTS Perm Link


One Response to “తొలి చందమామ అపరూప కథకులు శ్రీ అవసరాల”

  1. చందమామతో నా జ్ఞాపకాలు at చందమామ చరిత్ర on July 1, 2011 5:53 AM

    […] తొలి చందమామ అపరూప కథకులు శ్రీ అవసరాల […]

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind