నావల్ల ఏ పనీ ఆగకూడదు: చందమామ శంకర్

April 12th, 2010

షణ్ముఖవల్లి గారు

చందమామ శంకర్ గారిని మార్చి 21న శివరాం ప్రసాద్ గారూ, నేనూ ఆయన నివాసంలో కలిశాక ఓ అనూహ్య ఘటన జరిగి పోయింది. ఇన్నేళ్ల జీవితంలో ఆయనను కంటికి రెప్పలా కాపాడుకున్న ఆయన జీవన సహచరి శ్రీమతి షణ్ముగవల్లి గారు బయటకు వెళ్లి తిరిగి వస్తూ తూలి పడిపోయారు. కాలు ఎముకలో తిన్నటి చీలిక ఏర్పడిందని, భయపడవలసిన పనిలేదని, నెలరోజులు ఏ పనీ చేయకుండా విశ్రాంతి తీసుకుంటే చాలని డాక్టర్ చెప్పారట.

ఆయన ఈ విషయాన్ని చిన్నదిగానే తీసుకుని మాకెవరికీ చెప్పలేదు. రెండువారాల తర్వాత ఏదో పని మీద ఫోన్ చేసినప్పుడు గాని విషయం తెలీకుండా పోయింది. కనీసం ఫోన్ చేసి చెప్పి ఉంటే బాగుండేది కదా అని ఆయనను అడిగితే మీ అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకని ఊరకుండిపోయినట్లు చెప్పారు. మరి మీకు వంట ఇతర పనులు ఎవరు చేసిపెడుతున్నారని అడిగితే రెండు పూటలా బియ్యం తానే కడిగి స్టౌ మీద పెడుతున్నానని, పక్కవీధిలో ఉంటున్న చివరి అబ్బాయి రెండు పూటలా కూరలు తీసుకువస్తున్నాడని, ఇబ్బందిలేదని చెప్పారు. వంట చేయలేని రోజున హోటల్లో ఏదో ఒక టిఫన్ తెప్పించేసుకుని సరిపెట్టుకుంటున్నామని చెప్పారు.

జీవన సహచరులు

ఇన్నేళ్ల జీవితంలో ఈ దంపతులకు ఇలాంటి ఇబ్బంది ఎన్నడూ ఎదురుకాలేదు. దీన్ని కూడా ఆయన జీవితంలో సహజ పరిణామంలానే చూస్తున్నారు. ఆరేడుగురు పిల్లలు ఉన్నా రెక్కలు కట్టుకుని ఉద్యోగాల రీత్యా వలస పోయాక ఒంటరి జీవితం గడపక తప్పని మన కుటుంబ వ్యవస్థ మారిన జీవన శైలి ప్రభావం ఈ దంపతులమీద కూడా పడింది. ఈ ఇబ్బందిని ఆయన పెద్దగా పట్టించుకోలేదు.

కానీ ఈనెల చందమామకు గీసి పంపవలసిన బొమ్మలు సకాలంలో పూర్తి చేస్తానా లేదా అనే రంథి పట్టుకుందాయనకు. ఆమె పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవడంతో కాస్త కలవరంగా ఉందని, దీంతో పనిలో ఏకాగ్రత కుదరటం లేదని, ఓపిక తెచ్చుకుని జూన్ నెల బొమ్మలు పూర్తి చేస్తున్నానని చెప్పారు. ఇంకా బేతాళ కథకు బొమ్మలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఎలాగోలా పూర్తి చేసి పంపుతానని చెప్పారు.

ఈ మధ్యకాలంలో మళ్లీ రెండు సార్లు తనకు ఫోన్ చేసి అమ్మ ఆరోగ్యం ఇప్పుడు ఫర్వాలేదా అని అడిగి తెలుసుకుంటే సంతోష పడ్డారు. ఏప్రిల్ తొలివారంలో అన్ని బొమ్మలూ వేసి పంపేశారు. తొందరపడవద్దని, కొద్ది రోజులు  ఆలస్యగానే పంపమని చెబితే ఆయన తన జీవిత కాలమంతటా పాటించిన పనిసూత్రాన్ని ఓ మెరుపు వాక్యంతో చెప్పారు. “నావల్ల ఏ పనీ ఆగకూడదు” ఎంత నిక్కమైన సత్యమిది.

నెలరోజుల చందమామ పనిలో ఆయన బొమ్మలు వేయటం ఎంత త్వరగా పూర్తయితే తర్వాత వాటిని ఆయా కథల పేజీల లేఅవుట్‌లో పెట్టి 12 భాషలలో డీటీపీ పనికి పంపడం సులభమవుతుంది. సింగిల్ పేజీ, టూపేజీ, త్రీపేజీ, ఫోర్ పేజీ, బేతాళకథ, రామాయణం, శిధిలాలయం, ఇతర బొమ్మల కథలు, కాంటెంపరరీ కంటెంట్ ఇలా అన్ని పేజీలకు బొమ్మలను ముందుగా పేజీలలో ఇంపోజ్ చేసేస్తే తర్వాత టెక్స్ట్‌ని సాపుచేసి పేజీలలో సమానంగా వచ్చేలా లే అవుట్ రూపొందించడం సులభం. అందుకే తదుపరి నెలలో అవసరమైన బొమ్మలను ఈనెలలోనే చిత్రకారులకు సూచించి అందజేస్తే మరుసటి నెల చందమామ పనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఈ ధర్మసూత్రాన్ని ముందునుంచి అర్థం చేసుకున్న వారు కాబట్టే శంకర్ గారు తన పనికి ప్రాణమిస్తారు. ఎన్నడూ లేనిది ఈనెల సకాలంలో చిత్రాలు అందించలేకపోయానని, బేతాళ కథకు బొమ్మలేయడం ఇంకా మిగిలి ఉందని చెబుతున్నప్పుడు తన స్వరంలో అదే ఆదుర్దా. ఆ ఒక్క బొమ్మ సకాలంలో పూర్తి చేయకపోతే చందమామ పని ఎక్కడ, ఏ పాయింట్‌లో నిలిచిపోతుందో అనే ఆందోళన.

అందుకే ఆయన చందమామ ఆఫీసుకు వచ్చి పని చేసే రోజుల్లో కూడా, అంటే గత సంవత్సరం అక్టోబర్ వరకు, మధ్యాహ్న వేళల్లో తనను కలిసి చందమామ  చరిత్రకు సంబంధించిన విషయాలు పంచుకునేటప్పుడు ఇదే విషయం పదే పదే చెప్పేవారు. మనం ఇలా కలిసి విషయాలు పంచుకునే క్రమంలో మన ఇద్దరికీ కూడా మాట రాకూడదని జాగ్రత్తపడేవారు. రెండు వారాల క్రితం కూడా ఫోన్ చేసినప్పుడు కూడా ఆయన ఇదే విషయం చెబితే దాన్ని వెంటనే నా మౌస్ ప్యాడ్ మీది  కాగితంపై రాసుకున్నాను. “నావల్ల ఏ పనీ ఆగకూడదు.” ఇప్పడు కంప్యూటర్ ఆన్ చేసి మౌస్ మీదికి చేతిని చాపిన ప్రతి క్షణం, ఈ మెరుపు వాక్యం నాకు శంకర్ గారి పని సంస్కృతిని తటిల్లుమని సూచిస్తూ ఉంటోంది

పైకి ఇది ఏదో మామూలు విషయంలాగే అనిపించవచ్చు కానీ 57 సంవత్సరాలుగా శంకర్ గారు చందమామలో తన వృత్తిజీవితాన్ని ఈ సూత్రం ఆధారంగానే నడుపుకొస్తున్నారు. నెలపత్రిక అయిన చందమామ పని పకడ్బందీగా కొనసాగాలంటే మొదటినుంచి ఇదే పనివిధానం కొనసాగి ఉండాలి. ఎవరు చేయవలసిన పని వారు సకాలంలో చేస్తేనే పత్రిక సకాలంలో బయటకు వస్తుంది. అందుకే ఆయనకు ఈ నెల పని ఆలస్యమయేటట్లుందని గ్రహింపుకు రాగనే కలవరపాటు మొదలయింది. మొత్తంమీద ఎలాగోలా పూర్తి చేసి పంపారు కాబట్టి కాస్త ప్రశాంతత దొరికినట్లే.

అమ్మకు ఇప్పుడెలా ఉందని, మీ పరిస్థితి ఏమిటని ఒకటి రెండు సార్లు అడిగి పరామర్సించినప్పడు ఆయన ఓ రోజు ఫోన్ సంభాషణలో గత స్మృతులను తల్చుకున్నారు. ఇలా మనిషిని పట్టించుకుని పరామర్శించడం చూస్తుంటే తనకు ముద్దా విశ్వనాధం గారు గుర్తుకొస్తున్నారని చెప్పారు. ఆయన కూడా ఎంత పనిలో ఉన్నా చందమామలో పనిచేసే వారిని స్థాయీ భేదం లేకుండా పలకరించేవారట. ఏదైనా ఇబ్బంది కలిగితే వ్యక్తిగతంగా పరామర్శించి ధైర్యం చెప్పేవారట. ముద్దావిశ్వనాధం గారి అరుదైన ఫోటోను కూడా ఆయన చూపించడమే గాక గతంలో నాకు ఇచ్చారు కూడా.

ముద్దా విశ్వనాధం గారి తర్వాత మళ్లీ నా పని పట్ల ఇంత శ్రద్ధ, ఆసక్తి చూపించిన వారు మీరేనని, ఫోన్లో చెబుతోంటే నాకు ఇటువైపున సిగ్గేసింది. ఈ జ్ఞాన వృద్ధుడితో పరిచయం కావడమే ఓ అపూర్వ స్మృతిగా భావిస్తున్న నాకు ఆయన ఇంత గౌరవం ఇస్తుంటే తట్టుకోలేకపోయాను. ‘మిమ్మల్ని పట్టించుకోకపోతే చందమామలో ఎవరిని పట్టించుకోవాలి మాస్టారూ’ అంటే ఆయన వదలలేదు.

గత సంవత్సరం ఆగస్టులో తొలి పరిచయం అయిన సందర్భంగా నేను ఆయన చేయి పట్టుకుని కళ్లకద్దుకున్నాను. ఆ ఒక్క కరస్పర్శే మీ వ్యక్తిత్వాన్ని తేల్చి చెప్పిందంటారాయన. అప్పటికి 8 నెలలుగా చందమామలో ఉంటున్నా తనతో పరిచయం అయింది అప్పుడే కాబట్టి ఉద్వేగంతో ఆయన చేతిని స్పర్సించాను. ఆ తర్వాతే  చందమామ చరిత్రను వెలికి తీయాలన్న నా ప్రయత్నం జోరుగా సాగింది.

ఇంతవరకు చందమామ  బ్లాగులో 140 పైగా చిన్నవి, పెద్దవి కథనాలు ప్రచురించబడితే ఒకటి రెండు మినహాయిస్తే అన్నీ చందమామ చరిత్రను తడిమేవే. కేవలం ఈ ఎనిమిది నెలల్లోనే చందమామ చరిత్రకు సంబంధించిన 140 కథనాలు బ్లాగు రూపంలో వెలికి తీయగలిగినట్లు చెబితే ఇది చిన్నవిషయం కాదంటారాయన.

గత ఆగస్టులో తొలిసారిగా ఆయనను నేను కలిసినప్పుడే, ‘చందమామలో పనిచేసిన మనుషుల చరిత్రను లిఖితం చేసేవాడు ఇన్నాళ్ల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత చందమామనే వెదుక్కుంటూ వచ్చాడని భావించాన’ని చెప్పారు. అరవై ఏళ్లు చందమామ యాజమాన్యానికే పట్టని చందమామ చరిత్ర వెలికితీతకు ఇంత కాలం తర్వాత ఒక మనిషి వెదుక్కుంటూ రావడం యాదృచ్చికం కాదని నొక్కి చెబుతారాయన.

దీన్ని కూడా ఆయన దైవకృపలో భాగంగానే చూస్తున్నారు. 60 ఏళ్లు చందమామ సిబ్బందికి జరిగిన అన్యాయాన్ని సవరించడానికి దేవుడే మీరూపంలో చందమామకు ఓ ఉద్యోగిని ఆలస్యంగా అయినా సరే పంపారంటారాయన. ఇలా అంటున్నప్పుడు ఆయన గొంతులో తడి. ఎందుకంటే ఆయన జీవితం పొడవునా దైవాజ్ఞతోనే పనిచేస్తూ వచ్చానని బలంగా భావిస్తూ వచ్చారు.

‘శంకరా పోయి చందమామలో చేరి నా బొమ్మలు గీయరా’ అని దేవుడు ఆజ్ఞాపిస్తే గత ఆరు దశాబ్దాలుగా ఆ పని చేస్తున్నానని ఆయన విశ్వాసం. చివరకు క్యాబ్ ప్రయాణం సహకరించక గత నవంబర్ నుంచి ఆయన ఇంటివద్దనుంచే పనిచేస్తూ వస్తున్న ఘటనను కూడా దైవ కృపగానే భావిస్తున్నారు.

‘ఒరే శంకరా ఇంకా ఈ ప్రయాణపు తిప్పలు ఎందుకురా నీకు, హాయిగా ఇంట్లోనే కూర్చుని బొమ్మలు గీయి. ఎక్కడా ప్రయాణాలు అవీ చేయకు’ అని ఆరోజు దేవుడు తనకు చెక్ పెట్టారంటారు. అలా చెక్ పెట్టాడు కాబట్టి ఇప్పుడు మూడు గంటల ప్రయాణ తిప్పలు పోయి సులభంగా ఇంట్లోనే కూర్చుని బొమ్మలు గీస్తున్నానని. చాలా సంవత్సరాల తర్వాత ఉదయం పూట టిఫన్ చేయగలుగుతున్నానని ఆయన అంటారు.

మన కళ్లముందు ప్రపంచంలో ప్రేమానందులు, నిత్యానందులు, ఆమాంబాపతు భగవానులు ఆధ్యాత్మిక వ్యాయామాల -స్పిరిచువల్ ఎక్సర్‌సైజులట-  పేరిట పరమ జుగుప్సాకరమైన చర్యలకు మతం ముసుగులో నగ్నంగా పాల్పడిపోతున్న పాడుకాలంలో…. తనకంటూ ఏమీ కోరుకోని అరుదైన తత్వంతో, సంపూర్ణమైన సంతృప్తితో, 8 పదుల జీవితాన్ని నిరామయంగా గడిపిన ఓ పరమ భక్తిపరుడు… మతానికి, మత విశ్వాసాలకు, దైవ భావనకు కొత్త నిర్వచనం ఇస్తూ, నిజమైన భక్తి, ఆరాధన ఎలా ఉంటుందో తన యావజ్జీవిత ఆచరణ సాక్షిగా ఈ ప్రపంచానికి చాటిచెబుతున్నారు.

గత ఎనిమిది నెలలుగా ఓ అపర భక్తుడికి, ఓ పరమ నాస్తికుడికి లంకె అందుకే ఇంత బలంగా కుదిరింది. ఆయనకు నేను మతాన్ని, దైవభావాన్ని విశ్వసించనని పరోక్షంగా అయినా తెలుసు. ఆయన జీవితంలో మతాన్ని, విశ్వాసాన్ని వదలిపెట్టరని నాకూ తెలుసు. కాని పనిని దైవంగా భావించే ఆయన అంకితభావానికి కాకుండా నేను ఇక దేనికి దాసోహమవ్వాలి?

నా జీవితంలో తొలి ఇరవై ఏళ్లకాలంలో పరమ భక్తుడిగానే కొనసాగిన నేను తర్వాత వ్యతిరేక దిశకు మళ్లాను. అలా మారిన పాతికేళ్ల తర్వాత మొదటిసారిగా నిజమైన భక్తుడిని, పనిని దివ్యభావనతో ఎంచే అపర ఆస్తికుడిని ఇప్పుడే చూస్తున్నాను, శంకర్ గారి రూపంలో భక్తిభావనకు నిర్వచనం ఏదో చూస్తున్నానిప్పుడు.

అందుకే పరస్పర విరుద్ధ భావాల మధ్య ఘర్షణ అంశం మా ఇద్దరి బంధంలో పక్కకు పోయింది. భావాలు, విశ్వాసాలు వాటి మధ్య ఘర్షణలు పక్కకుపోయి… మనిషికి మనిషికి మధ్య మానవీయ బంధంలో మేం తడిసి ముద్దవుతున్నాం. ఓ అపర భక్తుడు పరమ నాస్తికుడిని, ఓ పరమ నాస్తికుడు ఓ అపర భక్తుడిని ఎవరేమిటో తెలిసి కూడా పరస్పరం గౌరవించుకుంటూ, ఆరాధించుకుంటూ మానవ సంబంధాన్ని కొనసాగిస్తున్న అద్భుత క్షణాలను మేం ఇప్పుడు ఆస్వాదిస్తున్నాం.

అందుకే మొన్న శంకర్ గారి ఇంట్లో భేటీ అయిన తర్వాత ఆయన శివరాం ప్రసాద్ గారికి, నాకూ కూడా విబూది ఇచ్చి ‘దీన్ని మూఢనమ్మకంగా భావించవద్దు, కాదనకుండా పెట్టుకోండి’ అని కోరితే కాదనలేకపోయాను. ఆ క్షణంలో నా విశ్వాసాలను పక్కన  పెట్టేశాను. నవ్వుతూనే, ఆయన విశ్వాసాన్ని మనస్పూర్తిగా గౌరవిస్తూనే ఆయనతో విబూది పెట్టించుకున్నాను. ఆయన నమ్ముతున్న విశ్వాసంలోని నైర్మల్యానికి అంజలి ఘటించాను.

దీంతో నా నాస్తికత్వానికి, నా ‘విశ్వాస’ రాహిత్యానికి వచ్చిన నష్టమేదీ లేదు. ఒక మహనీయ మూర్తిమత్వం వద్దకు మనం పోయినప్పుడు మన భావజాల పరమైన ‘విశ్వాస’ ప్రదర్శనను చాటుకోవలసిన పనిలేదు. మనసునిండా అచ్చమైన భక్తిభావనను ప్రోదిచేసుకున్న మనీషి విశ్వాసాన్ని మనం ఆ నిర్దిష్ట క్షణంలో గౌరవిస్తే, మన తల బేతాళకథలో లాగా తెగిపడదు కదా..

RTS Perm Link


8 Responses to “నావల్ల ఏ పనీ ఆగకూడదు: చందమామ శంకర్”

  1. Vamsi M Maganti on April 12, 2010 3:05 PM

    “ఒక మహనీయ మూర్తిమత్వం వద్దకు మనం పోయినప్పుడు మన భావజాల పరమైన ‘విశ్వాస’ ప్రదర్శనను చాటుకోవలసిన పనిలేదు. మనసునిండా అచ్చమైన భక్తిభావనను ప్రోదిచేసుకున్న మనీషి విశ్వాసాన్ని మనం ఆ నిర్దిష్ట క్షణంలో గౌరవిస్తే, మన తల బేతాళకథలో లాగా తెగిపడదు కదా..”

    - చప్పట్లు…..మళ్ళీ…మళ్ళీ…

  2. chandamama on April 12, 2010 3:15 PM

    వంశీగారూ,
    సాధారణంగా బ్లాగ్ కథనాలను చదవటమే తప్ప మీరు పెద్దగా స్పందించరని తెలుసు. అలాంటిది మీరు.. హృద్యంగా స్పందించారు. కృతజ్ఞతాభివందనలు

  3. శివరామప్రసాదు కప్పగంతు on April 12, 2010 7:48 PM

    బాగా చెప్పారు రాజుగారూ. శంకర్ గారి ఫోను నంబరు, నాకు “మెయిలు” చెయ్యరూ ఒక సారి మాట్లాడుతాను.

  4. వేణు on April 19, 2010 9:48 AM

    హమ్మయ్య! మీ బ్లాగు పునర్దర్శనం ఇవాళే.

    మీరు ప్రేమతో, శ్రద్ధతో, బాధ్యతతో వెలికితీసిన చందమామ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిందని చాలా ఆందో్ళన పడ్డాను. మొత్తానికి మళ్ళీ మీ బ్లాగు కనపడటం చాలా సంతోషంగా ఉంది.

    ఇక ఈ టపా చాలా బాగా రాశారు రాజు గారూ. ముఖ్యంగా ముగింపు అద్భుతం! అభినందనలు!

  5. సుజాత on April 20, 2010 2:31 AM

    ఏమో, మిమ్మల్ని చూస్తే నాకు మాత్రం భలే అసూయగా ఉందండీ రాజు గారూ!

  6. శివరామ ప్రసాదు కప్పగంతు on April 20, 2010 7:13 AM

    మీ బ్లాగు పున:రుద్ధరణ సందర్భంగా మన:పూర్వక అభినందనలు.

    శంకర్ గారిని ఈ కష్ట సమయంలో “చందమామ” ఏమన్నా ఆదుకుంటున్నదా? ఎవరన్న ఒక మనిషిని సహాయంగా పంపి, ఆ హాస్పటల్ లో ఉండటానికి అక్కడకు వెళ్ళటానికి రావటానికి వాహనం తదితరాలు. ఐదు దశాబ్దాల పైగా అలుపెరుగకుండా చందమామ ఉన్నతికి ఎంతగానో కృషి జరుపుతున్న ఈ సీనియర్ కళాకారునికి, కనీసం హాస్పటల్ ఖర్చులు అయినా ఇచ్చే అవకాసం ఉన్నదా.

  7. chandamama on April 20, 2010 11:25 AM

    వే్ణుగారూ చాన్నాళ్లకు మళ్లీ మీ దర్శనం. బాగా బిజీగా వున్నారు కదూ. ప్రింట్ చందమామ పనుల్లోకి వచ్చాక బ్లాగులు చూడటం, పోస్ట్ చేయడానికి కూడా కుదరకుండా ఉంది. ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడే హాయిగా ఉండేది. ముందుకు పోయి మళ్లీ వెనక్కు వచ్చినట్లుంది నాకయితే. కాని ఇదొక అనిర్వచనీయానుభవం అనుకోండి. ఈ కథనం ముగింపు అద్బుతం అన్నారు. ధన్యవాదాలు.

    సుజాతగారూ, మీ అమ్మాయి ఫోటోను చాలాసార్లే బ్లాగులో, వెబ్‌సైట్లో వాడానండీ. మీ చందమామ జ్ఞాపకాలను వెరిఫై చేయకుండా రవిగారి పాపే అనుకున్నాను. కాని రవిచంద్ర గారు ఎవరీ పాప అని అడిగితే అమాయకంగా రవిగారి పాపే అన్నాను. అప్పుడే దొరికిపోయాను. ఇక పొరపాటు జరిగదులెండి. కాని అందాల చందమామ కథనంలో పాప మీ పాపే నని ఇంకా సవరించలేదు. ఈ రోజంతా ఊపిరిపీల్చుకోలేనంత పని ఆపీసులో. మీకు వీలయితే ప్రింట్ చందమామకోసం సింగిల్ పేజీ కథలు కొన్ని రాసి పంపకూడదూ. దీనిమీదే కథనం రాసి పోస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ప్రతినెలా అయిదు సింగిల్ పేజీ కథలు ప్రచురించాలని నిర్ణయించడం జరిగింది. అవీ కొత్త కథలు. కాబట్టి సింగిల్ పేజీల కథలకు ఉన్నట్లుండి కొరత. అందుకే చందమామ పేజీ కొలతలతో ఎవరు చిన్న కతలు పంపినా తీసుకుంటాము. (నాణ్యత తప్పదనుకోండి)మరి మీనుంచి కూడా ఆశించవచ్చా..

    శివరా గారూ,

    శంకర్ దంపతుల పట్ల మీ ఆసక్తి అభినందనీయమే.. కానీ వారికోసం సహాయంగా మనిషిని పంపడం, వాహనం తదితర సౌకర్యాలు ఏర్పర్చటం కుదరదేమో.. ఈ విషయంలో అందరూ నిస్సహాయులే.. ఎవరి సమస్య వారు పట్టించుకోవడం తప్పదు. శంకర్ గారు బంధువుల ద్వారా తన ప్రయత్నం తాను చేసుకుంటున్నారు. అమ్మ ఇవ్వాళే ఆసుపత్రినుంచి ఇంటికి వచ్చిందని వార్త. ఆయన వెళ్లినా చేయగలిగేదేమీ లేదు కాబట్టి వారి అబ్బాయి, ఇతర బంధువులు ఆమెను చూసుకుంటూ వచ్చారు. మీ హృదయావేదనను మా పైవారిముందుకు తప్పక తీసుకుపోతాను. ధన్యవాదాలు.

  8. chandamama on May 8, 2010 1:50 PM

    ఈ కథనంపై రచన పత్రిక సంపాదకులు శ్రీ శాయి గారు ఇప్పుడే పంపిన స్పందనను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. శాయిగారికి ధన్యవాదాలు.

    ఇప్పుడే చూసాను ఇది -
    “దీంతో నా నాస్తికత్వానికి, నా ‘విశ్వాస’ రాహిత్యానికి వచ్చిన నష్టమేదీ లేదు. ఒక మహనీయ మూర్తిమత్వం వద్దకు మనం పోయినప్పుడు మన భావజాల పరమైన ‘విశ్వాస’ ప్రదర్శనను చాటుకోవలసిన పనిలేదు. మనసునిండా అచ్చమైన భక్తిభావనను ప్రోదిచేసుకున్న మనీషి విశ్వాసాన్ని మనం ఆ నిర్దిష్ట క్షణంలో గౌరవిస్తే, మన తల బేతాళకథలో లాగా తెగిపడదు కదా..”

    - మీరన్నది నిజం! మనం అభిమానించే ఎదుటివారి ఇష్టాలను గౌరవించడం – ముఖ్యంగా వయసులో పెద్దయిన వారివి – మంచి సంస్కారమనుకుంటాను.

    మీ

    శాయి

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind