కథల మాంత్రికుడికి చందమామ నివాళి

February 12th, 2010
శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం

చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు కాలం చేశారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. ఆయన అస్తమయంతో ‘చందమామ’ తొలినాటి వెలుగుల్లో మరొకటి ఆరిపోయింది. ఆయన కన్నుమూసిన విషాదవార్తను చందమామ అభిమానులకు, పాఠకులకు తెలియజేయడానికి తీవ్రంగా విచారిస్తున్నాం.

సుబ్రహ్మణ్యంగారు తన 29 వ ఏట చందమామ పత్రికలో చేరారు.‘చందమామ’ అనే పేరుతో చక్రపాణిగారు ప్రారంభించిన పిల్లల మాసపత్రికలో కొడవటిగంటి కుటుంబరావుగారితో పాటు ఈయన 1952వ సంవత్సరంలో చేరారు. 2006 దాకా అందులోనే కొనసాగారు. కథా కల్పనలో, ధారావాహికల రచనా ప్రక్రియలో అసాధారణ ప్రతిభ కలిగిన ఈయన అయిదు దశాబ్దాలపాటు చందమామలో పనిచేశారు. యాభైల మొదట్లో ‘చందమామ’ చేయి పట్టుకుంది మొదలుగా యాభైనాలుగు ఏళ్లపాటు చందమామలో అవిశ్రాంతంగా పనిచేసిన దాసరిగారు దేశవ్యాప్తంగా కథల ప్రేమికులకు కథామృతాన్ని  పంచిపెట్టారు.

అన్వర్ గారి పెయింటింగ్

అన్వర్ గారి పెయింటింగ్

తోక చుక్క, మకర దేవత, రాతి రథం, యక్ష పర్వతం. జ్వాలాదీపం, కంచుకోట, ముగ్గురు మాంత్రికులు, పాతాళ దుర్గం,రాకాసి లోయ, మాయా సరోవరం, శిధిలాలయ వంటి అద్బుత ప్రజాదరణ పొందిన ధారావాహికలను సృష్టించిన చందమామ కథల మాంత్రికుడు దాసరిగారు. ఆయన వ్రాసిన చిట్టచివరి ధారావాహిక భల్లూకమాంత్రికుడు. చందమామలో సీరియళ్ల శకం అంతటితో ముగిసింది.

చందమామ పాఠకులందరికీ ఇవి ఎంతో ఇష్టమైన కథలు. చందమామలో ధారావాహిక రచనలు ముగిసి 32 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈనాటికీ పాత, కొత్తతరాల పిల్లలు, పెద్దలు ఆయన సీరియల్స్‌ను మళ్లీ ప్రచురించవలసిందిగా కోరుతూ చందమామకు ఉత్తరాలు రాస్తున్నారు.

దాసరి గారి స్వదస్తూరి

దాసరి గారి స్వదస్తూరి

ఆణిముత్యాల వంటి పన్నెండు జగమెరిగిన ధారావాహికలను సృష్టించిన చందమామ కథల మాంత్రికుడు ఇక లేరు. తెలుగు పిల్లలకు, దేశంలోని పిల్లలు పెద్దలందరికీ ఎంతో ఇష్టమైన పాత్రలను తన కథల్లో సృష్టించారు. ఆయన ధారావాహికలు మొదలై కొనసాగిన కాలం -1954-78- చందమామ చరిత్రలో కథల స్వర్ణయుగం. పిల్లలతో పాటు పెద్దల మనస్సులను కూడా మంత్రజగత్తులో విహరింపజేసి, ఓలలాడించిన రమణీయ కథాకథన శైలి ఆయన స్వంతం.

ధారావాహికలలో పాత్రలకు ఆయన పెట్టిన పేర్లు చందమామ పాఠకుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా మిగిలిపోయాయి. ఖడ్గవర్మ, జీవదత్తుడు, పింగళుడు, శిఖిముఖి, విక్రమకేసరి,  కాలశంబరుడు, సమరసేనుడు, ఏకాక్షి,  మహాకలి, దూమకసోమకులు, కాంతిసేన, జయమల్లుడు, కేశవుడు వంటి జానపద కథల పాత్రలను ఎన్నిటినో ఆయన పిల్లలకు పరిచయం చేసారు. చిత్ర విచిత్ర పేర్లతో సాగే ఆయన సీరియల్ పాత్రలు పాఠకుల నోళ్లలో ఇప్పటికీ నానుతుంటాయి.

సుబ్రహ్మణ్యంగారి రచనలకు గీటురాయి పాఠకుల ఆదరణే. చందమామకు విపరీతమైన ప్రజాదరణ తెచ్చిపెట్టిన మొదటి రంగుల సీరియల్ ఆయనే రాసేవారు. 1960లలో కొన్నేళ్ళు సంచిక చివరి పేజీలలో పడిన ఒకపేజీ ‘చిత్రకథ’ను కూడా ఆయనే రాసేవారు. ఇదికాక ప్రతినెలా చందమామ సంచిక ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు.

దాసరి గారి కథలూ చిత్రాగారి బొమ్మలూ చందమామలో ఒకదానికొకటి ప్రేరణగా తొలినుంచీ పనిచేశాయి. కేవలం చిత్రాగారి అద్భుత చిత్ర సృష్టికోసమే దాసరి గారు తన కథల్లో చిత్రవిచిత్ర పాత్రలను ప్రవేశపెడుతూ వచ్చారంటే ఈ ఇద్దరి జోడీ చందమామలో ఎంత చక్కగా అల్లుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. వారిద్దరూ చందమామకు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చారు. చందమామ అభిమానుల మనసుల్లో వారిద్దరిదీ శాశ్వతస్థానమే.

కథల పట్ల ఆయన అంకితభావం, సంపాదకవర్గ సభ్యుడిగా ఆయన పాటించే క్రమశిక్షణ, సహోద్యోగులతో నెరపిన స్నేహం, నిష్కల్మషమైన అభిమానం మాత్రమే కాదు. చందమామ చరిత్రలోనే పాఠకులతో అత్యంత సజీవ, సహజ సంబంధాలను కొనసాగించిన ఏకైక వ్యక్తి దాసరి సుబ్రహ్మణ్యం గారు.

అరవైఏళ్లకు పైగా కథాసాహిత్య ప్రచురణలో కొనసాగుతున్న చందమామలో ఓ శకం ముగిసింది. చందమామ స్వర్ణయుగానికి కారణభూతులైన సంపాదకవర్గంలో చివరి సభ్యుడు కన్నుమూశారు. చందమామ శంకర్ గారు మాత్రమే పాతతరంలో మిగిలి ఉన్న ఏకైక మాన్యులు.

ఆరు దశాబ్దాలపాటు బాలబాలికల ఊహా ప్రపంచాన్ని తన ధారావాహికల ద్వారా వెలిగిస్తూ వస్తున్న శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి చిరస్మరణీయమైన స్మృతికి చందమామ అంజలి ఘటిస్తోంది. పత్రికా ప్రచురణలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ, చక్రపాణి, కొకు, దాసరి తదితర మాన్యులు ప్రతిష్టించిపోయిన అత్యున్నత కథా సాహిత్య విలువలను శక్తి ఉన్నంతవరకు కొనసాగిస్తామని చందమామ వాగ్దానం చేస్తోంది.

దాసరి సుబ్రహ్మణ్యంగారి అస్తమయ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, సోదరుడి కుమార్తె శ్రీమతి గోళ్ల ఝాన్షీ గారికి ‘చందమామ’ తన ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది.

(ఈ కథనంలోని ఇమేజ్‌లు శ్రీ వేణు, శ్రీ అన్వర్ సౌజన్యంతో. దాసరి గారి పెయింటింగ్ వేసి పంపిన అన్వర్ గారికి కృతజ్ఞతలు )

RTS Perm Link