అరచేతిలో అందాల ‘చందమామ’

April 9th, 2010

గీతాప్రియ

‘చందమామ’ జ్ఞాపకాలకు సంబంధించి ‘అమ్మఒడి’ ఆదిలక్ష్మిగారిది ఓ వినూత్న అనుభవం. చిన్నప్పుడు నాన్న చదివి వినిపిస్తే తప్ప చందమామ కథను వినలేని అశక్తత లోంచి ‘నేనే చదువు నేర్చుకుంటే పోలా’ అనే పట్టుదలతో, స్వయంకృషి తోడుగా శరవేగంగా చదువు నేర్చుకున్న అరుదైన బాల్యం తనది. ఈ తీపి జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే ఇక్కడ కొద్దిగా విందాం..

“నాన్నకి చదవటం వచ్చు కాబట్టి కదా చక చకా చదివేసాడు. మొదటి సారి ఇష్టంగా చదివేసేవాడు. మళ్ళీ చదవమంటే కుదరదనే వాడు.

’అదే నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ – అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందింది. చదవటం రాక చందమామ బొమ్మలు పదేపదే చూసుకునే కొద్దీ పసి మనస్సు లోతుల్లో అక్షరాలు నేర్చుకోవాలనే తపన పెరిగింది.

వీధిబడిలో చేర్చగానే, ఇష్టంగా మారాం చేయకుండా అక్షరాలు నేర్చేసాను. పెద్ద బాలశిక్ష చాలా కొద్దీ రోజుల్లో పూర్తి చేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పటికే నాకు కథలు చదవటం వచ్చేసింది.

ఆ విధంగా చందమామ నాకు చదవటం నేర్పింది. చదువు కోవాల్సిన అవసరం నేర్పింది. చదువు నేర్పిన గురువుని గౌరవించటమూ నేర్పింది.”

చందమామ ద్వారా చదవటం నేర్చిన, చదువు నేర్పిన గురువును గౌరవించడం నేర్చిన ఆదిలక్ష్మిగారు, ఒకప్పుడు నాన్నతో తను పొందిన అనుభవాన్ని తన పాపాయి నుంచి కూడా ఎదుర్కొన్నారట. చందమామ కథను ఒకసారి చదివి వినిపిస్తే మళ్లీ మళ్లీ వినాలి అనే కుతూహలంతో తప్పుల తడకగా చందమామ కథను చదివి నవ్వించే పాప, ఒకట్రెండుసార్లు చదివి ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్నిసార్లయినా చదివి వినిపిస్తాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేదట.

ఇదీ చందమామ ఘనత, చందమామతో బంధం అల్లుకున్న తరతరాల తెలుగు కుటుంబాల ఘనత. ఆదిలక్ష్మిగారు, ఆమె జీవన సహచరుడు, వారి పాపాయి దశాబ్దాలుగా నింగిలోని చందమామతో పాటు నేలమీది ‘చందమామ’తో కూడా చెలిమి కొనసాగిస్తున్నారు. నేలమీది ‘చందమామ’తో ఇటీవలి వరకు ప్రత్యక్ష సంబంధం లేని ఆదిలక్ష్మి గారు ఇటీవలే చందమామతో పరిచయంలోకి వచ్చారు.

నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… తాను పాఠాలు చెబుతున్న స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారూ… మీ చందమామ కుటుంబాన్ని చూసి చందమామ సిబ్బందిగా మేం గర్వపడుతున్నాం.

చందమామతో మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఆదిలక్ష్మిగారి అరచేతిలో అందాల ‘చందమామ’ జ్ఞాపకాల పూర్తి పాఠం కోసం కింది చందమామ వెబ్‌సైట్ లింకులో చూడండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2444

ఈ కథనానికి గాను మార్చిన ఫోటో ఆదిలక్ష్మిగారి అమ్మాయి గీతాప్రియది. ఈమె చిన్నవయసులోనే ‘ఆహా ఓహో’ అనే బ్లాగు నడుపుతున్నారు.  http://paalameegada.blogspot.com/
ఈ బ్లాగు కూడా సహజంగా కథలకే ప్రాధాన్యత ఇస్తూండటం గమనార్హం. చూడగలరు.

చందమామ పాఠకులు తమ చందమామ జ్ఞాపకాలను కింది లింకుకు పంపగలరు.

abhiprayam@chandamama.com

RTS Perm Link


7 Responses to “అరచేతిలో అందాల ‘చందమామ’”

 1. రవి on April 9, 2010 1:45 AM

  చందమామ ముచ్చట్లు ఎవరు ఎన్నిసార్లు చెప్పినా తనివితీరదండి. అందంగా ఉన్నాయి, అమ్మఒడి బ్లాగరు జ్ఞాపకాలు.

 2. రవిచంద్ర on April 9, 2010 2:01 AM

  పై ఫోటో లో ఉన్న పాప ఎవరు?

 3. chandamama on April 9, 2010 4:19 AM

  రవి గారూ, మీ సత్వర స్పందనకు నెనర్లు. రవిచంద్ర గారు అప్పుడే ఈ కథనంలోని ఫోటోలో ఉన్న పాప ఎవరు అని అడుగుతున్నారు. మీ పాప సంకీర్తనదే అని చెప్పరూ.. మీరు తప్ప చందమామ జ్ఞాపకాలకు ఎవరూ తమ చిన్నారుల ఫోటోలు పంపలేదు మరి. దాంతో అన్ని పాపాయిల జ్ఞాపకాలకూ మీ పాప ఫోటోయే పెట్టవలసి వస్తోంది. ఏమనుకోరు కదా..

 4. chandamama on April 9, 2010 5:58 AM

  రవిచంద్రగారూ,
  అరచేతిలో అందాల చందమామ కథనంపై మీరు పంపిన వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఆ కథనంలోని ఫోటో మన బ్లాగాడిస్తా రవిగారి పాప సంకీర్తనదండీ. చందమామ జ్ఞాపకాలకు గాను రవి గారు మాత్రమే తమ పాపాయి ఫోటో చందమామకు పంపారు. దాంతో పాపాయిలతో ముడిపడిన చందమామ జ్ఞాపకాలకు తప్పనిసరిగా సంకీర్తన ఫోటోయే పెడుతున్నాము. మరే కారణం లేదు.

  మీరు కూడా చందమామ ప్రియులే నని తెలుస్తోంది. మరి మీ చందమామ జ్ఞాపకాలు ఎప్పుడు పంపిస్తారు? తప్పక కింది లింకుకు పంపించగలరు. మీ ఫోటోయే పంపించండి.

  ఇలా కలుసుకుంటున్నందుకు ధన్యవాదాలు. మీకు నచ్చిన చందమామ కథలు కూడా పరిచయం చేసి పంపండి. చందమామ వెబ్‌సైట్, బ్లాగులో ప్రచురించగలం.

  రాజు గారూ,
  మీ ఈ సమాధానంతో నా కడుపు నిండిపోయిందనుకోండి. నేను కూడా చందమామ అభిమానినే. అభిమానం అంతా ఇంతా కాదు మాటల్లో చెప్పలేనంత.
  నా జ్ఞాపకాలు తప్పకుండా రాసి పంపిస్తాను. అన్నట్టు ఇది మీకు మెయిల్లో పంపించవచ్చు కదా?

  ఫోటో లో ఉన్న పాప ఫోటో చక్కగా ఉంది. నేను ఎక్కడో చూసినట్టు అనిపించి చిన్న కుతూహలంతో అడిగానంతే. బ్లాగాడిస్తా రవిగారి పాప అని మీరు చెప్పిన తర్వాత గుర్తుకొచ్చింది. ఆయన బ్లాగులో ఒకసారి వాళ్ళ పాప ఫోటో పెట్టాడు. అప్పుడు చూశాను.
  కృతజ్ఞతలతో
  రవిచంద్ర

  రవిచంద్ర గారూ,
  మీకు సంతోషం కలిగించినందుకు మాకూ సంతోషంగానే ఉంది. మీ బ్లాగును అప్పుడప్పుడు చూస్తున్నాను గాని నా బ్లాగులో ప్రమోటెడ్ లింకుగా పెట్టడం మర్చిపోయినట్లున్నాను. ఇప్పుడే మీ బ్లాగు లింకును చందమామ బ్లాగులో చందమామ కేటగిరీలో జోడిస్తున్నాను. చందమామ అభిమానులు బ్లాగులు అన్నీ ఇక్కడే ఉంచుతున్నాను.

  నా అధికారిక చందమామ మెయిల్‌కి కూడా పంపవచ్చు కాని చందమామ జ్ఞాపకాలు కేటగిరీకి వస్తున్న రచనల వివరాలు పైవారికి తెలియాలంటే అభిప్రాయం@చందమామ.కామ్ కు పంపిస్తేనే బాగుంటుంది. దాని ఇంగ్లీషు లింకు కింద చూడండి.

  Abhiprayam@chandamama.com

  ఇప్పటి చందమామలో ఏవి బాగున్నాయో, ఏవి బాగాలేవో కూడా చెబుతూ మీ ఫీడ్ బ్యాక్ తప్పక పంపగలరు. ముంబై చిరునామాకు కాకుండా నేరుగా కింది చిరునామాకే పంపించండి త్వరగా అందుతాయి.

  abhiprayam@chandamama.com

  చందమామకు సంబంధించి ఏ కొత్త సమాచారాన్నయినా చందమామ బ్లాగర్లతో పాటు మీతో కూడా ఇకనుంచి పంచుకుంటాను. మీకు తెలిసిన స్నేహితులు, పెద్దలకు కూడా చందమామతో పరిచయం ఉంటే వారికి కూడా తెలియజేసి వారి జ్ఞాపకాలను చందమామకు పంపించమని చెప్పగలరు.

  మీరు నాలుగయిదు రోజులలోపు జ్ఞాపకాలు రాసి పంపితే వాటిని ఆ పై శుక్రవారం అంటే ఏప్రిల్ మూడవ శుక్రవారం వెబ్‌సైట్, బ్లాగులలో పోస్ట్ చేస్తాము. కొన్ని కారణాల వల్ల చందమామ వెబ్‌సైట్ ప్రతి శుక్రవారం మాత్రమే అపడేట్ అవుతోంది అదీ పరిమితంగానే.

  అభినందనలతో..
  రాజు

 5. సుజాత on April 19, 2010 10:44 AM

  రాజు గారూ,చిన్న సవరణ,
  ఫొటోలో ఉన్న పాప మా అమ్మాయి సంకీర్తన. నేను నా జ్ఞాపకాలు రాసినపుడు ఈ ఫొటోనే పెట్టాను. అది మీరు రవి గారి పాపదని పొరపాటు పడ్డారు.

  రవిచంద్ర,
  మీరు మా సంకీర్తనను చాలా సార్లు చూశారుగా? గుర్తు పట్టలేదా?

 6. రవిచంద్ర on April 21, 2010 11:07 PM

  సుజాత గారూ,
  సంకీర్తన లా ఉందే అని గుర్తు పట్టాను గనకనే ఈ పాప ఎవరో కన్‌ఫర్మ్ చేసుకుందామని రాజు గార్ని అడిగాను. ఆయన రవి గారి పాప అనగానే మరింత కన్ఫ్యూజన్ లో పడిపోయాను. అదీ మ్యాటర్. 🙂

 7. chandamama on April 26, 2010 1:38 PM

  ఈ రోజు వరకు ఈ కథనంలో భాగంగా పోస్ట్ చేసిన పోటో సుజాత గారి పాప సంకీర్తనది. ఆదిలక్ష్మిగారు చందమామ జ్ఞాపకాలను పంపినప్పుడు వారి పాప ఫోటో జతచేయలేదు. దాంతో చందమామ ఫైల్ పోటోల్లో ఉన్న సుజాత గారి అమ్మాయి సంకీర్తన పోటో వాడాము. కాని సంకీర్తన రవి గారి పాప అని పొరపాటుగా భావించడంతో రవిచంద్ర గారు ప్రశ్నించడం అప్పటికీ నేను అదే పొరపాటు అభిప్రాయంతో ఉండటంతో గందరగోళం ఇంకా కొనసాగింది. తర్వాత ఆదిలక్ష్మిగారు తమ పాప ఫోటోను పంపడంతో ఇవ్వాళ్టికి ఆ ఫోటోనే ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. పాప ఫోటో విషయంలో పొరపాటుకు నాదే బాధ్యత. ఇకపై జరగదని నా హామీ.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind