చందమామ అలనాటి ముఖచిత్రం

October 27th, 2010

1948 ఫిబ్రవరి చందమామ ముఖచిత్రం

చందమామ ఈ నెల కూడా లేటుగా వచ్చింది. ఈ వారమే మాకూ ఆఫీసులో అందింది. ముఖచిత్రం చూడగానే ఆనందం. చందమామ మేటి చిత్రకారులలో ఒకరైన ఎంటీవీ ఆచార్య గారు 1948 ఫిబ్రవరి సంచికకు వేసిన ఫ్రంట్ కవర్ పేజీని ఈ అక్టోబర్ చందమామకు ముఖచిత్రంగా వేశారు.

పెద్దబ్బాయి తన తమ్ముడిని, చిన్నారి చెల్లెలిని తోపుడు బండిలో కూర్చోబెట్టి మెల్లగా లాగుతున్న దృశ్యం. బండి, పిల్లలు, శుభ్రంగా ఉన్న పల్లెదారి, పచ్చిక, గడ్డిపూలు, నేపధ్యంలో పెద్ద చెట్టు, పక్షులు, ఆకాశం… అన్నీ కొట్టొచ్చేంత స్పష్టంగా ఈ ముఖచిత్రం మనకు చూపుతోంది.  మానవ శరీర నిర్మాణాన్ని ఔపోశన పట్టి మహాభారతం సీరియల్‌‌లో, తదనంతర కాలంలో ఎంటీవీ ఆచార్య గారు చిత్రించిన అద్భుత చిత్రాలను తలపిస్తూ ఒకనాటి చందమామ చిత్రవైభవానికి చిత్రిక పడుతోందీ చిత్రం.

(ఎం.టి.వి. ఆచార్య
ఎం.టి.వి. ఆచార్య 1948లో చందమామలో ఆర్టిస్టుగా చేరాడు. చిత్రాగారు చందమామ తొలిచిత్రకారుడు కాగా, ఆచార్య గారు రెండవవారు. 1960 వరకు రెగ్యులర్‌గా చందమామలో పనిచేసిన ఈయన  మహాభారతం అట్టచివరి బొమ్మకూ, అట్టమీది బొమ్మకూ అద్భుతమైన బొమ్మలు గీశాడు. ఆయనకు మనుషుల ఎనాటమీ క్షుణ్ణంగా తెలుసు. సుమారు 20 ఏళ్ళ పాటు కొనసాగిన మహాభారతం సీరియల్‌కు ఆయన వివిధ పాత్రల ముఖాలు ఏ మాత్రమూ మార్పు లేకుండా చిత్రీకరించాడు. అందరూ బుర్రమీసాల మహావీరులే అయినా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, ఇలా ప్రతి ఒక్కరినీ బొమ్మ చూడగానే పోల్చడం వీలయేది. భీష్ముడికి తెల్ల గడ్డమూ, బట్టతలా ఆయనే మొదటగా గీశాడు. భీష్మ సినిమాలో ఎన్‌.టి.రామారావు ఆహార్యమంతా చందమామలో ఆయన వేసిన బొమ్మల నుంచి తీసుకున్నదే. ఆ తరవాత ఆయన వ్యక్తిగత కారణాలవల్ల బెంగుళూరుకు వెళ్ళిపోయారు.)

చందమామ అలనాటి చిత్రకారులకు సంబంధించిన వివరాలు దాదాపుగా దొరుకుతున్నాయి కాని ఆచార్య గారి వివరాలు అస్సలు అందుబాటులోకి రావడం లేదు. రోహిణీ ప్రసాద్ గారు తమ చందమామ జ్ఞాపకాలులో ఆచార్య గారి గురించి రాసిన పై బాగం తప్పితే ఆయన గురించి పెద్దగా వివరాలు తెలీవు.

1995 వరకు జీవించిన ఆచార్య గారు చందమామలో గీసిన ముఖచిత్రాల ఒరిజనల్ ప్రతులను రష్యా తదితర దేశాల్లో ప్రదర్శించి ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. చిత్రకారులు అప్పట్లో గీసిన పలు చిత్రాలను అప్పటి యాజమాన్యం ఉదారంగా బయటకు కూడా ఇచ్చేదని తెలుస్తోంది. ఆచార్య గారు కూడా ఇలా తన చిత్రాలను తీసుకెళ్లి ప్రదర్సనశాలల్లో ప్రదర్సించారు. తర్వాత వాటిని తిరిగి ఇవ్వలేకపోవడంతో మహాభారతంకు ఆయన గీసిన ఒరిజినల్ చిత్రాలు ప్రస్తుతం చందమామ వద్ద కూడా లేవు.

కాని ఆయన అప్పట్లో వేసిన కొన్ని చిత్రాలు మాత్రం రిజెక్ట్ కాగా వాటిని ఇప్పటికీ భద్రంగా ఆఫీసులో ఉంచారు. ఇలా ప్రచురణకు తీసుకోకపోవడంలో మిగిలిపోయిన చిత్రాలు వపా గారితో సహా ఇతర చిత్రకారుల చిత్రాలు  కూడా చందమామ ఆఫీసులో సురక్షితంగా ఉన్నాయి.

ఆచార్య గారికి కన్నడ సాస్కృతిక కళారంగంలో మంచి పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకు మించి వివరాలు తెలీవు.ఎవరికయినా కన్నడిగుడైన ఎంటీవీ ఆచార్య గారి వివరాలు తెలిసే అవకాశమంటే కాస్త చందమామ చెవిన వేయగలరు.

ముందుగా, 1948 ఫిబ్రవరిలో ఆచార్య గారు చందమామకు వేసిన ముఖచిత్రాన్ని దాని ఒరిజనల్ రూపంలో చూడాలనుకుంటే ఈ అక్టోబర్ చందమామను తీసుకోగలరు. ఈవారమే చందమామ మార్కెట్‌లోకి వచ్చింది పత్రిక అందుబాటులోనే ఉంది.

ఇప్పడు చందమామ అక్టోబర్ సంచికను తప్పక తీసుకుని చూడగలరు. దీంట్లో పాత కథలు, కొత్త కథలు నిజంగానే పోటీ పడ్డాయి. అన్ని కథలూ బాగానే ఉన్నాయి. మీరే చదివి చెప్పండి.
చందమామ.

RTS Perm Link


5 Responses to “చందమామ అలనాటి ముఖచిత్రం”

 1. వేణు on October 27, 2010 8:03 AM

  బుక్ స్టాండ్స్ లో చందమామ ఎంటీవీ ఆచార్య గారి ముఖచిత్రంగా కనిపించగానే ఆనందాశ్చర్యాలు కలిగాయి. ఆచార్య గారి ముఖచిత్రం ప్రింటులో చూడటం ఇదే తొలిసారి. చిక్కిపోయిన చందమామ సైజులో కూడా ఈ ముఖచిత్రం అందం తగ్గలేదు. (అయితే ఆచార్య గారి బొమ్మల శైలికి ఇది సరైన ప్రాతినిథ్యాన్ని వహించకపోవచ్చు). ఆచార్య గారి మహాభారతం వర్ణచిత్రాలను చందమామలో రాబోయే రోజుల్లో వరసగా ప్రచురిస్తారేమో అనే ఆశ కలుగుతోందిప్పుడు!

  ఇంతకీ ఈ ముఖచిత్రం ప్రస్తావన గానీ, చిత్రకారుడి పేరు గానీ లోపల ఎంత వెతికినా కనిపించలేదు. ఆ లోటు తీర్చటానికా అన్నట్టు ఇవాళ మీ టపా! సంతోషం.

 2. chandamama on October 28, 2010 2:27 AM

  వేణుగారూ, చందమామ ముఖచిత్రంపై మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ రోజు నెట్‌ ద్వారా అక్కడక్కడా కనిపించిన చందమామ చిత్రకారుల సమాచారాన్ని ప్రత్యేకించి ఎంటీవీ గారిపై సమాచారాన్ని కథనంలో అదనంగా ఇస్తున్నాను చూడండి. చివరలో చందమామ గురించిన ప్రత్యేక సమాచారపు లింకులను కూడా ఇస్తున్నాను. బహుశా మీకు ఇప్పటికే ఇవి తెలిసి ఉండవచ్చు.

 3. వేణు on October 28, 2010 10:16 PM

  రాజు గారూ, ఎంటీవీ ఆచార్య గారిపై నెట్ లో ఉన్న సమాచారాన్ని ఒకచోట చేర్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆచార్య గారి పేరు రోహిణీ ప్రసాద్ గారి వ్యాసంలో తొలిసారి నాక పరిచయమయింది. ఆపై ఆయన గురించీ, ఆయన చిత్రకళా శైలి గురించీ తెలుసుకోవాలనే ఆసక్తితో రెండేళ్ళ క్రితం నేను మీలాగే అంతర్జాలంలో అన్వేషించాను.

  ఇంతకీ ఆచార్య గారి ‘మహా భారతం’ బొమ్మలను క్లుప్త వివరణతో చందమామలో మళ్ళీ ప్రచురించే అవకాశం ఉందేమో చెప్పగలరా?

 4. chandamama on October 29, 2010 12:01 AM

  వేణు గారు,
  మహాభారతం సీరియల్‌ని తిరిగి ఏప్రిల్ తర్వాత ప్రచరించే అవకాశం ఉందనుకుంటాను. శ్రీనివాస కల్యాణం సీరియల్ ఏప్రిల్‌లో ముగుస్తుంది కాబట్టి, కొత్త సీరియల్‌గా మహాభారతం తిరిగి ప్రచురించే అవకాశం ఉంది. అలా కాకపోయినా మీరు చెప్పినట్లు ఆచార్య గారి ‘మహా భారతం’ బొమ్మలను క్లుప్త వివరణతో చందమామలో మళ్ళీ ప్రచురించే అవకాశం గురించి మీ అభిప్రాయం చాలా బాగుంది. పైవారికి తెలియ జేస్తాను. వారికి ఆమోదమైతే మీ కోరిక తీరవచ్చు. నా వంతు ప్రయత్నం కూడా చేస్తాను. మీ కోరిక నెరవేరాలనే ఆశిస్తున్నాను.

  ఇంతకూ మీరు చందమామకు కథలు పంపరా? కథలు రాయగల సమయం, తీరిక మీకు ఉంటే తప్పక పంపించగలరు.

  రచన శాయిగారు ఈ మధ్యే చందమామ ఆర్ట్‌బుక్ రెండు సెట్స్ తీసుకున్నారు. వీలయితే ఆ పుస్తకాలను ఒకసారి వెళ్లి చూడండి. వపాగారి ఒరిజనల్ చిత్రాలు 80, ఎంటీవీ ఆచార్య గారివి 25 వరకు ఈ పుస్తకంలో ప్రచురించారు. ధర చాలా ఎక్కువ కాబట్టి కొనమని మీకు రెకమెండ్ చేయలేదు. చూడండి చాలు.చూశాక మీ అభిప్రాయం పంపితే బాగుంటుంది.

  తమిళనాఢులో సుప్రసిద్ధ పత్రిక ఆనంద వికటన్ వారు ఈ నెల దీపావళి ప్రత్యేక సంచికలో చందమామ ఆర్ట్ బుక్ గురించి 5 పేజీలు ప్రకటన వేశారు. దీంట్లో కూడా చిత్రా, ఆచార్య, వపా, శంకర్ గారి ఒక్కో ఒరిజనల్ కలర్ చిత్రం పుల్ పేజీలో వేశారు. ఆచార్య గారిది తప్ప మిగిలిన వారి ఫోటోలు కూడా దీంట్లో ప్రచురించారు. వెల 90 రూపాయలు. అయినా కేవలం వీరి చిత్రాలకోసమే నేను ఈ సంచికను కొన్నాను.

 5. ramana on November 4, 2010 6:24 AM

  alanati 1952-1960 natiki 15 samvatsarala lopu school pillalandaru thappaka ‘chandamama’ chadivevaru.. aa ndu rly higgin bothams lo railu prayanamappudu chandamama konichivaru

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind