దాసరి సుబ్రహ్మణ్యంగారి అరుదైన జీవిత రికార్డు

January 24th, 2011

54 ఏళ్లు ఇక్కడే ఉన్నారు.

చందమామ సీరియల్స్ ద్వారా అయిదారు దశాబ్దాలుగా లక్షలాది పాఠకులను ఉర్రూతలూగిస్తూ వచ్చిన మాన్యులు దాసరి సుబ్రహ్మణ్యం గారి వ్యక్తిగత జీవితం కూడా పరమ సాధారణ స్థితిలో దాదాపు అజ్ఞాతంగా ఎటువంటి పటాటోపాలు లేకుండా కొనసాగింది. 1952 నుండి 2006 వరకు 54 ఏళ్లపాటు అనితర సాధ్యమైన విధంగా చందమామలో పనిచేసిన దాసరి గారు చివరకు వ్యక్తిగత జీవితాన్ని కూడా సుదీర్ఘకాలం పాటు ఒకే అద్దె ఇంటిలో గడపడం చారిత్రక విశేషం. ఇలా వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఒకే స్థలంలో అయిదు దశాబ్దాలపైబడి కొనసాగించడం బహుశా ప్రపంచంలో ఎవరికీ సాధ్యమయ్యే పని కాకపోవచ్చు. వృత్తి జీవితంలో చందమామ చిత్రమాంత్రికుడు శంకర్ గారు మాత్రమే ఇందుకు సంబంధించి మినహాయింపుగా ఉంటారు. ఈయన కూడా 1952 చివరినుంచి ఈ నాటి వరకు అంటే దాదాపు 58 ఏళ్లపాటు చందమామలోనే పనిచేస్తున్నారు. కాని నివాసం విషయంలో చాలా స్థలాలు మారారు.

జానపద కథా మాంత్రికుడు

చందమామలో 1952 నుంచి 1980 దాకా నిరవధికంగా జగత్ప్రసిద్ధమైన 12 సీరియల్స్ -తోకచుక్క, రాతిరథం, జ్వాలాద్వీపం, పాతాళదుర్గం, మకరదేవత, శిథిలాలయం, రాకాసిలోయ, భల్లూకమాంత్రికుడు వంటివి- రాసి చందమామ సర్క్యులేషన్‌‍ని అమాంతంగా పెంచిన ఘనత దాసరి గారి సొంతం.  అయితే ఆయన రాసిన జానపద ధారావాహికల మంత్రజగత్తులో ఉర్రూతలూగిన లక్షలాది మంది పాఠకులలో నూటికి 99 మందికి, చివరకు చందమామ రచయితలకు కూడా చందమామ సీరియల్స్ రచయిత ఎవరో ఇటీవలివరకు తెలియదంటే నమ్మశక్యం కాదు. చందమామ పత్రిక తన ఉద్యోగుల వ్యక్తిగత, వృత్తిగత జీవితంపై విధించిన అలిఖిత అజ్ఞాతవాసం అంత పటిష్టంగా కొనసాగింది మరి.

దాసరిగారి అద్దె ఇంటి నడవా

ఆయన ఆనారోగ్యంతో 2006లో విజయవాడలో బంధువుల ఇంటికి వెళ్లినప్పటికీ, 2009 వరకు పాఠకులు ఆయన పేరుతోటే ఉత్తరాలు, రచనలు పంపుతూ వచ్చిన ఉదంతమే ఇందుకు తిరుగులేని సాక్ష్యం. చివరకు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన అయిదు దశాబ్దాలకు పైగా ఒకే ఇంటిలో నివసించిన విషయం ఇటీవల వరకు ఎవరికీ తెలీదు. గత 54 ఏళ్లుగా ఎలాంటి మరమ్మతులు లేని స్థితిలో,  చెన్నయ్ మహానగరంలో,  ‘భూతాల’ నిలయం వంటి పురాతన భవనంలోని ఒక ఇరుకైన గదిలో ఆయన జీవించారు. భూతాల నిలయం అనే పదం ఇక్కడ ప్రతీకగా వాడవచ్చు కాని, ఆ భవంతిలో ఈనాటికీ దాసరి గారితో దశాబ్దాల అనుబంధాన్ని పెంచుకుంటూ వచ్చిన సాధారణ మనుషులు జీవిస్తున్నారు.

ఈ 7వ నంబర్ ఇల్లే ఆయన జానపద నివాసం

చెన్నయ్‌లోని వడపళనిలో పాత చందమామ భవంతికి కూతవేటు దూరంలోని సుప్రసిద్ధమైన మురుగన్ కోయిల్ స్ట్రీట్‌లో కిందా పైనా 12 గదులు ఉన్న ఒక పాడుబడిన అపార్ట్‌మెంట్‌లో 7వ నంబర్ గదిలో దాసరి గారు దశాబ్దాలుగా అద్దెకు ఉంటూ వచ్చారు. విజయ వాహినీ స్టూడియోలోని పాత చందమామ భవంతి ఇప్పుడు లేదు. చందమామ వైభవోజ్వల శకానికి సాక్షీభూతంగా నిలిచి అయిదెకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన చందమామ భవంతి ఇప్పుడు చరిత్రలో కలిసిపోయింది. అక్కడినుంచి చందమామ కార్యాలయం చెన్నయ్ లోని ఈక్కాండి తాంగల్ -గిండీ-, జెఎల్ ప్లాజా -తేనాంపేట-, చిన్న నీలాంగరై -తిరువాన్మయూర్ అవతల- ప్రాంతాలకు వలసపోయింది.

దాసరి గారి ఇంటికి ఎడమవైపున చందమామ కార్యాలయ భవంతి

భూమి గుండ్రంగా ఉన్న చందాన 2010 మేలో చందమామ పాతభవంతికి సమీప ప్రాంతానికే చందమామ ఎడిటోరియల్ ఆఫీసు మళ్లీ వచ్చి చేరింది. చిత్రమో, యాదృచ్ఛికమో గాని దాసరి గారు 54 ఏళ్లపాటు నివసించిన ఆ పాత ఇంటికి సరిగ్గా వెనుకవైపు భవంతి -స్వాతి ఎన్‌క్లేవ్ 5-6 నంబర్లు-లోనే ప్రస్తుతం చందమామ కార్యాలయం ఉంది. దాసరి గారు వడపళని ప్రాంతంలోనే ఉండేవారని చూచాయగా తెలుసు కాని నిర్దిష్టంగా ఎక్కడ ఉండేదీ అంతవరకు నాకు తెలీదు.

మురుగన్ కోయిల్ స్ట్రీట్‌లో స్వాతి ఎన్‌క్లేవ్ భవంతిలోకి -2A- వచ్చి చేరిన మూడు నెలలకు చందమామలో ప్యాకింగ్ విభాగంలో పనిచేస్తున్న రవి ఒక రోజు ఆఫీసు బయట పిచ్చాపాటిగా మాట్లాడుతూ ‘తాతా సర్ మొదటినుంచి ఉంటూవచ్చిన ఇల్లు ఇదే సార్’ అని చూపించారు. దాసరి గారిని చందమామ సిబ్బంది మొదటి నుంచి ‘తాతా సర్’ అని పిలుస్తూ వచ్చారు. సరిగ్గా దాసరి గారి ఇంటి వెనుకవైపు చందమామ ఆఫీసు ఉంది. నాకయితే రవి ఈ విషయం చెప్పాక షాక్ అయింది. ‘ఏమిటి ఇంత పాడుబడిన భవంతి’ అని చాలా సార్లు అనుకున్నాను గాని, ఆయన దశాబ్దాలుగా గడిపిన ఇంటిపక్కకు మేం వచ్చామని సూచన ప్రాయంగా కూడా తట్టలేదు.

అరుదైన చరిత్రకు నిలయంగా మారిన ఆ ఇంటిని పోటోలు తీయాలని, ఇంటిముందుకు వెళ్లి ఆయన వివరాలు తెలుసుకోవాలని అనుకున్నా అది ఆచరణలో సాధ్యపడేందుకు మరో మూడునెలలు పట్టింది. ఈ శుక్రవారం -17-12-2010- సాయంత్రం చందమామ కొల్లీగ్ వద్ద 3 మెగా పిక్సెల్ మొబైల్ తీసుకుని రవి సాయంతో ఆ ఇంటికి వెళ్లాము.

దాసరి గారు – చెన్నయ్ అద్దె ఇల్లు
రచన జూన్ సంచికలో ‘చెట్టెక్కిన బేతాళుడు’ పేరుతో నాయుని కృష్ణమూర్తిగారు, దాసరి గారితో, ఆయన అద్దె ఇంటితో తన పరిచయాన్ని సమగ్రంగా వివరించారు. ఆయన 1974లో బొమ్మరిల్లు పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న కాలంలో ఓ రోజు సంపాదకులు విజయబాపినీడు గారు చెన్నయ్‌లో ఒక పెద్దాయనను కలిసి ఆయన ఇచ్చే కొన్ని కాగితాలు తీసుకురావాలని చెప్పారు. (చందమామలో పనిచేస్తున్నప్పుడు, కొత్తగా ప్రారంభించబడిన బొమ్మరిల్లుకు ప్రోత్సాహం అందించాలన్న ఆలోచనతో దాసరి గారు ‘మృత్యులోయ’ జానపద సీరియల్‌ని ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో రాసి బాపినీడుగారికి పంపేవారు.)  ఆ ప్రకారం ఆ చిరునామాకు వెళ్లిన నాయుని గారు దాసరి గారిని కలిసిన ఆ ప్రథమ సమావేశపు సన్నివేశాన్ని ఇలా వర్ణించారు. విషయ విస్తరణ రీత్యా రచన జూన్ సంచికలో వచ్చిన ఈ భాగాన్ని కుదించి ఇక్కడ పొందుపర్చడమైంది.

వడపళనిలో మురుగన్ కోయిల్ ఉంది. అది తెలీని మద్రాసీయులు ఎవరూ ఉండరు. గుడికి డెబ్బై, ఎనభై మీటర్ల ముందు ఒక అడ్డరోడ్డు ఉండేది. అది చందమామ బిల్డింగు -విజయావారి పాత బిల్డింగ్- కు వెళ్లే వైపు కుడిపక్కన ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు ముందు బారుగా లోపలికి చిన్న చిన్న ఇళ్లు పదో, పన్నెండో ఉంటాయి. వీటిల్లో నేను వెళ్లవలసిన ఇంటికి సాయంకాలం ఏడున్నరకు వెళ్లాను -7వ నెంబర్ ఇల్లు- తాళం వేసుంది మళ్లీ రోడ్డు మీదికి వెళ్లి నిలబడ్డాను.

ఎనిమిదన్నర తర్వాత గుడి ఎదురు రోడ్డు క్రాస్ మీదనుండి వస్తున్న ఒకతను కనిపించాడు. ఏదో ఆలోచిస్తూ, అప్పుడప్పుడూ, తల పక్కకు తిప్పి చూస్తూ, ఆగి ఆగి సిగిరెట్టు కాలుస్తూ వస్తున్న వ్యక్తి. ఆయన నాకేసి చూసినప్పుడు ‘సుబ్రహ్మణ్యం గారికోసమండీ ఆ యింట్లో ఉంటారు’ అంటూ మధ్యలో కొన్ని ఇళ్లవైపు చేయి చూపిస్తూ అన్నాను. ‘ఎక్కణ్ణుంచి వస్తున్నారు’ అనడిగితే విజయబాపినీడు గారు పంపారని చెప్పాను. ‘రండి’ అని ఆయన ముందుకు దారితీసి తన గది ముందు ఆగి జేబులోంచి తాళంచెవి తీసి తలుపులు తెరిచారు. ‘ఉండండి,’ అంటూ చీకట్లో తనొక్కడే లోపలికి వెళ్లి ఏదో స్విచ్ నొక్కాడు. ముందు గదిలో వెలుగులు పరుచుకున్నాయి.

దాన్ని గది అనొచ్చునా, అనకూడదా అన్న మీమాంస క్షణంలో ఏర్పడింది. బాగా పొడవైన అగ్గిపెట్టె అడ్డంగా పెట్టినట్లు ఉంది ఆ గది. వెడల్పు అయిదడుగులకు మించి ఉండదు. పొడవు 12-15 అడుగుల మధ్య ఉండొచ్చు. కుడి వైపు  మూడడుగుల వెడల్పుతో లోపలికి ఒక దోవ ఉంది. ఆ మధ్యలోనే ఎడం వైపు ఒక గది ఉన్నట్లు తలుపులు వేసి ఉన్నాయి. బాగా వెనుకవైపు పెరడు అని చూస్తూనే తెలిసి పోతోంది. ముందు అయిదడుగుల వెడల్పు గదిలోనే బుక్ షెల్వ్స్ ఉన్నాయి. ఆయన కూర్చోవడానికి ఒక కుర్చీ ఉంది. ముందు తలుపుకు దగ్గరగా, లోపలకు వెళ్లే సందు ముందు వచ్చిన వాళ్లు కూర్చోవడానికి ఒక కుర్చీ, ఒక స్టూలు ఉన్నాయి.”

దాదాపు 35 ఏళ్ల క్రితం తాను చూసిన దాసరిగారి అద్దె ఇంటిని పొల్లుపోనంత నిర్దిష్టంగా వర్ణించిన నాయుని గారి జ్ఞాపకశక్తికి ఈ సందర్భంగా అందరం జేజేలు పలకాలి. ఆ ఇల్లూ, పరిసరాలూ ఈనాటికీ దాదాపు అలాగే ఉన్నాయి. వడపళని క్రాస్‌కి సమీపంగా నూరడుగుల రోడ్డులో -బీమాస్ హోటల్ వద్ద కలిసే- ఆ అడ్డరోడ్డు మాత్రమే కాస్త మెరుగయి ఉండవచ్చు.

నాయుని గారు ఆ కథనంలో వర్ణించిన తీరుకంటే మరింత ఘోరంగా ఆ ఇల్లు ఉందనిపించింది. అరవై, డెబ్బై ఏళ్లక్రితం కట్టిన ఆ భవంతిలో వర్షం వచ్చిందంటే చాలు, ముంగిట్లో నీరు వరద కడుతుంది. చెన్నయ్ లోని చాలా పాత ఇళ్లలో ఇదే పరిస్థితి. ఇంటి మట్టం కంటే రోడ్డు మట్టమే ఎత్తులో ఉన్న స్థితిలో కాస్త వర్షం పడిందంటే ఇంట్లోకి వెళ్లే దారిలో మడమలపైకి నీరు చేరుతుంది. ఈ నీళ్లు ఎటూ పోలేక నిలవ ఉండిపోయి భయంకరమైన వాసన వేస్తుంటుంది. ఆ నీళ్లలోనే కాళ్లు తడుపుతూ ఇరుకు దారి గుండా లోపలికి వెళితే అక్కడ పరిచయమైన ఇద్దరమ్మల సహాయంతో దాసరిగారు ఈ భవంతి చివరలో ఉన్న 7వ నెంబర్ గదిని చూడటం జరిగింది.

ఇద్దరమ్మలు మనవాళమ్మ, గౌరి

మార్వాడీల యాజమాన్యంలో ఉండే ఆ పాత భవంతిలో దాసరి గారు 1952 నుంచి 2006 వరకు 54 ఏళ్ల వరకు ఇక్కడి గ్రౌండ్ ప్లోర్ లోని లోని 7వ నంబర్ గదిలోనే నివసిస్తూ వచ్చారు. అనారోగ్య కారణాలతో ఇక్కడి నుంచే ఆయన 2006లో విజయవాడలోకి బంధువుల ఇంటికి వెళ్లారు. దీంట్లో మొత్తం 12 ఇళ్లు ఉంటున్నాయి., వీటిలో తెలుగు ఫ్యామిలీలే ఎక్కువ. చందమామలో గతంలో కన్నడ విభాగంలో పనిచేసిన పద్మనాభన్ బాబు, ఆయన భార్య గౌరి గార్లు 1వ నెంబర్ ఇంటిలో ఉంటున్నారు. ఈమెకు కన్నడతో పాటు తెలుగు కూడా బాగా వచ్చు. ఇక మనవాళన్ అనే తమిళ సినీ నటుడి -ఇప్పుడు లేరు- భార్య కాంతా మనవాళన్ -60- గారు 2వ నెంబర్ గదిలో ఉంటున్నారు. ఇక్కడున్న వాళ్లంతా గత 35, 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. అందరికంటే సీనియర్ మన దాసరి గారే. -అద్దెకొంపలో నివాసం చరిత్రలో ఒకే చోట 54 ఏళ్లు- మనవాళన్ దంపతులు దాసరి గారికి చివరివరకు సపరిచర్యలు చేశారట. చెన్నయ్‌లో ఆయనది బ్రహ్మచర్య జీవితమే కాబట్టి వేడి నీళ్లు కాచి ఇవ్వడం వంటి పనులు, సేవలను మనవాళన్ కుటుంబమే ఆయనకు అందించింది.

ఈ భవంతిలోని 6వ నంబర్ గదిలో గోపాల రావు గారనే టైలర్, దాసరి గారితో చాలా స్నేహంగా ఉండేవారట. ఈయన మురుగన్ కోయిల్ సమీపంలో టైలర్ షాపు పెట్టుకుని బతికేవారు. దాసరిగారికి ఈయనతో చివరివరకు సన్నిహిత సంబంధం కొనసాగింది. ఈయన పనిచేస్తున్న టైలర్ షాపు వద్దే దాసరి గారు ఎక్కువకాలం గడిపేవారు. తన అధ్యయనం మొత్తాన్ని ఈ షాపులోనే చేసేవారని తెలుస్తోంది. వాసిరెడ్డి నారాయణ రావుగారు ఈ విషయం చెప్పినట్లు శాయిగారు చెప్పారు. సామాన్యులే దాసరి గారి కథల్లో పాత్రలు. ఆయన స్నేహం కూడా మామూలు మనుషులతోటే కొనసాగింది. ఆయన కూడా ఇప్పుడు లేరు.

54 ఏళ్లు ఒకే ఇంటిలో ఉండటం, ఒకే ఆఫీసు -చందమామ-లో పనిచేయడం. దాసరి గారికే చెల్లింది. శంకర్ గారు కూడా చందమామలో గత 58 ఏళ్లుగా పనిచేస్తున్నా ఆయన చాలా ఇళ్లు మారారు. కాబట్టి ఇల్లు, ఆఫీసుకు సంబంధించిన దీర్ఘకాలిక రికార్డు ప్రపంచంలో బహుశా దాసరిగారికే దక్కవచ్చు. ఇది ఖచ్చితంగా గిన్నెస్ రికార్డుకు ఎక్కవలసిందే -అవసరమనుకుంటే-

ఈ ఇళ్లలోని వారిని కదిపితే చాలు దాసరి వారి జ్ఞాపకాల స్మరణలో మునిగి పోతున్నారు. చందమామ ఉద్యోగి, పెద్దాయన అనే గౌరవం కంటే ఆయన మా మనిషి అనే ఆత్మీయస్పర్శ వీళ్ల జ్ఞాపకాల్లో కొట్టొచ్చినట్లు కనబడుతుంది.

దాసరి గారి సోదరులు ఈశ్వర ప్రభు ఇక్కడికి చాలా తరచుగా వస్తూ పోతూండేవారట. ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉంటున్న ఈశ్వర ప్రభు గారి కుమార్తె మణి తన బాబాయిని కలుసుకోవడం కోసం ఇక్కడికి వస్తూండేవారట.

వడపళని - మురుగన్ కోయిల్ (ఆలయం)

దాసరి గారు చందమామ ఆఫీసులో పనిచేసినంతకాలం వడపళనిలోని మురుగన్ కోయిల్ స్ట్రీట్ పరిసరాల్లోనే 54 ఏళ్లుగా ఉంటూవచ్చారు. ఈ ఇల్లు మొదట్నించి మార్వాడీల చేతిలో ఉండేది. మూడేళ్లకు, ఆరేళ్లకు అద్దె ఇళ్లు ఖాళీ చేయాలనే ఇంటి ఓనర్లు రాజ్యమేలుతున్న కాలం మనది. మనిషికున్న భయాల్లో లీగల్ భయాలు సన్నవి కావు. కాగా 54 ఏళ్లుగా దాసరి గారిని ఆ ఇంటి నుంచి ఖాళీ చేయవలసిందిగా ఈ మార్వాడీ ఓనర్లు కోరకపోవడమే చిత్రాల్లో కెల్లా విచిత్రం.

దాసరి గారు వయోభారంతో మద్రాసు నుంచి విజయవాడకు 2006లో వెళ్లిన తర్వాత కూడా వడపళని లోని ఈ 7వ నంబర్ ఇంటితో ఆయన అనుబంధం కొనసాగింది. మొదటినుంచీ ఇద్దరు నివసిస్తున్న ఈ ఇంటిలో 2010 జనవరి వరకూ దాసరి గారి అద్దెభాగాన్ని -1000 రూపాయలు. – చందమామ పూర్వ అసోసియేట్ ఎడిటర్ బాల సుబ్రహ్మణ్యం గారు ఒక ప్రయోజనం కోసం దాసరి గారి తరపున చెల్లిస్తూ వచ్చారు.

ప్రస్తుతం ఇక్కడి స్వాతి ఎన్‌క్లేవ్‌లో ఉన్న చందమామ కొత్త ఆఫీసు బిల్డింగ్ పక్కనే ఉన్న పాతబడిన భవంతిలో ఏడవ నంబర్ ఇంటిలో దాసరి గారు అయిదు దశాబ్దాలకు పైబడి నివసించారు. ఇది చందమామ ప్రస్తుత ఆఫీసుకు సరిగ్గా వెనుకవైపున ఉండటం కాకతాళీయం.

దాసరి గారు నివసించిన ఇంటికి పక్క ఇల్లు కూడా చాలా పాతది. ప్రమాణాల ప్రకారం చూస్తే పక్కపక్కనే ఉన్న ఈ రెండు భవంతులూ చెన్నయ్ లోని అతి పురాతన భవనాలలో ఒకటిగా లెక్కించవచ్చు.

గది లోపల ఒక ఇరుకు భాగం

ఒక్కటి మాత్రం నిజం. దాసరి గారు చెన్నయ్ నగరంలో చివరి వరకూ మధ్యతరగతి జీవితమే గడిపారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో సామాన్య కుటుంబాలే ఉండేవి. చందమామలో సుప్రసిద్ధమైన 12 ధారావాహికలు రచించి లక్షలాది పాఠకులను దశాబ్దాలుగా ఉర్రూతలూగించిన దాసరి గారు ఇక్కడి ఇరుకు గదిలోనే నివసిస్తూ చందమామ సీరియల్స్‌కి పాత్రల రూపకల్పన చేసి ఉంటారు. ఆయన గడిపిన మధ్యతరగతి జీవితం సాక్షిగా ఆయన సీరియల్స్ పాత్రలు ఆ మట్టి వాసనే వేసేవంటే ఆశ్చర్యపడవలసింది లేదు.

దాసరి గారి ఇంటి వెనుక తలుపు

ముఖ్యంగా మీకు తెలుపవలసింది ఏమిటంటే 7వ నెంబర్ ఇంటి మూసిన తలుపు ఫోటో, వెనుక వైపు తెరిచిన తలుపు ఫోటో తప్పితే మిగతా ఫోటోలు అన్నీ కాంతా మనవాళన్ గారి ఇంటి పోటోలే. దాసరి గారు ఉంటూ వచ్చిన గదిలో ఉంటున్న ఆయన మేం వెళ్లే సమయానికి తాళం వేసి పోవడంతో ఆయన ఇంటిలోపలి భాగాలను ఫోటోలు తీయలేకపోయాము. ఈ ప్లాట్ లోని 12 ఇళ్లూ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి  గనుక పాఠకులు సౌకర్యార్థం 2వ నెంబర్ గది లోపలి, వెనుక భాగాలను ఫోటో తీసి పంపిస్తున్నాను. రచన జూన్ సంచికలో నాయని కృష్ణమూర్తి గారు వర్ణించిన దాసరి గారి ఇంటికి ఈ ఇతరుల ఇళ్లు కూడా సరిగ్గా సరిపోతున్నాయి.

మురుగన్ మెడికల్ షాప్

దాసరి – మురుగన్ మెడికల్ షాపు
వడపళని మురుగన్ కోయిల్ స్ట్రీట్‌లో దాసరి గారు 54 ఏళ్లపాటు నివసించిన ఇంటికి దగ్గరగా, మురుగన్ కోయిల్‌కి అతి సమీపంలో  మురుగన్ మెడికల్ షాపు ఉంది. ఈ మెడికల్ షాపులో మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి గత ఆరునెలల్లో చాలా సార్లు షాపుకు వెళ్లాము. దాన్ని తెలుగువారే నడుపుతున్నారు కాని దాసరి గారు దశాబ్దాలపాటు మందులు తీసుకున్న మెడికల్ షాపు ఇదేనని ఈ రోజు 24-12-2010- వరకు మాకు తెలీలేదు. బోర్డు కూడా రోడ్డుకు పైన కాకుండా లోపల కనీ కనిపించకుండా ఉండటంతో పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. చందమామ ప్యాకింగ్ విభాగంలో ఉన్న రవి చెప్పిన వివరాల ప్రకారం ఈ రోజు దీన్ని పట్టేశాము.

ధాసరి ఎక్స్‌లెన్స్ అవార్డుతో శ్రీనివాస్

ఈ మెడికల్ షాపుతో దాసరి గారికి 50 ఏళ్లపైబడిన బంధం ఉంది. 1952లో చెన్నయ్‌కి వచ్చింది మొదలుకుని దాసరి గారు  తమ వైద్య అవసరాలకు ఈ షాపుకే వచ్చేవారు. మేము వెళ్లేటప్పటికి షాపులో ఉన్న శ్రీనివాస్ గారిని దాసరి గారి గురించి ప్రస్తావిస్తే 22 ఏళ్లుగా ఆయన తనకు తెలుసని చెప్పారు. ఎందుకంటే ఇతను గత 22 ఏళ్లుగా ఈ షాపులోనే పనిచేస్తున్నారు. దాసరి గారి జ్ఞాపకాలను పంచుకోమని అడిగితే ముందుగా ఆయనకు చందమామ 2000 సంవత్సరం (?) లో జీవితకాల సాధనకు -లైఫ్ అచీవ్‌మెంట్‌- గాను అందించిన చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు ధ్రువపత్రాన్ని దాసరిగారు తమకు ఇచ్చారని చెప్పి షాపులోనే ఉన్న ఆ ఫోటోను మాకు అందించారు. షాపులోపలే దాన్ని 3 మెగా పిక్సెల్ మొబైల్‌తో ఫోటో తీస్తే అంత సరిగా రాలేదు.

చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డులు - దాసరి, శంకర్ గార్లు

చందమామ చరిత్రలో ఎక్స్‌లెన్స్ అవార్డు ఇద్దరికి మాత్రమే లబించింది వారు దాసరి, శంకర్ గార్లు. 1999లో చందమామ బయటి వ్యక్తుల సహాయం తీసుకుని తిరిగి ఉనికిలోకి వచ్చాక, దశాబ్దాలుగా పత్రిక అభివృద్ధికి దోహదం చేసిన మాన్యులను గౌరవించాలని పత్రిక  మనుగడకు ఆర్థిక సహాయం అందించిన సుధీర్ రావు తదితరులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఇద్దరు మహనీయులకు చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు అందించారు. వడపళనిలో ఉన్న ప్రముఖ హోటల్ ఆదిత్యలో జరిగిన ఓ ఫంక్షన్‌లో ఈ అవార్డును బహూకరించారు.

చందమామ ఆవిర్భవించిన 50 ఏళ్ల తర్వాత ఆ సంస్థకు చెందిన సిబ్బందికి అవార్డులు ప్రకటించిన చరిత్ర అదే మొదటిదీ, చివరిదీ కూడా కావడం గమనార్హం. వ్యక్తుల కంటే సంస్థ ముఖ్యమే కాని తెలుగింటి కథల మామగా పేరొందిన ఈ సుప్రసిద్ధ కథల పత్రికలో పనిచేసిన సిబ్బంది జీవితాలు ఇంత సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండిపోవడమే బాధాకరం. చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు వీరిద్దరికీ వచ్చినా, రాకున్నా వారి ఘనతర చరిత్రకు జరిగే లాభం, నష్టం ఏమీ ఉండవనుకోండి. కాని ఎక్కడో బాధ.

చందమామ బహూకరించిన ఈ జీవితకాల సాధన ధ్రువపత్రాన్ని దాసరి గారు 2006 వరకు పదిలపర్చుకున్నట్లు ఉంది. తర్వాత ఆయన అనారోగ్యంతో విజయవాడలో బందువుల ఇంటికి వెళ్లేటప్పుడు ఈ అపరూప జ్ఞాపకాన్ని ఈ మెడికల్ షాపులో తన స్నేహితుడికి ఇచ్చి వెళ్లినట్లుంది. ఈ రోజుకీ వారు దాన్ని షాపులోనే లోపల భద్రంగా ఉంచారు.

ఒరిజనల్ ఫోటో ఫ్రేమ్

దాసరిగారికి చందమామ బహూకరించిన ఎక్స్‌లెన్స్ అవార్డు ఫోటో ఫ్రేమును మాకు చూపించిన మురుగన్ మెడికల్స్ శ్రీనివాస్ గారి పోటో కూడా ఈ సందర్భంగా తీశాము. సాయంత్రం 4 గంటల తర్వాత వస్తే దాసరిగారితో తమ పరిచయం విశేషాలు చెబుతానని చెప్పారు. పక్కనే ఉన్నాము కాబట్టి మళ్లీ కలుద్దామని చెప్పి  మా వద్ద ఉన్న చందమామలను గౌరవంగా అందించి ఆఫీసుకు వచ్చేశాము.

ఇక్కడ ఒక మాట చెప్పాలి. భూమ్మీద వ్యక్తిగత ఆస్తి ఉండరాదని ప్రభోదించే మార్క్సిస్టు సిద్ధాంతాన్ని జీవితం చివరవరకూ నమ్మిన వారు దాసరి. అద్భుత రీతిలో చందమామ దశాబ్దాల సేవలకోసం తనకు అందించిన ఈ అపురూప ద్రువపత్రాన్ని కూడా దాసరిగారు తృణప్రాయంగానే వదిలి పెట్టి పోవడం, కీర్తికాంక్షల పట్ల ఎలాంటి మమకారం లేని ఆయన నిగర్వానికి, సగటు మనిషితనానికి తిరుగులేని నిదర్శనం. 83 ఏళ్ల వయసులో ఆయన మద్రాసు విడిచి విజయవాడ వెళుతున్నప్పుడు చందమామ పూర్వ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకు తోడుగా వెళ్లి దింపి వచ్చారని తెలుస్తోంది. ఎక్స్‌లెన్స్ అవార్డు ఫోటో ప్రేమును తన వెంట తీసుకెళ్లడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డ్ ఎంబ్లెమ్

కాని కొన్ని పుస్తకాలు తప్పితే ఆయన చెన్నయ్ నుంచి మరేమీ తీసుకుపోలేదు. చందమామ కోసం, చందమామ సీరియల్స్ కోసం, కథలకోసం జీవితాన్ని  అర్పించినందుకు గాను వచ్చిన అరుదైన అవార్డును కూడా ఆయన తనది కాదనుకుని ఒంటరిగా వెళ్లిపోయాడు. ఈ నిర్మమకారానికి, మూర్తిమత్వానికి మనం ఎలా వెలకట్టగలం చందమామలో దాసరి గారి జీవితానికి సంబంధించిన ఈ చిరస్మరణీయ సాక్ష్యాన్ని భద్రపర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ షాపు వారు ఈ అరుదైన ఫోటోను శాశ్వతంగా భద్రపర్చడానికి, భద్రపర్చగలవారికి ఇస్తే ఎంత బాగుంటుందో! ఇప్పుడే పరిచయం అయ్యారు కాబట్టి ఆ షాపువారిని కొన్నాళ్ల తర్వాత అయినా ఈ విషయమై ప్రస్తావించాలి. దాసరి రమణ గారు కోరుకుంటున్నట్లు ఆ ఫోటోయే గనుక ఇవ్వడానికి సిద్ధమయితే బాలసాహితి తరపున దీన్ని భద్రపర్చవచ్చు.

దాసరి గారికి ఇష్టమైన హోటళ్లు
దాసరి గారు వడపళనిలోని మురగన్ కోయిల్ స్ట్రీట్‌లో ఉన్న తన ఇంటి చుట్టుపక్కల ఉన్న రెండు మూడు హోటళ్లలో టిఫన్, భోజనం చేస్తూ వచ్చారు. 1970ల చివర్లో చందమామ కథకులు ఎంవీవీ సత్యనారాయణగారు తనను చెన్నయ్‌లో కలిసిన సందర్భంలో దాసరిగారు తన హోటల్ భోజనం గురించి ఇలా అన్నారట. ‘కుటుంబరావు గారిని కలవాలని వచ్చి ఎలాగూ కలవలేకపోయారు. పోతే పోయిందిలే. బాబ్బాబు, నా పేరు కాస్త గిన్నెస్ రికార్డు బుక్‌లో ఎక్కించవా! పాతికేళ్లకు పైగా చెన్నయ్‌లో నా బతుకు ఈ హోటల్ పాలయింది. పాతికేళ్లు ఒకే హోటల్లో తిండి. ఎవరికుంటుంది ఈ రికార్డు’ అని తనపైన తానే హాస్యమాడారు.

గణేష్ భవన్ - ఆర్కాట్ రోడ్

ఆ పాతికేళ్లకు తర్వాత మరో పాతికేళ్లు తోడయ్యాయి. ఆయన చెప్పిన హోటల్ బహుశా ఆర్కాట్  రోడ్డుపై ఉన్న గణేష్ భవన్ కావచ్చు. ఇరుకిరుకుగా లేకుండా ఖాళీ స్థలంలో విశాలంగా కనిపించే ఈ ఉడిపి హోటల్ దాసరి గారి అవసరాలకు చక్కగా సరిపోయి ఉండవచ్చు. నాయని కృష్టమూర్తిగారు రచన జూన్ 2010 సంచికలో రాసిన ‘చెట్టెక్కిన బేతాళుడు’ రచనలో చెప్పిన ప్రకారం ఆయన 80లకు ముందు మురుగన్ కోయిల్ ఎదురుగా ఆర్కాట్ రోడ్‌పై ఉన్న గణేష్ భవన్ హోటల్లో చాలాకాలం టీ, ఫలహారం తీసుకున్నారు. హిందూ పేపర్ తీసుకుని ఉదయం ఇక్కడికి వచ్చే ఆయన, దాదాపు గంటకుపైగా అక్కడే ఉండి టీ, సిగిరెట్లు తాగుతూ పేపర్ చదివేవారు. ఉడిపి హోటల్లో సిగిరెట్ వెలిగించే అవకాశం ఈయనకు మాత్రమే దక్కిందని నాయని కృష్ణమూర్తిగారి రచన వ్యాసం బట్టి తెలుస్తోంది. సరిగ్గా మధ్యతరగతి వారికి సరిపోయే సాంప్రదాయకమైన గణేష్ భవన్ ఈ నాటికీ సరసమైన ధరలకే మంచి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ముఖ్యంగా ఇక్కడి సాంబార్ రైస్, పాయసం అద్భుతం

హోటల్ శివప్రసాద్ - మురుగన్ కోయిల్

తర్వాతకాలంలో తన ఇంటికి దగ్గరగా, సుప్రసిద్ధ మురుగన్ దేవాలయం వీధి మొదట్లో ఉన్న హోటల్ శివప్రసాద్‌కి తరచుగా వెళ్లేవారట. ఇది ఆయన ఇంటికీ మరీ దగ్గరగా ఉంటుంది. దీనికి ఒక వైపున మురుగన్ కోయిల్, దానికి ఎదురుగా ఆర్కాట్ రోడ్డువైపు దారిలో మురుగన్ మెడికల్స్ షాపు ఉంటాయి. చెన్నయ్‌లో విశేషంగా పేరొందిన ఈ ఆలయం ముందు కొసలో ఉండే శివప్రసాద్ హోటల్ ఆలయానికి వచ్చి, వెళ్లే భక్తులతో సందడిగా ఉంటుంది.

హోటల్ శరవణ భవన్

ఆ తర్వాత 2000 దశకంలో ఆర్కాట్ రోడ్డు మీది శరవణ భవన్‌లో తరచుగా ఫలహారాలు తీసుకునే వారిని తెలుస్తోంది. 54 ఏళ్లుగా ఆయన  ఈ రెండు మూడు హోటళ్లనే ఉపయోగిస్తూ వచ్చారు. తన ఇంటినుంచి రోడ్డుపై ట్రాపిక్‌ను దాటుకుని వెళ్లడం వయసురీత్యా కష్టమనిపించినప్పుడు ఆయన రోడ్డుకి ఈవైపునే ఉండే శివప్రసాద్, శరవణ హోటళ్లకు మారారనిపిస్తుంది. 90 దశకం చివర్లో చెన్నయ్‌లో ప్రారంభమైన శరవణ గ్రూప్ హోటల్స్ నగరంలో మంచి భోజనానికి మారుపేరుగా నిలిచాయి. 2000సంవత్సరం తర్వాత దాసరి గారు చందమామ పూర్వ ఎడిటర్ బాల సుబ్రహ్మణ్యంగారితో తరచుగా శరవణ హోటల్ సందర్శించేవారని తెలుస్తోంది.

చందమామ కథల సెలెక్షన్‌ – దాసరి
అలాగే చందమామ రైటర్స్ ప్యామిలీగా పేరొందిన జొన్నలగడ్డ కుటుంబానికి చెందిన జొన్నలగడ్డ రత్న -నారాయణ స్వామిగారు, వసుంధర గారి సోదరులు- ఇటీవల చెన్నయ్‌లో కలిసినప్పుడు చెప్పిన వివరాలు ప్రకారం 1980 నుంచి 95 వరకు పదిహనేళ్ల పాటు దాసరి గారు ప్రతి వారాంతంలోనూ ఒక పూట లేదా ఒక రోజు బీసెంట్ నగర్‌లో ఉంటున్న ఆయన ఇంటికి క్రమం తప్పకుండా పోయేవారట. ఐడీబీఐ బ్యాంక్ ఛీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేసి రిటైరైన జొన్నలగడ్డ రత్నగారు దాసరి గారితో తన పరిచయం గురించి, ఆయనతో కథా చర్చల గురించి చాలా సమాచారం చెప్పారు. ఈయన ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

మంచి కథ కూడా చందమామలో ఒక్కోసారి సెలెక్టు కాకపోవడంపై దాసరి గారి ఆగ్రహం, పై వారికి -చందమామ అధికారిక సంపాదకులు- సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదంటూ విసుక్కోవడం, కథ రిజెక్టయినప్పుడు బాధపడవద్దని, చందమామలో కథ ప్రచురణకు తీసుకోనందుకు కథ లోపం కారణం కాదని, దాని వెనుక చాలా కారణాలు ఉంటున్నాయని -సహేతుక కారణాలు  కూడా- దాసరి గారు జొన్నలగడ్డ రత్నగారితో చెప్పేవారట. కథ తిరస్కరణకు గురయినప్పుడు దాసరిగారు రచయితలకు రిప్లై పంపేటప్పుడు స్వాంతన కలిగిస్తూ మీ కథ ప్రచురణకు తీసుకోనంత మాత్రాన కథ బాగా లేదనుకోవద్దని సర్దిచెప్పేవారట. కధల సెలెక్షన్‌కి సంబంధించి చందమామ అధికారిక సంపాదకుల తీరుపై కొడవటిగంటి కుటుంబరావుగారికి కూడా వ్యతిరేకత ఉండేదని విశ్వసనీయ సమాచారం. పత్రికలో కథల స్వీకరణ నిర్ణయాలకు సంబంధించి ఇది ప్రపంచంలో అప్పడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉండే సమస్యే కదా.

(చందమామ కథల సెలెక్షన్‌పై, దాసరి గారి స్పందనపై వివరణాత్మక సమాచారాన్ని ‘రచన’ పత్రిక 2011 జనవరి సంచికలో ఈయన సామాన్యుడు కాదు పేరిట దాసరి వెంకట రమణ గారు రాసిన ప్రత్యేక రచనలో చూడండి. నా దృష్టిలో ఇది చందమామ చరిత్రకు, దాసరి సుబ్రహ్మణ్యంగారి జీవిత చరిత్రకు సంబంధించి థీసెస్‌తో సమానమైన రచన.)

తీరిన రుణం
దాసరిగారిని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. 1970ల మొదటినుంచీ చందమామలో ఆయన సీరియల్స్‌తో పరిచయం అయినప్పటినుంచి, 2009 జనవరిలో నేను అదే చందమామలో తెలుగు విభాగంలో పనికి కుదిరిన తర్వాత కూడా ఆయన్ను చూడలేకపోయాను. చివరలో బాలుగారితో పాటు విజయవాడలో తనను కలవడానికి చాలా ప్రయత్నించి కూడా సాధ్యపడలేదు. ‘చెట్టంత మనిషి కళ్లముందు ఉన్నారులే’ అనే కాసింత ఏమరపాటు కూడా కారణం కావచ్చు. తీరా, ‘వయసుకు మించి బతికేస్తున్నానం’టూ తనను ఇంటర్వ్యూ చేసిన సిహెచ్. వేణుగారితో సరదాగా అన్న దాసరిగారు తర్వాత ఆరునెలలకే కాలం చేసినప్పుడు అందరికీ పిడుగుపాటే.

చందమామ చిత్రకారులు శంకర్ గారిపై వీడియో ఎలాగోలా విజయవర్ధన్ గారి తోడ్పాటుతో సేకరించగలిగాము. ఒక చిన్న వీడియో కెమెరా ఉండి విజయవాడకు పోగలిగి ఆయనను సజీవంగా చిత్రిక పట్టవలసిన అవసరం గురించి వేణు గారితో చర్చించినప్పటికీ కుదరలేదు. హ్యారీ పోటర్లు, అవతార్‌లు గురించి ప్రపంచానికి తెలియని రోజుల్లోనే లక్షలాది మంది పిల్లలను జానపద సీరియళ్ల మంత్రజగత్తులో ఓలలాడించిన ఈ అపరూప తెలుగు బాల కథా రచయితగురించి ఒక్కటంటే ఒక్క వీడియో చిత్రం కూడా తీయలేని బాధ ఇక అందరినీ వెంటాడుతూనే ఉంటుంది.

ఏమో.. నా జీవితంలో ఎన్నడూ చూడలేకపోయిన దాసరి సుబ్రహణ్యం గారి రుణాన్ని ఈవిధంగా తీర్చుకుంటున్నానేమో.!

నోట్
(చివరగా, దాసరి గారు చెన్నయ్‌లో నివసించిన ఇంటిని పట్టేశానంటూ నాలుగు నెలల క్రితమే చందమామ అభిమాని శ్రీ కప్పగంతు శివరాం ప్రసాద్ గారికి చెప్పినప్పుడు ఆయన వెనువెంటనే ప్రాధేయపడ్డారు. అది పాత భవంతి అంటున్నారు కనుక రాత్రికి రాత్రే దాన్ని కూల్చేసి కొత్త భవంతి నిర్మాణాలకు ప్లాన్ జరిగిపోవచ్చని, చలం గారు నివసించిన స్వంత ఇంటి ఫోటో విషయంలో కూడా ఇలా నిర్లక్ష్యం చేసినందువల్లే ఒక రోజు ఉన్నట్లుండి దాన్ని కూల్చేసి చరిత్రకే లేకుండా చేశారని శివరాం గారు బాధపడ్డారు.

అందుకే అప్పటినుంచి ఆయన పదే పదే మెయిల్స్ ద్వారా, ఫోన్ ద్వారా దాసరి గారి అద్దె ఇంటిని వీలైనంత త్వరగా ఫోటో తీయమని గుర్తు చేస్తూ వచ్చారు. మన జీవితాల్లో రియల్ ఎస్టేట్ ఒక పెద్ద భూతమని అది ఎప్పుడు ఏ కొంపను లేకుండా కూల్చి వేస్తుందోనని ఆయన భయం. శివరాంగారు హెచ్చరిస్తూ వస్తున్నప్పటికీ నా వద్ద ఉన్న డిజిటల్ కెమెరా లెన్స్ పాడవటంతో రిపేర్ చేయించడం కుదర్లేదు. కెమెరా రెడీ అయితే తర్వాత చూద్దామని తాత్సారం చేస్తూ వచ్చాను.

ఈలోగా దాసరి గారి మూడు పుస్తకాలను ప్రచురించే బాధ్యత తీసుకున్న రచన పత్రిక సంపాదకులు శ్రీ శాయిగారి చెవిన ఈ విషయం పడి, ఈ అంశంపై వ్యాసంతో పాటు ఫోటోలను కూడా పంపితే చాలా మంచిదని, మళ్లీ మళ్లీ వేయలేమని అరుదైన రికార్డుగా ఉంటుందని ఆయన సలహా ఇచ్చారు. ఇక తప్పనిసరై చందమామలో సిస్టమ్ అడ్మిన్ శశి వద్ద మొబైల్ తీసుకుని ఈ వారంలో పని కొంతవరకు పూర్తి చేయడం జరిగింది.

దాసరి గారు నివసించిన ఇంటి వివరాలు ఈ రూపంలో అయినా వెలుగులోకి వచ్చినందుకు కారణమైన శివరాం, శాయి గార్లకు మనఃపూర్వక కృతజ్ఞతలు. ఆ ఇంటి వివరాలు కావాలని చెప్పగానే దగ్గరుండి మరీ చూపించి, చుట్టుపక్కల కుటుంబాలను పరిచయం చేసిన చందమామ ప్యాకింగ్ విభాగం రవికి, మొబైల్ సాయం అందించిన శశికుమార్‌కి ఈ అన్ని ఫోటోలు తీయడంలో సహకరించిన చందమామ లే అవుట్ డిజైనర్ నరేంద్రకు, చివర్లో దాసరి గారి ఎక్సెలెన్స్ అవార్డు గురించి అరుదైన విశేషాలు తెలిపి దాని అరుదైన పోటో అందించిన మురుగన్ మెడికల్స్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.)

కె. రాజశేఖర రాజు.
చందమామ
………..

గమనిక
శాయిగారూ,
చెన్నయ్‌లో దాసరి గారి వ్యక్తిగత జీవితం, ఆయన నివసించిన ఇల్లు, సందర్శించిన హోటల్స్, వైద్యం కోసం ఉపయోగించిన మెడికల్ షాపు, చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు గురించి లభ్యమైన సమాచారం చాలా పెద్దదయినట్లుంది. రచన పేజీల కొలతకు సరిపోయేలా మీరు దీన్ని వీలైనంత మేరకు ఎడిట్ చేయగలరు.

మీ
రాజు….

తాజా సమాచారం.

దాసరి గారి ఎక్స్‌లెన్స్ అవార్డు ఒరిజనల్ స్కాన్

మురుగన్ మెడికల్స్ శ్రీనివాస్ గారి వద్ద ఉన్న, దాసరి సుబ్రహ్మణ్యం గారికి వచ్చిన ఎక్స్‌లెన్స్ అవార్డు చందమామ స్వయంగా ఫ్రేమ్ కట్టించి ఇచ్చిందే. దాసరి గారి కోరికమేరకు దీన్ని శ్రీకాకుళంలో కథానిలయానికి అందించవలసి ఉందని తెలుస్తోంది.. ఆయన అభిప్రాయానికి ఎనలేని విలువ కల్పిస్తూ డిసెంబర్ చివర్లో శ్రీనివాస్ వద్ద ఉన్న ఒరిజనల్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఫోటోను ఆయన అనుమతితో చందమామ ఆఫీసుకు తీసుకెళ్లి స్కాన్ తీయించి భద్రపర్చాము. దాని కాపీనే రచన సంపాదకులు శాయిగారికి, దాసరి వెంకటరమణ గారికి పంపాము. కనీసం కాస్తంత క్వాలిటీతో స్కాన్ అయిన ఈ కాపీ అయినా మనవద్ద ఉందని సంతృప్తి పడాలి.

24-01-2011
చెన్నయ్

Note: ఇక్కడ ఫోటోలు ప్రచురించడానికి ఇంట్లో కంప్యూటర్ సహకరించడం లేదు. రేపు ఆఫీసులో ఈ పని పూర్తి చేయగలను. అసౌకర్యానికి క్షమాపణలు. నా కాంతి సేన బ్లాగులో కూడా ఈవివరాలు చూడగలరు. ఇప్పటికే manateluguchandamama.blogspot.com లో శివరామప్రసాద్ గారు గత నెలలోనే ఫోటోలతో సహా ఈ కథనంలో కొంత భాగాన్ని ప్రచురించారు.

RTS Perm Link