‘చందమామ’ జ్ఞాపకాలతో వృధ్ధాప్యమూ పసితనమే…!!

June 18th, 2010

చందమామ యాజమాన్యం ‘ చందమామను (1947-2000) అన్‌లైన్‌లో పెట్టడమే ఓ గొప్ప సేవ! యధాలాపంగా కధలు చదువుతుండగా 1947 నాటికధ చదివి  ‘ నేను పుట్టిన సంవత్సరం నాటికధ’ నాలో స్పందన  కల్గించింది. చదివే ఊహ నాకు  కలిగినప్పటినుండీ చందమామను మానాయనగారు కొనితెచ్చేవారు.పెరిగేకొద్దీ’ కాసులు ‘దాచుకుని చందమామ కొని చదివి నాతర్వాతి వారికి వివరిస్తూ, ఊరిస్తూ చెప్పిన జ్ఞాపకం నాకింకాఉంది.

చందమామకు ఫోటో వ్యాఖ్యలు పంపాలనీ, దాన్లో అచ్చులో నాపేరు చూచుకోవాలనే కోరిక అమితంగా ఉండేది. చందమామకు కధలు వ్రాయాలనీ, అచ్చులో పేరుతోపాటుగా ఆ నా కధకు ఎలాంటి బొమ్మలు వేస్తారో అనే ఊహతో  పసితనమంతా గడచిపోయింది. ఆ ప్రయత్నం మాత్రం ఎందుకో జరగలేదు.అప్పట్లో పోస్టుకార్డు కొనడమే కష్టం, ఇహ కవరుకొని వ్రాసి పంపడమంటే మహా కష్టం.

చదువు, ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగం, పల్లెల్లో పని చేయడం, నీతికధల పిరీయడ్‌లో పాత చందమామ కధలు పిల్లలకు  మరికొంత సంభాషణలు, వివరణలు జోడించి ఆసక్తిదాయకంగా చెప్పడం కూడానాకింకా గుర్తుంది. పల్లెల్లో పని చేసేప్పుడు స్కూల్ లోని పిల్లలందరిచేతా నయాపైసలు కూడబెట్టించి, చందమామ పుస్తకాలు నెలనెలా నేనే కొని పట్టు కెళ్ళి చదివించడమూ, ఆపైన వాటిని ‘ స్కూల్ లైబ్రరీ’లో ఉంచడమూ కూడా నాకింకాగుర్తే!.
         
స్కూల్‌లో చదువుకునేప్పుడు బోర్ కోట్టే పిరీయడ్‌లో నోట్‌బుక్‌లో చందమామ సంచిక పెట్టుకుని చదివిన రోజులూ గుర్తే. తోటి స్నేహితులు చూస్తే వారినీ  చదువుకోమని చూపిన సంఘటన ఇప్పటికీ నవ్వుతెప్పిస్తుంది. చందమామ చేసినంత సాహిత్యసేవ ఇంతింతనరానిది. చిన్నతనంలోనే పిల్లలకు, చదవడాన్నీ, కధలపట్ల మమకారాన్నీ నేర్పినది మాత్రం  చందమామే!

చందమామ నా ఉద్యోగ జీవితంలో బోధనకు సహకరించడమేకాక, ఆధ్యాత్మిక జీవితంలోనూ సహకరించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. చందమామ ఎప్పటికీ అందరికీ ‘మామే!’ మరి. చందమామ జ్ఞాపకాలతో  వృధ్ధాప్యమూ పసితనంగానే ఉంటున్నది.  చందమామ జ్ఞాపకాలు మీఅందరితో పంచుకోడమూ ఎంతో ‘థ్రిల్లింగ్’గా ఉంది..

నేను 40 సంవత్సరాలు ఊపాధ్యాయినిగా పని చేసి విశ్రాంతి పొందిఉన్నాను. నా సర్వీసులో అంతా ‘ చందమామ కధల,నాస్టూడెంట్స్‌కు  చెప్తూ, చదివిస్తూ, వారికి తెలుగు నేర్ప్డమేకాక, కధలపట్ల ఆసక్తి  పెంచాను.నా అనుభవాలతో చిన్న చిన్న కధలు వ్రాస్తుండటం నావిశ్రాంత జీవనంలో కాలక్షేపంగా  ఉంది.

నా జీవితంలో 40సంవత్సరాలు పిల్లలతో గడపడం వల్ల నాకు పిల్లలతో మాట్లాడటమన్నా, వారికి పనికి వచ్చే పనులు కధలు, గేయాలు, నీతినేర్పే ఆటలు  క్రొత్తక్రొత్తవి  తయారు చేయడమన్నా మహా ఇష్టం. నాకు 64 సం.లు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా పిల్లలతోనే గడుపుతుంటాను, వారిలో ఒకరిగా, శేష జీవితాన్ని చందమామ స్నేహంతో గడపాలనేది నా కోరిక.
 
మామిత్రుడు  ఒక హైస్కుల్  ప్రధానోపాధ్యాయుడు  ఒకసభలో మాట్లాడుతూ ‘నేను హాయిగానిద్రపోతాను  అన్ని ఆలోచనలు మరచి, ఎందుకంటే పడుకునే ముందు చందమామ చదువుతాను’ అనిచెప్పారు. చందమామ పిల్లలకే కాక పెద్దలకూ మితృడేనన్నమాట!
చందమామ జ్ఞాపకాలు కోకొల్లలు. ఇంకా మరి కొన్ని ‘చందమామ జ్ఞాపకాలు’ మరోసారి…

“…..చందమామ కొనాలని ముందుగానే డబ్బు కూడబెట్టుకునే దాన్ని. ఆరోజుల్లో ఉపాధ్యాయుల జీతాలు చాలాతక్కువ. వారంలో ఓరోజు 5 కిలోమీటర్ల దూరంలో ఉండే స్కూల్‌కు నడిచి  ఆడబ్బుతో చందమామ వచ్చినరోజే కొని ఇంటికి వెళ్ళగానే ముందుగా ఫొటో వ్యాఖ్యలు చూసి, ‘అయ్యో ఇలా నేను వ్రాసి ఉండవలసింది’ అనుకుని, ఆనెల వ్యాఖ్యల గురించీ, ఆ వారమంతా ఆలోచించడమూ ఇంకా గుర్తుంది. చందమామ ‘ పిల్లలమామగా ‘ ‘మామ కాని మామ  చందమామ’. ఆకాశంలో చందమామ వెన్నెలనిస్తే, ఈచందమామ విజ్ఞానాన్నిస్తాడని  నా స్టుడెంట్స్‌కు  చెప్పడమూ గుర్తుంది.

చందమామ పిల్లల నేస్తమనీ, దాన్ని మించిన నేస్తం మరేదీ లేదనే నమ్మకంతో స్కూల్ పిల్లలచే చందమామ తప్పక ప్రతినెలా చదివించాను.. ఉద్యోగ జీవితంలో బోధనకు చందమామ బొమ్మలను, కథలను ఉపయోగించుకున్నాను.. కుమార్తె, కుమారులకూ చందమామ చదవడం అలవరచాను… 40 సంవత్సరాలు ఊపాధ్యాయినిగా పని చేసి, నా సర్వీసులో అంతా’ చందమామ కధలను, నా స్టూడెంట్స్‌కు చెప్తూ, చదివిస్తూ, వారికి తెలుగు నేర్ప్డమేకాక, కధలపట్ల ఆసక్తి  పెంచాను…”

శ్రీమతి ఆదూరి హైమవతి గారూ,

మీ ఆత్మనివేదనను జ్ఞాపకాల రూపంలో చందమామ కోసం పరిచి చూపారు.. మీ చిన్ని జీవితంలో మీరు చేసిన -పైన ఉటంకించిన- ప్రతి పనీ మంచిదే. మీ జన్మ సార్థకం అని మీరు వినమ్రంగా చెప్పుకున్నారు. కాని చందమామ జన్మ సార్థకమైందని మేం అనుకుంటున్నాము.

అక్షరాక్షరంలో పిండివెన్నెల చిలికించి మీరు అల్లిన వాక్యాలు చూస్తుంటే నాకు ఇటీవలే, రచన మే నెల ప్రత్యేక సంచిక -చందమామ కథల మాంత్రికుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారిపై ప్రత్యేక సంచిక- చూసిన సందర్భంగా ఢిల్లీలో కేంద్రమంత్రిత్వ శాఖలో కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న మేడేపల్లి శేషు గారు చెప్పిన కింది మాటలు గుర్తుకొస్తున్నాయి.

“పిల్లలకు మెదడు ఒక్కటే కాదు, మనసూ ఉంటుందని గ్రహించకుండా వాళ్ళను ‘చదువుల యంత్రాలుగా’ మారుస్తున్న మన ప్రస్తుత విద్యవిధానమంటే నాకు మొదటినుంచీ అసహ్యమే. వాళ్ళను మరింత అసహ్యకరమైన వినోద (?) కార్యక్రమాలకు బలికావించే టి.వి. చానెల్సు అన్నా, ఇప్పటి సినిమాలన్నా నాకు మరింత అయిష్టం. నాకే కనుక విద్యావిధానాన్ని నిర్ణయించే అధికారమిస్తే, నెలకో రోజు ‘చందమామ’ చదివే పీరియడ్ పెడతాను. మార్కులతో పనిలేకుండా, వాళ్లకు కొన్ని పాఠ్య అంశాలు ప్రవేశపెడతాను. మంచి పుస్తకాలు చదివిస్తాను. మంచి చలన చిత్రాలు చూపిస్తాను. పరీక్షలకు బదులు వాటిగురించి చర్చ పెడతాను…

…..జ్ఞానంతోపాటు పిల్లల్లో మనసూ, బుద్ధీ కూడా వికసించాలి. అప్పుడే వాళ్లకు పరిపూర్ణ వ్యక్తిత్వం వస్తుంది. ఏ చదువు చదివితే ఎంత సంపాదించవచ్చు అనే పద్ధతిలోనే నడుస్తోంది మన ప్రస్తుత విద్యావిధానం. ఇది ఎటు వెళ్లి ఎటు తేలుతుందో అర్థం కాకుండా ఉంది. భాష, సాహిత్యం, కళలు అనేవి ఉపయోగంలేని వ్యాపకాలు అనే ధోరణి బాగా ప్రబలుతోంది. ఇది ముందు తరాలకు చాలా ప్రమాదం.”

మీకులాగే మేడేపల్లి శేషు గారి కల ఫలించాలని, మన రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు, బాలబాలికలకు చందమామ పత్రిక అందాలని, క్లాసుల్లో చందమామ చదివే పీరియడ్ అంటూ ఒకటి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేం కూడా హైస్కూలులో తరగతి గదుల్లో టీచర్ పాఠం చెబుతుంటే చందమామ చదువుతూ పట్టుబడి దెబ్బలు తిన్నవాళ్లమే మరి.

కొసమెరుపు:

హైమవతి గారూ,
చందమామ నుంచి మీకు చల్లటి వార్త.

మీ ‘సందేశం’ కథను చందమామ ప్రచురణకు తీసుకుంటున్నాము. బహుశా మీ కథ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ప్రచురించబడవచ్చు. ప్రాథమిక ఎంపిక ఈరోజే పూర్తయింది.

చందమామలో కథ చూసుకోవాలనుకున్న మీ జీవిత కాల ఆకాంక్షను నెరవేరుస్తున్నందుకు మాకూ సంతోషంగా ఉంది. కొన్ని తరాల పిల్లలకు చందమామ కథలను, బొమ్మలను పరిచయం చేసిన మనీషి మీరు. మీ కథను ప్రచురించబోతూ చందమామ తనను తానే గౌరవించుకుటోందని భావిస్తున్నాము.

మీరు ఆరోగ్యం కాపాడుకుంటూ, ఇలాగే వీలు  కలిగినప్పుడల్లా 1, 2, 3 పేజీల కథలను పంపుతుంటారని ఆశిస్తున్నాము. మీరు ఉన్నది అమెరికాలోనే అయినప్పటికీ చందమామకూ మీకు అట్టే దూరం లేదు లెండి.

చందమామతో మీ ఈ కొత్త అనుబంధం కూడా దీర్ఘకాలం కొనసాగుతుందని ఆశిస్తున్నాము.

చందమామలో కథ చూసుకోవాలనుకుంటున్న మీ చిన్న ఆశను నెరవేర్చటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాము. మీరు చిన్న కథలు ఇలాగే పంపిస్తూ ఉండండి. చందమామకు మీరు కధలు పంపటం మాకు గౌరవం, సంతోషం కూడా.

ఆదూరి హైమవతి గారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠం కోసం.. కింది చందమామ వెబ్‌సైట్ లింకు చూడండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2453

మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.  మీ లేదా మీ పిల్లల ఫోటోతో సహా పంపండి.

లేదా
పోస్టులో కూడా, మారిన చందమామ కొత్త చిరునామా (చెన్నయ్‌)కు మీ జ్ఞాపకాలు పంపండి.

Chandamama India Limited
No.2 Ground Floor, Swathi Enclave
Door Nos.5 & 6, Amman Koil Street
Vadapalani, Chennai – 600026
Phone :  +91 44 43992828 Extn: 818

RTS Perm Link