దాసరి సుబ్రహ్మణంగారు : ‘రచన’ ప్రత్యేక సంచిక
“తనకే సొంతమైన ఏకాంతంలోకి నిశ్శబ్దంగా , అనాయాసంగా అంతర్థానమైన రచయిత…
జానపద కథల మాంత్రికుడు..
దాసరి సుబ్రహ్మణ్యం గారు!
దశాబ్దాలపాటు ఆయన చందమామకు వెన్నెముకగా నిలిచారు. సంపాదక వర్గ సభ్యునిగా ఉత్తమ సంప్రదాయాలు నెలకొల్పారు.
1954లో ‘తో్కచుక్క’తో మొదలైన ఆయన ధారావాహికల సమ్మోహన ఇంద్రజాలం 1980లో ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ విజయవంతంగా కొనసాగింది.
చందమామ అనన్య ప్రచారానికి కారణమయింది. ఆ రచనల పున: ప్రచురణలు చదువరులకు చేరువై, చందమామ విలువను పెంచుతూ వచ్చాయి.
ఆయన అక్షరాలను మంత్రిస్తే..అవి అవధుల్లేని కథాకల్పనలయ్యాయి. వీర, బీభత్స, రౌద్ర, అద్భుత రసావిష్కరణలతో అపురూప జానపద కథలై నిలిచాయి. ఆ శైలీ విన్యాసం జవనాశ్వాలై పరుగులు పెడితే అసంఖ్యాక పాఠకులు ఉత్కంఠతో, ఆసక్తితో, ఇష్టంతో ఏళ్ళతరబడి చదివారు. ఆ అక్షర ‘చిత్రా’లను గుండెల్లో దాచుకున్నారు.
ప్రతి సంచిక కోసం విరహపడ్డారు.ఎదురుచూశారు.దశాబ్దాలు గడిచినా వాటిని తలపోసుకుంటూనే ఉన్నారు.
ఊహల విహంగాల రెక్కలపై తరతరాల పఠితలను..పిల్లలనూ, పెద్దలనూ వింత వింత లోకాల్లో విహరింపజేసి మంత్రముగ్ధులను చేశారు.
కానీ…ఆయన మాత్రం పేరు ప్రఖ్యాతులేమీ పట్టనితనంతో ఆ పాఠకులకు కూడా తనెవరో తెలియని అజ్ఞాత రచయితగానే ఉండిపోయారు!”
కథల మాంత్రికుణ్ణి స్మరించుకున్నాం!
సి.హెచ్. వేణు
http://venuvu.blogspot.com/2010/02/blog-post.html
పత్రికకు తప్ప రచయితలు, సిబ్బందికి ప్రాధాన్యత అవసరం లేదనే చందమామ సంప్రదాయం కారణంగా చందమామ ధారావాహికల రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారు దాదాపు 60 ఏళ్లుగా అజ్ఞాత రచయితగానే ఉండిపోయారు. చందమామ వైభవోజ్వల చరిత్రకు అధ్బుతమైన ధారావాహికలతో పట్టం గట్టిన దాసరి గారి జీవిత, సాహిత్య జీవిత వివరాలు, చందమామకు ఆయన అందించిన గొప్ప తోడ్పాటు గురించి ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు ఓ మాన్యుడి నిర్విరామ కృషి, సంకల్ప బలం వల్ల బాల సాహిత్య చరిత్రలో ఓ అరుదైన పుస్తకం ప్రత్యేక సంచిక రూపంలో మన ముందుకు వచ్చింది.
చందమామ అభిమానులు, పాఠకులందరినీ గత రెండు నెలలుగా ఊరిస్తూ, నిరీక్షణకు గురిచేసిన రచన ప్రత్యేక సంచిక -మే నెల- ఇవ్వాళే మార్కెట్‌లోకి వచ్చింది. శాయిగారు ఈ విషయం నిన్న సాయంత్రమే నిర్దారించారు.
ప్రతి చందమామ పాఠకుడూ, అభిమానీ ఈ అపరూప ప్రత్యేకసంచికను తప్పక తీసుకుంటారని, దాసరి సుబ్రహ్మణ్యం గారి అరుదైన జ్ఞాపకాలను, ఆరు దశాబ్దాల పాటు ఆయన సాగించిన అలుపులేని సాహిత్య కృషిని తమ హృదయాలకు హత్తుకుంటారని ఆశిస్తున్నాము.
ఈ సందర్బంగా వారం రోజుల క్రితం శాయిగారికి రాసిన ఈమెయిల్ సారాంశాన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాము.
డియర్ శ్రీ శాయి గారూ,
మీరు పంపిన, దాసరి సుబ్రహ్మణ్యం గారిపై రచన ప్రత్యేక సంచిక -మే, 2010- వివరాల పీడీఎఫ్ ఫైల్ అందింది. నిన్న సాయంత్రం నుంచి సిస్టమ్ నాకు అందుబాటులో లేదు. దీంతో వెంటనే మీకు మెయిల్ పంపలేకపోయాను. ఇది ప్రశంస అనుకోండి. కృతజ్ఞత అనుకోండి. మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఉంది.
చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు జనవరి చివరలో పోయాక ఆయనపై రచన ప్రత్యేక సంచిక తీసుకురావాలనే ఆలోచనే మీకు రాకుండా ఉండి ఉంటే.. బాలసాహిత్యానికి సంబంధించినంతవరకూ ఓ గొప్ప తెలుగు పుస్తకం చరిత్రలో రికార్డుకు కూడా లేకుండా పోయేది. అందుకు చందమామ అభిమానులందరూ మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మీ ప్రకటన అందించిన ప్రేరణతో దాసరి గారి అభిమానులు ఓరకంగా వీరావేశంతోనే పనిచేసి, పోటీలు పడి మరీ ఆయన రచనలపై, జీవితంపై తమకు తెలిసిన సమస్త సమాచారాన్ని ప్రోది చేసి పంపారు.
చందమామ వైభవోజ్వల స్వర్ణయుగానికి కారణభూతులైన మహనీయులలో దాసరి గారు ఒకరు. ఆయన 1954 నుంచి 1980 వరకు విరామం లేకుండా చందమామ చరిత్రలోనే అజరామరమైన 12 ధారావాహికలను రాశారన్న విషయం కూడా దశాబ్దాల పాటు మరుగునపడింది. పత్రికకు తప్ప సిబ్బందికి, ఇన్ హౌస్ రచయితలకు ప్రాముఖ్యత కల్పించరాదన్న సంప్రదాయం చందమామది. ఈ పాలసీ చందమామకు మేలు చేసినప్పటికీ చందమామ ధారావాహికల రచయిత ఎవరో ప్రపంచానికి తెలియకుండా చేసింది. కుటుంబరావుగారే చందమామలో పేరులేని ఎడిటర్‌గా దశాబ్దాలపాటు పనిచేశారనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.
ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు, ఇన్ని దశాబ్దాలకు… చందమామలో 54 ఏళ్లపాటు నిరవధికంగా పనిచేసిన ఓ గొప్ప మనిషి జీవిత, కథాసాహిత్య వివరాలు రచన పత్రిక ద్వారా, కేవలం మీ ద్వారా ప్రపంచం ముందుకు వస్తున్నాయి. సమస్త చందమామ అభిమానుల తరపున మీకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలుపుతున్నాను.
ప్రత్యేక సంచిక నిడివి పెరగడం, ఊహించిన దానికంటే సమాచారం ఎక్కువగా పోగుపడటం వంటి కారణాలతో రచన ఏప్రిల్ సంచిక ముద్రణను పక్కనపెట్టి కూడా మీరు దాసరి గారిపై ప్రత్యేక సంచికకోసం తీవ్ర కృషి చేశారు. ఒక నెల పత్రిక ముద్రణ నిలిచిపోయినా ఫర్వాలేదనే తెగింపే ఓ సాహసోపేత నిర్ణయం. 1998లో చందమామ తాత్కాలిక అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినప్పుడు తగిలిన దెబ్బనుంచి చందమామ ఇప్పటికీ కోలుకోలేదు.
అందుకే మీ నిర్ణయం సాహసోపేతమైనది. దశాబ్దాలుగా తెలుగు వారి సాంస్కృతిక రాయబారిగా పనిచేసిన, చేస్తున్నచందమామ పత్రికపై అబిమానం, మమకారం హృదయంలో నిలుపుకున్నారు కాబట్టే మీరు ఇంత తెగింపుకు సిద్ధపడ్డారు. చంపి -చందమామ పిచ్చోళ్లు లేదా ప్రియులు- లలో ప్రధమస్థానం మీదే అని గతంలో త్రివిక్రమ్ గారు ఓ సందర్బంలో అన్నారు. ఈ రకంగా కూడా అది నిజమైంది.
చందమామ చరిత్రకు తన ధారావాహికల ద్వారా మెరుగులు దిద్దిన గొప్ప మనిషికి ‘రచన’ పత్రిక ప్రత్యేక సంచిక నీరాజనం పలుకుతోంది. బహుశా దాసరి గారికి ఇంతకు మించిన నివాళి మరొకటి ఉంటుందని నేననుకోవడం లేదు. ఇందుకు సంబంధించిన మొత్తం ఘనత మీదే అని మనస్పూర్తిగా చెబుతున్నా.
ఈ హారీ పోటర్లూ, అవతార్‌ల గురించి ప్రపంచానికి తెలీని రోజుల్లో చందమామ ధారావాహికల ద్వారా కోట్లాది మంది భారతీయ పిల్లలను, పెద్దలను జానపద మంత్ర నగరి సరిహద్దుల్లో ఓలలాడించిన గొప్ప కథకులు దాసరిగారు. దశాబ్దాలుగా మరుగున పడిన ఈయన మేటి కృషిని, తెరవెనుక నేపధ్యాన్ని రచన ప్రత్యేక సంచిక -మే,2010- ద్వారా ప్రపంచం తెలుసుకోనుంది.
చందమామ రచయిత రాసిన అన్ని ధారావాహికల పరిచయాలను, ఇతర వివరాలను ఒకే చోట చదివే అవకాశాన్ని చందమామ అభిమానులకు, పాఠకులకు కల్పించడం రచన పత్రిక వల్లే సాధ్యపడింది. ‘మాకూ ఓ ప్రపంచ స్థాయి కథా రచయిత ఉన్నాడు’ అని జబ్బలు చరిచి మరీ తెలుగువాళ్లు చెప్పుకునేలా సాగించిన ఓ అద్బుత కృషికి గాను మీరు గత రెండు నెలలుగా అలుపెరుగకుండా శ్రమించారు.
మీ సంకల్పబలం విజయవంతం కావాలని, ప్రతి చందమామ అభిమాని, పాఠకులు, జానపద కథల ప్రేమికులు ఈ ప్రత్యేక సంచికను అపురూపంగా దాచుకుంటారని ఆశిస్తున్నాను.
ప్రత్యేక సంచిక పది కాపీలను నేను రిజర్వ్ చేసుకున్నాను. మీకు ఎంఓ కూడా పంపాను. మే 2న ప్రత్యేక సంచిక విడుదలకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము.
ప్రపంచంలోని చందమామ ప్రేమికులందరి అభిమానం మీపై కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
రాజశేఖర రాజు
చందమామ
గమనిక: దాసరి సుబ్రహ్మణ్యం గారిపై రచన పత్రిక మే నెల ప్రత్యేక సంచిక కావలసినవారు కింది చిరునామాకు ఎంఓ పంపగలరు.
రచన, 1-9-286/2/పి, విద్యానగర్, హైదరాబాద్-500 044.
ఈ ప్రత్యేక సంచిక విడిప్రతి వెల రూ. 50 మాత్రమే.
సంప్రదించవలసిన ఈ మెయిల్ ఐడీ
పూర్తి చిరునామా
Y V S R S Talpa Sai
Editor – RACHANA Telugu Monthly
1-9-286/2/P Vidyanagar
Hyderabad – 500 044
e mail : rachanapatrika@gmail.com
Ph : 040 – 2707 1500
Mobile : + 99485 77517
visit : www.rachana.net
12 Responses to “దాసరి సుబ్రహ్మణంగారు : ‘రచన’ ప్రత్యేక సంచిక”
Leave a Reply






దాసరి గారు వ్రాసిన తోకచుక్క గురించి నాకో మధురానుభూతి. ఈ సీరియల్ 1950లలో ఎప్పుడో మొదటి సారి వచ్చింది. అప్పుడు మా అమ్మ, తన బాల్యంలో ఆ సీరియల్ నెల నెలా లైబ్రరీకి వెళ్ళి చందమామలో చదివిందట. తిరిగి 1980 లలో అనుకుంటాను, పునర్ముద్రితమైంది. అప్పుడు నేను రెండవ తరగతో, మూడవ తరగతో.. ఈ సారి మాత్రం, మా అమ్మ నెలనెలా మాకు తెప్పించి పెట్టింది, లైబ్రరీ అవసరం లేకుండా. నేను చదివిన మొదటి పిల్లల సీరియల్ అది. ఆ సీరియల్ చదివేప్పుడు మా అమ్మ ఏకాక్షి, చతుర్నేత్రుడు, కాలాభుజంగం, కంకాళం, ఉలూకం, నరవానరం – ఇలాంటి పదాలను వివరించి మాకు అర్థం చెప్పేది. ఇప్పటికీ ఆ సీరియల్ చదివేప్పుడు, ఏకాక్షి “కాలా భుజంగా” అని కేకపెడితే, ఓ గగుర్పాటు కలుగుతుంది.
ఈ రోజు దాసరి గారు, మా అమ్మగారు లేకపోయినా, తోకచుక్క మాత్రం గుర్తుంది. ఈ సీరియల్, ముగ్గురు మాంత్రికులు, నేను ఎప్పుడూ మరువలేను. మా పాపాయితో కూడా ఈ సీరియల్ చదివించాలని ఆశ పడుతున్నాను. (ఇంగ్లీషు చదువులు బలిసిన ఈ రోజుల్లో అది సాధ్యమవుతుందన్న నమ్మకం మాత్రం లేదు).
చెప్పకుండానే చాలా వచ్చేసింది. ఆ ప్రాతఃస్మరణీయులకు ఎన్ని మొక్కులు చెప్పుకోవాలో!
ఊ..రేపిక మా ఊరి మీద పడి వెతకాలి.
రవి గారూ, సత్వర స్పందనకు ధన్యవాదాలు.
“ఈ రోజు దాసరి గారు, మా అమ్మగారు లేకపోయినా, తోకచుక్క మాత్రం గుర్తుంది.” దీన్నే రివర్స్‌లో రాస్తాను. తోకచుక్క ఉన్నంతవరకు దాసరి, అమ్మ లోకంలో ఉంటారు. ఇంగ్లీషు చదువులు బలిసిన ఈ రోజుల్లో తెలుగువారందరికీ ఇలాంటి అమ్మలు, నాన్నలే కావాలి. నాన్నా చందమామ తేనా, చందమామ కథ వినిపించనా.. అని దశాబ్హాలుగా మన అమ్మా, నాన్నలు బాల్యంలో మనకు చందమామను పరిచయం చేయకపోతే మనకూ ఓ బాల్యం ఉంది,, చందమామతో పండిన బాల్యం ఉంది అని చెప్పుకునేందుకు మనకు ఏమీ మిగిలేదీ కాదు. కొన్ని తరాల పిల్లలకు చందమామను అందించిన ఆ గొప్ప అమ్మా నాన్నలకు శత సహస్ర వందనాలు.
ఖచ్చితంగా ఊరిమీద పడి వెతకండి. ఒకటికి రెండు రచన మే నెల ప్రత్యేక సంచికలు కొని పెట్టుకోండి. ఒకటి మీకూ, మిగతావి తర్వాత ఎప్పుడయినా ఆ పత్రిక కావాలి అనే మిత్రులకు ఇవ్వడానికీ..పనికొస్తాయి.
దాసరి సుబ్రహ్మణ్యం గారి జీవిత, రచనా విశేషాలపై రచన మే నెల ప్రత్యేక సంచిక విడుదల సందర్భంగా ఆయన వీరాభిమాని దాసరి వెంకటరమణగారు పంపిన ప్రకటన కింద ఇస్తున్నాము
“సాహితి మిత్రులకు నమస్కారం!
తెలుగు చందమామ చదవకుండా తెలుగు పిల్లలు పెద్దవాళ్ళు కారు
అన్నది ఒక నానుడి. అది కాస్త అతిశయోక్తిగా అనిపించినా నిర్వివాదమైన వాస్తవం. చందమామలో 1954 నుండి 1980 వరకు తోకచుక్క మొదలుకొని భల్లూక మాంత్రికుడు వరకు 12 అద్భుతమైన సీరియల్స్ ను రాసిన దాసరి సుబ్రహ్మణ్యం గారికి నివాళి గా రచన మే సంచిక ప్రత్యేకంగా రూపుదిద్దుకొని వెలువడుతోంది..
ఇది చందమామ అభిమానులందరూ తప్పక చదివి తీరవలసిన, అపురూపంగా దాచుకోదగ్గ సంచిక. ఒక విషయం గుర్తు పెట్టుకోండి. రచన తీరిగ్గా బజారులో కొనుక్కోవచ్చు అనుకొంటే మీరు ఆశాభంగం చెందవలసిందే. ఈ నెల అనగా ఏప్రిల్ 25 వ తేది లోగా వచ్చిన ఆర్డర్లను దృష్టిలో పెట్టుకొని డిమాండ్ ను బట్టి కాపీలు ప్రింట్ చేయబడతవి. మీ స్పందన పోస్ట్ కార్డ్ ద్వారా మెయిల్ ద్వారా వెంటనే తెలియ చేయండి. త్వరగా ఆర్డర్ చేయండి.
మీరు ఈ మెయిల్ ను మీకు తెలిసిన సాహితి అభిమానులందరికీ ఫార్వార్డ్ చేయండి. చిన్నప్పుడు మీరు చదివిన చందమామ స్మృతులను పంచుకోండి.
భవదీయ
దాసరి వెంకట రమణ
బాలసాహిత్య పరిషత్”
ఇప్పుడే అందిన వార్త. చందమామ కథల మాంత్రికుడు దాసరి గారిపై రచన పత్రిక మే నెల ప్రత్యేక సంచిక తొలి ప్రతులు తీసుకున్న వారు చందమామ సీనియర్ కథకులు శ్రీ ఎంవీవీ సత్యనారాయణ గారు. ఆయన ఈరోజు ఉదయమే హైదరాబాద్‌లో రచన ఆపీసులో శాయిగారిని కలిసి అక్కడే తన కాపీ తీసేసుకున్నారట. అలాగే దాసరి వెంకటరమణ గారికి కూడా ఒక కాపీ తీసిపెట్టారని తెలిసింది. మే 2న రచన చందాదారులకు పోస్ట్ చేస్తారని వినికిడి. ఇప్పటికే పాఠకులకు మార్కెట్లో అందుబాటులో ఉంది కనుక కావలసినవారు వెంటనే తీసుకోగలరు. 240 పేజీల ఈ అవురూప సంచిక వెల 50 రూపాయిలు మాత్రమే. త్వరపడండి.
order ela cheyyalo konchem cheppagalara??
‘రచన’ ప్రత్యేక సంచికలొ నా చిన్న రఛనలకు చోటు దొరికినందుకు ధన్యుణ్ని.
దాసరి సుబ్రహ్మణ్యం గారిపై ఇలా ఓ ప్రత్యేక సంచికను మన ముందుకు
తెస్తున్న రచన శాయిగారికి ధన్యవాదాలు.
కార్తీక్ గారూ, మీ పోస్టల్ అడ్రస్ ను ఈ-మెయిల్ ద్వారా వెంటనే పంపండి. rachanapatrika@gmail.com
కాపీకి 50 రూపాయిల చొప్పున అమౌంట్ ను ఎం.ఒ. చేయండి.
ఆడ్రస్- రచన, 1-9-286/2/పి, విద్యానగర్, హైదరాబాద్-500 044.
రచన శాయి గారు మే నెల ప్రత్యేక సంచిక గురించిన వివరాలను పంపిన తర్వాత పరస్పరం జరిగిన ఈమెయిల్ సంభాషణల క్రమాన్ని కింద పొందుపరుస్తున్నాను.
—————-
Mahasaya,
The special “Rachana” on late Sri Dasari garu looks very attractive and informative. I am eagerly looking forward to receiving the complete Patrika.
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
హ్యూస్టన్, టెక్సస్.
Phone: 832 594 9054
URL: http://www.vangurifoundation.org
Blog: http://www.vangurifoundation.blogspot.com
————–
Dear Sri Raju garu:
Namaste!
Thank you for your considered opinion and appreciation for the curtain riser. Hope it will remain even after reading the complete issue. It is the great effort of all of you that made it possible in a limited way. I am only a compiler of what all of you had fed for the cause.
I had confirmed receipt of your MO on the other day in a separate mail.
with best wishes
yours
sai
———————
Dear friend,
good compliment for Sai’s work. Thanks and congrats.
Have a wonderful day,
yours sincerely
veeren.
yandamoori@hotmail.com
——————–
Dear Sai garu,
Mr. Raju has put it very well and perhaps there cannot be much to add.
Thanks for a great effort.
sincerely,
krp
rohiniprasadk@gmail.com
—————
రాజు గారూ,
నమస్కారం. బాగున్నారా..రచన శాయి గారికి మీరు రాసిన సుదీర్ఘ లేఖ ఇందాకే చదివాను. అదంతా చదివాక నాకు అర్ధమైంది ఒక్కటే..అది కంప్యూటర్ కీ బోర్డ్ మీద కదిలే మీ వేళ్లలోంచి జాలువారిన పదాల పల్లకీ కాదు.. ఆ వేళ్ల కదలికలకు ఆధారభూతమైన హృదయాంతరాళాల్లోంచి పైకి ఉబికిన భావ మకరంద మందాకిని. మీ భావుకతకు,ఉదాత్త ఆలోచనా వైఖరికి నిజంగా నా జోహార్లు…
శుభాకాంక్షలతో గాయత్రి
gayatri_kakinada@yahoo.com
—————-
యండమూరి వీరేంద్రనాధ్ గారికి,
ఆలస్యంగా సమాధానం ఇస్తున్నందుకు క్షమించాలి.
ముందుగా, శాయిగారికి నా లేఖపై మీ ప్రశంసకు ధన్యవాదాలు. తర్వాత.. 1980ల నుంచి మీ పుస్తకాలతో పరిచయం. రాయచోటి లైబ్రరీలో మొదట చదివిన మీ పుస్తకం ‘చెంగల్వ పూదండ.’ అంతకు ముందు ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా వస్తున్నప్పుడు అప్పుడప్పుడూ చదివాను. తర్వాత పూర్తి పుస్తకం చదివినప్పుడు ఒక షాక్. అంతవరకు పల్లెటూరిలో మా బాల్యం చందమామ కథలు, వివిధ వారపత్రికల పఠనంతో చల్లగా సాగేది. మీ నవల చదివినప్పుడు అంతవరకు సమాజం గురించి తెలియని ఏదో కొత్త విషయం తెలుసుకున్నట్లయింది. ముఖ్యంగా జైలులో ఆ పెద్దాయన జీవిత వాస్తవాల గురించి చెప్పిన భాగాలు నిజంగా కదిలించాయి. ఆ తర్వాత మీ 86-87 వరకు మీ నవలలు అనుసరించినా, వెన్నెల్లో ఆడపిల్ల తెలుగందనాలకు మురిసిపోయినా… సమాజాన్ని అధ్యయనం చేయడానికి నా మొదటి పాఠం మీ ‘చెంగల్వ పూదండ’ నుంచే ఓ స్పష్టమైన వైఖరి తీసుకుంది. మీ రచనలన్నింటిలోనూ ‘చెంగల్వ పూదండ’ నాకు బాగా నచ్చిన పుస్తకం. దాదాపు 30 ఏళ్లపాటు మీ రచనలు అప్పుడప్పుడు తగులుతూనే ఉన్నాయి. కానీ మీతో పరిచయం కాలేదు. జీవితంలో ఎనెన్నో దశలు గడిపిన అనంతరం చివరకు చందమామలో చేరాను. ఇప్పుడు శాయిగారి ద్వారా మిమ్మల్ని ఇలా కలుస్తున్నాను.
చాలా సంతోషంగా ఉంది. మీ పేరు పాతచందమామల్లో ఎప్పుడో చూసినట్లు గుర్తు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటి చందమామలో అనుకుంటాను మీదో లేదా ఇంటిపేరు గల వారిదో చందమామలో కథ చూసాను. మీరే అయితే మీరీ సంతోషం.
మీ ఆప్తవాక్యాలకు మరోసారి కృతజ్ఞతలతో
రాజశేఖర రాజు
చందమామ
rajasekhara.raju@chandamama,com
my blog (Chandamama blog)
http://blaagu.com/chandamamalu/
—————–
గాయత్రి గారికి,
మరీ ఎక్కువగా పొగిడినట్లున్నారు. మీ ఆప్తవాక్యాలకు కృతజ్ఞతలు. కానీ నేను చాలా చిన్నవాడిని. దాన్ని మీరు మర్చిపోవద్దు. మీ వ్యాఖ్యలకు చాలా సంతోషం..
రాజు
——————-
శాయి గారూ,
నమస్సులు!
రచన మే నెల ప్రత్యేక సంచిక వెబ్ పేజీలు ఎంతో బావున్నాయి! చిత్రా విశ్వరూపం ప్రదర్శించి చిత్రించిన పేజీ నిడివి వర్ణచిత్రాన్ని ముఖచిత్రంగా ఇవ్వటం అద్భుతంగా అమరింది.
తెలుగు పాఠకలోకాన్ని అపూర్వ జానపద కథా వీధుల్లో విహరింపజేసిన అపురూప రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారికి ఇంత గొప్ప నివాళి మీరు మాత్రమే ఇవ్వగలిగారు! మీ కృషినీ, తపననూ ఎంత శ్లాఘించినా సరిపోదు. మీకు మన: పూర్వక అభినందనలూ, ధన్యవాదాలూ!
ఈ ప్రత్యేక సంచికపై రాజశేఖర రాజు గారి స్పందన ఎంతో హృద్యంగా ఉంది.
చందమామ ప్రియుల, దాసరి సుబ్రహ్మణ్యం గారి అభిమానుల హృదయాల్లోని భావాలను ఏకం చేసి ఆయన తన అక్షరాల్లో ప్రతిఫలించారు!
- వేణు.
venuniha@gmail.com
—————
శాయిగారూ,
మీరెంతో శ్రమపడి ఓపికతో అందరినీ ఒకచోటికి చేర్చి , తెలుగు జానపద కదా బ్రహ్మకు నివాళి అర్పించటానికి “రచన” ప్రత్యెక సంచిక తీసుకుని రావటం ఎంతగానో ముదావహం. ఆ సంచిక గురించి చక్కగా అందరి మనసులలోనూ ఉన్న ఆనందాన్ని, ఉన్నది ఉన్నట్టుగా మన చందమామ రాజుగారు (రాజశేఖర రాజు) వ్యక్తపరిచారు. మీరు పంపిన టీజర్ పేజీలలో ఒకటి కొద్దిగా మార్చి, ఆ తరువాత రాజుగారి అభినందనలు యధాతథంగా “మన తెలుగు చందమామ” బ్లాగులో ప్రచురించాను. చూడండి. ఈ కింది లింకు నొక్కండి.
http://manateluguchandamama.blogspot.com/
నాకు తెలిసి ఒక రచయితకు ఆయన అభిమానులచేత ఆయన రచనల మీద సమీక్షలు వ్రాయించి ప్రచురించబడిన ఏకైక ప్రత్యెక సంచికగా, మే నెల ‘రచన’ చారిత్ర పుటలలోకి ఎక్కుతుంది. అభినందనలు.
ఉంటాను.
శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు భారత్ నుండి
vu3ktb@gmail.com
http://saahitya-abhimaani.blogspot.com/
——————
Dear friend,
Thank you very much for your letter.
JUST NOW I WENT THROUGH YOUR AGRICULTURAL FIELD…TORCH LIGHT EXPERIENCE WITH CHANDAMAMA STORY READING. CONGRATS.
MY FIRST STORY IN 1968…. AND OTHER 5 STORIES ARE PUBLISHED IN CHANDAMAMA. IF I AM CORRECT (I AM NOT SURE) I AM THE FIRST WRITER FOR BETHALA KADHALU. TILL THEN THE MAGZINE PUBLISHED THEIR EMPLOYESS STORIES ONLY. SAI HAS SENT MY FIRST STORY TO ME. IT WAS IN 1969 jUNE ISSUE “AMAANUSHA SAKTHULU” IS THE TITLE.
once again, nice to see your artilcle in Chandamama blog.
Have a wonderful day,
yours sincerely
veeren.
yandamoori@hotmail.com
——————
“మా పాపాయితో కూడా ఈ సీరియల్ చదివించాలని ఆశ పడుతున్నాను. (ఇంగ్లీషు చదువులు బలిసిన ఈ రోజుల్లో అది సాధ్యమవుతుందన్న నమ్మకం మాత్రం లేదు).”
—- తప్పకుండా సాధ్యమౌతుంది.
మా అబ్బాయి చందమామ ఆర్కైవులలో ఆ బొమ్మలు చూసి నన్ను కథ అడిగి చదివించుకుంటాడు.
ముగ్గురు మాంత్రికులు ఇతివృత్తానికి అరేబియన్ నైట్స్‌లోని ఒక కథ కొంతవరకూ ఆధారం.
రచనలో చందమామ విశేషాలను ఇంత కాలనికి చదవడం నిజంగా అధ్భుతంగా అనిపించింది.అవన్నీ నేను బాపట్లలో మీ ఇంట్లొనే వసారాలో కూర్చుని చదివాను.మా అబ్బాయికి ఆ కధలన్నీ చెపుతూ ముద్దుగా వాటిలొని పేర్లతో పిలుస్తుంటాను.నిజంగా వాటిని చదవగలగడం నా అదృష్టం.మీకు నా
కృతఙ్ఞతలు.
తొలకరి
రచనలో చందమామ విశేషాలను ఇంత కాలనికి చదవడం నిజంగా అధ్భుతంగా అనిపించింది.అవన్నీ నేను బాపట్లలో మీ ఇంట్లొనే వసారాలో కూర్చుని చదివాను.మా అబ్బాయికి ఆ కధలన్నీ చెపుతూ ముద్దుగా వాటిలొని పేర్లతో పిలుస్తుంటాను.నిజంగా వాటిని చదవగలగడం నా అదృష్టం.మీకు నా
కృతఙ్ఞతలు.
తొలకరి
రాధమ్మగారికి,
కొన్ని తరాలుగా తెలుగునాడులో, దేశవ్యాప్తంగా కూడా మీ వంటి అమ్మలు, నాన్నలే చందమామను ఇంటిల్లిపాదికీ పరిచయం చేస్తూ, కధలు చదువుతూ, చదివిస్తూ జాతికి కథామృతాన్ని పంచిపెట్టారు. ఈ కార్టూన్ యుగంలో ఈ రోజుకూడా చందమామను పిల్లలు, పెద్దలు కూడా చదువడానికి ఆసక్తి చూపుతున్నారంటే దశాబ్దాల క్రితం మీ వంటివారు, మీ తల్లిదండ్రులు వేసిన పునాదే కారణం. రచన పత్రిక సంపాదకులు శ్రీ శాయిగారి పుణ్యమా అని మళ్లీ మీరూ, మేమూ, మనలాంటి వారం మళ్లీ చందమామ జ్ఞాపకాలను, దాసరి వారి జానపద సీరియళ్ల వైభవాన్ని మరోసారి చదువుకుంటున్నాము. చందమామ కథలను చదవటం మీ అదృష్టం అయితే మీవంటి నిత్యపాఠకులను కలిగి ఉండటం చందమామ అదృష్టంగా చెప్పాలి. పిల్లలకు చందమామ కథలను చదివి వినిపించే మీ వంటి తల్లులున్నంతవరకూ చందమామ వెలుగుతూనే ఉంటుంది. మనందరినీ ఈ రూపంలో కలిపిన శాయిగారికి, చందమామ జ్ఞాపకాలను పంచుకున్న మీకూ చందమామ తరపున కృతజ్ఞతాభివందనలు.చందమామతో మీ అనుబంధం, బాల్యంలో మీకు చందమామతో ఎలా పరిచయం అయింది. మీ పిల్లలు చందమామను ఎలా ఆస్వాదిస్తున్నారు వంటి విషయాలతో వివరంగా మీ చందమామ జ్ఞాపకాలు తప్పక పంపగలరు. వాటిని చందమామ వెబ్ సైట్ లోనూ, చందమామ బ్లాగ్ ద్వారానూ పాఠకులందరికీ పంచిపెడదాం.
మీ చందమామ జ్ఞాపకాలు పంపవలసిన చిరునామా
abhiprayam@chandamama.com
మీ
చందమామ
chandamama.com
blaagu.com/chandamamalu