చందమామ అపురూప పాఠకుడు

July 26th, 2010

చందమామ సంపాదకులకు తెలుగు చందమామ పాఠకుడు టార్జాన్ రాజు నమస్కరించి రాస్తున్న ఉత్తరం. ప్రస్తుతం నా వయస్సు 75 సంవత్సరాలు. 1947 సంవత్సరం  జూలై-ఆగస్టు నెలలో మన చందమామ మొదటి పుస్తకం కొని చదివినాను. అప్పటినుండి ఈ రోజు వరకు 60 సంవత్సరాలకు పైగా చందమామను కొని చదువుతూనే ఉన్నాను. ప్రతి సంవత్సరం పూర్తి అయిన తర్వాత 6 + 6 పుస్తకాలు చొప్పున బైండింగ్ చేయించి. నా లైబ్రరీలో భద్రంగా ఉంచినాను. ఈ చందమామలు, నా తండ్రి, నేను, నా కుమారుడు, మనమడు, ఇప్పుడు మునిమనుమడు చదువుచున్నారు. నేను చందమామ తప్ప ఏ ఇతర మాసపత్రికలు, వారపత్రికలు చదవను.

నాకు 1947 నాటికి పదేళ్లు. స్కూలుకు పోతూ పాన్‌షాపులో చందమామ కనిపిస్తే కొన్నాను. అప్పట్లో చందమామ ధర 25 పైసలు. నా బ్యాగులో చందమామ పత్రికను చూసి కోప్పడిన నాన్న దాన్ని తీసుకుని చదివారు. ఆగస్టునుంచి స్కూలు ఫీజును ఎక్కువగా ఇచ్చిన నాన్న, మిగిలిన డబ్బుతో చందమామ కొనుక్కోమని చెప్పారు. అప్పటినుంచి ఇప్పటివరకూ మా కుటుంబంలో అందరూ చందమామ పాఠకులే.

నా వయస్సు ఇప్పుడు 75 ఏళ్లు. నా మునిమనమరాలు చందమామ కథలు చెప్పమని రోజూ సాయంకాలం పూట పోరు పెడుతుంటే అప్పటినుంచి ఇప్పటి వరకు చందమామలను బైండు చేయించి రోజూ పిల్లలకు చందమామ కథలు వినిపిస్తున్నాను.

గత కొద్ది నెలలుగా మొదటి పేజీలో బేతాళ కథను ప్రచురిస్తున్నారు. బాగాలేదు. గతంలో ఉన్నట్లుగానే చందమామను ముద్రించగలరు.

పత్రిక 74 పేజీల్లో 20 పుటలు కార్టూన్‌లు, క్రీడలు, ప్రకటనలే ఉంటున్నాయి. తగ్గించగలరు.

నా అడ్రస్
జి.టార్జాన్ రాజు.
G.Tarzan Raju
ఫ్లాట్ నెంబర్ 150, NCL North Avenue
kompalli (via)
Hakimpet
(Near Sai baba temple)
Succendrabad -500014
AP.
మొబైల్: 98483 34503

గమనిక: “నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరేదేమిటంటే, 2009 సంవత్సరం నవంబర్- డిశంబర్ నెల చందమామ పుస్తకాలు నాకు అందలేదు. ఏ కారణం చేతనో పేపర్ బాయ్ ఇవ్వలేదు. నేను హైదరాబాదులో కన్పించిన ప్రతి పుస్తకాల షాపులో అడిగినాను. లేవు అని చెప్పినారు. మీరు నా కోరికను మన్నించి పై 2 పుస్తకాలు పంపించమని కోరుతున్నాను. పోస్ట్‌మెన్‌కు డబ్బు చెల్లించి పుస్తకాలు విడిపించుకొంటాను. నమస్తే.”

టార్జాన్ రాజు
సికిందరాబాద్

వీర చంపికి వీరతాడు

శ్రీ టార్జాన్ రాజు గారు  ఆరు దశాబ్దాల చందమామ పత్రిక చరిత్రలో ఒక అపరూప పాఠకులు. 1947 జూలై నెలలో స్కూలుకు పోతూ పాన్‌షాపులో చందమామ కనిపిస్తే కొనుక్కున్న ఈయన అప్పటినుంచి చందమామను చదువుతూనే ఉన్నారు. గత 63 ఏళ్లుగా చందమామ ప్రతులను ఆయన భద్రపరుస్తూనే ఉన్నారు. 2009 నవంబర్-డిసెంబర్ నెల చందమామ పుస్తకాలు హైదరాబాద్‌లో దొరకలేదని తప్పక వాటిని తనకు పంపించే ఏర్పాట్లు చేయించమని జనవరి చివరలో ఉత్తరం పంపారు. మొబైల్ నంబర్ పంపించడంతో వెంటనే ఆయనకు కాల్ చేస్తే అప్పటికే ఎలాగోలా ఆ పుస్తకాలను సేకరించుకున్నట్లు తెలిపారు.

మళ్లీ గత ఫిబ్రవరి నుంచి చందమామలు లేటుగా వస్తూండటంతో అప్పటినుంచి చందమామలు మిస్ అవుతున్నాయని. తప్పక ఈ కాపీలను పంపవలసిందని కోరుతూ ఇవ్వాళే ఆయన చెప్పారు. నెల దాటిన తర్వాత చందమామ వద్ద పాత కాపీలు అందుబాటులో ఉండని పరిస్థితుల్లో ఆయన కోరిక తీరటం కష్టమే.

కానీ ఇలాంటి అవసరాలు వస్తాయనే ఉద్దేశంతో అదనపు చందమామలను ముందుగా కొని పెట్టడం వల్ల ఆయనకు వ్యక్తిగతంగా అయినా కోరిన చందమామలను పంపించగల అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అదే సమయంలో ప్రతినెలా లేటుగా రావడం మూలాన చందమామను నిలిపివేశారని హైదరాబాద్‌ బుక్ ఏజెన్సీల వారు ఈయనకు చెప్పారనే వార్త విన్నందుకు బాధగా ఉంది.

నిన్న ఆదివారం (25-07-2010) చందమామ పత్రికపై పరిశోధన చేస్తున్న బాల సాహిత్య పరిషత్ కార్యదర్శి శ్రీ దాసరి వెంకటరమణ గారితో ఫోన్‌లో మాట్లాడుతూ ఈ చందమామ అపురూప పాఠకుడి గురించి సమాచారం తెలిపితే మహదానందపడ్డారు. 60 సంవత్సరాల చందమామలు ఆయన వద్ద ఉండటమే ఒక అపురూప విషయం అంటూ వాటిని శాశ్వతంగా భద్రపర్చటంపై చర్చించారు. ఆయనతోటే నేరుగా ఈ విషయం ప్రస్తావించవలసిందిగా కోరుతూ ఆయన గతంలో రాసిన ఉత్తరంలోని విశేషాలను చందమామ బ్లాగులో పెడుతున్నట్లు చెప్పాను.

టార్జాన్ రాజు గారు ఇంటర్నెట్, ఈ మెయిల్ వంటివాటి గురించి ఏమీ తెలియని అతి సాధారణ అరుదైన పాఠకులు కాబట్టి నేరుగా కలిసి ఆయనతో మాట్లాడితే మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తూ హైదరాబాద్‌లో ఆసక్తి ఉన్న చందమామ అభిమానులు ఆయనను సంప్రదించేందుకు గాను ఆయన చిరునామా కింది ఇస్తున్నాము.

చందమామ పరిశోధనకోసం తన వద్ద లేని ఒక పాత చందమామను హైదరాబాద్ పేవ్‌మెంట్ల మీది అంగళ్లలో ఒక సంచికను అక్షరాలా వెయ్యిరూపాయలు ఇచ్చి కొన్న వీరాభిమాని దాసరి వెంకట రమణ గారు. శ్రీ చొక్కపు వెంకటరమణ గారివంటి పరిచయస్తులు తనను ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి మరీ తమ వద్ద ఉన్న పాత చందమామలను ఇచ్చి ఉపయోగించుకోమని చెప్పిన విషయం నిన్ననే ఆయన మాట్లాడుతుంటే ఆప్రతిభుణ్ణయిపోవడం నావంతైంది.

“ఆ… చందమామ కథలేనా”  అంటూ తేలిక చేసి మాట్లాడటం ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో సమీక్షకులకు, సాహిత్యకారులకు అలవాటుగా తయారయిందట. లక్షలాదిమందిని కథా మంత్ర జగత్తులో విహరింపజేసిన మహిమ, మ్యాజిక్ అలనాటి చందమామ కథల్లో ఉందని. ఈ తరానికి వేటి మీదా అభిరుచి లేకుండా పోతున్నట్లే చందమామ కథల టేస్ట్‌ను పొందే అవకాశం కూడా లేకుండా పోయిందని రమణగారు నిన్ననే బాధపడ్డారు.

శ్రీ పాలంకి వెంకట రామచంద్ర మూర్తి  గారు తొలి తరం చందమామ రచయితగా పుంఖానుపుంఖాలుగా కథలు రాశారని, ఒక్కో సందర్భంలో చందమామ పత్రిక నిండా ఆయన కథలే రకరకాల మారుపేర్లతో ప్రచురించబడేవని మరెన్నో చరిత్రకు సంబంధించిన విషయాలు ధారాళంగా చెప్పుకుంటూ పోయారాయన.

వెంకట రమణ గారూ, మీకు వీలయితే సికిందరాబాద్‌లో హకీంపేట్ ప్రాంతంలో ఉన్న టార్జాన్ రాజుగారిని కలిసి లేదా ఫోన్ చేసి సంప్రదించడానికి ప్రయత్నించగలరు. మీరు చందమామ చరిత్రకు సంబంధించి ఎన్ని విషయాలు తోడుతున్నా, వ్యాసాల రూపంలో రాస్తున్నా ఇంకా చాలావరకు మీవద్ద సమాచారం మిగిలే ఉందనిపిస్తోంది.

ఆంధ్రా యూనివర్శిటీ తెలుగు విభాగానికి చెందిన శ్రీ ఎమ్.దాసు గారు కూడా చందమామ  పత్రిక పై పరిశోధన చేస్తున్నానని, కావున మీ పత్రికలో పనిచేసిన రచయితలు, వారి జీవితచరిత్రకు సంబంధించిన విషయాలు (1947-2000) దయచేసి పంపగలరని ఈ మధ్యే చందమామకు ఈమెయిల్ పంపారు. మీవద్దనుంచి అవసరమైన సహాయాన్ని ఆయనకూ అందించగలరు

Sri. DASU.M
DEPT OF TELUGU
ANDHRA UNIVERSITY
VISAKHAPATNAM
PIN-530003
CELL NO : 9989283692

NB: గత నలబై, యాభై ఏళ్లుగా చందమామలు వరుసగా చదువుతున్న అభిమానుల వివరాలు పాఠకులకు తెలిసి ఉంటే వారి వివరాలు చందమామకు పంపించగలరు.

RTS Perm Link


15 Responses to “చందమామ అపురూప పాఠకుడు”

  1. సుజాత on July 26, 2010 8:11 AM

    ఇటువంటి అపురూప పాఠకులు ఎటువంటి హంగామా లేకుండా నిశ్శబ్దంగా చందమామను ఆరాధిస్తూ చదువుతూ ఈ రోజు వరకూ దాన్ని కొనసాగిస్తున్నారంటే చందమామ ప్రియులంతా ఎంతో ఆనందించాల్సిన విషయం! అబ్బుర పడాల్సిన విశేషం.

    ఆయన వద్ద సజీవంగా ఉన్న ఆ పాత చందమామలన్నింటినీ చూస్తే ఒక్కసారిగా గుండె ఆందంతో నిండిపోతుందేమో! తప్పక ఆయన వద్దకు వెళ్ళి దర్శించుకుని అటువంటి అరుదైన పాఠకుడికి మనసారా నమస్కరించి అభినందించాలి హైదరాబాదులో ఉన్న చంపిలు! ఎప్పుడెళ్దాం? ఎప్పుడెళ్దాం?

    ఆ… చందమామ కథలేనా” అంటూ తేలిక చేసి మాట్లాడటం ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో సమీక్షకులకు, సాహిత్యకారులకు అలవాటుగా తయారయిందట. …అయితే కావొచ్చు! మాట్లాడుకోనివ్వండి. వారికి హారీపాటర్ ఎక్కువైతే కావొచ్చు. అది మన సమస్య కాదు. వారి సమస్య!

    చందమామ మా బాల్యం నుంచీ కొనసాగుతున్న మధుర స్వప్నం. మా పిల్లలకు మేమిచ్చే అపురూప వారసత్వం!

  2. SIVARAMAPRASAD KAPPAGANTU on July 26, 2010 9:51 AM

    మీ వ్యాసం చూసినాక హైదరాబాదులో ఉండె “చంపిల” మీద అసూయగా ఉన్నది రాజుగారూ. టార్జాన్ రాజుగారు ఎంత అద్భుతమైన చందమామ పాఠకుడు. నిజంగా ఆయన్ని ఈసారి హైదరాబాదు వెళ్ళినప్పుడు కలిసితీరాల్సిందే, ఆయన కలెక్షను ఒకసారి కళ్ళతోనన్నా చూసి రావాలి.

    తరువాత ఎవరండి చవటలు “ఆ చందమామ కథలేగా” అనే వాళ్ళు???? మానసిక లోపం ఏదైనా ఉంటే తప్ప చందమామ కథల గురించి అలా తీసి ఎవ్వరూ పారేస్తూ అనరు . అలాంటి వాళ్ళను కట్టేసి 24 గంటలూ వంతులు వేసుకుని చందమామ కథలను నిర్విరామంగా చదివి వినిపించి అందులో బొమ్మలను చూపిస్తే, తప్పకుండా గుణం కనిపించి అటువంటి మానసకలోపులు మామూలు మనుషులు అవుతారని పెద్ద పెద్ద సైక్రియాటిస్టులు బల్ల గుద్ది మరీ వాళ్ళ వాళ్ళ కాన్ఫరెన్సులలో చెప్పుకుంటున్నారని స్వకీయ విలేఖరి భోగట్టా.

    ఆపైన టార్జాన్ రాజుగారి గురించిన వ్యాసం మన తెలుగు చందమామలో ప్రచురిస్తాను, ఆయన ఫొటో ఏమైనా ఉంటే నాకు పంపగలరు. తప్పకుండా చందమామలో ప్రచురించలిసిన వ్యాసం.

  3. రవి on July 26, 2010 10:46 AM

    ఈ వేగు చదివుతూ ఎక్సయిట్ మెంట్ ఎక్కువై, అలాగో అయిందనిపించి వ్రాస్తున్నాను. సరిగ్గా మా అమ్మగారు కూడా 1947 లో తనకు పదేళ్ళని చెప్పారు. ఆమె కూడా చంపి. ఇంకా చెప్పాలంటే తోకచుక్కపి. ఆమె ఇప్పుడు స్వర్గస్తులు. ఇప్పుడు మా ఆవిడ గారి మామయ్య, స్వర్గీయ వెంకటరమణయ్యగారు ఒకనొక పల్లెలో పుట్టిపెరిగిన పరమవీర చంపి. ఆయనా టార్జాన్ రాజు గారిలాగే అనేక చందమామలు సేకరించారు. వాటిలో కొన్ని బౌండు పుస్తకాలు నా వద్దకు వచ్చి చేరియున్నాయి. అందులో సరికొత్త అట్టలతో ఉన్న 1950 దశకంలోవి ఉన్నాయి.

    టార్జాన్ రాజు గారి మునిమనవలెంత అదృష్టవంతులు?

  4. chandamama on July 26, 2010 11:31 AM

    “చందమామ అపురూప పాఠకుడు” పోస్ట్ చూసిన మరుక్షణమే కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు పంపిన వ్యాఖ్య.

    Fantastic news.
    krp
    ధన్యవాదాలు రోహిణీ ప్రసాద్ గారూ,

    సుజాత గారూ,
    అక్షరాలను శిల్పంలా చెక్కి ఢంకా భజాయించి చెప్పారు.

    “చందమామ మా బాల్యం నుంచీ కొనసాగుతున్న మధుర స్వప్నం. మా పిల్లలకు మేమిచ్చే అపురూప వారసత్వం!”
    మీ అభివ్యక్తికి నిండు నమస్కారాలు.

    సంకీర్తన బాగుందాండీ, చందమామ తనను పరామర్శించినట్లు చెప్పండి.
    రాజు,

    ధన్యవాదాలు శివరాంగారూ, చందమామ కథల గురించి ఆ రకం వ్యాఖ్యలు చాలా మంది చేస్తున్నారనే విషయం కూడా మన దాసరి వెంకటరమణ గారే చెప్పారు. సామాజిక సమస్యలపై వస్తున్న కథలను మక్కువగా చదువుతున్న వారు, ప్రచారం చేస్తున్నవారు, సమీక్షిస్తున్నవారు చాలామంది చందమామ కథలను ఒక రకం కించ భావంతో చూస్తున్నారని రమణగారు నిన్న చెప్పారు. కానీ ఈ రోజు సాక్షి పత్రికలో రావిశాస్త్రి గారు తమ బాల్యంలో బాలమిత్ర, చందమామలను ఆబగా చదివేవారని ఆయన చిన్న కుమారుడే మననం చేసుకున్నారు. చదవగానే సంతోషం వేసింది.

    టార్జాన్ రాజుగారి గురించిన వ్యాసం మన తెలుగు చందమామలో తప్పక ప్రచురించండి. ఆయనను తన చందమామ జ్ఞాపకాలను వివరంగా రాసి పంపమని కోరాను. కాని ఆయన ఎక్కువ సేపు ఫోన్‌లో కూడా మాట్లాడలేకపోతున్నారు. అందుకే హైదరాబాద్‌లో మనవాళ్లు వ్యక్తిగతంగా కలిసి మాట్లాడితే బాగుంటుందని ఆయన చిరునామా కూడా ఇచ్చాను. రేపు మళ్లీ ఒకసారి ఆయనకు ఫోన్ చేసి తప్పకుండా ఫోటో పంపమని చెబుతాను. మీరు ఈ లోపల వ్యాసం ప్రచురించండి ఫోటో సేకరిద్దాము.

    దాసరి సుబ్రహ్మణ్యం గారు చెన్నయ్‌లో నివసించిన ఆ ఇల్లు, ప్రతి రోజూ ఉదయాన్నే ఇంటికి దగ్గరగా ఉన్న రోడ్డు మీదికి వచ్చి హిందూ చదువుతూ టీ తాగిన ఆ గణేశ్ భవన్ హోటల్ ఫోటోలు ఇంకా తీయలేదు. త్వరలో తీసి పంపుతాను. మనం మార్చిలో శంకర్ గారిని కలవడానికి పోతూ విజయా హాస్పిటల్ వద్ద పండ్లు తీసుకున్నాము కదా, అక్కడికి చాలా దగ్గరిలోనే ప్రస్తుతం చందమామ ఆఫీసు ఉంది.

    రవిగారూ,
    అమ్మ గురించి గతంలోనే ప్రస్తావించారు. 1947లో ఆమెకు పదేళ్లు అంటే తప్పకుండా తొలి చందమామను ఆమె చూసే ఉంటారు. 1950 దశకంలోవి చందమామలు కలిగి ఉన్న మీరూ అదృష్టవంతులే.

    “టార్జాన్ రాజు గారి మునిమనవలెంత అదృష్టవంతులు?” చాలా చక్కటి మాట. కానీ చందమామను చదవగలిగిన అదృష్టవంతులు ఇప్పటి తరంలో తగ్గిపోతున్నారేమో అనిపిస్తోంది.

    అమ్మ ఫోటో మీ మామయ్యగారి పోటో ఉంటే భద్రపర్చండి. చందమామ జ్ఞాపకాలు మాత్రమే కాకుండా చందమామను హృదయంలో దాచుకున్న తల్లుల, తండ్రుల, పెద్దల జ్ఞాపకాలను కూడా త్వరలోనే మనం రికార్డు చేయవలసి వస్తుందనుకుంటున్నాను. మీ అమ్మగారితోనే ఆ రికార్డును మొదలు పెడదామా మరి.

    మీ ఉద్వేగపు వ్యాఖ్యకు మనఃపూర్వక అభినందనలు
    రాజు.

  5. వేణు on July 26, 2010 11:51 AM

    అరుదైన అద్భుతం! టార్జాన్ రాజు గారి లాంటి తరతరాల పాఠకులు తనకున్నారని చందమామ సగర్వంగా ప్రకటించుకోవాలి!

  6. chandamama on July 26, 2010 3:28 PM

    వేణు గారికి,
    నిజంగా చందమామే కాదు ఏ పత్రిక అయినా ఇంత సుదీర్ఘ కాల పాఠకులను కలిగి ఉంటే అది గర్వకారణమే కదూ! వీలయితే ఒకసారి ఆయనతో నేరుగా లేక పరోక్షంగా కలిసి వివరాలు సమగ్రంగా సేకరించగలరు.

    రాజుగారికి,
    ఇప్పుడే మీ బ్లాగు చూసాను చాల సంతోష పడ్డాను మనం మాట్లాడినది మాట్లాడినట్లుగా రాసారు కాని చిన్న పొరపాటు. పాలంకి వెంకట రామ చంద్ర మూర్తి బదులుగా పాలంకి సత్యనారాయణ అని రాసారు వీలయితే సవరించ గలరు.
    -దాసరి వెంకటరమణ

    దాసరి వెంకట రమణ గారూ, మీరు సూచించిన పేరు మార్పును ప్రధాన కథనంలో కూడా మార్చడమైనది. కృతజ్ఞతలు.

  7. kalpana on July 26, 2010 9:09 PM

    వావ్! చదువుతుంటే కళ్ళు చెమార్చాయి.నిజమైన అభిమానం అది. దానికి మన కితాబులు అక్కర్లేదు. సవినయ నమస్కారాలు తప్ప.

    మరో సారి చందమామ జిందాబాద్.

  8. .M.V.APPA RAO on July 27, 2010 2:52 AM

    చందమామ అపరూప పాఠకుడి గురించి చదివి సంతోషించాను.
    నా దగ్గర 1953 నుండే బైండ్లు ఉన్నాయి. ఈ మధ్య చందమామ
    కొనడం మానాను. అని వ్రాయడనికి బాధగా వుంది. కారణం ఆ
    నాటి చందమామకు ఈనాటి చందమామకు పోలికే లేదు. ఏదో
    వెలితిగా వుంటున్నది. ఇప్పటికీ రోజూ పాత చందమామలను
    చూసి, మరో సారి చదువుతూ తృప్తి పొందుతున్నాను. ఆ పాత
    కధలనే ఆ బొమ్మలతోనే తిరిగి ప్రతి నెలా ప్రచురిస్తే ఎంత బాగుండును.
    ఇది తీరని కోరికే. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు వచ్చినా ఆనాటి చందమామలను
    చేతిలోకి తీసుకొంటె నా వయసు లో విలివలేని ఆ సున్నా మాయమై
    చిన్న పిల్లవాడిగా మారి పోతాను. రాజు గారు, మీరో సాయం చేయండి.
    చందమామ ప్రారంభ సంచికను FACSIMILE EDITION గా ప్రింటు
    చేసి అమ్మకానికి వుంచితే మా (మీ)లాంటి చంపి లు తప్పక కొంటారని
    హామీ ఇస్తున్నాను. …యమ్వీ.అప్పారావు (సురేఖ)

  9. సుజాత on July 27, 2010 3:20 AM

    “తోకచుక్కపి”….రవి గారూ, భలే ఉంది ఈ expression !….

  10. కృష్ణశ్రీ on July 27, 2010 3:28 PM

    ఓ యాభయ్యేళ్ళ క్రితం, మా వూర్లో వెంకటేశ్వర కాఫీ మిల్స్ వారి పేపర్ బాయ్ సీతారామయ్య, వారం వారం ఆంధ్ర సచిత్ర వార పత్రికనీ, నెల నెలా చందమామనీ ఇచ్చి వెళ్ళేవాడు మాకు.

    మా అమ్మ ఓ సారి నన్ను “బుడుగు” పుస్తకం వచ్చిందా? అని అడగమని చెపితే, ప్రతీవారం అతన్ని అడిగేవాడిని……పుస్తకాలు ఇచ్చేలోపలే చెప్పేసేవాడు….బుడుగు రాలేదని!

    అప్పట్లో, “రాకాశి లోయ”; “దుర్గేశ నందిని” లాంటి సీరియళ్ళు చింపుకొని, వేరే బైండింగ్ చేయించుకొని దాచుకొనే వాళ్ళం! ఇప్పుడవి యెక్కడున్నాయో గుర్తు లేదు!

    ఆ రోజుల్లో చందమామ చదవని బుడుగు యెవడూ వుండేవాడు కాదంటే అతిశయోక్తి కాదు.

    టార్జాన్ రాజు గారికి అభివందనలు!

  11. chandamama on August 2, 2010 1:53 PM

    ‘చందమామ అపురూప పాఠకుడు’పై చక్తటి స్పందనలు పంపిన కల్పనగారికి, అప్పారావుగారికీ, కృష్ణశ్రీ గారికీ కృచజ్ఞతలు. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమాపణలు.
    అప్పారావు గారూ, మీ ఆవేదనతో పాలు పంచుకుంటున్నాము. చందమామ తొలి సంచిక ప్రింట్ విషయంలో నిస్సహాయులం.. కానీ, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక పైవారికి తెలియ జేస్తాను. పాత చందమామలతో మీ అనుబంధం గురించి కథనం ఇంకా మీకు బాకీ పడి ఉన్నాను. త్వరలో ఈ పని పూర్తి చేయగలమనుకుంటున్నాను.

    కృష్ణశ్రీ గారూ, రాకాశి లోయ, దుర్గేశ నందిని వంటి సీరియల్స్ మీవంటి వారి కోసం తప్పక తిరిగి ప్రచురిస్తాము. మీరు మీ ఫీడ్‌బ్యాక్‌ను పంపితే ఇలాంటి ప్రతిపాదనలు త్వరగా ఆచరణ రూపం తీసుకుంటాయి. వ్యాఖ్యకు అభినందనలు.

    జాతీయ ఉత్తమ ఉపాధ్యాయనిగా అవార్డు పొందిన శ్రీమతి ఆదూరు హైమావతి గారి తాజా ఈ మెయిల్ స్పందనను ఇక్కడ పోస్ట్ చేయడమైంది.

    చందమామ రాజు గారికి!
    ‘వీర చంపి ‘టార్జాన్ రాజు’ గురించీ చదివి ఆశ్చర్యమేసింది. చందమామ పుట్టుక చూసిన, ‘చంపి తాతయ్య’ గురించీ చందమామ ఙ్ఞాపకాల్లో ఉంచడం ముదావహం. నాదొక్క మనవి. చందమామ ‘చంపి’లు ఇంకా ఎంతోమంది ఉంటారు. ‘దాసరి సుబ్రహ్మణ్యం’ గారు అదే .. చందమామ కధల మాంత్రికులు, ఈ లోకానికి వీడ్కోలు చెప్పాక గానీ ఆయన గురించీ చంపిలకెవ్వరికీ తెలియలేదు, ఎంతోమంది చంపిలు ఆయన కధలు చదివి, రచయిత తెలియకనే అభిమానించినా, మే నెల ‘రచన’ చదివాక గానీ ఎవ్వరికీ [నాకూను] ఆయన గురించీ చాలామందికి, చందమామ రచయితలకు తప్ప తెలియకపోవడం విచారకరం. మన ఆంధ్రులు సాధారణంగా, మరణించాక గానీ మహనీయుల గొప్పదనం గుర్తించరనే విషయం చందమామ సైతం నిజంచేయడం విచారకరం. [మనస్సులో మాట మరోలా అనుకోకండి.] ఇప్పటికైనా చందమామ చంపిలు కొందరు మనమధ్య ఉండగానే, [ఆలోకం లో కథల పితామహునికి రిపోర్ట్ చేయకుండా] చంపిల సమావేశం జిల్లాలవారీగా, రాష్ర్ట్రాల వారీగా ఏరాటుచేస్తే, ఎంతో బావుంటుంది. చంపిలు వారు దాచుకున్న చందమామలతో వచ్చి వెన్నెల వెదజల్లితే ఎంత బావుంటుందో! ఊహించుకుంటేనే మహదానందంగా ఉంది. ఇదేమంత కష్టమైన విషయంకూడా కాదు. ఏదోలే అనుకోక ఆలోచించండి.
    ఇట్లు ,
    హైమవతి ఆదూరి.

  12. వసుంధర on August 4, 2010 5:46 PM

    తెలుగునాట బాలసాహిత్యంలో చందమామ పుట్టుక ఒక శకారంభం. 1947లోని పాఠకులందరూ ఆ విషయాన్ని వెంటనే గుర్తించారు. వారి ప్రభావం తర్వాతి తరాలమీద పడి- 1990ల వరకూ కూడా చందమామ ప్రభావం అద్భుత మాయాజాలంగా కొనసాగింది. ఇంగ్లీషు మీడియం చదువులు, ప్రవాసం కూడా చందమామని బాలలకు దూరం చేయలేకపోయాయి. అందువల్ల చందమామనే తప్ప- చందమామ పాఠకుల్ని అపురూపంగా భావించలేం. టార్జాన్ రాజు గారిలా చందమామని అభిమానించే, ఆరాధించేవారు తెలుగునాట కోకొల్లలు. ఐనా ఆయన్ను అపురూప పాఠకుడిగా భావించక తప్పదేమో! ఎందుకంటే 1990లలో ప్రపంచీకరణ పేరిట- యువతరానికి తెలుగు భాషపట్ల విముఖత మొదలైంది. అతి త్వరగా అంతరించనున్న ప్రపంచ భాషలలో తెలుగు ఒకటని ప్రముఖులు ఘోషిస్తున్నారు. మా పిల్లలకి తెలుగు రాదు, వాళ్లు తెలుగంటే ఇష్టపడరు- అని చెప్పుకోవడం గొప్పతనంగా చెలామణీ ఔతున్న ఈ రోజుల్లో- శ్రీ టార్జాన్ రాజుగారి మునిమనుమరాలు చందమామ కథలు చెప్పమని కోరుతూ ప్రతిరోజూ పోరడం అపురూపం.
    భాష మూలాలకు విలువనిచ్చే చందమామ ఉన్నంతకాలం తెలుగు భాష ఉంటుంది. చందమామ ప్రాచుర్యం టార్జాన్ రాజు గారు, ఆయన సమకాలీనుల పైన కాక- నేటి బాలలపైన ఆధారపడి ఉంది. వారిని చందమామ పాఠకులుగా మార్చుతున్న శ్రీ టార్జాన్ రాజు అసలుసిసలు అపురూప పాఠకుడు. వారు మనకి స్ఫూర్తి, ఆదర్శం కావాలి. ఒకప్పుడు చందమామలో వచ్చిన ఆకాశానికి గుంజలు కథ చదివినవారికి- ఆయనవంటివారే తెలుగు నేలమీది నెలరాజు (చందమామ)కు గుంజలు- అని అర్థమౌతుంది.
    ఆయనకు అభివందనాలు.

  13. చందమామ అపురూప పాఠకుడు « వసుంధర అక్షరజాలం on August 4, 2010 5:58 PM

    [...] శ్రీ టార్జాన్ రాజు ఓ అపురూప పాఠకుడు. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ వివరాలతోపాటు- [...]

  14. vasundhara on August 7, 2010 6:24 AM

    తెలుగునాట బాలసాహిత్యంలో చందమామ పుట్టుక ఒక శకారంభం. 1947లోని పాఠకులందరూ ఆ విషయాన్ని వెంటనే గుర్తించారు. వారి ప్రభావం తర్వాతి తరాలమీద పడి- 1990ల వరకూ కూడా చందమామ ప్రభావం అద్భుత మాయాజాలంగా కొనసాగింది. ఇంగ్లీషు మీడియం చదువులు, ప్రవాసం కూడా చందమామని బాలలకు దూరం చేయలేకపోయాయి. అందువల్ల చందమామనే తప్ప- చందమామ పాఠకుల్ని అపురూపంగా భావించలేం. టార్జాన్ రాజు గారిలా చందమామని అభిమానించే, ఆరాధించేవారు తెలుగునాట కోకొల్లలు. ఐనా ఆయన్ను అపురూప పాఠకుడిగా భావించక తప్పదేమో! ఎందుకంటే 1990లలో ప్రపంచీకరణ పేరిట- యువతరానికి తెలుగు భాషపట్ల విముఖత మొదలైంది. అతి త్వరగా అంతరించనున్న ప్రపంచ భాషలలో తెలుగు ఒకటని ప్రముఖులు ఘోషిస్తున్నారు. మా పిల్లలకి తెలుగు రాదు, వాళ్లు తెలుగంటే ఇష్టపడరు- అని చెప్పుకోవడం గొప్పతనంగా చెలామణీ ఔతున్న ఈ రోజుల్లో- శ్రీ టార్జాన్ రాజుగారి మునిమనుమరాలు చందమామ కథలు చెప్పమని కోరుతూ ప్రతిరోజూ పోరడం అపురూపం.
    భాష మూలాలకు విలువనిచ్చే చందమామ ఉన్నంతకాలం తెలుగు భాష ఉంటుంది. చందమామ ప్రాచుర్యం టార్జాన్ రాజు గారు, ఆయన సమకాలీనుల పైన కాక- నేటి బాలలపైన ఆధారపడి ఉంది. వారిని చందమామ పాఠకులుగా మార్చుతున్న శ్రీ టార్జాన్ రాజు అసలుసిసలు అపురూప పాఠకుడు. వారు మనకి స్ఫూర్తి, ఆదర్శం కావాలి. ఒకప్పుడు చందమామలో వచ్చిన ఆకాశానికి గుంజలు కథ చదివినవారికి- ఆయనవంటివారే తెలుగు నేలమీది నెలరాజు (చందమామ)కు గుంజలు- అని అర్థమౌతుంది.
    ఆయనకు అభివందనాలు.
    వసుంధర

  15. chandamama on August 31, 2010 2:23 AM

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind