బాల్య సంస్కారం నేర్పిన చందమామ
చందమామకు రెగ్యులర్గా కథలు పంపుతున్న మాన్యులు శ్రీ జొన్నలగడ్డ మార్కండేయులు గారు. రాజమండ్రిలో పుట్టి సమీపంలో ఉన్న పేరవరం గ్రామంలో పెరిగిన ఈయన చిన్నప్పుడు చందమామ కోసం ఎదురుచూపులు చూసిన మరపురాని జ్ఞాపకాలు ఆయన పంపిన చందమామ ముచ్చట్లలో తడుముతూ, యాభై ఏళ్ల క్రితం రాజమండ్రి రావాలంటే లాంచీలలో, నావలలో ఒంటెద్దు బళ్లలో ప్రయాణం చేయవలసిన అపురూప జ్ఞాపకాలను చందమామ పాఠకులతో పంచుకున్నారు.
బాల్యంలో తాను చదివిన చందమామ కథలలోని వర్ణనను తమ చుట్టూ పరిసరాలకు అన్వయించుకుంటూ పరవశం చెందిన మార్కండేయులుగారు, “పెరట్లో దబ్బ చెట్టు కాయకపోతే చందమామ కథ చదివిన మేము లంకె బిందెలున్నాయని చెట్టు చుట్టూ తవ్వేశాము. లంకెబిందెలు దొరకలేదు గాని నేల గుల్లబారిందో ఏమో దబ్బచెట్టు కొద్ది రోజుల్లోనే పూత పూసి విరగకాసింది.” అంటూ చందమామ బాల్యాన్ని హృద్యంగా పంచుకున్నారు.
పైగా సంచార గ్రంధాలయాల లెక్కన ఊర్లుకు సైకిళ్లలో, తోపుడు బళ్లలో చందమామ, బాలమిత్ర తదితర కథల పుస్తకాలు,వారపత్రికలు తీసుకువచ్చి తెలుగువారి పుస్తక పఠనాభిరుచికి అపురూప తోడ్పాటు అందించిన రెడ్డి వంటి సాధారణ వ్యక్తుల చరిత్రను ఆయన ఈ చందమామ ముచ్చట్లలో తడిమారు.
ఎదుటివారిని ఏకవచనంతో సంబోధించిన ఘటనలో చందమామ చిన్నప్పుడు నేర్పిన సంస్కారాన్ని ఆయన తన ముచ్చటలో మనతో పంచుకున్నారు.
చందమామ ముచ్చట్లను ఆయన ఈ మెయిల్ ద్వారా ఏప్రిల్ చివరిలోనే పంపినప్పటికీ, గత రెండు వారాలుగా అనివార్య కారణాల వల్ల చందమామ వెబ్సైట్లో, బ్లాగులో పోస్టే చేయలేక పోయాము. ఆలస్యానికి క్షంతవ్యులము. అలాగే చందమామ అభిమాని ఇనగంటి రవిచంద్ర గారు కూడా చందమామ జ్ఞాపకాలను ఏప్రిల్ చివరలో పంపారు. వచ్చే శుక్రవారం వారి చందమామ జ్ఞాపకాలను పోస్ట్ చేయనున్నాము.
శ్రీ మార్కండేయులు గారు పంపిన చందమామ ముచ్చట్ల పూర్తి పాఠం కోసం కింది చందమామ వెబ్సైట్ లింకులో చూడగలరు.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2448
test Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Comments (7)7 Responses to “బాల్య సంస్కారం నేర్పిన చందమామ”
Leave a Reply
బాగుంది రాజుగారూ…
ఇందులో నన్ను పట్టుకుంది – ఆయన “ఏకవచన సంబోధం” “సంస్కారం” – ఆపాటి సంస్కారం ఇప్పటివాళ్ళలో ఎంతమందికి అలవాటుందో వేళ్ళ మీద లెక్కెట్టొచ్చు. పదేళ్ళు చిన్నవారైనా, పరిచయం ఉన్నా లేఖున్నా, ఏకవచన సంబోధంతో పలకరించే జనాలను చూస్తే “మహదానందం” నాకు. గౌరవ వాచకం నేర్పని పెద్దలననాలో, సంస్కారం లేని ఆ పుణ్యాత్ములననాలో అర్థం కాదు. పిల్లకాయలను వదిలెయ్యండి – నాకు తెలిసిన కొంతమంది పెద్దలను చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. వాళ్ళు చిన్నవాళ్ళను పలకరించే తీరు చూస్తుంటే – పేరొక్కటే కాక పక్కన “గారు” తగిలిస్తారు – ఒక పెద్దాయనను ఇదే అడిగితే “ఇరవై ఏళ్ళు దాటాక ఏ మనిషైనా పెద్దవాడే – కాబట్టి గౌరవమిచ్చి పిలవడంలో తప్పు లేదు – ఆపైన వాళ్ళకూ తెలిసొస్తుంది ఇతరులకు గౌరవమెలా ఇవ్వాలో” అని…ఇదెప్పుడో పదిహేనేళ్ళ క్రితం జరిగిన ఘటన…బుఱ్ఱలో ముద్ర పడిపోయింది – ఎర్రగా కాల్చిన చువ్వతో పెట్టినట్టు
ఒక్క “గారు” తోనే “ఇతరుల” “గౌరవం” ఇనుమడిస్తుంది అని చెప్పటం ఉద్దేశం కాదిక్కడ. అర్థమయ్యిందనుకుంటున్నాను
భవదీయుడు
వంశీ
ధన్యవాదాలు వంశీగారూ,
“ఇరవై ఏళ్ళు దాటాక ఏ మనిషైనా పెద్దవాడే – కాబట్టి గౌరవమిచ్చి పిలవడంలో తప్పు లేదు –ఆపైన వాళ్ళకూ తెలిసొస్తుంది ఇతరులకు గౌరవమెలా ఇవ్వాలో”
చాలా గొప్ప మాట. ఇక్కడ అసందర్భమే అయినప్పటికీ మీతో ఒక మాట చెప్పాలని ఉంది.
దాదాపు 20 ఏళ్లక్రితం సామాజిక ఉద్యమాలలో పనిచేస్తున్న కాలం. కాళహస్తి సమీపంలో కొండల్లో ఆదవరం అని ఓ ఊరు. నిజంగానే కొండ కింద ఉన్న ఆ గ్రామంలో ఊరు యువకులనూ పెద్దలనూ కూడగట్టి పాటలు పాడుతూ, మాటలాడుతూ గ్రామీణ సమాజ దుస్థితిని కళ్లకు కట్టినట్లు వివరిస్తూ వారి అభిమానానికి పాత్రులమయ్యాము. ఆ ఊరిలో చాకలి సుబ్రహ్మణ్యం, ఆయన భార్య మా సంఘానికి చివరివరకూ ఆశ్రయం కల్పించారు. రైతాంగ సమాజంలో చాకలి అంటే కొంచెం చిన్న చూపే.. తేలిక భావంతో చూడటం కూడా కద్దు. అలాంటిది ఆ దంపతులను కూడా మేము అందరితో పాటు సమానగౌరవం ఇస్తూ, అన్నా, అక్కా అని పిలుస్తూ సంఘంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తూ వచ్చాం. క్రమంగా ఆ దంపతులు ఆ ఊరిలోని సంఘానికి తలలో నాలుకలా మారారు. ఊరిలో అందరి బట్టలూ ఉతికి ప్రతి ఇంటిలో తీసుకువచ్చిన ఆహారపదార్థాలను మాకు ప్రీతిగా పెట్టేవారు. ఒక రోజు ఊరినుంచి బయలు దేరుతుంటే మాతో పాటు వచ్చాడు తను. ‘అన్నా ఒక మాట చెబుతాను. నా జీవితంలో ఊరివారు నా పేరు మన్ననగా పిలవడం ఏరోజూ వినలేదు. సుబ్బిగా, చాకలినాయాలా అంటూ అవమానించే వారే. ఏమన్నా అంటే పెద్దకులాలు. కాని మీరు వచ్చింది మొదలు ఊరి జనం నన్ను మనిషిగా గుర్తించడం మొదలుపెట్టారు. ఇతరుల నోటినుంచి ఏరోజూ నాపేరు గౌరవంగా వినలేదు. కాని మీరు అన్నా అనే పిలుపుతో నన్ను కట్టిపడేశారు. నేనూ మనిషినే అనే విషయం అందరికీ గుర్తు చేయించారు. ఇది చాలన్నా నా జీవితానికి.. మీరు పదికాలాలు చల్లగా ఉండండి..’ అంటూ మా చేతులు పట్టుకుని వలవలా ఏడ్చేశాడు. ఆయన్ను సముదాయించాం.. గట్టిగా పొదవుకుని అనునయించాం.
మార్కండేయులు గారి చందమామ ముచ్చట చదివాక 20 ఏళ్ల క్రితం నాటి అపురూప జ్ఞాపకం మరోసారి గుర్తు వచ్చింది. మనిషిని గౌరవించడం ఈదేశంలో కులాలను, అంతస్తులను బట్టే జరుగుతూ ఉంటుంది. పనిమనుషులను మనుషులుగా గుర్తించే భావసంస్కారం ఈ దేశానికి ఇంకా కలగలేదని అనిపిస్తూంటుంది నాకు. కులాతీతంగా మనిషిని ఆప్యాయంగా పలకరించడం, హత్తుకోవడం అనేది… ఒక సంఘ నిర్మాణంలోనే, మన కులాల స్పృహను వదిలేసుకుని ప్రజలతో మనసా వాచా మమేకం కాగలిగే ఉద్యమ జీవితంలోనే సాధ్యమవుతుంది. ఈ నిషయాన్ని చాకలి సుబ్రహ్మణ్యం అన్న మాకు తన కన్నీటి పరితాపంతో కలిగించిన అనుభవంతో ఆరోజే నేర్చుకున్నాం. మార్కండేయులు గారు మానవత్వపు మహనీయ రూపాన్ని మళ్లీ నాకు చూపించారు. ఆయనకూ, ఆయన చెప్పిన వ్యాఖ్యలోని ఔన్నత్యాన్ని సరిగ్గా గుర్తించిన మీకు మరోసారి ధన్యవాదాలు.
ఒక్క “గారు” తోనే “ఇతరుల” “గౌరవం” ఇనుమడించదు. ఇది కూడా నిజమే.. నీకంటే అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్న వారిని నువ్వు ఎలా చూస్తున్నావు అనేది అన్నింటికన్నా గొప్ప విలువ. ఆ విలువల త్రాసులో మనం ఎటువైపు ఉన్నామో అందరమూ మనకు మనంగా పరీక్షించుకోవలసిందే… కులాధిక్యాన్ని, అంతస్తుల ఆధిక్యాన్ని నిలువునా పాతిపెట్టే విలువ అది.
రాజు.
చందమామ
కాని మీరు అన్నా అనే పిలుపుతో నన్ను కట్టిపడేశారు. నేనూ మనిషినే అనే విషయం అందరికీ గుర్తు చేయించారు. ఇది చాలన్నా నా జీవితానికి.. మీరు పదికాలాలు చల్లగా ఉండండి..’
నీకంటే అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్న వారిని నువ్వు ఎలా చూస్తున్నావు అనేది అన్నింటికన్నా గొప్ప విలువ.
_______________________________________________________
HATS OFF!
I mean, we need more people like you.
మలక్పేట గారూ,
మిమ్మల్ని రౌడీ అని మీరే పెట్టుకున్న పేరుతో పిలవడం కూడా నాకు మంచిదనిపించటం లేదు. ఇష్టమైన పేరు పెట్టుకోవడంలో మీ హక్కును గౌరవించవలసిందే. కానీ, నా వ్యాఖ్యలో అత్యంత కీలకమైన అంశాన్ని ఒడిసి పెట్టుకున్నారు. మీరు రౌడీ ఎలా అవుతారు? ఏం బాగాలేదు.
మనసులో మాట సుజాత గారి ద్వారా మీరు పరిచయం అయారు. కానీ ఇలా ప్రత్యక్ష సంబంధంలోకి ఇంతవరకు రాలేదు. మీరే ముందు పరామర్శించారు. చాలా సంతోషం.
కానీ మీ ప్రశంసకు అంతగా అర్హుడిని కానేమో అనిపిస్తుంది. ఎందుకంటే జీవితంలో ఏదో ఒక బలహీన క్షణం మనల్ని మళ్లీ మన కులంలోకి, అభిజాత్యంలోకి, అహంభావ ప్రదర్శనల్లోకి, ఫ్యూడల్ అహాల్లోకి లాక్కెళుతూనే ఉంటుంది. ఏమారితే చాలు మళ్లీ మనల్ని వెనక్కు నెట్టేసే భావజాలంలోకి పోకుండా బయటపడటానికి చాలా కష్టపడాలి.
ఆవిధంగా మనందరం మారుతూ, ఎదుగుతూ, దిగజారుతూ, మళ్లీ కొత్త భావాలవైపు పయనిస్తూ పాత-కొత్త భావ సంస్కారాల మధ్య ఘర్షణలో నలుగుతూ కొనసాగుతున్నామనుకుంటాను.
పరామర్శ ఉపన్యాసంలా మారుతున్నట్లుంది. మీ పరిచయం అయినందుకు సంతోషం. కానీ మీ పూర్తి పేరు తెలియదు. నిజంగా తెలియదు. సుజాత గారు కూడా చెప్పినట్లు లేదు.
మనలో మాట. మీకూ చందమామ జ్ఞాపకాలు ఉన్నాయా? ఉంటే పంచుకోవచ్చు కదా. మనం ఇలాగే కలుసుకుంటూ ఉందాం.
రచన మే నెల ప్రత్యేక సంచిక చూశారా! తెలుగు వాళ్లకు, పిల్లలకు, పెద్దలకు కథల రూపంలో మంత్రనగరి సరిహద్దులను చూపించిన గొప్ప మనిషి చందమామ ధారావాహికల రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారి జీవిత, సాహిత్య విశేషాలపై వచ్చిన అపురూప ప్లత్యేక సంచిక మే నెల రచన పత్రిక. వీలయితే తప్పక తీసుకోండి.
chala bangundi e kadha
super
telugu cinema