దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ

February 15th, 2010
కథకుడికి పాత్రల నివాళి

కథకుడికి పాత్రల నివాళి

(తెలుగులో బాలసాహితీ వికాసానికి చందమామ తరపున ఎనలేని కృషి చేసిన కథల మాంత్రికుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు 88 ఏళ్ల ప్రాయంలో ఇటీవలే విజయవాడలో కన్నుమూసిన విషయం తెలిసిందే. చందమామ అభిమాని, రచయిత, శ్రేయోభిలాషి శ్రీ దాసరి వెంకట రమణ గారు ఈ మంగళవారం -16-02-2010- సాయంత్రం బాల సాహిత్య పరిషత్తు పక్షాన హైదరాబాద్‌లో జరుగనున్న దాసరి సుబ్రహణ్యం గారి సంస్మరణ సభ విశేషాలను మెయిల్‌లో పంపారు.

చందమామ అభిమానులు, ప్రత్యేకించి చందమామ చరిత్రలో అత్యద్భుత విజయం సాధించిన ధారావాహికల రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి అభిమానులు, ఆయన మిత్రులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఎరిగినవారు ఈ సభకు హాజరై వారి మనోభావాలను పంచుకోవలసినదిగా ఆయన ఈ మెయిల్‌లో అందరికీ ఆహ్వానం తెలిపారు.

చందమామ జ్ఞాపకాలను, దాసరి గారి కథా రచనా పటిమను ఈనాటికి హృదయాల్లో పదిలపర్చుకుంటున్న చందమామ పాఠకులు, అభిమానులు ప్రత్యేకించి హైదరాబాద్‌ నగరంలో ఉన్నవారు దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభకు తప్పక హాజరై ఆయనతో, ఆయన ధారావాహికలతో తమ పరిచయాన్ని అందరితో పంచుకుంటారని ఆశిస్తున్నాం.

దాసరిగారికి ఆయన ధారావాహికలోని పాత్రలు నివాళి పలుకుతున్నట్లుగా మార్చి శివరాం ప్రసాద్ గారు పంపిన చందమామ చిత్రాన్ని ఈ బ్లాగులో ప్రచురించడమైనది. శివరాం గారికి కృతజ్ఞతలు

చందమామ పాఠకులు, అభిమానుల సౌకర్యార్థం దాసరి వెంకట రమణ గారు పంపిన ఈమెయిల్‌ను యథాతథంగా కింద పొందుపరుస్తున్నాం.)

దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ

(తేది 16 -02 -2010 మంగళవారం, సా: 5 గం.లకు నగర కేంద్ర గ్రంథాలయం, చిక్కడపల్లి, హైదరాబాద్.)

తెలుగువారి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచి, మన వుమ్మడి వారసత్వ సంపదగా అభివర్ణించ దగిన చందమామ మాస పత్రికలో  53 సం.లు పని చేసిన శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు మొన్న జనవరి 27వ తేది సా. 5 గం.లకు విజయవాడలో వారి అన్నయ్య శ్రీ ఈశ్వర ప్రభు గారి కుమార్తె శ్రీమతి గోళ్ళ ఝాన్సి గారి ఇంట్లో కన్నుమూశారు.

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను బాల సాహితీ వికాసానికి చేసిన సేవ ఎనలేనిది. దురదృష్టవశాత్తు … ఆ విషయం చాల కొద్ది  మందికి మాత్రమే తెలుసు.

1954 జనవరి చందమామ లో ప్రారంభమైన  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి తోకచుక్క రంగుల జానపద కథా ధారావాహిక నాటి  తెలుగునాట బాలల హృదయాల్లో గిలిగింతలు పెట్టింది. పిల్లలనే కాదు పెద్దలను సైతం అబ్బురంగా ఆకర్షించి ఊపిరి బిగపట్టేంత  ఉత్కంటకు గురిచేసిన ఆ ధారావాహిక … తరువాయి భాగం ఎప్పుడా అని మరుసటి నెల చందమామ కోసం ఎదురు చూసేలా చేసింది. చందమామ సర్క్యులేషన్ గణనీయంగా పెరగడానికి కారణభూతమైనది. ఆ ధారావాహిక విజయంతో  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు వెనక్కు తిరిగి చూడలేదు.

తోకచుక్క (Jan-54 – June-55 )
మకరదేవత (July-55 – December 56)
ముగ్గురు మాంత్రికులు (January-57 – June 58)
కంచుకోట (July-58 – Dec-59)
జ్వాలాద్వీపం (Jan-60 – June-61)
రాకాసిలోయ (July-61 – May-64)
పాతాళదుర్గం (May-66 – Dec-67)
శిథిలాలయం (Jan-68 – Sept-70)
రాతిరథం (Oct-70 – April-72)
యక్షపర్వతం (May-72 – June-74)
మాయా సరోవరం (Jan-76 – June-78)
భల్లూక మాంత్రికుడు (July-78 – April-80)

ఇలా వరుసగా మొత్తం 12 ధారావాహికలు రాశారు. ఈ ధారావాహికల రుచి కేవలం అనుభవైక వేద్యం. నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంచలనాత్మక హెర్రిపోటర్ కథల కంటే  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి కథలు, కథా కథనం లోనూ, పాత్రల సృష్టి లోనూ ఎన్నో రెట్లు మెరుగని నాటి పాఠకులకు, వాటిని చందమామలో పున: ప్రచురించినందున నేటి పాటకులకు … ఆస్వాదించిన వారికి మాత్రమే అర్థమౌతుంది. ‘శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం తెలుగు వాడవడం మన అదృష్టం ఆయన దురదృష్టం’ అని తెనాలి వాస్తవ్యులు శ్రీ వెలగా వెంకటప్పయ్య గారు అనేవారు.

కొడవటిగంటి కుటుంబరావు గారితో పాటు చందమామ సంపాదక వర్గంలో ఒకడుగా – చందమామ కథల ఎంపిక లోనూ, వాటిని తిరిగి వ్రాసే ప్రక్రియ లోనూ  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి కృషి మరువలేనిది.1975 లో శ్రీ చక్రపాణి మరణానంతరం, ముఖ్యంగా 1980లో శ్రీ  కొడవటిగంటి కుటుంబరావు గారు మరణించాక చందమామ పత్రికా నిర్వహణలో శ్రీ విశ్వనాథ రెడ్డి గారికి  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం వెన్నెముకలా వ్యవహరించారని చెప్పవచ్చు.

తెనాలికి సమీపం లోని పెద్ద గాజుల పర్రు లో 1922 అక్టోబర్25 న జన్మించిన శ్రీ సుబ్రహ్మణ్యం గారికి మరణించే నాటికి ఆయన వయసు 88 సం.లు

శ్రీ సుబ్రహ్మణ్యం గారు బాల సాహిత్యానికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని బాల సాహిత్య పరిషత్తు ఈ సంతాప సభను ఏర్పాటు చేసింది.

చందమామ అభిమానులు, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి అభిమానులు, ఆయన మిత్రులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఎరిగినవారు ఈ సభకు హాజరై వారి మనోభావాలను పంచుకోవలసినదిగా మనవి.

(తేది 16 -02 -2010 మంగళవారం, సా: 5 గం.లకు నగర కేంద్ర గ్రంథాలయం, చిక్కడపల్లి, హైదరాబాద్.)


మరిన్ని వివరాలకు కింది చిరునామాలో సంప్రదించండి.

Dasari Venkata Ramana
General Secretary,
Bala Sahitya Parishattu,
5-5-13/P4, Beside Sushma Theatre,
Vanasthalipuram, HYDERABAD – 500070.
04024027411. Cell: 9000572573.
email: dasarivramana@gmail.com

దాసరి వెంకటరమణ గారి పాత మెయిల్ వివరాలు -త్రివిక్రమ్ గారిద్వారా పంపినవి-  కూడా కింద పొందుపరుస్తున్నాము.

దాసరి సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్యే పరమపదించారు. మీకు ఈ విషయం బహుశా వార్తా పత్రికల ద్వారా తెలిసివుంటుంది. ఈ నెల పదహారో తేదిన మంగళ వారం సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ లెక్చర్ హాలు నందు సంస్మరణ సభను బాల సాహిత్య పరిషత్తు హైదరాబాద్ పక్షాన ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈ నెల ఇరవై ఒకటో తేది ఆదివారం విజయవాడలో ప్రజాసాహితి పక్షాన ఏర్పాటు చేయటం జరిగింది. ఈ విషయం చందమామ అభిమానులకు తెలియచేయగలరు.

రచన వచ్చే సంచికను -ఏప్రిల్- దాసరి సుబ్రహ్మణ్యం సంస్మరణ సంచికగా వేయటానికి రచన శాయి గారు నిశ్చయించారు. ఆవిషయమై ఒకసారి శ్రీ శాయి గారితో మాట్లాడండి.

Y V S R S Talpa Sai
Editor – RACHANA Telugu Monthly
1-9-286/2/P Vidyanagar
Hyderabad – 500 044
e mail : rachanapatrika@gmail.com
Ph : 040 – 2707 1500
Mobile : + 99485 77517
visit : www.rachana.net

మీ స్పందన కోసం ఎదురు చూస్తూ. – దాసరి వెంకట రమణ

NB: దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ గురించిన ప్రకటనను చందమామతో పంచుకున్నందుకు శ్రీ వెంకట రమణ గారికి కృతజ్ఞతలు.

RTS Perm Link


3 Responses to “దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ”

 1. శివరామప్రసాదు కప్పగంతు on February 15, 2010 8:34 PM

  ఇతర పత్రికలు దాసరి గారి గురించి ప్రత్యేక సంచిక వెయ్యటానికి ఉవ్విళ్ళూరుతున్నాయి సరే. ఏ చందమాకైతే ఆయన ఐదు డశాబ్దాల పైన తన జీవితాన్ని పంచి ఇచ్చాడో, ఏవరు వ్రాసిన ధారావాహికల కోసం చందమామను విరగపడి కొని చదివేవారో, అలా జానపద కథలలాగ చెప్తూనే అంతర్లీనంగా పిల్లలకు పరిశీలనా శక్తి, వ్యక్తిత్వ వికాసం నేర్పారో, ఆయన గురించి, చందమామ పత్రికకు ఆయన బొమ్మను ముఖ చిత్రంగా, చుట్టూ ఆయన పాత్రలలో కొన్నిటిని ఉంచి, ఒక ప్రత్యేక సంచిక ఈపాటికే తేవాలిసి ఉన్నది. మరి అటువంటి ప్రయత్నం ఈ నాటి చందమామలో జరుగుతున్నదని ఆశపడవచ్చా. ఎక్కువకాలం సంపాదకులుగా ఉన్న కొడవటిగంటి శత జయంతి సందర్భంగా కూడ ఆయన గురించి ప్రింటు చందమామలో ఒక్క వ్యాసం కూడ వచ్చినట్టుగా లేదు మరి.

 2. SIVARAMAPRASAD KAPPAGANTU on February 16, 2010 6:23 AM

  Both Dasari and Kodavatiganti have been favorites of a party championing exploitation of labour. Alas, they themselves have been exploited to the hilt. I do not know about adequate compensation to them. But when it comes to recognition, definitely they have been exploited. While it is their hard work, magazine got the good name. Even after decades, it is not being acknowledged.

  Really, as someone said, we Telugus are fortunate that Dasari was born amongst us and it is his misfortune that he was born as a Telugu Man.

 3. chandamama on February 17, 2010 12:52 PM

  దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభపై దాసరి రమణ గారి ప్రకటనను ఇక్కడ పోస్ట్ చేస్తూ సందర్బానుసారంగా అప్పుడే శివరాం ప్రసాద్ గారు పంపిన దాసరి పాత్రల నివాళిపై చిత్రాన్ని జతచేయడం జరిగింది. ఆయన చిత్రంలోని టెక్స్టులో ఉన్న లోపాన్ని సవరించి పంపితే కొత్త చిత్రాన్ని కూడా ఈరోజు అప్‌డేట్ చేయడమైనది. అయితే పని ఒత్తిడిలో ఉండి వెంటనే ఇతర పనులలోకి వెళ్లిపోవడంతో చిత్రాన్ని పంపించిన శివరాం గారి పేరును ప్రస్తావించలేకపోయాము. నివాళికి తగిన చిత్రాన్ని పంపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే చిత్రం పంపిన వారి పేరు పొందుపర్చడంలో జరిగిన పొరపాటు అనుద్దేశంగానే జరిగిందని సవినయంగా తెలియజేసుకుంటున్నాము.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind