నా చందమామ జ్ఞాపకాలు

October 25th, 2010

నా పేరు కోనె నాగ వెంకట ఆంజనేయులు. వేలాది మంది చందమామ పిచ్చివాళ్లలో -వీరాభిమానులు- నేనూ ఒకడిని. ఒకప్పుడు నా కంటే పెద్ద చందమామ పిచ్చివాడెవడూ లేరనుకునేవాడిని. ఇప్పుడు నా అభిప్రాయం  మార్చుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యనే తెలిసింది. నా కంటే పిచ్చివాళ్లు కోకొల్లలుగా ఉన్న సంగతి.

నేను యాభై ఏళ్లుగా చందమామ పాఠకుడిని. నలభై ఏళ్లుగా చందమామలు జాగ్రత్తలు చేస్తున్నవాడిని. ఇరవై సంవత్సరాలుగా చందమామకు కథలు రాస్తున్నవాడిని.

చందమామ నాకు పరిచయమయింది 1962 జూలై సంచికలోని “మేలు చేసిన వాడు” కథతో. అప్పటికి నాకు తొమ్మిదేళ్లు. ఏలూరులో మా  వీధిలో ఓ ఇంటి అరుగుమీద ఒక వ్యక్తి చందమామ చదువుతుంటే ముఖచిత్రం చూసి ఆకర్షితుడినై ఆ వ్యక్తి పక్కకు చేరి అతడితో పాటు ఆ కథ చదివాను.

బేతాళ కథకు శంకర్ గారి చిత్రం

ఆ బేతాళ కథ, శంకర్ వేసిన బురుజు విరిగి పడుతున్న దృశ్యం బొమ్మ నన్ను అమితంగా ఆకర్షించాయి. వెంటనే యింటికి వెళ్లి మా నాన్నగారితో ఆ పుస్తకం కొనిపించుకున్నాను. పేచీ పెట్టకుండానే నా కోరిక నెరవేరింది. ఆ నాటి నుండీ ఈ నాటివరకూ చందమామ నా జీవితంలో ఒక భాగమైపోయింది.

మొదట్లో చందమామలు జాగ్రత్త పెట్టడం తెలియలేదు. చాలా పుస్తకాలు మా పెద్దమ్మలు ఊరికి వెళుతూ కాలక్షేపానికి పట్టుకుపోయోవారు. అవి నాకు తిరిగి వచ్చేవి కాదు. 1962 నుంచి 1970 వరకు ఇలాగే అన్ని కాపీలూ పొగొట్టుకున్నాను. 1971 నుండి మాత్రం చందమామలు ఎవరికీ ఇచ్చే ప్రసక్తి పెట్టుకోలేదు. అప్పటినుండీ ఇప్పటి వరకూ అన్ని చందమామలూ నావద్ద భద్రంగా ఉన్నాయి. కాని ఇప్పటికీ పాత పుస్తకాల షాపులకు వెళ్లి 1971కి ముందు చందమామలు దొరుకుతాయేమోనని వెతుకుతుంటాను.

1962 జూలై చందమామ

అలా 1995లో, నేను మొట్టమొదట చూసిన -1962 జూలై- చందమామ మరి మూడు చందమామలతో కలిసి ఒకే బైండుగా దొరికింది. కనకమహాలక్ష్మి ఆలయం దగ్గరున్న ఓ షాపులో అది దొరికింది. ఆ బైండుకు అటూ ఇటూ చెదలు చేసిన కన్నాలు ఓ పాతిక ముప్పై ఉన్నప్పటికీ చదువుకోవడానికి అడ్డు రాలేదు. ఆ బైండు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ పుస్తకాలలో ఉన్న పేరు జి.సత్యనారాయణ గారిది. ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

అప్పట్లోనే -1973-లో నా క్లాసుమేటూ, బాల్యమిత్రుడూ అయిన యర్రంశెట్టి రాధాకృష్ణ యింట్లో 1950 నుండి 1965 వరకూ చందమామలు ఉన్నట్లు తెలిసింది. కానీ వాళ్ల నాన్నగారికి ఆ పుస్తకాలు ఎవరికీ ఇవ్వడం ఇష్టం ఉండదని చెప్పాడు. కానీ నేను వదలకుండా వాణ్ణి బ్రతిమాలి, చదివి ఇచ్చేస్తానని చెప్పి రోజుకో మూడు చొప్పున చందమామలు తీసుకెళ్లి చదివి తిరిగి ఇచ్చేసేవాడిని.  కొన్ని చాలా మంచి కథల్ని వదల బుద్ది కాక ఒక్కొక్క సంచికలోంచి నాకు బాగా నచ్చిన కథలు ఒక్కొక్కటి చొప్పున జాగ్రత్తగా విడదీసి తీసి మళ్లీ జాగ్రత్తగా బైండ్ చేసేవాడిని.

అలా 1950 నుంచి 1965 వరకూ నేను సేకరించిన కథలన్నీ ఓ బైండ్ ఇప్పటికీ నా దగ్గరే ఉంది. కానీ ఇప్పటికీ వాడికీ విషయం తెలియదు. తరవాత ఎప్పుడో తెలిసింది. వాళ్ల నాన్నగారు ఆ పుస్తకాలన్నీవాళ్ల స్నేహితుడెవరికో ఇచ్చేశారని. అప్పుడు చాలా బాధనిపించింది. నా సంపద నెవరో కొల్లగొ్ట్టేసినట్లు బాధపడ్డాను. కానీ ఇప్పుడా బాధ లేదనుకోండి. ఎందుకంటే పాత చందమామలన్నీ ఇప్పుడు నెట్‌లో చదువుకోవడానికి లభ్యమవుతున్నాయి. రోజుకో సంచిక చొప్పున చదువుతూ ప్రస్తుతం 1953 జూన్ వరకూ వచ్చాను.

1947 తొలి చందమామ ముఖచిత్రం

1947, 48, 49 నాటి చందమామలు కొన్ని శ్రీకాకుళం కథానిలయంలో ఉన్నట్లు తెలిసి వెళ్లి అవన్నీ జిరాక్స్ కాపీలు చేయించుకుని తెచ్చుకున్నాను. అలాగే శ్రీనివాస్ అనే ప్రెండ్ దగ్గరనుంచి 1961 నుండి 1968 వరకు ఉన్న కొన్ని చందమామలు కూడా జెరాక్స్ చేయించి తెచ్చుకున్నాను.

ఇదంతా నా చందమామల సేకరణ గురించి.

చందమామలో కథలు రాయడం గురించి చెప్పాలంటే..

చందమామల్లోని కథలు చదవగా, చదవగా నాకు కూడా చందమామకు కథలు రాయాలనే కోరిక కలిగింది. అప్పటికే మిగతా పత్రికలలో నావి కథలూ, కవితలూ, జోక్స్ మొదలైనవి వచ్చి ఉన్నాయి. చందమామలో కూడా నా కథలు చూసుకోవాలనే కోరికతో 1981లో కథ  రాసి పంపితే వెంటనే ప్రచురించారు. చాలా సంబరపడిపోయాను. చందమామలో నా పేరు చూసుకుని. అదే సంవత్సరం నా కథలు మరో మూడు చందమాలో పడ్డాయి. 1986లో మరో కథ ప్రచురణ తర్వాత ఎందుకనో ఆరు సంవత్సరాల గ్యాప్ వచ్చింది చందమామలో కథలు రాయడానికి.

1992లో జ్వరంతో బాధపడుతూ కొన్ని రోజులు ఇంట్లో విశ్రాంతిగా ఉండటంతో మళ్లీ చందమామ కథలు రాయడం మొదలు పెట్టేను. అప్పటి నుండి విరామం లేకుండా 2005 వరకూ ఎనభై పైగా కథలు చందమామకు వ్రాశాను. ఇంచుమించు ప్రతికథా హేలాపురిలో అంటూ ప్రారంభమవుతాయి నాకథలు చందమామలో. హేలాపురి మా ఊరు ఏలూరుకి పూర్వనామం, మా ఊరు మీదున్న మమకారంతో నా కథలకు ఆ పేరు పెట్టేవాడిని.

మొదట్లో సింగిల్ పేజీ కథలు రాసేవాణ్ణి. కొన్ని కథలు ప్రచురించబడిన తర్వాత, దాసరి సుబ్రహ్మణ్యం గారు – పెద్ద కథలు రాయమని ప్రోత్సహించారు తన ఉత్తరాల ద్వారా. అప్పటినుంచే పెద్ద కథలు కూడా చాలా రాసి పంపించాను. అన్నీ ప్రచురింపబడ్డాయి.

చాలా కథలు ప్రచురణ అయిన తర్వాత, చందమామ పాత సంచికలు కావలని దాసరి గారికి ఉత్తరం రాశాను. చందమామ కాపీలు  ఏజెంట్ల ఆర్డర్ల మేరకు బొటాబొటీగా ప్రింట్ చేస్తామని, పాత కాపీలు దొరకటం కష్టమనీ బాధపడుతూ ఆయన జవాబిచ్చేరు.
చందమామలో ఒక్కొక్కసారి ఒకే సంచికలో నావి రెండు కథలు ప్రచురణకు నోచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఒకే రచయిత కథలు రెండు ఒకే సంచికలో ప్రచురించకూడదన్న నియమం చందమామకున్నది. అందుకే ఒక కథ నా పేరుతోనూ, మరొక కథ కె.హనుమంతరావు పేరుతోనూ ప్రచురింపబడేది. ఈ విషయం దాసరి గారి దృష్టికి తీసుకెళితే, ఒకే సంచికలో ఒకే రచయితవి రెండు కథలు ప్రచురించకూడదన్న చందమామ నియమం కారణంగా రెండో కథకు నా పేరుకు దగ్గరగా ఉండేలా కె. హనుమంతరావు అనే పేరు పెట్టేనని తెలియపరిచేరు.  (పారితోషికం మాత్రం నా పేరు మీదే రెండు కథలకూ పంపేవారు)

ఈ కె. హనుమంతరావు పేరు నాకు రుచించక పోవడంతో ఆయనకు ఉత్తరం రాశాను. ఒకే సంచికలో నావి రెండు కథల ప్రచురణ అనివార్యమైన పక్షంలో ఆ రెండో కథకు మా అమ్మాయి పేర కో.క. గౌతమి – కోనే కనక గౌతమి- పేరుతో ప్రచురించవలసిందిగా కోరాను. తర్వాత ఆయన నాకు రాసిన ఉత్తరంలో కోక గౌతమి పేరు గుర్తు పెట్టుకుని అలానే చేస్తానని మాట ఇచ్చారు. ఇవి చందమామతో, దాసరి సుబ్రహణ్యం గారితో నాకున్న అనుబంధాలు, తీపి జ్ఞాపకాలు.

K.N.V Anjaneyulu

విశాఖపట్నం అంటే చందమామ కథకుల ఊరు. ఎంతోమంది సీనియర్ కథకులు ఈ నగర వాసులుగా జీవిస్తూ దశాబ్దాలుగా చందమామ పాఠకులుగానే కాక తదనంతర జీవితంలో చందమామ కథకులుగా కూడా రూపొందుతూ చందమామతో సజీవ సంబంధాలు కొనసాగిస్తున్నారు. శ్రీ కొనే వెంకట ఆంజనేయులు గారు కూడా ఈ కమనీయ కథా చరిత్రలో భాగస్థులు. తమ పుట్టిల్లు ఏలూరు పూర్వనామమైన హేలాపురిని తమ ప్రతి కథలో భాగం చే్స్తూ ఈయన ఇప్పటికీ చక్కటి కథలు చందమామకు పంపుతూనే ఉన్నారు.

మా అనుభవంలో చందమామ కథకులు రెండు రకాలు. చందమామ కథల నిడివి, ఇతివృత్తం, శైలి వంటివి క్షుణ్ణంగా తెలిసి చక్కటి పొందికతో పేజీల కొలతలకు సరిగ్గా సరిపోయేలా కథలు రాసేవారు. చందమామ కథల ఇతివృత్తం, శైలి వంటివి తెలియకపోయినా చందమామలో తమ కథ చూసుకోవాలనే ఆరాటంతో ఔత్సాహిక ధోరణిలో కథలు పంపేవారు. కొత్తగా కథలు పంపేవారి రచనలలో ఏమాత్రం వాసి ఉందనిపించినా సరే కాసిన్ని మార్పులతో వారికి ప్రోత్సాహం ఇచ్చి ప్రచురించే చరిత్ర చందమామకు తొలినుంచి ఉంది.

ఆంజనేయులుగారు ఈ వర్గీకరణలో తొలి కోవకు సంబంధించిన వారు. తొలినుంచి చివరి దాకా విడువకుండా చదివించే ధోరణి, కథలో బిగి సడలకుండా పక్కతోవలు పట్టకుండా సూటిగా విషయానికి కట్టుబడి రాసే కొద్ది మంది ప్రతిభావంతులలో వీరు ఒకరు. కథ ఏ కారణం చేత అయినా ప్రచురణకు తీసుకోకపోయినా సరే ఆ కథ పునఃపరిశీలనకు తీసుకోవడానికి మరోసారి ఆలోచింపజేసే శక్తి ఈయన కలానికి ఉందంటే అతిశయోక్తి కాదు.

ఈయన ఇటీవలే పంపిన తమ చందమామ జ్ఞాపకాలు ఒరిజనల్ కాపీని బస్సులో వెళుతూ పోగొట్టాను. చందమామ ఆఫీసులో పని ఎక్కువై చందమామ జ్ఞాపకాలను ఇంటి వద్ద టైప్ చేసి తీసుకువద్దామని భావించి రెండు వారాల క్రితం ఇంటికి తీసుకెళితే అనివార్య కారణాలతో  ఆ పనికాలేదు. ఇక్కడ సాధ్యం కాదని మళ్లీ మరుసటి రోజు ఆఫీసుకు తీసుకెళుతూ బస్సులో సీటు కింద పెట్టి దిగవలసిన స్టాప్ వద్ద త్వరత్వరగా దిగబోయే ఒత్తిడిలో ఆంజనేయులు గారి జ్ఞాపకాలను మర్చిపోయాను. ఎంత బాధపడ్డానంటే వారం రోజులు ఆయనకు ఫోన్ కూడా చేయడానికి సాహసించేలేకపోయాను. అంత కష్టపడి తన చందమామ జ్ఞాపకాలను పంపితే సులువుగా పోగొట్టేశానే అనే అపరాధ భావన. చివరకు సాహసించి ఫోన్ చేసి జ్ఞాపకాలు మీవద్ద జిరాక్స్ కాపీ ఉంది కదా అని అడిగి నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నాను.

ఆంజనేయులు గారూ!
మీ పని ఒత్తిడిలో ఉంటూనే చందమామకు కథలతో పాటు, చందమామ జ్ఞాపకాలను కూడా పంపించినందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు. చందమామతో మీ దశాబ్దాల బంధం చివరి వరకు కొనసాగుతుందని, కొనసాగాలని కోరుకుంటున్నాము.

ఈ సంవత్సరం మీరు తీసుకోలేకపోయిన మూడు నెలల చందమామ కాపీలను తీసిపెట్టాము. తప్పక ఈ వారంలో మీకు పంపించగలము. కాంప్లిమెంటరీ కాపీలు పంపలేని మా అశక్తతను మన్నిస్తారని తలుస్తున్నాము. కొనగలిగితే ఇటీవలే చందమామ ప్రచురించిన చందమామ ఆర్ట్ బుక్ తప్పక తీసుకోగలరు. ధర ఎక్కువే అయినప్పటికీ జీవిత కాల జ్ఞాపకంగా భద్రపర్చుకోదగిన 200పైగా చందమామ అలనాటి ఒరిజినల్ ముఖచిత్రాలను ఈ పుస్తకంలో ప్రింటు చేయడం జరిగింది. రెండు ముప్పావు కిలోల బరువుండే ఈ ఆర్ట్ బుక్ రెండుభాగాల వెల రూ.1500.00. ఖచ్చితంగా ఇది మీకు సంతోషం కలిగిస్తుందనే అనుకుంటున్నాము.

చందమామ వెబ్‌సైట్‌లో కూడా మీ చందమామ జ్ఞాపకాలు ప్రచురిస్తున్నాము చూడండి.
చందమామ.

RTS Perm Link


Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind