చందమామ : అమ్మ జ్ఞాపకాలు

August 20th, 2010

అక్షరాల రుచి చూపించిన అమ్మ, కళల పట్ల కూడా అభిరుచి పెంపొందేలా నన్ను పెంచింది. చాలా ఏళ్ల వరకు సంతానం కలగని మా పెద్దమామయ్య సంరక్షణలో తాతగారింట పెరిగాన్నేను. నాన్న ఉద్యోగ రీత్యా కలకత్తాలో ఉండేవారు. వేసవి సెలవుల్లో స్నేహితులంతా తాతగారిళ్లకు వెళ్తుంటే నేను మాత్రం అమ్మా, నాన్న దగ్గరికి వెళ్తుండేవాణ్ణి.

వేసవి సెలవుల రెండు నెలల్లో కూడబెట్టిన జ్ఞాపకాలు మూటగట్టుకుని మళ్లీ వేసవి వరకూ అవే జ్ఞాపకాలతో గడిపేవాణ్ణి. సెలవులు ముగిశాక, అమ్మనీ, నాన్ననీ వీడి తాతగారింటికి తిరుగు ప్రయాణమయ్యేటపుడు ఆ చిన్నతనంలో నేననుభవించిన మనోవేదన నాకింకా గుర్తే.

తాతగారింట్లో హద్దుమీరిన ముద్దువల్ల అల్లరి అంచులు దాటిన నాకు క్రమశిక్షణ నేర్పించింది అమ్మే, కిటికీ గుండా వెన్నెల కిరణాలు పడుతుంటే, నిద్రపోయేముందు సుద్దులు చెబుతూ, చక్కని పాటలు పాడుతూ, మంచి మంచి కథలు చెబుతూ బలమైన వ్యక్తిత్వానికి పునాది వేసింది అమ్మ.

అమ్మ ఏకసంధాగ్రాహి. ఎక్కడ ఏ శ్లోకాలు, పాటలు చదివినా, విన్నా చక్కగా గుర్తుపెట్టుకునేది. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టడం, పెద్ద చదువులు చదువుకోలేకపోవడం వంటి ప్రతిబంధకాల వలన ఆమె ప్రతిభ ఇంటి నాలుగ్గోడలకే పరిమితమైపోయింది. మిక్కిలి ఆత్మగౌరవం, నిజాన్ని నిర్భయంగా వెల్లడించడం, తెగువ, ధైర్య సాహసాలు, ఆమె విశిష్ట వ్యక్తిత్వానికి నిదర్శనాలు.

తొమ్మిదో తరగతికి వచ్చాక మళ్లీ అమ్మ సంరక్షణలోకి పూర్తిగా వచ్చాను. ఇంట్లో ఆడపిల్లలు లేని కారణంగా అమ్మకి వంటింట్లోనూ, ఇంటి పనుల్లోనూ సహాయం చేస్తుండటం వల్ల సొంతంగా పనులు చేసుకునే అలవాటు అబ్బింది. తర్వాతి రోజుల్లో ఎయిర్‌ఫోర్స్‌లో చేరాక ఆ శిక్షణ ఎంతో ఉపకరించింది.

హైస్కూలు రోజుల్లో అమ్మకోసం లైబ్రరీ నుండి పక్కటౌన్ సోంపేట కాలేజీకి వెళ్లే రోజుల్లో మధ్యాహ్నం భోజనానికి అమ్మ డబ్బులిస్తే (కాలేజీకి క్యారేజీ మోసుకెళ్లడం నామోషీగా భావించడం వల్ల) ఆ డబ్బులతో పత్రికలు కొనేసి, రోజంతా ఆకలితో గడిపేసే వాణ్ణి. అందుకే చందమామకి నేను రాసే కథల్లో ‘కంచిలి’, ‘సోంపేట’ పేర్లు కలిసి వచ్చేలా ‘కంచిపేట’ అనే ఊహాజనిత పట్టణాన్ని సృష్టించుకున్నాను.

అమ్మకు దగ్గరయ్యానని సంబరపడుతున్న సమయంలోనే, చిన్నతనంలోనే ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో మళ్లీ అమ్మకు దూరమవ్వాల్సి వచ్చింది. ట్రైనింగ్‌లో ఉండగా ప్రతిరోజూ ఓ ఉత్తరం రాసి పైన సీరియల్ నెంబర్ వేసి మరీ పోస్ట్ చేసేవాణ్ణి. నా ఉత్తరం కోసం పిచ్చిదాన్లా ఎదురుచూసేది అమ్మ. మళ్లీ తర్వాతి ఉత్తరం అందేవరకు పదే పదే ఆ ఉత్తరాన్ని చదువుకునేది. నారాక గూర్చి ముందుగా తెలిశాక ఆ తేదీ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూసేది.

అమ్మతో నాది చాలా ప్రత్యేకమైన అనుబంధం. బహుశా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అలానే అనుకుంటూ ఉండవచ్చు. తనకు ఇరవై ఏళ్ల వయసులో జన్మించాన్నేను. సముద్రంలా ఎప్పుడూ గంభీరంగా ఉండే నాన్న పడ్డ కష్టాలు అమ్మ అప్పుడప్పుడూ కథల్లాగా చెప్పడం వల్ల నాన్న మొదటినుంచి నాకు రోల్ మోడల్ అయ్యారు.

మూడేళ్ల క్రితం అమ్మకి తన 49వ ఏట అండాశయ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కొన్ని రోజుల పాటు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. కేన్సర్ పేరు వింటేనే కృంగిపోతారని ఇంట్లో ఎవరికీ ఈ విషయం తెలయబర్చలేదు. అప్పుడే దృఢంగా నిశ్చయించుకున్నాను. ‘నా లక్ష్యం అమ్మని బతికించుకోవాలి’. చాలా దీనావస్థలో అమ్మని నాతో బాటు అంబాలా (హర్యానా)కుతీసుకువచ్చాను.

అమ్మ ధైర్యం, తెగువ కలది కనుక చికిత్స మొదట్లో సానుకూల ఫలితాన్ని ఇచ్చింది. ఆ తొలిరోజుల్లో నేను అక్షరాలా ప్రపంచాన్ని మరిచిపోయాను. ఆ సమయంలోనే గర్భవతి అయిన నా భార్యని కూడా అంతగా పట్టించుకోలేకపోయేవాణ్ణి.

అప్పుడే నాకు కుటుంబంలో ప్రేమ, అప్యాయత, అనుబంధాల విలువ తెలిసింది. అమ్మ, నాన్న, నేను, నా భార్య.. మా నలుగురం ఒక ప్రపంచంలో జీవించాము. అమ్మని ఒక గాజుబొమ్మలా చూసుకున్నాను.

నా భార్య ప్రసవం వరకూ బతికనా చాలనుకున్న అమ్మ చక్కగా తేరుకుని, నాకు బాబు పుట్టేవరకూ ఉండి, వాణ్ణి చూసుకుని మురిసిపోయింది. ఇలా ఈ మూడేళ్ల కాలం –  జీవితకాలపు అనుభవాలను నేర్పింది. మా నలుగురి మధ్యా బంధం గాఢత పెరిగింది. ఇన్నాళ్లూ ఒంటరిగా ఉన్న నాకు కుటుంబ విలువల మాధుర్యం తెలిసింది.

ఇంకా ఎన్నో భవిష్యత్ ప్రణాళికలు, ఆశలు, ఊహలు, అమ్మ, నాన్న, నేను చిన్ని (నా భార్య) కూర్చుని చర్చించుకునేవాళ్లం. నా అత్యాశ దేవుడికి నచ్చలేదేమో! అమ్మని నాకు అర్థంతరంగా దూరం చేశాడు. అమ్మ ఆరోగ్యం నయమైందని ఎందరు దేవుళ్లకు ఎంతగా మొక్కానో అందరూ కలిసి నన్ను మోసం చేసినట్లనిపించింది. అమ్మ మరి నాతో లేదన్న తలంపు నిత్యం గుండెని పిండేస్తోంది.

పత్రికల్లో నా కవితలూ, కథలూ (విశేషించి ‘చందమామ’లో) అచ్చయినప్పుడల్లా ఉబ్బి, తబ్బిబ్బయిపోయే మా అమ్మ పేరు చంద్రకళ. ఇంట్లో నా ముద్దు పేరు చందు. చనిపోవడానికి ఒకరోజు ముందు చందు బాబూ అని నవ్వుతూ పిల్చిన అమ్మ నా చేతుల్లోనే చివరి శ్వాస విడిచి, శాశ్వతంగా దూరమైంది.

ఆమె ఆలోచనలతో ప్రేరేపితుడినై నేను చేసే ప్రతి పనికీ ఎంతో ప్రోత్సహించే అమృతమూర్తి, నా ప్రతి విజయానికీ ఎంతో మురిసిపోయే మా అమ్మ భౌతికంగా దూరమైనా, మానసికంగా నాతోనే, నాలోనే ఉంది. త్యాగాలమయమైన ఆమె జీవితమే నాకు స్పూర్తి, ఆమె ఆశయాల సాధనే నా జీవిత లక్ష్యం.

నా ప్రాణప్రదమైన అమ్మ స్మృతులు ఇలా నలుగురితో పంచుకునేందుకు ప్రేరేపించిన రాజు గారికి కృతజ్ఞతలు.
–మల్లారెడ్డి మురళీ మోహన్
26-07-2010

RTS Perm Link