ఆబాల గోపాల కథల పత్రిక “చందమామ”
ఆరు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలను ఆకట్టుకుంటూ వారిని అద్బుతమైన ఊహాలోకపు మంత్రజగత్తులో విహరింప జేస్తున్న కథల పత్రిక “చందమామ”. పిల్లల్లారా, చిన్నారీ, అమ్మాయీ, అని సంబోధిస్తూ, పాలు తాగే పసిపిల్లలకు ఊకొట్టే కథలను చెబుతూ చనుబాల కథల పత్రికగా 1947 జూలై నెలలో తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ అతి త్వరలోనే ఆబాల గోపాల కథల పత్రికగా భారతీయ సాహిత్య ఆకాశంలో తటిల్లున మెరిసింది.
జాతి జీవనంలో సాంస్కృతిక రాయబారిగా నిలిచిపోయిన అరుదైన పత్రిక చందమామ. భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చందమామ కథల పత్రికను చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు.
దైవ ప్రయత్నం కంటే మానవ ప్రయత్నానికి, తద్వారా మనుషులు సాధించే అంతిమ విజయాలకు ప్రాధాన్యమిచ్చే చందమామ కథలు తరాలు మారినా, సాంకేతిక జ్ఞాన ఫలాలతో జీవితం మూలమలుపులు తిరుగుతున్నా భారతీయ పాఠకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి.
హాస్యం, విజ్ఞానం, వినోదాల మేళవింపుగా రూపొందుతూ వచ్చిన చందమామ కథలు వాటికి తోడయిన అద్బుత చిత్రాలు -చిత్రా, శంకర్, ఎంటీవీ ఆచార్య, వడ్డాది పాపయ్య, రాజీ తదితరుల చిత్ర సృజన- భారతీయ పిల్లల మానసిక ప్రపంచాన్ని దశాబ్దాలుగా వెలిగిస్తూ వస్తున్నాయి.
ఆ పిల్లలు ఆ కథలతో పాటు పెరిగినా, జీవితంలో అన్ని దశలనూ అధిగమించినా సరే ఈనాటికీ వారు తమ బాల్యాన్ని మర్చిపోలేదు. తమ బాల్యాన్ని మంత్రనగరి సరిహద్దులలో ఊగించి, శ్వాసించిన చందమామ కథలనూ మర్చిపోలేదు. తెలుగునేల మీదే కాదు.. భారతీయ భాషలన్నింటిలోనూ అలనాటి తరం చందమామతో తమ అనుబంధం మర్చిపోలేదు.
1947 నుంచి చందమామ పత్రికను కొంటూ తమ పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకూ కూడా చందమామ కథలు చదివి వినిపిస్తూ, తాము మళ్లీ మళ్లీ చదువుతూ చందమామతో తాదాత్మ్యం చెందుతున్న పాఠకులు దేశంలో ఏ భాషలోనూ, ఏ ప్రాంతంలోనూ మరే పత్రికకూ లేరని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు.
ఆరు దశాబ్దాల క్రితం పిల్లల పత్రికగా మొదలైన చందమామను ప్రస్తుతం 70, 80 ఏళ్ల పైబడిన వారు ఇప్పటికీ కొని చదువుతూ తమ మనవళ్లు, మనవరాళ్లకు వాటిని చదివి వినిపిస్తున్నారంటే ఒకనాటి చనుబాల కథల పత్రిక క్రమంగా ఆబాల గోపాల కథల పత్రికగా మారిన వైనం బోధపడుతుంది.
చందమామపై పరిచయ కథనం పూర్తి పాఠం కోసం కింది లింకును తెరవండి.
http://prajakala.org/mag/2010/04/chandamama
Leave a Reply





