రచన -దాసరి- ప్రత్యేక సంచిక : అపూర్వ స్పందనలు
పిల్లలను, పెద్దలను ‘చందమామ’ ద్వారా కొన్ని దశాబ్దాలపాటు అలరించిన దాసరి సుబ్రహ్మణ్యం గారి వంటి అద్భుత అజ్ఞాత రచయిత గురించి తెలుగు పాఠకలోకానికి ‘చాటి’ చెప్పాలన్న తపనతో సర్వశక్తులూ ఒడ్డి నభూతో అన్న చందంగా రచన శాయి గారు తీసుకువచ్చిన మే నెల రచన ప్రత్యేక సంచిక పట్ల ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి..
ప్రస్తుతానికి శాయి గారు ఢిల్లీలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీ శేషు గారి అద్భుతమైన స్పందనను చందమామ బ్లాగుకోసం పంపారు.. ‘ఒక పత్రిక గురించి మరొక పత్రికలో ఊసే లేని (ఈసు తప్ప) తెలుగు పత్రికా లోకంలో ఇలాంటి ప్రయోగం జరగటం ఇదే మొదలనుకుంటాను.’ అంటున్న శేషుగారు మే నెల రచన ప్రత్యేక సంచిక తీసుకురావడంలో శాయి గారు పడ్డ కష్టం గురించి విచారం వ్యక్తం చేశారు.
రచన వంటి పత్రికలు వ్యాపార ఒడిదుడుకులను తట్టుకుని నిలబడాలని మనస్పూర్తిగా కాంక్షిస్తూ రచనకు త్వరలో చందా కడతానని కూడా చెప్పారు. సదాశయంతో, ఉత్తమాభిరుచితో లాభాపేక్ష అనే పదానికి అర్ధం ఏమిటో తెలియని తత్వంతో పత్రిక నడిపిస్తున్న వారికి పత్రిక విడివిడిగా కొనడం కాకుండా చందా రూపంలో తీసుకుంటే ఎంత ఊపిరి పోస్తుందో, మనకు తెలియని విషయం కాదు. అందుకే శేషుగారితో నూటికి నూరుపాళ్లూ ఏకీభవిస్తూ నేను కూడా ఈ నెల నుంచి రచనకు చందా పంపిస్తున్నాను.
నిజం చెప్పాలంటే మూడు నెలల క్రితం వరకు రచన శాయి గారి గురించి నాకు పెద్దగా పరిచయం లేదు. చందమామ వీరాభిమానుల్లో. అగ్రగణ్యుడిగా 8 నెలల క్రితం త్రివిక్రం గారు ఆయన గురించి చెప్పడం వరకే నాకు గుర్తుంది. ఎందుకో శాయిగారితో పరిచయం చాలా ఆలస్యంగా జరిగింది. కానీ గత మూడు నెలలుగా దాసరి గారిపై ప్రత్యేక సంచికకోసం మన రాష్ట్రంలోని, ఇతర రాష్ట్రాల్లోని, ప్రపంచంలోని తెలుగు వాళ్లను, దాసరి గారి అభిమానులను సంప్రదించడంలో, దాసరి జ్ఞాపకాలు, అరుదైన అంశాలను పంపమని తాను ఎంత తీవ్రస్థాయిలో శ్రమించారో చందమామ -దాసరి- అభిమానులకు తెలుసు.
మొదట అనుకున్న పథకాన్ని మించి దాసరిగారిపై విశేష స్పందనలు రచన కార్యాలయానికి వెల్లువెత్తడంతో ఏప్రిల్ సంచిక ముద్రణను సైతం ఆపివేసి ప్రత్యేక సంచికకు ప్రాధాన్యత ఇవ్వడంలో శాయిగారు రచన ఉనికినే సవాలుగా పెట్టారు. సాహిత్య అధ్యయనాన్ని సీరియస్‌గా తీసుకునే వారికోసం, రచన కంట్రిబ్యూటర్లకోసం ఉత్తమ పుస్తకాలను బహుమతిగా ఉచితంగా అందిస్తున్న సత్సంప్రదాయం కూడా రచన శాయిగారికే సొంతమనుకుంటాను.
కాళీపట్నం రామారావు గారి సాహిత్య సంచికలను 150 కాపీలకు పైగా తాను స్వయంగా కొనుగోలు చేసి రచన కంట్రిబ్యూటర్లకు ఉచితంగా అందించడం, తన అబిరుచికి తగిన పుస్తకాలను ముందే కొనుగోలు చేసి తదనంతర కాలంలో వాటిని అవసరమైన వారికి అందించడం, ఏ పుస్తకం కావాలన్నా దానికి సోర్స్ చెప్పి సహకరించడం.
ఇవన్నీ ఒక ఎత్తైతే తెలుగు బాల సాహిత్యం మర్చిపోలేని గొప్ప పనులు మూడు శాయిగారి స్వంతమయ్యాయి. అవి చందమామ పత్రికకు ముందు ప్రారంబించబడి 1945 నుంచి 59 వరకు బాలసాహిత్యానికి ఊపిరులు పోసిన ‘బాల’ పత్రికలోని ముఖ్యమైన కథలు, తదితర అంశాలను 1300 పైజీలకు పైగా క్రోడీకరించి నాలుగు పుస్తకాలుగా -కావాలంటే హార్డ్ బౌండ్‌గా కూడా దొరుకుతోంది- ప్రచురించడం, తెలుగు బొమ్మల రేడు బాపూ బొమ్మల సర్వస్వాన్ని పుస్తకంగా అచ్చేసి బాపూగారికి శాశ్వత గౌరవం కల్పించడం, ఇప్పుడు ప్రపంచ చందమామ అభిమానులంతా గర్వించదగిన దాసరి గారి జీవిత, సాహిత్య విశేషాల మే నెల రచన ప్రత్యేక సంచికను నభూతో న భవిష్యతి లాగా అతి తక్కువ ధరకు అందించడం…
ఒక్క మాటలలో చెప్పాలంటే తెలుగు సాహిత్యంలో ఏ పత్రికా ప్రచురణ సంస్థకూ సాధ్యంకాని, కాలేని మూడు గొప్పపనులు రచన పత్రిక మాత్రమే చేయగలిగింది. ఈ మూడు పుస్తకాల ప్రచురణ విషయంలో పైసా ఆదాయం ఆయనకు రాకపోవడం గమనార్హం. మే నెల రచన ప్రత్యేక సంచిక ఉత్పత్తి ఖర్చులే ఒక్కో పత్రికకు రూ.46లు అయ్యాయనే చేదునిజం ఇవ్వాళే ఆయన బయటపెట్టారు. ముద్రణా సంస్థ ఎంత తక్కువ వ్యయంతో ముద్రించినా విడి పత్రిక ఉత్పత్తి ధర రూ.46లకు చేరుకుందట. మార్కెట్‌లో మే నెల ప్రత్యేక సంచిక వెల రూ.50లు. ఈ వార్త వినగానే మనసంతా చేదయిపోయింది. ఈ విపత్కర పరిణామాలను రచన తట్టుకుని నిలబడుతుందా..
రచన బతకడం, మనగలగడం, మిగలడం…. కావాలిప్పుడు. ఇందుకు రచనకు చందాలు, ప్రకటనలు కావాలి. అవి మాత్రమే రచనను పది కాలాలపాటు బతికిస్తాయి. రచన పాఠకులు, చందమామ అభిమానులు, ఉత్తమ సాహిత్యాన్ని ఆదరించగల సంస్థలు తమ వంతు సాయం ఈ విషయంలో అందించగలిగితే ఎంత బావుణ్ణు. రచన బతకాలి. శాయి గారు రచన పత్రికను పది కాలాల పాటు నడపగలగాలి. ఇప్పుడు రచనకు ఆపన్న హస్తాలు నిజంగా కావాలి. చందాల రూపంలో… ప్రకటనల రూపంలో.. ఇంకా వీలైతే పెద్ద పెద్ద సంస్థల, వ్యక్తుల ఆర్థిక ఔదార్యం రూపంలో….
యునెస్కో వారు ప్రపంచంలోని కొన్ని పురాతన కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటిస్తుంటారు. పత్రికలకు సంబంధించి అలాంటి విధానమేదైనా ఉంటే, ‘చందమామకు’ ఆ గౌరవం దక్కాలి అంటూ రచన ప్రత్యేక సంచికపై మేడేపల్లి శేషు గారు పంపిన హృదయ స్పందనను ఇక్కడ చదవండి.
చందమామ ప్రపంచ వారసత్వ సంపద కావాలి!
రచన శాయి గారికి,
నమస్కారం (ఆంధ్రాలో ‘సాయి’ కాని ‘శాయి’ మీరొక్కరే అనుకుంటాను).
‘రచన’పత్రికకు నేను చాలాకాలంగా దూరమైనా, మళ్ళీ ‘చందమామ’ పత్రిక్కి సంబంధించిన ఒక గొప్ప రచయితను (ఆయన దాసరి సుబ్రహ్మణ్యం గారని ఇప్పుడే తెలిసింది) గురించి మీరేదో ప్రత్యేక సంచిక వేశారని తెలిసి (రామవరపు గణేశ్వర రావు గారు ఫార్వర్డ్ చేసిన మెయిల్ ద్వారా) మళ్ళీ మీ దగ్గరకొచ్చాను.
ఈ ‘రచన’ ప్రత్యేక సంచిక గురించి మీరు పడ్డ కష్టం బాగా తెలిసొచ్చింది. ఒక పత్రిక గురించి మరొక పత్రికలో ఊసే లేని (ఈసు తప్ప) తెలుగు పత్రికా లోకంలో ఇలాంటి ప్రయోగం జరగటం ఇదే మొదలనుకుంటాను. పిల్లలను, పెద్దలను ‘చందమామ’ ద్వారా కొన్ని దశాబ్దాలపాటు అలరించిన దాసరి సుబ్రహ్మణ్యం గారి వంటి అద్భుత అజ్ఞాత రచయిత గురించి తెలుగు పాఠకలోకానికి ‘చాటి’ చెప్పాలన్న మీ తపనకు జోహార్లు. తీగ లాగితే, డొంకంతా కదిలినట్లు (అలా కదిలించటం అంత తేలికపని కాదని తెలుసు), ‘చందమామ’ తో సంపర్కమున్న ఎంతోమందిని కదిలించి అచిరకాలంలో వారి దగ్గరనుంచి ఎన్నో అనుభవాలను పోగుచేసి, వాటిని ఏర్చి, కూర్చి ఒక ప్రత్యేక సంచిక రూపంలో మా ముందుంచిన మీ కృషి అభినందనీయం. యునెస్కో వారు ప్రపంచంలోని కొన్ని పురాతన కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటిస్తుంటారు. పత్రికలకు సంబంధించి అలాంటి విధానమేదైనా ఉంటే, ‘చందమామకు’ ఆ గౌరవం దక్కాలి. ఇన్ని భాషల్లో ప్రచురింపబడే ‘చందమామ’ మన తెలుగువాళ్ళ సృష్టి అనుకున్నప్పుడు చాలా గర్వంగా ఉంటుంది.
నేను ‘చందమామ’ లోని అన్ని సీరియళ్ళూ చదవకపోయినా, దాసరి వారి ‘భల్లూక మాంత్రికుడు’ మాత్రం చిన్నప్పుడు చదివాను. అది మొత్తం బైండు చేసిన కాపీ కూడా మా ఇంట్లో ఉండేది. వరంగల్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ఉండే మేము (నేను, మా చెల్లెలు) సెలవుల్లో ఖమ్మంలోని మా మేనత్తగారింటికి వెళ్ళినప్పుడు, వాళ్ళమ్మాయి దగ్గర ‘చందమామ’ చూసేవాళ్ళం. రంగులతో తళతళలాడే కొత్త కాపీని ముట్టుకుంటేనే జన్మ ధన్యమైనట్టు ఉండేది. జానపద సీరియల్ కింద రచయిత పేరు స్థానంలో ‘చందమామ’ అని ఉండేది కనుక, అసలు రచయిత పేరు తెలిసేది కాదు. కొ.కు గారివంటి గొప్ప రచయిత కూడా ‘చందమామ’లో పనిచేశారని చాలాకాలానికి తెలిసి అలాంటి పత్రికను చదవగలిగినందుకు గర్వంగా అనిపించింది. నేను డిల్లీలో ఉద్యోగంలో చేరిన తర్వాత కన్నడ, తమిళ, మళయాళ చందమామలు కొని ఆ భాషలు కొంతవరకూ నేర్చుకున్నాను.
ఈ ‘రచన’ ప్రత్యేక సంచిక చదవకపోయి ఉంటే, దాసరి సుబ్రహ్మణ్యం గారివంటి గొప్ప రచయితగురించి నాకు తెలిసి ఉండేది కాదు. ఆయన గురించి ప్రముఖులందరూ రాసిన వ్యాసాలు ఎంతో అపురూపంగా ఉన్నాయి. ఆ కథలను ఎంతగానో మెచ్చుకుని ఆసక్తిగా చదివిన మేము ఆ రచయిత ఎవరో ఇంతకాలంగా తెలుసుకునేందుకు ప్రయత్నించనందుకు ఎంతో సిగ్గుగా కూడా ఉంది. ఇంతకాలంగా ‘రచన’కు దూరంగా ఉండటంవల్ల ఇంకా ఇటువంటి ఎంతెంత విలువైన సమాచారం కోల్పోయానో అని బాధపడుతున్నాను. చిన్నప్పుడు ఇలాంటి అద్భుతమైన సీరియళ్ళు ‘చందమామ’లో చదివినందువల్లనేమో, కొందరు రాసినట్టు, హారీ పాటర్ నవలలుగాని, ‘అవతార్’ వంటి సినిమాలుగాని పెద్ద అద్భుతాలని అనిపించలేదు. వీలైనంతవరకూ పాత చందమామలన్నీ కొనేసి ఇంట్లో ఒక ర్యాక్ లో పెట్టేస్తే, పిల్లలు టి.వి. వైపు కన్నెత్తి కూడా చూడరనుకుంటాను.
పిల్లలకు మెదడు ఒక్కటే కాదు, మనసూ ఉంటుందని గ్రహించకుండా వాళ్ళను ‘చదువుల యంత్రాలుగా’ మారుస్తున్న మన ప్రస్తుత విద్యవిధానమంటే నాకు మొదటినుంచీ అసహ్యమే. వాళ్ళను మరింత అసహ్యకరమైన వినోద (?) కార్యక్రమాలకు బలికావించే టి.వి. చానెల్సు అన్నా, ఇప్పటి సినిమాలన్నా నాకు మరింత అయిష్టం. నాకే కనుక విద్యావిధానాన్ని నిర్ణయించే అధికారమిస్తే, నెలకో రోజు ‘చందమామ’ చదివే పీరియడ్ పెడతాను. మార్కులతో పనిలేకుండా, వాళ్లకు కొన్ని పాఠ్య అంశాలు ప్రవేశాపెడతాను. మంచి పుస్తకాలు చదివిస్తాను. మంచి చలన చిత్రాలు చూపిస్తాను. పరీక్షలకు బదులు వాటిగురించి చర్చ పెడతాను. జ్ఞానంతోపాటు పిల్లల్లో మనసూ, బుద్ధీ కూడా వికసించాలి. అప్పుడే వాళ్లకు పరిపూర్ణ వ్యక్తిత్వం వస్తుంది. ఏ చదువు చదివితే ఎంత సంపాదించవచ్చు అనే పద్ధతిలోనే నడుస్తోంది మన ప్రస్తుత విద్యావిధానం. ఇది ఎటు వెళ్లి ఎటు తేలుతుందో అర్థం కాకుండా ఉంది. భాష, సాహిత్యం, కళలు అనేవి ఉపయోగంలేని వ్యాపకాలు అనే ధోరణి బాగా ప్రబలుతోంది. ఇది ముందు తరాలకు చాలా ప్రమాదం.
ఎన్నో వ్యాపార ఒడిదుడుకులను తట్టుకుని ‘రచన’ వంటి ఉత్తమాభిరుచులుగల పత్రికను ఇంతకాలంగా నిర్వహిస్తున్నందుకు మీకెలా అభినందనలు తెలియజేయాలో తెలియటంలేదు (‘ఆహ్వానం’, ‘హాసం’ వంటి పత్రికలూ ఈ పోటీ ప్రపంచంలో అంతరించిపోయాయి). త్వరలో మళ్ళీ ‘రచన’కు చందా కడతాను. మరెందరో దాసరి సుబ్రహ్మణ్యం గారి వంటి అజ్ఞాత రచయితలు తెలుగు సాహిత్య లోకంలో ఉండవచ్చు. అటువంటి వారిని కూడా వెలుగులోకి తెస్తారని ఆశిస్తాను.
- మేడేపల్లి శేషు, కొత్త డిల్లీ
M. Seshu,
Office of Secretary,
Ministry of Labour & Employment,
109, Shram Shakti Bhavan,
Rafi Marg,
New Delhi – 110 001
Tel: 011-23738603
Mob: 9868912258
One Response to “రచన -దాసరి- ప్రత్యేక సంచిక : అపూర్వ స్పందనలు”
Leave a Reply






చందమామ కథల మాంత్రికుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి జీవిత, సాహిత్య విశేషాంశాలపై రచన మే నెల ప్రత్యేక సంచికపై దాసరి గారి అభిమానులు తమ హృదయ స్పందనలను అపూర్వంగా పంచుకుంటున్నారు. వాటిని ఈ ప్రధాన వ్యాసానికి అనుబంధంగా ఇస్తున్నాము. ఇవి వ్యక్తిగత ఈమెయిల్స్ రూపంలో ఉన్నప్పటికీ వ్యక్తిగత స్వభావంతో లేవు కాబట్టి దాసరి -చందమామ- అభిమానులందరూ పంచుకోవాలనే ఉద్దేశ్యంతో కామెంట్ల విభాగంలో చేరుస్తున్నాము.
Dear Sai garu!
Meeru annatlu gaane ivaala post lo ‘Rachana’ andindi.
Simply Adbhutam!
Chandamama priyulaku amoolyamaina chaaritraka nidhi ee sanchika.
nenu saitam Bhaagaswamy nainanduku paramaanandamgaa vundi.
Thanks and Congrats!
-Sudhama
శ్రీ శాయిగారు,
నమస్తే
రచన సోమవారమే అందింది. నేను ఊహించినదానికంటే అద్భుతంగా ఉంది.
దన్యవాదాలు.
మీరు అడిగిన యువ సంచికల కోసం ప్రయత్నిస్తాను.
మీ
వెంకట అప్పారావు (Surekha)
శాయిగారూ,
నమస్కారం
మీరు మెయిల్ ఇచ్చినట్టు దాసరి ప్రత్యేక సంచిక రాలేదు గాని నాకెంతో ప్రాణమైన బాపు బొమ్మల కథలు పుస్తకం. రచన పత్రిక, మరో పుస్తకంతో సహా నిన్ననే అంటే సోమవారం నాడు- వచ్చి చేరాయి.
మీరు బాపు రమణల షష్టిపూర్తి సందర్భంగా ఏదో పుస్తకాన్ని రూపొందించారని ఎక్కడో చదివాను కాని చూడలేదు. ఇప్పుడు దాన్ని చూసి మహదానందపడ్డాను. ఆ అపురూప రసవాహిని రూపకల్పన కోసం మీరు చేసిన కృషి తెలుసుకుని అబ్బుర పడ్డాను. బాపురమణల స్నేహ చందనాలందుకున్న మీకు నా అభినందనలు. వెనకటి తరానికి చెందిన మహానుభావులైన రచయితల పట్ల మీకున్న భక్తిప్రపత్తులకు మరోసారి జోహార్లు.
రచన నాకు మొదటినుంచీ నచ్చిన పత్రిక. పూర్వపు ఆంధ్రపత్రికలా ఉంది అనుకునేదాన్ని. రచనను ఇలాగే ఉండనివ్వండి.. ఈ కాలంలోకి దింప్పెయ్యకండి. మాలాంటి అభిమానులకేమీ కొదవ ఉండదు గనక రచన వెయ్యేళ్లు చిరంజీవిగా వర్ధిల్లుతుంది.
కృతజ్ఞతలతో
గాయత్రి
Sri Sai garu,
Namaste.
I got the Rachana special Issue yesterday and started exploring it. Not yet completed.
Anyway…Its so a SPECIAL ONE and I thank you verymuch for that.
Sincerely
Gayatri
———————-
రాజు గారూ,
నమస్తే! ఆదివారం పొద్దున్నే నాలుగు మాటలు మీతో పంచుకోవాలని రాస్తున్నాను. రచన ఎంతో అద్భుతంగా వచ్చింది కదూ! మీ బ్లాగులో వ్యాఖ్య రాయడానికి ఆలస్యం అయిపోయింది.నేను ఊళ్ళో లేను అప్పుడు. ఎండలు కదాని ఒక వారం పాటు మహాబలేశ్వర్ హిల్ స్టేషన్ వెళ్ళొచ్చాము.
శాయి గారు ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రతి సీరియల్ విశ్లేషణకూ బొమ్మలు చక్కగా అమరేటట్లు చేశారు. కానీ లక్ష్మి గాయత్రి గారి వ్యాసంలో శాయి గారు చెప్పినట్లు(బ్రాకెట్లో), దాసరి గారు మరణించాక ఇంత హంగామా చేశాం కానీ ఆయన విజయవాడలో ఉన్నారని తెలిసీ ఎంతమందిమి వెళ్ళాము? అని ప్రశ్నించుకోవాలనిపించింది నాకు.
నా మాటుకు నాకు ఆయన గురించి వేణు తన బ్లాగులో రాశాకే తెలిసింది. చందమామ పేరుతో సీరియల్స్ రాసేదెవరా అని చిన్నప్పుడు ఎంతో ఉత్కంఠ పడిన నేను ఆయన ఫలానా అని, కాసింత దూరంలో విజయవాడలోనే ఉన్నారనీ తెలిసాక ఏం చేయాలి? ఎంతో అబ్బురపడి విజయవాడ వెళ్ళి వారి దర్శనం చేసుకోవాలి! కానీ అలా చేశానా …లేదు! “ఎంత అదృష్టవంతులండీ మీరు”అంటూ వ్యాఖ్య రాసి ఊరుకున్నాను. ఆయనెవరో తెలిసిన సంతోషం మనసు నిండా ఉన్నా, నా స్పందన ఆ స్థాయిలోనే ఉంది.
పోనే విజయవాడ నాకేమన్నా కొత్తా అంటే కాదు! మా వూరు వెళ్ళినపుడల్లా ఒకరోజు పని గట్టుకుని విజయవాడ లెనిన్ సెంటర్ కి వెళ్ళి పాత పుస్తకాల కోసం కాలవ గట్టున పాకులాడతాను.
I’m over stay here” అని దాసరి గారు అన్నా, ఆ మాటను సరదాగానే తీసుకున్నాను గానీ నిజంగానే ఇంత త్వరగా చనిపోతారని బహుశా ఊహించకపోవడమే నా అలక్ష్యానికి కారణం అనుకుంటాను. ఆయన సంగతి తెలిశాక “ఈ సారి ట్రిప్ లో ఆయన్ను కలుసుకోవాలి”అనుకున్నాను తప్ప ఆ ట్రిప్పేదో వెంటనే పెట్టేసుకోవాలని మాత్రం అనుకోలేదు. అదీ నా పొరపాటు.
ఇక ఎప్పటికీ దిద్దుకోలేని పొరపాటు.
ఇకపై ఎవరైనా చందమామ గురించి రాస్తే దాసరి గారి సీరియల్స్ గురించి నాల్గు ముక్కలు చెప్పగలనేమో గానీ “ఆయన్ని చూశాను”అని రాసే అదృష్టం వేణు కున్నట్లు నాకు లేదు.
ఇక ఎప్పటికీ ఆయన్ని చూడలేం, మాట్లాడలేం! ఆయన పోయారని తెలిశాక చాలా పశ్చాత్తాపం వేసింది. అది రచన చూశాక మరింత పెరిగింది.
చందమామ విజయానికి మూల స్థంభాలైన వారిలో ఒకరు మన రాష్ట్రంలోనే…. దగ్గర్లోనే ఉన్నారని తెలిసీ ఆయన్ని ఎంతో అభిమానిస్తూనే..వెళ్ళి కలుసుకోలేకపోయినతర్వాత చందమామ తో నా అనుబంధాన్ని ఎన్ని పేజీలు రాసి ఏం లాభం?
ఈ సంచిక చూశాక నా తోటికోడలు వాత్సల్య నాకు ఫోన్ చేశారు.చందమామ గురించి ఇంతమంది రాస్తారని, దాని మీద ఇంత అభిమానం దాచుకున్న పెద్దవాళ్ళు ఇంతమంది ఉంటారనీ ఆమెకు తెలీదట. తను విజయవాడలోనే పుట్టి పెరిగింది. ఆ సీరియల్స్ అన్నీ తనకు ప్రాణమనీ అప్పటి చందమామలు ఇంకా తన పుట్టింట్లో కొన్ని ఉన్నాయనీ చెప్పింది.(ఇక్కడ…..నేను ఎగిరి గంతేసి ఉంటానని మీరు ఊహించే ఉంటారుగా!)1980 కి ముందు సంచికలు ఉంటే తప్పక తీసుకురమ్మని చెప్పాను. కావాలంటే స్కాన్ చేసుకునో. ఫొటోస్టాట్ తీసుకునో ఇచ్చేస్తానని చెప్పాను.(కానీ అసలంటూ ఆమె తెస్తే , తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఎగ్గొడదామనే పచ్చి స్వార్థం కూడా నా మనసులో ఉంది! మీ దగ్గర దాపరికమెందుకు.!)
చందమామలు దాచుకుందని తెలిస్తే “చిన్న పిల్లలాగా ఏమిటిది”అని మా అత్తగారు వాళ్ళు అనుకుంటారని ఎప్పుడూ ఈ సంగతి చెప్పలేదుట. చందమామను మనసులో ఇంత భద్రంగా దాచుకున్న “పెద్ద పిల్లలు”(మనమంతా)ఉన్నామని తెల్సి అవాక్కయిపోయింది.
రేపు గురువారం ఆమె విజయవాడ వెళ్తారు. ఎక్కడో పెట్లో దాచిన ఆనాటి చందమామలు పురుగుపట్టి పాడైపోకుండా ఉంటే తప్పక తెస్తానని చెప్పారు.అవి జాగ్రత్తగా ఉండాలని ముక్కోటి దేవతలకు మొక్కుతున్నాను.(అవసరానికి భలే గుర్తొస్తారు దేవుళ్ళు)
దాసరి గారు చివరి రోజుల్లో విజయవాడలోనే ఉన్నారని, అక్కడె పోయారనీ తెలిస్తే విజయవాడలో పాతికేళ్లు నివసించి,”ఆ జానపద సీరియల్స్ ఎవరు రాశారబ్బా”అని ఆలోచిస్తూ గడిపిన ఆమెకలా ఉంటుంటో ఊహించండి. కళ్ళనీళ్లు పెట్టుకునంత పని చేశారు.”అయ్యో, అయ్యో విజయవాడలో ఉన్నారా” అని పది సార్లైనా అని ఉంటారు.
ఇక రచనలో దాసరి గారి వ్యక్తిగత లేఖలు ప్రచురించడం నాక్కొంచెం బాధ కల్గించింది. ఆయన చేతిరాత చూడాలనుకునే అభిమానులకు దాన్ని చూపించడం వరకూ ఓకే గానీ ఆయన జీవితంలొని నీలినీడలు నలుగురికీ తెలియడానికి అది కారణమైంది కదా అనిపించింది. ఆ లేఖలు చూసేవరకూ ఆయన భార్యతో విడిపోయారనీ, కూతురికోసం పరితపించారనీ,జీవితాంతం ఒంటరిగా జీవించారనీ ఎవరికీ తెలీదు కదా!అదొక్కటీ తప్ప మిగతా సంచిక మొత్తం ఒక అద్భుతంగా తోచింది.
శాయి గారికి చందమామ అభిమానులంతా రుణపడి ఉండాలనిపించింది.
ఉంటానండీ,నమస్కారాలతో
సుజాత
మనసులోమాట
……………………
radhamma on May 6, 2010 12:12 PM Edit This
రచనలో చందమామ విశేషాలను ఇంత కాలానికి చదవడం నిజంగా అధ్భుతంగా అనిపించింది.అవన్నీ నేను బాపట్లలో మీ ఇంట్లొనే వసారాలో కూర్చుని చదివాను.మా అబ్బాయికి ఆ కధలన్నీ చెపుతూ ముద్దుగా వాటిలొని పేర్లతో పిలుస్తుంటాను.నిజంగా వాటిని చదవగలగడం నా అదృష్టం.మీకు నా
కృతఙ్ఞతలు.
రాధమ్మ
తొలకరి
రాధమ్మగారికి,
కొన్ని తరాలుగా తెలుగునాడులో, దేశవ్యాప్తంగా కూడా మీ వంటి అమ్మలు, నాన్నలే చందమామను ఇంటిల్లిపాదికీ పరిచయం చేస్తూ, కధలు చదువుతూ, చదివిస్తూ జాతికి కథామృతాన్ని పంచిపెట్టారు. ఈ కార్టూన్ యుగంలో ఈ రోజుకూడా చందమామను పిల్లలు, పెద్దలు కూడా చదువడానికి ఆసక్తి చూపుతున్నారంటే దశాబ్దాల క్రితం మీ వంటివారు, మీ తల్లిదండ్రులు వేసిన పునాదే కారణం. రచన పత్రిక సంపాదకులు శ్రీ శాయిగారి పుణ్యమా అని మళ్లీ మీరూ, మేమూ, మనలాంటి వారం మళ్లీ చందమామ జ్ఞాపకాలను, దాసరి వారి జానపద సీరియళ్ల వైభవాన్ని మరోసారి చదువుకుంటున్నాము. చందమామ కథలను చదవటం మీ అదృష్టం అయితే మీవంటి నిత్యపాఠకులను కలిగి ఉండటం చందమామ అదృష్టంగా చెప్పాలి. పిల్లలకు చందమామ కథలను చదివి వినిపించే మీ వంటి తల్లులున్నంతవరకూ చందమామ వెలుగుతూనే ఉంటుంది. మనందరినీ ఈ రూపంలో కలిపిన శాయిగారికి, చందమామ జ్ఞాపకాలను పంచుకున్న మీకూ చందమామ తరపున కృతజ్ఞతాభివందనలు.చందమామతో మీ అనుబంధం, బాల్యంలో మీకు చందమామతో ఎలా పరిచయం అయింది. మీ పిల్లలు చందమామను ఎలా ఆస్వాదిస్తున్నారు వంటి విషయాలతో వివరంగా మీ చందమామ జ్ఞాపకాలు తప్పక పంపగలరు. వాటిని చందమామ వెబ్ సైట్ లోనూ, చందమామ బ్లాగ్ ద్వారానూ పాఠకులందరికీ పంచిపెడదాం.
మీ చందమామ జ్ఞాపకాలు పంపవలసిన చిరునామా
abhiprayam@chandamama.com
మీ
చందమామ
chandamama.com
blaagu.com/chandamamalu
———–
I am sure you have received the Rachana sepcial issue. Your Pagala Durgam review is quite good Raju gaaroo. One more review I liked is that of Chokkaapu Venkata Ramana who write it in a different manner.
Sivaramprasad Kappaganthu