‘అంబులిమామ’ వందిడ్చి.. రొంబ రొంబ నండ్రి రాజా….

January 14th, 2011

చందమామ తమిళ సంచిక ‘అంబులిమామ’ను ఎనిమిది పదుల ముదివయస్సులోనూ విడవకుండా చదివే మాన్య పాఠకులు కళానికేతన్ బాలు గారు -ఎస్. బాలసుబ్రహ్మణ్యన్-. కళానికేతన్ బాలు పేరుతో 50 ఏళ్లకు పైగా చందమామలో పోటో వ్యాఖ్యలకు క్రమం తప్పకుండా పోటోలు తీసి పంపిన ఫోటో ప్రదాతలు వీరు. గత 50 ఏళ్లుగా చందమామకు క్రమం తప్పకుండా చందమామకు ఫోటోలు పంపుతూ వచ్చిన వారిలో ఈయనా ఒకరు. రెండో వారు నారాయణ తాట గారు.

1950లలో చందమామ ఆఫీసును సందర్శించి, చక్రపాణిగారి పరిచయం తర్వాత ఆయనతో వ్యక్తిగత స్నేహాన్ని చివరివరకు సాగించారు. తొలి పరిచయం తర్వాత చక్రపాణి గారితో చక్కటి సాన్నిహిత్య సంబంధం ఏర్పడిందని ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకుని తిరిగేవారమని అలనాటి వెచ్చటి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు.

చక్రపాణిగారితో అనుబంధం ప్రభావంతో చందమామకు అనేక కథలు కూడా రాసి పంపారు. పలు తమిళ పత్రికలలో నేటికీ ఈయన కథలు, రచనలు పంపుతుంటారు. తాను కథకుడిగా మిగిలానంటే కారణం చక్రపాణి అని కృతజ్ఞత చెబుతుంటారు. ఫోటోలు, కథలు రూపంలో చందమామకు కంట్రిబ్యూషన్, అంబులిమామ పత్రిక నెలవారీగా అందడం తనకు జీవితంలో అత్యంత సంతోషకర క్షణాలుగా చెబుతుంటారీయన.

కానీ, ఇటీవలికాలంలో ఈయనకు ఒక సమస్య పీడిస్తోంది. చందమామలు సకాలంలో అందకపోవడం అటుంచి అస్సలు అందకుండా కూడా పోవడంతో బాగా ఇబ్బంది పడుతున్నారు. లేటుగా వచ్చినా సరే ఈయనకు అంబులిమామ తప్పకుండా కావాలి. అంబులిమామ చదవడం జీవితం చివర్లో కూడా ఓ చక్కటి వ్యసనంగా మార్చుకున్న మాన్యులలో ఈయనా ఒకరు.

అందుకే చందమామ తనకు అందకుండా పోయిన ప్రతిసారీ స్వయంగా పోన్ చేసి మరీ అడుగుతుంటారు “అంబులిమామ మిస్ ఆయిడ్చి.. ఒరు అంబులి మామ కొడింగే రాజా” -చందమామ రాలేదు. ఒక కాపీ ఇవ్వవా- రెండు మూడు సార్లు ఇలా జరగేసరికి ఇక కుదరదని ఆయనకు చెన్నయ్‌లో ఉంటున్నప్పటికీ కొరియర్‌లో పంపవలసి వచ్చింది. దాదాపు ఆరునెలలుగా ఇదే తంతు. దీన్ని బట్టి చూస్తే రెండో సారి కూడా తప్పిపోయిన కాపీని బుక్ పోస్ట్‌లో పంపితే  చెన్నయ్‌లో కూడా అది అందలేదని స్పష్టమవుతోంది.

ఈసారి కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంబులిమామ కాపీలు ఆయనకు అందలేదు. రెండో దఫా అక్టోబర్, నవంబర్ కాపీలు బుక్ పోస్ట్‌లో పంపితే అవీ అందలేదు. గతవారం ఆయన మళ్లీ ఫోన్ చేశారు. వెంటనే ఆయనకు మూడు నెలల సంచికలు కొరియర్‌లో పంపాము. రెండు రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఇప్పుడే అందాయని థాంక్స్ చెప్పారు.

82 ఏళ్ల వయసులో ఫిజియోథెరపీ చేయించుకుంటూ బెడ్ మీద ఉన్నానని, మూడు అంబులిమామలు ఇప్పుడు చదువుతున్నానని చెబుతున్నప్పుడు ఆయన గొంతులో తడి. చందమామతో అయిదు దశాబ్దాలు జీవితం పంచుకున్న వెచ్చటి జ్ఞాపకాలు. ప్రతినెలా అంబులిమామ అందితే చాలు అదే పెద్ద ఆనందం అంటూ సంతోషం ప్రకటించే ఆయన స్వరంలో చందమామ పట్ల దశాబ్దాల అనుకంపన.

ఇలాంటి కదిలించే ఘటనలు అనుభవానికి వచ్చిన ప్రతిసారీ మాకు చందమామ కార్యాలయంలో విషాదానందాలు ఎదురవుతుంటాయి. ప్రీతిగా చందమామలు చదివేవారికి, చదువుతున్న వారికి అవి నెలవారీగా అందడంలేదు. చాలా మందికీ ఇదే అనుభవం అనుకుంటాను. మా ప్రయత్నలోపం ఏదీ లేకున్నా, సకాలంలో చందమామను కోరుకుంటున్నవారికి అది అందకపోవడం, లేటు కావడం, కాపీయే మిస్ కావడం. ఇలా చందమామకు సంబంధించి జరగకూడనివే జరుగుతున్నాయి.

చందమామ హిందీ కాపీని భారత మాజీ ప్రధాని, ప్రస్తుతం పూర్తిగా శయ్యమీదే ఉన్న అతల్ బిహారీ వాజ్‌పేయ్ గారికీ పంపిస్తున్నారు. ఆయన హిందీ చందమామను చదువుతున్నారో, చదవగలిగిన స్థితిలో ఉన్నారో లేదో తెలీదు. కాని కళానికేతన్ బాలు గారి వంటివారు ఈనాటికీ చందమామను చదువుతున్నారు. చందమామ క్రమం తప్పకుండా అందితే చాలు పరమామనందం ప్రకటించేవారు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టే పత్రిక మనగలుగుతోంది.

దశాబ్దాల క్రితమే చందమామలో ఒక అద్భుతమైన కథ వచ్చింది. కథ పేరు ‘ఆకాశానికి’ గుంజలు అనుకుంటాను. ఆకాశానికి గుంజలు లేవు అయినా అది కింద పడకుండా ఎలా ఉంటోంది అని భయపడిపోయిన వ్యక్తి ఇంట్లోంచి, ఊర్లోంచి పారిపోతూ చివరిగా ఒక ముని ద్వారా ఆకాశానికి గుంజలు ఏవి అనే సత్యం స్వీయానుభవంతో తెలుసుకుంటాడు. అద్భుతమైన కథ. దశాబ్దాల తర్వాత కూడా గుర్తు వచ్చే కథ.

చందమామకు కూడా గుంజల వంటి వారు ఉన్నారు. కళానికేతన్ బాలు గారు, 1947 నుంచి ఈనాటి దాకా చందమామను క్రమం తప్పకుండా చదువుతూ భద్రపరుస్తూ వస్తున్న టార్జాన్ రాజు -హైదరాబాద్- గారు, చందమామలో వస్తున్న ప్రతి చిన్న మార్పును నిశితంగా గమనిస్తూ 80 ఏళ్ల వయస్సులో కూడా తన సమ్మతిని, అసమ్మతిని ఆప్యాయంగా తెలియజేసే బి.రాజేశ్వరమూర్తి -చిలకలపూడి, బందరు- గారు, సురేఖ -మట్టెగుంట అప్పారావు- గారు, ఇలాంటి జ్ఞాన వృద్ధులతో పాటు ఆలస్యంగా వచ్చినా, కోరుకున్న ప్రమాణాలతో రాకున్నా శపిస్తూ కూడా చందమామ వస్తే చాలు హృదయానికి హత్తుకుంటున్న వేలాది మంది పాఠకులు, పెద్దలు, పిల్లలు వీరే చందమామకు నిజమైన గుంజలు.

ఈ గుంజలే, నిజమైన ఈ ఆధారాలే లేకపోతే చందమామ ఇంతటి విపత్కర స్థితిలోనూ ఈ రూపంలో అయినా వచ్చేది కాదు. నిజం చెప్పాలంటే ఇలాంటి వారి ప్రశంస, విమర్శ, సమ్మతి, అసమ్మతితో కూడిన మార్గదర్శనంతోటే చందమామ నిజంగా బతుకుతోంది.

కథలు తప్పితే ఇతర వినోద సాధనాలు లేని కాలాన్ని దాటుకుని సమాజం శరవేగంగా ఎదుగుతున్నప్పటికీ, సినిమాలు, క్రీడలు, కార్టూన్ ఛానెళ్లూ పసిమనస్సుల మానసిక ప్రపంచాన్ని ఆక్రమిస్తూ, చదివే ప్రక్రియ సమాజంలో తగ్గిపోతున్నప్పటికీ ఇలాంటే గుంజలే, ఆధార స్తంభాలే తెలుగు కథను బతికిస్తున్నారు. చందమామకు ప్రాణం పోస్తున్నారు. మన పాఠ్యపుస్తకాలు, మన బళ్లు, మన సిలబస్, మనిషి పురోగతికి మనం ఇస్తున్న దరిద్రపు నిర్వచనం వంటివి ఇలా కొనసాగినంతకాలం చందమామకూ ఢోకాలేదు. కథల పత్రికలకూ ఢోకాలేదు.

కావలిసిందల్లా పుస్తకాలు చదివే అలవాటును పిల్లలకు అదించగలిగే మనసున్న మారాజులు మాత్రమే. కనీసం సెలవు రోజుల్లో అయినా పిల్లలను కూర్చోబెట్టుకుని కాసిన్ని పాఠ్యేతర పుస్తకాలు, కథలు చదివించ గల తల్లిదండ్రులు, బళ్లలో బండ చదువుతో పాటు కాస్తంత సాహిత్య సంస్కారాన్ని పిల్లలకు అందించగలిగిన ఉపాధ్యాయులు. ఇలాంటి గుంజలు అక్కడక్కడా ఉన్నా చాలు చదివే అలవాటు తరంనుంచి తరానికి నెమ్మదిగానే అయినా చేరుతూంటుంది.

ఈ స్పీడ్ యుగంలో మనుషుల అలవాట్లు కూడా శరవేగంగా మారిపోతున్న వేగ జీవితంలో చందమామను చదివే అలవాటును పాఠకులు, అభిమానులు దశాబ్దాల తర్వాత కూడా మానటం లేదు. ఈ అందరి మూర్తిమత్వాన్ని ప్రతిబింబించే కళానికేతన్ బాలు -ఎస్ బాలసుబ్రహ్మణ్యన్- గారి ఆనంద క్షణాలలో పాలు పంచుకుంటూ..

చందమామ గుంజలందరికీ…

మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

RTS Perm Link