చందమామ చదవడం ఒక సంస్కారం, ఒక సంస్కృతి

September 17th, 2010

ఏనాటి కథ?  ఓ యాభై  ఏళ్ళ నాటిది.  నెల్లూరులో మా పక్క ఇంట్లో ఏల్చూరి రామానుజం శెట్టి గారు ఉండేవారు. ఆయన  శ్రీ కృష్ణ రాయబారం చిత్ర నిర్మాత.  కావడానికి కమ్యునిష్టు అయినా వాళ్ళ ఇంట్లోని “సుశాంగి”(సుజాత- శాంతి- గిరీష్)  గృహ గ్రంధాలయంలో అన్ని రకాల పుస్తకాలూ ఉండేవి.

వాళ్ళ పిల్లల సంగతి ఎలా ఉన్నా నేనూ మా తమ్ముడూ అందులో దూరి పొద్దస్తమానం పుస్తకాల మధ్యనే గడిపే వాళ్ళం.

ముఖ్యంగా చందమామ బౌండ్ పుస్తకాలు మాకు ప్రధాన ఆకర్షణ. జ్వాలాద్వీపం, రాకాసిలోయ వంటి అద్భుత కథలు చదివి మైమరచి పోయేవాళ్ళం.

దాసరి సుబ్రహ్మణ్యం గారు

చందమామలో వచ్చిన ధారావాహికలన్నీ చదివానుగాని రాకాసి లోయ లాంటి కథ మాత్రం ఎక్కడా చదవలేదు. అది ఒక్కటీ ఒక ఎత్తు. దాన్ని సినిమా తీస్తే ఎలా వుంటుందో నని ఊహించు కునేవాళ్ళం.ఎవరికి ఏ వేషం ఇవ్వాలో ఏ లోకేషన్లలో తీయాలో ఆలోచిస్తుండే వాళ్ళం. దాన్ని కల్పన చేసిన రచయిత ఎవరో ఆనాడు మాకు తెలీదు. కాని అతడు సామాన్యుడు కాదని మాత్రం అర్థమైంది.

రామానుజం గారు చాలా స్ట్రిక్ట్. పుస్తకాలు ఇంటికి ఇచ్చేవారు కాదు. ఈ ఒక్క  బౌండ్ పుస్తకమూ ఇస్తే బాగుండు నని ఆశ పడేవాళ్ళం. చివరికి వాళ్ళ ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి మారిపోయారు.

ఆ పుస్తకాలు ఏమయ్యాయోనని ప్రాణం విలవిలలాడి పోయింది! కాని ఆయన  మనస్సు కరగలేదు. పుస్తకాలు కొన్ని చెదలు పట్టాయట. కొన్ని వాళ్ళ పిల్లలు తీసుకెళ్ళి ఉండవచ్చు. ఏమైతేనేమి, నా రాకాసిలోయ దూరమైంది. ఆయన ఎప్పుడు గుర్తు వచ్చినా నన్ను మోసం చేశాడనే అనిపించేది.

కొన్ని దశాబ్దాలు గడిచాక  మిత్రుడు కంచనపల్లి కృష్ణారావు కర్నూలు నుండి ఫోన్ చేసి నీ రాకాసిలోయ మళ్ళీ చందమామలో వస్తోంది చూస్తున్నావా? అన్నాడు. ఎప్పటినుంచి? అని అడిగాను ఆత్రుతగా.  అయిదారునెలలనుంచి అన్నాడు. గుండె పగిలిపోయింది. తాజా సంచికనుండి కొనడం ప్రారంభించాను. పాతవి దొరికేదేలా? ఏజెంటును అడిగితే మద్రాసులో ట్రై చెయ్యమన్నాడు.

లాభంలేదని రావి కొండలరావు గారిని అడిగాను. పాపం ఆయన నాయందు దయతలిచి చందమామ ఆఫీసు వాళ్ళతో మాట్లాడారు. రెట్టింపు ధర చెల్లించాలని చెప్పారు. సరే అన్నాను. మనీఆర్డర్ పంపగానే పాత సంచికలు వచ్చేశాయి!

50 ఏళ్ల క్రితం ఇది ఓ చరిత్ర

అవి అన్నీ కలిపి బైండు చేయించాక నాకు ఏ భారత రత్న పురస్కారమో అందుకున్నంత గర్వంగా అనిపించింది. ఇప్పుడు నేను రాకాసిలోయ అధిపతిని! జాగ్రత్త!

స్పీలుబర్గులూ జార్జ్ లూకాసులూ ఎందుకు పనికొస్తారు దాసరి గారి కాల్పనిక శక్తి ముందు? చిత్ర గారి ఊహాశక్తి ముందు? ఇప్పటికైనా దాన్ని సినిమా తీయచ్చు. ఒక మగధీరను తలదన్నేలా. (రాజమౌళీ వింటున్నావా?) కాపీ రైట్ తీసుకోకుండా కాపీ కొట్టడమే మా రైట్ అనే దర్శకులు ఉన్నారిక్కడ.

చిన్నప్పుడు చందమామలో ఫోటో వ్యాఖ్యల పోటీకి పంపే వాళ్ళం. రెండుసార్లు బహుమతి వచ్చిన జ్ఞాపకం. పెద్దయినాక కూడా ఈ అభిరుచి పోలేదు. ఆంధ్రప్రభలో సబ్ఎడిటర్‌గా చేసే రోజుల్లో సైతం నేనూ కొప్పర్తి యజ్ఞన్నగారూ  దీనికి ప్రతినెలా పంపేవాళ్ళం. అదో సరదా. చాలా creative exercise.

1947 చందమామ తొలి ముఖచిత్రం

ఇక చందమామలో ఏనాటికైనా మన కథ పడితే చాలునని అల్లాడిపోయేవాడిని. చివరికి భారతిలోనైనా నా కవిత్వం ప్రచురించారుగాని చందమామలో నాకు చోటు దక్కలేదు. అంటే మన రచన అంత స్థాయిలో లేదని సరిపెట్టుకున్నాను.

కాలేజీలో నా సమకాలికుడు మాచిరాజు కామేశ్వరరావు కథలు ప్రతి నెలా చందమామలో వచ్చేవి. అతడిని కలిసి అభినందిద్దామని అతని కోసం చాలా ప్రయత్నం చేశాను. చివరికి అతను విజయవాడ లోనే ఉన్నాడని తెలిసిందిగాని కలవలేకపోయాను. అతనంటే నాకు గొప్ప admiration. చివరికి మా కంచనపల్లి కృష్ణారావు రాసిన చిన్న కథ ఈమధ్య చందమామలో వేశారు. అప్పటినుంచి నాకు అదోలా ఉంటోంది. అది ఈర్ష్యా?  ఏమో! చెప్పలేను. నేను సాధించలేనిది మా కిట్టూ సాధించాడు మరి!

చందమామ చదవడం ఒక సంస్కారం, ఒక సంస్కృతి. ఆ సంస్కృతిలో పెరిగినందుకు  గర్విద్దాము. దాసరిగారి రచనలు చదివామని, చిత్ర, శంకర్ గార్ల బొమ్మలు చూడగలిగామనీ పొంగిపోదాము. తెలుగు జాతి సంపద అయిన ఈ మహానుభావులను తగు రీతిలో గౌరవించుకోలేకపోయినందుకు మాత్రం తల వంచుకుందాము.
– ప్రసాద్ ఎం. వీ. ఎస్.

సరోజా ప్రసాద్ గారూ,

నిన్న -01-09-2010- ఫోన్‌లో మాట్లాడిన 24 గంటలలోపే మీ చందమామ జ్ఞాపకాలను హృదయంగమ రీతిలో పంపారు. అదీ ఒక విశిష్ట చరిత్రను తడిమారు. 1947నుంచి తెలుగు నేలమీద ప్రసరించిన ఒక మహత్తర భావ సంస్కారాన్ని, ఒక కమనీయ కథా సంస్కృతిని మళ్లీ మీరు అద్భుతంగా గుర్తు  చేశారు.

“స్పీలుబర్గులూ  జార్జ్ లూకాసులూ ఎందుకు పనికొస్తారు దాసరి గారి కాల్పనికశక్తిముందు?” తెలుగు కథకులు కాలరెత్తుకుని గర్వంగా తిరగగలగిన గొప్ప వ్యాఖ్య ఇది.

“చందమామ చదవడం ఒక సంస్కారం, ఒక సంస్కృతి. ఆ సంస్కృతిలో పెరిగినందుకు  గర్విద్దాము. దాసరిగారి రచనలు చదివామని, చిత్ర, శంకర్ గార్ల బొమ్మలు చూడగలిగామనీ పొంగిపోదాము. తెలుగు జాతి సంపద అయిన ఈ మహానుభావులను తగు రీతిలో గౌరవించుకోలేకపోయినందుకు మాత్రం తల వంచుకుందాము.”

నిజమే..తలవంచుకుందాం అనే మీ మాట ఎక్కడో చెళ్లున తగులుతోంది.

“ఇక చందమామలో ఏనాటికైనా మన కథ పడితే చాలునని అల్లాడిపోయేవాడిని”.

మీరు పంపనున్న కథలకు చందమామ సాదర స్వాగతం పలుకుతోంది. వాటికోసం ఎదురు చూస్తున్నాం. మీదే ఆలస్యం మరి.

దాదాపు చందమామలో వచ్చిన అన్ని సీరియళ్లను మీరు ఇప్పుడు ఆన్‌లైన్ చందమామలో ఆర్కైవ్స్‌ విభాగంలో చూడవచ్చు.
1947నుంచి 2000 వరకు అన్ని చందమామ కాపీలను ఆన్‌లైన్‌లో వివిధ భాషల్లో మీరు చూడవచ్చు.

మీ జీవిత కాల జ్ఞాపకాలలో సజీవంగా నిలిచి ఉంటున్న రాకాసిలోయ సీరియల్‌ను ఈ వారం నుంచి తెలుగు చందమామ వెబ్‌సైట్‌లో కూడా ప్రచురిస్తున్నాము చూడగలరు.

రాకాసిలోయ – 1

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=36&sbCId=94&stId=2473

మన:పూర్వక కృతజ్ఞతలతో

చందమామ

గమనిక: శ్రీ ఎంవీఎస్ ప్రసాద్ గారిని ఇవ్వాళ పరిచయం చేయవలసిన పనిలేదు. కానీ నెల క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో భారతీయ అపురూప చిత్ర సంగీత సేకర్త శ్రీ శ్యామ్ నారాయణ్ గారి విశిష్ట కృషిని ప్రపంచానికి పరిచయం చేసిన వారిగా ఆయనను గుర్తించుకుందాము.

ఇదే కథనాన్ని తెలుగు చందమామ వెబ్‌సైట్‌లో కూడా మరిన్ని చిత్రాలతో ప్రచురించటమైనది. కింది లింకులో చూడగలరు.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2472

RTS Perm Link


4 Responses to “చందమామ చదవడం ఒక సంస్కారం, ఒక సంస్కృతి”

 1. రవి on September 17, 2010 6:56 AM

  “స్పీలుబర్గులూ జార్జ్ లూకాసులూ ఎందుకు పనికొస్తారు దాసరి గారి కాల్పనికశక్తిముందు?”

  వావ్! అప్పుడెప్పుడో భోజరాజు ఒక్కో అక్షరానికి ఒక్కోలక్ష చొప్పున ఇచ్చేవాడట. ఒక్కో అక్షరానికి ఒక్కో చందమామ ఇవ్వచ్చండి, పై వాక్యానికి.

  నేనూ చిన్నప్పుడు ముగ్గురు మాంత్రికులు సీరియల్ మా ఫ్రెండు ఒకతను ఇవ్వకపోతే, భలే ఈర్ష్యపడ్డాను లెండి. ఈ రోజు ముగ్గురు మాంత్రికులు బౌండు పుస్తకం (మూలన కాస్త చెదలు కొట్టేసి ఉన్నది), పట్టువదలని విక్రమార్కుడిలా ఎక్కడెక్కడో తిరిగి సంపాదించేను లెండి. ఇంజినీరింగులో డిస్టింక్షనులో పాసయినప్పుడూ అంత గర్వంగా ఫీలవలేదు, కాబట్టి మీ భారతరత్న పురస్కారం సంగతి నాకు అర్థం అయింది. 🙂

 2. Anonymous on September 17, 2010 10:49 AM

  “……స్పీలుబర్గులూ జార్జ్ లూకాసులూ ఎందుకు పనికొస్తారు దాసరి గారి కాల్పనిక శక్తి ముందు? చిత్ర గారి ఊహాశక్తి ముందు?….”

  దాదాపుగా ఇలాంటి మాటనే దాసరి వారి ధారావాహికలను హారీ పోటర్ కథలకంటే గొప్పవి అని నెను అదేదో బ్లాగులో వ్యాఖ్యగా వ్రాస్తే తెగ పొడుచుకు వచ్చి పిచ్చి ప్రేలాపనలు చెసాడొకడు. అలాంటి మానసికలోపులకు ప్రసాదు గారి వ్యాఖ్య కనువిప్పు అవుతుందని ఆశిద్దాం.

  చందమాలో దాసరి వారి ధారావాహికలు, చిత్రాగారి బొమ్మలు లెకపోతే అసలు ఇంతకాలం చందమామ గురించి చెప్పుకునే వాళ్ళమా.

  ప్రసాదుగారూ! ఈ కింది లింకు నొక్కి మీ అభిమాన ధారావాహిక రాకాసిలోయను డౌన్లోడ్ చేస్కోండి.

  http://rapidshare.com/files/239083238/RakasiLoya.pdf

 3. SIVARAMAPRASAD KAPPAGANTU on September 17, 2010 10:50 AM

  “……స్పీలుబర్గులూ జార్జ్ లూకాసులూ ఎందుకు పనికొస్తారు దాసరి గారి కాల్పనిక శక్తి ముందు? చిత్ర గారి ఊహాశక్తి ముందు?….”

  దాదాపుగా ఇలాంటి మాటనే దాసరి వారి ధారావాహికలను హారీ పోటర్ కథలకంటే గొప్పవి అని నెను అదేదో బ్లాగులో వ్యాఖ్యగా వ్రాస్తే తెగ పొడుచుకు వచ్చి పిచ్చి ప్రేలాపనలు చెసాడొకడు. అలాంటి మానసికలోపులకు ప్రసాదు గారి వ్యాఖ్య కనువిప్పు అవుతుందని ఆశిద్దాం.

  చందమాలో దాసరి వారి ధారావాహికలు, చిత్రాగారి బొమ్మలు లెకపోతే అసలు ఇంతకాలం చందమామ గురించి చెప్పుకునే వాళ్ళమా.

 4. subramanyam on May 16, 2011 6:42 AM

  what chandamama taught me
  1.I restrain using english words when iam speaking telugu
  2.I try to keep interiors of my house the chandamama way i.e. less furniture, more space
  3.Every chandamama story has a hidden model, I try to use it in my life.
  4.One of my interest is to find out small stories in mythology-inspired by chandamama again

  If I continue, this will go on….

  subbu

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind