విజయవాడలో దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ

February 20th, 2010

Journey-459

తెలుగులో బాలసాహితీ వికాసానికి చందమామ తరపున ఎనలేని కృషి చేసిన కథల మాంత్రికుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు 88 ఏళ్ల ప్రాయంలో ఇటీవలే విజయవాడలో కన్నుమూసిన విషయం తెలిసిందే. చందమామ అభిమాని, రచయిత, శ్రేయోభిలాషి శ్రీ దాసరి వెంకట రమణ గారు ఈ ఆదివారం -21-02-2010- సాయంత్రం ప్రజాసాహితి వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో జరుగనున్న దాసరి సుబ్రహణ్యం గారి సంస్మరణ సభ విశేషాలను మెయిల్‌లో పంపారు.

చందమామ అభిమానులు, ప్రత్యేకించి చందమామ చరిత్రలో అత్యద్భుత విజయం సాధించిన ధారావాహికల రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి అభిమానులు, ఆయన మిత్రులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఎరిగినవారు ఈ సభకు హాజరై వారి మనోభావాలను పంచుకోవలసినదిగా ఆయన ఈ మెయిల్‌లో అందరికీ ఆహ్వానం తెలిపారు.

చందమామ జ్ఞాపకాలను, దాసరి గారి కథా రచనా పటిమను ఈనాటికి హృదయాల్లో పదిలపర్చుకుంటున్న చందమామ పాఠకులు, అభిమానులు ప్రత్యేకించి విజయవాడ నగరంలో ఉన్నవారు.. దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభకు తప్పక హాజరై ఆయనతో, ఆయన ధారావాహికలతో తమ పరిచయాన్ని అందరితో పంచుకుంటారని ఆశిస్తున్నాం.

దాసరి రమణ గారు పంపిన ఈమెయిల్ పూర్తి పాఠం కింద చూడండి.

విజయవాడలో దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ

( ప్రజాసాహితి వేదిక విజయవాడ వారి ఆధ్వర్యంలో )

( తేది21-02-2010 ఆదివారం, సా: 6 గం.లకు చండ్ర రాజేశ్వరరావు  గ్రంథాలయం, శిఖామణి సెంటర్, విజయవాడ.)

Dasari-Subrahmanyam_450

తెలుగువారి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచి, మన వుమ్మడి వారసత్వ సంపదగా అభివర్ణించ దగిన చందమామ మాస పత్రికలో  53  సం.లు పని చేసిన శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు మొన్న జనవరి 27వ తేది సా. 5 గం.లకు విజయవాడలో వారి అన్నయ్య శ్రీ ఈశ్వర ప్రభు గారి కుమార్తె శ్రీమతి గోళ్ళ ఝాన్సి గారి ఇంట్లో కన్నుమూశారు.

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను బాల సాహితీ వికాసానికి చేసిన సేవ ఎనలేనిది. దురదృష్టవశాత్తు … ఆ విషయం చాల కొద్ది  మందికి మాత్రమె తెలుసు.

tokachukka

1954 జనవరి చందమామ లో ప్రారంభమైన  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి తోకచుక్క రంగుల జానపద కథా ధారావాహిక నాటి  తెలుగునాటి బాలల హృదయాల్లో గిలిగింతలు పెట్టింది. పిల్లలనే కాదు పెద్దలను సైతం అబ్బురంగా ఆకర్షించి ఊపిరి బిగ పట్టేంత  ఉత్కంటకు గురిచేసిన ఆ ధారావాహిక … తరువాయి భాగం ఎప్పుడా అని మరుసటి నెల చందమామ కోసం ఎదురు చూసేలా చేసింది. చందమామ సర్క్యులేషన్ గణనీయంగా పెరగడానికి కారణభూతమైనది. ఆ ధారావాహిక విజయంతో  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు వెనక్కు తిరిగి చూడలేదు.

తోకచుక్క                        (Jan-54 – June-55 )
మకరదేవత                     (July-55 – December 56)
ముగ్గురు మాంత్రికులు (January-57 – June 58)
కంచుకోట                        (July-58 – Dec-59)
జ్వాలాద్వీపం                  (Jan-60 – June-61)
రాకాసిలోయ                  (July-61 – May-64)
పాతాళదుర్గం                  (May-66 – Dec-67)
శిథిలాలయం                  (Jan-68 – Sept-70)
రాతిరథం                         (Oct-70 – April-72)
యక్షపర్వతం                  (May-72 – June-74)
మాయా సరోవరం          (Jan-76 – June-78)
భల్లూక మాంత్రికుడు     (July-78 – April-80)

దాసరి మంత్రనగరి

దాసరి మంత్రనగరి

ఇలా..మొత్తం 12 ధారావాహికలు రాశారు. ఈ ధారావాహికల రుచి కేవలం అనుభవైకవేద్యం.  నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంచలనాత్మక హారీపోటర్ కథల కంటే  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి కథలు, కథా కథనం లోనూ, పాత్రల సృష్టి లోనూ ఎన్నో రెట్లు మెరుగని నాటి పాటకులకు, వాటిని చందమామలో పున: ప్రచురించినందున నేటి పాఠకులకు … ఆస్వాదించిన వారికి మాత్రమే అర్థమౌతుంది. “శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం తెలుగు వాడవడం మన అదృష్టం ఆయన దురదృష్టం” అని తెనాలి వాస్తవ్యులు శ్రీ వెలగా వెంకటప్పయ్య గారు అనేవారు.

కొడవటిగంటి కుటుంబరావు గారితో పాటు చందమామ సంపాదక వర్గంలో ఒకడుగా – చందమామ కథల ఎంపిక లోనూ, వాటిని తిరిగి వ్రాసే ప్రక్రియ లోనూ శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి కృషి మరువలేనిది. 1975లో శ్రీ చక్రపాణి మరణానంతరం, ముఖ్యంగా 1980లో శ్రీ  కొడవటిగంటి కుటుంబరావు గారు మరణించాక చందమామ పత్రికా నిర్వహణలో శ్రీ విశ్వనాథ రెడ్డి గారికి  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం వెన్నెముకలా వ్యవహరించాడని చెప్పవచ్చు.

తెనాలికి సమీపం లోని పెద్ద గాజులపర్రు లో 1922 అక్టోబర్25 న జన్మించిన శ్రీ సుబ్రహ్మణ్యం గారికి మరణించే నాటికి ఆయన వయసు 88 సం.లు.

మా సృష్టికర్తకు కథాంజలి!

మా సృష్టికర్తకు కథాంజలి!

శ్రీ కొత్తపల్లి రవిబాబు  అధ్యక్షతన, శ్రీ దాసరి వెంకటరమణ (సుబ్రహ్మణ్యం గారి బంధువు కారు- చందమామ కథల  పరిశోధకులు, ప్రధాన కార్యదర్శి-బాల సాహిత్య పరిషత్తు హైదరాబాద్)  ముఖ్య వక్తగా పాల్గొంటున్న ఈ సభలో, ఇంకా శ్రీమతి  గోళ్ళ ఝాన్సీ (సుబ్రహ్మణ్యం గారి అన్న కీ.శే.ఈశ్వరప్రభు గారి కూతురు),శ్రీ అట్లూరి అనిల్ (సుబ్రహ్మణ్యం గారి మిత్రులు, హైదరాబాద్.), రాంపల్లి  శ్రీలక్ష్మి (చందమామ అభిమాని), శ్రీ గోళ్ళ నారాయణరావు (సుబ్రహ్మణ్యం గారి అన్న కీ.శే.ఈశ్వరప్రభు గారి మనుమడు) మొదలగు వారు ప్రసంగిస్తారు.

చందమామ అభిమానులు, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి అభిమానులు, ఆయన మిత్రులు,ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఎరిగినవారు  ఈ సభకు హాజరై వారి రచనల గురించి గాని, వారితో తమకు గల అనుబంధం గురించి కాని, సుబ్రహ్మణ్యం గారి వ్యక్తిత్వం గురించి కాని, వారి మనోభావాలను పంచుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకోవలసిందిగా మనవి.

వివరాలకు సంప్రదించండి
శ్రీ కొత్తపల్లి రవిబాబు: +919490196890
e mail: ravibabu@yahoo.co.in

శ్రీ దివికుమార్ :  +919440167891, 0866-2417890:
e mail:  1949@yahoo.com

ప్రజాసాహితి వేదిక,
విజయవాడ 

సమావేశ స్థలం:
ప్రజాసాహితి వేదిక విజయవాడ వారి ఆధ్వర్యంలో
తేది. 21-02-2010 ఆదివారం, సా: 6 గం.లకు చండ్ర రాజేశ్వరరావు  గ్రంథాలయం, శిఖామణి సెంటర్, విజయవాడ.

ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం ……స్మరించుదాం.

……………….

విజయవాడలో ఈ ఆదివారం జరుగనున్న దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ వివరాలను ఈమెయిల్ ద్వారా పంపిన దాసరి వెంకటరమణ గారికి కృతజ్ఞతలు.

ఫోటోలు: వేణు, శివరాం ప్రసాద్ గార్లు, చందమామ సౌజన్యంతో

(చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారిపై ఈ ఆదివారమే సాక్షి దినపత్రిక అనుబంధంలో ‘చందమామ’ను చేరుకున్నారు! పేరిట కథనం ప్రచురించనున్నారు.)

చందమామ వెబ్‌సైట్‌లో, బ్లాగులో ఇటీవల దాసరి గారిపై ప్రచురించిన కథనాల లింకులు కింద చూడగలరు.

కథల మాంత్రికుడు దాసరి గారి సంస్మరణ
http://blaagu.com/chandamamalu/2010/02/18/%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2-%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-%e0%b0%a6%e0%b0%be%e0%b0%b8%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%97%e0%b0%be/

చందమామ కథల మాంత్రికుడి సంస్మరణ సభ
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2427

కథల మాంత్రికుడికి చందమామ నివాళి
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=40&sbCId=117&stId=2424
 
చందమామ ప్రగాఢ సంతాపం
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2423
 
దాసరి తాతగారితో మా జ్ఞాపకాలు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=40&sbCId=117&stId=2422

RTS Perm Link


2 Responses to “విజయవాడలో దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ”

  1. గిరిధర్ పొట్టెపాళెం on February 20, 2010 6:09 AM

    ఇన్ని దశాబ్దాలపాటు ధారావాహికలతో చందమామ పాఠకులనలరించిన మహానుభావులు శ్రీ దాసరి సుబ్రమణ్యం గారి ఆత్మ శాంతించాలని, ఇలాంటి మహానుభావుడిని మళ్ళీ ముందు తరాలకు ప్రసాదించమని భగవంతుదిని ప్రార్ధిస్తూ, ఆయనకు నివా నివాళులర్పిస్తున్నాను.
    -గిరిధర్ పొట్టేపాళెం

  2. SIVARAMAPRASAD KAPPAGANTU on February 21, 2010 2:26 PM

    ఈ ధారావాహికల రుచి కేవలం అనుభవైకవేద్యం. నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంచలనాత్మక హారీపోటర్ కథల కంటే శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి కథలు, కథా కథనం లోనూ, పాత్రల సృష్టి లోనూ ఎన్నో రెట్లు మెరుగని నాటి పాటకులకు, వాటిని చందమామలో పున: ప్రచురించినందున నేటి పాఠకులకు … ఆస్వాదించిన వారికి మాత్రమే అర్థమౌతుంది.

    మీరు వ్రాసిన పై మాటలు అక్షర సత్యాలు. కాని, కొంతమంది ఆత్మ న్యూనతా భావంతో బాధపడేవాళ్ళు ఈ మాటలు వ్రాస్తే అకారణంగా ఎదో పెద్ద తప్పు వ్రాసినట్టుగా బాధ పడిపోతున్నారు. మన మంచి రచయితను పొగుడుకోవటంకూడ తప్పే!!!!

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind