జానపద కథా వైశంపాయనుడు దాసరి పుస్తకావిష్కరణ

January 30th, 2011

హైదరాబాద్‌ సిటీ సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో జనవరి 27 సాయంత్రం జరిగిన  దాసరి సుబ్రహ్మణ్యం గారి 3 పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతానికి ఇక్కడ చూడగలరు.  సాధారణ పాఠకుల కంటే కథకులు, రచయితలు, ప్రచురణకర్తలే అధికంగా పాల్గొన్న ఈ సభలో, చందమామ సీరియల్స్  రచయిత, జానపద కథా వైశంపాయనుడు దాసరి గారు నాలుగు దశాబ్దాల క్రితం బొమ్మరిల్లు, యువ మాసపత్రికలలో రాసిన  రెండు అపరూప సీరియల్స్‌ని, ఆయన రాసిన 40 ఇతర కథలను కలిపి మూడు పుస్తకాలుగా వాహినీ బుక్ ట్రస్ట్ ప్రచురించింది.

ఎవరు లేకుంటే నేటి తరం పాఠకులకు కూడా అలనాటి జానపద సీరియల్స్ చదివే అవకాశం, చందమామ వైభవోజ్వల చరిత్రను తెలుసుకునే అవకాశం ఉండేది కాదో ఆ మంచి మనిషి రచన పత్రిక సంపాదకులు శ్రీ శాయిగారు,  ఆయనకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ బృహత్ యజ్ఞంలో తనదైన పాత్ర వహిస్తున్న శ్రీ దాసరి వెంకటరమణ గారు పది మంది మాట, చేత సాయంతో తీసుకువచ్చిన అరుదైన పుస్తకాలివి.

ప్రపంచం ఇంతగా ఎదగని మంచి కాలంలో విలసిల్లిన మన కథా సాంస్కృతిక వైభవాన్ని మళ్లీ మనముందు ఆవిష్కరించడానికి వీరు చేసిన ప్రయత్నాలు, ఉడతాభక్తిగా ఈ గొప్ప కృషిలో తలొక పాలు పంచుకున్న మాన్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనలు.

ఈ పుస్తకావిష్కరణ ఫోటోలను చూడటానికి ముందు చందమామ అభిమాని, మనసులో మాటలు పదిమందితో పంచుకునే సుజాత గారు హృద్యంగా తెలిపిన ఈ సభ విశేషాలను క్లుప్తంగా కింది లింకులో చూడగలరు.

వచ్చేశాయి…అద్భుత జానపద నవలలు !

http://manishi-manasulomaata.blogspot.com/2011/01/blog-post_28.html

ఒకే ఒక్క మాట. ఈ పుస్తకాలను కొని చదవకపోతే, మన పిల్లలకు, ముందుతరాల వారికి చెప్పి, చూపి చదివించకపోతే మన ఒకనాటి కథా సంస్కృతికి దూరంగా ఉన్నట్లే. తెలుగు జనపదాలలో పుట్టి పెరిగిన కథ విశ్వరూపాన్ని మనం దాసరి గారి ఈ రెండు సీరియల్స్ -మృత్యులోయ,  అగ్నిమాల- లో సమగ్రంగా దర్శించగలం.

మృత్యులోయ – బొమ్మరిల్లు పత్రికలో 39 నెలల పాటు వచ్చిన పెద్ద సీరియల్

అగ్నిమాల – చక్రపాణి గారి కోరిక మేరకు దాసరి సుబ్రహ్మణ్యం గారు యువ మాసపత్రికలో రాసిన     మహోజ్వల జానపద నవల

దాసరి సుబ్రహ్మణ్యం కథలు – విలక్షణ కథాంశాలు, అసాధారణ శిల్పం, సజీవమైన పాత్రల మేలుకలయికతో జీవితపు పలు పార్శ్వాల్ని తడిమి మనసులను చెమ్మగిల్లజేసే ఆధునిక కథలు

ఈ మూడు పుస్తకాల వెల రూ. 360 మాత్రమే.  ప్రజల కొనుగోలు శక్తి కునారిల్లుతున్న పాడుకాలంలో ఇంత వెలపెట్టి పుస్తకాలు కొనే శక్తి మనలో చాలామందికి లేకపోవచ్చు.

కాని లాభాపేక్ష అనేది లేశమాత్రంగా కూడా లేని శాయి గారు పది కాలాల పాటు మళ్లీ మళ్లీ ఇలాంటి అరుదైన పుస్తకాలను మనకు అందించాలంటే మనం పుస్తకాలను తప్పక తీసుకోవలసిందే. ఇంతకు మించి ఒక్క మాట అదనంగా చెప్పినా ఇక అతిశయోక్తిగానే ఉంటుంది. ఈ పుస్తకం ప్రచురణ ఖర్చులయినా వస్తే దాసరి గారి మరి కొన్ని సీరియల్స్‌ ప్రచురణ భారాన్ని తలకెత్తుకుంటానని శాయిగారు సభలోనే చెప్పారు కూడా.

దయచేసి ఈ పుస్తకాలను కొనండి. మంచి ప్రయత్నాన్ని ఆదరించండి.

ఈ మూడు పుస్తకాలూ దొరకు చోటు

వాహినీ బుక్ ట్రస్ట్,
1-9-286/పి/2విద్యా నగర్
హైదరాబాదు

ఫోన్ :040-27071500

మొబైల్: 09948577517 (‘రచన’ శాయి గారి సెల్‌ఫోన్)

వీలైనంత త్వరలో ఈ ఆవిష్కరణ సభ గురించి మరికొన్ని వివరాలను ఇక్కడే తెలుసుకుందాము.

ఇక సభలో తీసిన కొన్ని పోటోలను అందినమేరకు ఇక్కడ చూద్దాం.

దాసరి సుబ్రహ్మణ్యం గారు

బొమ్మరిల్లు సీరియల్

మృత్యులోయ వెనుకపేజీ

మృత్యులోయ ఇన్నర్ కవర్

మృత్యులోయ ఇన్నర్ కవర్

అగ్నిమాల - యువ సీరియల్

అగ్నిమాల వెనుకపేజీ

దాసరి కథలు కవర్ పేజీ

ఆవిష్కరణ సభలో దాసరి గారి రచనల ప్రదర్శన

భాగ్యనగరి సిటీ సెంట్రల్ లైబ్రరీ హాల్‌లో గోడ బొమ్మలు

శ్రీ విజయబాపినీడు, శ్రీ దాసరి వెంకటరమణ, శ్రీ సురేష్ - మంచిపుస్తకం ఫేమ్

శ్రీ దాసరి వెంకట రమణ

చందమామ ఫ్యామిలీ

సభకు విచ్చేసిన వారిలో కొందరు మాన్యులు

దాసరి గారి మూడు పుస్తకాల గురించి ఇక ఏమీ చెప్పనవసరం లేదు. ప్లీజ్… కొని చదవండి. మీ పిల్లలచేత చదివించండి.  వాళ్లకు  చదివే సమయం అంటూ ఉంటే…..

(దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్థంతి మరియు పుస్తకావిష్కరణకు చెందిన ఫోటోలు, పుస్తకాల కవర్ పేజీ బొమ్మలు సకాలంలో పంపిన రచన శాయి గారికి, దాసరి వెంకట రమణ గారికి కృతజ్ఞతలు)

రాజు

చందమామ

RTS Perm Link

దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రధమ వర్ధంతి

January 25th, 2011

ఆహ్వానం

ఇతడనేక యుద్ధముల నారితేరిన వృద్ధమూర్తి

తన రచనలతో
తెలుగు పిల్లల్ని అలౌకిక లోకాలకు లాక్కెళ్ళి
వారి మదిలో
వెలుగు పువ్వులు పూయించి
తెలుగువాడి బాల్యానికి
అవ్యక్త… అనిర్వచనీయ….. కొస మెరుపు రంగులద్ది
జీవితాంతం…..
మరవలేని మధుర జ్ఞాపకాలుగా  మలచిన
అధ్బుత రస పిపాసి
అజ్ఞాత రచయిత
జానపద కథా వైశంపాయనుడు
దాసరి సుబ్రహ్మణ్యం గారి
ప్రధమ వర్ధంతికి
బాల సాహిత్య పరిషత్తు మీకు ఆహ్వానం పలుకుతోంది. .
వేదిక: హైదరాబాదు చిక్కడపల్లి లోని సిటి సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరం
సమయం : తేదీ 27-01-2011 న సా. 6 గం. లకు

బాల్యంలో చందమామ స్మృతులున్న ప్రతి ఒక్కరు తప్పక  హాజరు కావలసిన సభ .

ఈ సభకు మీరు వచ్చినట్లయితే మీకు ముచ్చటగా మూడు లాభాలు

ఒకటి: దాసరి సుబ్రహ్మణ్యం గారి మూడు పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవాన్ని వీక్షించవచ్చు.

రెండు: అనేక మంది దాసు అభిమానులను, చందమామ అభిమానులను కలుసుకోవచ్చు.

మూడు: అరుదైన దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనల ప్రదర్శనను తిలకించవచ్చు.

మరికొంత సమాచారం కోసం వేణువు (venuvu.blogspot.com) నొక్కండి.

ఆహ్వాన పత్రం కోసం అటాచ్మెంట్ చూడండి.

గమనిక: ఈ సభలో ఊక దంపుడు ఉపన్యాసాలుండవు.


దాసరి వెంకటరమణ
ప్రధాన కార్యదర్శి
బాల సాహిత్య పరిషత్తు
5-5-13/P4, Beside Sushma Theatre,
Vanasthalipuram, HYDERABAD – 500070.
04024027411. Cell: 9000572573.
email: dasarivramana@gmail.com

(మనిషన్నాక సవాలక్ష సమస్యలు… ఊపిరి తీసుకోనివ్వని వృత్తి జీవితం… ఉద్యోగ, కౌటుంబిక ఒత్తిళ్లు. ఎవరయినా వీటిని అర్థం చేసుకోవలసిందే.. అయితే, ఈ నెల  27న అంటే ఈ గురువారం సాయంత్రం హైదరాబాద్ చిక్కడపల్లి లోని సిటి సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో సాయంత్రం 6 గం.లకు జరిగే మన దాసరి గారి ప్రధమ వర్థంతికి ఏమాత్రం వీలున్నా, చందమామ అభిమానులు, పాఠకులు, పెద్దలు, పిల్లలు హాజరు కావలసిందిగా మనవి.

తెలుగు కథ మహత్తును యావద్భారతావనికి రుచిచూపిన జానపద కథా మాంత్రికుడు మన దాసరి సుబ్ర్హహ్మణ్యం గారి చిర జ్ఞాపకం కోసం మనం హాజరవుదాం. మూడు లేక నాలుగు తరాల పెద్దలు, పిల్లలం అందరం ఈ అరుదైన సమావేశంలో కలుసుకుని పలకరించుకుందాం. దాసరి గారిని తలుచుకుందాం. దాసరి వెంకటరమణ గారు చెప్పినట్లు ఈ సభలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఉండవు కనుక అందుకోసమయినా మనందరం కలుసుకుందాము. ఒక మహనీయమూర్తిని మన జ్ఞాపకాల్లో భద్రపర్చుకోవడానికయినా 27 సాయంత్రం మనం ఏమాత్రం వీలున్నా, తప్పక కలుసుకుందాం.)

RTS Perm Link

దాసరి సుబ్రహ్మణ్యంగారి అరుదైన జీవిత రికార్డు

January 24th, 2011

54 ఏళ్లు ఇక్కడే ఉన్నారు.

చందమామ సీరియల్స్ ద్వారా అయిదారు దశాబ్దాలుగా లక్షలాది పాఠకులను ఉర్రూతలూగిస్తూ వచ్చిన మాన్యులు దాసరి సుబ్రహ్మణ్యం గారి వ్యక్తిగత జీవితం కూడా పరమ సాధారణ స్థితిలో దాదాపు అజ్ఞాతంగా ఎటువంటి పటాటోపాలు లేకుండా కొనసాగింది. 1952 నుండి 2006 వరకు 54 ఏళ్లపాటు అనితర సాధ్యమైన విధంగా చందమామలో పనిచేసిన దాసరి గారు చివరకు వ్యక్తిగత జీవితాన్ని కూడా సుదీర్ఘకాలం పాటు ఒకే అద్దె ఇంటిలో గడపడం చారిత్రక విశేషం. ఇలా వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఒకే స్థలంలో అయిదు దశాబ్దాలపైబడి కొనసాగించడం బహుశా ప్రపంచంలో ఎవరికీ సాధ్యమయ్యే పని కాకపోవచ్చు. వృత్తి జీవితంలో చందమామ చిత్రమాంత్రికుడు శంకర్ గారు మాత్రమే ఇందుకు సంబంధించి మినహాయింపుగా ఉంటారు. ఈయన కూడా 1952 చివరినుంచి ఈ నాటి వరకు అంటే దాదాపు 58 ఏళ్లపాటు చందమామలోనే పనిచేస్తున్నారు. కాని నివాసం విషయంలో చాలా స్థలాలు మారారు.

జానపద కథా మాంత్రికుడు

చందమామలో 1952 నుంచి 1980 దాకా నిరవధికంగా జగత్ప్రసిద్ధమైన 12 సీరియల్స్ -తోకచుక్క, రాతిరథం, జ్వాలాద్వీపం, పాతాళదుర్గం, మకరదేవత, శిథిలాలయం, రాకాసిలోయ, భల్లూకమాంత్రికుడు వంటివి- రాసి చందమామ సర్క్యులేషన్‌‍ని అమాంతంగా పెంచిన ఘనత దాసరి గారి సొంతం.  అయితే ఆయన రాసిన జానపద ధారావాహికల మంత్రజగత్తులో ఉర్రూతలూగిన లక్షలాది మంది పాఠకులలో నూటికి 99 మందికి, చివరకు చందమామ రచయితలకు కూడా చందమామ సీరియల్స్ రచయిత ఎవరో ఇటీవలివరకు తెలియదంటే నమ్మశక్యం కాదు. చందమామ పత్రిక తన ఉద్యోగుల వ్యక్తిగత, వృత్తిగత జీవితంపై విధించిన అలిఖిత అజ్ఞాతవాసం అంత పటిష్టంగా కొనసాగింది మరి.

దాసరిగారి అద్దె ఇంటి నడవా

ఆయన ఆనారోగ్యంతో 2006లో విజయవాడలో బంధువుల ఇంటికి వెళ్లినప్పటికీ, 2009 వరకు పాఠకులు ఆయన పేరుతోటే ఉత్తరాలు, రచనలు పంపుతూ వచ్చిన ఉదంతమే ఇందుకు తిరుగులేని సాక్ష్యం. చివరకు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన అయిదు దశాబ్దాలకు పైగా ఒకే ఇంటిలో నివసించిన విషయం ఇటీవల వరకు ఎవరికీ తెలీదు. గత 54 ఏళ్లుగా ఎలాంటి మరమ్మతులు లేని స్థితిలో,  చెన్నయ్ మహానగరంలో,  ‘భూతాల’ నిలయం వంటి పురాతన భవనంలోని ఒక ఇరుకైన గదిలో ఆయన జీవించారు. భూతాల నిలయం అనే పదం ఇక్కడ ప్రతీకగా వాడవచ్చు కాని, ఆ భవంతిలో ఈనాటికీ దాసరి గారితో దశాబ్దాల అనుబంధాన్ని పెంచుకుంటూ వచ్చిన సాధారణ మనుషులు జీవిస్తున్నారు.

ఈ 7వ నంబర్ ఇల్లే ఆయన జానపద నివాసం

చెన్నయ్‌లోని వడపళనిలో పాత చందమామ భవంతికి కూతవేటు దూరంలోని సుప్రసిద్ధమైన మురుగన్ కోయిల్ స్ట్రీట్‌లో కిందా పైనా 12 గదులు ఉన్న ఒక పాడుబడిన అపార్ట్‌మెంట్‌లో 7వ నంబర్ గదిలో దాసరి గారు దశాబ్దాలుగా అద్దెకు ఉంటూ వచ్చారు. విజయ వాహినీ స్టూడియోలోని పాత చందమామ భవంతి ఇప్పుడు లేదు. చందమామ వైభవోజ్వల శకానికి సాక్షీభూతంగా నిలిచి అయిదెకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన చందమామ భవంతి ఇప్పుడు చరిత్రలో కలిసిపోయింది. అక్కడినుంచి చందమామ కార్యాలయం చెన్నయ్ లోని ఈక్కాండి తాంగల్ -గిండీ-, జెఎల్ ప్లాజా -తేనాంపేట-, చిన్న నీలాంగరై -తిరువాన్మయూర్ అవతల- ప్రాంతాలకు వలసపోయింది.

దాసరి గారి ఇంటికి ఎడమవైపున చందమామ కార్యాలయ భవంతి

భూమి గుండ్రంగా ఉన్న చందాన 2010 మేలో చందమామ పాతభవంతికి సమీప ప్రాంతానికే చందమామ ఎడిటోరియల్ ఆఫీసు మళ్లీ వచ్చి చేరింది. చిత్రమో, యాదృచ్ఛికమో గాని దాసరి గారు 54 ఏళ్లపాటు నివసించిన ఆ పాత ఇంటికి సరిగ్గా వెనుకవైపు భవంతి -స్వాతి ఎన్‌క్లేవ్ 5-6 నంబర్లు-లోనే ప్రస్తుతం చందమామ కార్యాలయం ఉంది. దాసరి గారు వడపళని ప్రాంతంలోనే ఉండేవారని చూచాయగా తెలుసు కాని నిర్దిష్టంగా ఎక్కడ ఉండేదీ అంతవరకు నాకు తెలీదు.

మురుగన్ కోయిల్ స్ట్రీట్‌లో స్వాతి ఎన్‌క్లేవ్ భవంతిలోకి -2A- వచ్చి చేరిన మూడు నెలలకు చందమామలో ప్యాకింగ్ విభాగంలో పనిచేస్తున్న రవి ఒక రోజు ఆఫీసు బయట పిచ్చాపాటిగా మాట్లాడుతూ ‘తాతా సర్ మొదటినుంచి ఉంటూవచ్చిన ఇల్లు ఇదే సార్’ అని చూపించారు. దాసరి గారిని చందమామ సిబ్బంది మొదటి నుంచి ‘తాతా సర్’ అని పిలుస్తూ వచ్చారు. సరిగ్గా దాసరి గారి ఇంటి వెనుకవైపు చందమామ ఆఫీసు ఉంది. నాకయితే రవి ఈ విషయం చెప్పాక షాక్ అయింది. ‘ఏమిటి ఇంత పాడుబడిన భవంతి’ అని చాలా సార్లు అనుకున్నాను గాని, ఆయన దశాబ్దాలుగా గడిపిన ఇంటిపక్కకు మేం వచ్చామని సూచన ప్రాయంగా కూడా తట్టలేదు.

అరుదైన చరిత్రకు నిలయంగా మారిన ఆ ఇంటిని పోటోలు తీయాలని, ఇంటిముందుకు వెళ్లి ఆయన వివరాలు తెలుసుకోవాలని అనుకున్నా అది ఆచరణలో సాధ్యపడేందుకు మరో మూడునెలలు పట్టింది. ఈ శుక్రవారం -17-12-2010- సాయంత్రం చందమామ కొల్లీగ్ వద్ద 3 మెగా పిక్సెల్ మొబైల్ తీసుకుని రవి సాయంతో ఆ ఇంటికి వెళ్లాము.

దాసరి గారు – చెన్నయ్ అద్దె ఇల్లు
రచన జూన్ సంచికలో ‘చెట్టెక్కిన బేతాళుడు’ పేరుతో నాయుని కృష్ణమూర్తిగారు, దాసరి గారితో, ఆయన అద్దె ఇంటితో తన పరిచయాన్ని సమగ్రంగా వివరించారు. ఆయన 1974లో బొమ్మరిల్లు పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న కాలంలో ఓ రోజు సంపాదకులు విజయబాపినీడు గారు చెన్నయ్‌లో ఒక పెద్దాయనను కలిసి ఆయన ఇచ్చే కొన్ని కాగితాలు తీసుకురావాలని చెప్పారు. (చందమామలో పనిచేస్తున్నప్పుడు, కొత్తగా ప్రారంభించబడిన బొమ్మరిల్లుకు ప్రోత్సాహం అందించాలన్న ఆలోచనతో దాసరి గారు ‘మృత్యులోయ’ జానపద సీరియల్‌ని ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో రాసి బాపినీడుగారికి పంపేవారు.)  ఆ ప్రకారం ఆ చిరునామాకు వెళ్లిన నాయుని గారు దాసరి గారిని కలిసిన ఆ ప్రథమ సమావేశపు సన్నివేశాన్ని ఇలా వర్ణించారు. విషయ విస్తరణ రీత్యా రచన జూన్ సంచికలో వచ్చిన ఈ భాగాన్ని కుదించి ఇక్కడ పొందుపర్చడమైంది.

వడపళనిలో మురుగన్ కోయిల్ ఉంది. అది తెలీని మద్రాసీయులు ఎవరూ ఉండరు. గుడికి డెబ్బై, ఎనభై మీటర్ల ముందు ఒక అడ్డరోడ్డు ఉండేది. అది చందమామ బిల్డింగు -విజయావారి పాత బిల్డింగ్- కు వెళ్లే వైపు కుడిపక్కన ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు ముందు బారుగా లోపలికి చిన్న చిన్న ఇళ్లు పదో, పన్నెండో ఉంటాయి. వీటిల్లో నేను వెళ్లవలసిన ఇంటికి సాయంకాలం ఏడున్నరకు వెళ్లాను -7వ నెంబర్ ఇల్లు- తాళం వేసుంది మళ్లీ రోడ్డు మీదికి వెళ్లి నిలబడ్డాను.

ఎనిమిదన్నర తర్వాత గుడి ఎదురు రోడ్డు క్రాస్ మీదనుండి వస్తున్న ఒకతను కనిపించాడు. ఏదో ఆలోచిస్తూ, అప్పుడప్పుడూ, తల పక్కకు తిప్పి చూస్తూ, ఆగి ఆగి సిగిరెట్టు కాలుస్తూ వస్తున్న వ్యక్తి. ఆయన నాకేసి చూసినప్పుడు ‘సుబ్రహ్మణ్యం గారికోసమండీ ఆ యింట్లో ఉంటారు’ అంటూ మధ్యలో కొన్ని ఇళ్లవైపు చేయి చూపిస్తూ అన్నాను. ‘ఎక్కణ్ణుంచి వస్తున్నారు’ అనడిగితే విజయబాపినీడు గారు పంపారని చెప్పాను. ‘రండి’ అని ఆయన ముందుకు దారితీసి తన గది ముందు ఆగి జేబులోంచి తాళంచెవి తీసి తలుపులు తెరిచారు. ‘ఉండండి,’ అంటూ చీకట్లో తనొక్కడే లోపలికి వెళ్లి ఏదో స్విచ్ నొక్కాడు. ముందు గదిలో వెలుగులు పరుచుకున్నాయి.

దాన్ని గది అనొచ్చునా, అనకూడదా అన్న మీమాంస క్షణంలో ఏర్పడింది. బాగా పొడవైన అగ్గిపెట్టె అడ్డంగా పెట్టినట్లు ఉంది ఆ గది. వెడల్పు అయిదడుగులకు మించి ఉండదు. పొడవు 12-15 అడుగుల మధ్య ఉండొచ్చు. కుడి వైపు  మూడడుగుల వెడల్పుతో లోపలికి ఒక దోవ ఉంది. ఆ మధ్యలోనే ఎడం వైపు ఒక గది ఉన్నట్లు తలుపులు వేసి ఉన్నాయి. బాగా వెనుకవైపు పెరడు అని చూస్తూనే తెలిసి పోతోంది. ముందు అయిదడుగుల వెడల్పు గదిలోనే బుక్ షెల్వ్స్ ఉన్నాయి. ఆయన కూర్చోవడానికి ఒక కుర్చీ ఉంది. ముందు తలుపుకు దగ్గరగా, లోపలకు వెళ్లే సందు ముందు వచ్చిన వాళ్లు కూర్చోవడానికి ఒక కుర్చీ, ఒక స్టూలు ఉన్నాయి.”

దాదాపు 35 ఏళ్ల క్రితం తాను చూసిన దాసరిగారి అద్దె ఇంటిని పొల్లుపోనంత నిర్దిష్టంగా వర్ణించిన నాయుని గారి జ్ఞాపకశక్తికి ఈ సందర్భంగా అందరం జేజేలు పలకాలి. ఆ ఇల్లూ, పరిసరాలూ ఈనాటికీ దాదాపు అలాగే ఉన్నాయి. వడపళని క్రాస్‌కి సమీపంగా నూరడుగుల రోడ్డులో -బీమాస్ హోటల్ వద్ద కలిసే- ఆ అడ్డరోడ్డు మాత్రమే కాస్త మెరుగయి ఉండవచ్చు.

నాయుని గారు ఆ కథనంలో వర్ణించిన తీరుకంటే మరింత ఘోరంగా ఆ ఇల్లు ఉందనిపించింది. అరవై, డెబ్బై ఏళ్లక్రితం కట్టిన ఆ భవంతిలో వర్షం వచ్చిందంటే చాలు, ముంగిట్లో నీరు వరద కడుతుంది. చెన్నయ్ లోని చాలా పాత ఇళ్లలో ఇదే పరిస్థితి. ఇంటి మట్టం కంటే రోడ్డు మట్టమే ఎత్తులో ఉన్న స్థితిలో కాస్త వర్షం పడిందంటే ఇంట్లోకి వెళ్లే దారిలో మడమలపైకి నీరు చేరుతుంది. ఈ నీళ్లు ఎటూ పోలేక నిలవ ఉండిపోయి భయంకరమైన వాసన వేస్తుంటుంది. ఆ నీళ్లలోనే కాళ్లు తడుపుతూ ఇరుకు దారి గుండా లోపలికి వెళితే అక్కడ పరిచయమైన ఇద్దరమ్మల సహాయంతో దాసరిగారు ఈ భవంతి చివరలో ఉన్న 7వ నెంబర్ గదిని చూడటం జరిగింది.

ఇద్దరమ్మలు మనవాళమ్మ, గౌరి

మార్వాడీల యాజమాన్యంలో ఉండే ఆ పాత భవంతిలో దాసరి గారు 1952 నుంచి 2006 వరకు 54 ఏళ్ల వరకు ఇక్కడి గ్రౌండ్ ప్లోర్ లోని లోని 7వ నంబర్ గదిలోనే నివసిస్తూ వచ్చారు. అనారోగ్య కారణాలతో ఇక్కడి నుంచే ఆయన 2006లో విజయవాడలోకి బంధువుల ఇంటికి వెళ్లారు. దీంట్లో మొత్తం 12 ఇళ్లు ఉంటున్నాయి., వీటిలో తెలుగు ఫ్యామిలీలే ఎక్కువ. చందమామలో గతంలో కన్నడ విభాగంలో పనిచేసిన పద్మనాభన్ బాబు, ఆయన భార్య గౌరి గార్లు 1వ నెంబర్ ఇంటిలో ఉంటున్నారు. ఈమెకు కన్నడతో పాటు తెలుగు కూడా బాగా వచ్చు. ఇక మనవాళన్ అనే తమిళ సినీ నటుడి -ఇప్పుడు లేరు- భార్య కాంతా మనవాళన్ -60- గారు 2వ నెంబర్ గదిలో ఉంటున్నారు. ఇక్కడున్న వాళ్లంతా గత 35, 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. అందరికంటే సీనియర్ మన దాసరి గారే. -అద్దెకొంపలో నివాసం చరిత్రలో ఒకే చోట 54 ఏళ్లు- మనవాళన్ దంపతులు దాసరి గారికి చివరివరకు సపరిచర్యలు చేశారట. చెన్నయ్‌లో ఆయనది బ్రహ్మచర్య జీవితమే కాబట్టి వేడి నీళ్లు కాచి ఇవ్వడం వంటి పనులు, సేవలను మనవాళన్ కుటుంబమే ఆయనకు అందించింది.

ఈ భవంతిలోని 6వ నంబర్ గదిలో గోపాల రావు గారనే టైలర్, దాసరి గారితో చాలా స్నేహంగా ఉండేవారట. ఈయన మురుగన్ కోయిల్ సమీపంలో టైలర్ షాపు పెట్టుకుని బతికేవారు. దాసరిగారికి ఈయనతో చివరివరకు సన్నిహిత సంబంధం కొనసాగింది. ఈయన పనిచేస్తున్న టైలర్ షాపు వద్దే దాసరి గారు ఎక్కువకాలం గడిపేవారు. తన అధ్యయనం మొత్తాన్ని ఈ షాపులోనే చేసేవారని తెలుస్తోంది. వాసిరెడ్డి నారాయణ రావుగారు ఈ విషయం చెప్పినట్లు శాయిగారు చెప్పారు. సామాన్యులే దాసరి గారి కథల్లో పాత్రలు. ఆయన స్నేహం కూడా మామూలు మనుషులతోటే కొనసాగింది. ఆయన కూడా ఇప్పుడు లేరు.

54 ఏళ్లు ఒకే ఇంటిలో ఉండటం, ఒకే ఆఫీసు -చందమామ-లో పనిచేయడం. దాసరి గారికే చెల్లింది. శంకర్ గారు కూడా చందమామలో గత 58 ఏళ్లుగా పనిచేస్తున్నా ఆయన చాలా ఇళ్లు మారారు. కాబట్టి ఇల్లు, ఆఫీసుకు సంబంధించిన దీర్ఘకాలిక రికార్డు ప్రపంచంలో బహుశా దాసరిగారికే దక్కవచ్చు. ఇది ఖచ్చితంగా గిన్నెస్ రికార్డుకు ఎక్కవలసిందే -అవసరమనుకుంటే-

ఈ ఇళ్లలోని వారిని కదిపితే చాలు దాసరి వారి జ్ఞాపకాల స్మరణలో మునిగి పోతున్నారు. చందమామ ఉద్యోగి, పెద్దాయన అనే గౌరవం కంటే ఆయన మా మనిషి అనే ఆత్మీయస్పర్శ వీళ్ల జ్ఞాపకాల్లో కొట్టొచ్చినట్లు కనబడుతుంది.

దాసరి గారి సోదరులు ఈశ్వర ప్రభు ఇక్కడికి చాలా తరచుగా వస్తూ పోతూండేవారట. ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉంటున్న ఈశ్వర ప్రభు గారి కుమార్తె మణి తన బాబాయిని కలుసుకోవడం కోసం ఇక్కడికి వస్తూండేవారట.

వడపళని - మురుగన్ కోయిల్ (ఆలయం)

దాసరి గారు చందమామ ఆఫీసులో పనిచేసినంతకాలం వడపళనిలోని మురుగన్ కోయిల్ స్ట్రీట్ పరిసరాల్లోనే 54 ఏళ్లుగా ఉంటూవచ్చారు. ఈ ఇల్లు మొదట్నించి మార్వాడీల చేతిలో ఉండేది. మూడేళ్లకు, ఆరేళ్లకు అద్దె ఇళ్లు ఖాళీ చేయాలనే ఇంటి ఓనర్లు రాజ్యమేలుతున్న కాలం మనది. మనిషికున్న భయాల్లో లీగల్ భయాలు సన్నవి కావు. కాగా 54 ఏళ్లుగా దాసరి గారిని ఆ ఇంటి నుంచి ఖాళీ చేయవలసిందిగా ఈ మార్వాడీ ఓనర్లు కోరకపోవడమే చిత్రాల్లో కెల్లా విచిత్రం.

దాసరి గారు వయోభారంతో మద్రాసు నుంచి విజయవాడకు 2006లో వెళ్లిన తర్వాత కూడా వడపళని లోని ఈ 7వ నంబర్ ఇంటితో ఆయన అనుబంధం కొనసాగింది. మొదటినుంచీ ఇద్దరు నివసిస్తున్న ఈ ఇంటిలో 2010 జనవరి వరకూ దాసరి గారి అద్దెభాగాన్ని -1000 రూపాయలు. – చందమామ పూర్వ అసోసియేట్ ఎడిటర్ బాల సుబ్రహ్మణ్యం గారు ఒక ప్రయోజనం కోసం దాసరి గారి తరపున చెల్లిస్తూ వచ్చారు.

ప్రస్తుతం ఇక్కడి స్వాతి ఎన్‌క్లేవ్‌లో ఉన్న చందమామ కొత్త ఆఫీసు బిల్డింగ్ పక్కనే ఉన్న పాతబడిన భవంతిలో ఏడవ నంబర్ ఇంటిలో దాసరి గారు అయిదు దశాబ్దాలకు పైబడి నివసించారు. ఇది చందమామ ప్రస్తుత ఆఫీసుకు సరిగ్గా వెనుకవైపున ఉండటం కాకతాళీయం.

దాసరి గారు నివసించిన ఇంటికి పక్క ఇల్లు కూడా చాలా పాతది. ప్రమాణాల ప్రకారం చూస్తే పక్కపక్కనే ఉన్న ఈ రెండు భవంతులూ చెన్నయ్ లోని అతి పురాతన భవనాలలో ఒకటిగా లెక్కించవచ్చు.

గది లోపల ఒక ఇరుకు భాగం

ఒక్కటి మాత్రం నిజం. దాసరి గారు చెన్నయ్ నగరంలో చివరి వరకూ మధ్యతరగతి జీవితమే గడిపారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో సామాన్య కుటుంబాలే ఉండేవి. చందమామలో సుప్రసిద్ధమైన 12 ధారావాహికలు రచించి లక్షలాది పాఠకులను దశాబ్దాలుగా ఉర్రూతలూగించిన దాసరి గారు ఇక్కడి ఇరుకు గదిలోనే నివసిస్తూ చందమామ సీరియల్స్‌కి పాత్రల రూపకల్పన చేసి ఉంటారు. ఆయన గడిపిన మధ్యతరగతి జీవితం సాక్షిగా ఆయన సీరియల్స్ పాత్రలు ఆ మట్టి వాసనే వేసేవంటే ఆశ్చర్యపడవలసింది లేదు.

దాసరి గారి ఇంటి వెనుక తలుపు

ముఖ్యంగా మీకు తెలుపవలసింది ఏమిటంటే 7వ నెంబర్ ఇంటి మూసిన తలుపు ఫోటో, వెనుక వైపు తెరిచిన తలుపు ఫోటో తప్పితే మిగతా ఫోటోలు అన్నీ కాంతా మనవాళన్ గారి ఇంటి పోటోలే. దాసరి గారు ఉంటూ వచ్చిన గదిలో ఉంటున్న ఆయన మేం వెళ్లే సమయానికి తాళం వేసి పోవడంతో ఆయన ఇంటిలోపలి భాగాలను ఫోటోలు తీయలేకపోయాము. ఈ ప్లాట్ లోని 12 ఇళ్లూ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి  గనుక పాఠకులు సౌకర్యార్థం 2వ నెంబర్ గది లోపలి, వెనుక భాగాలను ఫోటో తీసి పంపిస్తున్నాను. రచన జూన్ సంచికలో నాయని కృష్ణమూర్తి గారు వర్ణించిన దాసరి గారి ఇంటికి ఈ ఇతరుల ఇళ్లు కూడా సరిగ్గా సరిపోతున్నాయి.

మురుగన్ మెడికల్ షాప్

దాసరి – మురుగన్ మెడికల్ షాపు
వడపళని మురుగన్ కోయిల్ స్ట్రీట్‌లో దాసరి గారు 54 ఏళ్లపాటు నివసించిన ఇంటికి దగ్గరగా, మురుగన్ కోయిల్‌కి అతి సమీపంలో  మురుగన్ మెడికల్ షాపు ఉంది. ఈ మెడికల్ షాపులో మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి గత ఆరునెలల్లో చాలా సార్లు షాపుకు వెళ్లాము. దాన్ని తెలుగువారే నడుపుతున్నారు కాని దాసరి గారు దశాబ్దాలపాటు మందులు తీసుకున్న మెడికల్ షాపు ఇదేనని ఈ రోజు 24-12-2010- వరకు మాకు తెలీలేదు. బోర్డు కూడా రోడ్డుకు పైన కాకుండా లోపల కనీ కనిపించకుండా ఉండటంతో పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. చందమామ ప్యాకింగ్ విభాగంలో ఉన్న రవి చెప్పిన వివరాల ప్రకారం ఈ రోజు దీన్ని పట్టేశాము.

ధాసరి ఎక్స్‌లెన్స్ అవార్డుతో శ్రీనివాస్

ఈ మెడికల్ షాపుతో దాసరి గారికి 50 ఏళ్లపైబడిన బంధం ఉంది. 1952లో చెన్నయ్‌కి వచ్చింది మొదలుకుని దాసరి గారు  తమ వైద్య అవసరాలకు ఈ షాపుకే వచ్చేవారు. మేము వెళ్లేటప్పటికి షాపులో ఉన్న శ్రీనివాస్ గారిని దాసరి గారి గురించి ప్రస్తావిస్తే 22 ఏళ్లుగా ఆయన తనకు తెలుసని చెప్పారు. ఎందుకంటే ఇతను గత 22 ఏళ్లుగా ఈ షాపులోనే పనిచేస్తున్నారు. దాసరి గారి జ్ఞాపకాలను పంచుకోమని అడిగితే ముందుగా ఆయనకు చందమామ 2000 సంవత్సరం (?) లో జీవితకాల సాధనకు -లైఫ్ అచీవ్‌మెంట్‌- గాను అందించిన చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు ధ్రువపత్రాన్ని దాసరిగారు తమకు ఇచ్చారని చెప్పి షాపులోనే ఉన్న ఆ ఫోటోను మాకు అందించారు. షాపులోపలే దాన్ని 3 మెగా పిక్సెల్ మొబైల్‌తో ఫోటో తీస్తే అంత సరిగా రాలేదు.

చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డులు - దాసరి, శంకర్ గార్లు

చందమామ చరిత్రలో ఎక్స్‌లెన్స్ అవార్డు ఇద్దరికి మాత్రమే లబించింది వారు దాసరి, శంకర్ గార్లు. 1999లో చందమామ బయటి వ్యక్తుల సహాయం తీసుకుని తిరిగి ఉనికిలోకి వచ్చాక, దశాబ్దాలుగా పత్రిక అభివృద్ధికి దోహదం చేసిన మాన్యులను గౌరవించాలని పత్రిక  మనుగడకు ఆర్థిక సహాయం అందించిన సుధీర్ రావు తదితరులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఇద్దరు మహనీయులకు చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు అందించారు. వడపళనిలో ఉన్న ప్రముఖ హోటల్ ఆదిత్యలో జరిగిన ఓ ఫంక్షన్‌లో ఈ అవార్డును బహూకరించారు.

చందమామ ఆవిర్భవించిన 50 ఏళ్ల తర్వాత ఆ సంస్థకు చెందిన సిబ్బందికి అవార్డులు ప్రకటించిన చరిత్ర అదే మొదటిదీ, చివరిదీ కూడా కావడం గమనార్హం. వ్యక్తుల కంటే సంస్థ ముఖ్యమే కాని తెలుగింటి కథల మామగా పేరొందిన ఈ సుప్రసిద్ధ కథల పత్రికలో పనిచేసిన సిబ్బంది జీవితాలు ఇంత సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండిపోవడమే బాధాకరం. చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు వీరిద్దరికీ వచ్చినా, రాకున్నా వారి ఘనతర చరిత్రకు జరిగే లాభం, నష్టం ఏమీ ఉండవనుకోండి. కాని ఎక్కడో బాధ.

చందమామ బహూకరించిన ఈ జీవితకాల సాధన ధ్రువపత్రాన్ని దాసరి గారు 2006 వరకు పదిలపర్చుకున్నట్లు ఉంది. తర్వాత ఆయన అనారోగ్యంతో విజయవాడలో బందువుల ఇంటికి వెళ్లేటప్పుడు ఈ అపరూప జ్ఞాపకాన్ని ఈ మెడికల్ షాపులో తన స్నేహితుడికి ఇచ్చి వెళ్లినట్లుంది. ఈ రోజుకీ వారు దాన్ని షాపులోనే లోపల భద్రంగా ఉంచారు.

ఒరిజనల్ ఫోటో ఫ్రేమ్

దాసరిగారికి చందమామ బహూకరించిన ఎక్స్‌లెన్స్ అవార్డు ఫోటో ఫ్రేమును మాకు చూపించిన మురుగన్ మెడికల్స్ శ్రీనివాస్ గారి పోటో కూడా ఈ సందర్భంగా తీశాము. సాయంత్రం 4 గంటల తర్వాత వస్తే దాసరిగారితో తమ పరిచయం విశేషాలు చెబుతానని చెప్పారు. పక్కనే ఉన్నాము కాబట్టి మళ్లీ కలుద్దామని చెప్పి  మా వద్ద ఉన్న చందమామలను గౌరవంగా అందించి ఆఫీసుకు వచ్చేశాము.

ఇక్కడ ఒక మాట చెప్పాలి. భూమ్మీద వ్యక్తిగత ఆస్తి ఉండరాదని ప్రభోదించే మార్క్సిస్టు సిద్ధాంతాన్ని జీవితం చివరవరకూ నమ్మిన వారు దాసరి. అద్భుత రీతిలో చందమామ దశాబ్దాల సేవలకోసం తనకు అందించిన ఈ అపురూప ద్రువపత్రాన్ని కూడా దాసరిగారు తృణప్రాయంగానే వదిలి పెట్టి పోవడం, కీర్తికాంక్షల పట్ల ఎలాంటి మమకారం లేని ఆయన నిగర్వానికి, సగటు మనిషితనానికి తిరుగులేని నిదర్శనం. 83 ఏళ్ల వయసులో ఆయన మద్రాసు విడిచి విజయవాడ వెళుతున్నప్పుడు చందమామ పూర్వ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకు తోడుగా వెళ్లి దింపి వచ్చారని తెలుస్తోంది. ఎక్స్‌లెన్స్ అవార్డు ఫోటో ప్రేమును తన వెంట తీసుకెళ్లడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డ్ ఎంబ్లెమ్

కాని కొన్ని పుస్తకాలు తప్పితే ఆయన చెన్నయ్ నుంచి మరేమీ తీసుకుపోలేదు. చందమామ కోసం, చందమామ సీరియల్స్ కోసం, కథలకోసం జీవితాన్ని  అర్పించినందుకు గాను వచ్చిన అరుదైన అవార్డును కూడా ఆయన తనది కాదనుకుని ఒంటరిగా వెళ్లిపోయాడు. ఈ నిర్మమకారానికి, మూర్తిమత్వానికి మనం ఎలా వెలకట్టగలం చందమామలో దాసరి గారి జీవితానికి సంబంధించిన ఈ చిరస్మరణీయ సాక్ష్యాన్ని భద్రపర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ షాపు వారు ఈ అరుదైన ఫోటోను శాశ్వతంగా భద్రపర్చడానికి, భద్రపర్చగలవారికి ఇస్తే ఎంత బాగుంటుందో! ఇప్పుడే పరిచయం అయ్యారు కాబట్టి ఆ షాపువారిని కొన్నాళ్ల తర్వాత అయినా ఈ విషయమై ప్రస్తావించాలి. దాసరి రమణ గారు కోరుకుంటున్నట్లు ఆ ఫోటోయే గనుక ఇవ్వడానికి సిద్ధమయితే బాలసాహితి తరపున దీన్ని భద్రపర్చవచ్చు.

దాసరి గారికి ఇష్టమైన హోటళ్లు
దాసరి గారు వడపళనిలోని మురగన్ కోయిల్ స్ట్రీట్‌లో ఉన్న తన ఇంటి చుట్టుపక్కల ఉన్న రెండు మూడు హోటళ్లలో టిఫన్, భోజనం చేస్తూ వచ్చారు. 1970ల చివర్లో చందమామ కథకులు ఎంవీవీ సత్యనారాయణగారు తనను చెన్నయ్‌లో కలిసిన సందర్భంలో దాసరిగారు తన హోటల్ భోజనం గురించి ఇలా అన్నారట. ‘కుటుంబరావు గారిని కలవాలని వచ్చి ఎలాగూ కలవలేకపోయారు. పోతే పోయిందిలే. బాబ్బాబు, నా పేరు కాస్త గిన్నెస్ రికార్డు బుక్‌లో ఎక్కించవా! పాతికేళ్లకు పైగా చెన్నయ్‌లో నా బతుకు ఈ హోటల్ పాలయింది. పాతికేళ్లు ఒకే హోటల్లో తిండి. ఎవరికుంటుంది ఈ రికార్డు’ అని తనపైన తానే హాస్యమాడారు.

గణేష్ భవన్ - ఆర్కాట్ రోడ్

ఆ పాతికేళ్లకు తర్వాత మరో పాతికేళ్లు తోడయ్యాయి. ఆయన చెప్పిన హోటల్ బహుశా ఆర్కాట్  రోడ్డుపై ఉన్న గణేష్ భవన్ కావచ్చు. ఇరుకిరుకుగా లేకుండా ఖాళీ స్థలంలో విశాలంగా కనిపించే ఈ ఉడిపి హోటల్ దాసరి గారి అవసరాలకు చక్కగా సరిపోయి ఉండవచ్చు. నాయని కృష్టమూర్తిగారు రచన జూన్ 2010 సంచికలో రాసిన ‘చెట్టెక్కిన బేతాళుడు’ రచనలో చెప్పిన ప్రకారం ఆయన 80లకు ముందు మురుగన్ కోయిల్ ఎదురుగా ఆర్కాట్ రోడ్‌పై ఉన్న గణేష్ భవన్ హోటల్లో చాలాకాలం టీ, ఫలహారం తీసుకున్నారు. హిందూ పేపర్ తీసుకుని ఉదయం ఇక్కడికి వచ్చే ఆయన, దాదాపు గంటకుపైగా అక్కడే ఉండి టీ, సిగిరెట్లు తాగుతూ పేపర్ చదివేవారు. ఉడిపి హోటల్లో సిగిరెట్ వెలిగించే అవకాశం ఈయనకు మాత్రమే దక్కిందని నాయని కృష్ణమూర్తిగారి రచన వ్యాసం బట్టి తెలుస్తోంది. సరిగ్గా మధ్యతరగతి వారికి సరిపోయే సాంప్రదాయకమైన గణేష్ భవన్ ఈ నాటికీ సరసమైన ధరలకే మంచి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ముఖ్యంగా ఇక్కడి సాంబార్ రైస్, పాయసం అద్భుతం

హోటల్ శివప్రసాద్ - మురుగన్ కోయిల్

తర్వాతకాలంలో తన ఇంటికి దగ్గరగా, సుప్రసిద్ధ మురుగన్ దేవాలయం వీధి మొదట్లో ఉన్న హోటల్ శివప్రసాద్‌కి తరచుగా వెళ్లేవారట. ఇది ఆయన ఇంటికీ మరీ దగ్గరగా ఉంటుంది. దీనికి ఒక వైపున మురుగన్ కోయిల్, దానికి ఎదురుగా ఆర్కాట్ రోడ్డువైపు దారిలో మురుగన్ మెడికల్స్ షాపు ఉంటాయి. చెన్నయ్‌లో విశేషంగా పేరొందిన ఈ ఆలయం ముందు కొసలో ఉండే శివప్రసాద్ హోటల్ ఆలయానికి వచ్చి, వెళ్లే భక్తులతో సందడిగా ఉంటుంది.

హోటల్ శరవణ భవన్

ఆ తర్వాత 2000 దశకంలో ఆర్కాట్ రోడ్డు మీది శరవణ భవన్‌లో తరచుగా ఫలహారాలు తీసుకునే వారిని తెలుస్తోంది. 54 ఏళ్లుగా ఆయన  ఈ రెండు మూడు హోటళ్లనే ఉపయోగిస్తూ వచ్చారు. తన ఇంటినుంచి రోడ్డుపై ట్రాపిక్‌ను దాటుకుని వెళ్లడం వయసురీత్యా కష్టమనిపించినప్పుడు ఆయన రోడ్డుకి ఈవైపునే ఉండే శివప్రసాద్, శరవణ హోటళ్లకు మారారనిపిస్తుంది. 90 దశకం చివర్లో చెన్నయ్‌లో ప్రారంభమైన శరవణ గ్రూప్ హోటల్స్ నగరంలో మంచి భోజనానికి మారుపేరుగా నిలిచాయి. 2000సంవత్సరం తర్వాత దాసరి గారు చందమామ పూర్వ ఎడిటర్ బాల సుబ్రహ్మణ్యంగారితో తరచుగా శరవణ హోటల్ సందర్శించేవారని తెలుస్తోంది.

చందమామ కథల సెలెక్షన్‌ – దాసరి
అలాగే చందమామ రైటర్స్ ప్యామిలీగా పేరొందిన జొన్నలగడ్డ కుటుంబానికి చెందిన జొన్నలగడ్డ రత్న -నారాయణ స్వామిగారు, వసుంధర గారి సోదరులు- ఇటీవల చెన్నయ్‌లో కలిసినప్పుడు చెప్పిన వివరాలు ప్రకారం 1980 నుంచి 95 వరకు పదిహనేళ్ల పాటు దాసరి గారు ప్రతి వారాంతంలోనూ ఒక పూట లేదా ఒక రోజు బీసెంట్ నగర్‌లో ఉంటున్న ఆయన ఇంటికి క్రమం తప్పకుండా పోయేవారట. ఐడీబీఐ బ్యాంక్ ఛీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేసి రిటైరైన జొన్నలగడ్డ రత్నగారు దాసరి గారితో తన పరిచయం గురించి, ఆయనతో కథా చర్చల గురించి చాలా సమాచారం చెప్పారు. ఈయన ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

మంచి కథ కూడా చందమామలో ఒక్కోసారి సెలెక్టు కాకపోవడంపై దాసరి గారి ఆగ్రహం, పై వారికి -చందమామ అధికారిక సంపాదకులు- సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదంటూ విసుక్కోవడం, కథ రిజెక్టయినప్పుడు బాధపడవద్దని, చందమామలో కథ ప్రచురణకు తీసుకోనందుకు కథ లోపం కారణం కాదని, దాని వెనుక చాలా కారణాలు ఉంటున్నాయని -సహేతుక కారణాలు  కూడా- దాసరి గారు జొన్నలగడ్డ రత్నగారితో చెప్పేవారట. కథ తిరస్కరణకు గురయినప్పుడు దాసరిగారు రచయితలకు రిప్లై పంపేటప్పుడు స్వాంతన కలిగిస్తూ మీ కథ ప్రచురణకు తీసుకోనంత మాత్రాన కథ బాగా లేదనుకోవద్దని సర్దిచెప్పేవారట. కధల సెలెక్షన్‌కి సంబంధించి చందమామ అధికారిక సంపాదకుల తీరుపై కొడవటిగంటి కుటుంబరావుగారికి కూడా వ్యతిరేకత ఉండేదని విశ్వసనీయ సమాచారం. పత్రికలో కథల స్వీకరణ నిర్ణయాలకు సంబంధించి ఇది ప్రపంచంలో అప్పడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉండే సమస్యే కదా.

(చందమామ కథల సెలెక్షన్‌పై, దాసరి గారి స్పందనపై వివరణాత్మక సమాచారాన్ని ‘రచన’ పత్రిక 2011 జనవరి సంచికలో ఈయన సామాన్యుడు కాదు పేరిట దాసరి వెంకట రమణ గారు రాసిన ప్రత్యేక రచనలో చూడండి. నా దృష్టిలో ఇది చందమామ చరిత్రకు, దాసరి సుబ్రహ్మణ్యంగారి జీవిత చరిత్రకు సంబంధించి థీసెస్‌తో సమానమైన రచన.)

తీరిన రుణం
దాసరిగారిని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. 1970ల మొదటినుంచీ చందమామలో ఆయన సీరియల్స్‌తో పరిచయం అయినప్పటినుంచి, 2009 జనవరిలో నేను అదే చందమామలో తెలుగు విభాగంలో పనికి కుదిరిన తర్వాత కూడా ఆయన్ను చూడలేకపోయాను. చివరలో బాలుగారితో పాటు విజయవాడలో తనను కలవడానికి చాలా ప్రయత్నించి కూడా సాధ్యపడలేదు. ‘చెట్టంత మనిషి కళ్లముందు ఉన్నారులే’ అనే కాసింత ఏమరపాటు కూడా కారణం కావచ్చు. తీరా, ‘వయసుకు మించి బతికేస్తున్నానం’టూ తనను ఇంటర్వ్యూ చేసిన సిహెచ్. వేణుగారితో సరదాగా అన్న దాసరిగారు తర్వాత ఆరునెలలకే కాలం చేసినప్పుడు అందరికీ పిడుగుపాటే.

చందమామ చిత్రకారులు శంకర్ గారిపై వీడియో ఎలాగోలా విజయవర్ధన్ గారి తోడ్పాటుతో సేకరించగలిగాము. ఒక చిన్న వీడియో కెమెరా ఉండి విజయవాడకు పోగలిగి ఆయనను సజీవంగా చిత్రిక పట్టవలసిన అవసరం గురించి వేణు గారితో చర్చించినప్పటికీ కుదరలేదు. హ్యారీ పోటర్లు, అవతార్‌లు గురించి ప్రపంచానికి తెలియని రోజుల్లోనే లక్షలాది మంది పిల్లలను జానపద సీరియళ్ల మంత్రజగత్తులో ఓలలాడించిన ఈ అపరూప తెలుగు బాల కథా రచయితగురించి ఒక్కటంటే ఒక్క వీడియో చిత్రం కూడా తీయలేని బాధ ఇక అందరినీ వెంటాడుతూనే ఉంటుంది.

ఏమో.. నా జీవితంలో ఎన్నడూ చూడలేకపోయిన దాసరి సుబ్రహణ్యం గారి రుణాన్ని ఈవిధంగా తీర్చుకుంటున్నానేమో.!

నోట్
(చివరగా, దాసరి గారు చెన్నయ్‌లో నివసించిన ఇంటిని పట్టేశానంటూ నాలుగు నెలల క్రితమే చందమామ అభిమాని శ్రీ కప్పగంతు శివరాం ప్రసాద్ గారికి చెప్పినప్పుడు ఆయన వెనువెంటనే ప్రాధేయపడ్డారు. అది పాత భవంతి అంటున్నారు కనుక రాత్రికి రాత్రే దాన్ని కూల్చేసి కొత్త భవంతి నిర్మాణాలకు ప్లాన్ జరిగిపోవచ్చని, చలం గారు నివసించిన స్వంత ఇంటి ఫోటో విషయంలో కూడా ఇలా నిర్లక్ష్యం చేసినందువల్లే ఒక రోజు ఉన్నట్లుండి దాన్ని కూల్చేసి చరిత్రకే లేకుండా చేశారని శివరాం గారు బాధపడ్డారు.

అందుకే అప్పటినుంచి ఆయన పదే పదే మెయిల్స్ ద్వారా, ఫోన్ ద్వారా దాసరి గారి అద్దె ఇంటిని వీలైనంత త్వరగా ఫోటో తీయమని గుర్తు చేస్తూ వచ్చారు. మన జీవితాల్లో రియల్ ఎస్టేట్ ఒక పెద్ద భూతమని అది ఎప్పుడు ఏ కొంపను లేకుండా కూల్చి వేస్తుందోనని ఆయన భయం. శివరాంగారు హెచ్చరిస్తూ వస్తున్నప్పటికీ నా వద్ద ఉన్న డిజిటల్ కెమెరా లెన్స్ పాడవటంతో రిపేర్ చేయించడం కుదర్లేదు. కెమెరా రెడీ అయితే తర్వాత చూద్దామని తాత్సారం చేస్తూ వచ్చాను.

ఈలోగా దాసరి గారి మూడు పుస్తకాలను ప్రచురించే బాధ్యత తీసుకున్న రచన పత్రిక సంపాదకులు శ్రీ శాయిగారి చెవిన ఈ విషయం పడి, ఈ అంశంపై వ్యాసంతో పాటు ఫోటోలను కూడా పంపితే చాలా మంచిదని, మళ్లీ మళ్లీ వేయలేమని అరుదైన రికార్డుగా ఉంటుందని ఆయన సలహా ఇచ్చారు. ఇక తప్పనిసరై చందమామలో సిస్టమ్ అడ్మిన్ శశి వద్ద మొబైల్ తీసుకుని ఈ వారంలో పని కొంతవరకు పూర్తి చేయడం జరిగింది.

దాసరి గారు నివసించిన ఇంటి వివరాలు ఈ రూపంలో అయినా వెలుగులోకి వచ్చినందుకు కారణమైన శివరాం, శాయి గార్లకు మనఃపూర్వక కృతజ్ఞతలు. ఆ ఇంటి వివరాలు కావాలని చెప్పగానే దగ్గరుండి మరీ చూపించి, చుట్టుపక్కల కుటుంబాలను పరిచయం చేసిన చందమామ ప్యాకింగ్ విభాగం రవికి, మొబైల్ సాయం అందించిన శశికుమార్‌కి ఈ అన్ని ఫోటోలు తీయడంలో సహకరించిన చందమామ లే అవుట్ డిజైనర్ నరేంద్రకు, చివర్లో దాసరి గారి ఎక్సెలెన్స్ అవార్డు గురించి అరుదైన విశేషాలు తెలిపి దాని అరుదైన పోటో అందించిన మురుగన్ మెడికల్స్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.)

కె. రాజశేఖర రాజు.
చందమామ
………..

గమనిక
శాయిగారూ,
చెన్నయ్‌లో దాసరి గారి వ్యక్తిగత జీవితం, ఆయన నివసించిన ఇల్లు, సందర్శించిన హోటల్స్, వైద్యం కోసం ఉపయోగించిన మెడికల్ షాపు, చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు గురించి లభ్యమైన సమాచారం చాలా పెద్దదయినట్లుంది. రచన పేజీల కొలతకు సరిపోయేలా మీరు దీన్ని వీలైనంత మేరకు ఎడిట్ చేయగలరు.

మీ
రాజు….

తాజా సమాచారం.

దాసరి గారి ఎక్స్‌లెన్స్ అవార్డు ఒరిజనల్ స్కాన్

మురుగన్ మెడికల్స్ శ్రీనివాస్ గారి వద్ద ఉన్న, దాసరి సుబ్రహ్మణ్యం గారికి వచ్చిన ఎక్స్‌లెన్స్ అవార్డు చందమామ స్వయంగా ఫ్రేమ్ కట్టించి ఇచ్చిందే. దాసరి గారి కోరికమేరకు దీన్ని శ్రీకాకుళంలో కథానిలయానికి అందించవలసి ఉందని తెలుస్తోంది.. ఆయన అభిప్రాయానికి ఎనలేని విలువ కల్పిస్తూ డిసెంబర్ చివర్లో శ్రీనివాస్ వద్ద ఉన్న ఒరిజనల్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఫోటోను ఆయన అనుమతితో చందమామ ఆఫీసుకు తీసుకెళ్లి స్కాన్ తీయించి భద్రపర్చాము. దాని కాపీనే రచన సంపాదకులు శాయిగారికి, దాసరి వెంకటరమణ గారికి పంపాము. కనీసం కాస్తంత క్వాలిటీతో స్కాన్ అయిన ఈ కాపీ అయినా మనవద్ద ఉందని సంతృప్తి పడాలి.

24-01-2011
చెన్నయ్

Note: ఇక్కడ ఫోటోలు ప్రచురించడానికి ఇంట్లో కంప్యూటర్ సహకరించడం లేదు. రేపు ఆఫీసులో ఈ పని పూర్తి చేయగలను. అసౌకర్యానికి క్షమాపణలు. నా కాంతి సేన బ్లాగులో కూడా ఈవివరాలు చూడగలరు. ఇప్పటికే manateluguchandamama.blogspot.com లో శివరామప్రసాద్ గారు గత నెలలోనే ఫోటోలతో సహా ఈ కథనంలో కొంత భాగాన్ని ప్రచురించారు.

RTS Perm Link

‘అంబులిమామ’ వందిడ్చి.. రొంబ రొంబ నండ్రి రాజా….

January 14th, 2011

చందమామ తమిళ సంచిక ‘అంబులిమామ’ను ఎనిమిది పదుల ముదివయస్సులోనూ విడవకుండా చదివే మాన్య పాఠకులు కళానికేతన్ బాలు గారు -ఎస్. బాలసుబ్రహ్మణ్యన్-. కళానికేతన్ బాలు పేరుతో 50 ఏళ్లకు పైగా చందమామలో పోటో వ్యాఖ్యలకు క్రమం తప్పకుండా పోటోలు తీసి పంపిన ఫోటో ప్రదాతలు వీరు. గత 50 ఏళ్లుగా చందమామకు క్రమం తప్పకుండా చందమామకు ఫోటోలు పంపుతూ వచ్చిన వారిలో ఈయనా ఒకరు. రెండో వారు నారాయణ తాట గారు.

1950లలో చందమామ ఆఫీసును సందర్శించి, చక్రపాణిగారి పరిచయం తర్వాత ఆయనతో వ్యక్తిగత స్నేహాన్ని చివరివరకు సాగించారు. తొలి పరిచయం తర్వాత చక్రపాణి గారితో చక్కటి సాన్నిహిత్య సంబంధం ఏర్పడిందని ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకుని తిరిగేవారమని అలనాటి వెచ్చటి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు.

చక్రపాణిగారితో అనుబంధం ప్రభావంతో చందమామకు అనేక కథలు కూడా రాసి పంపారు. పలు తమిళ పత్రికలలో నేటికీ ఈయన కథలు, రచనలు పంపుతుంటారు. తాను కథకుడిగా మిగిలానంటే కారణం చక్రపాణి అని కృతజ్ఞత చెబుతుంటారు. ఫోటోలు, కథలు రూపంలో చందమామకు కంట్రిబ్యూషన్, అంబులిమామ పత్రిక నెలవారీగా అందడం తనకు జీవితంలో అత్యంత సంతోషకర క్షణాలుగా చెబుతుంటారీయన.

కానీ, ఇటీవలికాలంలో ఈయనకు ఒక సమస్య పీడిస్తోంది. చందమామలు సకాలంలో అందకపోవడం అటుంచి అస్సలు అందకుండా కూడా పోవడంతో బాగా ఇబ్బంది పడుతున్నారు. లేటుగా వచ్చినా సరే ఈయనకు అంబులిమామ తప్పకుండా కావాలి. అంబులిమామ చదవడం జీవితం చివర్లో కూడా ఓ చక్కటి వ్యసనంగా మార్చుకున్న మాన్యులలో ఈయనా ఒకరు.

అందుకే చందమామ తనకు అందకుండా పోయిన ప్రతిసారీ స్వయంగా పోన్ చేసి మరీ అడుగుతుంటారు “అంబులిమామ మిస్ ఆయిడ్చి.. ఒరు అంబులి మామ కొడింగే రాజా” -చందమామ రాలేదు. ఒక కాపీ ఇవ్వవా- రెండు మూడు సార్లు ఇలా జరగేసరికి ఇక కుదరదని ఆయనకు చెన్నయ్‌లో ఉంటున్నప్పటికీ కొరియర్‌లో పంపవలసి వచ్చింది. దాదాపు ఆరునెలలుగా ఇదే తంతు. దీన్ని బట్టి చూస్తే రెండో సారి కూడా తప్పిపోయిన కాపీని బుక్ పోస్ట్‌లో పంపితే  చెన్నయ్‌లో కూడా అది అందలేదని స్పష్టమవుతోంది.

ఈసారి కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంబులిమామ కాపీలు ఆయనకు అందలేదు. రెండో దఫా అక్టోబర్, నవంబర్ కాపీలు బుక్ పోస్ట్‌లో పంపితే అవీ అందలేదు. గతవారం ఆయన మళ్లీ ఫోన్ చేశారు. వెంటనే ఆయనకు మూడు నెలల సంచికలు కొరియర్‌లో పంపాము. రెండు రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఇప్పుడే అందాయని థాంక్స్ చెప్పారు.

82 ఏళ్ల వయసులో ఫిజియోథెరపీ చేయించుకుంటూ బెడ్ మీద ఉన్నానని, మూడు అంబులిమామలు ఇప్పుడు చదువుతున్నానని చెబుతున్నప్పుడు ఆయన గొంతులో తడి. చందమామతో అయిదు దశాబ్దాలు జీవితం పంచుకున్న వెచ్చటి జ్ఞాపకాలు. ప్రతినెలా అంబులిమామ అందితే చాలు అదే పెద్ద ఆనందం అంటూ సంతోషం ప్రకటించే ఆయన స్వరంలో చందమామ పట్ల దశాబ్దాల అనుకంపన.

ఇలాంటి కదిలించే ఘటనలు అనుభవానికి వచ్చిన ప్రతిసారీ మాకు చందమామ కార్యాలయంలో విషాదానందాలు ఎదురవుతుంటాయి. ప్రీతిగా చందమామలు చదివేవారికి, చదువుతున్న వారికి అవి నెలవారీగా అందడంలేదు. చాలా మందికీ ఇదే అనుభవం అనుకుంటాను. మా ప్రయత్నలోపం ఏదీ లేకున్నా, సకాలంలో చందమామను కోరుకుంటున్నవారికి అది అందకపోవడం, లేటు కావడం, కాపీయే మిస్ కావడం. ఇలా చందమామకు సంబంధించి జరగకూడనివే జరుగుతున్నాయి.

చందమామ హిందీ కాపీని భారత మాజీ ప్రధాని, ప్రస్తుతం పూర్తిగా శయ్యమీదే ఉన్న అతల్ బిహారీ వాజ్‌పేయ్ గారికీ పంపిస్తున్నారు. ఆయన హిందీ చందమామను చదువుతున్నారో, చదవగలిగిన స్థితిలో ఉన్నారో లేదో తెలీదు. కాని కళానికేతన్ బాలు గారి వంటివారు ఈనాటికీ చందమామను చదువుతున్నారు. చందమామ క్రమం తప్పకుండా అందితే చాలు పరమామనందం ప్రకటించేవారు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టే పత్రిక మనగలుగుతోంది.

దశాబ్దాల క్రితమే చందమామలో ఒక అద్భుతమైన కథ వచ్చింది. కథ పేరు ‘ఆకాశానికి’ గుంజలు అనుకుంటాను. ఆకాశానికి గుంజలు లేవు అయినా అది కింద పడకుండా ఎలా ఉంటోంది అని భయపడిపోయిన వ్యక్తి ఇంట్లోంచి, ఊర్లోంచి పారిపోతూ చివరిగా ఒక ముని ద్వారా ఆకాశానికి గుంజలు ఏవి అనే సత్యం స్వీయానుభవంతో తెలుసుకుంటాడు. అద్భుతమైన కథ. దశాబ్దాల తర్వాత కూడా గుర్తు వచ్చే కథ.

చందమామకు కూడా గుంజల వంటి వారు ఉన్నారు. కళానికేతన్ బాలు గారు, 1947 నుంచి ఈనాటి దాకా చందమామను క్రమం తప్పకుండా చదువుతూ భద్రపరుస్తూ వస్తున్న టార్జాన్ రాజు -హైదరాబాద్- గారు, చందమామలో వస్తున్న ప్రతి చిన్న మార్పును నిశితంగా గమనిస్తూ 80 ఏళ్ల వయస్సులో కూడా తన సమ్మతిని, అసమ్మతిని ఆప్యాయంగా తెలియజేసే బి.రాజేశ్వరమూర్తి -చిలకలపూడి, బందరు- గారు, సురేఖ -మట్టెగుంట అప్పారావు- గారు, ఇలాంటి జ్ఞాన వృద్ధులతో పాటు ఆలస్యంగా వచ్చినా, కోరుకున్న ప్రమాణాలతో రాకున్నా శపిస్తూ కూడా చందమామ వస్తే చాలు హృదయానికి హత్తుకుంటున్న వేలాది మంది పాఠకులు, పెద్దలు, పిల్లలు వీరే చందమామకు నిజమైన గుంజలు.

ఈ గుంజలే, నిజమైన ఈ ఆధారాలే లేకపోతే చందమామ ఇంతటి విపత్కర స్థితిలోనూ ఈ రూపంలో అయినా వచ్చేది కాదు. నిజం చెప్పాలంటే ఇలాంటి వారి ప్రశంస, విమర్శ, సమ్మతి, అసమ్మతితో కూడిన మార్గదర్శనంతోటే చందమామ నిజంగా బతుకుతోంది.

కథలు తప్పితే ఇతర వినోద సాధనాలు లేని కాలాన్ని దాటుకుని సమాజం శరవేగంగా ఎదుగుతున్నప్పటికీ, సినిమాలు, క్రీడలు, కార్టూన్ ఛానెళ్లూ పసిమనస్సుల మానసిక ప్రపంచాన్ని ఆక్రమిస్తూ, చదివే ప్రక్రియ సమాజంలో తగ్గిపోతున్నప్పటికీ ఇలాంటే గుంజలే, ఆధార స్తంభాలే తెలుగు కథను బతికిస్తున్నారు. చందమామకు ప్రాణం పోస్తున్నారు. మన పాఠ్యపుస్తకాలు, మన బళ్లు, మన సిలబస్, మనిషి పురోగతికి మనం ఇస్తున్న దరిద్రపు నిర్వచనం వంటివి ఇలా కొనసాగినంతకాలం చందమామకూ ఢోకాలేదు. కథల పత్రికలకూ ఢోకాలేదు.

కావలిసిందల్లా పుస్తకాలు చదివే అలవాటును పిల్లలకు అదించగలిగే మనసున్న మారాజులు మాత్రమే. కనీసం సెలవు రోజుల్లో అయినా పిల్లలను కూర్చోబెట్టుకుని కాసిన్ని పాఠ్యేతర పుస్తకాలు, కథలు చదివించ గల తల్లిదండ్రులు, బళ్లలో బండ చదువుతో పాటు కాస్తంత సాహిత్య సంస్కారాన్ని పిల్లలకు అందించగలిగిన ఉపాధ్యాయులు. ఇలాంటి గుంజలు అక్కడక్కడా ఉన్నా చాలు చదివే అలవాటు తరంనుంచి తరానికి నెమ్మదిగానే అయినా చేరుతూంటుంది.

ఈ స్పీడ్ యుగంలో మనుషుల అలవాట్లు కూడా శరవేగంగా మారిపోతున్న వేగ జీవితంలో చందమామను చదివే అలవాటును పాఠకులు, అభిమానులు దశాబ్దాల తర్వాత కూడా మానటం లేదు. ఈ అందరి మూర్తిమత్వాన్ని ప్రతిబింబించే కళానికేతన్ బాలు -ఎస్ బాలసుబ్రహ్మణ్యన్- గారి ఆనంద క్షణాలలో పాలు పంచుకుంటూ..

చందమామ గుంజలందరికీ…

మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

RTS Perm Link

చందమామ కథల పునాది…

January 11th, 2011

“బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి…పిల్లల్లో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు…దేవుడి మీద భక్తినీ, మతవిశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు…కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ”. -కొడవటిగంటి కుటుంబరావు

చందమామకు కథలు రాయాలనుకునేవారికి, కథలు పంపాలనుకునేవారికి కరదీపికలాంటిదీ చిన్న పేరా. అప్పుడూ, ఇప్పుడూ, భవిష్యత్తులో కూడా చందమామ కథలకు దిశానిర్దేశం చేయగల ప్రామాణికతకు ఈ చిన్ని పేరా ఒక ప్రతీకగా నిలుస్తుంది. దయ్యాల పేరు ఎత్తితేనే అశాస్త్రీయమనే తప్పు వైఖరినుంచి బాలసాహిత్యాన్ని మళ్లించి, -దయ్యాలు, భూతాలు, రాక్షసులు, మంత్రాలు, మహత్తుల వంటి కాల్పనిక ప్రపంచపు ప్రామాణిక అంశాలను మనుషుల్లో మంచిని నిలబెట్టడానికి ఉపయోగించే క్రమంలో చందమామ కథలు ఒక అద్భుత ప్రయత్నం చేశాయి.

రాత్రిపూట కదిలే చెట్ల నీడను చూసి దయ్యమనుకుని దడుచుకునే లక్షలాది మంది పిల్లలు చందమామలో చింతచెట్టు దయ్యాల కథలు చదివి మహానుభూతిని పొందారు. చందమామ దయ్యాలు అటు పిల్లలను ఇటు పెద్దలను భయపెట్టకపోగా వారు దశాబ్దాలుగా చింతచెట్టు దయ్యాల కథలను చదువుతూనే ఉన్నారు రామాయణ భారతాలు, ధారావాహికలు, బేతాళ కథలు, పాతికేళ్లనాటి కథలు తర్వాత చందమామ పాఠకులు ఈనాటికీ మర్చిపోకుండా ప్రచురించమని కోరుతున్న కథలు చింతచెట్టు దయ్యాల కథలే.

“ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి..కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ.” అంటూ కుటుంబరావుగారు కథల స్వభావం గురించి చేసిన వ్యాఖ్య చందమామ కథలకు ప్రాణ ప్రతిష్ట కల్పిస్తోంది.

రామాయణం, భారతం ఐతిహాసిక గాధలను చందమామలో చదివితే మహిమలు, విశ్వాసాలు, భక్తి వంటి వాటికంటే, మానవ స్వభావంలోని పాత్రలు మాత్రమే మనకళ్లముందు కనబడి ఆనందం కలిగిస్తాయి. మంచి చెడ్డల మధ్య విచక్షణను తేల్చుకునే అవకాశాన్ని పాఠకులకే వదిలిపెడతాయవి. ఏ కథ చదివినా, ప్రాథమికంగా మనిషి యత్నమూ, మనిషి సద్బుద్ధీ మాత్రమే చివర్లో నెగ్గడం చందమామ కథల లక్షణం.

కొత్తగా చందమామకు కథలు పంపేవారు కూడా ఈ ధర్మసూత్రాన్ని దృష్టిలో ఉంచుకుంటే చందమామలో ఎలాంటి కథలు ప్రచురణకు తీసుకుంటారో, ఏ కథలు సాధారణంగా ఎంపికవుతాయో సులభంగా అర్థం అవుతుంది. మంచిని మాత్రమే చెబుతాం చెడు ఉన్నా చెప్పం అనే సూత్రం చందమామ కథలకు కూడా వర్తిస్తుంది. అది మరి కాస్త ముందుడుగు వేసి మంచికి మాత్రమే పట్టం గడతాం, మంచిని మాత్రమే గెలిపిస్తాం అనే స్థాయికి చందమామ కథలు పరిణమించాయి.

చందమామ కథల స్వభావానికి సంబంధించిన ఈ రహస్యాన్ని పట్టుకున్నారు కనుకే చందమామ కథకులు దశాబ్దాలుగా చందమామకు అర్హమైన కథలను మాత్రమే పంపుతూ చందమామ విజయగాథకు కథల వన్నెలద్దారు. సమాజంలోని, మనుషుల్లోని దుర్గుణాలకు ప్రాధాన్యత ఇవ్వడం -హైలెట్ చేయడం- కాకుండా ఆ దుర్గుణాలపై అంతిమంగా మానవ విజయానికి ప్రాధాన్యమిస్తూ ముగిసే కథలు చందమామకు శాశ్వత కీర్తిని అందించాయి.

వరుసగా రెండు మూడు చందమామ సంచికలలోని కథలను చదివి పరిశీలిస్తే చందమామ కథల ఫార్మాట్ సులభంగా బోధపడుతుంది. ఈ ప్రాతిపదికన చందమామకు కథలు రాసి పంపగలరని కొత్త కథకులను కోరుతున్నాము.

చందమామలో గత 15 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో కొత్త కథలు –పాత, కొత్త రచయితలు రాసి పంపుతున్నవి- ప్రచురించబడుతున్నాయి. ఒక్క డిసెంబర్ సంచికలో శ్రీనివాస కల్యాణం సీరియల్‌తోపాటు 12 కథలు కొత్తవి ప్రచురించబడ్డాయి. ఇక జనవరి నెలలో మొత్తం 14 కథలు కొత్తవి –అంటే గతంలో ప్రచురించబడనివి- వచ్చాయి.

చందమామ సైజు ప్యాకెట్ సైజ్‌కు కుదించుకు పోయి మళ్లీ కాస్త పెద్దదయిన సందర్భాన్ని పాఠకులు మెచ్చనప్పటికీ, ఇన్ని కథలు కొత్తవి వేయడం, ఒకే సంచికలో 18 కథలు రావడం చూసి పాఠకులు, అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.

దశాబ్దాలుగా చందమామ కథల శైలికి అలవాటుపడిన మాన్య కథకులు, ఇతర పత్రికలలో వందల కథలు రాసినప్పటికీ చందమామకు ఇప్పుడు కొత్తగా కథలు రాసి పంపుతున్నవారు, జీవితంలో ఒకసారయినా చందమామలో కథ ప్రచురించబడాలనే చిర ఆకాంక్షతో కథలు పంపుతున్నవారు. –వీరు కూడా మంచి విషయాన్నే ఎంచుకుంటున్నారు- కొత్తగా కథలు రాస్తున్నవారు చందమామకు ఇటీవల కాస్త ఎక్కువగానే కథలు పంపుతున్నారు. కథలు పంపినప్పటికీ, అవి ప్రచురణకు తీసుకుంటున్నదీ లేనిదీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెంటనే చెప్పలేకపోతున్నప్పటికీ, కథకులతో ఫోన్ ద్వారా రెగ్యులర్ సంబంధంలో ఉండటం ద్వారా చందమామకు, కథకులకు ఒక విశ్వాస బంధం చెక్కుచెదరకుండా కొనసాగుతోందనే భావిస్తున్నాము.

గతంలో వలే పోస్ట్ కార్డ్ ద్వారా కమ్యూనికేషన్ ఇప్పుడు దాదాపు అసాధ్యమయ్యే పరిస్థితి రావడంతో వీలైనంత మేరకు ఫోన్, ఈమెయిల్ ద్వారానే సంప్రదింపులు జరుగుతున్నాయి. పాఠకులు,  కథకులు కూడా అవకాశముంటే తమ ఫోన్ లేదా మొబైల్‌ని పంపితే నేరుగా వారితో సంప్రదించడానికి వీలవుతుంది.

ఈ పరిమితిని, ఈ సౌలభ్యాన్ని పాఠకులు, అభిమానులు, కథకులు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా తమ ఫోన్ సంఖ్యలు, ఈమెయిల్‌ని చందమామ చిరునామాకు పంపవలసిందిగా అభ్యర్థన.

తెలుగు చందమామకు కథలు, ఉత్తరాలు పంపేవారు నేరుగా చెన్నయ్ లోని చందమామ కార్యాలయానికే పంపవచ్చు.

K. Rajasekhara Raju,
Associate Editor (Telugu) – Online
Chandamama India Limited
No.2 Ground Floor, Swathi Enclave
Door Nos.5 & 6 Amman Koil Street
Vadapalani, Chennai – 600026
Phone :  +91 44 43992828 Extn: 819
Mobile : +91 9884612596

Email :  rajasekhara.raju@chandamama.com
Visit us at telugu. chandamama.com
blog : blaagu.com/chandamamalu

లేదా ఎడిటర్ పేరుతో కూడా పై చిరునామాకు పంపవచ్చు. తెలుగులో కథలు టైప్ చేసి పంపలేని వారు తాము రాసిన కథలను స్కాన్ చేసి నేరుగా ఈమెయిల్ రూపంలో కూడా కథలు పంపవచ్చు. అయితే స్కానింగ్ సరిగా చేయాలి. కథ అటూ ఇటూ చెరిగిపోకూడదు. ఇక పోస్ట్ ద్వారా కథలు పంపే ప్రక్రియ ఎలాగా కొనసాగుతోంది.

సంక్రాంతి సందర్భంగా చందమామ పాఠకులకు, అభిమానులకు, కథకులకు, చంపిలకు చందమామ హార్దిక శుభాకాంక్షలు.

RTS Perm Link

ప్రపంచ సంస్కృత పుస్తక ప్రదర్శనశాల – చందమామ

January 7th, 2011

సంస్కృత భాషాభిమానులకు, పాఠకులకు, విద్యార్థులకు, పరిశోధకులకు మంచి వార్త. ప్రపంచంలోనే మొట్టమొదటి సంస్కృత పుస్తక ప్రదర్శన 2011 జనవరి 7-10 మధ్య బెంగళూరులో బసవనగుడి నేషనల్ కాలేజీ గ్రౌండ్‌లో జరుగుతోంది. ప్రపంచ స్థాయిలో జరుగుతున్న ఈ విశిష్ట కార్యక్రమంలో సంస్కృత చందమామ కూడా తన స్టాల్‌ని ప్రదర్శిస్తోంది. (స్టాల్ నంబర్ 132)

బెంగళూరులోని బసవనగుడి నేషనల్ కాలేజీలో నిర్వహిస్తున్న ఈ తొలి ప్రపంచ స్థాయి సంస్కృత బుక్ పెయిర్‌లో దాదాపు 500 కొత్త సంస్కృత పుస్తకాలను విడుదల చేయనున్నారు. వందమంది సంస్కృత భాషా ప్రచురణ కర్తలు ఈ పుస్తక ప్రదర్శనలో పాలు పంచుకోనున్నారు. అరుదైన ఈ పుస్తక ప్రదర్శనకు ప్రవేశ రుసుములేదు. అందరూ ఆహ్వానితులే.  సంస్కృత భాషతో కాస్త పరిచయం ఉన్న, లేని  అన్ని వయస్సుల వారికీ ఈ పుస్తక ప్రదర్శన ఉచితం.

భారతీయ సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టే ఈ బుక్ ఫెయిర్ జనవరి 7 నుంచి 10 దాకా నాలుగురోజుల పాటు జరుగనుంది. 500 కొత్త సంస్కృత పుస్తకాల ఆవిష్కరణతోపాటు సులభ సంస్కృతంలో కాన్సర్టులు, నాటికలు, పప్పెట్ షోలు, మోడల్ హోమ్స్, మార్కెట్ ప్లేస్‌లు వంటి ప్రదర్శనలు జరుగుతాయి.

ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న సంస్కృతంలో జరుగుతున్న ఈ పుస్తక ప్రదర్శనను చూడండి, విశ్వసించండి, హత్తుకోండి అంటూ నిర్వాహకులు పిలుపునిచ్చారు.

లక్ష్యాలు
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సంస్కృత సంబంధిత ప్రముఖ సంస్థలన్నీ కలిసి సంస్కృతాన్ని, దాని సుసంపన్నమయిన భాషా పునాదిని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ఈ పుస్తక ప్రదర్శనను తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆధునిక సంస్కృత పరిశోధన, సాహిత్యాన్ని కొత్తమలుపుకు తీసుకుపోవడం, సంస్కృతభాషలో నూతన సృజనలు చేసి ప్రచురించేలా సంస్కృత పరిశోధకులను ప్రోత్సహించడం, సంస్కృత ప్రచురణలకు మార్కెట్‌ని కల్పించడం. సంస్కృతాన్ని భవిష్యత్ కెరీర్ మార్గంగా ఎంచుకునే విషయమై సంస్కృత విద్యార్థులలో ఆత్మవిశ్వాసం ప్రోది చేయడం ఈ పుస్తక ప్రదర్శన లక్ష్యాలు.

సంస్కృత భాషతో పరిచయం ఉన్న, లేని ప్రజలందరికీ ఈ పుస్తక ప్రదర్శన ఉచిత సందర్శనను అనుమతిస్తున్న్టట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొంటున్న వలంటీర్లందరూ సరళ సంస్కృతంలో మాట్లాడుతూ ప్రాంగణం మొత్తాన్ని సంస్కృత వాతావరణంతో గుబాళింపజేస్తారని, వీరి సరళ సంస్కృత సంభాషణలను అన్ని వయస్కుల వారు సులభంగా అర్థం చేసుకుని ఆస్వాదిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు.

పుస్తక ప్రదర్శన నిర్వాహకులు
రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్
కర్నాటక ప్రభుత్వం
దేశంలోని అన్ని సంస్కృత విశ్వవిద్యాలయాలు, అకాడమీలు
ప్రాచ్య పరిశోధనా సంస్థలు
సంస్కృత పోస్ట్ గ్రాడ్యుయేట్ శాఖలు
నేషనల్ మాన్యుస్కిప్ర్ట్ మిషన్,
సంస్కృత్ ప్రమోషన్ ఫౌండేషన్
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సంస్కృత్ స్టడీస్, పారిస్
సంస్కృత భారతి

కార్యక్రమ విశేషాలు
సంస్కృతంపై వివిధ స్థాయిల్లో అవగాహన ఉన్న దాదాపు లక్ష మంది దేశ విదేశాలనుండి ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొననున్నారు.
ఇక్కడ నిర్వహించనున్న కాన్పరెన్స్‌లో పదివేల మంది సంస్కృత పరిశోధకులు ప్రతినిధులుగా రానున్నారు. భారతదేశం వెలుపల ఉన్న 24 సంస్కృత సంస్థల ప్రతినిధులు ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నారు.

బెంగళూరు నగరంలోనే, 1008 సంస్కృత సంభాషణా శిబిరాలను  ఈ ప్రదర్శన శాల ప్రారంభానికి రెండు నెలల ముందునుంచే అంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించారు.వీటి ద్వారా కనీసం 30 వేలమంది కొత్తగా సంస్కృతాన్ని మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. వీరంతా తమ మిత్రులు, బంధువులతో కలిసి పుస్తక ప్రదర్శనకు రానున్నారు.

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బెంగళూరు నగరంలో ఈ శుక్రవారం నుంచి సోమవారం దాకా -జనవరి 7-10- నిర్వహిస్తున్నారు.

మరిన్ని వివరాలకు కింది వెబ్‌సైట్ చూడండి

http://www.samskritbookfair.org/

వివిధ సుప్రసిద్ధ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బృహత్ పుస్తక ప్రదర్శనశాలలో చందమామ పత్రిక 132వ స్టాల్‌లో చందమామ ప్రత్యేకించి, సంస్కృత చందమామలను ప్రమోషన్ కోసం ఉంచుతోంది. ఆసక్తి కలిగి ప్రదర్శనశాలకు వెళ్లేవారు చందమామ స్టాల్‌ని కూడా తప్పక సందర్శించగలరు

వేదిక: బెంగళూరులోని బసవనగుడి నేషనల్ కాలేజీ గ్రౌండ్

గమనిక: దాదాపు సంవత్సరం తర్వాత ప్రాంతీయ చందమామ జనవరి సంచికలు జనవరి తొలి వారంలోనే మార్కెట్‌లోకి వెళ్లాయని వార్త. శ్రీనివాస కల్యాణం సీరియల్‌తో సహా 14 కొత్త కథలతో – ఈ 20 ఏళ్లలో ఇదే మొదటిసారి- పత్రిక మునుపటి సైజులో -పాత చందమామ కంటే కొంచెం చిన్నసైజుతో- మార్కెట్లోకి వచ్చింది.

RTS Perm Link