కూరగాయల కథ

June 25th, 2010

బుడంకాయంత బుడ్డోడికి వంకాయంత వజ్రం దొరికిందట, ఆ బుడంకాయంత బుడ్డోడు ఆ వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలో దాచాడంట. ఆ చాచటాన్ని దోసకాయంత దొంగోడు చూస్తాడు. ఆ దోసకాయంత దొంగోడు బీరకాయంత బీరువా దగ్గరికి వచ్చి ఆ వంకాయంత వజ్రాన్ని తీస్తుంటే మునక్కాయంత ముసలవ్వ చూసి గుమ్మడికాయంత పోలీస్ స్టేషన్ కెళ్లి పొట్లకాయంత పోలీసులకు చెప్పుతుంది.

ఆ పొట్లకాయంత పోలీసులొచ్చి ఆ దొంగని పట్టుకొని, కాకరకాయంత కర్రతో కొట్టి, సొరకాయంత స్టేషన్లో ఉంచి, ఆ వంకాయంత వజ్రాన్ని ఆ బుడంకాయంత బుడ్డోడికి ఇప్పిస్తారు. అప్పుడు వాడు సంతోషించి, ఆ మునక్కాయంత ముసలవ్వకి చెంచలాకంత చెయ్యితో బచ్చలాకంత బహుమానం ఇస్తాడు.
– బి. గిరిబాబు

పాతాళదుర్గం 17 వ భాగాన్ని ఆన్‌లైన్ చందమామలో ప్రచురించవలసిందిగా కోరుతూ చందమామ మెయిల్ కమ్యూనికేషన్‌లోకి వచ్చిన బోయ గిరిబాబు గారు అడక్కుండానే తన చందమామ జ్ఞాపకాన్ని ఈ చిన్ని కథ రూపంలో పంపారు. కూరగాయలకు, మనుషులకు, వస్తువులకు, పోలిక పెట్టి కథ నడిపించే తీరు అచ్చంగా మన దేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న స్వచ్ఛమైన మౌఖిక సంప్రదాయానికి నమూనాగా నిలుస్తుంది.

ప్రస్తుతం ప్రింట్ చందమామలో ఇలాంటి కథలు అచ్చు వేయనప్పటికీ, మనందరి బాల్యం ఇలాంటి మౌఖిక కథలతో, ఊకొడితే గాని నోట్లోంచి ఊడిపడని కథలతోనే నడిచి ఉంటుంది.ఒకప్పుడు పల్లెటూళ్లలో పదిమంది పిల్లలు, పెద్దలు కూడితే చాలు… “ఒక ఊళ్లో ఒక రాజు ఉండేవాడంట. ఆతడికి ఏడుగురు కొడుకులంట..” అంటూ టకారాంత ప్రయోగంతో కథను అల్లుకుంటూ పోయే హృద్యమైన వాతావరణం రాజ్యమేలేది.

బుడంకాయంత బుడ్డోడు, వంకాయంత వజ్రం, బీరకాయంత బీరువా, దోసకాయంత దొంగోడు, మునక్కాయంత ముసలవ్వ, గుమ్మడి కాయంత పోలీస్ స్టేషన్, పొట్లకాయంత పోలీసులు.. మౌఖిక సాహిత్య శైలిలో కూడా ఆది ప్రాస ఎంత చక్కగా కుదిరిందో ఈ కథలో పోలికలన్నీ చెబుతున్నాయి.

రచయితలు, కథకులు పంపుతున్న కథలు సవరణకు గురైనప్పుడు ప్రత్యేక వ్యావహారిక భాషలోకి మారిపోయి వాటి సహజత్వం కోల్పోతున్నాయేమో అనిపిస్తుంటుంది. కాని సవరణలు లేకుండా, శిష్ట సాహిత్య రీతులకు అవతలనే ఉంటూ టకార ప్రయోగంతో మనిషి అల్లుకుంటున్న సహజమైన కథలను కూడా రికార్డు చేయవలసిన అవసరముంది. ఇప్పటికే ఇలాంటి ఎన్ని అపరూప కథలు -బహుశా వీటికి సాహిత్య గౌరవం లేకపోవచ్చు- తెలుగునేలపై అంతరించిపోయాయో చెప్పలేము.

మా చిన్నప్పుడు అంటే 1970లలో అమ్మ దగ్గిర, అవ్వ దగ్గర, తాత దగ్గిర కూర్చుని కథలు చెప్పించుకుని పిల్లలందరం సంబరపడేవాళ్లం. కొన్నాళ్లకు స్కూళ్లకు పోయాక, టౌన్లకు పోయాక కొత్త సినిమాలు, పాతసినిమాలు చూసే అవకాశం వచ్చినవారిని మధ్యలో కూచో బెట్టుకుని సినిమా కథ మొత్తం ఆ అదృష్టవంతుల నోట్లోంచి చెప్పించుకుంటూ గంటల కొద్దీ గడిపేవాళ్లం. ఇలా బాల్యమంతా కథలే. ఇంటర్మీడియట్‌లోకి వచ్చాక ఆ కథల ప్రపంచం స్థానంలో కొత్త సాహిత్యం, అభిరుచులతో కాలం కొట్టుకుపోయింది.

తన చిన్ని చందమామ జ్ఞాపకం ద్వారా మళ్లీ అందరి బాల్యాన్ని గుర్తు చేసిన గిరిబాబు గారికి ధన్యవాదాలు.
మీ చందమామ జ్ఞాపకాలను పోస్ట్ ద్వారా చందమామ ఆఫీసుకు-చెన్నయ్ చిరునామా మళ్లీ వడపళనికి మారింది- కాని, కింది ఈమెయిల్ ఐడీకి కాని పంపండి.
abhiprayam.@chandamama.com

తెలుగు ఆన్‌లైన్ చందమామలో చందమామ పాఠకులు, అభిమానులు, రచయితలు పంపిన చందమామ జ్ఞాపకాలకోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link