ఇంతగా అమ్ముడుపోయామా?
యూనియన్ కార్బైడ్.. ప్రపంచ పారిశ్రామిక యుగ చరిత్రపై ఒక పెద్ద మచ్చ. పాతికేళ్ల తర్వాత కూడా ఆ మచ్చ భోపాల్ భాధితులపై వేస్తున్న దుష్ర్పభావం తగ్గుముఖం పట్టలేదు. ఆర్థికంగానే కాదు, మనుషుల ప్రాణాల పరంగానే కాదు. ఘోరమైన శారీరక బాధల పరంగానే కాదు.. జీవితంలో అన్నిటికంటే విలువైన ఆత్మగౌరవ పరంగా కూడా యూనియన్ కార్బైడ్ మచ్చ ఈ దేశాన్ని పాతికేళ్లుగా కాలుస్తోంది.
అన్ని వ్యవస్థలూ ప్రజా వ్యతిరేక స్వభావంలో కూరుకుపోయిన నేపధ్యంలో.. న్యాయపరంగా కూడా భోపాల్ మానవ ఆర్తనాదం ఓటమి బాట పట్టింది. న్యాయం కూడా ఇంత నిస్సిగ్గుగా అమ్ముడయిపోయిన వేళ.. ఈ దేశంలో బాధితులకు, నిజంగా సహాయం కావలసిన వారికి ఇక దిక్కెవ్వరు?
కొన్ని వందల, వేల ప్రాణాలు హరీమన్నాయి. వేలాది మంది శరీరాలు రసాయనిక విస్పోటనంతో చితికిపోయాయి. ఎవరిని కదిపినా ఆక్రోశం, ఆర్తనాదం.. మానని గాయాలు పచ్చి పుండును పాతికేళ్ల తర్వాత మరోసారి కెలికిన అనుభూతి.
న్యాయమూర్తులంగారూ,
మీరు న్యాయం చేయకపోయినా ఫర్వాలేదు. దేశదేశాల్లో పాతుకుపోయిన ఆ బహుళ జాతి కంపెనీ మీద చేయి వేసే సాహసం మీకు లేకపోవచ్చు. మీరు చదివిన చదువులు, నేర్చిన సంస్కారం… ఇవేవీ భోపాల్ బాధితుల గోడును వినడంలో పనికిరాకుండా పోయి ఉండవచ్చు… ఏవో.. ఏవేవో తెలియని ఏ ఇతర శక్తులో మీ గొంతుకు, మీ కలానికి, మీ ధర్మవివేచను, మీ ఉనికికి కూడా అడ్డుపడి ఉండవచ్చు.. రావలసిన నిజమైన తీర్పును మీ స్వరంలోంచి రాకుండా చేసి ఉండవచ్చు.
కాని ఆ హంతక స్వభావం గల కంపెనీ ప్రతినిధికి వయసు మీరిన కారణం చూపి రెండేళ్ల శిక్షతో సరిపెట్టారు. మీరు బాధల్ని, దశాబ్దాల నొప్పులను వినకపోయినా ఫర్వాలేదు. బాధితుల మానని పుండ్లను మరింతగా కెలికే అధికారం మీకు ఎవరిచ్చారు? దేశానికి వెలుగునిస్తామని చెప్పిన ఆ ఎవరెడీ టార్చ్ లైట్ల అసలు పెట్టుబడిదారుడి ఊసు కూడా మీ తీర్పులో కనబడకుండా పోయింది.
న్యాయమూర్తులంగారూ! కోటిగొంతుకల పెనుకేకలే సాక్ష్యంగా మేం ఈ చిన్ని ప్రశ్న వేస్తున్నాం. మీరు న్యాయవర్తనులేనా? మీరు న్యాయంగానే వ్యవహరిస్తున్నారా? మీరు అమ్ముడు పోయారో, అమ్ముడుపోలేదో, అదృశ్య వత్తిడులకు లొంగిపోయారో మాకనవసరం. విషరక్కసి విసిరిన పుండ్లు మానక, పాతికేళ్లకే వృద్ధాప్యంతో అలిసిపోయిన భోపాల్ బాధితుల వయసు, వారి హాహాకారాలు మీ చెవిన పడ్డాయా లేదా అన్నదే మా సందేహం, ప్రశ్న కూడా.
ఈ అహింసా దేశంలో ఇంత అహింసాత్మకంగా ఇంత విషపు తీర్పును ప్రకటించేశారే… వ్యవస్థా వ్యతిరేక పోరాటాలను ‘అవతార్’ సినిమాల్లోనే చూసి ఆనందించమని భజాయించేశారే.. పాతికేళ్ల తర్వాత ఇంత నిస్సిగ్గు తీర్పుతో మీరు ఈ దేశ వాసులను ఎంఎన్‌సీల ముందు కట్ట కట్టుకు చావమంటూ తాంబూలాలిచ్చేశారే..!
ప్రపంచంలో సాయుధపోరాటాలు ఎందుకు పుడతాయో, హింసాత్మక, ప్రతి హింసాత్మక తిరుగుబాట్లు ఎందుకు చెలరేగుతాయో.. కమ్యూనిస్టు ‘భూతాలూ’, నక్సలైటు ‘రాక్షసులూ’, ఛావెజ్ ‘కర్కోటకులూ’, ఎందుకు ఆవిర్భవించారో, ఆవిర్భవిస్తున్నారో… మీకు ఏ ‘లా’ పుస్తకాలూ చెప్పవు లెండి. ఉన్నా చదివే తీరికా, ఆసక్తీ మీకు ఉండవు కదా..
ఎందుకంటే.. శ్రీశ్రీ అన్నట్లు… “అదృష్టవంతులు మీరు.. వెలుగును ప్రేమిస్తారు..”
అవునూ.. మీరు ఇప్పటికీ యూనియన్ కార్బైడ్ వాడి ఎవరెడీ టార్చ్‌లను కొని వాడుతూనే ఉన్నారు కదూ..
వెలుగును ప్రేమించేవారూ.. దేశభక్తిపరులూ కదా…
వాడుతూనే ఉంటారు లెండి…
రెండువందల లోపు జనాన్ని చంపిన కసబ్‌కు ఉరిశిక్ష…
పదిహేను వేలమందిని విషం కక్కి చంపించిన వాడి ఊసే లేదు..
కసబ్‌ది మాత్రమే నేరం…ఆండర్సన్ ఆత్మకు కూడా మలినం అంటదు…
ఢిల్లీలో ‘రాజపక్షే’ వాలిన వేళ.. భోపాల్‌లో సమస్త ప్రజా వ్యతిరేక తీర్పు వెలువడిన వేళ…
ఎంత చక్కటి టైమింగ్… ఎంత చక్కటి సమయపాలన
న్యాయం ఎంత గొడ్డుపోయిందీ దేశంలో..
కొసమెరుపు: శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని యూనియన్ కార్బైడ్స్ నాటి సీఈఓ ఆండర్సన్‌ను అఘమేఘాల మీద బయటకు పంపించి వేశారట కేంద్ర, రాష్ట్ర్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే జరిగేది లెండి. ఇంతకూ ఆండర్సన్ ఇక్కడే ఉంటే ఎవరి శాంతిభద్రతలకు భంగం కలిగేదో..
మరీ ఇంతగా అమ్ముడు పోయామా!!
ఇది చందమామ కథల గోడు కాదు.. నా గోడు.. ఏ న్యాయానికీ నోచుకోని ప్రజల గోడు…
(పాతికేళ్ల తర్వాత కూడా కనీస న్యాయం పొందలేక ఓడిపోయిన భోపాల్ బాధితులకు సహానుభూతితో…)
6 Responses to “ఇంతగా అమ్ముడుపోయామా?”
Leave a Reply






What the judges can do? They have to follow the case prepared by the Police(Govt) as per old IPC.
What Police guys could have done against vested interests of then CM and PM ?
దేశంలోని సామాన్య మానవుడి గొంతుని మా అందరి పక్షానా ఎంతో చక్కగా వినిపించారు రాజు గారూ!
కానీ ఎవరికి? కళ్ళూ చెవులూ లేని న్యాయ వ్యవస్థకు!
రెండేళ్ళ జైలు శిక్ష!
నేరం ఎంత తీవ్రమైనది? ఎంతమంది ప్రాణాలు ఉఫ్ మని ఊదేసింది!ఎంతమందిని జీవితాంతం శిక్షకు గురి చేసింది?
ఒకరిద్దరి ప్రయోజనాల కోసం వేలమంది ఉసురు పోసుకోడానికి సిద్ధపడిన ప్రభుత్వాన్ని నమ్మి ఈ దేశంలో జీవిస్తున్నాం మనం? ఎంత దౌర్భాగ్యం మనది?
ఎంతమంది కసబ్ లకు సమానం ఆండర్సన్? కసబ్ కూడా ఆండర్సన్ వలే డబ్బు వెదజల్లి న్యాయాన్ని కొనగలిగి ఉంటే అతగాడినీ మైనరనొ మరోటనో చెప్పి వదిలేసేవారే!
ఎంత సిగ్గు లేని తనం? జనం ఉమ్మేస్తారని కూడా వెరపు లేదు.
ఇన్నాళ్ళకు మీ నుండి నేనాశించిన పోస్టు చదివాను సార్. ధన్యవాదాలు. ఇక్కడ నే రాసింది చూసారా..http://saamaanyudu.wordpress.com/2010/06/08/%E0%B0%B5%E0%B1%80%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B1%81-%E0%B0%95%E0%B0%B8%E0%B0%AC%E0%B1%8D-%E0%B0%95%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81/
Mari anyamina thirpu
అనామకుడు, సుజాత, సామాన్యుడు, దేవ్ గార్లకు ధన్యవాదాలు.
పాతికేళ్ల తర్వాత కూడా న్యాయం దొరకలేదనే కసితో భోపాల్ బాధిత కుటుంబాల్లో యువతలో ఏ ఒకటో, రెండో శాతం మంది తిరుగుబాటు బాట పట్టినా ఆ బాట తప్పు అనే నైతిక స్థైర్యం భద్రసమాజానికి లేదు. అయినా.. మా దేశం నుంచి పరారయిన నరహంతకుడు మీ దేశంలో దాక్కున్నాడు కాస్త పట్టివ్వండి అనే ధైర్య ప్రకటన సామంత దేశాల గొంతు లోంచి వస్తుందా? అది చావేజ్‌కు చెల్లు, ఫిడెల్ క్యాస్ట్రోకు చెల్లు. మనమూ ఉన్నాం. నూరుకోట్లమందిమి. మనకూ ఓ ప్రధాన మంత్రీ, ఓ రాష్ట్రపతీ.. ఉన్నారు లెండి.
శ్రీశ్రీ ఎంత గొప్ప కవిత్వం దశాబ్దాల క్రితమే రాశారు.
మనమంతా బానిసలం,
గానుగలం, పీనుగలం!
వెనుక దగా, ముందు దగా,
కుడి యెడమల దగా, దగా!
మనదీ ఒక బతుకేనా?
కుక్కల వలె, నక్కల వలె!
మనదీ ఒక బతుకేనా?
సందులలో పందులవలె!
chaala baga raasaru…