చక్రపాణి ప్రేరణతో రచయితనయ్యా..
రచన పట్ల నా అనురక్తి 80 ఏళ్ల ముదివయస్సులో కూడా కొనసాగుతోంది. బడిలో చదువుకునే రోజుల్లోనే నాలో రాయాలనే కుతూహలం ఏర్పడింది. సుప్రసిద్ధ తమిళ రచయిత తమిళన్ రచనలతో ప్రభావితుడినయ్యాను. శక్తివంతమైన అతడి రచనా విధానం త్వరలోనే నన్ను ఆయన అభిమానిగా మార్చేసింది. ఏదో ఒకటి రాయాలి అనే నా తపనను ఇది మరింతగా పెంచింది.చెన్నయ్ లోని కన్నెమెరా లైబ్రరీని చాలాసార్లు సందర్శించేవాడిని. అక్కడ అరేబియన్ నైట్స్ వంటి పుస్తకాలను చదువుతూ ఆస్వాదించేవాడిని.
అయితే 1950లలో పిల్లలకోసం పెద్దగా పుస్తకాలు ఉండేవి కావు. ఆ సమయంలో పిల్లల పఠనావసరాలను తీర్చడానికి అంబులిమామ -తమిళ చందమామ- పత్రిక మాత్రమే వచ్చేది. ఈ పత్రిక గురించి మరింతగా తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో అప్పట్లోనే నేను చందమామ ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఓ పెద్దమనిషితో సమావేశమయ్యాను. ఆయనే చక్రపాణి అని తర్వాత చెప్పారు.
ఆయన నాతో ఎంతో ఆదరంగా మాట్లాడారు. ఎలా రాయాలి అనే విషయంపై నాకు అమూల్యమైన సలహాలు ఇచ్చారు. దీని తర్వాత ఆయన నన్ను 10-12 బీర్బల్ కథలను రాయమని కోరారు. చందమామ చక్రపాణిగారితో ఈ అనుబంధం నా రచనా వృత్తిని ముందుకు తీసుకుపోయింది. ఆ ప్రభావంతోనే ఇవ్వాళ కూడా నేను మంజరి, దినమణి, దినమలర్, దినతంతి వంటి ప్రముఖ తమిళ పత్రికలకు కథలు, వ్యాసాలు రాసి పంపుతుంటాను
నా అభిప్రాయం ప్రకారం చక్రపాణి శక్తియుక్తుల వల్లే చందమామ గత 60 ఏళ్లుగా తన ప్రజాదరణను నిలబెట్టుకుంటోంది.
చందమామ పాఠకులకు శుభాకాంక్షలు.
(కళానికేతన్ బాలు పేరుతో ఎస్ బాలసుబ్రహ్మణ్యన్ గారు గత 50 ఏళ్లకు పైగా చందమామలో ఫోటో వ్యాఖ్యలకు క్రమం తప్పకుండా ఫోటోలు తీసి పంపుతున్నారు. ఒక ఆల్బమ్ నిండా ఒకే సారి పకృతి, జీవులు,జీవితం గురించిన విశేషాలతో కూడిన వైవిధ్యభరితమైన ఫోటోలను ఆయన పంపుతుంటారు. చిన్నపాటి పాత కెమెరాతో ఫోటోలు తీయడమే తప్ప ఆధునిక టెక్నాలజీ జోలికి పోని ఈయనను చందమామ పనిమీద ఇటీవల ఫోన్ ద్వారా మాట్లాడినప్పుడు తన చందమామ జ్ఞాపకాలను పంచుకున్నారు.
తొలి పరిచయం తర్వాత చందమామ చక్రపాణి గారితో చక్కటి సాన్నిహిత్య సంబంధం ఏర్పడిందని ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకుని తిరిగేవారమని అలనాటి వెచ్చటి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. చందమామకు తన కంట్రిబ్యూషన్, అంబులిమామ పత్రిక నెలవారీగా అందడం ఇవి తన జీవితంలో అత్యంత సంతోషకర క్షణాలుగా ఉంటున్నాయని. చెప్పారు.
రచన విషయంలో చక్రపాణి గారి సలహాలు విని, పాటించిన బాలుగారు 80 ఏళ్ల వయసులో కూడా ప్రముఖ తమిళ పత్రికలన్నింటికీ ఇప్పటికీ రచనలు పంపుతూనే ఉన్నారు. ఫోటోలు మాత్రమే కాకుండా చిన్న చిన్న కథలు చందమామకోసం పంపించవలసిందిగా కోరితే ఈ నెలలోనే నాలుగు కథలు రాసి పంపారు. వాటిలో ఒకటి ఎంపిక చేయడమైంది.
ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన “సహస్ర చంద్రోదయ దర్శనా”లను పూర్తి చేసుకున్న కళానికేతన్ బాలు గారు చందమామ సీనియర్ కంట్రిబ్యూటర్‌గా మాకు ప్రేరణగా నిలుస్తున్నారు.
ఆయన ఆరోగ్యంగా ఉండాలని, చివరివరకు రచనా వ్యాసంగం కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. ఆయనకు పూర్ణ జీవిత శుభాకాంక్షలు.
చందమామ







