దాసరి గారి గిన్నెస్ రికార్డులు

March 2nd, 2010

చందమామ సీనియర్ కథల రచయిత శ్రీఎమ్.వి.వి సత్యనారాయణ -విశాఖపట్నం- గారు కుటుంబరావు గారి కాలంనుంచి చందమామకు కథలు, బేతాళకథలు పంపుతూ వచ్చారు. అప్పట్లో దాసరి గారితో తనకు కలిగిన పరిచయాన్ని ఆయన హృద్యంగా చందమామతో ఇటీవలే పంచుకున్నారు.

ఈయన 1980కి ముందు ఓసారి కుటుంబరావుగారిని కలిసి చూసి పోదామని చెన్నయ్ లోని చందమామ ఆఫీసుకు వచ్చారట. ఆ సమయానికి కొకు ఆఫీసులో లేరు. దీంతో ఈయన చందమామ కార్యాలయంలోని కుటుంబరావు గారి కుర్చీవద్దకు వచ్చి దండం పెట్టి వెళ్లారట.

కొకు లేని సమయంలో వచ్చి ఆశాభంగంతో వెనుదిరిగి వెళుతున్న తనను దాసరిగారు రిసీవ్ చేసుకుని భోజనం కోసం హోటల్‌కు తీసుకెళ్లారట. ఆరోజు దాసరిగారు  అన్నమాటలు ఈరోజుకీ ఈయన మర్చిపోలేదు.

‘కొకును ఎలాగూ కలవలేకపోయావు గాని, కొంచెం నా పేరు ఆ గిన్నెస్‌లోకి ఎక్కేటట్టు చూడు’ అని దాసరి గారు ఈయనతో ముక్తాయించారట. ఈయనకు ముందు అర్థం కాలేదట. ‘35 ఏళ్లుగా హోటల్ తిండి తింటున్నాను. ఇంటిభోజనం తినే యోగం వస్తుందో లేదో తెలీదు. ఈలోగా సాధిస్తున్న రికార్డును ఎందుకు పోగొట్టుకోవాలి. హోటల్ వదలని వీరుడిగా నా పేరన్నా గిన్నెస్‌ బుక్‌లో ఎక్కించు బాబ్బాబు’ అని దాసరి గారు జోకులేస్తుంటే ఈయనకు నవ్వాగింది కాదట.

నిజమే మరి. దాసరి గారి వ్యక్తిగత జీవితం కూడా రికార్డుల మయమే. మద్రాసులో చందమామలో చేరినప్పటినుంచి అంటే 1952 నుంచి 2006 వరకు కూడా చెన్నయ్‌లో ఒకే అద్దె ఇంట్లో దాసరి గారు ఉంటూ వచ్చారు. ఒకే అద్దె ఇంట్లో 54 ఏళ్లకు పైగా జీవితం. మనుషులకు సాధ్యమయ్యే పనేనా ఇది.

ఒకే ఆఫీసులో 54 ఏళ్లు పనిచేయడం. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా సగటు మనుషులకు సాధ్యం కాని పని. నా ఉద్దేశ్యంలో అలవాటు బలంమీద ఆయన అన్నేళ్లపాటు చెన్నయ్‌లో ఒకే హోటల్‌లోనే భోంచేసి ఉంటారేమో అని నా సందేహం.

చివరకు బాలసాహిత్యానికి, ఆబాల గోపాల సాహిత్యానికి కూడా పేరొందిన చందమామలో వరుసగా పాతికేళ్లపాటు సీరియల్స్ రాస్తూ వచ్చిన అరుదైన రికార్డు కూడా ఈయన పేరు మీదే ఉంది.

అప్రస్తుతమనుకోకుంటే వివాహమైనప్పటికీ చెన్నయ్‌లో 50 ఏళ్లకు పైగా ఒంటరిగానే జీవించిన అరుదైన రికార్డు కూడా ఈయనదే. 84 ఏళ్ల వృద్ధాప్య దశలో చివరకు కనీసావసరాలకు మనిషి తోడు లేని పరిస్థితుల్లోనే దాసరి గారు చందమామను వదిలి విజయవాడకు వెళ్లవలసి వచ్చింది.

అప్పుడు కూడా ఆరోగ్యం బాగయితే తాను మళ్లీ చందమామకు తిరిగి వస్తానని అప్పటి చందమామ ఉద్యోగులకు మాట ఇచ్చి మరీ వెళ్లారు. కానీ రాలేకపోయారు. శివరాం ప్రసాద్ గారు తన సాహిత్య-అభిమాని బ్లాగు లో రాసినట్లుగా స్వర్గమనేది నిజంగా ఉంటే, దాసరి గారు ఇప్పుడు అక్కడ బిజీగానే ఉంటారు. ఎందుకంటే నాగిరెడ్డి, చక్రపాణి గారు ఇప్పటికే ‘స్వర్గం’లో ‘చందమామ’ పత్రికను మొదలు పెట్టేసి ఉంటారు కదా.

వేణుగారు ఈయనను ఇంటర్వ్యూ చేస్తూన్నప్పడు, తన వయసు (87సంవత్సరాలు) ఓసారి స్మరించుకొని, ‘I am over stay here!’ అని సరదాగా జోక్ చేసిన అరుదైన వ్యక్తిత్వం దాసరిగారిది. భూమ్మీద అవసరానికి మించి ఉండటం, బతకడం, బతకవలసి రావడం కూడా సరైంది కాదు అనే ప్రత్యేక సామాజిక తత్వం దాసరి గారిది.

చివరకు 87 ఏళ్ల ప్రాయంలో కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, వైద్య ప్రక్రియలతో పనిలేకుండా, సునాయాసంగా, సుఖంగా కన్నుమూసిన అపర భీష్ముడు శ్రీ దాసరి. సుఖ మరణం పొందడం అనేది మానవజాతి ప్రాచీన స్వప్నాలలో ఒకటి. నొప్పింపక, తానొవ్వక అన్న చందంగా సునాయాసంగా పోవడం ద్వారా జాతి స్వప్నాన్ని కూడా సాకారం చేసుకున్న అరుదైన మనీషి ఆయన.

బాలసాహిత్యంలో ధ్రువతారగా నిలిచే చందమామ తాతయ్య శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి దివ్యస్మృతికి చందమామ నీరాజనాలు.

RTS Perm Link